ఎన్నో ఏళ్లుగా నేను కూడబెట్టుకున్న శ్రమ, నోట్ చేసుకున్న ఆలోచనలు, పాదటిప్పణలు—అన్నీ నిన్నటి ఒకే రాత్రిలో గాలిలో కలిసి పోయినట్లు మాయమయ్యాయి. మొదట్లో నేను దానిని ఒక సాధారణ కంప్యూటర్ వైఫల్యంగా భావించాను; కానీ నా కష్టమంతా రాత్రికి రాత్రి మాయ మవడానికి ఎవరికీ కనిపించకుండా ఎక్కడో హిమాలయాల్లో కొండవాగుల మధ్యన ఒంటరిగా పడి ఉన్న ఆ పురాతన లైబ్రరీయే కారణం అని ఈ రోజు ఉదయం మూర్తి నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ, ఈ లైబ్రరీ బిల్డింగ్ కనుక్కోవడంలో మాకు గూగుల్ ఎర్త్ సహాయ పడిందని చెప్పాలి.
గూగుల్ ఎర్త్‌లో పొరల మాదిరిగా కూర్చిన భూ భాగాలపై, ‘తరాలి’ పట్టణ సరిహద్దుల్లోని పిండార్ నదికి సమీపంలోని పొలాల్లో, ఒక దీర్ఘ చతురస్రాకారంలో తన ఉనికిని ప్రపంచ జ్ఞానపటం నుంచి తుడిచి వేసుకున్న ఒక అస్పష్ట కట్టడాన్ని ఒకదాన్ని చూపించి – ఇదే నీ శ్రమంతటినీ మాయం చేసిన గ్రంథాలయం అన్నాడతడు. పైకి రాళ్ళ దిబ్బ లాగా కనిపిస్తున్న ఈ కట్టడం భూమిలోపల ఒక పురాతన గ్రంథాలయంగా ఉందనే విషయం మూర్తి చెబుతుంటే నేను నిజమేనా అనే సందిగ్ధంలో పడ్డాను. అతడు పూర్వాశ్రమంలో హిమాలయాల్లో పని చేసిన ఆర్కియాలజిస్టు కావడంతో నాకు వేరే మార్గం కూడా లేదు కానీ ఆర్కియాలజిస్టులు తమ మనసులను తవ్వుకున్నంతగా భూమిని తవ్వరనే నమ్మకం నాకు హైన్రిష్ ష్లీమన్ జీవిత చరిత్ర ‘బహు రూపులవాడు’ చదివాక గట్టిపడింది. సాటిలైట్ టెక్నాలజీ మ్యాపింగ్ విషయంలో భారతదేశంలో 3-D terrain కి మాత్రమే అనుమతులున్నాయి, కానీ full 3D-city photogrammetry కి చాలా నియంత్రణలు ఉన్నాయి. దానితో గూగుల్ ఎర్త్ లో భారతదేశ నగరాలన్నీ 2-D లో మాత్రమే కనిపిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో వలె భవనాలు, చెట్లు కూడా 3-D లో కనిపించడం జరగదు. హిమాలయాలు వంటి పర్వతాల ఎగుడు దిగుడులు చూసేందుకు మాత్రమే 3-D terrain టెక్నాలజీ సహాయపడుతుంది. కాబట్టి గూగుల్ ఎర్త్ లో పైనుంచి దీర్ఘ చతురస్రాకారంలో కనబడుతున్న ఈ కట్టడం 3-D లో చూడలేకపోయాను. ఆ నిర్మాణం వాస్తవానికి చెందిందా, లేక వాస్తవమే దాని కోసం కొంచెం మారిందా అనే ప్రశ్న ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.
పోయిన నెల నేను నా పరిశోధనా పత్రాలను తీసుకుని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారితో మాట్లాడేటప్పుడు చేయి జారి పేపర్లన్నీ కింద పడిపోయాయి. ఆ పేపర్లు ఒక్కసారి
గా పడిపోతే వచ్చిన శబ్దానికి అతడి ఆఫీసు సింబాలిక్ ఆర్డర్ ఏదో నాశనం ఐపోయిందన్నట్టు అతడి ముఖం మాడిపోయిన రొట్టె లాగా కోపంతో నిండిపోయింది. ఆయన దృష్టిలో నేను చేసినది చిన్న పొరపాటు కాదు, ఒక సంస్థాగత నేరం. “పేపర్లన్నీ ఇక్కడినుండి తీసేసుకుని వెంటనే వెళ్ళిపో!” అని అతడు అరిచినప్పుడే నాకు ఈ దేశంలో జ్ఞానం మీద ఆసక్తి కంటే జ్ఞానం మీద తమ హక్కునీ, అధికారాన్నీ ప్రకటించుకోవడంలో అనురక్తి ఎక్కువగా ఉంటుందని అర్థమైంది. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో “జ్ఞానం” చుట్టూ పెరిగిన పాత వ్యవస్థల్లో పాతుకుపోయిన విచిత్రమైన ప్రొటోకాల్స్ ముందు మోకరిల్లలేక నేను లేచి వెళ్ళిపోయాను.
పైగా నేను విదేశీ వాణ్ణి, ఒక తెల్లవాణ్ణి¹ కావడంతో.. ఒక విదేశీ విద్యార్థిని అజమాయిషీ చేసి గేలి చేయడంలో ఆ ప్రొఫెసర్ ఏదో ఆనందాన్ని పొంది ఉండాలి. ఇది సంస్థాగత ఆనందం . దానిని వ్యక్తిగత ఆనందం అని పొరబడకూడదు. చాలా సార్లు వ్యక్తులుగా ఆనందించడం కంటే వారి వారి స్థానాలు ఆనందిస్తుంటాయి. స్థాన బలిమే కాదు స్థాన ఆనందమూ ఉంటుంది. ఈ దేశంలో వ్యక్తులు కొన్నిసార్లు తమ అసలు శరీరంతో కాక తమ స్థాన-శరీరంతో మాట్లాడటం ప్రవర్తించడం తరచూ చూస్తుంటాను.
ఆ రోజు రాత్రి హోటల్ లో డిన్నర్ చేస్తుంటే నా పక్కనే కూర్చున్న వ్యక్తిగా పరిచయమయ్యాడు మూర్తి. తింటూ తింటూ – “ఏదైనా ఒక విషయాన్ని ఎంపరికల్ గా ప్రయోగాల ద్వారా నిరూపించ గలిగితేనే సత్యమౌతుందా?. నిరూపించలేకపోతే సత్యం కాదా ?” అని అడిగాడు. నేను ప్రశ్నను ప్రాసెస్ చేసుకుని సమాధానం చెప్పే లోపల అతడే అన్నాడు- “హేతుబద్ధ విచారణతో కూడా మనం సత్యాన్ని చేరుకోవచ్చు కదా సాంఖ్యులలాగా?” అన్నాడు. అని, నా సమాధానం కోసం వేచి చూడకుండా చేతులు కడుక్కునేందుకు లేచి వెళ్ళిపోయాడు. అతడు వెంటవెంటనే ప్రశ్నలు అడగడం ద్వారా సమాధానాలను అడ్డుకుంటున్నట్టు అగుపించాడు. – ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ని వ్యక్తిగత అంశాలు తప్పకుండా కలుషితం చేస్తాయి దానిని నివారించేందుకు హేతుబద్ధ విచారణ అవసరం అనీ హేతుబద్ధ విచారణ మన subjective blind spots ని పరిగణలోకి తీసుకునే ఒక వ్యవస్థ – అనీ నేను అతడితో చెబుదామనుకున్నాను, అతడా అవకాశాన్ని అప్పుడు ఈయలేదు. కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్ లో చూపిస్తూ ఆ దీర్ఘ చతురస్రాకారపు రాతి దిబ్బ కింద పురాతన గ్రంథాలయం ఉందని అతడు నాతో చెప్పినప్పుడైనా అతడికి ఆ విషయం చెబుదామని అనుకున్నాను. కానీ చెప్పలేక పోయాను. ఎందుకంటే నా self నా వద్ద మాత్రమే లేదని , మూర్తి నన్ను చూసే సిగ్నిఫైర్ల మధ్య ఉన్న ఖాళీల్లోనే నా ఉనికి చిక్కుకుపోయిందని అప్పుడు స్పష్టంగా అనిపించింది.
ఏమైతేనేం కొంత కాలానికి ఒక కారు తీసుకుని నేనూ, మూర్తీ ‘తరాలీ’ పట్టణానికి బయలుదేరాం, మా డ్రైవర్ గా ఒక బుద్ధిస్ట్ భంతే. ఇతడు నాలాగే ఏదో కాఫీ షాపులో మూర్తికి పరిచయం అయ్యాడంట. ఈ భంతే దగ్గర ఎప్పుడూ ఒక ఎరుపు రంగు అట్టతో చక్కగా బైండ్ చేయబడిన లావుపాటి పుస్తకం ఉండేది. దానిలో అన్నీ ఖాళీ పేపర్లు ఉండేవి. దానిని అతడు చివరి పవిత్ర గ్రంథం (Final Scripture) అంటుండేవాడు. ఇప్పటిదాకా మానవుడు పవిత్ర మంటూ రాసినదంతా తుడిచివేసినప్పుడే అసలైన చివరి పవిత్ర గ్రంథం ఉదయిస్తుందనీ, ఆ మహా గ్రంథంలో మొదటి భాగం(Volume 1) మాత్రమే తనవద్ద ఉందనీ మాతో చెప్పేవాడు. మా కారు ప్రయాణం మధ్య మధ్యలో ఆగుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళడంతో హిమాలయాలకు చేరడానికి మూడురోజులు పట్టింది. ఆ ప్రయాణంలో అంతా, భూమి కింద గ్రంథాలయం ఉండటం ఏంటని నేను ఒక్కణ్ణే సంశయాత్మకంగా ఉన్నాను కానీ, మూర్తి, భంతేలు నాలాగా లేరు. వారు ఆ గ్రంథాలయం లో ఏమేం పుస్తకాలు వెతుక్కోవాలో మాట్లాడుకుంటూ ఉండేవారు. మహాభారతంలో కర్ణుడు, అలాగే స్వామీ వివేకానందుడూ పిండార్ నది తీరంలో తపస్సు చేశారనీ అందువల్ల తాను కూడా ఆ నది ఒడ్డున తపస్సు చేసుకోవాలని ఉబలాట పడుతున్నాననీ భంతే చెప్పాడు. ఐతే తనకు కార్ లో కంటే గుర్రం మీద పోవాలని ఉందని చెప్పేవాడు. గుర్రం ఎందుకు అని అడిగినప్పుడు అతడు ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. తాను ముఖ్యంగా మాతో రావడానికి అతడి మూలాలే కారణమనీ అతడి పూర్వీకులైన పిండారీలకూ పిండార్ నదికీ ఏదైనా లింక్ ఉండే ఉంటుందనీ అదేంటో కనుక్కుందామని వస్తున్నాను అనీ చెప్పాడు. 1817 లో లార్డ్ హేస్టింగ్స్ పిండారీలను అణచి వేశాక వారి సంతానం ఎక్కడికి వెళ్ళి పోయారో ఈ దేశానికి తెలియదు కానీ తామంతా ఈ దేశంలోనే మౌనంగా సందర్భం కోసం వేచి ఉంటున్నామనీ తామంతా ఒక అసమర్థ పాలకుడు దేశాన్ని ఏలే సమయానికి మళ్ళీ గుర్రాలతో బయలుదేరి ప్రభుత్వాలను దోచుకోవడం కోసం ఎదురు చూస్తుంటామనీ చెప్పాడు. “పిండారీలనే వాళ్ళెవరూ మిగలకుండా బ్రిటీష్ వాళ్ళు ‘పిండారీ యుద్ధం’లో వాళ్ళని పూర్తిగా అణచివేశారు” అని నేను Encyclopedia of Britannica లో చదివాను అన్నాను. అణచివేయడం అంటే సమూలంగా నిర్మూలించడం కాదనీ, పులి దెబ్బకి బలైపోయిన అప్పటి తమ పిండారీ దళ నాయకుడు ‘చిటూ’కి తాను ముని ముని మనవడిననీ ఆ వీర వారసత్వం తమలో ఇంకా ఉందనీ తమ వారంతా మధ్య ప్రదేశ్ లో అక్కడక్కడా విస్తరించి ఉన్నారనీ చెప్పాడు.
నాకు భంతే చెప్పేదంతా ఫిక్షన్ లాగా తోచేది. కానీ మూర్తి అవన్నీ నిజమని నాతో వాదించేవాడు. భంతే వాడే భాష అణగారిన వర్గాల గొంతుకలా, చాలా నిశ్చయంగా, స్పష్టంగా ఉంది చూశావా అనేవాడు. ఒక్కోసారి భంతే చాలా విచారంగా కూడా కనిపించేవాడు , అకస్మాత్తుగా భావోద్వేగాలతో, చెప్పే టాపిక్ కి సంబంధం లేనట్టుగా మాట్లాడేవాడు. తాను తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకు పోవడానికి ఈ దేశ రాజకీయాలే కారణమని చెప్పాడు. భక్తి, తపస్సు వంటివన్నీ నిజజీవితం నుండి మనుషులను పలాయనం చెందించడానికి ఉపయోగపడతాయని, చివరికి ఈ భూప్రపంచం మొత్తం పలాయనం చెందే మనుషులతోనే నిండి స్వచ్ఛతను కోల్పోయి కొట్టుమిట్టాడుతోందనీ అన్నాడు. దారి దోపిడీలు చేసుకుని బతికే పిండారీలుగా తామే నిజమైన విలన్లమనీ తమను చూసి ప్రజలు భయపడటంలో ఉండే కిక్కు భలేగుండేదనీ, ఐతే ఇప్పుడున్న దోపిడీదారులు తమలాగా విలన్ల లాగా కనిపించకుండా వైట్ కోట్ లో కార్పోరేట్ లెవెల్ లో దోపిడీ చేస్తూ దేశమంతా వ్యాపించారనీ అన్నాడు. ఐనా గానీ తమ పూర్వీకుల్లాగా దారి దోపిడీలకి దొమ్మీలకీ దిగుదామంటే ప్రజల దగ్గరే ఏమీ ఉండటం లేదనీ, బీద ప్రజలను కొట్టి దోచుకోవడం వారి ఆస్తులను పిండుకుని పీడించడం కార్పోరేట్లకు తెలిసినంతగా పిండారులకు తెలియదనీ అన్నాడు. కారు నడిపేటప్పుడు డ్రైవర్ భంతేకి నిద్ర రాకుండా ఉండేందుకు మేము అతడితో ముచ్చట్లు పెట్టడం అతడు మాకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగేది. పిండార్లంటేనే క్రూరులుగా భావించిన ఈ దేశంలో తాను బౌద్ధ సన్యాసిగా మారటంలో traumatic inversion ఉందనీ, పిండారీల వారసులుగా తామనుభవించిన సామాజిక వేదన అవమానం వంటివన్నీ తమ అంతరంగ లోపాల వలన కాదనీ అవన్నీ చారిత్రక అపశ్రుతులనీ వాటినుంచి బయటపడేందుకే ఈ “చివరి మానసిక మలుపు” తీసుకున్నాననీ అణచివేతను అనుభవించిన వారే స్వేచ్ఛ విలువను తెలుసుకోగలుగుతారనీ చెప్పేవాడు.
ఎట్టకేలకు మూడు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హిమాలయాల ముంగిలిలో ఘాట్ రోడ్లు దాటుతూ ఆ కొండల మధ్య మౌనంగా ప్రశాంతంగా వెలిగుతున్న తరాలీ పట్టణానికి చేరుకున్నాం. పిండార్ నది ఒడ్డున ఉన్న బగర్ ఆలయానికి వెళ్ళి ఆ లోయ అందాల్ని పరికించాము. అక్కడి నుండి నదిని దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాం. పిండాలి నదిలో కాళ్ళు పెట్టగానే భూమి వణికిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే పిండార్ నది Indian , Eurasian tectonic plates కలిసిన చోట, భూ చరిత్రను మలుపు తిప్పిన ఆ కలయికకి గుర్తుగా వాటి నిశ్శబ్ద బిడ్డగా నిర్మలంగా ఆ లోయల్లో ప్రవహించే నది. Tectonic plates అనే భౌగోళిక సరిహద్దులు, యుద్ధంతో కాక చల్లని నీటితో కలిసి ఉండటం, వాటి చుట్టూ ఉన్న దేశాలు యుద్ధాలతో రక్తాన్ని ఏరుల్లా పారించడం- ఇంతకుమించిన పారడాక్స్ ఏముంటుందని ఆ నది అడిగినట్టు అనిపించింది. దాని ప్రతి నీటిబొట్టులో లక్షల ఏళ్ల భూభౌతిక స్మృతులు నిద్రపోతున్నాయి. దానిని దాటి రెండు ఫర్లాంగుల దూరం పొలాల్లోకి నడిచి పోతే ఒక రాతి దిబ్బ లాగా దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న అరుగు ఎత్తు కట్టడం ఉంది. అంటే అది ఆ భవనం యొక్క పై కప్పు అన్నమాట. దాని కిందే గ్రంథాలయం ఉందంటాడు మూర్తి. ఆ పైకప్పులాగా కనిపించే కట్టడం పక్కనే ముళ్ళ పొద ఉంది. దానిని జాగ్రత్తగా తొలగిస్తే ఒక మనిషి పట్టేంత సొరంగం కనబడింది. తనతో తెచ్చిన బ్యాగులో నూనె బట్టను ఒక చెక్కకి చుట్టి కాగడాలా వెలిగించాడు మూర్తి. ముగ్గురమూ లోపలికి వెళ్ళాం. కాగడా వెలుతురులో లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యం. లోపల వేల లక్షల సంఖ్యలో పుస్తకాలు రాత ప్రతులు చేతితో రాసినవి, ప్రింటు చేసినవి, తాళపత్రాల్లో రాసినవి వివిధ భాషలకు చెందినవన్నీ ఇబ్బడిముబ్బడిగా చిందరవందరగా పడి కనిపించాయి. నా మెదడును చూసుకుంటున్న అనుభూతి కలిగిందప్పుడు. “నీ గదిలో మాయమైపోయిన నీ థీసిస్ ఇందులో ఎక్కడో ఉంటుంది వెతికి తీసుకో!” అంటూ నవ్వేశాడు మూర్తి. అడ్డదిడ్డంగా పడిఉన్న పుస్తకాలను రాత ప్రతులనూ పరిశీలించుకుంటూ,పక్కకి తోసుకుంటూ ముందుకి వెళితే ఆ గదిలో ఒక మూలనుండి కింది అంతస్తుకి పోవడానికి మెట్లు కనబడ్డాయి. మేం ముగ్గురం కిందికి దిగగానే మరింత ఆశ్చర్యం!. పురాతన చెక్క అల్మారాలలో చక్కగా అమర్చి ఉంచిన వేలకు వేల పుస్తకాలు. మరో విచిత్రం ఏంటంటే అవన్నీ చక్కగా సబ్జెక్టు వారిగా భాషలవారిగా అమర్చి ఉన్నాయి. ఒక రెండు వరుసల అల్మారాల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక అరుగులాంటి ఒక రాతి బల్ల ఉంది. దానిమీద కొన్ని అక్షరాలు చెక్కి ఉన్నాయి. అదేంటో తెలుసా…అన్నాడు మూర్తి. అది పర్షియన్ భాషలో రాయబడిన ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం అన్నాడు. ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగాను.
“ఇంకా అర్థం కాలేదా ?. ఈ గ్రంథాలయం విశిష్టత! ఈ భూగోళం లో ఎవరు రాసినదైనా అకస్మాత్తుగా కనబడకుండా పోయిందంటే అది ఈ గ్రంథాలయంలో ప్రత్యక్ష మౌతుంది. ఈ మానవాళికి అవసరం లేని, మానవాళికి కీడు చేసే ప్రతీ రాత ఇక్కడికి లాగి వేయబడుతుంది. మానవాళి దేనిని దుష్ట థియరీలని అనుకుంటుందో వేటిని నికృష్ట రాతలుగా పరిగణిస్తుందో వాటిని తనలోకి లాగేసుకుని కాపాడేదే ఈ గ్రంథాలయం. నిరుక్తం. ఈ ప్రపంచం మనం చదవదగిన పుస్తకాలనే మనమధ్య ఉంచుతుంది. మనం చదువలేని మనతో సాధ్యంకాని పుస్తకాలను ఈ
ప్రపంచం ఇక్కడ ఈ గ్రంథాలయంలో దాచేస్తుంది. ఇంకా చెప్పాలంటే నిజానికి ఈ గ్రంథాలయం పుస్తకాలను దాచేది కాదు, జ్ఞానంపై మానవుల చెడు ఉద్దేశ్యాలను గుర్తించిన వెంటనే పుస్తకాలను రక్షించేది!”
“అంటే నేను రాసిన థీసిస్ ప్రపంచానికి చెడు చేస్తుందా?. ఈ నాసదీయ సూక్తం ప్రపంచానికి హాని చేసిందా?. అందుకే మాయమై ఇక్కడికి వచ్చిందా!”…అని వెటకారంగానే అడిగాను. అసలు మూర్తి చెబుతున్నదంతా పరమ సుత్తి అని నా అభిప్రాయం. “కాదు. కొన్ని రాతలు ప్రపంచానికి ఎప్పుడు చేరాలో అప్పుడు చేరుతాయి కూడా. నాసదీయ సూక్తం ఒక సత్తా వాద సందేహం. అది సృష్టిని సందేహిస్తుంది. దేవుళ్ళను సందేహిస్తుంది. జ్ఞానాన్ని సందేహిస్తుంది. అసలు సందేహాన్నే సందేహిస్తుంది. మతాల్లోకి పలాయనం చేసుకున్న మానవాళి నివసించే ఈలోకంలో ఆదిభౌతిక నిశ్చయవాదాన్ని( metaphysical certainity) ఖండిచేదేదైనా ఈ ప్రపంచంలో ఉనికిని కోల్పోతుంది. ఇప్పుడు నీ థీసిస్ మాయమైంది అని నీవు అనుకుంటున్నావు. కానీ నీ థీసిస్ ని అర్థం చేసుకునే శక్తి ఈ లోకానికి లేదు. కాబట్టి నీ థీసిస్లో నిజాయితీ కనుక ఉంటే నీవు చచ్చిపోయాక ఈ ప్రపంచం దానిని అర్థం చేసుకునేందుకు సిద్ధమయ్యాక అప్పుడు అది ఈ గ్రంథాలయం నుంచి మాయమై ప్రపంచంలో ఎక్కడో ఒక గొప్ప ఆలోచనాపరుడు తరచుగా వెళ్ళి చదువుకునే లైబ్రేరీలోకి చేరుకుంటుంది. అతడి ద్వారా ప్రపంచంలోకి తిరిగి చేరుకుంటుంది. నాసదీయ సూక్తంకానీ, నీ థీసిస్ కానీ ప్రమాదకరమైనవి కావు. కానీ ఈ ప్రపంచం యొక్క symbolic structure సిద్ధంగా లేనంత వరకు నాసదీయ సూక్తానికీ, నీ థీసీస్ కీ విలువ ఉండదు అప్పటిదాకా అవి ఈ ప్రపంచానికి ప్రమాదకరమైనవే ” అని చెప్పాడు. మేం డిస్కషన్ చేస్తుంటే భంతే మాత్రం ఫోన్ లో మాట్లాడుతూ లోపలికీ బయటకీ ఆదుర్దాగా తిరుగుతున్నాడు. అతడు లోపలికి వచ్చాక సిగ్నల్స్ సరిగ్గా లేక గట్టిగా మాట్లాడుతుంటే ఇద్దరం అటువైపు చూశాం. అతడు మాట్లాడేది గ్రీకు భాష అని నాకు అర్థమైంది. అతడు గ్రీకు భాషలో ఎవరికో ఈ గ్రంథాలయం అడ్రస్ చెబుతున్నాడు. చూస్తుంటే వీళ్ళిద్దరూ ఈ గ్రంథాలయానికి అంతకుముందే వచ్చి ఉన్నట్లు తోచింది. నాకెందుకో భయమనిపించింది. నా గురించి నాకంటే ఎక్కువగా ఇతరులకు తెలుసని అనిపించినప్పుడు కలిగే భయం వంటిదది.
ఇంతలో గ్రీకు లిటెరేఛర్ స్టూడెంట్ Stephen Leftaris లోపలికి వచ్చాడు. భంతే, స్టీఫెన్లు మంచి స్నేహితులు. స్టీఫెన్ కి ఈ గ్రంథాలయం ఎక్కడుందో తెలియదు కానీ భంతే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గ్రీసు దేశం నుండి వచ్చి దాదాపు నెల రోజులుగా ఇండియాలో మకాం వేశాడు. అతడు మా ముగ్గురి వైపు కనీసం కన్నెత్తైనా చూడకుండా వేగంగా సరాసరి గ్రీకు పుస్తకాల దగ్గరికి వెళ్ళి ఆ అల్మారాను, ఆ పుస్తకాలనూ చేతులతో తడుముతున్నాడు. ఒక పుస్తకం బయటకు తీశాడు. దాని మీద Τὸ Λόγιον τῆς Σκιᾶς అని గ్రీకు లో రాసి ఉంది. Oracle of the Shadow ² అని దాని అర్థం. ఇది ఒలింపిక్స్ విజేతలపై విస్తృతంగా రాసిన పిండారస్ అనే గ్రీకు కవి రాసిన అదృశ్య పుస్తకం. పిండారస్ రాసిన ఎన్నో పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒలంపిక్ విజేతల పై రాసిన రాతలే ప్రస్తుతం దొరుకుతున్నాయి. ఐతే ఈ Oracle of Shadows పుస్తకంలో పిండారస్ విజేతలవి కాకుండా పరాజితుల కథలు రాశాడు. ఈ లోకానికి విజేతలను కొలిచే సంస్కృతి ఉంది. కనుక ఈ లోకం పరాజితులను కూడా పట్టించుకునే రోజు వచ్చినప్పుడు ఈ పుస్తకం బయటకు వస్తుందనేది మూర్తి వాదన. అప్పటిదాకా ఇవటువంటి పుస్తకాలు ఈ గ్రంథాలయంలో తపస్సు చేస్తూ ఉండిపోతాయి. స్టీఫెన్ చాలా ఆదుర్దాగా ఆ పుస్తకం తిరగేశాడు. అతడి పొడుగాటి వేళ్ళు ముడి పెట్టిన కళ్ళు “Malanthios” అనే పేరు కోసం వెదుకుతున్నాయి. Malanthios, స్టీఫెన్ కి ఒకానొక వంశ పూర్వజుడు. ఒలంపిక్స్ లో చివరి రౌండ్ దాకా ఆడుతూ వచ్చి ఫైనల్ ఆటలో ఓడిపొయిన పరాజితుడు. అతడు ఓడిపోయాక అవమానం తట్టుకోలేక దేశం విడిచి వెళ్ళిపొయాడు. అతడి కథను అతడి ఆచూకీని పిండారస్ మహా కవి రాసి ఉంటాడని అతడి నమ్మకం. అందుకే ఆదుర్దా. అతడు మాకు చెప్పిన విషయం ఇది. కానీ, భంతే నన్ను పక్కకు పిలిచి స్టీఫెన్ సగం అబద్ధం- సగం నిజం చెబుతున్నాడని అసలు ఆ పుస్తకం ప్లేటో గుహలో ఉన్న నీడల గురించి రాసి ఉందనీ, నీడలకు ఏ అర్థం ఉండదు కానీ దానికి అర్థాన్ని కల్పించే భ్రమను గ్రీకు సాహిత్యం ఎన్నుకుందనీ, ఆ భ్రమ నేటికీ ఉండిపోయిందనీ చెబుతూ అసలు ఆ పుస్తకం అప్పటి గ్రీకు దేవతల పై ఒక దారుణమైన విమర్శనా గ్రంథమన గ్రీకు వంటి పౌరాణిక దేశంలో పరాజితులను గురించి రాయడమంటేనే సింబాలిక్ గా దైవ దూషణ కిందికే వస్తుందనీ, అందుకే దానిని గ్రీకు లో నిషేధించారనీ చెప్పాడు. పిండారస్ పుస్తకాలన్నీ నిషేధించబడ్డాయి. ఆ విధంగా పరాజితుడైన పిండారస్ గ్రీకును వదిలివేసి ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ భారతదేశంలో స్థాపించి తన రహస్య పుస్తకాలను తన నిషేధించబడిన పుస్తకాలను ఇక్కడ దాచాడనీ, అంతేకాకుండా దీనికి పుస్తకాలను రాతప్రతులనూ ఆకర్షించి దాచే మాంత్రిక శక్తిని కల్పించాడనీ చెప్పాడు. అతడు భారతదేశంలో పిండార్ నది ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడో లేక అతడు వచ్చాక ఈ నదిని ఆ పేరుతో పిలిచారో తెలియదు అని చెప్పాడు. నిజానికి స్టీఫెన్ ఏదో సత్యాన్ని అన్వేషిస్తున్నట్టులా అగుపించాడు అందరికీ. కానీ నాకు మాత్రం అతడి లోపల రగులుతున్న తన సంస్కృతి గాయాన్ని మాన్పించేందుకు ఒక నరేటివ్ కోసం వెదుకుతున్నాడనిపించింది. అతడు చారిత్రక నవలాకారుడిలా కనిపించాడు. ప్రతి నాగరికతలో కవులు సత్యం సత్యమని గగ్గోలు పెట్టి అన్వేషించి చివరికి పురాణాల్లో సత్యాన్ని దాచి పెడుతున్నామని చెప్పుకున్నారు. కానీ వారు చెప్పింది మాత్రమే సత్యమని అనడంతో ఇంకా ఎంతటి సత్యాన్ని శాశ్వతంగా మరుగున పడవేశారో ఎవరికీ తెలియదు.
“నాకెందుకో ఇదంతా నమ్మబుద్ధి కావడంలేదు. ఇదంతా మీ construction. ఇదొక పాడుబడిన పురాతన గ్రంథాలయం. మీరు దీని చుట్టూ ఒక అందమైన కథ అల్లుతున్నారు ..అంతే! Come on ..there is no purpose to all these books . Books must speak to the people పుస్తకాలు మన నిజతత్వాన్ని వెలికి తీసేలా ఉండాలి. మన నొప్పి బాధ గాయాలు….ఇవేవీ లేకుండా They carry no meaning at all” అని అరిచాను. నా చేతిలో ఉండే జర్మన్ realistic novelist జాన్ విక్టర్ హైడ్² పుస్తకం Recesses of unknown ని ఆ కోపంలో నేల మీద విసిరేశాను. అది నేల మీద పడి దుమ్ము ఒక్కోసారిగా లేచింది. నాలో అసహనం పాత గోడల్లోని పగుళ్ళలోంచి బయటకు వినిపించింది. నా పాత గోడలను చూస్తే నాకే భయమేసింది. వాళ్ళకిదంతా మామూలే అన్నట్టు నా కోపాన్ని అసహనాన్ని కూడా ఆ ముగ్గురు పెద్దగా పట్టించుకోలేదు.
“సాహిత్యం అనేది రాజకీయాలకంటే కూడా చాలా పెద్దది” Mr. ఆనంద్ అని నా వైపు చూస్తూ అన్నాడు మూర్తి. రాజకీయాలు ప్రభుత్వాలను నిర్మించాయి. సాహిత్యం సంస్కృతులను నాగరికతలను నిర్మించాయి. ఎంతటి వేదన ఎంతటి దుఃఖం నిండుకుని ఉంది మన ప్రపంచంలో. ఐతే ఈ దుఃఖాన్ని అందరికీ తెలపాలనే ఉద్దేశ్యంలో తలచుకుని తలచుకుని ఏడ్చారు కవులు. ఆ దుఃఖమే తమ భావజాలంగా మార్చుకోకపోతే ఈ ప్రపంచంలో ఇంత దుఃఖం ఉందని తెలిసేదెలా అనుకుని తల్లడిల్లిన వారున్నారు. దుఃఖం అందరికీ తెలియజెప్పినంత మాత్రాన ఈ ప్రపంచంలో దుఃఖం కనుమరుగు కాలేదు. కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో భరించలేనంత దుఃఖం ప్రిమో లెవీ రాశాడు కానీ అదంతా ఒక్క యుద్ధాన్ని ఆపిందా చెప్పు?. నీవు చెప్పే గాయాల పుస్తకాలు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. అక్కడి దారుణాలను ప్రత్యక్షంగా చూసి అనుభవించి బతికి భయటపడిన ప్రిమో లెవీ తన అనుభవాలను రాశాడు. నిజమే. కానీ concentration camp లలో దుఃఖాలు అనుభవించి అక్కడే చిక్కి శల్యమై చచ్చిపోయినవారు ఏమీ రాయలేదు అనుకున్నావా? వాళ్ళు ఆ చీకటిలో ఓ మూలకు కూర్చుని రాసిన తమ దుఃఖం తమ వేదన అదంతా ఎక్కడికి పోయింది? అదంతా కనుమరుగైపోయిందని ఈ ప్రపంచం భ్రమపడుతుంది. కానీ ఇదిగో ఆ రాతలన్నీ ఇక్కడే ఈ గ్రంథాలయంలో దాచబడి ఉన్నాయి. ఈ గ్రంథాలయం వాటిని లాగేసుకుంది. నీకు వెతుక్కునే ఓపిక ఉందా? Mr. Anand! ఈ ప్రపంచ దుర్మార్గాలలో బతికి బయటపడిన వారు మాత్రమే సత్యాన్ని నిర్మిస్తున్నారు. It’s the literature of the fittest. అంతే! చనిపోయిన వారికే గొంతుక వస్తే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది. సత్యాన్ని నిర్మించడానికి వారికి గొంతుకే లేదు. వారేమీ నిర్మించలేరు, ఆఖరికి సమాధులు కూడా బతికున్న వారేకదా నిర్మించేది!
ప్రిమో లెవీ రాసిన పుస్తకం చదివి ఎందరో కన్నీరు కార్చారు. కానీ ఒక్క యుద్ధమూ ఆగలేదు. అసలు అతని వేదనను పట్టించుకున్న ఒక్క దేశ నాయకుణ్ణి చూపించు! ఏ నియంత నైతిక అపరాధనా భావంతో గజగజా వణికిపోయాడో చెప్పు! ఈ రోజుకీ యుక్రెయిన్ లో, సిరియాలో, ఇరాన్ లో, పాలస్తీనాలో ఇంకా ఎన్నో చోట్ల పసిపిల్లలు బాంబుల మోతల్లో నేలరాలుతునే ఉన్నారు. అసలు ఈ ప్రపంచం ఇప్పటిదాకా రాయబడిన పుస్తకాలు చదివి ఏనాడైనా మారిందా? మనుషులు బాధా తప్త పుస్తకాలను తాము నిజంగా మారాలని కొత్త మానవుడిగా అవతరించాలని చదువుతున్నారా..లేక తమలోని guilt ని తగ్గించుకోవడానికి చదువుతున్నారా?…తామూ రెండు కన్నీటి బొట్లు ఈ atrocitiesకి ఆహుతిచ్చాము అనే తృప్తి తప్ప ప్రపంచాన్ని మార్చింది ఎప్పుడు? ఈ బాధాతప్త పుస్తకాలు వ్యక్తులతో కంట తడి పెట్టించడం ద్వారా తాము నైతికంగా ఉన్నతులమనే భావనను, తృప్తిని కలిగిస్తాయి తప్ప మనిషిని కార్యోన్ముఖుని చేయవు. దీనిని మనం moral catharsis అందామా? సాహిత్యం ప్రపంచాన్ని మార్చివేస్తుంది అని ఈ రోజుకీ మనం నమ్ముతున్నాం – అది ఎంత పచ్చి అబద్ధమో తెలిసినా కూడా..” ఆవేశంగా అరిచాడు మూర్తి.
ఈలోగా స్టీఫెన్, పరుగున వచ్చి మెకాలాంజీలో వేసిన
“లేడా & హంస” చిత్రపటాన్ని తీసుకువచ్చి…”ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్” అంటూ ఆనందంగా అరవడం మొదలు పెట్టాడు. ప్రపంచంలో ఈ చిత్రం JPEలుగా, పోస్టర్లుగా, కాఫీ ముగ్గుల మీద ముద్దలుగా రకరకాల కాపీలుగా దొరుకుతుంది కానీ ఒరిజినల్ దొరకదు. “తీవ్రమైన కామ వాంఛలను రెచ్చగొట్టేలా ఉందని 17 వ శతాబ్దంలో రాణి అన్నే ఆఫ్ ఆస్ట్రియా దానిని ధ్వంసం చేసినట్టు చరిత్రలో ఉంది. కానీ ఆ పెయింటింగ్ ఇక్కడ ప్రత్యక్షమైంది యూహూ..ఇది ఒరిజినల్” అంటూ పాట పాడటం గెంతులేయడం మొదలెట్టాడు. భంతే ఆ చిత్రపటాన్ని చూసి చీదరించుకున్నట్టు మొఖం పెట్టాడు. “అసలు ఏముంది ఈ చిత్రంలో!!?..జీయస్ దేవుడు హంస లాగా మారి లేడాని బలాత్కరించడం ఏరకమైన ప్రేమ అనిపించుకుంటుంది?. ఇది మనుషులపై దేవుళ్ళ బలాత్కారం. బలహీనులపై బలవంతుల బలాత్కారం .ఈ రోజుకీ మానవుల మస్తిష్కాలను దేవుళ్ళు, మార్కెట్లూ, మీడియా, కాపిటలిజం బలాత్కరిస్తూనే ఉన్నాయి” అని ఆగిపోయాడు. మళ్ళీ ఏదో గుర్తు తెచ్చుకున్నవాడిలా వణుకుతున్న గొంతుకతో భావోద్వేగంతో చెప్పాడు. ” మనిషికి ప్రేమ భావన ఒక abstract విషయం. అది పైకి కనబడినంత సింపుల్ గా ఉండదు. ఎంత సింపుల్ జీవితాలు జీవించే వారిలో ఐనా ప్రేమ భావన వచ్చేసరికి అది abstract గానే మారుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే కొద్దీ- మానసికంగా కావొచ్చు శారీరకంగా కావొచ్చు,- దూరమయ్యే కొద్దీ మరింత abstract గా మారుతుంది. అసలు ఆ ప్రేమించిన వ్యక్తి సడెన్ గా మాయమైపోతే, ఎక్కడున్నాడో తెలియకుండా అయిపోతే ఆ abstractness లో ఎన్ని రంగులు ఉంటాయో ఎవరైనా చూశారా…అది అనుభవిస్తేనే కదా తెలిసేది” అన్నాడు. అకస్మాత్తుగా భంతే ఎమోషనల్ ఎందుకయ్యడో అతడి బాధాతప్త జీవితాన్ని పరికిస్తే కానీ తెలియకపోవచ్చు. ప్రతి మనిషి మనసు లోతుల్లో దాగి ఉన్న గ్రంథాలయంలో రాసుకున్న విషయాలెన్నో ..కానీ ఈ సమాజంలో విపరీతంగా అణచివేయబడ్డవాడి లోతుల్లో ఉండే గ్రంథాలయం ఎంత పెద్దదో ఎవరూ ఊహించలేరు . విశ్రాంత అగ్రవర్ణాల వారు ప్రేమ భావనను abstract గా కవిత్వీకరించడం, నిమ్న వర్గాలవారు దానిని రియలిస్టిక్ కోణంలో కవిత్వీకరించడం సాహిత్యంలో తరచూ జరిగేదే. భంతే జీవితంలోనే ద్రోహం , మోసం, నిస్సహాయత వంటి కర్కషమైన వాస్తవిక జీవితం ముందు అతడు కోరుకునే abstractness అణచివేయబడి ఉంది.. ఉన్నత వర్గాల వారిలాగా అది అతడికి metaphysical luxury కాదు. ఐతే ఆస్ట్రియా రాణి చిత్రాన్ని తగలబెట్టిందంటే ఆమెకూ- ఆమెకనేకాదు మొత్తం మానవాళికీ , కామోద్రేకం అంటే భయం ఎందుకనో నాకు అర్థం కాలేదు. నగ్న చిత్రాలను, లైంగిక వాంఛలను తెలిపే శిల్పాలను, పోర్న్ వెబ్సైట్లను చూసి ప్రపంచం ఎప్పటికీ భయపడుతూనే ఉండిపోయింది. ఒక్క ఖజురహో దేవాలయం తప్ప ఏదీ చరిత్రలో నిలిచి పోలేదు. ఆస్ట్రియా రాణి ఆ చిత్ర పటాన్ని చూసింది అనేకంటే ఆ చిత్రపటమే ఆమెని చూసింది. చిత్ర పటమే ఆమెను ఆమెకు అద్దంలా గా చూపించింది. తనలో ఉన్న కోరికలను తనకే చూపించింది. అది ఆమెకి భరింపరాని విషయమౌతుంది. మనిషి తనలో తాను కోపాన్ని, వీరత్వాన్ని, రక్తదాహాన్ని, అధికారాన్ని, విద్వేషాన్నీ చూసుకుని దాని గురించి గొప్పగా చెప్పుకున్నాడు, కానీ కాముకతను మాత్రం నీచమైనదిగా భావించి తన లోపలే దాచుకున్నాడు. అది ఈ గ్రంథాలయంలో ప్రత్యక్షమైంది మెకలాంజీ గీసిన చిత్రం రూపంలో.
మేం నలుగురం ఒక టేబుల్ చుట్టూ అలసిపోయి కూర్చున్నాం. మనసులోకి పదే పదే తరచి చూసుకుంటే వచ్చే అలసట లాంటిదే అది. మూర్తి వెలిగించిన కాగడా నూనె లేక ఆరిపోయే దశకు చేరుకుంటున్నది. నాకెందుకో ఉక్కపోత లాగా అనిపించింది. లైబ్రరీ లోపలి పొరల్లో ప్రపంచానికి అవసరం లేని, అవసరం రాని ఇన్ని పుస్తకాలు ఇన్ని ఆలోచనలు మానవుని జంక్ డిఎన్ఎ లాగా పేరుకుపోయి ఉండటం చూసి మానవుని మనుగడ మీదే విసుగుదల కలిగి మనసంతా భారంగా మారిపోయింది. మానవుని unconscious mind అతడికే బట్టబయలైనప్పుడు ఆ పొరలన్నీ విడిపోయినప్పుడు మాటల్లో దొర్లే freudian slips వంటివి దొర్లుతున్నాయి. పైగా అదంతా మయంకరమైన కలలాగా తోచింది. ఈ ప్రపంచం సక్రమంగా పని చేయడానికి ఎన్నింటినో అణచి ఉంచాలనుకోవడం మనిషి పనితీరు ప్రపంచ పఫనితీరుకి భిన్నంగా లేకపోవడం చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్రపంచం సత్యాన్ని నిర్మించుకుంటుంది. ఏది ఎప్పుడు సత్యంగా బయటకు రావాలో అదే నిర్ణయించుకుంటుంది. భూమి అంతటికీ ఒక consciousness ఉంది. అది కేవలం ఒక భౌతిక పదార్థం కాదు. ఇదే సత్యమని మనం చెప్పుకుంటున్నదంతా ఒక tip of iceberg వంటిదే. ఒక చిన్న అట్టముక్క వంటిదే. లేదా మనలో ఉన్న ఒకానొక వ్యాధి యొక్క వ్యాధి లక్షణమే సత్యం. ఇపుడు ఈ హిమాలయ సానువుల్లో ఈ అంతర్ గ్రంథాలయంలో మా ముగ్గురి మధ్య జరిగినదంతా కథగా రాయమని నన్ను పురమాయించాడు మూర్తి. ఆ క్షణం నాకు లైబ్రరీ నుండి బయటకు పారిపోవాలి అనిపించింది. నా థీసీస్ లాగే నా కథ కూడా మాయమైపోతుందేమో! యుద్ధమూ – శాంతి, కర్కషత్వమూ – కరుణ రసమూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీలాగా పొంగి పొరలే సాహిత్య లోకంలోకి నేనెందుకు పోవాలనిపించింది! భంతే మౌనంగా నా వైపు చూసి final scripture నా చేతికి ఇచ్చి చదువుకోమని సైగ చేశాడు. స్టీఫెన్ నిద్ర తూలుతున్నట్టుగా కనిపించాడు. కాగడా ఏ క్షణమైనా ఆరిపోయేలా ఉంది. ఈ లోగా లైబ్రరీ గోడలు కదులడం మొదలైంది. పిండార్ నదిలో టెక్టోనిక్ ప్లేట్ ఏదో కదిలి ఉండిండాలి. ఈ గ్రంథాలయం భూమి మీదే కాదు భూమిలోపల కూడా నిలబడే శక్తి కలిగిలేదు. అంతటి ప్రమాదపు అంచులమీద దీని అస్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగించింది. భూకంపంలో ఎప్పుడైనా నాశనమయ్యే దుస్థితిలో ఉండి కూడా వేల యేళ్ళ నుండీ భూగర్భంలో నిలబడే ఉంది. ఇక్కడి భూకంపం కూడా ఒక స్వప్నం మాత్రమేననుకుంటా. అందరం బయటకు పరుగులు తీసేందుకు సిద్ధమయ్యాం. భూగర్భంలో ఉన్న గ్రంధాలయంలో టేబుల్ కింద దాక్కోవడం లో అర్థమే లేదనుకున్నాం. ఇప్పుడు కింద కాదు పైన భూమిమీద దాక్కోవాలి. పైకి పరిగెత్తాలి. నేను ఎలాగోలా పుస్తకాలు దాటుకుంటూ తోసుకుంటూ మొదట బయటికి వచ్చేశాను. మిగిలిన ముగ్గురినీ బయటకు రమ్మని అరుస్తుండగానే లైబ్రరీ నాముందే లోపలికి కూలిపోయినట్టు శబ్దం వచ్చింది. మనిషి పట్టేంత ఉన్న ఆ చిన్న ద్వారం కాస్తా మూసుకుని పోయింది. భూకంపం కూడా ఆగిపోయింది. వాళ్ళు ముగ్గురూ లోపలే ఉండిపోయారు. నిజానికి వాళ్ళు లోపల ఉండి పోవడానికే నిర్ణయం తీసుకుని మరీ వచ్చినట్టున్నారు. బహుశా ఈ లైబ్రరీని కాపాడటమే వారి ధ్యేయం అనుకుంటాను. ఈ కథ రాసి అందులో ఏదో ఒక కాల్పనికతను నిర్మాణం చేసి అదెక్కడో పబ్లిష్ అయ్యాక నాకు ఇక ఈ పిండారస్ గ్రంథాలయం లోపల ఉండిపోయే అర్హత ఏమాత్రం ఉంటుంది!? తాను ఏమీ రాయకుండా నన్ను మాత్రం రాయమని చెప్పిన మూర్తి చాలా తెలివి గలవాడనిపించింది. సాహిత్యం చేసే అసలు పని సాక్ష్యాన్ని సృష్టించడం. మూర్తి దాని ట్రాప్ లో పడేందుకు ఇష్టపడక నన్ను సాక్ష్యం గా నిలప దలుచుకున్నాడు. భంతే ఇచ్చిన Final scripture జాన్ లాక్ Tabula rasa వంటిది. మొత్తం ఖాళీ పేపర్లు తళతళ లాడుతున్నాయి. ఈ భూమి మీద మారణహోమాలు సృష్టించిన పవిత్ర గ్రంథాలకంటే ఈ ఖాళీ పేపర్ల పుస్తకం ఎంతో ఉన్నతంగా తోచింది. రచయితలు ప్రపంచం గురించి ఎంతో రాశారు. ఇంకా దానిని మార్చడమొక్కటే మిగిలిపోయింది.
Foot notes:
1.పరమహంస యోగానంద భక్తులైన నా స్పానిష్ – యుగోస్లేవియన్ తల్లిదండ్రులు నాకు యోగానంద అని పేరు పెట్టారు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ చేస్తున్న విద్యార్దిని.
2.దీనిని అమెరికన్ రచయిత అఫ్సర్ మొహమ్మద్ తెలుగు నేర్చుకుని తెలుగులోకి అనువదించారు. “నీడల దైవ వాక్కు” అమేజాన్ లో దొరుకుతుంది.
3. John Victor Hide – జర్మనీ నవలాకారుడిగా గొప్ప నవలలు రాశారు. Recesses of Unknown నవల ఆధారంగా తెలుగులో రాజమౌళి సినిమాగా తీశారు.








చాలా లోతైన ఆలోచనలు ఉన్న రచన ఇది. కథ నాకు పూర్తిగా పట్టుబడలేదు.బహుశా చాలా కొత్త అంశాలిందులో ఉండడం కావొచ్చు. లోపం నాదే కానీ రచయితది కాదు.
Thank you Sir