నిరాశ పడను
పుస్తకాలు చదవడం మానను
రాయడమూ ఆపను.
పుస్తకం చదవని నాడు
నాకు పస్తులున్న రోజే
కళ్ల నిండా పులుము కోక పోతే
నా చూపుకు అర్థం లేదు.
బయటి నుంచి ఇంట్లోకి రాగానే
రెపరెపలాడుతూ ఆహ్వానిస్తాయి
కరెంటు లేని నాడు కూడా
మా యిల్లు ఊహలతో వెలుగుతుంది
పేరుకున్నది దుమ్ము కాదు
పుప్పొడి
ప్రేమగా తుడుస్తాడు
గోముగా ఛాతి కద్దుకుంటాను
రాసిన నాటి కాలాన్ని
ఆవాహన చేస్తాను
ఎప్పుడో పూసిన పువ్వుల్ని
వాడి పోకుండా చూస్తాను.
అక్షరాభ్యాసం చేయించిన
అలనాటి పంతులు గారిని స్మరిస్తాను
లిపి విన్యాస లతలకు వేలాడుతూ
జ్ఞాన శిఖరాలకు ఎగ బాకుతాను.
నా పొట్ట కోసినా
అక్షరం ముక్కలే వుంటాయి
అవి నా చేతులకు బలాన్నిచ్చాయి,
చాకిరీని నేర్పాయి
నా మనుమలు
అపరిచితులు కాకుండా అడ్డుకున్నాయి.
నాలోని కవిని వెలికి తీసాయి
మానవత్వానికి ద్వారాలు తెరిచాయి
ఒక్క కథ
జీవితాన్ని విస్తృత పరుస్తుంది
ఒక్క కవిత
కస్తూరిలా పరిమళింప జేస్తుంది.
*
పుస్తకాల పై మీకున్న అపారమైన ప్రేమ ఈ కవితలో కనిపిస్తుంది. మీ బాటలోనే మేము కూడా
లిపి విన్యాస లతలకు వేలాడుతూ
జ్ఞానశిఖరాలకు ఎగబాకుతాను…
అద్భుతం దృశ్యం
నా పొట్ట కోసినా
అక్షరం ముక్కలే ఉంటాయి…
పుస్తకాల పురుగు అనే మాటను
నోబెల్ ప్రైజ్ లా స్వీకరిస్తాను…
గ్రంథాలు ముద్రించుకొని
ఒక ముద్ద తక్కువ తింటాను…
విలువైన వాక్యాలు