పారశీక అఖాతంలో చిక్కుపడిన లంగరు

ఖొమేనీ పూర్వీకులు (నేటి ఉత్తర్ ప్రదేశ్‌లోని) అవధ్‌లో స్థిరపడ్డ పారసీకులనీ, అతని తాత, లక్నో నివాసి అయిన ‘అహ్మద్ హిందీ’, బ్రిటిష్ ప్రాబల్యం నానాటికీ పెరిగిపోతూ ఉండడంతో, సహించలేక, 1830లో తిరిగి పర్షియా వెళ్లిపోయాడనీ, అప్పుడు నాకు తెలియదు.

ఫీసర్లు, సహాయక సిబ్బంది (క్రూ) గుంపుగా ఎయిర్ ఇండియా విమానంలో తెల్లవారుఝామున, డిసెంబరు చలిలో టెహరాన్ చేరుకున్నాం. టెర్మినల్‌లో అడుగు పెట్టడంతోనే ఇరాన్ రాజు షా, అతడి రాణీల నిలువెత్తు ఫొటోలు ఎదురయ్యాయి. బయలుదేరే ముందు బొంబాయిలో కొన్న ఉన్ని దుస్తులు, కోటు అక్కరకు వచ్చాయి. ఈ విధంగా గుంపుగా వెళ్లి షిప్పులో జాయిన్ అయేటప్పుడు ఆ బృంద సభ్యుల మధ్య ఒక అదనపు అనుబంధం ఏర్పడుతుంది. మా విషయంలో కూడా అదే జరిగింది. అఫీసర్లు వివిధ రాష్ట్రాలవారు; డెక్, ఇంజిన్  క్రూ సభ్యులు గుజరాతీలు; సెలూన్ క్రూ (వంటవాళ్లు, స్టూవర్డ్‌లు) గోవన్లు. మాది ఇండియన్ షిప్ గనుక వేరే దేశస్థులు ఉండే అవకాశం లేదు. మా బృందం టెహరాన్ విమానాశ్రయం నుండి బయలుదేరి, 900 కి.మీ. దక్షిణాన ఉన్న అబదాన్‌ పట్టణానికి వెళ్లేందుకై, మా కంపెనీ వారి స్థానిక ఏజెంటు బస్సు ఏర్పాటు చేశాడు.

దారిలో కోమ్ పవిత్ర నగరాన్ని (Holy City of Qom) దాటుతున్నప్పుడు, పారశీకుల ప్రధాన పుణ్యస్థలాలో ఒకటైన ‘ఫాతిమా మాసూమె’ దర్గాపై నిర్మించిన పెద్ద నీలంరంగు బురుజు దూరంగా, ఉదయపుటెండలో మెరుస్తూ కనిపించింది. దాని ప్రాశస్త్యాన్ని మాతో బస్సులో వచ్చిన ఏజెంటు వచ్చీరాని ఇంగ్లీషులో వివరిస్తూ, “మాసూమ్ అంటే అమాయకత్వం,” అన్నాడు. అది ఉర్దూలోకి వచ్చిచేరిందన్న మాట! పర్షియాకీ మనదేశానికీ ఉన్న చారిత్రక, సాంస్కృతిక, నౌకాయాన సంబంధాలు శతాబ్దాల నాటివి. తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లోనూ పారసీక పదాలు ప్రవేశించాయి. అప్పటికే మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్న ఫార్సీ, మొఘలుల పాలనలో రాజభాషగా అవతరించింది. ఒక దశలో ఫార్సీ వ్రాయగలిగే వారి సంఖ్య పర్షియా (ఇరాన్)లో కన్నా భారతదేశంలోనే ఎక్కువగా ఉండేది అంటారు.

పారశీక అఖాతం_వీకీపీడియా

పగలంతా ప్రయాణించినప్పటికీ ఎక్కడా ఆగలేదు – భోజనాలకి తప్ప. ఆగిన ప్రతీ చోటా – తండూరీ రోటీ, కబాబ్‌లు, తాజా కూరలతో సలాడ్‌లూ, పళ్లూ ఇవీ మా భోజనం. అడక్కపోయినా పాలు కలపని వేడి టీ నీళ్లు ఇచ్చారుగానీ, ‘ఇరానీ చాయ్’ మాకు ఆ దారిలో దొరకలేదు! ఫ్లయిట్‌లో నిద్ర సరిగ్గా లేకపోయినా బస్సు ప్రయాణం అలసట అనిపించలేదు. ‘భలేగా ఉన్నాయే, వీళ్ల రోడ్లు!’ అనుకున్నాను; అప్పటికి మనకింకా హైవేలు లేవు.

అబదాన్‌కి సమీపంలో, ఖొర్రంశహర్ (‘ఖొర్రంపట్నం’ అన్నమాట)లో ఆగినప్పుడు, సీనియర్ల సూచన మేరకు వెంట తెచ్చుకున్న డాలర్లను, ఇరానియన్ కరెన్సీలోకి మార్చాను. మెరుపు తీగెలవంటి బ్యాంకు ఉద్యోగినులు, పొట్టి జుత్తుతో, లిప్‌స్టిక్కులతో, మినీస్కర్టులలో కనులవిందు చేశారు. (నా వయసు 21 అని సహృదయులైన పాఠకులు గుర్తుచేసుకోగలరు).

ఒకవైపు కమ్యూనిస్టుల్నీ, మరోవైపు మతశక్తుల్నీ నిలువ రించే ప్రయత్నంలో, ఆధునీకరణ పేరిట, పైపూత సంస్కరణలను అమలుచేస్తూన్న అమెరికా ఏజెంటు షా పాలన నడుస్తున్నది. మరో నాలుగేళ్ల తరువాత, అంటే 1979లో, అయతోల్లా ఖొమేనీ నాయకత్వంలో, పూర్తిస్థాయి మత రాజ్యంగా ఇరాన్ అవతరించింది. చక్కని ఇరానియన్ చుక్కల్ని బురఖాలు మాయం చేశాయి.

ఖొమేనీ పూర్వీకులు (నేటి ఉత్తర్ ప్రదేశ్‌లోని) అవధ్‌లో స్థిరపడ్డ పారసీకులనీ, అతని తాత, లక్నో నివాసి అయిన ‘అహ్మద్ హిందీ’, బ్రిటిష్ ప్రాబల్యం నానాటికీ పెరిగిపోతూ ఉండడంతో, సహించలేక, 1830లో తిరిగి పర్షియా వెళ్లిపోయాడనీ, అప్పుడు నాకు తెలియదు.

***

పెర్షియన్ అఖాతంలో, ‘ఖోర్-అల్-అమాయా’ ఏంఖరేజ్‌లో ఉన్న మా టేంకర్‌ని చేరుకొనేందుకు ఖొర్రంశహర్ వద్ద లాంచీ ఎక్కాం. చిన్న నది గుండా ప్రయాణం.

“ఈ నది పేరు తెలుసా?” అని మా ఎలెక్ట్రికల్ ఆఫీసర్ క్రిష్ణన్ అడిగాడు.

అతడు నేవీలో చాలా కాలం పనిచేసి వచ్చాడు. సగం నెరిసిన దట్టమైన గెడ్డం, గంభీరమైన మీసాలు. చైన్ స్మోకర్. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం. మళయాళీయేగాని, కొంచెం యాసతో తెలుగు మాట్లాడతాడు. అందుచేత మా ఇద్దరికీ బాగా కుదిరింది. అతన్ని ‘సర్’ అనవద్దని వారించాడు కూడాను.

“లేదండీ, తెలియదు,” అన్నాను.

“యూఫ్రటిస్-టైగ్రిస్ నదుల గురించి వినే ఉంటావు. మనం నదికి దిగువగా, సముద్రంవైపు ప్రయాణిస్తున్నాం, అవునా? అంచేత కుడివైపు ఉన్నది ఇరాక్, ఎడమవైపున ఇరాన్,” అని మరో సిగరెట్టు వెలిగించాడు.

“అంటే!? మెసపొటేమియా నాగరికత…?” చిన్నప్పటి చరిత్ర పాఠాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి.

“ఆ, అదే. ఆ రెండు నదులూ కలిస్తేనే ఇది ఏర్పడింది. దీన్ని స్థానికులు ‘షత్-అల్-అరబ్’ అంటారు. అంటే ‘అరబ్బుల నది’. ఖొర్రంశహర్‌కి కాస్త ఎగువన బస్రా పట్టణం ఉంది – ఇరాక్‌లో. నువ్వు వినేఉంటావు,” అంటూ దమ్ము లాగాడు.

ఎందుకు వినలేదు? ‘సిందుబాదు కథలు’ చదివే కదా, మొదట సముద్రంవైపుగా నా దృష్టి మరలింది? ఆ తరువాత యూల్స్ వెర్న్ ‘సాగరగర్భంలో సాహస యాత్ర,’ థార్ హెయెర్డాల్ ‘కడలిమీద కోన్-టికి’ – ఇవే నన్ను ఓడలవైపు లాక్కొచ్చాయి! విశాఖ రేవులోకి వస్తూ పోతూ ఉండే ఓడలు నాలోని అన్వేషకుడిని తట్టిలేపాయి. నడక నేర్చుకోగానే సముద్రం వైపు పరుగుతీసిన పిల్ల తాబేలుని నేను.

ఆశ్చర్యం నిండిన కళ్లతో మళ్లీ ఆ నదిని చూశాను. పెద్ద నదేమీ కాదు. మనం వాగు అంటాం, ఇంకాస్త పెద్దది; గంగా, బ్రహ్మపుత్ర, గోదావరిలతో పోలిస్తే ఖచ్చితంగా వాగే. రెండు వైపులా స్త్రీలు బట్టలు ఉతుకుతూ కనిపించారు. కాస్త బిగ్గరగా మాట్లాడితే అవతలి ఒడ్డుకు వినిపిస్తుంది. ఆవిధంగా కొందరు సంభాషిస్తున్నారు కూడాను.

“నేనింకా మన గోదావరిలా ఉంటుందేమో అనుకున్నాను.”

“ఈ ఎడారిలో ఒక నది ఉండడం, అది నిత్యం ప్రవహిస్తూండడం – అదే అపురూపం. అవిగో, ఆ చెట్లను చూశావా?” అంటూ చెట్ల తోపులను చూపించాడు, క్రిష్ణన్ సాబ్. ఈత చెట్లలా ఉన్నాయి.

“ఇంతకు ముందు నువ్వు వాటిని చూసి ఉండవు. అవి ఖర్జూరపు చెట్లు.”

ఇరాన్-ఇరాక్‌ల మధ్య భీకరమైన యుద్ధం (1980-1988) జరిగినప్పుడు, ఆ నదిలోనే ఎన్నో పడవలూ, లాంచీలు, నదీముఖం వద్ద పెద్దపెద్ద ఓడలూ మునిగిపోయాయి. ఖొర్రంశహర్ పట్టణం సర్వనాశనం అయింది. అబాదాన్ ఆయిల్ రెఫైనరీ బాగా దెబ్బతిన్నది.

సముద్రం సమీపిస్తూన్నకొద్దీ నది మరింత వెడల్పుగా మారింది. లాంచీ ఊగిసలాట బాగా ఎక్కువైంది. ఎటు చూసినా లంగరు దించిన ఓడలు! చిన్న పెద్దా, వందల సంఖ్యలో ఉంటాయేమో?! ప్రాచీనకాలపు తెరచాప ఓడలు కనిపించాయి. అవి మహరాష్ట్ర, గుజరాత్‌లతో వాణిజ్యానికై నేటికీ వినియోగంలో ఉన్నాయి. వాటిని ‘అరబ్ ధౌవ్’లు అంటారు. గంటకుపైగా సముద్రంలో ప్రయాణించి, మా ఓడను చేరుకున్నాం. కడుపులో వికారం. వాంతి అవుతుందేమోనని భయపడ్డాను; కాలేదు. సీనియర్‌ల ముందు పరువు దక్కింది.

మేము షిప్పులోకి అడుగుపెట్టేసరికి సూర్యాస్తమయం అయిపోయింది.

“ఈ ఏజెంటు మహా ఘటికుడు; చీకటి పడేలోగా తీసుకొచ్చి షిప్పులో పడేశాడు – హోటల్ ఖర్చు లేకుండా,” అన్నాడు క్రిష్ణన్, గెడ్డం నిమురుకుంటూ. ఒక రాత్రయినా హోటల్లో రెస్టు తీసుకోవచ్చని ఆశించాడతడు, పాపం.

***

మా సూట్‌కేసులన్నిటినీ డెరిక్‌తో పైకెత్తి, మెయిన్ డెక్‌మీద పేర్చారు, క్రూ. ఎవరి బ్యాగులు వాళ్లు తీసుకొని మా క్యాబిన్‌లలోకి వెళ్లాం. నాకు నిద్ర ముంచుకొస్తోంది.

ఫోర్త్ ఇంజినీరు, “బాయిలర్ సూట్‌లోకి మారి, సెకండ్‌సాబ్‌కి రిపోర్ట్ చెయ్యి,” అన్నాడు.

‘చచ్చాం!’ అనుకుంటూ అతను చెప్పినట్టే చేశాను.

సెకండ్ సాబ్, “ఇవాళ్టినుంచీ నీకు నైట్ డ్యూటీ. పొద్దున్న ఆరు వరకూ. త్వరగా ఏదో తిని క్రిందికి, ఇంజిన్ రూంకి వెళ్లు. తినడానికి బాయలర్ సూట్‌లో డ్యూటీ మెస్‌కి వెళ్లు; సెలూన్‌కి వెళ్లినప్పుడు మాత్రం యూనిఫాంలో ఉండితీరాలి. గుర్తుపెట్టుకో. బిల్జ్ లైన్ ట్రేస్ చేసి నాకు పొద్దున్నకల్లా చూపించు. సీనియర్ ఫిఫ్త్ ఇంజినీర్‌ని అడిగి, లాగ్‌బుక్ రాయడం, జెనరేటర్లు స్టార్ట్ చెయ్యడం నేర్చుకో. స్టార్టింగ్ పొసీజర్ చార్‌సాబ్ (ఫోర్త్ ఇంజినీర్)కి చూపించు, రేపు బ్రేక్‌ఫాస్ట్ టైములో. ఇక దయచెయ్యి,” అన్నాడు, బీరు క్యాన్ తెరుస్తూ. అతని ప్రక్కనే చిరునవ్వులొలికిస్తూ చార్‌సాబ్, తీన్‌సాబ్‌లిద్దరూ కూర్చొని ఉన్నారు, తమ బీరు క్యాన్‌లతో.

“ఎస్సార్!”

“ఇంకో విషయం! రాత్రి ఏ వేళప్పుడైనా – ఏదైనా అవసరం పడినా, అలాం మ్రోగినా చార్‌సాబ్‌కి ఫోన్‌చెయ్యి! ఏం చెప్పాను? చెప్పినవన్నీరిపీట్ చెయ్యి!”

చేశాను. సెకండ్ ఇంజినీరు మొహం విసుగ్గాపెట్టి, “అలారం కాదు, అలాం! మరో విషయం – ఎస్సార్ కాదు, యెస్, సర్! అనాలి, లుక్ షార్ప్!” అన్నాడు.

“యెస్, సర్!”

అలా మొదలైంది రోజుకి పన్నెండుగంటల డ్యూటీ. మొదట్లో నైట్ డ్యూటీయే, సాయంత్రం ఆరు నుండి పొద్దున్న ఆరువరకూ. పగలు పన్నెండు గంటలు సీనియర్ ఫిఫ్త్ ఇంజినీర్ డ్యూటీ చేస్తాడు. ఇంజిన్ రూములో రాత్రంతా ఒక్కడినీ బిక్కుబిక్కు మంటూ. జెనరేటర్ నడుస్తూ ఉంటుంది. అవసరమయితే మరో జెనరేటర్ స్టార్ట్ చెయ్యాలి. మైంటెనెన్సు సంబంధించిన కొన్ని పనులూ, ఏర్పాట్లూ చెయ్యాలి. అరగంటకొకసారైనా ఇంజిన్‌రూమంతా కలియతిరగాలి. లీకేజిలు, అగ్నిప్రమాదావకాశాలు లేవని నిర్ధారణ చేసుకోవాలి. లాగ్‌బుక్ నింపాలి.  డ్యూటీ ఆయిల్‌మేన్ తోడుంటాడు. టీ చేసిపెడతాడు. తాజా ‘గ్యాలీ న్యూస్’ అందజేస్తారు. షిప్పులో చెలరేగే పుకార్లను ‘గ్యాలీ న్యూస్’ అంటారు. ఇంకా ఎన్నాళ్లు ఏంఖరేజ్‌లో ఉంటాం అనే అంశం మీద రకరకాల వదంతులు, వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆయిల్‌మేన్‌లతో మాట్లాడి నా హిందీ మెరుగుపడింది.

ఒకసారి షిప్పులో జాయిన్ అయ్యాక, మళ్లీ ఒక్కరోజు కూడా సెలవంటూ ఉండదనీ, ప్రతీరోజూ పనే అనీ, రోజువారీ డ్యూటీ గంటల తరువాత ఎప్పుడు సీనియర్లు పిలిస్తే అప్పుడు ఇంజిన్‌రూములో హాజరవాలనీ నాకు తెలుసు. ఆదివారాలు, దీపావళి, ఈద్, క్రిస్మస్ అన్నీ మర్చిపోవాల్సిందే కానీ నెలల తరబడి, ఏకబిగిన నైట్ డ్యూటీ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు.

ఎనిమిది గల్ఫ్ దేశాల ఉమ్మడి సముద్ర ద్వారం, పారశీక అఖాతం (ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కటార్, బహరైన్, ఒమాన్). అందుచేత అది శతాబ్దాలుగా ఓడల రాకపోకలకు సాక్ష్యంగా నిలిచిన జలమార్గం. భారత దేశానికి సముద్రమార్గాన్ని ‘కనుగొన్న’ వాస్కో-డ-గామా, ఆఫ్రికా ఖండాన్ని దాటాక ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఒమాన్ నివాసి, అరబ్బు నావికుడైన అహ్మద్ ఇబన్ మజిద్ అతనికి దారి చూపాడంటారు. ఆ నావికుడు కంజి మలాం అనే గుజరాతీ అని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, స్థానిక నావికుల సహాయం లేకుండా వాస్కో-డ-గామా కేరళ తీరంపై అడుగు పెట్టలేకపోయేవాడనేది సత్యం.

కొన్ని వందల ఇతర ఓడల మాదిరిగానే మా ఓడ కూడా నెలల తరబడి ఏంఖరేజ్ (లంగరు దించే ప్రదేశం)లో ఇరుక్కుపోవడానికి గల్ఫ్‌ దేశాల్లోని ఆనాటి పరిస్థితులే కారణం. 1973లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే అరబ్ దేశాలన్నీ ఐక్యంగా, ఒక నిర్ణయం తీసుకున్నాయి. అంతకు ముందు ఏడాది జరిగిన (యామ్ కిప్పూర్) యుద్ధంలో ఇజ్రాయిల్‌కి మద్దతునిచ్చిన (అమెరికాతో సహా) అన్ని పశ్చిమదేశాలకూ ఎగుమతుల్ని నిలిపివేశాయి. క్రూడ్ ధరను నాలుగైదు రెట్లు పెంచేశాయి (బ్యారెల్‌కి మూడు నుండి పన్నెండు డాలర్లకు). దీన్నే, ‘1973 ఆయిల్ సంక్షోభం’ అంటారు. గల్ఫ్ దేశాలవద్ద అపారమైన సంపద పోగుపడిందిగానీ, వారి సాంకేతిక నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రేవులు ఆధునీకరణ చెందలేదు. 1967లో ఇజ్రాయిల్-ఈజిప్టుల మధ్య జరిగిన యుద్ధంలో సైనాయ్ ఎడారిని ఇజ్రాయిల్ ఆక్రమించింది; దానికి ఆనుకొని ఉన్న సూయెజ్ కెనాల్ మూతబడింది. ఎనిమిదేళ్ల తరువాత తిరిగి 1975లో దాన్ని తెరిచారు. గల్ఫ్‌లో వాణిజ్య ఓడల రద్దీకి ఇదికూడా ఒక కారణం.

పోగుపడ్డ డాలర్లతో దిగుమతులకై గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు చేసాయిగానీ రేవులలో సదుపాయాలు చాలక ఓడలన్నీ నెలల తరబడి లంగరువేసి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇది ఓడల యజమానులకు పండగే. ఆలస్యం అయిన ప్రతీ రోజుకీ దిగుమతిదారులు వేలకొద్దీ డాలర్లు కుమ్మరించుకోవాలి, ప్రతీ ఓడ యజమానికీ.

షత్-అల్-అరబ్-పై-ధౌవ్_ఎన్_సైక్లోపీడియా-బ్రిటానికా

యామ్ కిప్పూర్ యుద్ధం (1972) తరువాత, అమెరికా నాయకత్వం క్రింద పాశ్చాత్య దేశాలన్నీ ఏకమై, హడావుడిగా తమ వ్యూహాలను మార్చుకున్నాయి. ఆయిల్ ఉత్పత్తి, అమ్మకపు ధరలను నిర్ణయించే అధికారాన్ని కోరుకున్న సౌదీ అరేబియా రాజు ఫైజల్, 1975లో హత్య కావించబడ్డాడు. అంతకు ఇరవై ఏళ్ల క్రిందటే 1953లో, ఇరాన్ ఆయిల్ పరిశ్రమని జాతీయం చేసిన నేరానికి మహమ్మద్ మొసాడెఘ్‌ని పదవీచ్యుతుడిని చేసి, షాకి పట్టంకట్టాయి – అమెరికన్, బ్రిటిష్ ప్రభుత్వాలు. ఈ రెండు ఆపరేషన్ల వెనుకా సీ.ఐ.ఏ. హస్తం ఉందని ఒక బలమైన వాదన వినిపించింది. నాకీ ఙ్ఞానం, మళయాళీ అయిన క్రిష్ణన్ సాబ్ ప్రసాదించాడు. అతను సీ.పీ.ఎం.కి సానుభూతిపరుడని మాటల సందర్భంలో నాకు అర్థం అయింది. నంబూద్రిపాద్, ఏ.కే. గోపాలన్, సుందరయ్య – వీరిపట్ల అతనికి చాలా గౌరవం. నేను అతన్ని ‘గురూజీ’ అని సంబోధించడం మొదలుపెట్టాను. అతడు కూడా నన్ను శిష్యుడిలాగా చూసుకున్నాడు. ముఖ్యంగా, షిప్పులో ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. చదవమని తన పుస్తకాలు ఇచ్చాడు.

స్మోక్ రూమ్ (సాయంత్రం పూట ఆఫీసర్లు సేదతీరే హాలు; అక్కడ మ్యూజిక్ సిస్టమ్, సిగరెట్లు తాగేందుకు అనుమతి, పార్టీలు జరిగినప్పుడు బార్ ఏర్పాట్లు ఉంటాయి)లో జరిగే చర్చల మూలంగా కూడా నాకు అనేక విషయాలు తెలిశాయి. డే డ్యూటీకి మారాక నలుగురినీ కలిసే అవకాశాలు పెరిగాయి. అంతేకాదు, మా కంపెనీ వారు నెలానెలా పంపే ఇండియన్ మేగజీన్లతో బాటుగా టైమ్, న్యూస్‌వీక్ కూడా స్మోక్‌రూములో ఉండేవి. కుదిరినప్పుడల్లా కొత్త, పాత సంచికలను తిరగేస్తూ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి తెలుసుకున్నాను.

నాకొకటి అర్థం అయింది. ఆయిల్ అనేది గల్ఫ్ దేశాలకు వరంగా మొదలై, పాశ్చాత్య దేశాల కుట్రలకు కేంద్రంగా, చివరికి అక్కడి ప్రజలకు శాపంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా అక్కడి క్రూడ్ ఆయిల్, భూగర్భంలోంచి వెలువడుతూనే ఉంది; స్థానికుల రక్తం, వలస కార్మికుల చెమట, ఆ ఎడారి భూముల్లో ఇంకిపోతూనే ఉన్నవి.

***

ఆనాటి ఏంఖరేజ్‌లో, మా షిప్పులోని సీనియర్లతో సహా, ఎవరూ, ఎన్నడూ, కనీవినీ ఎరగని దృశ్యాలు మా కంటబడ్డాయి. మా ప్రక్కనే లంగరు దించిన ఒక ఓడ (బల్క్ కేరియర్) సిమెంటుతో వచ్చింది. గల్ఫ్‌లో నిర్మాణం పనులకై చాలా పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టిన రోజులవి. ఆ ఓడలోని సిమెంటుని అన్‌లోడ్ చెయ్యడానికి మూడు హెలికాప్టర్లను వినియోగించేవారు. తెల్లవారుతూనే అవి వంతులవారీగా వచ్చి, సిమెంటుని మోసుకొని, తీరం వైపు వెళ్లి, కాసేపట్లో తిరిగి వచ్చేవి. వాటి పైలట్లు, అదే ఏడాది ముగిసిన వియత్నాం యుద్ధంలో పనిచేసిన అనుభవఙ్ఞులైన అమెరికన్లని తెలిసింది. వాళ్లకెంతెంత జీతాలిచ్చేవారో భగవంతుడికే తెలియాలి! ఈ ప్రహసనం సూర్యాస్తమయం అయ్యేదాకా సాగేది. సగం సిమెంటు సముద్రంపాలు అవుతూండడం మాకు ఆశ్చర్యం కలిగించేది.

వందల ఓడల దీపాలతో రాత్రుళ్లు వెలిగిపోతూ, ఒక మహానగరపు నడిబొడ్డున ఉన్నామనే భావనను కలిగించేవి. పగలు గాలిపటాలు ఎగిరేవి. ఓడల మధ్య లైఫ్‌బోట్లు చక్కర్లు కొడుతూ కనిపించేవి. వీ.ఎచ్.ఎఫ్.లో మాట్లాడి, మాట్లాడి, ఆ చుట్టుపక్కల ఉన్న ఓడలవాళ్లంతా మా డెక్ ఆఫీసర్లకి స్నేహితులైపోయారు.

ఒక నెల్లాళ్లు గడిచాక అసలు సమస్యలు మొదలైపోయాయి. మా ఓడలో నీళ్లకి రేషన్ విధించారు. పళ్లూ, కూరలు, మాంసం, చేపలు మెనూలోంచి మాయం అయిపోయాయి. కొన్నిరోజులకు గుడ్లు అయిపోయాయి. బ్రెడ్ కూడా రెండు స్లైసులే. రోజూ ఉడికించిన కాబూలీ చనా, ఏదో ఒక పప్పు, అన్నం లేదా చపాతీలు – ఇవే మా భోజనం.

“ఈ బొంబాయి క్రూ మెతకవాళ్లు కాబట్టి సరిపోయిందిగానీ, ఇదే కలకత్తా క్రూ అయితే ఎప్పుడో సమ్మె జరిగేది; కంపెనీ కాళ్లబేరానికి వచ్చేది,” అన్నాడు క్రిష్ణన్.

షత్-అల్-అరబ్ దీ తీరాన ఖర్జూరపు చెట్లు_జెమిని

ముందుగా విస్కీ, బీరు అయిపోయాయి. మరికొన్ని రోజుల్లో సిగరెట్లు ఖతం. చెయిన్ స్మోకర్ క్రిష్ణన్ పడ్డ యాతన వర్ణనాతీతం. నాలుగురోజులు నరకం అనుభవించాక, క్రూని మంచి చేసుకొని బీడీ కట్టలు సంపాదించాడు. మొదట అతన్ని చూసి అంతా నవ్వారుగానీ, మా కేప్టన్, ఛీఫ్ ఇంజినీరుతో సహా చాలామంది, పబ్లిగ్గా బీడీలు తాగడం మొదలుపెట్టారు. అంతకు ముందల్లా ‘బెన్సన్ అండ్ హెడ్జెస్’, లేదా ‘స్టేట్ ఎక్స్‌ప్రెస్’ వంటి బ్రాండ్‌లు మాత్రమే తాగేవారు పాపం! ఆ దృశ్యం చూడాల్సిందే! రేజర్ బ్లేడ్‌లు లేక గెడ్డాలు పెంచడం ఫ్యాషన్‌గా మారింది. పొడుగు జుత్తు ఎలాగూ 1970లలో ఫ్యాషనే! స్నానం, బట్టలు ఉతుక్కోవడం వాయిదా పడ్డాయి. పెర్‌ఫ్యూమ్‌ల వాడకం పెరిగింది. పళ్లు తోముకోవడం ఉప్పుతోనే.

మా డెక్ ఆఫీసర్ల రేడియో స్నేహాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఒక పాకిస్తానీ షిప్ వాళ్లు నాలుగేసి బస్తాల ఉల్లిపాయలు, బంగాళ దుంపలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక షరతు – మా షిప్‌లో ఉన్న దిలీప్ కుమార్ సినీమా (‘నయా దౌర్’) చూపించాలి. మా వద్ద 16 మి.మీ. ప్రొజెక్టరూ, కొన్ని సినీమాలూ ఉండేవి. అన్న ప్రకారం వాళ్ల లైఫ్ బోట్‌లో వచ్చి మాతోబాటు సెలూన్‌లో లంచిచేసి, సినీమాచూసి ఆనందంగా వెళ్లారు. మాకు ఉల్లిపాయలు, బంగాళా దుంపలతో బాటు బోనస్‌గా కోడిగుడ్లు దక్కాయి! అయితే భోజనాలు అవుతూండగా పాకిస్తానీ సెకండ్ ఆఫీసరు, ఇందిరా గాంధీపై తన కోపాన్ని వెళ్లగక్కాడు. ఆమె పాకిస్తాన్‌ని రెండు ముక్కలు చేసిందని అతడి ఆక్రోశం. మా కేప్టెన్ నవ్వి ఊరుకున్నాడుగానీ పాక్ ఛీఫ్ ఆఫీసర్, తన సహచరుడిని అడ్డుకొని, “మనం రాజకీయాలు చర్చించడానికి ఇక్కడికి రాలేదు,” అన్నాడు, కఠినంగా.

మరి కొన్ని రోజులయ్యాక ఒక బంగ్లాదేశ్ జనరల్ కార్గో షిప్‌తో మావాళ్లు మరో వస్తుమార్పిడికి ప్రయత్నాలు చేశారు. బాంగ్లా దేశీయులు బియ్యం, గోధుమపిండి, కొన్ని పప్పులూ ఇస్తామన్నారు. ‘మీవద్ద ఏమున్నాయి?’ అని అడిగారు. చాలాసేపు సంప్రదింపులు జరిగాక, మా వద్దనున్న ఫిలింఫేర్, స్టార్‌డస్ట్, ముఖ్యంగా ప్లేబాయ్, పెంట్‌హౌస్ మేగజీన్లు తీసుకోవడానికి అంగీకరించారు. మాకు ఇచ్చినవి వాళ్ల కార్గోలో ఉన్నవే గనక ఉదారంగానే ఇచ్చారు. అలా కొన్నాళ్లు గట్టెక్కించాం.

ఉత్తరాలు, ఇంటి సమాచారం ఎలాగూ లేవు. నేనేమైపోయానో అని మా ఇంట్లో బెంగ పెట్టుకున్నారని తరవాత తెలిసింది. నాన్నగారు కంపెనీవారికి టెలిగ్రాం ఇచ్చారట. ‘మీవాడు క్షేమంగా ఉన్నాడు,’ అని టెలిగ్రాం ద్వారానే జవాబు వచ్చిందట. మొదటి షిప్పులోనే ఇటువంటి చేదు అనుభవం ఎదురుకావడం నన్ను బాగా నిరుత్సాహపరచింది.

నా బిక్కమొహం చూసి, ఒకరోజు మా రాజ్‌పుత్ ఫోర్త్ ఇంజినీరు వర్మ, “నువ్వేమీ కంగారు పడకు; ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. నిత్యం సెయిల్ అవుతూనే ఉండే టేంకర్, ఈ విధంగా ఏంఖరేజ్‌లో చిక్కుకోవడం చాలా అరుదు. మరో రెండు వారాల్లో మనం పోర్టుకి వెళ్లాల్సిందే. మంచినీళ్లు అడుగంటిపోయాయి. జనరేటర్లకు కావాల్సిన డీజిల్ అయిపోతున్నది. బడాసాబ్ (ఛీఫ్ ఇంజినీర్) చెప్పాడు, త్వరలోనే పోర్టులోకి వెళ్తున్నాం. నిన్నొక మాట అడగాలి. ఇంకా ఎన్నాళ్లు నైట్ డ్యూటీలు చేస్తావు? పగటి డ్యూటీకి మార్చమని సెకండ్ సాబ్‌కి చెప్తాను. సీనియర్ ఫిఫ్త్ ఇంజినీర్ మహా గడుసు పిండం; ఇన్నాళ్లూ నిన్ను నైట్ డ్యూటీలోనే ఉంచేశాడు. నేనూ పట్టించుకోలేదు. పగలయితే మిగతా ఇంజినీర్లతో కలిసి పనిచేస్తూ, నేర్చుకొనే అవకాశం ఉంటుంది,” అన్నాడు. అన్నమాట మీద నిలబడ్డాడు.

ఆనాటితో నా రోజులు బాగుపడడం మొదలైంది. చార్‌సాబ్ వర్మ, జెనెరేటర్ ఒవరాల్ పనిలో బాధ్యతలు ఒప్పగించాడు. పనిలో ఉత్సాహం, సీనియర్ల మెచ్చుకోలు. అదనపు బాధ్యతలు.

ఎట్టకేలకు లంగరెత్తి అబదాన్ రిఫైనరీకి అనుబంధంగా ఉండే టేంకర్ టెర్మినల్‌కి రమ్మని మా ఓడకు ఆదేశం వచ్చింది.  చాన్నాళ్లుగా బబ్బున్న మెయిన్ ఇంజిన్‌ని మేల్కొలపడానికి ఎన్నో జాగ్రత్తలు పాటించాలి; ఏర్పాట్లు చెయ్యాలి. ఫోర్త్, థర్డ్ ఇంజినీర్లు అవన్నీ చేస్తూంటే వాళ్ల వెంట ఉండమని, నాకు కూడా కొన్ని పనులు నేర్పించారు. మా థర్డ్ ఇంజినీరు చక్రబొర్తి అని బెంగాలీవాడు. మంచి పనిమంతుడే గానీ కోపిష్టి. మొత్తానికి లంగరెత్తి ఓడ కదిలే రోజుకి ఇంజినీర్ల బృందంలో నేనూ ఒకడినయ్యాను. సమిష్టి కృషిలోని ఆనందం క్రమేపీ నా ఎరుకలోకి వచ్చింది.

ఇంజిన్ స్టార్ట్ కాగానే, మంచినీటి రేషనింగు ఎత్తివేస్తున్నామని పబ్లిక్ అడ్రెస్ సిస్టంలో ఛీఫ్ ఆఫీసర్ ప్రకటించాడు. ఆఫీసర్ల సెలూన్‌లో చప్పట్లు, కేరింతలు. క్రింద ఉండే క్రూ కేబిన్‌ల నుండి ఈలలు వినిపించాయి. షిప్పు రేవులోకి వెళ్తూంటే అందరి మొహాలూ వికసించాయి. ఇక కాసేపట్లో డీజిల్ సర్వీస్ టేంకులు ఖాళీ అయిపోతున్నాయనగా జెట్టీని చేరుకున్నాం. వెంటనే కార్గో లోడింగ్ మొదలైపోయింది. మా సరఫరాలకై అన్ని ఏర్పాట్లూ చేశాడు, మా ఏజెంటు. మంచి నీళ్లు, డీజిల్, హెవీ ఫ్యూయెల్, తాజా పళ్లూ, కూరలూ, బియ్యం, పప్పులూ, చేపలూ, మాంసం, పాలూ, గుడ్లూ, ఐస్‌క్రీములూ…సర్వం. ఛీఫ్ స్టూవర్డ్ ఆధ్వర్యంలో, డెక్ క్రూ సాయంతో, మా సెలూన్ క్రూ (కుక్‌లు, స్టూవర్డ్‌లూ) ఆ సరుకులన్నింటినీ మా స్టోర్స్‌లో, కోల్డ్‌స్టొరేజ్‌లో పేరుస్తూంటే అంతా గుమిగూడి, వాటిని చూస్తూ మురిసిపోయారు. బాండెడ్ స్టోర్‌లో విస్కీ, బీరు, సిగరెట్లు కూడా ఎట్టకేలకు మా ఓడ మీద అడుగుపెట్టాయి. అంతటా ఉత్సాహం, ఆశాభావం.

ఏజెంటు కట్టలకొద్దీ ఉత్తరాలు మోసుకొచ్చాడు. ఛీఫ్ ఆఫీసర్ వాటిని పంచుతూంటే అందరి ముఖాలూ విప్పారాయి. గడచిన నాలుగు నెలల ఆందోళనల్ని అంతా మర్చిపోయారు. నాకు అత్యధిక సంఖ్యలో ఉత్తరాలు వచ్చాయి. ఛీఫ్ ఆఫీసర్, ఛీఫ్ ఇంజినీరుకేసి తిరిగి,

“బడా సాబ్! మీ పాంచు (ఫిఫ్త్ ఇంజినీర్) కొత్త రికార్డు సృష్టించాడు. ఒక్కడికే ఇన్ని ఉత్తరాలు రావడం నా నేనెప్పుడూ చూడలేదు!” అన్నాడు.

నావికుల జీవితం సముద్రంతో ఎంతగా పెనవేసుకుపోయినా, నేలతల్లితో ఉండే బాంధవ్యమే వారి గుండెల్ని దిటవుపరుస్తుందని నాకు అర్థం అయింది.

*

ఉణుదుర్తి సుధాకర్

4 comments

Leave a Reply to Murty Linga Mandapaka Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సముద్ర ప్రయాణం గురించిన కథనం చారిత్రక విషయాలను గుర్తు చేస్తూ సాగింది.
    కథా కథనం చాలా బాగుంది. సింద్ బాద్ నావికుడి కథలు మరోసారి చదివినట్టనిపించింది. అభినందనలు.
    బి ఎస్ రాములు

  • సుధాకర్ గారి రచన ల్లో, చరిత్ర కి సంబంధించిన అంశాల తో కథనం ఆశక్తి గా సాగుతుంది.. చాలా బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు