పిచ్చిమాలోకం   

పిచ్చిమాలోకం   

తమిళ మూలం : జెయమోహన్

పూమేడై రామయ్య (1924-96

ఈ కథకు మూలం జెయమోహన్ రచించిన ‘అఱం’ సంపుటంలోని ‘కోట్టి’ అనే కథ. అఱం లోని కథలన్నీ నిజజీవితంలో జెయమోహన్‍కు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి రాసినవే.కథలోని పాత్రధారి పూమేడై రామయ్య, నాగర్కోయిల్ నివాసి. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. ప్రతి రోజూ సాయంత్రం, ఊరి మైదానంలో, ఆయన స్థానిక సమస్యలపై నిర్వహించే సమావేశాలు, సమస్యలను విపులీకరించడమే కాక ప్రజలను ఆకట్టుకునేవి.  రాజకీయ, అధికార యంత్రాంగాన్ని  కదిలించేవి. 

***

హాస్పిటల్ రోడ్లో  వెళ్తోంటే, టీవీఎస్ – 50, గుడ గుడమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. బండి దిగకుండా, అలానే కాళ్ళతో నెట్టుకుంటూ రోడ్డు పక్కకి తీసుకెళ్ళి స్టాండేసాను. చైన్ ఊడిపోయుంది. ఇదిప్పుడో రోత. ముట్టుకుంటే చేతులు మురికవ్వడం ఖాయం. ఎంత జాగ్రత్త పడ్డా, బట్టల మీద మరకలు పడ్డం ఖచ్చితం. ఒంటిమీదుండేది తెల్ల చొక్కా. ఒకటో రెండో నాకున్న మంచి చొక్కాలన్నీ తెలుపే! వెళ్ళేదేమో ఓ ముఖ్యమైన పని మీద. 

ఇంటిగడప దాటే ఆఖరి నిమిషంలో కూడా, నాన్న నా చెవిలో వూదుతూనే వున్నాడు. “రేయ్! అక్కడికెళ్ళి  నీ తెలివితేటలు ప్రదర్శించొద్దు, అర్థమైందా? వాళ్ళది బాగా వున్న కుటుంబం. మధ్యలో  మన నారాయణన్ ఉండబట్టి దిగొచ్చారు. పిల్ల చూడ్డానికి బావుంటుంది. వాళ్ళు కావాల్సినంత ఇస్తారు. అంతకన్నా ఎక్కువడిగినా సరే! అసలు ఈ సంబంధం కుదిరిందంటే మటుకు  ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినట్టే.”  రాత్రంతా  ఇదే గోల.

నేవెళ్ళేది అమ్మాయిని చూడ్డానికి! కాదు కాదు. వాళ్ళు ‘అబ్బాయిని చూసేటందుకు’ నేనే  వాళ్ళింటికి  వెడుతున్నాను. వెళ్ళి,  ఆవును బేరం చెయ్యడానికి వచ్చినట్టుగా నటించాలి. అక్కడందరికీ విషయం తెల్సు. కానీ  ఏవీ తెలీనట్టు ప్రవర్తిస్తారు. నా ఒడ్డు, పొడుగు, తీరూ నచ్చితే – ఆవుకు తవుడు పెట్టడానికన్నట్టో, కుడితి నీళ్ళు పొయ్యడానికన్నట్టో, లోపల్నించీ అమ్మాయి వచ్చి ముఖం చూపిస్తుంది. వాళ్ళది పెరువట్టార్ కుటుంబం.  ఒకప్పటి కాలంలో మహారాజులకు కప్పాలు, భూమి శిస్తులు కూడా కట్టే వాళ్ళట. ఈ రోజుకీ వాళ్ళకున్న ఆస్తులకు తక్కువేం లేదు. మామూలుగా అయితే బయటి వాళ్ళు, వాళ్ళతో  సంబంధం కలుపుకోడం అయ్యే పని కాదు. కాపోతే  వాళ్ళకిప్పుడు చదువుకున్న అబ్బాయి కావాలి అనుకుంటున్నారు.  లేదంటే బయటవాడొకడు వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మాయిని చూడటం అన్న ప్రసక్తే లేదు. 

బీఏ బీఎల్ చేసి, సుబ్రమణ్య నాడార్ దగ్గర జూనియర్ లాయర్ గా పని చేస్తున్నాను. ఆయనకు సంవత్సరమంతా కలిపి నాలుగు కేసులు వొస్తే ఓ పెద్ద పండగ. ఆఖరికి  టీ డబ్బులు కూడా నా దగ్గర నించి లాక్కోడానికి సంశయించడు మా నాడార్ గారు. నాకు మటుకు అంతకంటే గత్యంతరం ఏవుంది? మంచి  వకీలు దగ్గర జూనియర్ గా చేరడవంటే అదో పెద్ద యుద్ధం. బడా వకీళ్ళు వాళ్ళ వాళ్ళను మాత్రమే జూనియర్లుగా చేర్చుకుంటారు, అది కూడా భార్య వైపు చుట్టం అయితేనే. నాలుగేళ్ళ క్రితం నేనేదో లాయరుగా వెలిగిపోతానని ఊహించేసుకుని నాన్నే స్వయంగా వెళ్ళి లీమన్ టైలర్స్ లో నా కోసం ఒక కోటు కుట్టించి తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాంటి కలలు కనడం మానేసి గమ్మునుంటున్నాడు. 

చైన్ సరిచేసి గడ్డినేల మీద చేతులు రుద్ది తుడుచుకున్నాను. శుభ్రంగా నీళ్ళతో కడుక్కుంటే తప్ప కుదరదు. చేతులు దూరంగా చాపి, కొంచెం దూరంలో వున్న బడ్డీ కొట్టు దగ్గరకి నడిచాను. అక్కడున్న లావుపాటి ఆవిడ బకెట్లోకి నీళ్ళ చెంబు ముంచి, చేతుల మీద పోసింది. అయినా  ప్రయోజనం కనపడలేదు. “కొంచెం పెప్సీ పోసుకోయ్యా! జిడ్డంతా ఒక్కసారిగా వదిలి పోతుంది!” అంటూ నేను సమాధానం చెప్పే లోపల, చేతుల మీద పెప్సీ బాటిల్ ఒకటి ఒంపేసింది. మురికి అంతా ఒక్క దెబ్బకి మాయం. చేతులు కడుక్కుని తుడుచుకుంటూ ఉంటే, అప్పుడు కనపడింది అది, చొక్కా ముంజేతి మీద… వేలి ముద్ర! ఎప్పుడు అక్కడికి ఎలా చేరుకుందో, అర్థం కాలేదు. 

చిరాగ్గా టీవీఎస్ స్టార్ట్ చేస్తూ ఉంటే, ముందర ఒకాయన మాసిపోయిన గొడుగు పట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూండడం కనపడింది. ఒక్క క్షణం మా మాణికం మామేమో అనుకున్నాను, కాదు. మోపెడ్ లో ముందుకెడుతూ ఆ మనిషిని దాటుకుని వెళ్తూ ఉంటే, ఈయన్ను చూసి ‘మాణికం మామ’ అని, ఎలా అనుకున్నాను? తల గోక్కున్నాను. ఆయనకూ ఈ మనిషికీ అసలు పోలికే లేదు. అసలు మా మాణిక్యం మామ ఉండేది ‘ఈశాంతి మంగళం’లో. ఒక్కసారిగా ఎక్కడో ఏదో వెలిగి బండి ఆపాను. 

నిజమే! నేను చూసిందాయన్నే!   ‘పూమేడై రామయ్య’!  ఎందుకో నా బుర్రలో ఆయన్నీ మా మాణిక్యం మామనీ, ఎప్పుడూ తారుమారు చేసేస్తూంటాను. 

చిత్రం ఏమిటంటే ఏ విషయంలోనూ ఇద్దరికీ పొంతన ఉండదు. మాణిక్యం మామ నల్లగా వుండి భారీకాయంతో ఉంటాడు. ఆ చదరపు మొహం మీద పెద్ద మీసం ఒకటి తగిలించుంటుంది. ఎప్పుడూ కళ్ళు చిట్లిస్తూ నేల చూపులు చూస్తూ మాట్లాడతాడు. మాట్లాడతాడన్నానా? అన్నీ పైపై మాటలు… అదికూడా అస్పష్టంగా, గందరగోళంగా. ఎప్పుడు కనపడినా ఒకటే పలకరింత – నిజంగా పిల్లనిచ్చిన మామగారయినట్టు, “ఏం అల్లుడూ! అందరూ బావున్నారుగా!”, అని. అరటితోటలూ, బర్రెలూ, ఇవి తప్ప ఇంకేమీ తెలీదు మాణిక్యం మామకి. 

పూమేడై రామయ్య అందుకు పూర్తిగా వ్యతిరేకం. సన్నగా పొట్టిగా ఉంటాడు. మీసం లేని కోల మొహం, చామనచాయ, ఎప్పుడూ నవ్వుతూ వుండే కళ్ళు. తల మీద తెల్లటి  గాంధీ టోపీ పెట్టుకుని, ఖాదీ లాల్చీ వేసుకుని, ధోవతి కట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ పక్క జేబులో ఒక డైరీ, ఇంకేవో వస్తువులూ పెట్టుకొని ఉండడం వల్ల, వాటి బరువుకి, లాల్చీ ఒక వైపుకి లాగినట్టుగా జారి వుంది. ఆ లాల్చీకి విచిత్రంగా ఒక పై జేబు కూడా వుంది. దాంట్లో కొన్ని ఫౌంటెన్ పెన్నులూ, చిన్న నోట్ పాడ్, పర్సు, కళ్ళద్దాల కేసూ వున్నాయి. 

ఇప్పటిదాకా పొద్దస్తమానం గాంధీ టోపీని పెట్టుకుని తిరిగే వ్యక్తిని ఈయన్ని తప్ప ఇంకెవర్నీ చూడలేదు నేను. అందుకే మొదటి సారి చూసినప్పట్నుంచీ అలా గుర్తుండిపోయాడు. ఎప్పుడూ ఒక తుప్పు పట్టిన సైకిలేసుకుని తిరిగేవాడు. ఆయనకున్న ఏకైక సహచరి ఆ సైకిలు. ఎందుకో ఆయన నడుచుకుంటూ వెళుతున్న పద్ధతి, నన్ను కొంత కలవరపెట్టింది. అసలు నిజంగా… నేను చూస్తున్నది ఆ మనిషినేనా? అన్న అనుమానం వచ్చింది.  చాలా కష్టపడి అడుగులో అడుగు వేసుకుంటూ, నెమ్మదిగా నడుస్తున్నాడు. జాగర్తగా చూసాను. ఆయనే! కానీ ఆయన  మొహంలో ఎపుడూ  కనిపించే ఆ కొంటె నవ్వు మటుకు కనపడ్డం లేదు. మొహం బాగా వాచిపోయి వుంది. బుగ్గలు నున్నగా ఉబ్బి తేలి వున్నాయి. కళ్ళు చిన్నవై పోయి వాటి కింద  గుంటలు అగుపిస్తున్నాయి. 

నేను ‘నమస్కారం’ అని పలకరిస్తే ‘వందేమాతరం!’ అంటూ సమాధానం ఇచ్చాడు పూమేడై.  

‘ఏమైంది మీకు?’ 

‘కాలు బాగా వాచింది” సమాధానం ఇచ్చాడు ఆయన. “ఆస్పత్రిలో చూపించుకుందామని బయలుదేరాను. చివరాఖరికి వాచిన నా  ముఖం కూడా. ‘ఇప్పటిగ్గానీ మీ పిళ్ళై కులస్తుల కళ నీ ముఖంలో రాలేదు రోయ్’ అని అందరూ అంటున్నారు!’

“బండి ఎక్కండి సార్!” అన్నా నేను. 

“పర్లేదు, బాబు. ఎక్కడికో ముఖ్యమైన పని మీద వెడుతున్నట్టున్నావు.”

“పర్లేదు, రండి. నే చెప్తున్నాగా!”

“ఈ బం‍డి ఎక్కడం ఎపుడూ అలవాటులేదు. నీకిబ్బంది!” అంటూ మోపెడ్ మీద కష్టపడి కూర్చున్నాడు. మోపెడ్ అంత మంచి కండిషన్ లో లేదు. లాగుతుందో లేదో అన్న అనుమానం కలిగింది. ఎక్కడం అలవాటులేక, అపసవ్యంగా కూచున్నాడు పెద్దాయన. అలా కూచోడంతో బండి ఓ పక్కకి వంగింది . 

“ఇది ఇనుప గాడిద లాంటిది కదా” అన్నాడాయన. 

నవ్వాను నేను. 

‘గాడిద, గుర్రం కంటే బరువెక్కువ మోస్తుంది’ …  పొడిగించాడు. 

బయలుదేరాం. 

“నీకు… నేనెవరో తెలిసినట్టుంది బాబూ! నా ప్రసంగాలు కానీ విన్నావా?” 

“ఎక్కువ కాదు లెండి. ఒకటో రెండో”. 

“అంతేలే, ఎక్కువ వినుండి ఉంటే, చీదరించుకుంటూ తప్పించుకుని దూరంగా పారిపోయేవాడివి. హ, హ్హ , హ’ అని నవ్వేసాడు. నేనూ జత కలిపాను. 

‘ఏం చేస్తూంటావ్?”

“నేనో లాయర్ని!”

“సివిలా? క్రిమినలా?”

“ఏదో చెప్పాలంటే, ఒక్క   కేసైనా వాదించాలి కదండీ?”

“భలే వాడివయ్యా నువ్వు!” అని ఫకాల్న నవ్వాడు. “ఎక్కడికో శుభకార్యానికి వెళ్తున్నట్టున్నావ్, ఈ తళతళ లాడే తెలుపు చెప్తోంది నాకు.”

ప్రతిదీ బాగా గమనించేట్టున్నాడు పెద్దాయన అనుకున్నాను. “ప్రస్తుతం సగం శుభం మాత్రమే సార్, మిగతా సగం వాళ్ళ చేతుల్లో వుంది. శుభానికి కూడా ఖరీదు ఎక్కువైపోయింది  ఈ రోజుల్లో“ 

దానికి కూడా నవ్వాడాయన. “పుస్తకాలవీ  చదివే అలవాటుందా?” అడిగాడాయన. 

“ఉంది”

“ఏం చదువుతావ్?”

“కథలు”. 

“ఎవరి కథలు. కల్కి?”

“కల్కి ఇప్పుడెవరు చదువుతున్నారు సర్? నేను సుందర రామస్వామి కథలు చదువుతాను.”

“ఓహ్!, సుదర్శన్ స్టోర్ నడుపుతాడు, అయ్యర్…  అతను కమ్యూనిస్టు కదా?”

“అవును”

“చదవడం మానొద్దు. అది నిన్నెప్పుడూ ముందుకే తీసుకెళ్తుంది! ఏం చదివినా పర్లేదు. నిన్ను చేరాల్సిన చోటుకి కచ్చితంగా చేరుస్తుంది. అరె! నా పత్రిక పట్టకరావడం మర్చిపొయ్యాను. ‘సత్య భేరి’ ఇరవై ఎనిమిదో సంచిక వచ్చింది. దాంట్లో వళ్ళలార్ ‘దీపారాధన’ పద్ధతి గురించి రాసాను. ఓ సారి చదువు.”

ఆ పత్రిక నేనెప్పుడూ చదవలేదు కానీ, ఊరంతా పోస్టర్లు మటుకు చూసాను, ‘సాంఘిక దురాచారాల మీద కొరడా!, అంతర్జాతీయ వాదుల వేట! మధ్యే మార్గపు పత్రిక!’ అంటూ.

వచ్చే నవ్వును దాచుకుని అడిగాను “మాస పత్రిక కదా?”

“అలానే అనుకోవచ్చు. కానీ ‘మదర్ ప్రెస్’ యజమాని షణ్ముఖ నాడార్ నాన్చి సాగదీశాడంటే, మారు మాట్టాడకుండా, మాసం కాస్త మల్లె తీగలా సాగి  యాభయి రోజులకో, అరవై రోజులకో బయటికొస్తుంది.”

“అది సరే! మీకు ఒంట్లో బాలేదా ?”

“పైకెళ్ళడానికి ఒళ్ళు తయారవుతోంది. ఇప్పుడు నాకు డెబ్బై రెండేళ్ళు. నిరసన ప్రదర్శనలు  చేస్తూ చేస్తూ ఎన్నోసార్లు విపరీతంగా దెబ్బలు తిన్నాను. అదృష్టం కొద్దీ, ఇక్కడి టీ షాపుల్లో ఇంకా గట్టి టీ దొరుకుతోంది. ఈ శరీరంలో ఇంకా కొంత శక్తి ఏదన్నా మిగిలుందంటే ఆ టీ వల్లే. చూద్దాం! ఒకసారి  పూర్తి మరమ్మత్తు చేయించుకుని దాటుకుంటే,  దాటి పోయినట్టే. అలా కాకుండా ఆ పైనున్న పెద్దాయన ఈ యంత్రాన్ని మొత్తంగా తీసి పక్కన పారేద్దామనుకుంటే, అదైనా పర్లేదు.” 

***

మొదటి సారి ఈయన్ను ఎక్కడ చూశానో గుర్తు చేసుకున్నాను.

ఆ రోజుల్లో మేము కొట్టారం వినాయకుడి గుడి ఎదురుగా వున్న ఇంట్లో కాపరం వుండే వాళ్ళం. నేను ఒకటో క్లాసు చదువుతున్నాను. నాన్న ప్రైమరీ స్కూల్ టీచరుగా పని చేసేవారు. ఇంటి మధ్యభాగంలో చావడి, ముందుభాగంలో వసారా అరుగులూ వెనక భాగంలో నివాస గదులు, పెరడూ వుండే పాత కాలపు పెద్ద పెంకుటిల్లు అది. ఆ ఇంటిగల్లాయనే ఈ పూమేడై రామయ్య. ముందరున్న వసారా గదుల్లో ఒక్కదాన్ని తనకుంచుకుని, మిగతా ఇంటిని రెండు భాగాలుగా చేసి, అద్దెకిచ్చాడు. కానీ ఎప్పుడూ అక్కడికి వొచ్చేవాడు కాదు. 

ఒకసారి వీధిలో నిలబడి  ఏవో సైగలు చేస్తూ మా నాన్నతో మాట్లాడుతూ ఉండడం చూసాను.  పూమేడై, చేతులు తిప్పుతూ, తల అటూ ఇటూ ఊపేస్తూంటే కథకళి చూస్తున్నట్టు తమాషాగా అనిపించింది.  పక్క రోజ గాంధీ టోపీ పెట్టుకుని సైకిల్‍తో  కనపడ్డాడు. ఏదో పాత తువ్వాలు తలకు చుట్టుకున్నట్టుగా వుంది. పూమేడై! పూమేడై! అని అరుస్తూ గేలి చేస్తూ వీధిలో పిల్లలు ఆయన వెనకాల పడ్తున్నారు. సైకిల్ తొక్కుతూ రెండు చేతులూ గాల్లో వదిలేసి, “నలుదిక్కులూ  స్వాతంత్రమని మ్రోగేను! మనమంతా సమానమన్నది నిశ్చయమేను!” అని గొంతెత్తి పాడుతున్నాడు. నా దగ్గరికి రాగానే ఆగి, “నిశ్చయం! ఏం నిశ్చయం అయింది?” అన్నాడు. 

నాకు భయమేసి కోనార్ అంగడి వరండాలోకి పరిగెత్తాను. కోనార్ “ఏం పన్లేదా పూమేడై ? పిల్లల్ని ఇలా బయపెడ్తున్నావు. ఫో ఇక్కడ్నించీ!” అన్నాడు. అలా అంటూనే  నావైపు తిరిగి అడిగాడు  “నువ్వు బడి పంతులు గారి అబ్బాయివి కదా? వీడొక వెర్రిబాగులోడు. వాణ్ణి పట్టించుకోకు. ఆ ఏడుపాపేసి అల్లం మిఠాయి కావాలంటే చెప్పు? చిల్లరుందా?”  అన్నాడు నన్ను సముదాయిస్తూ.

ఆ తర్వాత ఎప్పుడో అమ్మనడిగాను, “అమ్మా! ఆరోజు పూమేడై నాన్నతో నిలబడి సైగలెందుకు చేస్తున్నాడు?”

“వాడి గురించి మర్చిపో! వాడొక దరిద్రప్పీనుగ! పిత్రార్జితం అంతా, దీపావళి టపాసుల్లాగా కాల్చి బూడిద చేస్తూ తిరుగుతున్నాడు. తిక్క సంత… ప్రతి శుక్రవారం వాడికి మౌనవ్రతం అట. మన జోలికి రాకపోతే అదే పదివేలు” తిట్లందుకుంది ఆవిడ. 

మా వూళ్ళో జనాల మాటల్లో చెప్పాలంటే, “పూమేడైకి  కొట్టారం, నాగర్కోయిల్, ఎలందైయడి ఈ ఊళ్ళల్లో అంతా ఎకరాల ఎకరాల భూమి, బోలెడు ఇళ్ళూ ఉండేవి. తిరువనంతపురంలో బీఏ చదువుతానని వెళ్ళి గాంధీ టోపీ నెత్తి మీద పెట్టుకుని తిరిగొచ్చాడు. అక్కణ్ణించీ అంతా  మారిపోయింది. ప్రసంగాలు, సత్యాగ్రహాలు, పోలీసులు తరుముకోడాలూ, జైలు బతుకు, గట్రా! గట్రా! కన్న తల్లీ తండ్రీ కూడా వీడి మీద బెంగతోనే పోయారు. కన్నవాళ్ళ ఉసురు తగలక పోతుందా? వాళ్ళ మనోవ్యధ వీడికి శాపంగా తగిలింది. చివరికి  వీడికి గూడా పిచ్చెక్కింది!” 

మళ్ళీ ఆయన్ని చూసింది నేను నాగర్కోయిల్ స్కాట్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో.  పిక్చర్ పాలస్‍లో ఏదో సినిమా చూడ్డానికి వెడుతూ వెడుతూ, టైటస్ ట్యుటోరియల్ సందులోకి, పాసు పోసుకోడానికని వెళ్ళాను.  అక్కడ ఆ మూత్రపు మడుగులో చెక్క పెట్టె ఒకటేసుకుని  దానిపై నిలబడి ప్రహరీ గోడ మీద ఏదో అంటించడానికని చూస్తున్నాడు. వెనక్కి తిరిగి ఉండడంతో మొదట నేను ఆయన్ని గుర్తుపట్టలేదు. 

తెల్ల కాయితం మీద, ఎర్రటి అక్షరాలు, “ఆకస్మిక శిరోవేదనా సమావేశం” అనే శీర్షికతో. నవ్వకుండా ఉండలేకపోయాను,

“రాచరికాలు లేకుంటే దేశం సుభిక్షం అవుతుంది, ‘తోటి’వాళ్ళు లేకుంటే దేశం గబ్బు పట్టిపోతుంది! ఛాందస పెత్తందారీ పాలకులారా తస్మాత్ జాగర్త! పూమేడై(మధ్యే వాది) గర్జిస్తున్నాడు, బహిరంగ సభ సాయంత్రం ఆరుగంటలకు – మున్సిపల్ మైదానంలో! రండి! అంతరాత్మ పిలుపు వినండి! కుహనా వాదులను తరిమికొట్టండి!”

అదంతా చదివిన తర్వాత  కానీ నాకర్థం కాలేదు –  ‘ఈ గోలంతా వీధులు శుభ్రం చేస్తూ, పారిశుధ్య పనులు చేసుకుంటూ, పొట్ట పోషించుకునే ‘తోటి’ అనే కులానికి చెందిన కార్మికులకు మద్దతుగా ఈయన పెట్టబోయే సమావేశం గురించి’ అన్న విషయం. 

చెక్క పెట్టి మీద నుంచి కిందకి దిగి సంచీ లోంచి గాంధీ టోపీ బయటికి తీసి తన తల మీద పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే ఆయన్ని గుర్తుపట్టగలిగాను. నన్ను చూసి నవ్వుతూ “పని చేసేటప్పుడు టోపీ తీసేస్తాను. మురికి గుంటలో దిగినప్పుడు టోపీ పెట్టుకోడం మంచిదే కానీ అది కింద పడిపోతే కష్టం గదా!”, అంటూ కన్నుగీటాడు.

“నిజమే! మొదట గుంటలో పడేది అదేగా?” అన్నాను నవ్వుతూ. 

“హా, హ్హ హా” అంటూ ఆయన కూడా నా వొళ్ళు జలదరించేట్టు  నవ్వాడు. 

కొన్ని పోస్టర్లు, జిగురు బకెట్టు వీటితో పాటూ కొన్ని ఆకు కూరలు, అరటి పువ్వు, సైకిల్ మీంచి వేలాడుతూ వున్నాయి. గాంధీ గారిలా సాత్విక ఆహారం కాబోలు! 

“ఇక్కడ అంటించడం కంటే మీరు మెయిన్ రోడ్డులో పోస్టర్లు అంటిస్తే, ఎక్కువ మంది చూస్తారు కదా?” అన్నాను. 

“బాబూ, గత ముప్ఫయి ఏడేళ్ళ నించీ గోడలమీద పోస్టర్లు అంటిస్తున్నాను. ఇది నేను నిర్వహిస్తున్న నాలుగు వేలా ఎనిమిది వందలా పద్దెనిమిదో సమావేశం. నా అనుభవం ఏవి నేర్పించిందో చెప్తా విను – మెయిన్ రోడ్డు మీద నెమ్మదిగా వెళ్ళే వాణ్ణి ఎప్పుడన్నా చూసావా? ప్రతి వాడూ తను పోయే లోపల కుబేరుడు ధనాగారం మూసేస్తాడేమో అన్నంత  వేగంగా ఉరుకులు పరుగులతో కదా పరిగెడుతూ ఉంటారు! కానీ ఈ సందులోకొచ్చిన వాడికి వేరే గత్యంతరం లేదు. పోస్తూ పోస్తూ ఒక నిముషం అన్నా ఆగాల్సిందే. పరిగెడుతూ పోయగల్గిన వాడెవడున్నాడు?” అంటూ సైకిల్ని స్టాండ్ మీంచి ఒక తాపు తన్ని, బయటకు తీసాడు. “అమెరికన్లు ఈ పరిగెడుతూ పోసే విషయం మీద ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారని విన్నాను. అప్పుడు బళ్ళు ఈడ్చుకెళ్ళే ఎద్దుల్లా మనిషికూడా రోడ్డు మీద ఈసీజీ గీసినట్టు మూత్రిస్తూ ముందుకెడతాడు.” అన్నాడు ముగిస్తూ. 

ఆయన సమావేశానికి వెడదామని నిశ్చయించుకున్నాను. శనివారం సాయంత్రం సైకిల్ వేసుకుని మున్సిపల్ గ్రౌండ్ కు వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టైము పావు తక్కువ ఆరైంది. ఒక్క పిట్ట కూడా ఆ పరిసరాల్లో కనపళ్ళేదు.  స్టేజూ, లైట్లూ అంటూ ఏవీ లేవు. అరటిపళ్ళు అమ్ముతూ కొంతమంది ముసలమ్మలు కూర్చుని వున్నారు. చాలా సైకిళ్ళు నిలబెట్టి వున్నాయి. సమావేశం రద్దయినట్టుగా వుంది. ఈడ్చుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు, కనీసం బగ్గి శంకరం షాపుకి వెళ్ళి పప్పు చెక్కలు తిని అల్లం కాఫీ తాగుదామని నిశ్చయించుకున్నాను. అక్కడ నిలబడి తింటూంటే క్లోక్ టవర్ వైపు నించీ పూమేడై సైకిల్ మీద రావడం చూసాను. 

అదే సైకిలు, అదే లాల్చీ, అదే టోపీ. కానీ బట్టలు శుభ్రంగా గంజి బెట్టి ఇస్త్రీ చేసినట్టు తెల్లగా తళతళ లాడుతున్నాయి. సైకిల్ వెనకాల ఒక దేవదారు చెక్కతో చేసిన పెట్టె, ముందర కుడి వైపు హేండిల్‍కి ఒక చిన్న లౌడ్-స్పీకరు, తగిలించి వున్నాయి. ఎడమ వైపు ఒక పెట్రోమాక్సు లైట్ వుంది. రెండు పెద్ద సంచులు, హేండిల్ బార్ నించి వేలాడుతున్నాయి. మితిమీరిన  భారం వల్ల సైకిల్ ఒక పక్కకి ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉంది. ఎదురైన వాళ్ళని, కొంతమందిని నమస్కారంతో, కొంత మందిని తల పంకిస్తూ, పలకరిస్తూ చిరునవ్వుతో వస్తున్నాడు. నా పక్కనించి వెడుతూ తల ఊపుతూ ఒక చిరునవ్వు పారేసాడు. కానీ నన్ను గుర్తు పట్టలేదన్నది స్పష్టం! 

ఆయన ఆపినప్పుడు సైకిల్ నేలమీదకి ఒరిగింది. పైకి లేపి నిలబెట్టి స్టాండ్ వేసాడు. చెక్క పెట్టెకి కట్టిన తాళ్ళను విప్పి దాన్ని మోసుకుంటూ మైదానానికి ఉత్తరం వైపు చివరికంటా తీసుకెళ్ళి, నేల మీద పెట్టాడు. ఆ పెట్టె అటు ఇటు ఊగకుండా రెండు బల్లపరుపుగా వుండే రాళ్ళు అటొకటి ఇటొకటి అడ్డంగా పెట్టాడు. 

అప్పటికే ఒక పది పదిహేను మంది చుట్టూ చేరారు. ఎవరో నవ్వుతూ ఎగతాళిగా అన్నారు . “ఏయ్ పూమేడై! ఈసారి ఎవర్నైనా పాకీ దాన్ని దగ్గర తీసావా?”. 

ఆ మాటలు ఏవీ ఆయన చెవిన పెట్టుకున్నట్టనిపించలేదు. ఒక వైరు తీసుకెళ్ళి పక్కనున్న బడ్డీ కొట్టు స్విచ్ బోర్డులో దూర్చాడు. తన దగ్గరున్న  లౌడ్ స్పీకర్ని  అక్కడే వున్న వేప చెట్టు మీదకెక్కి ఒక కొమ్మకు కట్టేసాడు. చెట్టు దిగి, రెండు చేతులూ దులుపుకొని చెక్క పెట్టెకు దగ్గరలో వున్న ఇంకో కొమ్మకు, ఒక పెద్ద బల్బు తగిలించి స్విచ్చి ఆన్ చేసాడు. వైర్ తీసుకొచ్చి లౌడ్ స్పీకరుకు తగిలించాడు. పెట్రొమాక్స్  లైట్ ఆన్ చేసి మంట పూర్తిగా తెల్లగా మారేదాకా ఉఫ్, ఉఫ్ అని గట్టిగా గాలి కొట్టా‍డు. ఓ యాభై అరవై మంది పోగయ్యారు. బడ్డీ కొట్టు దగ్గర, టీ దుకాణం దగ్గర, నిలబడున్న వాళ్ళను కూడా లెక్కెయ్యాలేమో? అందరూ ఆయన పని చేస్తూంటే చూస్తున్నారు కానీ సహాయం చెయ్యడానికి ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. ఉదాసీనంగా తమాషా  చూస్తున్నారు. 

ఆయన సమావేశం మొదలుపెట్టేటప్పటికి ఆరున్నర కావచ్చింది. మైకు చేతిలో పట్టుకుని ఓ రెండు క్షణాలు కళ్ళు మూసి చిన్నగా గొణిగినట్టుగా, “వందే మాతరం!” అన్నాడు. మళ్ళీ వెంటనే వందే మాతరం! వందే మాతరం! అని గొంతు హెచ్చించి నినాదాలు చేశాడు. ఒక రెండు సార్లు ఊపిరి తీసుకుని పాట పాడడం మొదలు పెట్టాడు. స్పష్టమైన ఉచ్చారణతో, మారుమోగుతున్న కంఠస్వరంతో పాడుతున్నాడు. 

దేశం ముందుకు ముందుకు ! 

మంచిని పంచుకు పంచుకు ! 

ద్వేషం ఎందుకు ఎందుకు!  

ప్రేమే చెంతకు చెంతకు ! 

పాట చివరికి రాగానే మళ్ళీ ఓ రెండు క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. చిరునవ్వుతో తలనటూ ఇటూ తిప్పుతూ  జనాలనందరినీ ఒక సారి పరికించాడు. మరుక్షణం చప్పట్లతో తాళం వేస్తూ ఖంగుమంటున్న స్వరంతో ఇంకో పాట అందుకున్నాడు. 

అయ్యలూ , నా సాములూ! 

అయ్యో అయ్యయ్యో నా సాములూ! 

ఆలోచించండి, ఆలోచించండి, సాములూ! 

మందలం కాదు మనం మనుషులం !

ఆలోచించండి, ఆలోచించండి, సాములూ! 

పాట పూర్తి కాగానే ఏదో సంభాషణ కొనసాగిస్తున్నట్టుగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. “అయ్యలారా! విషయం ఏంటంటే, మొన్నీ మధ్య కొత్త చట్టం ఒకటి ప్రవేశపెట్టబడింది. అదేం చెప్తోందంటే, ‘ఇంతకు ముందులా వడచ్చేరి బజారులో చెత్త ఎత్తి, చిమ్మి శుభ్రపరిచే పని ఒక ‘తోటి’లే చేసే అవసరం లేదు. వేరే వాళ్ళు గూడా ఈ పని చెయ్యడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.’  భలే! భలే! చివరికి మన దేశంలో సమానత్వం చోటుచేసుకోవడం ఎంత అద్భుతమైన విషయం? ఓ సారూ వింటున్నారా! ఇది ఎంత గొప్ప వార్త! మహాత్మా చెప్పింది కూడా  ఇదే… పాలించే వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ చేతులకు మట్టి అంటించుకోవాలని… రాజు కూడా ‘తోటి’ వాడు చేసే పని చెయ్యడానికి ముందుకురావాలని. సరే బావుంది! అప్పుడు ‘తోటి’ వాడు ఏం పని చేసుకు బతకాలి? చెప్పండి సారూ! మనం వాళ్ళకి అద్భుతమైన చదువులు చెప్పించేస్తున్నాం కదా? వాళ్ళ నాలికల మీంచి ఇంగ్లీష్ ప్రవహించేస్తోందిగా. ఓహ్! మంచి మంచి ఇళ్ళు కూడా వాళ్ళకి కట్టించడం పూర్తయి పోయింది. ఎంత గొప్ప విషయం? వాళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో సుఖంగా కుర్చీలేసుకుని కూర్చుని రేడియో వినేస్తున్నారు. ఇంతటితో మనం ఆగొద్దు! మున్ముందు వాళ్ళకు గొప్ప ఉద్యోగాలు కూడా ఇప్పిచ్చేద్దాం! మున్సిపల్ కమిషనర్ని చేసేద్దాం! లేదనుకుంటే, ఒక ప్రత్యేక కార్యదర్శిని చేసేద్దాం, ఇదంతా ఎందుకు కౌన్సిలర్ని గూడా చేసేస్తే పోలా? ఏవంటారు?” 

ఆయన చెప్పేదాంట్లో విషయం ఉందనిపించింది నాకు.

“మురికి కాల్వలు శుభ్రం చేయడం, మార్కెట్లోని చెత్తను ఎత్తివెయ్యడం, ఇవి రెండూ పారిశుధ్య పనుల కిందికే వస్తాయి. ఈ చట్టం అమలులోకి వస్తే, మిగతా కులస్తులు తెలివిగా మార్కెట్లో చెత్త తీసే పనికి మాత్రం, పోటీకి వచ్చి ‘తోటి’ లను బయటకు తోసేస్తారు. మార్కెట్లో నించి ఎత్తి వేసే అన్ని రకాల చెత్తకూ మంచి గిరాకీ ఉంటుంది కదా. డబ్బులే! డబ్బులు. అక్కడ నించీ వచ్చే ప్రతి పైసా జేబులో వేసుకుని మురికి కాలవ పని మటుకు, తోటీలకు వదిలేస్తారు,”  అన్నాడాయన ముగిస్తూ. 

ప్రసంగం పూర్తి చెయ్యంగానే ప్రశ్నలు మొదలైపోయినాయి. 

‘ఏందయ్యా నువ్వనేది? ‘తోటి’లు మటుకే మార్కెట్ పని చెయ్యాలంటావా?” అన్నారెవరో. 

“వాళ్ళ పని వాళ్ళను  చెయ్యనివ్వండి. వాళ్ళు సరిపోకపోతే, అప్పుడు వేరే వాళ్ళను తీసుకొద్దాం.” అన్నాడు పూమేడై. 

భుజం మీద ఎర్ర కండువా వేసుకుని వున్న ఒకాయన, “అంటే గాంధీ చెప్పినట్టు, ఎవడి కులవృత్తి వాడు చేసుకోవాలంటావ్” అన్నాడు. 

తొట్రుపాటు లేకుండా సమాధానం ఇచ్చాడు, పూమేడై, “ అవును కామ్రేడ్! గాంధీ మరుగుదొడ్లు కడిగి పెంటను ఎత్తిపోసాడు.  ఎందువల్లనంటే ఆయన ‘తోటి’ కులంలో పుట్టాడు! ఏ ప్రపంచంలో బతుకుతున్నావ్ నువ్వు?”.  అంటూ  ఎగతాళిగా నవ్వుతూ, తన చెయ్యి అతని వైపే చూపిస్తూ, ఒక అర నిమిషం అలానే ఉండిపోయాడు పూమేడై. అందరూ ఆ ప్రశ్న వేసిన కామ్రేడ్కేసి తిరిగిచూసి ఫక్కుమని నవ్వారు. 

“‘తోటి’ వాడు ఈ పని వదిలేయాలంటే, వాడికి ముందు ఇంతకంటే మంచి ఉద్యోగం ఒకటి చూపించు. లేకపోతే వాళ్ళకు చేసుకోడానికి ఈ పని గూడా లేకుండా పోయి,  నీలాగా వీధుల్లో అడక్క తింటారు. ఎర్ర పోస్టర్లు గోడ కంటించి ‘జిందాబాద్’, అని ఓ అరుపు అరుస్తే, మీ పార్టీ పెద్దలు, నీ మొహం మీద చిల్లర డబ్బులు విసురుతారేమో. ‘తోటి’ వాళ్ళకి ఆ అదృష్టం కూడా లేదు!” అని కొనసాగించాడు  పూమేడై.

“ ఏయ్ పూమేడై!  నువ్వే వెళ్ళి  ఆ పెంటంతా మొయ్యి!” ఎవరో అరిచారు జనాల్లోంచి. 

పూమేడై అతని వైపు తిరిగాడు. “ఏం? ఎందుకు మొయ్యగూడదు? రోజూ మా ఇంట్లో మరుగుదొడ్డి నేనే కడుగుతాను. తాను విసర్జించినది వేరే వాడొచ్చి  శుభ్రం చేయాలనుకునే వాడు, మరుజన్మలో అశుద్ధం తినే పందిగా పుడతాడు. అయినా ఇప్పుడు నేను మాట్లాడుతోంది నీతో కాదుగా, వచ్చే జన్మలోని నీ అవతారంతో –  “ఏయ్ పందీ! పో ఇక్కణ్ణించి!”

ప్రశ్న వేసిన మనిషితో సహా, అందరూ పొట్టచెక్కలయ్యేలా  నవ్వారు. 

ఏదో కేతిగాణ్ణి చూసినట్టుగా చూస్తున్నారందరూ, పూమేడైని. ఆయన గంభీరంగా చేస్తున్న ప్రతి ప్రకటనకీ పగలబడి నవ్వుతున్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఎగతాళిగా మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ‘విషయం’ మాట్లాడుతున్నాడో, అర్థం కావడం లేదు. ఎనిమిది గంటలకల్లా సమావేశం ముగిసింది. ముగిసిన వెంటనే సామాన్లన్నీ తనొక్కడే సర్దుకోడం మొదలెట్టాడు. 

నేను గూడా ఒక చెయ్యి వేద్దామనుకున్నా కానీ ‘ఎవరైనా చూస్తే?’ అన్న ఆలోచనొచ్చి, ఆ ప్రయత్నం విరమించుకున్నాను. బడ్డీ కొట్టతనికి కరెంటు వాడుకున్నందుకు డబ్బులిచ్చి, ఒక సోడా తాగి సైకిల్ తోసుకుని వెళ్తూ వెళ్తూ, టీ బంకు దగ్గర నిలబడున్న నన్ను చూసాడాయన. చూసి నవ్వాడు. అయితే గుర్తు పట్టినట్టులేదు. 

దాని తర్వాత ఇరవై ముప్ఫయి సార్లు అయన ప్రసంగాలు విని వుంటాను.  ఒక్కోసారి ‘ఈయన మాటల్లో గొప్ప ఉద్వేగం వుంది’ అనిపించేది. కొంతసేపటి తర్వాత, లేని శత్రువుని ఊహించుకుని బాణాలు సంధిస్తున్నాడేమో అనిపించేది. 

కొన్ని రోజుల  తర్వాత నాకు అర్థమైంది – సమాజం ఆయనకు నిశ్శబ్దంగా స్పందిస్తోంది! అని. 

ఎప్పుడూ తన ప్రసంగాల్లో సామాన్యుల ఇబ్బందుల గురించే ప్రస్తావిస్తూ ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తీసుక వచ్చేవాడు. ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా, మొదట తనే జన బాహుళ్యంలో ప్రస్తావించి, ప్రశ్నించేవాడు. దీని వల్ల ఎవరైతే ఆ సమస్యను ఎదుర్కుంటున్నారో వాళ్ళందరూ సంఘటితమయ్యే వాళ్ళు. విషయం ప్రాచుర్యంలోకి వచ్చి అన్ని కోణాల్లో చర్చ జరిగేది. చివరికి ఆ సమస్యకు ఒక సమాధానం దొరికేది. 

రెండేళ్ళ క్రిందట కనకం అనే ఆవిడ, ఫాస్ట్ ట్రాక్  కోర్టుకి జడ్జీగా నియమితులయ్యారు. రావడంతోనే   ఆమె కోర్టు గదిలో అందరి ముందరా “నేనేది రాస్తే అదే చట్టం! ఏ జడ్జిమెంటుకి ఎవరు ఎంత ఇవ్వాలో కూడా నా ఇష్టం!” అంటూ ప్రకటించింది. ఓ బలమైన కులానికి చెందిన ఆవిడకి, తన కులస్తుల నించీ మంచి తోడ్పాటు ఉండడమే కాకుండా, రాజకీయంగా కూడా బాగా పరపతి ఉంది. లాయర్లలో సగం మంది ఆమెతో బేరాలు కుదుర్చుకున్నారు. మిగతా సగం కోపంతో వూగారు తప్ప ఏవీ చెయ్యలేక పోయారు. ప్రతి విషయంలో తన మాటే చెల్లాలని శాసించేది ఆవిడ. ఈ వార్త పూమేడై చెవిలో పడగానే, ఊరంతా పోస్టర్లు అంటించి తన సమావేశంలో ఆవిడని ఎండగట్టాడు. ఏదైతే అప్పటిదాకా గుసగుసలాడుకునే వాళ్ళో, ఆ విషయం టీ బంకుల దగ్గర జరిగే చర్చల్లోకి ప్రవేశించింది. వూరు ఊరంతా, ఆమె  గురించి కోడై కూయడం మొదలెట్టింది. ఆవిడ తన మొహం బయట చూపించుకోలేక పోయింది. నాలుగు నెలల్లోనే హైకోర్టు ఆమెని ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేసింది. 

                                                                   ***

మోపెడ్, హాస్పిటల్ ముందు ఆపాను. “లోపలకి వెళ్ళే ముందర టీ తాగుదామా?” అడిగాను. 

“పర్లేదు, బాబూ! ఇప్పటికే నువ్వు చాలా చేసావు. ఇక్కడ దిగేసి నా పాటికి నేను పోతాను” అన్నాడాయన. 

“నేను తీసుకపోతాలెండి. టీ తాగి పోదాం”. 

“సరే నీ ఇష్టం. అయితే నువ్వు డబ్బులిచ్చేట్టయితే నేను తాగను. నా టీకి నేనే డబ్బులిస్తాను.”

నేను ఏదో అనే లోపలే, “ఇదంతా, పూమేడై ఉప నిబంధనల్లో రాసుంది. రూలు నంబర్ ఎనిమిది, చూడు!” అని జేబులోంచి ఒక కాయితాన్ని బయటకు లాగాడు. నలిగిపోయి, దళసరిగా ఉన్న ఆ కాయితం మీద ‘ పూమేడై సంఘ రాజ్యాంగ చట్టాలు ‘ అనే శీర్షిక కింద వరసగా నంబర్లు వేసి, కొన్ని వింత నియమాలు ముద్రించి వున్నాయి. 

  1. సేవలు చెయ్యి, ప్రశ్నల బాంబులు వెయ్యి!
  2. అవగాహన పెంచు, అలసటను చంపు! 
  3. ‘తోటి’ కి సమానత్వం కల్పించు! 

ఇలా సాగినవాటిలో ఎనిమిదో నంబరు పక్కన ఇలా రాసుంది ‘అ‍డుక్కుతినొద్దు!అమ్ముకు తిను!’ 

మొత్తం ఇరవై నియమాలున్నాయి. అన్నిటికన్నా కింద ‘తీర్మాన స్వీకారం జరిగిన తేదీ – అక్టోబర్ 2, 1948’ అని రాసుంది. సాక్షి సంతకం కింద ఇద్దరి వేలి ముద్రలున్నాయి. ‘సుం‍డన్’ , ‘గుణమణి’, అని ఇద్దరు ఎవరో అనామకులు. వస్తున్న నవ్వును ఆపుకోడానికి పక్కకి తిరిగాను. 

“నీకు టీ ఇప్పించడానికి  నా దగ్గర డబ్బులు లేవు!” అన్నాడాయన. 

షాప్ లోపలికి వెళ్ళి రెండు టీలు ఇమ్మని అడిగాను. “మంచిగా, పల్చగా చెయ్యి అమ్మా!” అన్నాడు, పూమేడై.  బెంచీ మీద కూర్చుని, భారీగా శ్వాస తీసుకుంటూ, ఆస్తమా రోగిలా కనిపిస్తున్నాడాయన. 

“అమ్ముకు తిను – వినడానికి బానే ఉంది కానీ, అమ్మడానికి ఏవన్నా మిగిలుందా?” 

“సైకిలుందిగా! పాత మోడలే కానీ గట్టిపిండం. రెండో ప్రపంచ యుద్ధానికి కూడా పోయొచ్చింది.”

“మరి మైకు సంగతి ఏవిటి?”

“అది కిందటి నెలలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ‘ రేపే లక్కీ డిప్! రేపే లక్కీ డిప్!’ అని అరుచుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అది వినంగానే, “అరేయ్! మునగాలంటే ఇప్పుడే మునుగు! రేపనేది ఉందో లేదో!” అని నేనూ అరుస్తూ వుంటాను. 

“అయితే ఇంక సమావేశాలు లేవనమాట!”

“ఆ! అంత తొందరగా వదిలిపెడతామా మనం. ఇప్పుడు నా దగ్గర ఓ పెద్ద బూర మైకుంది. క్లాక్ టవర్ కింద నిల్చుని ప్రసంగిస్తూంటే, ఇప్పుడు సాక్షాత్ ‘కలైవాణర్ ఎన్ ఎస్ కే’ గారు శ్రోతగా నా ముందు నిలబడుంటారు. అంతకంటే ఏం కావాలి? అంత మహా నటుడూ చేతులు వెనక్కి కట్టుకుని, విగ్రహ రూపంలో ఉంటాడాయే. పాపం రాళ్ళు వెయ్యాలన్నా వెయ్యలేడు. ఇంక నన్ను ఆపేదెవరు?”

“ఇప్పుడు ఉన్న ఉద్యోగవల్లా పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి తినేయడమే అన్న మాట!” అని ఇంకాస్త కదిలించాను. 

“ఏంది బాబూ, నీ అమాయకత్వం. అక్కడికి వాళ్ళేదో చమటోడ్చి కష్టపడి సంపాదించేసినట్టు. ఇదంతా అభాగ్యుల మీదా అన్నార్తుల మీదా అజమాయిషీ చేసి సంపాదించిందేగా. ఎండాకాలంలో సంపాదించింది, వానా కాలంలో పోవాల్సిందేగా! ‘చేయఁదగిన విధులఁ జేయుటే ధర్మంబు, ధర్మమెడలి బ్రతుకఁ దగవు గాదు’ అని మహాత్ముడు తిరువళ్ళువర్ చెప్పలేదూ?”

“మీరు చెబుతున్న విషయానికీ, తిరువళ్ళువర్ చెప్పిందానికీ సంబంధం ఏవన్నా ఉందా?” చిరాగ్గా అడిగాన్నేను. 

“అదేదో అక్కడికి ప్రతివాడూ తిరుక్కురళ్‍ను సందర్భోచితంగా ప్రస్తావిస్తున్నట్టు! ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓ రెండు వాక్యాలు వల్లించ లేకపోతే, అసలు అలాటి వాటికి  ప్రయోజనం ఏవుంది? అది సరే, నన్నయితే అడుగుతున్నావ్! ఆ కరుణానిధి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇలాటివి వెదజల్లుతాడుగా! ఆయన్ని అడిగే ధైర్యం ఉందా నీకు?”. 

టీ వచ్చింది. చప్పుడు చేసుకుంటూ టీ తాగాడు. 

“మీరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారుగా. పింఛను వస్తుందనుకుంటా?” 

‘అదో వింత’ నవ్వాడాయన. “1946 లో మొట్టమొదట జైలు కెళ్ళా నేను. అప్పుడు యూనివర్సిటీ కాలేజీలో చదివే వాణ్ణి. ఓ రోజు పొద్దున్న, మా కాలేజీకి బోధేశ్వరన్ వచ్చాడు. కవయిత్రి నిగంథకుమారి ఉన్నారే, వాళ్ళ నాన్న గారు. చట్టంపి స్వామి గారి శిష్యుడు ఆయన. తెల్ల గడ్డంతో, పొడుగాటి ఖాకీ చొక్కా, ఖాదీ ధోవతి వేసుకుని ఎర్రటి ఎండలో  నిలబడి ప్రసంగించాడు. ఆయన ఉపన్యాసం వినాల్సింది నువ్వు. ఎంత ఉద్వేగంతో ప్రసంగించాడనుకున్నావ్? ఓ మూడు నాలుగు వందల మంది విద్యార్థులు పోగైయుంటారు ఆరోజు. “నగ్నంగా దేశమాత నిలబడి ఉంటే,  నీకెందుకు ఈ చదువులు  తెచ్చి పెట్టే తలపాగాలు?” అని గర్జించాడు. ఆ రోజే ఉద్యమంలోకి దూకాను. అప్పట్నుంచీ ఎన్నో చోట్ల ఎన్నెన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఒకసారి నాగర్కోయిల్‍లో సత్యాగ్రహం చేస్తే, నాతో బాటూ అరెస్ట్ అయిన వాళ్ళల్లో తేరూర్ శివన్‍పిళ్ళై గారు, ఈత్తవిళై అర్జునన్ నాడార్ గారు లాంటి స్వాతంత్ర పోరాట యోధులంతా వున్నారు. ఆ రోజుల్లో జైలు వేరే చోట ఉండేది. ఫైర్ స్టేషన్ పక్కనుండే ముత్తు సినిమా హాల్ని కోర్టుగా, మళ్ళీ  పోలీసు స్టేషన్ గా  కూడా వాడుకునే వారు. దాని పక్కనుండే షెడ్లు జైలు గదులన్నమాట. నాతో పాటూ ఇంకో ఎనిమిది మందిని, రెండూ చేతులూ గుడ్డతో కట్టేసి, పోలీస్ స్టేషన్ కి తోలుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళిన ఇనస్పెక్టర్ పేరు నారాయణ్ నాయర్. తరువాత ఆయన ఎస్పీ‍గా రిటైర్ అయ్యాడు. నేను ఎప్పుడు కనపడినా, “రేయ్ పూమేడై! మాదచోద్! నాతో చేయికలిపి వినయంగా ఉంటే నీకీ ఈ గొడవలు వుండవు.” అని సలహా ఇచ్చేవాడు. దానికి నాదెపుడూ ఒకటే సమాధానం  “సారూ! గాంధీ గారి ప్రబోధంతో అంతరాత్మకు విరుద్ధంగా జీవించడంకంటే చావడం  మంచిదని శపధం పూనినవాడిని” అని. 

ఒక సారి ఏం చేసాడంటే – బజార్లో నిలబడి దారిన పోయే వాళ్ళందరిమీదా, చర్నాకోల్ ఝళిపించడం మొదలు పెట్టాడు. సంత వైపు వెళ్ళే అమాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఒక ముసలి బెస్తలావిడ, అటు వైపు వస్తోంటే  ఆమె మీదకు దూకబోయాడు. అది చూసి ఊరకే ఉండలేక పోయాను. “ఏయ్ కొట్టాలంటే, తన్నులు తినడానికి సిద్ధంగా వున్న నా లాంటి వాళ్ళ మీదబడు.” అని అరిచాను. “ఆమెను కొడితే ఏం చేస్తావ్?” అని సవాలు విసిరాడు. “కొట్టి చూడు. తెలుస్తుంది.” అన్నాను. 

ఆమెని కొట్టడానికి, కొరడా పైకెత్తాడు. “అయ్యో!” అని కేక పెట్టిందావిడ. “హేయ్! హేయ్! హేయ్!” అని ఎద్దలబండివాడిలా అదిలించినట్టుగా కేక పెట్టాను. మళ్ళీ చెయ్యెత్తాడు. “హేయ్! హేయ్!హేయ్!” అని మళ్ళీ కేక పెట్టాను. అక్కడున్న జనమంతా పగలబడి నవ్వారు. తీవ్రమైన కోపంతో వణికిపోయాడు. ఒళ్ళంతా పొగరు నిండిన నాయర్ కదా! తనని, ఎద్దు బండివాడి కింద జమ కడితే, ఎలా తట్టుకోగలడు?

చర్నాకోల్  పక్కన పారేసి, నన్ను కింద పడేసి, కాలితో ఎడాపెడా తన్నడం మొదలెట్టాడు. అలానే, నా చెయ్యి పట్టుకుని లాక్కెడుతూ రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. నా పంచె, గోచీ ఊడిపోయాయి. ఒంటి మీద ఏవీ మిగల్లేదు. ఆ రోజుల్లో నేను చొక్కా వేసుకునే వాణ్ణి గాదు. నేను దొంగబిచ్చగాడినని  కేసు రాసి, లాక్కొచ్చి లోపల పడేసాడు. జైలు ఆవరణలో సాక్షాత్తూ శివన్ పిళ్ళై గారి పక్కనే చాలా సేపు పడున్నాను. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని పోయుంది. ఆయన నన్ను గుర్తు పట్టలేదు. స్పృహ రావడానికి ఒక రోజు పట్టింది. నాలుగైదు రోజుల తర్వాత శివన్ పిళ్ళై నన్ను చూసారు. తరవాత సుచీంద్రం గుళ్ళో హరిజనుల ప్రవేశానికి పోరాడిన పెద్దాయన ఎమ్ ఈ నాయుడు జైలుకి వచ్చి, మా విడుదల గురించి అధికారులతో మాట్లాడారు. అప్పుడు మమ్మల్ని రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని పిటిషన్ పెడితే, ఇంకో పెద్ద మనిషిని పంపించారు. వచ్చినాయన, అసలు సిసలు పిళ్ళై, పెద్ద విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ బొట్టు. ఆయనెవరో కాదు, మన డాక్టర్ ఆనంజ పెరుమాళ్ ఉన్నారే, ఆయన తండ్రి! వివరాలు అన్నీ కనుక్కున్న తర్వాత, గొంతు తగ్గించి, రూఢి చేసుకోడానికి అడిగాడు నన్ను, “ఏవిటి మీరు? పిళ్ళైలా?” అని. 

కానీ శని నా నాలిక మీదే ఆడుతూంటాడుగా! ఆ దరిద్రుడు, గమ్మునెందుకుంటాడు? “లేదు! కిందటి నెల, డబ్బులిచ్చి కులం మార్పించుకున్నాను. ఇప్పుడు ‘తోటి’ కులం!” అన్నా నేను. ఒక మాంఛి రిపోర్ట్ రాసాడాయన. దాని తర్వాత, జైల్లో జేబుదొంగగా ఒక ఎనిమిది నెలలు వున్నాను”. 

“అదేం తెలివితక్కువ తనం! ఇలాంటి పనులు చేసేటప్పుడు, చేతిలో తగిన కాయితం పెట్టుకోని తిరగొచ్చుగా? ఏవీ లేకుండా, మీరు జేబుదొంగో, దేశభక్తుడో ఎవడు చెప్పగలడు?”. 

“ఎందుకు, ఎవడిదగ్గరకైనా వెళ్ళడం? నిన్న స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళు, ఈ రోజు జేబు దొంగలయ్యారు. దానర్థం, నిన్నటి జేబుదొంగలు, ఈరోజు దేశభక్తులనేగా?”  

“మీకు నిజంగానే పిచ్చెక్కింది!” 

“అది సరేలే! అదిప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేముంది? అందరికంటే, ఆ విషయం ముందు కనిపెట్టింది మా అమ్మ. “రేయ్! నీలాగే ఆ గాంధీకి కూడా కొంచెం బుర్ర తక్కువటగా? దాన్ని దాచుకోడానికే టోపి పెట్టుకు తిరుగుతాడటగా” అని ఓ రోజు నెమ్మదిగా నన్నడిగింది? హ్హా హ హ్హా.”

“అదే. ఈ నవ్వుకోడమే ఇప్పుడు మీకు కావాల్సింది”, అన్నాను పైకి, లోపల జాలి పడుతూ. 

“నేను నవ్వింది అందుకు కాదు. నేనెప్పుడు  కనిపించినా, వాళ్ళ జేబులు తడుముకుంటూ, అక్కడ జైలర్లు చాలా జాగర్తగా వుండేవాళ్ళు…  హ్హా హ్హా హ్హ”

“ఒక విషయం చెప్పండి నాకు! శివన్ పిళ్ళై గారు ఇప్పుడు మీ గురించి  ఒక మాట చెప్తే, ఏదో కొంత పింఛను రాదూ?”. 

“ఏం మాట్లాడుతున్నావ్? అసలు ముందు ఆ శివన్ పిళ్ళైని పట్టించుకునే వాణ్ణి, ఒకణ్ణి చూపించు. స్వాతంత్య్రం తర్వాత, అందరూ ఆయన్నెప్పుడో మరిచిపోయారు. 1953లో ఉద్యమ నాయకుడు నేసమణి, ఆయన ముఖ్య అనుచరుడు దాణులింగ నాడార్ తో కలిసి, నాగర్కోయిల్  ప్రాంతాన్ని తమిళనాడులో కలపడానికి చేసిన ఉద్యమంలోకి దూకాను. మళ్ళీ నిరసనలూ, ప్రదర్శనలూ… తమాషాగా, అప్పుడు కూడా నన్ను పట్టుకు చావగొట్టింది, నారాయణ్ నాయర్ అవ్వడం, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అప్పటికి అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. మక్కెలిరగదన్ని పోలీస్ వాన్లోకి విసిరేసాడు. ఎంతైనా పాత స్నేహితుడు గదా! పలకరిద్దాం అనుకుని, “ఎలా వున్నారు సార్?” అని అడిగాను. అలా అడిగినందుకు  ఇంకో రెండు తగిలించాడు. నేరుగా కోర్టుకి తీసుకెళ్లారు. ఈ సారి నిలబడింది  మన స్వతంత్ర్య భారత దేశపు కోర్టులో. నెత్తి మీద ఒక సీలింగ్ ఫాన్ కూడా తిరుగుతోంది. అలాగే, మన్ను తింటూ పట్టుబడ్డ పిల్లాడిలా నవ్వుతోన్న గాంధీ గారి ఫోటో కూడా ఒకటి, గోడ మీద వేలాడేసి వుంది. అవి పక్కన పెడితే, బ్రిటిష్ కాలం లానే, అదే బిళ్ళ బంట్రోత్తు! అదే పాత కాయితాలు! అదే చట్టం!  జడ్జీ ఒక అయ్యర్. ఇంతకు ముందు నాకు పడ్డ శిక్షలు చూసాడు. బ్రిటిష్ చట్టాలను, తూ చ తప్పకుండా, పాటించమని, మన వాళ్ళకు ఆర్డర్ వుంది కదా? అందువల్ల, ఆయన, ‘నా నేరం దోపిడీ దొంగతనం!’, అని ఖరారు చేసి, లోపల వెయ్యమన్నాడు. నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది ఇక్కడ! రాజకీయాల కంటే దోపిడీలకి జైలుకెళ్ళడం మేలు. అక్కడున్న ఖైదీలు మనల్ని  చాలా గౌరవంగా చూస్తారు. కంచంలోని సాంబారు ముక్కలు తీసి మన కంచంలో పెట్టి, “తినండి సర్!” అంటారు.  ‘ఎడలాక్కుడి కసాయి అంగడి’ ఖాదర్ తెలుసు కదా, వాళ్ళ నాన్న మొయిద్దీను కూడా నా జైలు మేటు. జంట హత్యలకని జైల్లో పెట్టారు. మేం బయటికొచ్చిన తర్వాత,  తను చచ్చేదాకా రోజూ నన్ను కలిసి, భూప్రపంచం లోని ప్రతి విషయాన్ని నాతో చర్చించి, టీ తాగి ఇంటికెళ్ళేవాడు. మంచోడు పాపం!”

“కానీ, నేసమణి గారు ఒక మాట చెప్పుంటే, ‘భాషోద్యమం పెన్షను’ వచ్చేదిగా మీకు! తమిళోద్యమంలో పోరాడిన వాళ్ళకి ఏదో ఇస్తామని, గవర్నమెంట్ ప్రకటించింది అనుకుంటా కదా!”

“ఆయన చెప్తే సరిపోతుందా. నేను ఒప్పుకోవద్దా? నిజానికి చిదంబరనాథన్, ఒక రోజు నన్ను కలవడం కోసం  కొట్టారంకి వచ్చాడు. “చూడూ, జరిగిందేదో జరిగింది. నువ్వు దిక్కులేని చావు ఛస్తే, మాకు తలొంపులు. నువ్వు చేయాల్సిందల్లా, పింఛను తీసుకోడానికి ఒప్పుకోడం. మిగతాది పెద్దాయన చూసుకుంటారు.” అని చెప్పాడు. అప్పటికే, నేసమణి రాజకీయాల్లోకి వెళ్ళాడని నాకు ఒళ్ళు మంటగా వుంది. “ఏనుగు ఎక్కి తిరుగుతున్నాడు కదా. కిందున్న నేల కనపడుతోందటనా పెద్దాయనకి?” అని అడిగాను. “ఆ గోల అంతా ఇప్పుడు ఎందుకు? ఈ పింఛను ఇచ్చేది మీ ప్రభుత్వమే కదా! తీసుకోవచ్చుగా?” అని వాదించాడు. “ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు, లంచాలు కూడా తీసుకుంటారట! నేనిప్పుడు ఈ డబ్బులు తీసుకుంటే, లంచాలు కూడా తీసుకోవచ్చా?” అని అడిగి అక్కడితో ఆగకుండా “నేనూ అలా చెయ్యొచ్చు! అంచెప్పి ఒక ఉత్తర్వు పట్టుకురా, అప్పుడు ఒప్పుకుంటాను పింఛను తీసుకోడానికి” అన్నాను . ఏది ఏమైనా, పక్షపాతం వుండకూడదుగా! నాకూ ఓ గవర్నమెంటు బంట్రోతుకూ తేడా ఉండొద్దూ! అది గూడా లేపోతే నెత్తిమీదున్న ఈ గాంధీ టోపీకి విలువేముంది? ‘నీ చావు నువ్వు చావు!’ అని ఒక అరుపు అరిచి, చిదంబరనాథన్ తల కొట్టుకుంటూ అక్కడ్నించి మాయమయ్యాడు.”

“మీ ఈ పొగరుబోతుతనమే మీ ఇబ్బందులకు కారణం!” అన్నా నేను. “మీ మీదున్న గౌరవం కొద్దీ, ఆయన మీ దగ్గరికొచ్చాడు. మీరు కూడా ఆ గౌరవం నిలుపుకోవాల్సింది. ఇప్పుడేమో ఇవన్నీ భరించాల్సి వస్తోంది… ఒక ఇల్లూ వాకిలీ లేకుండా ఇలా వీధుల్లో!”

“బాబూ! పట్టినత్తార్ వంటి  సిద్ధుడు కూడా, వీధుల్లోనే తన జీవితం గడిపాడు.”

“ఇలా అంటున్నందుకు ఏవనుకోవద్దు. మీ కంటే నేసమణి చాలా సీనియర్ కదా! ఒక్కసారన్నా ఆయన్ని వెళ్ళి కలవాల్సింది మీరు.” 

“నేనదో రకం, బాబూ! గాంధీలో కూడా ఇద్దరు మనుషులున్నారు. మొదటిది సర్కారు గాంధీ – మహా… రాజనీతిజ్ఞుడు! రెండోది తోటిగాంధీ – కార్యకర్త! నీ ముందున్నది – తోటిగాంధీ! అర్థమైందా? ఆ తరువాతి వారమే  కోర్టు ఎదురుగా  మీటింగ్ పెట్టి, నేసమణిని ఒక గంట సేపు కడిగవతలేసాను. అవకాశం వదులుకుంటానా?”

“ఆ దెబ్బతో, పెన్షన్ పూర్తిగా భూస్థాపితం అయిపోయుంటుంది”

“పెన్షన్ అంటే, పోయినోళ్ళ నోళ్ళల్లో వేసే  వాతబియ్యం! నేను బతికి బాగున్నానుగా, నాకెందుకు? అది సరే బాబూ, ఒక విషయం చెప్పు! గాంధీ గారికి పింఛను ఇస్తావంటే ఆయన ఒప్పుకునేవాడా?” ఆయన తర్కం నాకర్థం కాలేదు. “పెన్షన్ తీసుకునేది, పని చెయ్యడం మానేసాక. నేను ఇంకా పని చేస్తున్నాగా ?” అని ముక్తాయించాడాయన. 

“కాంగ్రెస్ వాళ్ళు ఏవన్నారు? మీ వైద్యానికి చిల్లర డబ్బులైనా ఇచ్చారా లేదా?”

“కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ని తన వేలి మీద  నడిపించిన అంత గొప్ప నేసమణి గారి శిష్యులే ఈ రోజు ఆఫీసుకి నడుచుకుంటూ వెళతారు. అదే ఆఫీసులో, నేల ఊడ్చి, కడిగిన వాళ్ళు, ఈరోజు, పార్టీ ఆఫీసుకి, కాంటెస్సా కార్లలో వెళ్తున్నారు.” అంటూ టీ అంగడి లోకి చూసి, “టీ కెంత అయ్యింది?” అని అడిగాడు. 

“రూపాయిన్నర!”

“అంతకంటే తక్కువకు ఇవ్వవా?” అని అడిగాడు, చిల్లర ఇస్తూ. నా టీకి నేను డబ్బులిచ్చాను. 

బయటికి రాగానే, “మళ్ళీ కలుద్దాం, అయితే!” అన్నాడు. “వచ్చే వారం ఒక సమావేశం వుంది. అనాథాశ్రమంలో కన్యకా స్త్రీలు, పసి పిల్లలకు కుళ్ళి పోయిన కూరలు పెడుతున్నారట. అసలు ఇలాటి వాటి గురించి ఎవడికి పట్టింది మన దేశంలో?”. 

“నన్ను కూడా రానీండి, మీతో పాటూ హాస్పిటల్  లోపలకి!” 

“దేనికి? నీ పనులు నీకున్నాయిగా!”

“ఆ సంగతి వదిలేయండి! మీరు డాక్టర్ని కలిసేదాకా, మీతో వుంటాను. వెళ్దాం పదండి!”

ఎలాగోలా సమాధాన పడి బండెక్కాడాయన. 

“మీరు చివరి సారి జైలుకెళ్ళిందెప్పుడు?” 

“అంటే, ఊరికే తీసుకెళ్ళి లోపల పడేయడం కాకుండానా? నీకో విషయం చెప్పేదా. కొంతమంది కానిస్టేబుళ్ళు అయితే నేను కళ్ళబడ్డం కూడా సహించలేరు. చూడంగానే బూతులు లంకించుకుంటారు. ఒక్కోసారి, రెండు దెబ్బలు కూడా వేస్తారు. అంతెందుకు, స్టీఫెన్ జ్ఞానరాజ్ ఎస్పీగా ఉండేటప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్లి, ఏ కేసూ రిజిస్టర్ చెయ్యకుండా, కొన్నిరోజులు లోపలుంచి, చావబాది కానీ వొదిలిపెట్టేవాడు గాదు. ఆ విషయం వొదిలేస్తే, చాలా మంచి పిల్లాడు. నిజం కేసు మీద చివరి సారి లోపలికెళ్ళింది అయితే, 1989 లో గాంధీ జయంతి నాడు.”

‘సత్యాగ్రహం చేసినందుకా?”

“చ ఛా కాదు.”అన్నాడు, కొట్టి పారేస్తూ. “ఆ రోజు పొద్దున్నించీ, గాంధీ గారి విగ్రహానికి దండల మీద దండలు వేస్తున్నారు. కొంచెం స్టయిలుగా ఉంటే బావుంటుందని, ఒక టోపీ తీసుకెళ్ళి పెట్టాను ఆయన తల మీద.  ఎవడో పేపర్ వాడు, అది  ఫోటో తీసాడు. ఆరెస్ట్ చేసి నా మీద కేసు పెట్టారు.”

“ఏం టోపీ అది?”

“ఎర్ర టోపీ, మంచి వెల్వెట్ బట్టతో చేసింది. ఆ రోజు ఎక్కడో  ‘గాడిదల సంత మైదానంలో సర్కస్ వస్తోంది!’ అనే పోస్టర్ చూసాను. దాన్లో  బఫూన్ తలమీద ఉన్న టోపీ చూసి,  భలేవుందే అనుకోని, నా డబ్బులతో, బట్ట కొని, అలాంటిదే  ఒక అందమైన టోపీ కుట్టించి గాంధీ తల మీద పెట్టాను. నిజంగా చెప్తున్నాను… ఒట్టు! తమాషా  కాదు. ఆ టోపీ పెడితే  ఆయన ఎంత చక్కగా అందంగా, వున్నాడనుకున్నావ్! ఆయనకు కూడా నచ్చిందనుకుంటాను! నన్ను చూసి ఒక కొంటె నవ్వు కూడా పారేసాడు. ఆ తర్వాత ఒక ఆర్నెల్లు లోపలుంచారు. నేను చేసిన నేరం ఏమిటి? అని ముందర పోలీసుల్ని, తర్వాత కోర్టునీ, అడిగాను. ఏవీ చెప్పం! అన్నారు.’’

“మీకు నోటిదూల  ఎక్కువ. లేపోతే పొద్దస్తమానం ఎవడైనా తన్నులు తినాలనే తాపత్రయంతో  తిరుగుతాడా?”

“బాబూ, తన్నించుకోవడంలో కూడా ఓ తెలీని ఆనందం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి మొగుడొచ్చి చితక్కొడితే కానీ రాత్రి పూట నిద్ర పట్టదు తెలుసా? ఇది కూడా అలాగే!”

“ఇక్కడ మటుకు దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకోండి, అతి తెలివిని ప్రదర్శించకండి. డాక్టర్ తో  నేను మాట్లాడతాను. గమ్మునుండండి. సరేనా?” 

“చూద్దాం. నిజానికి నా ఆరోగ్యం అంత గొప్పగా లేదు. నాలుగైదు రోజుల్నించీ, మూత్రం బొట్లు బొట్లుగానే వస్తోంది. రంగు కూడా మారిపోయింది. మూత్రమా, యాసిడా అని చేత్తో తాకి కూడా చూసాను! ఓహ్! తట్టుకోలేనంత నొప్పి…”

బండి హాస్పిటల్ వరండాదగ్గరగా ఆపి ఆయనకు ఊతమిస్తూ మెట్లెక్కించాను. ఏదో కొన్ని మెడికో లీగల్ కేసుల విషయంలో గవర్నమెంట్ ఆసుపత్రికి ఒకట్రెండు సార్లు వచ్చాను. పొద్దున పూట, ఇంత జనం ఉంటారని తెలీదు. ఒక పెద్ద వరండాలో కటిక నేల మీద స్తంభాలకు, గోడలకు ఆనుకొని ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళ తల్లులు బారులు బారులుగా కూర్చుని వున్నారు. నేలంతా పేషంట్ల ఉమ్మితో నిండి పోయుంది. గాయాల దుర్గంధం, మందుల వాసన, కలిసిపోయి అక్కడి గాలి ముక్కుపుటాలను అదరగొడుతోంది. పశువులతో బాటూ, వీధికుక్కలు కూడా విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నాయి. 

పూమేడై స్తంభానికి ఆనుకుని కూర్చున్నారు. “ఇంక నువ్వు వెళ్ళు, బాబూ.  పర్లేదు! నా సంగతి నేను చూసుంటాను.”

“ఇంతదూరం వచ్చా కదా! ఒక మాట డాక్టర్తో మాట్లాడి వెళ్తాను.” అంటూ పైకి లేచాను. 

“ఒక్క నిముషం!”, అని నన్ను ఆపి తనదైన పంధాలో “మిగతా వాళ్ళలా, నేను కూడా లైన్లోనే నిలబడతాను. అర్థమైందా?” అన్నాడు. 

“మంచిది!” అన్నాను. 

కిసుక్కున నవ్వాడాయన. “లైనులో నిలబడ్డం, ప్రజాస్వామ్యం!” అంటూ కన్నుగీటుతూ, “లైను అస్సలు ముందుకు కదలకకుండా నిలబడి పోవడం,  పరిఢవిల్లిపోతున్న  ప్రజాస్వామ్యం!” అని పొడిగించాడు. 

“మీరిక్కడే వుండండి. నేనెళ్ళి లైన్లో నిలబడతాను. అది ఓకే కదా!”. 

“అది ఓకే. కానీ యముడు పాశం పట్టుకొచ్చినప్పుడు – వెళ్ళి, మీ బదులు నేను లైన్లో నిలబడతాను అనేవ్!” అని చిన్నగా నవ్వాడు. 

ఒక పెద్ద ఆవు, చిక్కం కట్టున్న దూడతో వచ్చి, ఆయన్ను వాసన చూసింది. ఆవు  తలను నిమిరాడాయన. ఓ రెండు మూడు వందలమంది నిల్చుని ఉన్నారు వరసలో.  కమ్ములున్న కిటికీ. దాని వెనకాల కౌంటర్లో తెల్ల యూనిఫారం వేసుకున్న నడి వయస్కురాలు. వంచిన తల పైకెత్తకుండా, చీటీలు రాస్తోంది. వెనకాల ఫైళ్ళతో నిండిన అల్మైరాలున్నాయి. నెత్తిమీద పాత సీలింగ్ ఫ్యాన్ ఒకటి తిరుగుతోంది. ఉన్నట్టుండి ఆమె రాయడం ఆపేసి, బయటకెళ్ళి  ఓ పది నిముషాల తర్వాత లోపలికి వచ్చింది. లైను కదులుతున్న పద్ధతి నా సహనాన్ని పరీక్షిస్తోంది. ఇద్దరు ముసలివాళ్ళు తమ తల చేతుల మధ్యలో పెట్టుకుని, గొంతుకు కూర్చుని వున్నారు. అదే భంగిమలో వరస తో పాటూ నెమ్మదిగా  ముందుకు కదులుతున్నారు. అందరికంటే ముందు నిలుచున్న ముసిలి ఆడ మనిషి, చీటీ తీసుకుంటూ నర్సుతో ఏదో అంది. 

“ఏయ్ ! దాంట్లో  రాసుంది కనపడట్లా! ముందిక్కణ్ణించి కదులు, ఫో!” అని బుసలు కొట్టింది కౌంటర్ లో వున్న నర్సు . 

ఏదో గొణుక్కుంటూ గూనిబోయిన దేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ముసలావిడ. 

అప్పుడు చూసాను హెడ్ కానిస్టేబుల్ ముత్తుస్వామి లోపలికి రావడం. నాకు బాగా  తెలుసతను. 

పూమేడై కూచోనున్న స్తంభం దగ్గరికి రాగానే ముత్తుస్వామి ఆయన్ని గుర్తు పట్టాడు. పూమేడై జోగుతున్నాడు. ముత్తుస్వామి ఆయన్ని “ఏయ్!” అని అరుస్తూ బూటు కాల్తో తొడమీద తన్నాడు. పూమేడై, పక్కకి పడబోతున్నవాడల్లా స్తంభాన్ని పట్టుకుని సర్దుకున్నాడు. నా రక్తం మరిగిపోయింది, గట్టిగా పళ్ళు బిగించి, కళ్ళు పెద్దవి చేసి, పెల్లుబికిన కోపాన్ని అణుచుకున్నాను.

“ఇక్కడేం చేస్తున్నావ్?” అడిగాడు ముత్తుస్వామి ఆయన్ని. ఎర్రబడ్డ కళ్ళతో, ముత్తు స్వామి వైపు చూసాడు ఆయన. ఇంకా పూర్తిగా దిగ్బ్రాంతి నించి తేరుకున్నట్టు లేదు. 

“సార్! ముత్తుస్వామి సార్!” అని వరండాకు అవతల పక్క నించీ అరిచాను. 

“ఎవరూ! ఓహ్ మీరా? ఇక్కడేం చేస్తున్నారు?” అడిగాడు నన్ను అతను. 

“మా నాడార్ సారు ఈయన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే ఇటొచ్చాను.”

“ఏందీ! నీకేమన్నా పిచ్చి పట్టిందా! వీడో మహా పిచ్చినాకొడుకు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం! చూడ్డానికి అలా ఉంటాడు గానీ, ఒళ్ళంతా విషమే వెధవకి! మా ఎస్‍ఐ భాస్కరన్ గారి వుద్యోగం పోయింది వీడి వల్లే. ఇప్పుడాయన రైసుమిల్లులో బియ్యం దంచుతున్నాడు.”

“అలానా? మా సార్ చెప్పాడని తీసుకొచ్చాను.”

“అది సరే, కాంచాంబరం కేసు ఏవయ్యింది?” అంటూ, ఒక్కసారిగా ముఖకవళికలు మారుస్తూ గొంతు తగ్గించి “కేసు మనం గెలిచే అవకాశం ఏవన్నా ఉందా?” అనడిగాడు, ముత్తుస్వామి.

“అదే చూస్తున్నాను. ప్రస్తుతానికి కేసు వాయిదా పడింది. కాంచాంబరం దగ్గర డబ్బులస్సలు లేవు.”

“మరదే! వాడి జేబులో డబ్బులంటే మీ దగ్గరకి ఎందుకొస్తాడు?” ఎగతాళిగా అన్నాడు ముత్తుస్వామి. “సర్లే, నేను పోతున్నాను. ఇంకో కేసు ఎదురుచూస్తోంది అక్కడ. చేతులు నరికేసిన కేసు!” అంటూ అలానే పోయాడు. 

“ఒక చీటీ ఇస్తారా?” కౌంటర్లోకి తల పెట్టి అడిగాను. 

ఏవీ సమాధానం లేదు. 

“చీటీ!” మళ్ళీ అడిగాను. 

నా వైపు చూసి ఓ రెండుక్షణాలాగి అడిగిందామె.”ఎవరికి”?

“అదిగో అక్కడున్నాడే, పూమేడై”

“అతన్నొచ్చి లైన్లో నిల్చోమను! నువ్వు పక్కకి జరుగు!”

వొంట్లో రక్తం సల సలా మరిగింది, “ఆయన నిలబడలేడు!”

“నిల్చోలేకపోతే అక్కడే వదిలేయ్! చచ్చినప్పుడు లోపలకి తీసుకపోతాం! అసలు నువ్వు ముందు లైన్లో నించి బయటకురా!”

ఒక ఆడమనిషి అంత కఠినంగా మాట్లాడగలదు అన్నది నమ్మలేక నేను ఆమె వైపు తీక్షణంగా చూసాను. సర్దుకోడానికి కొంత సేపు పట్టింది. “సరే పిలుస్తాను!” ఆమెకి చెప్పాను. 

“ఇక్కడ కాదు. లైను వెనకాలకి పోయి నించోమను. నువ్వు కదులు ఇక్కణ్ణుంచి.”

నేనేదో అనే లోపల వెనక నించున్న ముసలాయన నెమ్మదిగా గొణిగాడు, “ఒక ఐదు రూపాయలు పడేస్తే గానీ పని అవ్వదిక్కడ!”

పూమేడైకి కనపడకుండా జాగర్తగా ఒక ఐదురూపాయలు కౌంటర్ లోపలికి తోసాను. సరుగు తెరిచి, నోటు లోపల పడేసి మరో మాట లేకుండా, వెంటనే “పేరు? వయసు?” అని అడిగింది. వివరాలిచ్చి చీటీ తీసుకుని పూమేడై దగ్గరకు వెళ్ళాను. జాగర్తగా పైకి లేపి నిలబెట్టాను. “రూమ్ నంబర్ 13” అని చెప్పాను. 

“అబ్బా! అదృష్ట సంఖ్య” అన్నాడు. “సరిగ్గా విన్నావా ! అది మార్చురీ ఏమో?” 

“మార్చురీ అయితే మనల్ని వెళ్ళమనరు. వాళ్ళే దగ్గరుండి జాగర్తగా తీసుకెళ్తారట! చెప్పారు.”

“ఓహ్! గౌరవప్రదమైన విడిదిలా, ఏసీ గూడా ఉంటుందనుకుంటా?”

రూమ్ నంబర్ 13 ముందర, బెంచీలు ఖాళీలు లేవు. ఒక యాభై మంది నిలబడివుంటే, ఇంకో ఇరవై మంది కూచుని వున్నారు. నలుగురో ఐదుగురో కింద కూచుని, కాళ్ళు చాపుకుని వున్నారు. పూమేడైని కూర్చోమని చెప్పి నేను క్యూలో నిలబడ్డాను. పేషంట్లు ఎంత తొందరగా రూంలోకి కెళ్తే, అంత తొందరగా బయటికి రావడం చూసి కొంచెం తేలిక పడ్డాను. 

వాచీ వైపు చూసాను. ‘బేరం కోసం తయారుగా వున్న వాళ్ళింటి ఆవు, ఆ పిల్ల ఇద్దరూ నా గురించి వేచి చూస్తూ వుంటారు.  ఆమె ఎలా ఉంటుంది? పెరువట్టర్ల పిల్ల కదా! టెక్కుకి తక్కువుండదు. పెద్దింటి పిల్లకి పిసరంత పొగరు ఉంటే చూడ్డానికి బానేవుంటుంది!’

గంట గడిచిన తర్వాత  నా వంతు వచ్చింది. పూమేడై వైపు చూస్తే, గాఢ నిద్రలో వున్నాడు. వెంటనే లోపలికెళ్ళాను. 

“చెప్పండి?” అన్నాడు నన్ను అనుమానంగా చూస్తూ డాక్టర్. నడివయసు మనిషి. బట్టతలతో పాటూ మాడు మీదికి అతి కష్టం మీద లాక్కొచ్చి దువ్విన కొద్ది పాటి వెంట్రుకలూ, దళసరి కళ్ళద్దాలూ, ముడతలు పడ్డ పాంటూ చొక్కాతో, కూచుని ఉన్నాడాయన. 

“నా పేరు గణేశన్, నేను లాయర్ని!” అన్నాను. ఆయన చూపులో మార్పు గమనించి సంతోషించాను. “మాకు తెల్సినాయన ఒకాయనకు ఒంట్లో బాలేదు. తీసుకొచ్చాను.”

“పోలీస్ కేసా?” వెనక్కి వాలి అడిగాడాయన. 

“లేదండీ, తెల్సినాయన. అంతే! వయసుపైబడింది. చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు. దయచేసి మీరు చెయ్యగలిగిందంతా చెయ్యండి. డబ్బు విషయం నేను చూసుకుంటాను. ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు.”

తలకొద్దిగా పక్కకు వాల్చి  అడిగాడు, “ఆయన మీకు బంధువా?”

“చిన్నప్పటినుంచీ తెల్సు.” 

“లోపలికి తీసుకరండి”. 

పట్టుకుని తీసుకెళ్ళాను. డాక్టర్ ఆయన్ని పక్కరూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి, పరీక్ష చేసాడు. నేను బయట నిలబడ్డాను. చేతులు కడుక్కుని డాక్టర్ నన్ను లోపలికి రమ్మన్నాడు. “మూత్రపిండాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి  ప్రమాదకరంగా వుంది. అసలు ఆ మనిషి లేచి నిల్చోగల్గడమే నాకు ఆశ్చర్యంగా వుంది.”

“గట్టి పిండం” అన్నాను నేను. 

“పెద్దాయన గదా, నా క్లినిక్ కి ఎలాగోలా తీసుకురాగలరా?”

“ఆయన రాడండీ! అక్కడ మీరేవి చేయగలరో, అదంతా ఇక్కడ చెయ్యండి. డబ్బులు నేను కడతాను.” 

“మీకు ఆయన బంధువు కాదు అంటున్నారు. చాలా అవుతుంది. చూద్దాం. ముందు ఓ ఐదు వేలు సర్దండి. అంతా అయ్యేటప్పటికి ఇంకొంత ఖర్చు అవ్వొచ్చు.”

గట్టిగా శ్వాస తీసుకుని చెప్పాను, “పర్లేదు. ఈయన కోసం ఖర్చు పెట్టే వాళ్ళు కొంతమంది తప్పకుండా వుంటారు. మీరు అడ్మిట్ చేసుకోండి!”

“సరే అయితే!” అంటూ ఏదో రాయడం మొదలెట్టి మధ్యలో ఆగాడు. “కొంచెం ఆగండి. వార్డులో చెప్పాలి!” అంటూనే ఏదో రహస్యం చెప్తున్నట్టుగా, గొంతు తగ్గించేసి “డబ్బంతా ముందరే ఇచ్చేస్తే బావుంటుంది.” అన్నాడు. 

అతని కళ్ళలోకి చూసాను. ఏం చెప్తున్నాడో అర్థం అయ్యింది. మళ్ళీ నన్ను నేను అతికష్టం మీద నిభాయించుకున్నాను. “డాక్టర్! మీరే ఆయన పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. ఆలస్యం చెయ్యకుండా దయచేసి వెంటనే అడ్మిట్ చేసుకోండి. డబ్బులు తీసుకుని ఒక గంటలో వచ్చేస్తాను.” నాకు తెలియకుండానే  నా స్వరంలో తీవ్రత పెరిగింది.

డాక్టర్ నవ్వినట్టుగా పెదాలు వంకర చేసి, “మీకు ఆయన బంధువు కాదంటున్నారు. మీరు ఇక్కడ ఆయనని వదిలేసి మళ్ళీ తిరిగిరాకపోతే? అంటే అలా చేస్తారని కాదు. వూరికే మనం అనుకోడానికి! అసలే స్పెషల్ వార్డు ఒక పద్ధతిలో నడుస్తుంది. అక్కడ అటూ ఇటూ తిరిగే హెల్పర్లు కూడా వాళ్ళ చేతులు తడపాలంటారు. నేనేమీ తీసుకోలేదంటే వాళ్ళు, నమ్మను కూడా నమ్మరు! వాళ్ళకి నా జేబులోంచి తీసివ్వలేను కదా!” 

అతని మొహం లోని నవ్వు, ఏదీ వినడానికి తయారుగా లేడని చెప్తోంది. 

“సరే, డబ్బులు తీసుకొస్తాను” అని భారంగా నిట్టూర్చాను.  

అప్పుడే ఇంకో ముసలావిడ రూంలోకి వచ్చింది. ఆమె చేతులు, కాళ్ళూ, వాటికవి వేరే ప్రాణాన్ని సంతరించుకొని వున్నట్టుగా అడ్డూ ఆపూ లేకుండా వణుకుతున్నాయి. “జ్వరం సారూ!” అని మూలిగింది. ఆమె వైపు కూడా చూడకుండా చిన్న చీటీ రాసి చేతిలో పెట్టాడు. 

“కానీండి!” అన్నాడు నన్ను చూస్తూ. 

“ఈయనను ఎక్కడుంచాలి?” అడిగాను ఆయన్ని. 

ఆమె ఆపకుండా మూలుగుతూ నేపథ్యంలో మాట్లాడుతూనే వుంది “ఈ జ్వరం నాలుగైదు నెలల్నించీ తగ్గడంలా! ఇప్పుడేమో …” .

 “ఆయన్ను బయట వరండాలోకి తీసుకెళ్ళండి!” అని నాకు సమాధానమిచ్చాడు డాక్టర్. 

“ఆయనకస్సలు…” అంటూ  నేను అభ్యంతరం చెప్పే లోపలే, ఒక్క ఉదుటున  నా మాటలకడ్డం వచ్చాడు. “సార్, ఇక్కడి మాకొచ్చే కేసులన్నీ ఇలానే ఉంటాయి. మేము ప్రతి ఒక్కరి గురించి పట్టించుకోవాలంటే కుదిరే పని కాదు.”అని చెప్తూ, వణుకుతూ మాట్లాడుతున్న ఆ ముసలి ఆవిడను  “చీటీ ఇచ్చాగా, పక్కకెళ్ళు!” అని విసుక్కోని, బెల్లు మోగించి అరిచాడు “తరువాతి  పేషెంట్‍ని పంపించండి!” అని. 

పూమేడైని నిద్ర లేపాను.

 “ఏవన్నారు డాక్టర్లు? తగలబెట్టమన్నారా? పూడ్చి పెట్టమన్నారా?” అడిగాడు. 

“లేదు ముందర శవపరీక్ష చేస్తామన్నారు! మాట్లాడకుండా నాతో రండి!” , అంటూ బయటికి తీసుకెళ్ళాను. “వాళ్ళు మిమ్మల్ని అడ్మిట్ చేయాలంటున్నారు. ముందర కొన్ని పరీక్షలు చేస్తారట. మీరు కొంచెంసేపు, వరండాలో కూచొని వుండండి!”

“నువ్వెక్కడికి వెడుతున్నావ్? ఈ పెద్దపెద్ద పూల హారాలు వెయ్యడం, పూల పాడెలూ అవీ నేను పెద్ద పట్టించుకోను.” 

“అయితే కేవలం నాలుగు మూరలు మల్లెపూలు మాత్రమే వేస్తాను. సరేనా? మీరు..  కొంచెంసేపు మాట్లాడకుండా వుంటారా? నాకో చిన్న పనుంది, పది నిముషాల్లో వస్తాను. ఇక్కడే వుండండి”. 

స్థంభానికి  ఆనుకుని, పడుకున్నాడాయన. 

టీవీఎస్-50 ని, నా చేతనైనంత వేగంగా నడిపించాను. 5000 రూపాయలు నాకెక్కడ దొరుకుతాయి? అంత డబ్బు దగ్గర పెట్టుకునేవాళ్ళు, నాకు తెలీదు. పూమేడై పేరు చెప్పి, ఎవరిని అడగొచ్చు? పార్టీ వాళ్ళు! ఐదు వేలు, అప్పటికప్పుడు? నేనెక్కడికెళ్ళాలో దానంతటకదే స్ఫురించింది. 

ఆ అమ్మాయి వాళ్ళింటి వైపు బండిని నడిపించాను. 

***

వరండాలో ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని వున్నారు. నాకోసమే ఎదురు చూస్తున్నారు. ఒకాయన, మైలై పొన్నుస్వామి శివజ్ఞానం లాగా పొడవాటి గుబురు మీసాలు మెలితిప్పి, కామరాజ్ నాడార్ గారి ఆకారంలో కూర్చొని వున్నాడు. అప్పటిదాకా పటాసులు పేలినట్టు, డబడబా మాట్లాడుతున్న ఆ మనిషి నన్ను చూడగానే మాట్లాడ్డం ఆపేసాడు. అందరూ నన్ను గమనించడం మొదలెట్టారు. మోపెడ్ స్టాండేసి గబగబా మెట్లెక్కాను. కిళ్ళీ నములుతూ,  రంగు పంచె  కట్టుకుని, చొక్కా వేసుకోకుండా కూర్చొని వున్నాయన ఇంటిగలాయన అయ్యుంటాడని ఊహించాను. 

“నేను, గణేశన్! లాయర్ని’ అని చెప్పాను ఆయనకి.

“రండి, రండి” అన్నాడాయన. నాకప్పుడు తెలిసొచ్చింది, నా బట్టలన్నీ మురికైపోయి, మరకలతో నిండి ఉన్నాయని. 

“ఒక అత్యవసరమైన పని మీద మీ దగ్గరకొచ్చాను. నాన్నకేవీ బాలేదు. హాస్పిటల్లో వున్నారు. కొంచెం మీ సహాయం కావాలి.”  అంటూ ఆయనేదో సమాధానం చెప్పే లోపల, “అర్జెంటుగా ఐదు వేలు కావాలి. నాన్న మిమ్మల్ని కలవమన్నారు. ‘అక్కడొక్కచోటే మనకు వెంటనే సహాయం దొరుకుతుంది’, అని చెప్పి పంపించారు.” అన్నాను. 

ఏదో చెప్పబోతున్నట్టు మిగతా ఇద్దరి వైపు చూస్తూ  ఇబ్బందిగా కదిలాడు ఆయన. వేరే పెద్ద మనుషుల ముందర, ఇలా డబ్బులడిగితే ఆయన మాత్రం ఎలా కాదంటాడు? పాపం, ఇలాటి పరిస్థితి ఇంతకు ముందర ఎదుర్కొని ఉండడు. 

“టైం లేదండి. సాయంత్రం ఐదు లోపల డబ్బులు వెనక్కిచ్చేస్తాను. మీరు వేరేరకంగా అనుకోవద్దు. కొంచెం వెంటనే…”  వత్తిడి చేసాను. కిళ్ళీతో నిండిన నోరు, ఖాళీ చేసుకుని, ఒక్క నిముషం! అని ఆయన అనబోతూంటే, నా రెండు చేతులు జోడించి “గొప్ప సహాయం ఇది!” అన్నాను. మరో క్షణం అనుమానంగా చూసి లోపలికెళ్ళి వెంటనే నోట్లు లెక్క పెడుతూ బయటకొచ్చాడాయన,. “గొప్ప సహాయం!” అని మళ్ళీ అన్నాను. డబ్బులు తీసుకుని లెక్క కూడా పెట్టుకోకుండా, వాళ్ళకి నమస్కారం పెట్టి, మోపెడ్ మీదికి దూకాను. 

***

నేను డాక్టర్ గదిలోకి వెళ్ళే లోపలే, అక్కడ ఏదో జరిగింది అని అర్థం అయ్యింది. జనాలు గుమికూడి వున్నారు. పెద్ద పెద్దగా అరుపులు వినబడుతున్నాయి. జనాల్లోంచి దారి చేసుకుని ముందుకెళ్ళాను. డాక్టర్ నిప్పులు తొక్కిన కోతిలా ఎగురుతున్నాడు. నన్ను చూడంగానే, “వచ్చావా.. ఇదంతా నీ వల్లే! వీడ్ని ఇక్కడ్నించీ తీసుకెళ్ళిపో! లేకపోతే నేను లాక్కెళ్ళి బయట పడేస్తాను. ఏవనుకున్నావ్? నేనెవన్నా బుర్ర తక్కువోణ్ణి అనుకున్నావా! పిల్ల కాకిననుకున్నావా!”, అని ఆయాసపడ్తూ విరుచుకపడ్డాడు. 

“ఏంది? ఏమైంది?”

“ఒక్క దెబ్బ కొడితే చచ్చి ఊరుకుంటాడు. అదృష్టం! అంత దాకా రాలేదు. ఈ ముష్టి పీనుగను ఇక్కడ్నించీ ఈ క్షణమే తీసుకెళ్ళు.” అరిచాడు డాక్టర్. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టున్నాయి. 

“డాక్టర్! నేను చెప్పేది వినండి.  మీరు అడిగినట్టే…” అంటూ డబ్బు తెచ్చినట్టుగా సైగ చేసాను. 

“ఆ బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా వాణ్ణి ఇక్కడ చేర్చుకోను. ఈ చుట్టుపక్కల ఎక్కడా వాడసలు కనపడ్డానికే వీల్లేదు. ముందు వాణ్ణి ఇక్కడ్నించీ తీసుకెళ్ళు!” 

“ఏమంటున్నాడు ?” పూమేడై ఆసక్తిగా అడిగాడు. “దిక్కుమొక్కూ లేని వాళ్ళు ప్రశాంతంగా చావడానికి, ఆఖరికి ప్రభుత్వ ఆస్పత్రిలో  కూడా  వీలు లేకపోతే, అవి వుండి ఏం ప్రయోజనం చెప్పు?”

“తిక్క లండీ కొడకా!” అంటూ డాక్టర్ కోపంతో ఊగిపోతూ పూమేడై వైపు అంగలేశాడు. డాక్టర్ని జబ్బ పట్టుకుని ఆపాను. 

సహనం పూర్తిగా చచ్చిపోయి,  “ఏయ్, ఏమనుకుంటున్నావ్? ఆయన మీద చెయ్యి చేసుకునే దమ్ములున్నాయా నీకు? నీ అంతు చూస్తా నేను.” అని కేక పెట్టాను. 

డాక్టర్ తగ్గాడు. “నేను బతికుండగా, ఈ మనిషి ఈ హాస్పిటల్ లోకి అడుగుపెట్టడానికి లేదు, చెప్తున్నాను” అంటూ అక్కడ్నించీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 

“ఏం చేసారు మీరు? ఇంత గొడవ అవుతోంది!” అడిగాను, పూమేడై వైపు తిరిగి. 

అప్పటికే బాధ తట్టుకోలేక నేల మీద ముడుచుకుని పడుకున్నాడాయన. యూనిఫారం వేసుకోనున్న వార్డ్ బాయ్ ఒకతను నా దగ్గరికొచ్చాడు. “సార్ మీరా ఈయన్ను తీసుకొచ్చింది? ఈయన మన పూమేడై కాదా?” అని అడిగాడు. 

“అవును ఆయన నా క్లయింట్. నేను ఆయన లాయర్ని! అది సరే. ఏమయ్యింది ఇక్కడ? ఇంత గొడవేంది?” అడిగానతన్ని. 

స్వరం తగ్గించి, చెప్పాడతను, “కాంగ్రెస్ పార్టీ మనుషులు దేవసహాయం, కరుణాకరన్ ఇక్కడికొచ్చారు. ఎవర్నో పొడిచేసి  నేరుగా ఇక్కడికే వచ్చినట్టున్నారు. మారు తేదీలతో ఆస్పత్రిలో చేరినట్టు రాసుకోమన్నారు. ఇక్కడిది మామూలే కదా! వాళ్ళు క్యూలో నిలబడ లేదు. ఒక నమస్కారం పెట్టి నేరుగా లోపలికొచ్చారు. డాక్టర్ ఒళ్ళంతా నవ్వులు పూసుకుంటూ, దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకున్నాడు. మనోడికి ఇదంతా కంటబడి డాక్టర్ దగ్గరికెళ్ళి అడిగాడు. “క్యూలో ఉన్న వాళ్ళ సంగతి ఏంది? నలభై మంది పొద్దున్నించీ ఇక్కడ నిలబడున్నారు కదా?” అని. దానికి డాక్టర్, “వీళ్ళు అధికార పార్టీ మనుషులు, వీళ్ళకు క్యూ లేదు” అన్నాడు. 

వార్డు బాయ్ అలా చెబుతూ ఉండగానే నాకు నోట్లో మాట పడి పోయింది. ఆ తర్వాత ఏం జరిగుండొచ్చో  ఊహించాను. 

ఆపకుండా పగలబడి నవ్వుతూనే చెప్పుకుంటూ పోతున్నాడతను,  “అప్పుడు ఈ పిచ్చోడు, తన నిజ స్వరూపం చూపించాడు. బయటికి పద్ధతిగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దూడతో పాటూ మేస్తున్న ఆవుని, నేరుగా డాక్టర్ గదిలోకి తోలాడు. డాక్టర్ భయపడి పోయి తన టేబుల్ మీదకెక్కేసాడు. మనోడు నినాదాలు ఇచ్చాడు  “ఆవు-దూడ, కాంగ్రెస్ గుర్తు! వాటికి గూడా క్యూ లేదు!” అని. ఆవు లోపలంతా చిందర వందర చేసేసి, బయటకి పరిగెత్తింది. డాక్టరేమో “వామ్మో వాయ్యో” అని కేకలు పెడుతూనే వున్నాడు. కొంతసేపు ఏదో మాంఛి సినిమా చూసినట్టు వుండింది అనుకో!”

జనాలంతా వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. “ఓహ్! ఈయనే కదా. ఆ ఉబ్బిపోయిన మొహంతో గుర్తు పట్టలేక పోయాం ఎవరనేది! అంటున్నారెవరో. ‘ఒకప్పుడు బాగా డబ్బులుండేవి. ఆ సభలూ ఈ సభలూ అనిచెప్పి, వున్నదంతా గోకి పారేసాడు!’, ‘పిచ్చెక్కితే ఇంతే అన్న మాట!’ , ‘వీధుల్లో పడాలని రాసుంటే అంతే!’,  ‘భార్యా పిల్లలూ లేరు కదా!’ ‘పిల్లలు లేరు. భార్య ఎప్పుడో పోయింది.’ ‘ఎక్కడ ఛస్తే మటుకు ఏమిటి?’ ‘హాస్పిటల్లో చస్తేనే కొంత నయం! పరువుగా ప్రాణం పోయినట్టు!’”

ఆ రణగొణ ధ్వనిలో పూమేడై ఎలావున్నాడో చూసేందుకు కిందికి వంగాను. మొహమంతా పాలిపోయి పచ్చగా మారిపోయింది. నా కదలికలు చెవిలోపడి కళ్ళు తెరిచి నవ్వాడు. “ఒక తప్పు చేసాను. బహుశా ఆఖరి  తప్పేమో!” అన్నాడు. 

నా నోట్లోంచి “ఆహా! ఏం సమయం ఎన్నుకున్నారు? జ్ఞానోదయానికి!” అంటూ రాబోయే మాటల్ని గొంతులోనే నొక్కేసాను. 

“కాంగ్రెస్ గుర్తు 78 లోనే మారిపోయింది కదా! ఇప్పుడు చేతి గుర్తు… పూర్తిగా మర్చేపోయాను” అన్నాడు, మళ్ళీ కళ్ళు మూస్తూ. అలాంటి  పరిస్థితిలోనూ నవ్వొచ్చింది నాకు. 

అవే ఆయన ఆఖరి మాటలు! 

ఆటోని పిలిచి వేరే ఆసుపత్రికి తీసుకవెడుతోంటే దారిలోనే ప్రాణం పోయింది.  నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన; ఆ ఐదువేలతోనే, అంత్యక్రియలు పూర్తయ్యాయి. మువ్వన్నెల జండాతో, మూడు రంగుల పూదండలతో, మహా బాగా జరిగింది ఆ తంతు. వచ్చినవాళ్ళందరికీ, తల మీదికి గాంధీ టోపీ, నోట్లో వేయడానికి టోపీ లోపట కొన్ని వాత బియ్యపుగింజలూ పోసి,  చేతిలో పెట్టారు.  

*****

సవరణ : భాస్కర్ అవినేని

కథ ఆడియో ఇక్కడ వినండి:

కథ :’ పిచ్చిమాలోకం’ – తమిళ మాతృక శ్రీ జెయమోహన్ – Harshaneeyam (captivate.fm)

కుమార్, ఎస్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఓ అద్భుతమైన కథ. చదువుతున్నం తసేపు ఈ లోకం లో లేను. ఇది సమకాలీన కథ ఆంటే నమ్మలేక పోతున్నా..రాసిన జయ మోహన్ కు, అనువాదం చేసిన అవినేని భాస్కర్ కు, గాత్రం ఇచ్చిన ఎస్ కుమార్ కు అభినందనలు.

  • చాలా ఆలశ్యమైంది చదవటానికి.అందుకే లింకు కాపి చేసిపెట్టుకున్నాను.చదువుతుంటె ఎంత భరంకరమైన స్థితి లో మనం ఉన్నాము!😰 Very touching one. Thank you kumargaru share చేసినందుకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు