1
బహిష్కరణ
-సలీమ్ జ్యూబ్రాన్
సరిహద్దు గుండా సూర్యుడు నడుస్తాడు
తుపాకులు మౌనంగా ఉంటాయి
తుల్కరేం* లో స్కై లార్క్ పక్షి ఒకటి
ఉదయ గీతం పాడుతూ పాడుతూ
కీబూట్జ్** లో ఉన్న మిగతా పక్షి సముదాయం తో
రాత్రిభోజనం చేయడానికి ఎగిరి పోతుంది
గస్తీ తిరుగుతున్న సైనిక దళాన్ని
పట్టించుకోని ఒంటరి గాడిద ఒకటి
సరిహద్దు రేఖ మీద షికారు చేస్తుంది
కానీ నాకు మాత్రం
నా మాతృభూమి ,
బహిష్కరించబడిన నీ కొడుకు
నీ ఆకాశానికీ
నా కళ్ళకీ
నడుమ విస్తరించిన సరిహద్దు గోడలా
చూపును మసకబారుస్తాయి.
*తుల్కరేం వెస్ట్ బ్యాంక్ లో ఉన్న ఒక పాలస్తీనియన్ నగరం
**కీబూట్జ్: 100 నుండి 1000 మంది వరకు కలసి ఉండే జనావాసాలను కీబూట్జ్ అంటారు . ఇజ్రాయెల్ లో ఇలాంటివి 270 దాకా వున్నాయి.
2
అసాధ్యం
– తౌఫిక్ జయ్యాద్
మా విశ్వాసాల తళ తళ ల మెరుపును
హింసతో ధ్వంసం చేయడం కంటే
ఒక గొప్ప ఆశయం కోసం సాగుతున్న
మా యాత్ర లో ఒక్క అడుగునైనా
నియంత్రించడం కంటే
బహుశా …..
సూది లో నుండి ఏనుగును దూర్చడం
నక్షత్ర మండలం లో వేయించిన చేపను పట్టుకోవడం
సూర్యుడిని బయటకు నెట్టేయడం
గాలిని బంధించడం
మొసలితో మాట్లాడించడం
నీకు చాలా తేలిక కావచ్చు.
*
సలీమ్ జ్యూబ్రాన్ 1941 లో ఆల్ బుక్యా లో జన్మించారు . మూడు కవిత్వ సంపుటులు ప్రచురించారు . ఆమె చివరి కవిత్వ సంపుటి 30 ఏళ్ళ క్రితం ప్రచురించబడినప్పటికీ ఇవాళ్టి ఇజ్రాయెల్ , పాలస్తీనా యుద్ధం లో దాని ప్రాసంగికతను మనం చూడవచ్చు
తౌఫిక్ జయ్యాద్ పాలస్తీనియన్ పాపులర్ లిటరేచర్ లో ధిక్కార తాత్వికత కి పెట్టింది పేరు . ఏడు కవిత్వ సంపుటాలు ప్రచురించారు . ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ లో నాయకుడు పాలస్తీనియన్ అరబ్ మైనారిటీ కమ్యూనిటీ లో అతడిది పెద్ద పేరు.
*
Add comment