పార్ట్ టైమ్ పంతులు ఉద్యోగం

వంగూరి జీవిత కాలమ్-75

1975 మే నెలలో యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరిన నెలలోనే నా మొదటి కారు కొనుక్కోగలిగినా బతకడానికి ఆ జీతం సరిపోదు అని తెలిసి పోయింది. ఆశించని విధంగా మా ప్రొఫెసర్ హుస్సేన్ గారే ఇచ్చిన  సలహా మీద పక్కనే ఉన్న టెక్సస్ సదరన్ యూనివర్శిటీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో ఏమైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఉన్నాయా అని ఫోన్ చెయ్యగానే తెలుగు ఇంగ్లీషు లో మాట్లాడిన ఆయనని కలవడానికి కాస్త భయంగానూ, కాస్త కుతూహలంగానూ, మరి కాస్త ఆశ గానూ అక్కడకి వెళ్ళాను. ఆయన ఆఫీసుకి  వెళ్ళగానే పైన బోర్డ్ మీద “ప్రొఫెసర్. డి. ఏ. ఏ. ఎస్. ఎన్. రావు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ “ అని ఉంది.

ఆయన పూర్తి పేరు దువ్వూరి అనంత అచ్యుత సత్యనారాయణ రావు. అమెరికాలో నాకు పరిచయం అయిన మొట్టమొదటి “పెద్దాయన” ఆయనే!. 1975 లో అలా పరిచయం అయిన ఆయన గురించీ, ఆయనతో సుమారు మూడు దశాబ్దాల నా అనుబంధం గురించీ ముందే క్లుప్తంగా అయినా చెప్పడం నా ధర్మం. నారాయణ రావు గారు నవంబర్ 7, 1918 న అనకాపల్లి దగ్గర కశింకోట లో జన్మించారు. కశింకోటలో చదువుకుని మెట్రిక్యులేషన్ లో రాష్ట్రానికంతటికీ మొదటి స్థానం లో నిలిచారు.  ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో      B. Sc (1939), M. Sc (1940) చదువుతున్నప్పుడే ఆయన హేతువాదిగా, వామ పక్ష భావాలతో శ్రీశ్రీ గారి అభిమానిగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని విద్యార్ధి నాయకుడిగా ఎదిగారు. నేను కూడా 1961-62 లో ఆంధ్రా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివినప్పుడు పాత గోడల మీద ‘నారాయణ రావు జిందాబాద్” మొదలైన మాసిపోయిన రాతలు కనపడేవి. రావు గారు 1955 లో యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, ఆస్ట్రేలియా లో Ph. D చేశారు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ లోనూ, ఆంధ్రా యూనివర్శిటీలోనూ లెక్చరర్ గా పని చేశారు. ఎలా జరిగిందో తెలియదు కానీ 1957 లో ఆయన హ్యూస్టన్ లోని టెక్సస్ సదరన్ యూనివర్శిటీలో ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ నెలకొల్పడానికి నియమితులయ్యారు.

Houston Colored Junior College అని 1927 లో అమెరికాలో నల్ల వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యబడిన ఆ విద్యాలయం కాలక్రమేణా 1947-51 ప్రాంతాలకి Texas Southern University for Negros అనీ, ఆ తర్వాత రాజకీయ కారణాలకి అనుగుణంగా ఆ నీగ్రో అనే పదం తొలగించి టెక్సస్ సదరన్ యూనివర్శిటీ గానూ స్థిరపడింది. భార్య శారదాంబ గారు పసి వారైన ఇద్దరు కొడుకులు చార్వాక, అరుణ్ కాంత్, కుమార్తె నటా లతో హ్యూస్టన్ లో ఆ యూనివర్శిటీ లో చేరడానికి 1957 లో వచ్చిన నారాయణ రావు గారు టెక్సస్ రాష్త్రానికే కాక అమెరికా  దక్షిణాది అమెరికా రాష్ట్రాలకి వచ్చిన మొట్టమొదటి తెలుగు వారు..బహుశా మొదటి భారతీయులేనేమో కూడా!. మూడు సంవత్సరాల తర్వాత అప్పటి నియమాల ప్రకారం అమెరికా వదలి భారత దేశమో, మరొక దేశం నుంచో మాత్రమే గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చెయ్యాలి కాబట్టి ఆ ప్రయత్నం లో ఉండగా కెనడా లో అవకాశం వచ్చి అక్కడ రెండేళ్ళు  విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసి, అక్కడ నుంచి గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చేసి మళ్ళీ 1962 లో తిరిగి అదే టెక్సస్ సదరన్ యూనివర్శిటీలో ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ చైర్మన్ గా చేరి, 1984 లో పదవీ విరమణ చెశారు. హ్యూస్టన్ లో ఇండియా కల్చురల్ అసోసియేషన్, తెలుగు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకులలో ఒకరు గా విశిష్టమైన సేవలు అందించారు. మార్చ్ 2002 లో తన 84వ ఏట దేముడిని నమ్మని నారాయణ రావు గారు భీష్మ ఏకాదశి నాడు సునాయాస మరణం పొందారు, ఆ సమయంలో నేను ఇండియాలో ఉన్నాను. సుమారు 30 ఏళ్ల పాటు నాకు వందలాది సాహిత్య కార్యక్రమాలలో స్ఫూర్తి ప్రదాతగా, స్వీకారం చుట్టి ఆయన తన సహకారం అందించారు. ఆయా సందర్భాలు వచ్చినపుడు ఆయన పాత్ర వివరంగా ప్రస్తావిస్తాను.

నారాయణ రావు గారి భార్య శారదాంబ గారు 1974 లో ఇండియా వెళ్ళి హైదరాబాద్ నుంచి కాకినాడ కారులో వెడుతూ కారు ప్రమాదం లో మరణించారు. ఆ తర్వాత ఆయన ఇండియా లో ప్రకటనలు ఇచ్చి దవీందర్ కౌర్ ని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా 1996 లో మరణించారు. ఆయన కుమారులలో ఒకరు ప్రకటనల ద్వారానే ఒక కన్నడం అమ్మాయిని, మరొకతను ముందు ఒక ఆఫ్రికన్-అమెరికన్ అమ్మాయిని, విడాకుల తర్వాత తెలుగు అమ్మాయిని వివాహం చేసుకోగా కుమార్తె రెండవ వివాహం చేసుకుని ఐర్లండ్ లో ఒక పెద్ద కోట లో నివశిస్తున్న సంఘ సేవకురాలు. మూసలో ఇమడని వ్యక్తిగా, దేముడిని, కుల వ్యవస్థని, అశాస్త్రీయమైన విషయాలని నమ్మని ఆయన తన జీవితం లోనూ, పిల్లల పెంపకం లోనూ ఆచరించి చూపించారు అని చెప్పడానికే ఈ విషయాలు ప్రస్తావించాను. 1960 ల నుంచి శారదాంబ గారి మరణించిన 1974 దాకా వారి ఇల్లే హ్యూస్టన్ లో భారతీయులందరికీ పుట్టిల్లు. ఒక తెలుగు వారే కాదు….ఆ రోజుల్లో హ్యూస్టన్ వచ్చిన వారందరికీ ఆతిధ్యం ఇచ్చి, స్థిరపడడానికి ఏర్పాట్లు చేసి, పండగలకీ, పబ్బాలకీ వారిల్లే సాంస్కృతిక కేంద్రంగా ఉండేది.  తను నాస్తికుడే అయినా ‘నలుగురిలో నారాయణ రావు” లాగా భార్య శారదాంబ గారు చేసుకునే పూజాపునస్కారాలకి ఆయన అడ్డుచెప్ప లేదు సరి కదా ఆ రోజుల్లో హ్యూస్టన్ లో ఉండే భారతీయుల చేత వ్రతాలు చేయించినా ఆభ్యంతర పెట్ట లేదు.

నారాయణ రావు గారు మంచి కవి. వ్యాస కర్త. కథకుడు. 1940 ప్రాంతాలలో ఆయన రచనలు ‘ఆనంద వాణి’ మొదలైన అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి. 1983 లో పురాణం వారు మా ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయి, అవన్నీ 1988 లో ఆయన  ‘ఇంద్ర చాపం” అనే పేరిట పుస్తక రూపం లో ప్రచురించారు. తెలుగు నాట స్త్రీ స్వాతంత్ర్యం, సమాన హక్కుల మీద అధునాతన వ్యాసాలు వ్రాసిన రచయితలలో నారాయణ రావు గారు ప్రముఖులు. ఆయన వ్రాసిన “పరమాణువు” అనే శాస్త్రీయ గ్రంధానికి మద్రాసు యూనివర్శిటీ వారి ప్రధమ బహుమతి లభించింది. ఇండియాలో ఉన్నా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికాలో నివసిస్తున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని మాన లేదు.

ఇవేమీ తెలియని నేను 1975 మే నెలలో ఒకానొక రోజు టెక్సస్ సదరన్ యూనివర్శిటీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో  ఆయనని చూడగానే మన భారతీయుడే అని తెలియడం,  నా పేరు రాజు వంగూరి అని చెప్పగానే “తెలుగు వాడివేనా? అని ఆయన అడగడం…నేను బి. యే విద్యార్ధులకి ఫిజిక్స్ పాఠాలు చెప్పగలనో లేదో ఆయన నిర్ధారించుకుని నాకు ఆ సమ్మర్ సెమిస్టర్ మూడు నెలలూ పార్ట్ టైమ్ లెక్చరర్ గా ఉద్యోగం ఇవ్వడం టక టకా జరిగిపోయాయి. వారానికి రెండు గంటలు క్లాస్ ‘పీకడం’…మరొక రెండు గంటలు లేబొరేటరీ….గంటకి $15 జీతం. యథాప్రకారం సోషల్ సెక్యూరిటీ వగైరా కోతలు పోగా నెలకి సుమారు $200 ఆదాయం. ఇదీ నా పోస్ట్ డాక్టరల్ వేతనం కలిపితే నెలకి సుమారు 600 డాలర్లు …పరవా లేదు కాలం గడిపేద్దాం అనుకుని సంబర పడ్డాను. ఈ అదనపు ఉద్యోగానికి మా ప్రొఫెసర్ హుస్సేన్ అనుమతి ఇవ్వడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

ఇక్కడ మరొక అనుకోని, ఊహించని అనుభవం గురించి చెప్పాలి.   యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో నేను పని చేసే టర్ బ్యులెన్స్ లేబొరేటరీ నుంచి ఈ టెక్సస్ సదరన్ యూనివర్శిటీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ సుమారు రెండు  మైళ్ళ దూరం. అంటే పావు గంటలో నడిచి వెళ్ళేటంత దూరమే.  కానీ అంత వరకూ నాకు ఎవరూ చెప్పనిదీ, నాకు తెలియనిదీ ఒక అమెరికా రహస్యం ఏమిటంటే ఇక్కడ అన్ని యూనివర్శిటీలూ కేంపస్ లోపల చాలా బాగా ఉంటాయి కానీ కేంపస్ బయట సాధారణంగా ‘ఘెటో’ వాతావరణం ఉంటుంది. అది ఎందుకో తెలియదు. ఘెటో అంటే బీద వారు అని మాత్రమే కాదు. క్రిమినల్ వ్యాపకాలలో ఉండే వారు ఎక్కువగా నివసించే ప్రదేశం. మన ఇండియాలో కూడా అన్నీ నగరాలలోనూ కొన్ని రౌడీ పేటలు ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది కదా!. సరిగ్గా ఇక్కడ ఈ రెండు యూనివర్శిటీల మధ్యా అలాంటి వాతావరణమే అని నాకు తెలియక కారు పెట్రోలు కలిసి వస్తుంది కదా అని నడిచి వెళ్ళడం మొదలు పెట్టాను.

మొదటి వారం ఏమీ జరగ లేదు కానీ రెండో వారం ఒక రోజు నడిచి వెనక్కి వస్తుంటే మిట్ట మధ్యాహ్నమే ….ఇద్దరు నల్ల వాళ్ళు నాకు అడ్డం తగిలి నా చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ లాక్కున్నారు. నేను గట్టిగా అరుస్తూ పెనుగులాడుతూ ఉండగా ఒకడు నా పేంట్ జేబు లో ఉన్న వాలెట్ పైకి లాగేసి. అందులో ఉన్న ఐదారు , డాలర్లు తీసుకుని ఇద్దరూ పారిపోయారు. ఇదంతా జరగడానికి ఐదు నిమిషాలు కూడా పట్ట లేదు. నేను అరుస్తున్నా రోడ్డు మీద ఉన్న అతి కొద్ది మందీ ఏమీ పట్టించుకో లేదు. వాళ్ళ దగ్గర కత్తులూ, తుపాకులూ లేక పోవడం వలన ఏదో కాళ్ళు, చేతులూ గీసుకు పోవడం తప్ప ఎక్కువగా దెబ్బలు తగలక పోవడం, అంత కన్నా ముఖ్యం నా గ్రీన్ కార్డూ, సోషల్ సెక్యూరిటీ కార్డూ, అప్పుడే సంపాదించుకున్న కారు డ్రైవర్ లైసెన్సూ, అన్నీ ఉన్న వాలెట్ ని వాళ్ళు దయతో అక్కడే విసిరెయ్యడం కేవలం నా అదృష్టం అనే చెప్పాలి. అమెరికాలో అదే నా మొదటి ‘మగ్గింగ్’. ఆ తర్వాత ఈ విషయం చెప్పగానే నారాయణ రావు గారు ఏకంగా కేంపస్ లోనే, తన ఆఫీసు లోనే తన మీద ఒక విద్యార్థి కత్తితో చేసిన హత్యా ప్రయత్నం, పక్కనే ఉన్న మరొక ప్రొఫెసర్ ఆ విద్యార్ధిని అదుపు లోకి తీసుకుని తనని రక్షించిన సంగతి చెప్పగానే నేను అవాక్కయి పోయాను. ఇంతకంటే ఘోరంగా మరొక సారి జరిగిన మగ్గింగ్ అనుభవం గురించి తర్వాత వ్రాస్తాను.

డబ్బు మాట ఎలా ఉన్నా ఈ ఒక్క మగ్గింగ్ సంఘటన తప్ప నేను టీ ఎస్ యూ లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పని చేసిన రెండు సెమిస్టర్లూ..అంటే 1975 మే నెల నుంచి డిసెంబర్ దాకా…నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. ఒక లెక్చరర్ గా అప్పటికే నేను బొంబాయి ఐఐటీ లో ఆ అనుభవాన్ని రుచి చూసి ఆనందించిన వాడినే!. కానీ ఇక్కడ విద్యార్ధులు అందరూ ఆఫ్రికన్ అమెరికన్లే అవడం, వాళ్ళలో అన్నీ వయసుల వాళ్ళూ ఉండడం, కొందరితో రాజకీయాలు, నల్ల-తెల్ల వారి మధ్య వివక్ష లాంటి అతి సున్నితమైన అంశాల గురించి చర్చలూ, ఏదో పాములు ఆడించే వాళ్ళు ఉండే దేశం. లేదా గాంధీ గారి దేశం అనే తప్ప భారత దేశం అంటే ఏ కోశానా తెలియని వారితో మన జాతి విషయాలు చెప్పడం..ఇలా నా అవగాహనా పరిధి చాలా విస్తృతం అయింది. వారిలో కొందరు “మమ్మల్ని తెల్ల వారు బానిసలు గా బలవంతాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ మీ అంతట మీరే మీ దేశాన్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని తరచూ అడిగిన ప్రశ్నకి నాకు ఇప్పటికీ సారి అయిన సమాధానం లేదు. ఆ నాటి నా విద్యార్ధులలో ఆఫ్రికన్ అమెరికన్ వారే కాక, ఆఫ్రికా దేశాలైన, నైజీరియా, ఉగాండా మొదలైన దేశాల నుంచి చదువుకోడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో విశాల దృక్పధాలు, సంకుచితమైన భావాలు, ఏమీ పట్టించుకోని వారు,…ఇలా ఎన్ని రకాల వారు ఉన్నా అందరూ చదువుకుని, డిగ్రీ తెచ్చుకుని జీవితంలో పైకి ఎదగాలి అనే ధ్యేయం ఉన్నవారే!. సాధారణ ఆఫ్రికన్ అమెరికన్ పౌరులతో నాకు కలిగిన ఈ సాన్నిహిత్యం వలన నాకు అమెరికా దేశం మీదా, ఇక్కడి వ్యవస్థ మీదా నా అవగాహనా పరిధి చాలా పెరిగింది. నల్ల వారంటే మనకి ఉండే మూస అభిప్రాయాలు వాస్తవాలకి ఎంత దూరమో స్పష్టంగా అర్ధం అయింది. అలాగే మెక్సికన్, చైనీస్ ల గురించి కూడా సరి అయిన అవగాహన కలిగే అవకాశం నా తర్వాతి ఉద్యోగం లో వచ్చింది. అది కూడా పార్ట్ టైమ్ పంతులు ఉద్యోగమే…మరొక కాలేజ్ లో..మరొక సబ్జెక్ట్ లో….ఆ విశేషాలు త్వరలోనే…

*

వంగూరి చిట్టెన్ రాజు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇన్ని విశేషాలతో ఇంత కొంచెమే వ్రాయటం ఏమీ బాగా లేదు. ఇంకో నెలదాకా ఆగాలంటే కష్టం. అప్పటి పరిస్థితులు చాలా బాగా వ్రాస్తున్నారు. నిజమే, మీ విద్యార్థులు అడిగినట్లుగా ఎందుకు మన దేశం వదిలి వచ్చాము అనిపిస్తుంది.

    • మీ స్పందనకి ధన్యవాదాలు. ఇలాంటి నెలవారీ ధారావాహికలలో ఎంత రాస్తే ఎక్కువో, తక్కువో అంచనా వెయ్యడం కష్టం కదా…అందుకే సంఘటనలని నెల వారీ టాపిక్ లా రాస్తున్నాను.

  • ఎందుకు అమెరికా అనేదానికి సమాధానం: ఓ స్నేహితుడు చెప్పినది – మొదట్లో స్కూల్లో బాగా చదువుకోవడం – తర్వాత పై ఊర్లో ఇంటర్మీడియేట్. అక్కడ తెల్సుకున్న విషయాల ప్రకారం ఐ ఐ టి. అక్కడ నేర్చుకున్న దాని ప్రకారం టోఫెల్ జి ఆర్ యి. ఆ తర్వాత విమానం ఎక్కుట, ఓ సారి ఇక్కడకి రాగానే మిగతావి …. ఆకాసాత్పతితం తోయం యధాగఛ్ఛతి సాగరం… అన్నట్టూ జరుగుతాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు