పాపులర్ అపోహలకు ఇదే సమాధానం!

త్యరంజన్ అందరిలాంటి వాడు కాదు. బ్యాంకులో ఓ మూల క్యాష్ కేబిన్ లో కూచుని ఒకటి నుండి వంద వరకూ లెక్కేసుకుని ఇంటికెళిపోయే రకం కాదు. అతనిలో సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యం తన చుట్టూ ఉన్నవాళ్ళకెంతో ప్రేరణ కలిగిస్తాయి. సత్యరంజన్ ఇప్పటిదాకా ఎన్నో అనువాదాలు చేశాడు. స్వాతి చతుర్వేది ‘ఐ యామ్ ఏ ట్రోల్’   మార్తా హర్నేకర్ ‘ఐడియాస్ ఫర్ స్ట్రగుల్’ , క్రిస్టియానా లాంబ్ ‘ఐ యామ్ మలాలా ‘ వంటి పుస్తకాల అనువాదాల తో పాటు ప్రభాత్ పట్నాయక్, ఐజాజ్, రోమిల్లా థాపర్,హోవర్డ్ జిన్, నోమ్ చాంస్కి,జాన్ బెల్లమి ఫాస్టర్,మైకేల్ డి ఏట్స్, మైకేల్ లెబోవిట్జ్,ఇస్త్వాన్ మెస్జెరాస్ తదితరుల వ్యాసాలు సుమారు వందకు పైగా అనువాదం చేశారు. లేటెస్టుగా గ్యాబ్రియేల్ గార్షీయ మార్క్వేజ్ ‘ది జనరల్ ఇన్ హిస్ లాబరింత్’ ని ‘చరమ యాత్ర’ పేరుతో చేసిన అనువాదం అతనికి మరింత గుర్తింపునిచ్చింది.

సత్యరంజన్ తో శ్రీరామ్ చేసిన సంక్షిప్త సంభాషణ ఈ పక్షం ‘సారంగ’ కోసం ప్రత్యేకం.

— మార్క్వేజ్ ని తెలుగులోకి అనువాదం చేయాలని ఎందుకనిపించింది ? 

మార్క్వెజ్ పుస్తకం తెలుగులో తీసుకురావాలన్న అలోచన నాది కాదు. 2014-15 మధ్య కాలంలో ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ గుడిపూడి విజయ రావు గారు ఫోన్ చేసి  రాఘవులు గారు (సి పి ఎం పొలిట్ బ్యూరో సభ్యులు) మార్క్వెజ్ రాసిన పుస్తకం తెలుగులో తీసుకురావాలి అని చెప్పిన సంగతి నాతో అన్నారు.       ఆ పుస్తకం నేను అనువాదం  చేస్తే బాగుంటుంది అని చెప్పి, ది జనరల్ ఇన్ హిస్ లాబరింత్ పుస్తకం పంపారు.అంతకు ముందు నేను మార్క్వెజ్ సాహిత్యం గురించిన పరిచయ వ్యాసాలు తప్ప మార్క్వెజ్ రచనలు ఏవీ చదవలేదు.  మార్క్వెజ్ రాసిన ద జనరల్ ఇన్ హిస్ లాబరింత్ పుస్తకమే నేను చదివిన  తొలి పుస్తకం.దానినే సుమారు ఏడేళ్ల క్రితం తెలుగు చేసి ఇచ్చాను

– తెలుగులో మార్క్వెజ్ ప్రాసంగికతకి ఎలాంటి ప్రాధాన్యముందనుకుంటున్నారు ? మార్క్వెజ్ ఇతర రచనలేమన్నా తెలుగులోకి అనువాదం అయ్యాయా ?

ఆనాడు లాటిన్ అమెరికాలో నెలకొన్న పరిణామాలను రాజకీయేతర మాధ్యమం ద్వారా ప్రజలు అర్థం చేసుకోవడానికి  ఈ పుస్తకం తోడ్పడుతుందని   బి వి రాఘవులు భావించి ఉండవచ్చని నాకు అనిపించింది. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ బొలివేరియన్ రివల్యుషన్ అనే నినాదాన్ని బహుళ ప్రాచుర్యం లోకి తెచ్చాడు. దక్షిణాది అమెరికా దేశాల ఏకీకరణ సైమన్ బొలివర్ ఆకాంక్ష.స్పెయిన్ వలస పాలన నుండి దక్షిణాది అమెరికా దేశాలను విముక్తి చేసింది కూడా ఈ లక్ష్యం తోనే. ఆ లక్ష్యం నెరవేరి ఉంటే ఇవాళ ప్రపంచ భౌగోళిక రాజకీయాల తీరే వేరుగా ఉండేది. చే గువేరా బొలివర్ ఆశయాలకు అనుగుణంగా దక్షిణాది అమెరికా దేశాల్లో విప్లవం తీసుకురావాలని ఆకాక్షించి బొలీవియా వెళ్ళాడు.ఆ ప్రయత్నంలోనే హతమారిపోయాడు. చే తరువాత చావెజ్ బొలివర్ ఆశయ సాధన కోసం బొలీవియా, ఈక్వెడార్,క్యూబా,నికరాగువా దేశాలతో యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికా నేషన్స్ ఏర్పాటు చేశాడు.ప్రపంచ బ్యాంకు అప్పులు  ఇవ్వడానికి షరతుల పేరిట  పశ్చిమ దేశాల ప్రయోజనాలు ఈడేర్చడానికి కోసం పనిచేస్తుంది కాబట్టి వర్ధమాన దేశాలు మరీ ముఖ్యoగా లాటిన్ అమెరికా దేశాలు ఆ ఉచ్చులో పడకూడదని బ్యాంక్ ఆఫ్ సౌత్ ని ఏర్పాటు చేశాడు. యూరో కరెన్సీ మాదిరి లాటిన్ అమెరికా దేశాల మధ్య కూడా ఒకే కరెన్సీ చలామణిలోకి తెచ్చేదానికి గట్టి కృషి చేశాడు.యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికా నేషన్స్ లో మెక్సికో, చిలీ దేశాలను కూడా భాగస్వామ్యం చేశాడు.ఒక్క కొలంబియా మినహా లాటిన్ అమెరికా దేశాలన్ని సహకార సమాఖ్య దేశాలుగా ఏర్పడ్డాయి. వెనిజులా లో దేశీయంగా అనుసరించిన ప్రజానుకూల విధానాలతో పాటు     ఛావేజ్ అనుసరించిన ఈ విదేశాంగ నీతి మూలంగా వెనిజులాను పశ్చిమ దేశాల మీడియా     ‘రోగ్ నేషన్’ గా ప్రచారం చేసింది.ఇప్పుడు శ్రీలంక మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారం లాంటిదే అప్పట్లో వెనిజులా మీద కూడా సాగింది. యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ఒకప్పటి పాపులర్ రచయిత వెనిజులా దేశం మొదలారిపోయింది అని చెప్పినట్లు ఒక కేస్ స్టడీ ఇప్పటికీ వాట్సప్ ల్లో చక్కర్లు కొడుతుంది. ఈలాంటి నేపధ్యంలో ఈ పుస్తకం తెలుగులో రావడం ఉపయుక్తంగా ఉంటుందని భావించి నేను ఆ సాహసం చేశాను.

అయితే ఇది చాలా ఆలస్యంగా అచ్చులోకి వచ్చింది.  ఇందుకు గాను  పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారికి అభినందనలు.

మార్క్వేజ్   సాహిత్యేతర రచన ‘క్లాండ్స్టైన్ ఇన్ చిలీ’   ఇంతకు ముందు ఎన్ వేణుగోపాల్, సి వనజ తెలుగు చేసినట్లు, త్వరలో ఈ పుస్తకం పునర్ముద్రించనున్నట్లు ఫేస్ బుక్ లో పి మోహన్ రాశారు. హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ కూడా ఉమా నూతక్కి గారు అనువాదం పూర్తి చేసినట్లు తెలిసింది.

— ది జనరల్ ఇన్ హిస్ లాబరింత్ అనే టైటిల్ కి చరమ యాత్ర పేరు ఎంతవరకూ సమంజసమైనదిగా భావిస్తున్నారు.

జనరల్ అనే పదం లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాచర్యంలో ఉన్నతంగా, తెలుగు రాష్ట్రాల్లో లేదు.లాటిన్ అమెరికా దేశాలను అత్యధిక కాలం సైనిక నియంతలే పరిపాలించారు,కాబట్టి జనరల్ అనే పదం వారి  దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. కేవలం రెండు వందల మంది పటాలంతో స్పెయిన్ వలస పాలకులకు వ్యతిరేకంగా బొలివర్ చేసిన అసమాన పరాక్రమ యుద్ధ గాథను మార్క్వేజ్ ఈ నవలా వస్తువు గా ఎంచుకోలేదు.వెన్నుపోట్లు,మోసాలు, దిక్కారాలు,నయవంచనలతో ఒక మహత్తర విప్లవకారుడు అలసి సొలసి విసిగి వేసారి అంతు తెలియని వ్యాధిగ్రస్తుడై కొలంబియా లోని మాగ్ధలినా నదీ తీర రేవు పట్టణమైన బొగటా నుండి యూరప్ కు ప్రవాసం వెళ్ళే క్రమంలో మరణించిన వైనాన్ని నవలా వస్తువు గా ఎంచుకున్నాడు మార్క్వేజ్. మోర్ ఆర్ లెస్ ఇట్స్ లాస్ట్ జర్నీ ఆఫ్ ద జనరల్.అందుకే ఈ పుస్తకానికి చరమ యాత్ర అని పేరు సముచితంగా ఉంటుందని భావించాను. తెలుగులో వచ్చిన కథా సంపుటాలకు గానీ,కవిత్వ సంపుటాలకు గానీ నవలలకు గానీ ఆఖరుకు సినిమాలకు కూడా ఒకటి రెండు పదాలకు మించిన పేర్లు ఉండడం అది కూడా థీమ్ ను సూచన ప్రాయంగా తెలియచేసేదిగా ఉండడం సహజం.టామ్ నాయిర్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అని రాసిన పుస్తకాన్ని తెలుగు చేసిన శ్రీశ్రీ దానికి రెక్క విప్పిన రెవల్యూషన్ అని పేరు పెట్టాడు.1968 లో ఫ్రాన్స్ విద్యార్థుల పోరాటం దాని అణిచివేత లను టామ్ నాయిర్ అంతానికి ఒక  ఆరంభం  (ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్) ఎంత సముచితమో శ్రీశ్రీ పెట్టిన పేరు కూడా అంతే సముచితంగా అనిపిస్తుంది

— మీరిప్పటికీ చాలా అనువాదాలు చేశారు. వాటికీ మార్క్వేజ్ ని అనువాదం చేయడానికీ మధ్య గల వ్యత్యాసం ఏమిటి ?

నేను ప్రొఫెషనల్ అనువాదకుడిని కాను. అనువాద శాస్త్ర నియమ నిబంధనల మీద కూడా నాకు అంత పెద్దగా ఎరుక  లేదు.ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్లు గా పని చేసిన తెలకపల్లి రవి గారు, గుడిపూడి విజయ రావు, కె ఉషారాణి అలానే బి వి రాఘవులు,వి శ్రీనివాసరావు,వి కృష్ణయ్య – వీరు సమకాలీన రాజకీయ వాతావరణానికి అనువైన పుస్తకాలు ఎంపిక చేసి పంపితే నేను తెలుగు చేసి ఇస్తుంటాను.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం (యు పి ఎ 2) అమెరికాతో అణు ఒప్పందం మీద సంతకం చేసే ఆలోచనలో ఉన్నప్పుడు వి శ్రీనివాస రావు గారు భారత్ లో ఇంగ్లాండ్ మాజీ రాయబారి విలియం క్లార్క్ రాసిన స్పెషల్ రిలేషన్షిప్ అనే పుస్తకాన్ని తెలుగు చెయ్యమని ఇచ్చారు. స్పెషల్ రిలేషన్షిప్  అనేది దౌత్య పదం.అమెరికా ప్రపంచo లో ఏ దేశం తో ఏ ఒప్పందం చేసుకున్నా అందులో అంతిమ ప్రయోజనాలు తనకే దక్కేలా ఎలా చూసుకుంటుందో విలియం క్లార్క్ ఆ నవలలో గొప్పగా వివరించాడు. కుట్ర అనే పేరిట అది తెలుగులో అచ్చేసారు.అలాగే క్రిస్టియానా లాంబ్ రాసిన ఐ యామ్ మలాలా పుస్తకం తెలుగు చెయ్యమని ఐద్వా నాయకురాలు పుణ్యవతి, బుక్ హౌస్ ఎడిటర్ ఉషారాణి అడిగితే చేశాను. హోవర్డ్ జిన్ రాసిన  (థర్డ్ వరల్డ్ ట్రావెలర్ అన్న వెబ్  సంక్షిప్తీకరించిన ) పీపుల్స్ హిస్టరీ ఆఫ్ అమెరికా, క్వాన్ యాన్చి రాసిన మావో నాట్ గాడ్ ఏ మాన్, సుచేతన చట్టోపాధ్యాయ రాసిన యాన్ ఎర్లీ కమ్యూనిస్ట్ ముజఫర్ అహ్మద్, బొలీవియా డైరీ, చిలీ – అనెదర్ సెప్టెంబర్ ఎలెవన్..ఇలా నేను తెలుగు చేసిన పుస్తకాలు రాజకీయ నేపథ్యానికి తగిన పుస్తకాలే. ఇప్పుడు నేను చేసిన మార్క్వేజ్ పుస్తకం కూడా అదే కోవకి చెందినది కాబట్టి తెలుగు చెయ్యడానికి నేను పెద్దగా  ఇబ్బంది పడలేదు.

— రియలిజాన్ని, మాజికల్ రియలిజాన్ని గురించి చెప్పి మార్క్వేజ్ రచనా శైలి లాటిన్ అమెరికన్ సాహిత్యంలో ఎంత ప్రత్యేకమైనదో చెప్పండి.

మార్క్వేజ్ సాహిత్యాన్ని పూర్తిగా చదవకుండా ఈ విషయమై నేను వ్యాఖ్యానించ లేను. నాకు అర్ధం అయినంత మేర మార్క్వేజ్ మౌలికంగా వామపక్ష వాది.సోషలిస్టు వాస్తవికత పట్ల ఎరుక ఉన్నవాడు.అయితే లాటిన్ అమెరికా దేశాలు అత్యధిక కాలం మిలిటరీ నియంతృత్వ పాలనలో మగ్గిపోయిన నేపథ్యంలో వాస్తవిక ఘటనలను,చారిత్రక వ్యక్తులను,కాల్పనిక పాత్రలను తన పరిశోధక ప్రవృత్తి, సహజ సృజనాత్మక కాల్పనికతతో జోడించి చెప్పే కొత్త ఒరవడి సృష్టించాడు.సాహిత్యం ద్వారా సామాజిక వాస్తవికతను ప్రజలకు అర్ధం చేయించే ఈ ప్రక్రియను మ్యాజిక్ రియలిజంగా అర్ధం చేసుకోవచ్చు అనుకుంటున్నాను.

****

నోమి క్లైన్ ‘ఫెన్స్ స్ అండ్ విండోస్ ‘ అనువాదం పూర్తయి అచ్చుకెళుతోంది. సత్యరంజన్ కి హృదయపూర్వక అభినందనలు. చరమయాత్ర కావల్సినవాళ్ళు పల్లవి ప్రచురణలు వెంకట నారాయణ గార్ని 9866115655 లో సంప్రదించండి. సత్యరంజన్ని పలకరించాలనుకుంటే 9182449279 కి చేయొచ్చు.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

10 comments

Leave a Reply to sowjanya bhashyakarla Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • సత్యరంజన్ గారితో సంక్షిప్త సంభాషణ మరియు శ్రీరామ్ సంధించిన ప్రశ్నలు.. చాలా కొత్తగ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి ఫెన్సెస్ అండ్ విండోస్ కు స్వాగతం .. సత్యరంజన్ గారికి నా అభినందనలు…పై కామెంట్ లో పొరపాటున వ్యాసం అని టైపో మిస్టేక్ … క్షమించగలరు

  • సత్యరంజన్ అన్నగూర్చి చాలా విషయాలు ఈ ముఖాముఖి ద్వారా తెలిశాయి. హృదయపూర్వక అభినందనలు..

  • మంచి పరిచయం అన్న..
    విలువైన విషయాలు తెలుసుకునే వీలు కల్పించిన ఇంటర్వ్యూ…స్ఫూర్తిని,చేతనను కలిగించే రచనల్ని తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేస్తున్న సత్యరంజన్ గారికి ధన్యవాదాలు..
    చరమ రాత్రి చదవాలనే ఆసక్తి కలిగింది.
    మీకు ధన్యవాదాలు

  • సత్యరంజన్ గారి గురించి ఎన్నో తెలియని విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిశాయి. అనువాదం చేస్తున్నప్పుడు వచ్చిన సమస్యలు కూడా చెప్పి ఉంటే బాగుండేది.

  • Satyaranjan anna is one of the most liberated individuals I have ever seen in Telugu people . His voice is genuine and works are concrete . I owe him a lot. He is one of my mentors that helped me during the wickedest times I was going through .

  • మంచి ఇంటర్వ్యూ. మంచి ప్రయత్నం. నాకు చాలా informative గా కూడా అనిపించింది. థాంక్యూ..

  • ఇద్దరికీ అభినందనలు. ఆసక్తికరమైన ముఖాముఖి.

  • రంజన్ గారి విషయ పరిజ్ఞానం వల్ల ఆయనతో మాట్లాడి ఏ విషయంపైనైనా క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఇప్పటి తెలుగు సాహితీ రంగంలో అరుదైన మేధావి. కానీ, సందడికి కొంత దూరం పాటిస్తూ ఉంటారు. కొన్ని వేదికల వల్ల ఇలాంటి సంభాషణలు మా మధ్య ఎన్నో ఉన్నాయి. అవి రికార్డ్ అయితే బాగుండు అనిపించేది. అనువాదాలు అనే కాదు, ఓ గ్లోబల్ perspectiveతో లోకల్ సమస్యను Cause and Effect ను అర్థం చేయించగలరు. ఏదైనా శీర్షికతో ఆయన మాటలు మరింత ఎక్కువ రీచ్ కావాలి. Marquez గురించి ఓసారి ఆయనతో మాట్లాడింది గుర్తు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు