బడులు మూతపడ్డప్పటి నుంచీ
పిల్లల కనుపాపలపై
సీతాకోక చిలుకలు వాలుతాయి
భుజాలపై భారమంతా పోయి
కాళ్ళకు చేతులకు
రెక్కలు మొలుస్తాయి
తాతగారూ అమ్మమ్మ ఇళ్ళల్లో
పూల కుండీలు అన్నీ
ఒక్కసారిగా నవ్వులు
విరాబూస్తాయి
తాత చేతిలోని ఊత కర్ర
మాయమయి మనవడి
చిటికెన వేలు మొలుస్తుంది
మేనమామ భుజాలు
ఏనుగు అంబారీగా
మారిపోతుంది
వీధులన్నీ క్రికెట్ హోరుతో
గచ్చిబౌలి స్టేడియంలవుతాయి
అదిగో మళ్లీ
బడులు మొదలవుతున్నాయి
ఇళ్లన్నీ బోసిపోయి
యుధ్ధ మేఘాలు కమ్ముకున్న
సరిహద్దు దేశంలా
బూడిద రంగు పులుముకుంటుంది
అమ్మతో పాటుగా బన్నిగాడు
ఒక మూలన ఒంటరిగా
బిక్కు బిక్కుమంటూ
ఒదిగిపోయారు
మరలా వసంతం వరకూ
వాకిళ్లన్నీ ఎదురు చూపుల
తోరణాలవుతాయి…!!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Thank you Afsar Sir
బావుందండీ…
ఆ అల్లరి పిడుగులు ఆనందంతో పరుగుల తీస్తూ
విరిసిన నవ్వులతో మా బడి ఆవరణను కళ కళ లాడిస్తూ
కిల కిల నవ్వులతో తమ నేస్తాలను ఆలింగనం చేసుకుంటూ
వేసవి సెలవుల సంబరాలను పంచుకుంటూ
కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త బట్టలతో సీతాకోక చిలుకల్లా ఎగురుతూ
సందడి సందడిగా తిరుగుతూ
పాఠశాల పరిసరాలను సుసంపన్నం చేస్తూ
ఉన్నారే…
Thank you teacher
వర్మగారూ కవిత బాగుంది.
thank you sir