పీడితుల నిర్భయ జెండా- భూపతి!

కమ్యూనిస్ట్ వుద్యమం లో భూపతి గారు చాలా కాలం పాటు పని చేసి, రైతు కూలి సంఘానికి నాయకుడిగా కొనసాగి గత రెండు మూడు దశకాల నుంచి ఫూలే, అంబేడ్కర్ కుల నిర్మూలనా స్పృహతో రచనలు చెయ్యడం అన్నీ సహజ పరిణామాలుగానే భావించ వచ్చు.

నేను నాగార్జునా యూనివర్సిటీ కి వచ్చినాక 2008-10 మధ్యలో మా తమ్ముడు ప్రత్తిపాటి నవజీవన్ ఓసారి భూపతి నారాయణ మూర్తి గారిని నాదగ్గరికి తీసుకొచ్చాడు. (ఆయన మలికిపురం నుంచి ఇటు వొస్తే అన్నీ నవజీవనే చూసుకునేవాడు). అంతకు ముందు ఆయన గురించి కొద్దిగా వినడం, ఆయన రాసిన ‘దళితుల అసలు జాతి నాగులు’ అనే పుస్తకం చదవడం తప్ప ఆయన్ని చూడలేదు. అనుకోని విధంగా ఆయన్ని మా ఆఫీస్ లో కలవడం, మాట్లాడడం, ఆయన అభిమాని అవ్వడం జరిగిపోయాయి. ఆయనకి బొత్తిగా వినిపించదు. మనం పేపర్ మీద రాస్తే భూతద్దంలో చూసి, పెదాల కదలికను గమనించి రెస్పాండ్ అవుతారు. అప్పటికే ఆయన ఎనిమిది పదుల్లో ఉన్నప్పటికీ మెయిన్ గేట్ నుంచి లోపలికి తూనీగలా నడిచి వొచ్చారు. ఆయన నడుస్తుంటే నవజీవన్ వెనక పరుగెత్తినట్టు నడుస్తాడు. అప్పటికీ సైకిల్ తొక్కే అలవాటుంది అని చెప్పారు. నేను అడిగినవాటన్నిటికీ సమాధానం చెప్పాడు. తర్వాత ఎప్పుడొచ్చినా నవజీవన్ నా దగ్గరికి తీసుకొచ్చేవాడు. తర్వాత ‘దళితుల అసలు జాతి నాగులు’ పుస్తకం మళ్ళీ వెయ్యాలనుకున్నప్పుడు ఆ పుస్తకానికి నేను ముందుమాట రాయాలన్నారు. నేను ఆయనకి ముందుమాట రాయడమేమిటని అంటే నవజీవన్ ఆయన మీరే రాయాలని గట్టిగా అంటున్నారు అన్నాడు. అలా మా పరిచయం బాగా సన్నిహితంగా మారింది.

పోయినేడు(2018) ఫిభ్రవరి నెల లో భీమ్ భూమి పత్రిక ఆయన మీద ప్రత్యెక సంచిక వేసింది. ఆ సందర్భంగా ఆయన బైటికి రాలేకపోతున్నారు మూవ్ మెంట్ తగ్గింది ఎలాగూ పత్రికని కూడా ఇచ్చి ఆయనతో ఆవిష్కరింపచేద్దాం అని ఎడిటర్ మాతంగి దిలీప్ అంటే దిలీప్, తంగిరాల సోనీ, సామాజిక పరివర్తన కేంద్రం ఉన్నవ వినయ్ కుమార్ నేనూ మలికిపురం వెళ్లాం. అక్కడికి చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆయన అభిమానులు, మిత్రులు చాలామంది వచ్చారు. వారిలో నేలపూరి రత్నాజీ, చింతపల్లి గురుప్రసాద్ గారు, BSP నాయకులు లక్ష్మణరావు గారు, కోలాటి పెద్దిరాజు గారు మొదలైన వారు ఉన్నారు. ఆమె, ఆమె కొడుకులు, కోడళ్ళు భూపతి గారిని అపురూపంగా చూసుకుంటున్నారు. ఆయన హుషారుగా తిరుగుతున్నప్పటికీ ఒకసారి ఉన్న జ్ఞాపక శక్తి మరోసారి ఉండడం లేదు అన్నారు. నన్ను మామూలుగా చూసి ఊరుకుని మాట్లాడుతుంటే గుర్తుకొచ్చి నా దగ్గరికొచ్చి తన తలని నాకు ఆనించి నవ్వాడు. చేతులు పట్టుకుని ఊపేశాడు.

భూపతి నారాయణ మూర్తి గారికి చదువు అంతంత మాత్రమే! సామాజికంగా మాల కులంలో, ఆర్ధికంగా వెనుకబడిన వర్గంలో పుట్టాడు. అయినా అతడు మహా శక్తి సంపన్నుడు. తన కంటే పీడితులు, బాధితులు ప్రపంచంలో చాలా మందే వున్నారనే గొప్ప అవగాహన ఆయనది. దు:ఖితుల రోదన వినగల పొడుగాటి హృదయం ఆయనది. తన జ్ఞానంతో, ఆలోచనలతో అంతకంటే గొప్పదైన ధృఢ సంకల్పంతో ఆయనో విశిష్టమైన వ్యక్తిగా యెదిగాడు. ఆయన  1921, సెప్టెంబర్ 17 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని మలికిపురం మండల కేంద్రం లో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు పల్లమ్మ, వీరాస్వామి. ఆయన ఐదో తరగతి వరకు మలికిపురం, రాజోలులో చదివారు. 1940 లో ‘కమలమ్మ’ అనే ఆమెతో వివాహం అయ్యింది. బతుకుదెరువు కోసం అనేక పనులు చేసుకుంటూ బర్మా దేశానికి వలసెళ్ళి అక్కడ కార్ఖానాలలో కార్మికుడిగా పనిచేశారు. ఆ తర్వాత స్వతంత్ర్యోద్యమం లో పాల్గొని జైలుకెళ్ళారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వ్యవసాయ రైతుకూలీ వుద్యమం లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసి నిర్బంధాలు యెదుర్కొని, కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడిపి హైదరాబాద్, విశాఖపట్నం సెంట్రల్ జైళ్ళలో డిటెన్యూ గా వున్నాడు.తర్వాత కూడా కోనసీమ ప్రాంతంలో జరిగిన భూపోరాటాల్లో పాల్గొన్నాడు. కమ్యూనిస్ట్ వుద్యమంలో అగ్రస్థాయి నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటి వారందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన పాల్గొనని వుద్యమం, అందోళన లేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఆయన వుద్య జీవిగానే కొనసాగాడు. ఆయన చాలాకాలం పాటు దళిత, బహుజన వ్యవసాయ కార్మిక సంఘానికి రాస్ట్ర అధ్యక్షుడిగా వుండి భూమిలేని దళిత బహుజన రైతు కూలీల సమస్యల మీద పనిచేశారు. ఆయన భార్య కమలమ్మ కూడా ఆయనతో పాటు పోరు బాటలోనే పయనించి కోనసీమ పేద ప్రజల ప్రేమానురాగాలకు వారు పాత్రులయ్యారు.

నారాయణమూర్తిగారి వ్యక్తిగత జీవితం ఆశక్తికరంగా వుంటుంది. ఆయన స్కూల్ రోజుల్లో వొక బ్రాహ్మణ టీచర్ బెత్తంతో చెవిపై కొట్టడం వలన ఆయన వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయారు. దీంతో ఆయనకు పిల్లనివ్వడానికి యెవరూ ముందుకురాకపోయే సరికి పేద అనాధ పిల్ల అయిన కమలమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆయన తండ్రి పెత్తందారీ కులాల కింద పాలేరుతనం చెయ్యడం యిష్టంలేక బర్మా వంటి యితర దేశాలకు సైతం వలసెళ్ళి పనులు చేసుకుని ఆత్మగౌరవంతో బతకడం వలన నారాయణ మూర్తిగారికి కూడా బాల్యం నుంచే కొంత అభ్యుదయ భావాలు సహజంగానే అబ్బాయనవచ్చు. గ్రామాల్లో దెయ్యాలు, భూతాల పేరున జరిగే మూఢత్వాలపై ఆయనకు ముందునుంచీ వ్యతిరేకత వుండేది. యెంతదూరమైనా తూనీగలా నడిచే ఆయనకు సైకిల్ తొక్కడం యిష్టమైన హాబీ. బాగా వృద్ధాప్యంలో కూడా ఆయన సైకిల్ తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
. ఆయన నిరక్షరాస్యురాలైన తన భార్య కమలమ్మ గారిని చదివించి ఆమెను తన వుద్యమ జీవితంలో కూడా భాగస్వామిని చేసుకున్నాడు. ఆ రోజుల్లోనే ఆమెకు సైకిల్ తొక్కడం నేర్పించి ఆయన స్త్రీ స్వేచ్చ పట్ల తన ధృక్పధాన్ని ఆచరణలో చూపించారు. కమలమ్మ గారి చైతన్యం యెంతో మందికి స్పూర్తిదాయకం. నారాయణ మూర్తి, కమలమ్మల ఒక్కగానొక్క కూతురుకి కారల్ మార్క్స్ భార్య ‘జెన్నీ’ పేరును పెట్టుకున్నారు.

నారాయణ మూర్తి గారు కమ్యూనిస్ట్ పార్తీ తరపున పోటీ చేసి రెండుసార్లు మలికిపురం సర్పంచ్ గా యెన్నికవ్వడమే కాక ఆయన రాజోలు, బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గాలనునంచి రెండుసార్లు యెన్నికలలో పోటీచేసి వోడిపోయారు. ఆయనకు క్షేత్ర స్థాయి దళిత కమ్యూనిస్ట్ నాయకుడిగా మంచిపేరుంది. యెల్లప్పుడూ ప్రజల్లోనే వుండి వారి సమస్యల మీద పనిచేసిన ఆయనంటే అక్కడి సామాన్య జనానికి విపరీతమైన ప్రేమ. కమ్యూనిస్ట్ వుద్యమం కుల సమస్యను పట్టించుకోలేదని ఆయన బాధ పడతారు. ఆయన యెక్కువగా తన శక్తినంతా వెచ్చించిన రైతు కూలీ సంఘంలో తన సహచరులు తలా వొక దోవ చూసుకుని తనని యేకాకిని చేసినప్పుడు నారాయణ మూర్తి గారు వుద్యమం నుంచి వెనుదిరగకుండా తన భావాలను ప్రజల్లో వ్యాప్తి చేస్తూ ఆ విధంగా వారిని చైతన్య పరచాలని రచనా వ్యాసంగాన్ని యెన్నుకున్నారు. అందుకు యెంతో శ్రమించి అధ్యయనం ద్వారా అనేక అంశాల పట్ల తన అవగాహనను పెంపొందించుకున్నారు. ఆయన రచయితగా పరిణామం చెందాకే ఆయన దృష్టి బాబా సాహెబ్ డా. అంబేడ్కర్ పైన పడిందనవచ్చు. అంబేడ్కర్ ని అధ్యయనం చేశాక ఆయన ఆలోచనా విధానంలో కుల, వర్గ సమస్యపైన స్పస్టమైన మార్పు వొచ్చింది. యీ దేశపు కుల భూస్వామ్యం అంతరించి సమ సమాజం స్థాపించబడాలంటే మార్క్స్, అంబేడ్కర్ ల ఆర్ధిక సాంఘిక ధృక్పధాలు భారత సమాజానికి అవసరమని ఆయన నమ్మాడు. యీ క్రమంలోనే ఆయన కుసుమ ధర్మన్న, సి.వి, కె.జి.సత్యమూర్తి(శివసాగర్) వంటి వారి రచనలను సీరియస్ గా అధ్యయనం చేశారు. ఆ విధంగా భూపతి గారు బ్రాహ్మణ వాదాన్ని యెదిరించి దానికి ప్రత్యామ్నాయ సామాజిక సాంస్కృతిక విప్లవం రావాలని చెప్పిన ఫూలే అంబేడ్కర్ ల భావధారను తన రచనల్లో చొప్ప్పించడం ప్రారంభించారు. ఆయన రచనల మీద సి.వి గారి ప్రభావం ఉంది.

భూపతి నారాయణ మూర్తి గారు ఫార్మల్ గా చదివుకున్న డిగ్రీల చదువు కంటే యిన్ ఫార్మల్ గా చదివిన చదువు అసాధారణం. ఆయన నిరంతర అధ్యయనశీలి, ఆలోచనల పుట్ట. ఆయన మెదడు రగిలే కుంపటి. నిరంతర అధ్యయనం, రచన అనేవి ఆయనకు రాను రాను వో వ్యసనం లాగా పట్టుకున్నాయి. ఆయన యిప్పటి వరకూ సుమారు నలభై దాకా పుస్తకాలు ప్రచురించారు. దాదాపు అన్ని రచనలూ సిద్ధాంతపరమైనవే! ‘తెలుగు జాతి-జాతీయత’, ‘దళితుల అసలు జాతి నాగులు’, ‘ మార్క్సిస్ట్ అవగాహనతోనే దళితుల విముక్తి’, ‘దళితులపై దమనకాండ’, ‘రిజర్వేషన్లు- పుట్టుపూర్వోత్తరాలు’,’రిజర్వేషన్లు-రాజ్యాంగం’, ‘పాలన,బోధన, జనజీవన రంగాలలో తెలుగు’, ‘ప్రాణాంతకమైన తుఫానులనుండి ప్రజలకు రక్షణ లేదా?’, ‘దోపిడీ పాలనతో గ్రామీణ మండల వ్యవస్థ’, ‘శిధిలావస్థలోనున్న గన్నవరం ఆక్విడెక్టు’,’మధ్యపానమా? మానవత్వమా?’, ‘స్మశానంగా మారుతున్న కోనసీమ’, ‘అమరుడు కందికట్ల నాగభూషణం’, ‘క్రైస్థవులపై కాషాయం దాడి’, ‘బ్రాహ్మణ భావజాలంపై క్షత్రియుల తిరుగుబాటు’, ‘దోపిడీ వర్గాల పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిరశించండి’, ‘మండల్ కమిషన్ నివేదిక- పూర్వాపరాలు’, ‘హైందవ సమాజంలో శృంగారానికి సంకెళ్ళు’, ‘సైన్స్ అంటే యేమిటి?’ ‘జ్ఞానం ఎలా వస్తుంది?’, ‘తెలగాల విముక్తికి దారెటు?’, ‘ఆది బౌద్ధాన్ని అంతం చేసిన బ్రాహ్మణీయ మహాయానం’, ‘బహుజనుల స్థితిగతులు-విముక్తి ప్రణాళిక’, ‘దళిత, బహుజన రాజకీయ సిద్ధాంత వ్యాసాలు’, ‘దళిత బహుజన బానిసత్వానికి కారకులెవరు?’, ‘టెర్రరిజానికి పుట్టిల్లు అమెరికా’ మొదలైనవి భూపతి నారాయణ మూర్తి గారి రచనలు.
ఆయ్న రచనలలో శాస్త్ర సాంకేతిక రంగాల వ్యాప్తి యొక్క ఆవశ్యకతతో పాటు ప్రజల్లో మూఢనమ్మకాలను వొదలగొట్టాల్సిన అవసరాన్ని చర్చించే రచనలు, యిటీవల యెంతో ప్రచుర్యం పొందిన తెలుగు భాష, జాతీయతల పైన ఆశక్తికరమైన చర్చ, చరిత్ర, సంసృతి, వారసత్వం పైన సరైన చారిత్రక దృష్టి కోణాన్ని అందించే రచనలు, రిజర్వేషన్ విధానం పైన, రాజకీయ అర్ధశాస్త్రం, అభివృద్ధి వంటి అంశాలు, బౌద్ధం, జైనం, చార్వాకం వంటి అవైదిక మతాలను యెలా చూడాలి అనే అంశం పైన, సాంస్కృతిక విప్లవం అంటే యేమిటి, టెర్రరిజం, అంతర్జాతీయ రాజకీయాలు, సంక్షోభాలు వంటి విభిన్న అంశాలపైన ఆయన విస్తృతంగా రాశారు.
భూపతి నారాయణమూర్తి గారి రచనల్లో ‘నాటి నాగులే నేటి దళితులు’ అనే పుస్తకం మలిముద్రణలో ‘నాటి నాగులే నేటి బహుజనులు’ అనే పేరుతో వొచ్చింది. యీ పుస్తకం నేడు అణగారిన కులాలుగా వున్న వారి పుట్టుపూర్వోత్తరాలు, వారి సాంస్కృతిక అస్తిత్వం, భాష వంటి అంశాలపై ఆశక్తికరమైన సమాచారాన్ని యిస్తుంది.
యీ పుస్తకంలోని చర్చని ఆయన ‘తెలుగు భాష’, ‘తెలుగు జాతి’ అనే అంశాలపై రాసిన పుస్తకం లో కూడా కొనసాగించారు. బౌద్ధంపైన నారాయణ మూర్తి గారి అవగాహన యెంతో లోతుగా వుంటుందనడానికి ఆయన రాసిన ‘ఆది బౌద్ధాన్ని అంతమొందించిన బ్రాహ్మణీయ మహాయానం’ అనే గ్రంధం మంచి వుదాహరణ.

మొదట పూర్తిస్థాయి మార్క్స్ వాదిగా వున్న భూపతి గారు తర్వాత ఫూలే, అంబేడ్కర్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి రాసిన పుస్తకం ‘ఫూలే, అంబేడ్కర్ స్పూర్తితో బహుజనుల స్తితిగతులు- విముక్తి- ప్రణాళిక’ అనే పుస్తకంలో ఫూలే, అంబేడ్కర్ విముక్తి సిద్ధాంతాన్ని పీడితులు తెలుసుకుని దానిని ఆచరణలో సాధ్యం చేసుకోవల్సిన అవసరం వుందని నారాయణ మూర్తి గారు యీ పుస్తకం లో పేర్కొన్నారు.
‘బహుజన సాంస్కృతిక విప్లవం’ అనేది నారాయణ మూర్తి గారి రచనలలో మరో ముఖ్యమైన పుస్తకం. అభివృద్ధికి నిరోధకంగా వుండే ఛాందసవాద విశ్వాసాలకు బహుజనులు దూరంగా వుండాలని ఆయన యీ పుస్తకంలో ప్రతిపాదించారు.

బహుజన కులాల సాంస్కృతిక విప్లవాన్ని సాధించడానికి ఆయన యీ పుస్తకంలో కొన్ని సూచనలు చేశారు. అవి- బ్రాహ్మణ వాదాన్ని వెలి వెయ్యడం, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడం, మూఢనమ్మకాల్ని అనవసరమైన దుబారా ఖర్చుల్ని ప్రజలపై రుద్దే మతపరమైన పండుగల స్థానంలో యీ దేశంలో శాస్త్ర విజ్ఞానాన్ని, సమతా భావనని పెంపొందించిన మహనీయుల పుట్టినరోజులు, వర్ధంతులు, ఆయా సంస్థల ఆవిర్భావ దినాలు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మొదలైనవి పర్వ దినాలుగా ఆచరించడం వలన ప్రజల్లో భావ వికాసం పెంపొంది వారు అభివృద్దివైపు పురోగమిస్తారని ఆయన యీ పుస్తకంలో వివరించారు.వుదాహరణకు సావిత్రీబాయి జయంతి, మేడే, అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన రోజు, అంతర్జాతీయ మానవ హక్కుల దినం మొదలైనవి.
భూపతి నారాయణ మూర్తి గారి రచనల్లో ‘కాటన్ దొరకు

కోటి దండాలు’, ‘పాకీపనివారి నికృష్ట బతుకులు’ యెంతో విశిష్టమైనవే కాక వాటికెంతో ప్రాసంగికత వుంది. గోదావరి నదిపైన ధవళేశ్వరం వద్ద కాటన్ దొర ప్రాజెక్ట్ నిర్మించడం వలన ఆ ప్రాంతం లో వొచ్చిన హరిత విప్లవం, వ్యవసాయిక అభివృద్ధి ని కొనియాడుతూ కాటన్ దొర కృషికి నీరాజనాలు పలికారు. అలాగే ప్రభుత్వాలు వొకవైపు స్వచ్చ భారత్ వంటి కార్య క్రమాలు చేపడుతున్నప్పటికీ యిప్పటికీ దళితులు చేతులతో మనుషుల మల మూత్రాలు యెత్త వల్సిన దుస్థితిపైన బెజవాడ విల్సన్ వంటి వారు వుద్యమాలు నిర్మిస్తున్నారు. యీ నేపధ్యంలో పాకీ పని గురించి ఆయన రాసిన కఠోరమైన విషయాలు పాఠకులను ఆలోచించచేసేవిగా వున్నాయి.

భూపతి గారికి అంతర్జాతీయ రాజకీయాల పైన యెంతో మంచి అవగాహన వుందనడానికి ఆయన రాసిన ‘టెర్రరిజానికి పుట్టినిల్లు- అమెరికా’ అనే పుస్తకం మంచి వుదాహరణ. అమెరికా యేక ధృవ కేంద్రంగా బక్క చిక్కిన దేశాలపైన, తన దురహంకారాన్ని ప్రశ్నించే దేశాలపైన నిరాటంకంగా సాగిస్తున్న ఆగడాలను యీ పుస్తకంలో ఆయన అనేక సంఘటనలవారీగా వివరించారు. అందులో ముస్లిం దేశాలైన ఇరాక్, లిబియా,ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై దాడులు, దేశాధినేతల హత్యలు,క్యూబా, యుగోస్లావియా, చిలీ, కాంబోడియా, కాంగో, మెక్సికో వంటి దేశాలపై ఆంక్షలు, దాడులు మొదలైన పలు రకాల హక్కుల హననానికి అమెరికా పాల్పడడం మీద విశ్లేషాత్మకంగా యీ గ్రంధాన్ని రూపొందించారు.

తెలుగులో మొట్టమొదటి దళిత కవి కుసుమ ధర్మన్న జీవితం, వుద్యమం, సాహిత్య సేవ గురించి భూపతి నారాయణ మూర్తి గారు రాసిన ‘సాంస్కృతిక విప్లవ మూర్తి కుసుమ ధర్మన్న కవి’ అనే పుస్తకం కుసుమ ధర్మన్న వుద్యమాన్ని, సాహిత్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని యెంతో గౌరవంతో పాఠకులముందు వుంచిన మంచి రిఫరెన్స్ పుస్తకం. ధర్మన్న కవి దళితుడు కాబట్టి ఆయన గురించి చాలా మంది సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు వుద్దేశ పూర్వకంగానే సరీగా తెలియనివ్వలేదని భూపతి గారు పేర్కొన్నారు.
మేధావులంటే యెవరు? వారి వలన సమాజానికి జరగవల్సిన మేలు యేమిటి? అనే అంశం గురించి నారాయణ మూర్తి గారు వొక ఆశక్తికరమైన పుస్తకాన్ని ప్రచురించారు. యీ పుస్తకంలో శారీరక శ్రమకు విలువ లేకుండా చేసిన బ్రాహ్మణ వాదుల మేధావితనం యెలాంటిదో వివరించారు. అలాగే ప్రతిభ అనేదాన్ని దోపిడీ వర్గాలు వొక ఆయుధంగా వుపయోగిస్తారని అసలైన ప్రతిభావంతులు శ్రమజీవులేనని భూపతి గారు యీ సందర్భంలో పేర్కొన్నారు.

ఆయన తిరుపతి దేవస్థానం చాటే కులతత్వం పైన, క్రైస్తవమతం ప్రజల్ని భక్తి పేరుతో వెనుకబాటు తనానికీ, చైతన్య రాహిత్యానికీ గురి చెయ్యడం, పరిశ్రమలు, యెన్నికల విధానం, నూరేళ్ళ దళిత వుద్యమం తీరుతెన్నులు, భారత రాజ్యాంగం, వ్యవసాయ సంక్షోభం, భూ సంస్కరణలు, పర్యావరణం, ప్రకృతి భీభత్సంలో కోనసీమ పచ్చదనం హరించుకు పోవడం వంటి అనేక అంశాల పై ఆయన విస్తృతంగా వ్యాసాలు రాసి ప్రచురించారు.
భూపతి నారాయణ మూర్తి గారి ధృక్పధంలో సహజమైన క్రమ పరిణామం కనిపిస్తుంది. ఆయన తన కాలం లో ముందుకొచ్చిన ప్రజా వుద్యమాలన్నింటిలో క్రియాశీలకంగా పాల్గొని యెన్నో త్యాగాలు చేశారు. తన తండ్రి నుండి ఆధిపత్య ధోరణులను ధిక్కరించడం నేర్చుకున్నారు కనకనే తాను కూడా పుట్టి పెరిగిన వూరిలో కలో గంజో తాగి యెవరో వొకరి కాళ్ళకింద పడి వుండకుండా సముద్రాలు దాటి జీవనోపాధిని పొందడం ఆయన జీవితంలో మొదటి తిరుగుబాటు గా భావించవచ్చు. తర్వాత ఆయన బర్మా నుంచి తిరిగొచ్చాక స్వతంత్ర్యోద్యమం లో కీలకమైన ప్రజా వుద్యమాలు, వీధి పోరాటాల దశలో స్వతంత్ర్యోద్యమం నిరసనల నుంచి ప్రతిఘటనల వైపుకు మళ్ళినప్పుడు సహజంగానే ఆకర్షితుడై స్వతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. ఆయనకు ఆ వుద్యమం వలన పీడితులైన దళితుల ఆకాంక్షలు నెరవేరబోవని అప్పటికి అర్ధం కాలేదు.

కమ్యూనిస్ట్ వుద్యమం లో భూపతి గారు చాలా కాలం పాటు పని చేసి, రైతు కూలి సంఘానికి నాయకుడిగా కొనసాగి గత రెండు మూడు దశకాల నుంచి ఫూలే, అంబేడ్కర్ కుల నిర్మూలనా స్పృహతో రచనలు చెయ్యడం అన్నీ సహజ పరిణామాలుగానే భావించ వచ్చు. యివన్నీ పీడితుల బానిస సంకెళ్ళు తెంచడానికే అని ఆయన నమ్మారు. ఆయనకు ప్రజా వుద్యమాల పట్ల, వాటి కార్యాచరణ పట్ల యెంతో విశ్వాసం వుంది. ప్రజాస్వామికమైన ఆశయాలకోసం జరిగే అన్ని వుద్యమాలను ఆయన సమర్ధించారు. మాదిగ దండోరా వుద్యమాన్ని, స్త్రీవాద వుద్యమాన్ని, తెలంగాణా వుద్యమాలను భూపతి గారు మనస్పూర్తిగా ఆహ్వానించారు. దళిత వుప కులాలు, బహుజనుల మధ్య వుండవల్సిన ఐక్యత, సైద్ధాంతిక పరమైన అవగాహనల పైన నారాయణ మూర్తి గారు మిత్రులతో తరచుగా చర్చిస్తుంటారు. ఆయన స్త్రీ పక్షపాతి. తన భార్య, బిడ్డల విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడమే కాకుండా స్త్రీలందరికీ పురుషులతో సమాన అవకాశాలు, హక్కులు వుండాలంటారు భూపతి గారు. యే ప్రజా వుద్యమం లో వున్నప్పటికీ ఆయన పది రూపాయలు సంపాదించుకున్న దాఖలా లేదు. ఆయన నిబద్ధతను యెవరూ తప్పు పట్టలేరు. స్వతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం యిచ్చే పెన్షన్ ని ఆయన తిరస్కరించడం ఆయన లోని నికార్సైన విప్లవకారుడికి నిలువెత్తు నిదర్శనం. కటిక దరిద్రాన్ని అనుభవించినప్పటికీ యెటువంటి ప్రలోభాలకు లొంగని నిబద్ధుడు భూపతి నారాయణ మూర్తి గారు. అందుకే తన ప్రాంతపు ప్రజలు ఆయన్ని యెంతో ప్రేమిస్తారు. మలికిపురంలో ఆయనకు నాలుగైదేళ్ళ క్రితం యిటీవల జరిగిన ఘనమైన పౌర సన్మానమే అందుకు తార్కాణం. ఆయన వుద్యమం పట్ల, రచనా శైలి పట్ల యెందరో ఆకర్షితులై స్వయం కృషితో రచయితలుగా, మేధావులుగా యెదిగారు.

నవజీవన్, నేను కల్సినప్పుడు ఆయన గురించి అనుకోడం తప్ప సంవత్సర కాలంగా నేను భూపతి గారిని చూడ లేదు. మొన్న సెప్టెంబర్ లో ఆయన మనవడు అమర్ నాద్ కాల్ చేసి   తాతయ్యకి ఇప్పుడు 99 ఏడు వస్తుంది, పుట్టినరోజు చేద్దాం అనుకుంటున్నాం, రండి’ అన్నాడు. తర్వాత ఆయనకి సీరియస్ గా ఉందని, ఈనెల 21న చనిపోయారని తెలిసింది.

ఒక వ్యక్టి సమాజం నుంచి యెన్ని అవరోధాలు యెదురైనా తన స్వయం కృషితో వాటన్నిటినీ అదిగమించి గొప్ప మేధావిగా, రచయితగా ఆలోచనాపరుడిగా యెదగడం అరుదైన విషయం. అయితే భూపతి నారాయణ మూర్తి గారిలో వున్న పీడిత ప్రజల పక్షపాతమే అయన చేత ఆ ప్రయత్నాలు చేయించిందనవచ్చు. సమాజంలో వుండే కుల వివక్ష ఆయన్ని బదిరుడిని చేస్తే ఆయన యెవరూ వూహించనంత శక్తివంతుడయ్యారు. అశక్తత నుంచి అత్యంత శక్తి వంతుడిగా, చైతన్య దీప్తిగా ప్రకాశించిన భూపతి నారాయణ మూర్తి గారు’జన హృదయ భూపతి’… ఆయనకి ప్రేమపూర్వక నివాళి…

*

 

 

 

చల్లపల్లి స్వరూప రాణి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భూపతి గారి గురించి
    స్వరూప రాణి గారు చక్కని విషయాలు తెలియజేసారు.
    నాటి తరం నూటికి నూరు శాతం కమ్యునిస్టు కార్యకర్తగా,నిజాయితీ గల అంబేడ్కరిస్టు గా ,నేటి తరం యువత ఆయన గురించి విపులంగా తెలుసు కోవాలి. స్వరూప రాణి గారికి ధన్యవాదాలు.

  • “బ్రాహ్మణ వాదాన్ని వెలి వెయ్యడం, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడం, మూఢనమ్మకాల్ని అనవసరమైన దుబారా ఖర్చుల్ని ప్రజలపై రుద్దే మతపరమైన పండుగల స్థానంలో యీ దేశంలో శాస్త్ర విజ్ఞానాన్ని, సమతా భావనని పెంపొందించిన మహనీయుల పుట్టినరోజులు, వర్ధంతులు, ఆయా సంస్థల ఆవిర్భావ దినాలు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మొదలైనవి పర్వ దినాలుగా ఆచరించడం వలన ప్రజల్లో భావ వికాసం పెంపొంది వారు అభివృద్దివైపు పురోగమిస్తారని ఆయన యీ పుస్తకంలో వివరించారు.
    ఎంత బాగుందో భక్తి ఏరులై ప్రవహిస్తున్న ఈ రోజుల్లో అలాంటి మంచి దినాలని సెలబ్రేట్ చేసుకోవడమంటేనే ఆనందంగా ఉంది. భూపతి గారికి ధన్యవాదాలు.
    నీ కృషి గొప్పగా ఉందిరా స్వరూపా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు