పుట్టిన రోజు

అమ్మ (సుమిత్ర లండ) లేని ఖాళీని పూడ్చుకోవడానికి కవిత్వానికి దగ్గరయ్యాను. నేనిప్పుడు వెలితిలోంచి వెలుగుల వైపు నడుస్తున్న కొత్త అక్షరాన్ని. కవిత్వంతో నాది ఏడేళ్ళ నడక. చిన్నప్పుడు – నాన్న (రామస్వామి లండ) నేర్పిన అక్షరం, లాంతరు వెలుగులో అర్ధరాత్రి వరకూ ఆయన చదివి వినిపించిన సాహిత్యం, రాయని బతుకు కథలు చెప్పే సముద్రం, వలస పక్షుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సిక్కోలు వాతావరణం, రెక్కలు తెగిన జటాయువు లాంటి ఉద్దానం.. నన్ను కదిలిస్తాయి. కవిత్వం కమ్మంటాయి. 2020 లో నా తొలి కలల సంపుటి “గాజురెక్కల తూనీగ” ప్రచురించాను. బహుశా.. ఈ ఏడాది చివర్లో “నాలుగు రెక్కల పిట్ట” నై వస్తాను. పిల్లలకు పాఠాలు చెప్పడం, కవిత్వం చదువుకోవడం, అప్పుడప్పుడూ ఓ వాక్యం కావడం… మనసుకు ఇష్టమైన వ్యాపకాలు. 

 

1

పుట్టినరోజు

రాత్రవగానే శిశిరాలు
నన్ను  పెనవేసుకుంటాయి
చలిలో..
ఖాళీతనంలో..
అర్ధరాత్రి లోపు
ఒక్క వాక్యమైనా తోడు రాకపోతుందా అని
ఓపిగ్గా నిరీక్షిస్తాను
చందమామ
కాళ్ళు ముడుచుకుని నిద్రపోతుంటుంది
ఒక కన్ను మూసి
చెట్టు కూడా రాత్రిలోకి జారుకుంటుంది
ఒంటరిగా నిద్రపట్టదేమో
సముద్రం మాత్రం
మెల్లగా వచ్చి
నన్ను కావలించుకుని పడుకుంటుంది
అసూయతో చుక్కలు
ఒకదాన్నొకటి కొట్టుకొని రాలిపోతాయి
గాలి
రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరిపోతుంది
తీరం అంచున చిక్కుకున్న పడవొకటి
అటూ ఇటూ ఊగుతూ
కెరటాలను నిద్రపోనివ్వదు
గుండెల మీద పడుకున్న చిన్నారి
పల్చటి కలలోంచి లేచి
మళ్ళీ దట్టమైన కలలోకి మేలుకుంటుంది
సరిగ్గా రేపు
మరణిస్తాననగా
ఇవాళ
నేనొక వాక్యమై పుడతాను.
*
2
ఒంటరి దుఃఖాలు
ప్రతి రాత్రినీ
దుఃఖానికి రాసిచ్చేసి
నా నేల నిద్రలోకి జారుకుంటుంది
ఎవరైనా ఇటు కేసి వస్తారో రారో
వచ్చినా నిద్రలేపుతారో లేదో
పొద్దున్నే
సజీవంగానో నిర్జీవంగానో
నిద్రలేవాలి
బతికుంటే అదో తంటా!
చిన్న డబ్బాలో ప్రాణాన్ని కట్టుకుని
పనిని వెతుక్కుంటూ
రెండో మూడో  ఆకలి పేగుల్నీ
కిడ్నీలు అవిసిన దేహాల్నీ మోసుకుంటూ
ఇసుక దారుల్లో ఒకటే నడక
రోజు రోజుకీ బరువెక్కుతూ
నెత్తిమీద బతుకుగంప!
ఎముకల్లో మూలుగును తినమరిగిన
రాజకీయం పురుగొకటి చేరి
ఊళ్లన్నీ గుల్లబారి పోయాయి
మావి..
వలస ఎడారులు
వసంతాలు ముఖం చాటేసిన వనాలు
ఈ గడపల్లో
ఏ ఉషోదయాలూ వాలవు
ఇవీ
ప్రకృతి పగబట్టిన ఊళ్ళు
మరణంరంగు గాలులుంటాయని
ఎవరి ఊహకైనా అందుతుందా?
చావు వాసనేసే నీళ్ళ గురించి
ఎవరైనా వినుంటారా?
పదేళ్లకే అనాథలై
గుజరాత్ తీరానికేసి సాగిపోయే పాదాల కథ
ఐదేళ్ల కాపురానికే
ఎండిపోయే నుదురుకొమ్మల కథ
ఏ కన్నీళ్ళకు తెలిసుంటుంది?
మావన్నీ ఒంటరి దుఃఖాలు
ఏ దుఃఖంతోనూ సరిపోలవు.
*
3
  రెండు ఆశ్చర్యార్థకాలం!!
అనంతకాలం నుండీ
ఆమే నేనూ ప్రేమించుకుంటున్నాం
నేనామెను నా చూపుగా
నా హృదయ లయగా
నా నడకగా స్వీకరించాను
నేనొక ఆకాశాన్నని నమ్మించడానికి
ఆమె ఒక హరివిల్లవుతుంది
నేనొక చెట్టునని రుజువుచేయడానికి
ఆమె ఒక రంగురంగుల పిట్టవుతుంది
కొన్ని కలల్ని కనమని
తన కన్రెప్పల్ని దానమిస్తుంది
కొన్ని సుదీర్ఘ ఉదయాల్నీ
కొన్ని ఆంతరంగిక సాయంత్రాల్నీ
కొన్ని నిశ్శబ్దరాత్రుల్నీ కానుకిస్తుంది
నదిలా నా వెంట ప్రవహించీ ప్రవహించీ
నాలో పచ్చదనాన్ని నింపి నన్నో
అరణ్యాన్ని చేస్తుంది
రకరకాల రూపాంతరీకరణల తర్వాత
ఆఖరికి నేనో పాటనవుతాను
ఆమె నా పాటరెక్కల్ని కదిపే
వేదనవుతుంది
ఎన్నేళ్లు కలిసున్నామనే లెక్కుండదు
విడిపోతామనే భయమూ ఉండదు
ప్రేమ అనే పరావలయ కక్ష్యలో
బలీయమైన హృదయాకర్షణకులోనై
దగ్గరవుతూ దూరమవుతూ
చిర్నవ్వు గ్రహాలమై సాగిపోతుంటాం
మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఏర్పడే
సంశ్లిష్ట వాక్యంలో
నేనో అసమాపక క్రియని
తానో సమాపక క్రియ!
ప్రపంచానికి మాత్రం –
మేం రెండు ఆశ్చర్యార్థకాలం!!
*

సాంబమూర్తి లండ

నేను సాంబమూర్తి లండ. టీచర్. బోధన తర్వాత ఎక్కువగా ప్రేమించేది కవిత్వం. చదవడం మరీ ఇష్టం. వర్తమాన సమాజంలోని వ్యత్యాస్తాలు, మూకస్వామ్యాలు, బతుకు రొద, శూన్యం నన్ను కదిలిస్తాయి. 2020 లో "గాజురెక్కల తూనీగ" కవితా సంపుటి ప్రచురించాను. నాదైన వాక్యాన్నీ, నాదైన గొంతునీ, నాదైన భాషనీ వదిలివెళ్లాలనేది నా స్వప్నం.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏరువాక లో నా అక్షరానికి అవకాశం కల్పించిన సారంగకు ధన్యవాదాలు.

  • మంచి కవిత లు సాంబ మూర్తి గారు
    శుభాకాంక్షలు

  • ఏరువాక ప్రయత్నం బాగుంది. కవి మిత్రుల సంగతులు తెలుస్తున్నాయి. సాంబమూర్తి కి అభినందనలు.

  • మంచి కవితలు అందించారు అన్న…శుభాకాంక్షలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు