పెంకి తనం నుంచి మొక్కవోని దీక్ష వైపు..

అల్లాడి వెంకట సుబ్బు స్మారక పురస్కారం అందుకున్న సందర్భం-

పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఊరి చివర గుమ్ముడూర్ అనే మాదిగ గూడెంలో తాళ్లపల్లి అబ్బయ్య అబ్బమ్మ దంపతులకు జన్మించాను.

నాన్న దొరగారికి జీతం ఉండేవాడు. అది ఒక రకంగా వెట్టి చాకిరి లాంటిది. సంవత్సరం మొత్తం పని చేయించుకొని వారి పంట కళ్ళంలో మూడు బస్తాలో నాలుగు బస్తాలో వడ్లు ఇచ్చేవారు. ఆ వెంటనే నాన్నకు అప్పిచ్చాం అనే వంకతో ఆ వడ్లను మొత్తం తమ వడ్ల రాశిలో కలుపుకునేవారు. అమ్మ పాత కల్లాల దగ్గర లేకి చేసి మమ్మల్ని పోషించేది. పూట గడవని రోజుల్లో కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని పాఠశాలకు పంపించారు. మేము ఇద్దరం ఆడపిల్లలం మా చెల్లి నేను పాఠశాలకు వెళ్లి చదువుకునే వాళ్ళం. ఇద్దరు ఆడపిల్లలే అనే బాధ అమ్మ నాన్నలో మాకు ఎప్పుడూ కనిపించలేదు. పేదరికం ఒకవైపు కుల అవమానాలు అణచివేతలు ఒకవైపు పెత్తందారుల శ్రమదోపిడి మరోవైపున చుట్టుముట్టినా, అమ్మానాన్నలు కష్టాలకు దడవకుండా కన్నీళ్ళకు వెరవకుండా ఎంతో ఓర్పుతో మమ్మల్ని చదివించారు.

నేను ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు మహబూబాద్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోని విద్యను అభ్యసించాను. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోని దగ్గర బంధువైన సోమవరపు వీరస్వామి గారితో నాకు వివాహం జరిగింది. వివాహనంతరం నా భర్తను ఒప్పించి ఆయన సహకారంతో ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టాను. నాకు ఇద్దరు పిల్లలు .గాయత్రి ఎంబీబీఎస్ ఫైనలియర్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ లో చదువుతుంది. కళ్యాణ్ కుమార్ ఇంటర్ సెకండియర్ చేస్తున్నాడు. డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఖమ్మం. ఎం ఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్. ఎం ఏ సంస్కృతం కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్. టీచర్ ట్రైనింగ్ బిఈడి కాలేజ్ హనుమకొండ. ఏం ఫీల్ మదురై కామరాజు విశ్వవిద్యాలయం తమిళనాడు. పీహెచ్డీ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం- గైడ్ గా ఆచార్యబన్న అయిలయ్య గారు. యూజీసీ నెట్. ఏపీ సెట్ లో ఉత్తీర్ణత సాధించాను. 2001 డిఎస్సీ ద్వారా తెలుగు పండిట్ ఉద్యోగం సాధించాను.
అణగారిన వర్గం అయిన దళిత మాదిగ కులంలో పుట్టిన నేను బాల్యం నుండి అంటరానితనాన్ని చాలా దగ్గరగా చూస్తూ పెరిగాను, పాఠశాలలో కళాశాలలో సమాజంలో అనేక అసమానతల ను ఎదుర్కొంటూ, సమాజంతో పాటు కుటుంబంలో లింగ వివక్షతను అణచివేతలను ఎదుర్కొంటూ అన్నింటిని అధిగమిస్తూ నాదైన దారిలో నేను సాహితీ పయనం మొదలుపెట్టాను.

పరిశోధన సిద్ధాంత గ్రంథాలు రాసి ఎంపీలు పిహెచ్డి పట్టాలు పొందిన తర్వాత మా గురువుగారు బన్న ఐలయ్య గారు ” నువ్వు వచనం బాగా రాస్తున్నావమ్మా కథలు చక్కగా రాయగలవు” అంటూ నాలోని సాహితీ క్షేత్రానికి బీజం వేశారు. గురువుగారి ప్రోత్సాహంతో కథలు రాయడం మొదలు పెట్టాను అంతేకాకుండా నేను పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తరుణంలో ‘ నగర గీతం’ అలిశెట్టి ప్రభాకర్ గారి కవితను విద్యార్థులకు బోధిస్తూనే నేను ఎంతో స్ఫూర్తి పొందాను. కవిత్వం అంటే కేవలం వర్ణనలు మాత్రమే కాదు బతుకు చిత్రను కూడా అని అవగాహన చేసుకున్నాను. అప్పటినుండి సామాజిక అంశాలు దళిత జీవిత బాధలు బాధలు కవిత్వంగా రాస్తున్నాను. 2014 నుండి నారాచనా వ్యాసంగం మొదలుపెట్టి వివిధ దిన మాస పత్రికలకు వివిధ సంకలనాలకు పంపించడం మొదలుపెట్టాను. అచ్చయిన వివిధ పోటీలలో బహుమతి పొందిన కథలు కవితలు నవల పుస్తకాలుగా ముద్రించాను.

మహబూబాద్ జిల్లా సాహితీ శిఖరంలో మొగ్గ తొడిగిన ఏకైక ఉపాధ్యాయ దళిత రచయిత్రిగా గుర్తింపు పొందుతున్నాను. నేను రాసిన మొదటి కథ సంపుటి మమతల మల్లెలు ఈ కథల సంపుటిలో మొత్తం 11 కథలు ఉన్నాయి.

నేను చూసిన అనుభవించిన నేను ఎదుర్కొన్న సంఘటనలని కథలుగా మలిచాను. ప్రతి ఒక్క ఆడపిల్ల ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలనే కథా వస్తువులుగా తీసుకున్నాను. నేను చిన్నతనంలో పెంకి పిల్లగా ఎలా ఉండేదాన్నో  మమతలు మల్లెలు కథలో చూపించాను మా నాన్న ఎంత సహృదయం నన్ను ఎంత గారాబంగా పెంచాడో చిత్రించాను. సాధారణంగా అణగారిన ప్రజల జీవితాలను చిత్రించేటప్పుడు తండ్రి తాగుబోతుగా తల్లి మాత్రమే కష్టపడుతూ తమ పిల్లలను పెంచి పోషించినట్టుగా ఎన్నో కథలు చిత్రిస్తూ వస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా మా నాన్న సహజత్వాన్ని ఉదాత్తంగా ఉన్నతంగా మా నాన్నకు మా పట్ల గల చెప్పలేని ప్రేమ కరుణ ఆర్థతులను అవతల మల్లెల కథలో సహజాతి సహజంగా చిత్రించాను. నాలో ఉన్న పెంకి పిల్లలోని సహజత్వం మొండి తనం పట్టుదల ఎదుగుతున్న కొద్ది ఎక్కడికి పోలేదు కొత్త రూపాల్లోకి కొత్త స్వభావాల్లోకి మారుతూ వచ్చింది.

ఆనాటి పెంకి పిల్ల తత్వం అవగాహన పెరుగుతున్న కొద్ది జీవిత సంకల్పాన్ని మొక్కవోని దీక్షగా మలుచుకోవడానికి ప్రయత్నించాను. నన్ను నేను మలుచుకోవడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో సహనం వహించాల్సి వచ్చింది ఎన్నో అవమానాలను సవి చూడవలసి వచ్చింది.

రచయితలు తనుకు తెలిసింది కథలుగా నవలలుగా రాస్తారు తనకు తెలియనిది రాయలేరు. తనకు తెలిసినది రాయాలనుకున్నప్పుడు వాటిని తెలుసుకొని రాస్తారు అలా లోతుగా తెలుసుకొని రాసినప్పుడే అవి సామాజిక పరిణామాలను చరిత్రను మానవ సంబంధాల్లోని అవకతవకలను కథలుగా చిత్రించగలరు. అలా నా జీవితాన్ని కథలుగా చిత్రించి నా అనుభవాలను కథల్లో చిత్రిస్తూ క్రమక్రమంగా నేను ఎదిగిన పరిణామాన్ని నా రచనల ద్వారా తెలియజేశాను. తెలుగు సాహిత్యంలో వెలుగులోకి రావలసిన ఎదగాల్సిన ఎదుగుతున్న తెలంగాణ రచయితలు ఎందరో ఉన్నారు.   పిచ్చి చెట్ల మధ్య సుగందాలు వేద జల్లే పూల చెట్లు మొలిచినట్లు అణగారిన అట్టడుగు స్థాయిలో నుంచి అనేకమైన ఒడిదుడుకలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి నా సామాజిక వర్గం గొంతుకగా దళిత ప్రతినిధిగా మహబూబాబాద్ జిల్లా నుండి నా రచనల ద్వారా స్పందిస్తున్నాను. నేను రాసిన రాస్తున్న కథలు వర్తమాన దళితుల జీవిత నేపథ్యాలను , సంఘర్షణలను వాటి వెనకాల ఉన్న జీవిత సమాజం ముందు ఉంచుతున్నాను. ఆ నేపథ్యంలో రాసిన మరో కథల సంపుటి “రక్షణ” ఈ కథ సంపుటిలో 14 కథలు ఉన్నాయి.

వాస్తవ పరిస్థితులు ఆధారంగా సమాజంలో జరుగుతున్న అసమాన తలను పడిపోతున్న మానవతా విలువలకు నా కథలు అర్థం పడుతున్నాయి. అణగారిన వర్గాల విద్యకు వికాసానికి దూరంగా ఉండాలని తరతరాల సంప్రదాయ ఆలోచనలను బద్దలు కొట్టి విద్యనభ్యసించారు బోయ జంగయ్య. అణకారిన వర్గాలు విద్యను అభ్యసించడమే ఒక ఎత్తు అయితే సృజన రంగాల్లో అడుగుపెట్టడం మరొక ఎత్తు. ప్రముఖ కవి బోయ జంగయ్య సాహిత్య రంగంలోకి వచ్చేనాటికి దళితే తరులు సాహిత్య రంగాన్ని ఏలుతున్నారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే దళిత సాహిత్యాన్ని రాస్తున్నారు తప్పితే ఎక్కడ చూసిన అగ్రకుల ఆధిపత్యం కనిపిస్తూ ఉండడం తన సామాజిక వర్గం గురించి వారి రచనలలో ఎక్కడా కనిపించకపోవడం బోయ జంగయ్య గారిని ఎంతో బాధించింది. తన వర్గాల చరిత్రను తానే రాయాలని మౌలికమైన ఆలోచనలు ఆయనలో చెలరేగాయి. అలా రచన వైపు దృష్టిసారించి కవిత్వం కథలు నవల బాల సాహిత్య మొదలగు ప్రక్రియలలో తనకంటే ముందు తరం వారిని ప్రభావితం చేసిన మహానుభావుల జీవిత చరిత్రలు రాసిన అరుదైన దళిత రచయిత బోయ జంగయ్య. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం కలిగి స్వచ్ఛందంగా తన ఆలోచనలను సమాజం ముందు పెట్టారు కవి బోయ జంగయ్య. స్వతహాగా తన జీవిత సంఘర్షణ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్న రచయిత. వాటిని ప్రేరణగా తీసుకొని తన రచన సాహిత్యానికి ఎన్నుకున్నారు. జీవిత వాస్తవికత పునాదిగా వచ్చిన వారి రచనలపై నేను రచించిన పరిశోధన గ్రంథమే  జంగయ్య సాహిత్య అనుశీలన.

నేను ఒక దళిత మహిళ రచయిత్రిని ఒకసారి జంగయ్య గారి రచనలు చదివితే ఈ దేశంలోని దళితుల జీవితాలు అచ్చంగా కనిపిస్తాయి జంగయ్య గారి రచనలు చదివిన నేను నా జీవితం నా సామాజిక వర్గం వారి జీవితం ఉన్నత సామాజిక వర్గం వారి జీవితం తరతరాలుగా అనుభవిస్తున్న వేద ఈ దేశంలో దళితులు జీవితాలు అనేక సమస్యలతో అందులో దళిత మహిళల జీవితాలు మస్కబారిపోయినట్లుగా గుర్తించాను.

దళిత సామాజిక వర్గానికి చెందిన నేను బోయ జంగయ్య రచనలు చదవడం తాను స్వయంగా అనుభవించిన పరిస్థితులను అవగతం చేసుకొని నా పరిశోధనలో సాధ్యమైనంత వరకు సమగ్ర విశ్లేషణ చేశాను. బలమైన అంబేద్కర్ భావజాలంతో రచనలు చేస్తున్న బోయ జంగయ్య ఈ సమాజంలో దళితుల అడుగడుగున ఎదుర్కొంటున్న అవమానాలను అధిగమించి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి బోయ జంగయ్య గారి సాహిత్యం ఎంత దోహద పడింది. ఆదిశగా నేను కూడా ఏ ప్రక్రియలో రచన చేపట్టిన కథ రాసిన నవల రాసిన కవిత్వ రాసిన దళిత చైతన్య విశ్లేషించడానికి దళితుల అభ్యున్నతి లక్ష్యంగా కొనసాగించారు. మూఢనమ్మకాలను వదిలేసిన నాడే దళితుల అభ్యున్నతి సాధిస్తారన్న అంశాలు నా రచనల్లో పేర్కొన్నాను.

‘కెరటం’ నా మొదటి నవల.  ఈ కెరటం నవల తెలంగాణలో దళిత స్త్రీ రాసిన తొలి దళిత నవలగా పేరుపొందింది. ఈ నవలలో ప్రధాన వస్తువు దళితుల జీవితం ఇందులో ప్రధాన పాత్ర మల్లమ్మ మల్లమ్మ మాదిగ గూడెంలో కటికదారిద్రాన్ని అనుభవిస్తున్న కుటుంబంలోని స్త్రీ. దళితుల అమాయకత్వం మూఢనమ్మకాలు నిరక్షరాస్యత ఓర్వలేని తనం మొదలు అనేక విషయాలు ఇతివృత్తాలుగా ఈ నవలలో చిత్రించాను. ఈ నవలను పరిశీలిస్తే అనగారిన జీవితాలు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల స్థితిగతులు అర్థమవుతాయి.

‘దుఃఖనది’ కరోనా కథలు – ఈ కథల సంపుటిలో 12 కథలు ఉన్నాయి కరోనా సమయంలో ప్రింట్ లైన్ వారియర్స్ గా పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడిన వారందరి గురించి చిత్రించాను. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజల ఎదుర్కొన్న సమస్యలను కూడా చిత్రించాను. ‘మట్టి బంధం’ కవితా సంపుటిలో 94 కవితలు ఉన్నాయి. ఇందులో మహిళా సాధికారత సామాజిక ఆర్థిక నేపథ్యంలో చిత్రీకరించాను.

*

తాళ్లపల్లి యాకమ్మ

5 comments

Leave a Reply to Lakshmi Kandimalla Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిమ్మల్ని ఎప్పుడు చదివినా, ఎప్పుడు కలిసినా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది యాకమ్మ గారు! ఇవన్నీ పంచుకున్నందుకు థాంక్యూ. ఇంకా మీరు రాయవలసిన వి ఉన్నాయి. రాస్తారని నమ్మకం. థాంక్యూ సారంగ.

  • స్ఫూర్తి వంతమైన పరిచయం.
    చాలా బావుంది యాకమ్మ గారు. అభినందనలు.

  • ప్లాస్టిక్ పూలు అందంగా ఉండచ్చేమో గానీ పరిమళం అబ్బదు… స్వానుభవంతో అనుభూతించి రాసిన అక్షరాలు సహజ పరిమళంతో ఆకట్టుకుంటాయి👍జయహోలు మీకు👍👍👌👌

  • స్ఫూర్తివంతమైన ప్రయాణం అక్క
    శుభాకాంక్షలు💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు