పూల చాదర్‌

చావు నించి ఇంటికి బయల్దేరిండు గుల్జార్‌.
మనసు మనసుల లేదు. దోస్తు విల్సన్‌ చనిపోయిన బాధ మెలిపెడుతుండగ అతని అంత్యక్రియలు జరిగిన తీరు గుల్జార్‌ నెందుకో మరింతగా డిస్టర్బ్‌ చేసింది.

విల్సన్‌ పుట్టింది ఒక కులంలో.. తీసుకుంది క్రైస్తవ మతం. పెండ్లి చేసుకుంది మరో మతం స్త్రీని. నాస్తికుడిగా మారిండు. చివరికి చనిపోయినంక అంత్యక్రియలు హిందూ స్మశాన వాటికలో..

ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదనిపించింది!

ముఖ్యంగ తన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న గుల్జార్‌ను బాగా హింస పెడుతున్నది!
యాభైల్లో ఉన్నడు. దగ్గరి దోస్తుల్లోంచి ఇప్పటికి ముగ్గురు తోటోల్లు చనిపోయిన్రు. ఎవరు ఎప్పుడు పోతరో తెలీని మాహోల్‌. చూస్తుండంగనే ఒక్కొక్కరు చనిపోయిన్రు. తల్సుకుంటె గుబులుగ ఉంది. తన పిల్లల షాదీలు కానే లేదు. కష్టపడి చదివిస్తున్నడు. బిడ్డకు 26 ఏండ్లు. షాదీ చేసుకోమ్మా అంటే ‘అబ్బిచ్‌ నక్కో అబ్బా!’ అంటది.
‘కైకు రే?’ అంటే ‘చెప్తా!’ అంటది.
కొడుక్కి 23. వాడు ఎంతసేపూ యూనివర్సిటీలనే గడుపుతడు.

చెల్లెండ్లిద్దరు, అమ్మీ, అబ్బా గుర్తుకొస్తున్నరు గుల్జార్‌కు. ఎందుకో కండ్లల్ల నీల్లు. ఈ హైదరాబాద్‌ల అమ్మీ అబ్బాలను తెచ్చి పెట్టుకోలేడు. వాళ్లు కూడా ఈడ ఉండలేరు. తాము అక్కడికి పోయి ఉండలేని పరిస్థితి. వాళ్ల ముసలితనానికి ఆసరా అయి చేసేటోల్లు లేరు. యాతన. అట్లనో ఇట్లనో ఎల్లదీస్తున్నరు. మాట వరుసకు వచ్చి మా దగ్గర ఉండమని చెప్తుంటడు గనీ అది మనస్పూర్తిగ అంటున్న మాట కాదని వాళ్లగ్గూడ తెలుసు.
ఒకటి మాత్రం బలంగ అనిపిస్తుంటది- వాళ్లకు తనంటే షానా పాణం. వాళ్ల కన్నా ముందుగ తను మాత్రం పోకూడదు. పోతే తట్టుకోలేరు. తల్లిదండ్రులకు తమ కండ్ల ముందే పిల్లలు పోతే మనసుకు ఎంత కష్టమో! ఆ కష్టాన్ని మాత్రం కలిగించకూడదు -అని బలంగా అనుకున్నా గనీ దోస్తులు ఇట్లా అర్ధాంతరంగా తరలిపోతుంటే ఎందుకో గుబులుగ ఉంటున్నది!
ఒకవేళ తను చనిపోతే తన బాడీని ఏం చేయాలనేది మనసులో పీకుతున్నది గుల్జార్‌కు! విల్సన్‌ లెక్క ఆ విషయంలో ఏ స్పష్టతా ఇవ్వకుండా మాత్రం ఉండకూడదనిపిస్తున్నది.
మహామహుల గురించి విన్నడు- వాళ్ల భావజాలాలకు సంబంధం లేకుంటనే వాళ్ల అంత్యక్రియలు జరగడం. తను కూడా చూసిండు, బాలగోపాల్‌, జయశంకర్‌ సార్ల అంత్యక్రియలు. వాళ్లిద్దరి ‘చితి’ చూస్తు నిలబడ్డడు తను. శ్రీశ్రీ గురించి విన్నడు. శ్రీశ్రీదైతే మరీ ఘోరం. నచ్చిందల్లా కాళోజీ చేసింది. ఆయన చనిపోయినప్పుడు ఖైరతాబాద్‌ పోయి చూసిండు. కండ్లు ఐబ్యాంక్‌కి ఇచ్చేసిన్రని చెప్పిన్రు. కండ్లుండే చోట దూదిపింజలు పెట్టి ఉన్నై. బాడీ కాకతీయ మెడికల్‌ కాలేజీకి రాసిండని, జరసేపట్ల తీసుకుపోతరని తెలిసి గర్వంగ అనిపించింది.
అట్లనే కన్నబిరన్‌ చనిపోయినప్పుడు చూడ్డానికి గుడ లేదు. ఆయన చనిపోయిండన్న విషయం అంత్యక్రియలు జరిగిపోయినయన్న విషయం ఒక్కసారే తెలిసింది. చివరి చూపు చూడకుంట అట్లెట్లా? అని ఆశ్చర్యం. ఆయనకు అవన్నీ ఇష్టం లేవని, ఎవరికీ చెప్పకుంట అంత్యక్రియలు చేసేయమని కోరిండని తెలిసింది. ఎటూ తేల్చుకోలేని విషయం! ముస్లింగ పుట్టిన కవి ‘దేవిప్రియ’ను ఎలక్ట్రిక్‌ క్రిమేషన్‌ చేసిన్రని తెలిసింది!

సరే, మొత్తంగా చూస్తే తనేం చెయ్యాల్నో తెలుస్తలేదు. కండ్లు ఐబ్యాంకుకు, బాడీని మెడికల్‌ కాలేజీకి రాసేస్తే బాగుంటుందని తన మనసుకు తోస్తున్నది. యాక్సిడెంట్‌లో పోతే అవయవాలు కూడా దానం చేస్తే ఇంకా మంచిది. కానీ పెద్దగా చదువుకోని, అసలివన్నీ ఆలోచించని, తనే లోకంగా ఉండే తన బేగం సైదాకు ఎట్లా వివరించడం?! తన బిడ్డకు సమజైతదా? కొడుక్కి?

ఇల్లు చేరి కాల్లు చేతులు కడుక్కున్నంక సైదా అడిగింది, విల్సన్‌ విషయాలు. చెప్పుకుంట- ‘‘తన భావాలకు వ్యతిరేకంగా అంత్యక్రియలు జరిగినయి, అతనికి అట్లా ఇష్టం కాదు. షానా ప్రోగ్రెసివ్‌. ఇంత జల్ది పోతానని అనుకోలేదు కాబట్టి ఈ విషయం ఆలోచించి ఉండడు. కులం వాళ్లు వచ్చిన్రు. క్రైస్తవ పాస్టర్లు వచ్చిన్రు. ముస్లింలు వచ్చిన్రు. మేమందరం ఉన్నం. మేం చెప్పి చూసినం.. కానీ ఎవరూ వినలేదు. ఆఖరికి హిందూ స్మశానవాటికలో ఆ ప్రకారంగా సమాధి చేయడం మాకెందుకో జీర్ణం కాలేదు సైదా! రేపు నేను చచ్చిపోతే కూడా నా భావాలకు భిన్నంగా చేస్తరు కదా అనిపించింది’’ అంటుంటే దోస్తు పోయిన నొప్పి, అనుకున్నది చేయలేని అశక్తత కలగలిసి దుఃఖం తన్నుకు వచ్చింది గుల్జార్‌కు. పొగిలి పొగిలి ఏడ్చిండు.. సైదా ‘అవేం మాటలు..’ అంటు గుల్జార్‌ను తన గుండెలకు హత్తుకున్నది!
***
విల్సన్‌ ఇంటికాడ దోస్తులు మల్ల కలిసిన్రు. అతని భార్యతో పిల్లలతో మాట్లాడదామని కూడిన్రు. దినం లాంటి కార్యక్రమమేదో ఎట్లా చేయాలె, ఇంటి హాలతు ఏంది తెలుసుకుందమనుకున్రు. అయన్నీ మాట్లాడినంక బయటికొచ్చి చాయ్‌ తాగుదామని ఒక హోటల్లో చేరిన్రు.

అక్కడ మొదలైంది అసలు చర్చ!
విల్సన్‌ అంత్యక్రియల విషయంలో గుల్జార్‌ అసంతృప్తే మిగతా వారిగ్గుడ ఉంది. ఒకరిద్దరికి అది పెద్ద విషయంగ అనిపించలేదు గనీ మిగతావాళ్లలో ఐదారుగురు దోస్తులు మాత్రం ఆ విషయం చర్చించాల్సిందే నని పట్టుబట్టిన్రు.
అందులో మరొక ముస్లిం, ఇద్దరు దళితులు, ఇద్దరు బీసీలున్నరు. ముస్లిం దోస్తు ఖయ్యూం చర్చను మొదలేసిండు, ‘‘నేను నాస్తికున్ని బై! నా బాడీని మజీదుకు తీసుకుపోవడం, నమాజె జనాజా చదవడం అవన్నీ నాకు ఇష్టం లేదబ్బా! ఇట్ల నేను ఇంట్ల చెప్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ నేను మొండిగా నా బాడీని ఏ మెడికల్‌ కాలేజీకి రాసినా, నేను చనిపోయినంక మా కుటుంబ సభ్యులు సందిగ్ధ పడ్డా, మా సుట్టాలు ఒప్పుకుంటరన్న నమ్మకం లేదు. ఏం చెయ్యాల్నో తెలియదు!’’ అన్నడు.
మిగతా దోస్తులేమంటరోనని షానా ఆసక్తిగ వింటున్నడు గుల్జార్‌.
అంతల్నె ఒక బీసీ దోస్తు, ‘‘మాదైతే విచిత్రమైన సమస్య. మా కులంలో మా తాత దాంక బొంద బెట్టేదట. తర్వాత ఎట్ల అలవాటైందో ఏమో.. ఇప్పుడు మమ్మల్ని కాష్టం బెడుతున్నరు. మేం ఏం జెయ్యాల్నో చెప్పు ఇగ’’ అన్నడు. అందరు ఆశ్చర్యంగ చూసిన్రు.
ఈ టాపిక్‌ నచ్చని ఇంకో దోస్తు- ‘‘నేన్‌ పోతర బై! మనమే సచ్చిపోయినంక మన బాడీ ఏమైతేంది.. నాకైతె ఇంట్రస్టు లేదు’’ అన్నడు. అందరు నవ్విన్రు. ఆ దోస్తు గుడ నవ్వి అందరికి షేక్‌ హ్యాండిచ్చి ఎల్లిపోయిండు.

జరసేపు ఈ ముచ్చట నడిషినంక దళితుల్లో ఒక ఇంటలెక్చువల్‌ దోస్తు, గుల్జార్‌ను అడిగిండు, ‘నువ్వేమంటవ్‌ గుల్జారన్నా?’ అని. అందరు ఇంట్రస్టుగ చూసిన్రు గుల్జార్‌ దిక్కు. గుల్జార్‌ నిర్ణయాలు స్థిరంగ ఉంటయని, నిక్కచ్చి, నిజాయితీ ఉన్నోడని దోస్తులకు బాగా గురి.
‘‘నా సహచరికి, మా పిల్లలకు ముందు ఈ విషయం సమ్జాయించాలె. తర్వాత మీకు చెబుత’’ అన్నడు గుల్జార్‌.
ఇంటల్లెక్చువల్‌ దోస్తు మాట్లాడ్డం మొదలుబెట్టిండు-
‘‘చచ్చిపోయినంక అంత్యక్రియలు కుటుంబ సభ్యులు ఎట్లా అంటే అట్లనే కానిద్దామనే ఆలోచనే అందరికీ ఉంటున్నది. ఎక్కడో కొందరు మాత్రమే భిన్నంగ చేయగలుగుతున్నరు. అందుకు సుట్టాల నుంచి వ్యతిరేకత వచ్చినా పట్టించుకోకుండా చేస్తున్నరు. ఈమధ్య యాక్సిడెంట్ల చనిపోయిన కొడుకు బాడీలోని పార్ట్స్‌ వేరొకరికి దానం చేయడానికి ఒక తల్లి ఒప్పుకున్న వార్త చదివి ఆనందమేసింది.
ఏది మంచి, ఏది మూఢత్వం అన్న విచక్షణ ఉండే మనం ముందుగ ఒక క్లారిటీకి రావడమే మంచిది. ఆ విషయం ఇప్పుడెందుకు అనుకోవడం సరైంది కాదు.
నిజానికి ముస్లింలకు తమ అంత్యక్రియల విషయంలో ఇబ్బందేం లేదు. ఈ దేశ వర్ణవ్యవస్థకు ప్రత్యామ్నాయ సంస్కృతుల్లో ఒకటి ముస్లిం సంస్కృతి . పైగా బాడీ మట్టిలో కలిసిపోవడం అనేది ప్రకృతి ధర్మం. అట్లా ముస్లింల పద్ధతి మంచిదే! అట్లనే క్రిస్టియన్లలో సమాధి చేయడమే ఉంది. మా దళితుల్లో గుడ షానా వరకు సమాధి చేయడమే ఉంది.
ఇగ ఖయ్యూం లేవదీసింది మరొక రకం సమస్య. కవులు, మేధావులు, నాస్తికులు, హేతువాదులందరి ఇండ్లల్ల ఇది పెద్ద సమస్య. సుట్టాల బలవంతంతోటి వాళ్ల కులం వాళ్లు, మతంవాళ్లు ఎట్ల చేస్తరో అట్ల జరిగినప్పటికీ భార్యాపిల్లలకు మనసుల ఏ మూలో పొడుస్తుంటది, ఆయన భావాలకు వ్యతిరేకంగ చేసినమే అని. ఇగ పెండ్లి కావలసిన ఆడపిల్లలున్న ఇండ్లల్లో సుట్టాలు చెప్పినట్లు ఇనాల్సిందే!
ఖయ్యూం చనిపోయినంక కండ్లను ఐ బ్యాంకుకు, బాడీని మెడికల్‌ కాలేజీకి ఇవ్వనివ్వరు వాళ్ల సుట్టాలు. మరేం చేయాలె? ఆ బాధ్యత ఎవరికివ్వాల్నో ముందే వీలునామా రాసి పెట్టడం, ఆ విషయం ఇంట్లో భార్యాపిల్లలతో, తోడబుట్టినవాళ్లతో సంశయాలు లేకుండా చర్చించడం జరగాలె. అట్ల బతికుండంగనే ఒప్పించుకుంటే సమస్య ఉండదు. కాని మరి ఖయ్యూం ఆ పని చేయగలడా?’’ అని ఆగి ఖయ్యూం దిక్కు సూషిండు మా దోస్తు.
‘‘అసలా ముచ్చట తీస్తే సావు గురించి ఇప్పుడెందుకు అని అందరు అదరగొడ్తున్నరు బై!’’
‘‘అట్లనే అంటరు, అయినా సమ్జాయించాలె. లేదంటే విల్సన్‌ గతే మనకు పడుతుంది!’’
ఇట్ల చర్చ జరుగుతుంటే ఇంకో బీసీ ఇంటల్లెక్చువల్‌ దోస్తు చెప్పిన విషయం గుల్జార్‌ను అటెన్షన్‌కి గురిచేసింది.
‘‘మహాత్మా జ్యోతిరావు ఫూలే కూడా తన అంత్యక్రియల గురించి తీవ్రంగా ఆలోచించినట్లు మనకు తెలుస్తున్నది. ఆయన తన వీలునామాలో నా దేహాన్ని కాల్చొద్దు, సమాధి చేయాలని రాశాడు. ఆయన చనిపోయినప్పుడు పెంచుకున్న కొడుకు వేరే కులంవాడని పాలోళ్ళు అడ్డుపడితే సావిత్రీబాయి ఫూలే నే కొడుకు పాత్ర పోషించడం పెద్ద సంచలనం!’’

గుల్జార్‌ ఇంటికొచ్చినంక ఈ విషయాలన్నీ అడిగి విన్నది సైదా!
***
గుల్జార్‌ ఈ కాకమీద ఉండంగనే బక్రీద్‌ పండుగ వచ్చింది. తమ ఊరు వెళ్దామని అనుకొని నలుగురు పయనమై పోయిన్రు. రంజాన్‌కు గుల్జార్‌ చెల్లెండ్లు గుడ వచ్చి ఉండె. బక్రీద్‌ ఖుర్బానీ ఇవ్వాలని ఒకరు, వచ్చిపోయే ఖర్చు ఎక్కువైతున్నదని ఒకరు ఈసారికి రాలే.

పండుగ తెల్లారి కుషాలుగ గుల్జార్‌ అమ్మీ అబ్బాతో మాట్లాడుకుంట వాకిట్ల ఉన్న చెట్ల కింద కుర్చీలేసిండు. మద్య మద్యలో సుట్టాలు, ఊర్లో ఉన్న ముస్లింలు వచ్చి ఖుర్బానీ ఇచ్చిన మాంసం ‘భాగా’లు ఇచ్చి పోతున్నరు. గుల్జార్‌ అమ్మీ ఖైరాతి, సైదా మేక మాంసాన్ని, ఎద్దు మాంసాన్ని వేరు చేసి వేటికవి వండడానికి ఎండేయడానికి రెడీ చేస్తున్నరు. గుల్జార్‌ బిడ్డ రౌష్ని, కొడుకు చాంద్‌ సాయం చేస్తున్నరు. గుల్జార్‌ అబ్బా సులేమాన్‌ సాహెబ్‌ కుర్చీల కూసున్నడు. గుల్జార్‌ జరసేపు అబ్బా పక్కన కూసుంట, జరసేపు అమ్మీ, సైదాలకు సాయం చేసుకుంట ఉన్నడు. కొద్దిసేపటికి కోయడం అయిపోయి ఎండేయడానికి పిల్లలు పట్టుకుంటే ఖైరాతి, సైదా రెండు పొరల సుత్లీకి మధ్యలో మాంసం పోగులను పెట్టుకుంట అల్లుకుంట దండెం చేస్తున్నరు.
‘ఈ కవాబుల దండేలు హైదరాబాద్‌ల ఎండేస్తే మమ్మల్ని అపార్టుమెంటోల్లు మీటింగ్‌ పెట్టుకొని ఎల్లగొడతరేమో’ నని జోకులేస్తుంది రౌష్ని. అందరు నవ్వుకున్నరు.
సైదాతోని ఎప్పట్లెక్కనే ఖైరాతి, ‘వాడు అల్లావాలా! వాడు ఏది అడగడు. మనమే వానికి కావలసినవేందో చేసిపెట్టాలె’ అని గుల్జార్ గురించి చెప్తున్నది.

‘‘సరే గనీ, ఈ దర్గాల గొడవ ఏందిరా! దర్గాలకు ఎల్లొద్దని జమాతుల వాళ్లు చెప్తున్నరంటా! జాన్‌పాడ్‌ షహీద్‌ దర్గాకు మనం మొదటి నుంచి పోవడం అలవాటు గదా! మీ అమ్మ ఆ దర్గాకు మన్నత్‌ చేసే నీ చెల్లె పేరు జానిబేగం అని పెట్టింది గదా! సైదా పేరు గుడ అక్కడ మన్నత్‌ చేసి పెట్టిందేనాయె. మొన్న నల్గొండ లతీఫ్‌ షావలీ ఉర్సు విషయంల గొడవ అయ్యిందట. నీకేమన్న తెలుసా!’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌.

గుల్జార్‌కు ఉత్సాహమేసింది, ‘‘హౌ అబ్బా! కొన్ని జమాతుల వాళ్లు అరబిక్‌ ఇస్లాం ప్రకారం నడవాలని అంటున్నరు. ఇస్లాం పుట్టిన అరబస్తాన్‌ల ఎట్లాంటి నడవడిక ఉందో అట్లనే నడవాలని అంటున్నరు. అల్లా ముందే తల వంచాలె గనీ దర్గాలకు మొక్కుడేంది అనేది వాళ్ల వాదన. మరి మన దగ్గర ఇస్లాం వ్యాప్తి జరుగుతున్న దశలో ఇస్లాం సంస్కృతి  భారత సంస్కృతిలోకి, భారత సంస్కృతి ముస్లింలలోకి ఆదాన్‌ ప్రదాన్‌ – ఇచ్చిపుచ్చుకోవడం లెక్క మిళితమైంది. అట్లాంటి ఇండియన్‌ ముస్లిం కల్చర్‌ ను కాదని ఇవాళ అరబిక్‌ ఇస్లాం లాగే అన్నీ పాటించాలంటే మనకూ హిందువులకు దూరం పెంచడమే! దర్గాలు, పీర్ల పండుగలు గంగా జమున తెహజీబ్‌ లెక్క, అలాయిబలాయి కల్చర్‌ లాగ కొనసాగుతున్నయి. దర్గాల దగ్గరికి ముస్లింల కన్నా ఎక్కువగా ఎస్సీలు బీసీలు ఎస్టీలే వస్తరు. బాపనోల్లు తప్ప మిగతా అన్ని కులాలోల్లు వస్తరు. పీర్ల పండుగల్లో కూడా బహుజనులే ఎక్కువగా నిష్టతోని భక్తితోని ఇష్టంగా పాల్గొంటరు. మనమెట్ల కాదంటం చెప్పు’’ -చెప్పిండు గుల్జార్‌.
‘‘అదేరా.. నాకు తెల్వదా.. చిన్నప్పట్సంది సూస్తున్నా. మరి ఈ నడమంత్రపు ఏశాలేందిరా!’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌.
పిల్లలు, సైదా, ఖైరాతి ఆసక్తిగా ఈల్ల ముచ్చట ఇంటున్నరు.

‘‘అటు ఆరెస్సెస్‌, బీజెపీ వాళ్లు దర్గాలకు పీర్ల పండుగలకు వ్యతిరేకంగా ఉండి హిందూత్వను ప్రచారం చేస్తుంటరు. ఇటు ఇస్లామీయులు గుడ దర్గాలకు వెల్లొద్దు, పీర్ల పండుగ చేయొద్దని అంతే దూరాన్ని పెంచుతున్నరు. లతీఫ్‌ షావలి ఉర్సు చేయొద్దని కొందరు గొడవ చేసిన్రట. దాంతో మరింత పట్టుదలతోని మరింత గ్రాండ్‌గా ఉర్సు చేసిన్రు దర్గా కల్చర్‌కు సపోర్టు చేసేటోళ్లు’’ అన్నడు గుల్జార్‌.
‘‘మంచిపని చేసిన్రు! మనూర్ల ఎన్ని పేర్లున్నయిరా ఈ దర్గా వలీలవి. ఇప్పుడు ఇదేం పోయే కాలంరా..’’ బాదపడ్డడు సులేమాన్‌ సాహెబ్‌.
‘‘అవును అబ్బా! నా వయసు వాళ్ల పేర్లు జానయ్య, జానమ్మ, సైదయ్య, సైదులు, సైదమ్మ, సైదిరెడ్డి ఇట్లా వంద పేర్ల దాంక ఉంటయి. ఇయన్నీ జాన్ పహాడ్ షహీద్ పేర్లే! అట్లనే వరంగల్‌ జిల్లాల అన్నారం యాకూబ్‌ షావలి దర్గా చుట్టుపక్కల వందల కిలోమీటర్ల దాంక యాకూబు, యాకన్న, యాకమ్మ, యాకూబ్‌ రెడ్డి ఇట్లా వందల పేర్లుంటై. అట్లనే గుంటూర్ల మస్తాన్‌ పేరు. మనదగ్గర లతీఫ్ పేరు. ఇట్లా అన్ని చోట్లా ఈ కల్చర్‌తోని పరోక్షంగ ముస్లింల మీద ఒక అవ్యాజమైన ప్రేమను ఇవి పెంచుతున్నయి. దీనిని నాశనం చేయడానికి ఈ జమాతుల వాళ్లు పూనుకుంటున్నరు. ఇది ఎంతమాత్రం మనం సహించకూడదు. సపోర్టు చెయ్యకూడదు..’’
సులేమాన్‌ సాహెబ్‌ గుల్జార్‌ దిక్కు తృప్తిగ చూసిండు.

సైదాకు తన పేరు పెట్టిన జాన్‌పాడ్‌ సైదులు దర్గా అంటే షానా ఇష్టం. అప్పుడప్పుడు పోయిరావాలని ఉందంటే ఒకటి రెండుసార్లు గుల్జార్‌ తోడు పోయినా, ఎక్కువసార్లు పిల్లల్నే తోడు పంపేటోడు. దాంతో ఈ టాపిక్‌ని తను ఆసక్తిగా ఇంటుండడం గమనించిండు గుల్జార్‌.
‘‘ఏమోరా! నేను చచ్చిపోయినంక మాత్రం ఈల్లెవరు చెప్పేది ఇనొద్దు. నా మజార్‌ మంచిగ కట్టించు. ఫాతెహా లివ్వడం ఆపొద్దు. జ్యారత్‌, చహలుమ్‌ అన్నీ చెయ్యాల్రా! ప్రతి ఏడాది పెద్దల పండుగ నాడు నాకోసం నువ్వు ఊద్‌ ఎయ్యాలె. నా మనుమడితోని ఏయించాలె. ఏరా చాంద్‌! ఏస్తావుగా?’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌!
గుల్జార్‌కు గిర్రున కండ్లల్ల నీళ్లు తిరిగినయ్‌!
‘‘జరూర్‌ దాలుంగా దాదా!’’ అంటున్నడు చాంద్‌.
‘‘నువ్వు కోరుకున్నట్లే అన్నీ చేస్తాం లే అబ్బా!’’ అన్నడు జీరబోతున్న గొంతుతోటి గుల్జార్‌.
‘‘సాలురా.. ఈ మాట సాలు!’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌ గుడ పూడుకుపోయిన గొంతుతోటి.
‘‘కైకె బాతాన్‌ జీ వో.. అబ్‌ కైకు వో సోబ్‌?’’ అని ఖైరాతి అరిషింది.
‘‘పర్వానై అమ్మీ! బోల్నే దేవ్‌! క్యానై హోతా!’’ అని గుల్జార్‌ సమ్జాయింపుగ అన్నడు.
‘‘బోల్నారీ! బోలేతోచ్‌ బచ్చొంకు క్లారిటీ రెహతా..’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌.

ఇదే సందని గుల్జార్‌, ‘‘సరేగానీ అబ్బా! టాపిక్‌ వచ్చింది కదా. నేను చనిపోయినంక గుడ ఏం చెయ్యాల్నో నా కొడుక్కు, నా బిడ్డకు చెప్పాలె గదా!’’ అన్నడు.
సులేమాన్‌ సాహెబ్‌ స్వేచ్ఛాభావాలున్న మనిషి చేబట్టి ఎంటనే ‘చెప్పురా!’ అన్నడు.
సైదా గుల్జార్‌ దిక్కు కోపంగ చూసింది. రౌష్ని, చాంద్‌ అయోమయం, ఆసక్తి, జరంత బెరుకుతో చూసిన్రు.
‘‘నా భావాలు వేరు కదా.. నా ఇష్ట ప్రకారం నేను చనిపోయినంక నా కండ్లను ఐబ్యాంకుకు, నా బాడీని మెడికల్‌ కాలేజీకి ఇవ్వాలని కోరిక. మనం పోయినంక గుడ మన బాడీ ఎవరికన్న ఉపయోగపడాలె.. ఏమంటవ్‌ అబ్బా!’’ అన్నడు గుల్జార్‌.
‘‘ఏం మాటలవీ!’’ అన్నది సైదా.
‘‘అరేయ్‌.. మమ్మల్నిట్లా బతకనివ్వరాదురా.. ఇట్లాంటి మాటలని ఎందుకు పరేశాన్‌ జేస్తవు’’ అన్నది ఖైరాతి.
‘‘అనంగనే పోతరా.. టాపిక్‌ బాగుంది, కానివ్వురి!’’ అన్నది రౌష్ని.
పెద్దగ నవ్విండు చాంద్‌.
సులేమాన్‌ సాహెబ్‌ కండ్లల్ల గుడ సన్నని నీటిపొర ఆవరించింది గనీ తమాయించుకొని, తల గోక్కొని, ‘‘ఏమోరా! మన ఇస్లాంల ఇయన్నీ లేనట్లుంది.. ఒప్పుకోరు’’ అన్నడు.
‘‘ఇప్పుడే నువ్వంటివి కదా, వాళ్లు ఒప్పుకోకున్నా నాకు జ్యారత్‌, చహలుమ్‌ లు చేయాలని, ఫాతెహా లివ్వాలని! మరి దీనికెందుకు ఒప్పుకోవు?’’ అన్నడు గుల్జార్‌ మురిపెంగ నవ్వుకుంట.
‘‘నిజమేరా!’’ అన్నడు సులేమాన్‌ సాహెబ్‌ గుడ ముసిముసిగ నవ్వుకుంట.
‘‘మీరు ముగ్గురేమంటరు చెప్పురి’’ అడిగిండు గుల్జార్‌.
‘‘నువ్వనుకున్నట్లు మన సుట్టాలు ఒప్పుకోరుగ అబ్బా!’’ అన్నడు చాంద్‌.
‘‘మీరిద్దరు చదువుకున్నరు, మీరు ఒప్పించాలె రా!’’ అన్నడు గుల్జార్‌.
‘‘ఏమో అబ్బా! వాళ్లు ఒప్పుకుంటరని నాకైతే నమ్మకం లేదు. అప్పుడు అమ్మీ వాళ్ల మాటే విందామంటది’’ అన్నడు చాంద్‌.
‘‘నువ్వేమంటవు సైదా?’’ అన్నడు గుల్జార్‌.
‘‘హమ్మో! నువ్వు లేవంటే నేను బతికుంటనా.. అసల్‌ మై తుమారెకు మర్నేచ్‌ నైదేతి.. తుమె మర్‌గైతో మై మర్‌గైజైసాచ్‌!’’ అనుకుంట తునకల దండెం వదిలేసి వచ్చి గుల్జార్‌ను అల్లుకుని బోరున ఏడ్చింది సైదా!
దాంతో అందరూ గుల్జార్‌ చుట్టూ చేరి అల్లుకుపోయిన్రు. అందరూ ఏడుస్తుంటే సులేమాన్‌ సాహెబ్‌ కుర్చీల కూసొనే తన ఒళ్లు ఎగిరెగిరి పడంగ ఏడుస్తున్నడు.
‘‘అరెఅరె.. ఏంది ఇదంతా..!’’ అంటున్నడు గనీ గుల్జార్‌కు గుడ గొంతు పూడుకుపోయింది. సంభాలించుకుని అందరి తలలు దువ్వుకుంట, ‘‘ఏడ్వొద్దు.. అందరం ఎనకా ముందూ పోయేటోల్లమే. భూమికి మనం శాశ్వతం కాదు. ఎవరు ముందు పోయినా, ఎవరు ఎనక పోయినా గుండె నిబ్బరంతోని నడుచుకోవాలె. ఇట్ల బుజ్‌దిల్‌ లతోని ఏడిస్తే ఇగ నా నుంచి మీరేం నేర్చుకున్నట్లు. ఇన్నాళ్లు నేను మీరంతా అన్నీ అర్దం చేసుకుంటరను కుంటుంటె ఇట్లయితె ఎట్ల!?’’ అంటు సమ్జాయించిండు గుల్జార్‌.
‘‘అందుకే ఇసొంటి టాపిక్‌లు మాట్లాడుకోవద్దనేది..’’ అని ఖైరాతి అందుకుంది.
గుల్జార్‌ వీల్లను వదిలించుకుని తండ్రి దగ్గరికి పోయి ఆయన కండ్లు తుడిచి వంగి ఆయనను గుండెలకు హత్తుకున్నడు. మల్ల ఒళ్లు ఎగిరెగిరి పడుతుండంగ ఏడ్షిండు సులేమాన్‌ సాహెబ్‌. మల్ల అందరు వీళ్ల సుట్టు చేరి ఏడ్సుడు షురూ చేసిన్రు.
అయాల జరంత తేరుకున్నంక సైదా అన్న మాట గుల్జార్‌ కెందుకో సమజ్‌ కాలేదు. సైదా గుడ విప్పిచెప్పలేదు-
‘‘నువ్వు పోతే నేను బతికి గనక ఉంటే.. ఏం చెయ్యాల్నో నాకు తెలుసు!’’

2

ఏండ్లు గడిషిపోయినయి.
గుల్జార్‌ పిల్లలిద్దరూ లవ్‌ మ్యారేజులే చేసుకున్నరు. ఇద్దరివీ మతాంతర వివాహాలే. హైదరాబాద్‌లోనే సెటిలయ్యిన్రు.
సులేమాన్‌ సాహెబ్‌, ఖైరాతి గడిచిపోయిన్రు.
గుల్జార్‌ అమ్మీ అబ్బాల ఇంట్లోనే కాల్లు చేతులు ఆడినన్నాళ్లు ఉందామని ఊరికి చేరిన్రు గుల్జార్‌, సైదా. అక్కడెందుకు, నా దగ్గర ఉండండంటే నా దగ్గర ఉండమని పిల్లలు బతిమిలాడిన్రు. లేదంటే మాకు దగ్గర్లో మీకో సపరేట్‌ డబుల్‌ బెడ్‌రూం తీసుకుంటం.. పనిమనిషిని పెడతం. ఇక్కడే ఉండమని చెప్పినా వీళ్లకెందుకో ఊర్లో ఉండాలనే అనిపించింది. గుల్జార్‌ కన్న ఎక్కువ సైదా ఊరివైపే మొగ్గింది. గుల్జారుగ్గూడా తను ఆడి దుంకిన ఊరని హుషారు గుండింది. దాంతో ఊర్లో ఇల్లు బాగుచేసుకొని ఉండిపోయిన్రు.

ఊర్ల చేరినంక కొత్త వాతావరణం ఏర్ప
 డింది. ప్రైమరీ మెడిసిన్‌ తెచ్చి పెట్టి ఊర్లోవాళ్లకు జ్వరానికి, నొప్పికీ ఇచ్చేటోడు గుల్జార్. ఆర్థిక ఇబ్బందులతోని వచ్చినోళ్లకు అంతో ఇంతో సాయం చేసేటోడు. దాంతో మెల్లమెల్లగా రోజూ పొద్దున్నే గుల్జార్ ఇంటి ముంగల జనం కూసొని గుల్జార్ కోసం చూస్తుండేది. గుల్జార్ లేషి రాంగనే వాళ్ళ ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చెప్పుకునేది. గుల్జార్‌ పెన్షన్‌ దాదాపు వాళ్లకే పంచేసేటోడు. ఇట్లయితే ఎట్లా అని తొల్త పరేషానైంది సైదా. ఐటెంక ఖామోషై సమజ్‌ చేసుకుంట ఉండిపొయ్యింది. గుల్జార్‌ దాన గుణం ఎరుకై సుట్టుపక్కల ఊర్ల వాళ్లు గుడ రాబట్టిన్రు. పైసలు సరిపోక దోస్తులను, ఎన్‌జివోలను అడిగి మరీ వాళ్లకు సాయం చేయబట్టిండు గుల్జార్‌. వాళ్లకు జీవన ఆదరువు ఏర్పాటు చేసేటోడు. రోగులొస్తే వారి రోగాన్ని బట్టి దవాఖానకు పోవాల్సిన అవసరం లేనోళ్లెవరో, పోవాల్సినోల్లు ఏ దవాఖానకు పోవాల్నో, ఎసువంటి జాగ్రత్తలు తీసుకోవాల్నో చెప్పేటోడు. తనకు తెలిసిన డాక్టర్‌లకు ఫోన్లు చేసి జర సాయం చెయ్యండని పంపేటోడు.. గుల్జార్‌ మాట, మందు బాగా పనిచేస్తదని ప్రచారమయ్యింది. సుట్టుపక్కల వందల కిలోమీటర్ల దాంక గుల్జార్‌ పేరు మోగిపోయింది. గుల్జార్‌ బతికున్న దేవుడని దండం పెట్టేటోల్లు జనం!
రోజు పొద్దున సైదా వాకింగ్‌కి పోయేది. ఎప్పుడో ఒకసారి గుల్జార్‌ వల్ల అయ్యేది. గుల్జార్‌కు నిద్దర పట్టుడే తక్కువ. ఏ అద్దరాతిరో నిద్ర పట్టేది. అందుకని గుల్జార్‌ను లేపకపోయేది. గుల్జార్‌ జల్ది లేషిన రోజు, తనకోసం వచ్చిన జనాన్ని అరుసుకొని పంపించేసి సైదాతో పొయ్యేటోడు. ఒకరోజు ఊరిబైట ఒక వేపచెట్టు ఉన్న జాగా చూపెట్టింది సైదా. ఆ చెట్టు కింద ఏనెరాళ్లుంటే తను కూసొని గుల్జార్‌ను కూసొమ్మన్నది. ఎందుకో ఆ వాతావరణం గుల్జారుగ్గూడా నచ్చింది. ‘‘నాకీ జాగ ఇప్పిస్తవా?’’ అన్నది సైదా. గుల్జార్‌ ఆశ్చర్యపోయిండు. ‘‘ఏం చేసుకుంటవు!’’ అన్నడు. ‘‘నాకెందుకో ఈ జగా బాగ నచ్చింది. నేను రోజు తెల్లారి ఇక్కడి దాకా వాకింగ్‌కు వచ్చి ఈ చెట్టుకింద కొద్దిసేపు కూసొని వస్తుంట. మొన్న ఈ జాగా ఆయన ఇటునుంచి పోతు ‘ఈ జాగ తీస్కోరాదమ్మా! అమ్ముదామనుకుంటున్న’ అన్నడు. నేను మా ఆయనను అడిగి చెప్తా. నువ్వు ఇప్పుడే ఎవరికీ మాటివ్వకు అన్న. నువ్వేమంటవు?’’ అడిగింది సైదా.
‘‘నీ ఇష్టం గనీ, అన్ని పైసలు మనకాడెక్కడియి. పిల్లల్ని అడగాల్సి వస్తది గదా!’’ అన్నడు గుల్జార్‌.
‘‘అయన్నీ నీకెందుకులే.. నేను చూస్కుంటగ’’ అన్నది. గుల్జార్‌ ఆశ్చర్యపోయి, ‘సరే, నీ ఇష్టమే’ అన్నడు.
గుల్జార్‌ను ఆశ్చర్యపరుస్తు ఆ జాగ కొన్నది సైదా. పిల్లల్ని పైసలు అడగలేదు. తనే ఎప్పటిసందో దాసుకున్న పైసలన్నీ తీసి, తనకున్న కాసిన్ని సొమ్ములు అమ్మేసి ఆ పని చేసింది.

ఆ జాగల తీరుతీర్ల చెట్లు, ముఖ్యంగ పూల చెట్లు పెట్టించింది. ఆ వేపచెట్టు కింద ఒక మంచం, రెండు కుర్చీలు అమర్చింది.
ఇగ ఇద్దరికి ఎల్లాలన్పించినప్పుడల్లా ఎల్లి అక్కడ వేపగాలికి సేదతీరి వచ్చేటోల్లు. పిల్లలు వచ్చినప్పుడు ఇయన్నీ సూషి పరేషానయ్యిన్రు. ‘ఇదంతా చేస్తున్నట్లు మాకు చెప్పలేదెందుకు’ అని అలిగిన్రు. మేం పైసలిచ్చేటోల్లం కదా అన్నరు. నవ్వి ఊకున్నది సైదా.

సైదాలో ఈ మార్పు పట్ల జరంత పరేషానయిండు గుల్జార్‌. ఊకె ఆలోచిస్తుండడం, తనలో తనే ఏవో లెక్కలేసుకుంటున్నట్లు అనిపించేది. గమనించనట్లే ఉండేటోడు గుల్జార్‌. ఎందుకంటె సైదా ఎప్పుడు గుడ తనకోసం గుల్జార్‌ను ఏమీ అడిగేది కాదు. తనకోసం ఏమైనా తెస్తే ‘అవసరమా’ అనేది. ఎప్పుడు పిల్లలూ గుల్జార్‌ చింతే.
ఊర్లో చేరినంక నల్గొండలో లతీఫ్‌ సాబు గుట్ట ఉర్సు వస్తె గురువారం సందల్‌ రోజు పోదామని తీసుకెల్లేది. శుక్రవారం పోయి గుట్ట దామన్‌ల గడుపుదామనేది. గుట్ట ఎక్కే ఓపిక, శక్తి లేవు కాబట్టి కిందనే గడిపి వచ్చేటోల్లు.
తనను అట్లా తనకు ఇష్టమైన వాటికి వదిలి గుల్జార్‌ తన ఆలోచనల్లో ఉండేటోడు.. ఫోన్లు, దోస్తులతోని చర్చలు, సోషల్‌ మీడియా పోరాటాలు చేస్తుండేటోడు.

జాన్‌పాడ్‌ సైదులు దర్గా ఉర్సు వచ్చింది. పోయివద్దామన్నది. ఇప్పుడు అవసరమా అన్నడు గుల్జార్‌. ఈ ఒక్కసారికి అని బతిమాలుకుంది. సరేనని పొయిన్రు. దర్గా సుట్టు తిరుగుదామంటే నువ్వు తిరిగిరా.. నేనిక్కడ నిలబడతా అని పక్కనున్న చెట్టుకింద నిలబడ్డడు గుల్జార్‌. నెత్తినిండా కొంగు కప్పుకొని మూడు సుట్లు తిరిగింది. రమ్మంటే లోపలికి పోయిండు. లోపలికి పోడానికి ఫీజు, కందూరుకైతే ఒక రేటు, మామూలుగైతే ఒక రేటు ఇవన్నీ లోపలున్న కాంట్రాక్టరు మనుషులు బలవంతంగా వసూలు చేస్తుండడం చూసి గుల్జార్‌కు బాధేసింది. ఏందిది, దర్గా గుడ వ్యాపారమైపోయిందే అనిపించింది. సైదా గుడ రగిలిపోయి బైటికొచ్చినంక గుల్జార్‌తో ఒకటే అన్నది, మీకు పరిచయమున్న జర్నలిస్టులకు చెప్పండి, ఈ వ్యవహారం బాగాలేదు అని. వాళ్లకు తెలియకుండా ఉంటాయా? ఇవాల్రేపు అన్నీ అందరికీ తెలిసే జరుగుతుంటయి అని ఊకున్నడు గుల్జార్‌.
ఈసారి దర్గాను, పరిసరాలను ఎక్కువగా అబ్జర్వ్‌ చేస్తూ గడిపింది సైదా. వయసు పెరుగుతుంటే ఇలా జరుగుతుందేమోననుకున్నడు గుల్జార్‌.
***
ఒకరోజు రాత్రి సైదా గాఢ నిద్రలో ఉంది. గుల్జార్‌కు వీపు నుంచి ఛాతీలోకి మెల్లగా నొప్పి షురూవైంది. గ్యాస్ట్రికా? గుండెనొప్పా? డౌటొచ్చింది. ఏం చేయాలె. సైదాను లేపబుద్ధి కాలేదు. ఊర్లో ఆరెంపీ డాక్టర్లే గానీ హాస్పిటల్లు లేవు. నల్గొండకు ఈ రాత్రి ఏం పోతాం? అని తగ్గుతుందేమో చూద్దామని పక్క మీద అటు తిరిగి ఇటు తిరిగి పడుకున్నడు. లేషి అటు ఇటు నడిషిండు. చాంద్‌ కు కాల్‌ చేద్దామా అనిపించింది.. కాని వాడు హైదరాబాద్‌లో ఉండి ఏం చేస్తడు? అనిపించి ఊకున్నడు. రేష్మాతో మాట్లాడాలనిపించింది. పడుకుని ఉంటరంతా.. ఎందుకు డిస్టర్బ్‌ చేయడం, సూద్దాం ఇంక జరసేపు అనుకున్నడు. సైదా ను చూస్తూ కూసున్నడు. కొద్దిసేపట్ల నొప్పి ఎక్కువైపొయి ఒక్కసారిగా గుండెలో ఏందో పట్టేసినట్లయి చేతులతో ఛాతీని అదుముకుంటు అమ్మా అన్నడు. మాట బైటికి రాలేదు. గుండె ఆగిపోయింది.
***
తెల్లారి గుల్జార్‌ చనిపోయిండన్న విషయం అజమ్‌ కాక సోయి తప్పి పడిపోయింది సైదా. సోయి వచ్చినంక గుండెలవిసేలా ఏడ్చింది.

గుల్జార్‌ తన కళ్ళను ఐబ్యాంకుకు, బాడీని మెడికల్‌ కాలేజీకి రాసిండని దగ్గరి సుట్టాలతో చెప్పిన్రు చాంద్‌, రౌష్ని. సుట్టాలంత బెంబేలెత్తిపోయిన్రు. దాడీవాలాలైతే అగ్గిమీద గుగ్గిలమయ్యిన్రు. అస్సలు ఒప్పుకునేదే లేదన్నరు. ఏవేవో వ్యాఖ్యానాలు తోడు తెచ్చుకుని చాంద్‌ని, రౌష్నిని పరేషాన్‌ చేయబట్టిన్రు..

ఇంతలో సైదా నిశ్చయంగా చెప్పిన నిర్ణయం చాంద్‌ని, రౌష్నిని మరింత హతాషుల్ని చేసింది. గుల్జార్‌ భౌతిక కాయం దగ్గర వాలిపోయి ఏడుస్తున్న సైదా నిర్ణయాన్ని గుడ మార్చడానికి కొందరు ప్రయత్నాలు చేసిన్రు. సైదా తల అడ్డంగా ఊపుతూ తన నిర్ణయం మీదే స్థిరంగా ఉన్నది.
చాంద్‌ను ఇంట్లోకి పిలిపించింది రౌష్ని. ‘ఏం చేద్దాం రా?’ అన్నది ఏడుస్తు.. వాడు గుడ అక్కను పట్టుకొని పొగిలి పొగిలి ఏడ్చిండు. ఇద్దరూ కొద్దిసేపటికి తేరుకున్నరు. ‘నువ్వేమంటవ్‌ ఆపా?’ అన్నడు చాంద్‌. ‘అమ్మీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటదని అస్సలు ఊహించలేదురా.. ఏం చేద్దాం?’ అన్నది. ‘అబ్బాజాన్‌ చెప్పినట్లు బాడీ డొనేట్‌ చేద్దామంటే సుట్టాలు ఒప్పుకునేలా లేరు. నువ్వు ఓకే అంటే అమ్మీ చెప్పినట్లే చేద్దాం ఆపా!’ అన్నడు చాంద్‌. చాంద్‌ అత్త ముందుకు తోస్తే అతని బార్య వచ్చి ఏదో అడ్డు చెప్పబోయింది. చాంద్‌ ఆమెను వారించి ‘నువ్వు చెప్పు ఆపా?’ అన్నడు.
‘‘అమ్మీ చెప్పినట్లే చేద్దాం రా! లేదంటే తను మరింత అప్‌సెట్‌ అయితది’’ అన్నది రౌష్ని.
చాంద్‌ వాళ్లమ్మ కాడికి పోయి, ‘‘నువ్వు చెప్పినట్లే చేద్దాం అమ్మీ!’’ అని చెప్పిండు. వాణ్ని పట్టుకొని ఏడ్చింది సైదా. వాడు గుడ ఏడ్చి కండ్లు తుడుసుకొని టైమవుతుందని బైటికి నడిచిండు. బైట వెయిట్‌ చేస్తున్న వాల్లందరికీ ‘అమ్మీ చెప్పినట్లే చేద్దాం!’ అన్నడు.
అట్లెట్లా అని కొందరు అన్నరు. కొందరు వాల్లను వారించిన్రు. అట్లా పెట్టడం ఇస్లాంలో ఉన్నదా.. ఉంటే ఏంటి దాని ఆనుపానులు అని కొందరు చింత చేయడం మొదలుపెట్టిన్రు. కొందరు ఈ వ్యవహారం నచ్చక ఎల్లిపోయిన్రు.
గుల్జార్‌ దోస్తులు అయోమయంగ మొఖాలు చూసుకున్నరు. చాంద్‌తోని గుల్జార్‌ ఆలోచనలు పంచుకున్నరు. మా అమ్మ నిర్ణయమే మాకు ఇప్పుడు ముఖ్యమని తేల్చి చెప్పిండు 
చాంద్‌.

మొత్తానికి ఏడుపులు, అల్లాహు అక్బర్‌ల నడుమ జనాజా లేషింది. ఊరికి దగ్గర్లో ఉన్న మజీదుకు తీసుకుపోయిన్రు. జనాజా నమాజ్‌ అయ్యాక మళ్లీ మోసుకొచ్చి సైదా నిర్ణయం ప్రకారం ఊరిబైట సైదా కొనుక్కున్న జాగలో సైదాకు ఇష్టమైన వేపచెట్టు కాడ సమాధి చేయడం జరిగిపోయింది!

 

***
సైదా ఎక్కడికీ రానన్నది. పిల్లలు అడిగి అడిగి అలిసిపోయిన్రు. వాళ్ల తమ్ముడు గుడ వచ్చి నిద్ర చేయడానికి తన ఇంటికి రమ్మన్నడు. రానన్నది. మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉండి వెళ్లండని పిల్లలకు చెప్పింది. వాల్లకు సెలవుల ప్రాబ్లం కాబట్టి నాలుగు రోజులు చాంద్‌, వారం రోజులు రౌష్ని ఉండి ఎల్లిపోయిన్రు.

సైదా దినమంతా గుల్జార్‌ సమాధి చుట్టూరా మొక్కలు చెట్లను చూసుకుంటు ఆ వేపచెట్టు కిందనే గడపడం అలవాటు చేసుకుంది. సైదాకు తోడు అమ్మలక్కలు వచ్చి కూసొని ముచ్చట పెట్టేటోల్లు. గుల్జార్‌ మంచితనం గురించి కతలు కతలుగా మాట్లాడుకునేటోల్లు. మొదట్లో గుల్జార్‌ చనిపోయిండని తెలియని ఊర్ల వాళ్లు వచ్చి విషయం తెలిసి బాధపడి, ఊకుండలేక ఆడా ఈడా కొన్ని పూలు తెచ్చి సమాధి మీద చల్లిపోయేటోల్లు. సల్లంగుండాలని దువా ఇచ్చేటోల్లు. నొప్పులు రోగాల వాళ్లు వెంటనే పోలేక అక్కడ కాసేపు గడిపి ఎల్లేటోల్లు. కొందరు వచ్చినరోజు అక్కడే పండుకొని తరువాతి రోజు పోయేటోల్లు. ఎట్ల ప్రచారమైందో గానీ అట్లా ఎల్లి గుల్జార్‌ సమాధి మీద కొన్ని పూలు చల్లి అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి వస్తే మంచి జరుగుతదని, రోగం నయమైతదని ప్రచారమైంది. దాంతో ఇక జనం మస్తుగ రావడం షురువైంది. మజార్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఊదు రాసుకోవడం, దీపాలు పెట్టడం, రాత్రిళ్లు నిద్ర చేయడం లాంటివి మొదలై మెల్లగా కందూర్లు చేయడం దాకా వచ్చింది!

పూలు చల్లితే మేలు జరుగుతుందనే నమ్మకం ఎక్కువవుతూ వచ్చింది. గుల్జార్‌ అంటే అర్దం పూల తోట కాబట్టి పూలు చల్లితే చాలు ఆయన సంతృప్తి పడి తమకు మేలు చేస్తాడని జనం రకరకాల పూలతో వచ్చి పూలు చల్లేవాళ్లు. దాంతో ఆ ప్రాంతమంతా వివిధ రకాల పూల వాసనతో నిండిపోయి అదొక రకమైన తన్మయం పొందేలా చేసేది.. దాంతో గుల్జార్‌ అంటే పూదోట అనే పేరు దశదిశలా వ్యాప్తి చెందింది.
కొన్నాళ్లకు గుల్జార్‌ మజార్‌ మీద పెద్ద దర్గా వెలిసింది! వేపచెట్టు పక్కన దర్గా. ప్రశాంతతకు నిలయంల నిలబడింది.
సైదాకు ఈ మార్పు గొప్ప సంతృప్తి నిచ్చింది. వచ్చిన వాళ్లకు ఊద్‌ రాయటం.. మోర్చా కట్ట (నెమలీకల కట్ట)తో దీవించడం, మంచి చెడులు అర్సుకోవడం ఆమె దినచర్య అయింది. తనకు తెలిసిన వైద్యం కూడా చేసేది సైదా. ముఖ్యంగ ధైర్యం చెప్పేది. దువా, దవా రెండూ ముఖ్యమనేది. దవాఖానకు గుడ పోవాలని చెప్పేది. గుల్జార్‌ బాబా మీకు తోడుంటడని చెప్పేది. సైదా ఓపిక, జనానికి మానసిక ధైర్యం చెప్పే తీరు చూసి అబ్బురపడుతు నిబ్బరంతో వెళ్తున్నరు జనం.

అక్కడెవరో ఒక పెద్ద గల్లగురిగి లాంటి పెట్టె పెట్టిన్రు. వచ్చినవాళ్లు తోచినంత వేస్తున్నరు. ఆ పైసలు రాత్రికి తీసి ఉంచి మరుసటిరోజు వచ్చినవాళ్ల అవసరాలకు ఇస్తున్నది సైదా. ఫీజుల్లేని దర్గా! డిమాండ్లు చేయని దర్గా! ఇక్కడికొస్తే తీసుకుపోవడమే కానీ ఇచ్చిపొయ్యేది ఏమీ లేదని.. కొన్ని పూలు చల్లితే చాలని ప్రచారమైంది! నిష్కల్మషమైన మనిషికి, మనసుకి గుల్జార్‌ ప్రతిరూపమని, అతనిలాంటి మనుషులుంటే లోకం సుఖసంతోషాలతో విలసిల్లుతుందని అందుకే అతనికి దర్గా వెలిసిందని, మనం గూడ ఆ వలీ లెక్క బతకాలని జనం చెప్పుకోబట్టిన్రు!
ముస్లింలతో పాటు మిగతా బహుజనులు ఎక్కువగా వస్తున్నరు దర్గాకు. కొబ్బరికాయలు కొట్టడం, మేకపోతులు కోయడం, మన్నత్‌లు, కందూర్లు మరింత పెరిగినయి. రాత్రిళ్లు నిద్ర చేస్తానికి ఎందరో వస్తున్నరు. వారికి సదుపాయాలు అందించేవాళ్లు కూడా ఎందరో ముందుకొస్తున్నరు..!

రోజూ గుల్జార్‌ మజార్‌పై ఎక్కించే పూల చాదర్‌ల గుబాళింపుతో, సాంబ్రాణీ, ఊద్‌ బత్తీల పొగతో అదేదో అతీతమైన ప్రదేశంలాగా అనిపిస్తూ సందర్శకులను అలౌకిక భావనలోకి తీసుకెళ్తుంటది 
దర్గా.
తీరొక్క పూలతో దర్గా నిండిపోతుండడంతో గరీబుల పెళ్ళిల్లకు అక్కడి పూలు ఉచితంగా సరఫరా అయ్యేవి. గుల్జార్‌ బాబా దర్గా పూలలోంచి ఒక్కపువ్వైనా పెళ్లి పూలలో కలిస్తే చాలు, ఆ జంట సంసారం ఏ ఒడుదుడుకులు లేకుండా సాగుతుందని ప్రచారమయ్యింది! దాంతో ఆ దర్గా పూలను తప్పకుంట పెళ్లివారు తీసుకెళ్లడం ఆనవాయితీగ మారింది.

గుల్జార్‌ బాబా దర్గా అంటే నిశ్చింతకు, నియ్యతికి, మనోధైర్యానికి మారుపేరైపోయింది! ఒక్క పూలచాదర్‌ చాలు తమ కష్టాలు తీరడానికి అనేది ఆ చుట్టుపక్కల ప్రజల విశ్వాసంగా మారిపోయింది!

ఒక నమ్మకం, ఒక ధైర్యం, ముఖ్యంగ నిశ్చింత చాలా ముఖ్యం.. మనాదిని పారదోలడం ముఖ్యం.. ఇక నాకేం కాదన్న నమ్మకం రోగాన్ని సగం నయం చేస్తుంది.. బహుశా అదే దర్గాలను బతికిస్తున్నదని చెప్తుంటది సైదా!

ఇప్పుడు ఆ ఊరి పేరు గుల్జార్‌ బాబా దర్గా ఊరు. గుల్జార్‌ పుట్టినరోజు ఉర్సు మొదలై వారం రోజులు సాగుతుంది. అప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం దర్గాను సందర్శించుకుంటరు. నెలరోజుల పాటు జనం పెద్ద సంఖ్యలో వస్తనే ఉంటరు. ఉర్సు జాతరలో గరీబోళ్లంతా ఎన్నెన్నో వస్తువలు అగ్వకు కొనుక్కుంటరు. పిల్లలకు, ఆడోళ్లకు ఇష్టమైనవన్నీ దొరుకుతాయక్కడ. మిగతా ఏడాదంతా జనం వచ్చిపోతనే ఉంటరు. గురు, శక్రవారాలు మిగతా రోజుల కన్నా ఎక్కువ జనం వస్తుంటరు.

మీరు ఎప్పుడైనా ఆ ఊరి దిక్కు పోతే సైదాను, గుల్జార్‌ బాబాను చూస్తానికి తప్పకుంట పోయిరావాలె!
ఇప్పుడు- సైదా పూర్తిగా తెల్లబడ్డ తలవెంట్రుకలతో మొఖంపై ఒక కళతో మెల్లగా కదులుతూ మీ కణతలకు ఊద్‌ రాసి మోర్చాకట్టతో మూడుసార్లు తలపై మెల్లగా తాటిస్తూ దువా ఇస్తుంది!
మీరు ఎక్కడలేని ప్రశాంతతను, నిశ్చింతను పొందుతరు!

మిమ్మల్ని అలోకంలోకి తీసుకెళ్లడానికి పూల చాదర్లు కప్పుకున్న గుల్జార్‌ బాబా ఎలాగూ ఉంటడు!
*
చిత్రం: మహమ్మద్ గౌస్ 

స్కైబాబ

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very impressive story. It enlightens the reader about the changes took place in the muslim community. Darga is the holy place where each and every community come to visit. Darga is a place of spiritual democracy. Darga culture took the idea of equality in Islam and it helped to create a harmonious society. Compassion and benevolence have been spread from this place. Skybaba, you made a wonderful story.

  • మంచి కథ స్కై. దర్గా ఒక ప్రజాస్వామిక ఆధ్యాత్మిక స్థలం. ఇస్లాం ను ప్రజలకు చేరవేసింది దర్గాలే. చచ్చాక ఏమవుతామో తెలియదు కానీ, దర్గాగా మరి దేవుడయ్యె అవకాశం ఉంది. మనిషి దేవుడు కావటం అంటే ఇదే. పూల చాదర్ చాల బాగున్నది. అభినందనలు.

  • దర్గాల విషయంలో నా అభిప్రాయం సుస్పష్టం. ఇది సరైంది కాదని…. కనుక కథ గురించి కంటే కూడా శైలి గురించి మాత్రమే మాట్లాడ గలను. ఇది స్కైబాబ మార్క్ కథ.

  • మంచి కథ. గుల్జార్ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం. అది కాస్తా ఆయన్ను దర్గాగా మార్చడం, కథ చివరి వరకు చదివించింది. ఇండియన్ ఇస్లాంను అరబిక్ ఇస్లాం డామినేట్ చేస్తోందని, దానివల్ల భారతీయ ముస్లింలకు జరిగే కష్ట నష్టాల గురించి చాలా బాగా చెప్పారన్నా. పాత ఆచారాలు మంచివే. కానీ, ఇప్పుడంతా జమాత్‌లు అంటూ అరబిక్ ఇస్లాంను తేవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ముస్లింలలోనే బేధాభిప్రయాలు వస్తున్నాయి. మొత్తానికి కథ ఏకబిగిన చదివించింది. మధ్యలో కాస్త సాగతీత అనిపించినా చదివించింది. అభినందనలు అన్న.

  • థాంక్యూ వెరీ మచ్ జిలుకరా! షుక్రియా సంఘీర్!
    సాబిర్! దర్గా సంస్కృతి ఎలా సరైంది కాదో మీ అభిప్రాయం రాస్తేనే కదా చర్చించడానికి ఉంటుంది! ఎదురుచూస్తాను..

  • Sir ఈ కథ చాలా బాగుంది. మా అబ్బా కూడా body donate చేస్తే తమ్ముడు వాళ్ళు ఇవ్వలేదు.
    చదువుతున్నంత సేపు కన్నీళ్ళు కారుతున్నాయి వున్నాయి పాత జ్ఞాపకాలు గా🙏👌

    • అదే కదా విషాదం..
      మనం వెనక్కు నడుస్తున్నాం..
      😓

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు