పూరీడుపిట్ట పాట

శాన్నాలుగా ఎదురు తెన్నులు సూత్తన్ను
పుచ్చపువ్వుల్లాటి నా రొండు కళ్ళూ
సూర్జిడిని ఎలిగించి పొగులంతా ఎదకతనవి
పొద్దుబోయీపాటికి దీవెట్టుకొని
దివస్తంభాల మీద దివ్వలవతనవి –
ఏ పొద్దు కిందనుండి దూరి తుర్రుమని
ఎటెగిరిపోతందో ఏటో తెల్డంనేదు
సూపుకి సిక్కకుండా కంటికి దొరక్కుండా
ఆ లైలగంగి పిట్టెంత యమలేసి
తప్పుకొని తిరగతందో సెప్పనలవి గాదు
అంతకి యిరుమిక్కిలి దనికి మర్లేసీద్దును గానీ
ఆ పిట్ట పేణానికి నా పేణం జత!
గుండి రోసిపోయినట్టు ఊరిసుట్టూ తిరిగెన్ను
గడ్డలూ గాయిలూ దాటి నా డబ్బలు మంట
నేల కనబడిన సోటల్లా
నీలు కప్పేసిన సోటల్లా
కల్లు కాయలు కాసినట్టు ఎదికెన్ను
ఆ పిట్టెక్కడా అలోడనేదు సరిగదా
దాని కాలుమీది కర్రీక సకా నా కంటబడనేదు
అడపా దడపా పలకరింపు కొచ్చినట్టు
రెక్కలోర్సి ఎగిరెలిపొచ్చీ
మా ఇల్లాక సెట్టుమీద వోలీదా పిట్ట
సెట్టంతే సెట్టా.. సెట్టు దిబ్బయిపోను సెట్టు!
ఆ సెట్టే నా బొట్టు తుడిసేసిన సెట్టు
ఆ సెట్టే మా యింటి దీపాలారిపేసిన సెట్టు
పచ్చటిసెట్టు పమిడికాయలే యిస్తాదనుకున్ను
నా పెనిమిటి పేణాలు జారదీసింది పాపిష్టి సెట్టు!
ఆ సెట్టు సెడ్డదనం మాటేమో గానీ
దసరా పండుక్కందరూ పాలపిట్ట మొకం జూత్తారు
నీను మాత్తరం నా పూరీడు పిట్ట మొకమే జూడాల
నా మామున్నప్పుడు ఈ పిట్టను జూత్తే
ఒక పాట పాడోడు
తోలీత ఆ పాట యిన్నానంతే..
నా మామకి మనసిచ్చుకున్ను;
మామతో నానెప్పుడో సెనగ్గుడ్డికి నడిసెళ్తుంతే
అప్పుడు మల్లా అదే పాట;
ఇప్పుడు నా మామాలేడు.. ఆడి పాటానేదు..
మామతో నా మనువు జేసిన పూరీడున్నాది
ఆమాసకో పుణ్ణంకో ఆ పిట్టమొకం జూసి
దండమెట్టుకుంతే శాన
నా ఉదిమిల మెదిల్నోడి కోసం ఉగ్గబట్టుకున్న దుఖ్కమంతా
కరిగిపోయి కల్లు సల్లబడతాయి
ఒంటరి ఆడదాన్ని, దుక్కీ దుఖ్కమూ తప్పనిదాన్ని
అటు ఎవసం సూడల్ల ఇటు యిల్లు నడపల్ల
అంగటికీ పొలానికీ దినంకింతని యిచ్చుకుని
గిడసబారిపోయిన నా బతుకును
పొడుగు జేసుకోవల్లని గింజుకుంతన్ను;
ఆరేడు పొద్దుల కొకపాళైనా ఆ పిట్ట నా కంట బడిపోతె సరి!
నాకెవులూ సాయం సెయ్యక్కర్నేదు
నీను పొలాన దిగితే పొద్దు ఎనక్కి పరిగెట్టల్ల
నీను గాదిలో ఏసిన గింజల్లా గలగల నవ్వీ
రూపాయి కాసవ్వల్ల..!
పూతికి పుల్లంత ఉంతాను గానీ మాసెడ్డ సావసం నాది
ఆది నుండీ మా నేల మీద నాలాటి
బొట్టు సెరిగిపోయిన ఆడోలందరూ అంతే;
లచ్చలమంది మా మొగోళ్లని బలిదీసుకున్న
కళింగ ఉద్ధం నాటి నుండీ ఇదే తిత్తవట;
ఒంటరిసొంటోళ్ళమైనా మీము జంకమూ బెంకము
గుండిబలంతోటే బండి నెట్టుకోని ఎలిపొస్తాం!
*

కంచరాన భుజంగరావు

1 comment

Leave a Reply to K Nagavali Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు