https://www.scribd.com/document/332248874/Going-to-meet-the-man-pdf
మంచిని మాత్రం గుర్తుపెట్టుకోవడం, చెడుని మరచిపోవడం మనుషులకీ, సంఘానికీ కూడా అలవాటే. సంఘం విషయంలో, కాలం మార్పువల్ల తరాలు మారుతున్నప్పుడు పాతకాలపు మనుషుల అరాచకత్వాలు తెరమరగున పడిపోవడం జరగడం సహజం. ఒక మనిషి కొన్ని తరాలు జీవించినప్పుడు పాతకాలపు “బంగారు” రోజులని తలచుకోవడమూ అంతే సహజం. అయితే, ఈ “బంగారు రోజులు” క్రూరత్వంతో ముడిపడివుంటే? జేమ్స్ బాల్డ్విన్ రాసిన “గోయింగ్ టు మీట్ ది మాన్” కథలో ఒక తెల్లవాడు – పైగా పోలీస్ షరీఫ్ – ఆలోచనల్లో తన చిన్నప్పటి సంఘటనని తీపిగుర్తుగా భావిస్తూ, కేవలం దాదాపు మూడు దశాబ్దాలకన్నా కొంచెం ఎక్కువ కాలంలో వచ్చిన మార్పులని తట్టుకోలేక ప్రతిఘటిస్తూ, దాన్ని నల్లజాతివాళ్ల మీద కోపం రూపంలో చూపించి అధికార మదాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఝళిపిస్తూ, ఆఖరికి ఆ క్రూరత్వాన్ని పక్కమీదికి భార్యదగ్గరకు కూడా ఎలా చేర్చాడో కనిపిస్తుంది.
ఒకప్పుడు ఆఫ్రికా ఖండాన్నుంచీ మనుషులని బందీలుగా పట్టుకొచ్చి అమెరికాలో అమ్మారు. పొలాల్లో పనిచెయ్యడానికి మనుషుల అవసరం ఈ కొనుగోళ్లకి కారణం. (ఈ మధ్య ఒక మహానుభావుడు అలా బందీలుగా పట్టుకొచ్చి అమ్మబడ్డవాళ్లని వలసవచ్చినవాళ్లుగా వర్ణించాడు కూడా!) ఐరోపా ఖండం నుంచీ ఇంగ్లండు, ఫ్రాన్స్, మరికొన్ని దేశాలు ఓడల్లో ఈ బానిసలని అమెరికా చేర్చారు. ఇక్కడ యజమానులు పెట్టే బాధలని తట్టుకోలేక పారిపోవడానికి ప్రయత్నించినవాళ్లు పట్టుబడ్డప్పుడు ప్రాణాలతో మిగలడం విచిత్రం. కొన్నిసార్లు వాళ్లకి వాళ్లు చెయ్యని నేరాలని ఆపాదించి శిక్ష తీవ్రతని పెంచడం కూడా. (“12 యియర్స్ ఎ స్లేవ్” అన్న హాలీవుడ్ చిత్రంలో కిడ్నాప్ చెయ్యబడి అమ్మబడి, పన్నెండేళ్లపాటు ఒక నల్లజాతివాడు పడ్డ పాట్లని చాలా సహజంగా చిత్రీకరించారు.)
“గోయింగ్ టు మీట్ ది మాన్” కథ ఒక తెల్లజాతి పోలీస్ షరీఫ్ జెస్సీ నిద్రపట్టక పొర్లుతున్నప్పుడు మొదలవుతుంది. ఆ రోజున ఒక నల్లజాతి కుర్రాణ్ణి దారుణంగా పోలీస్ సెల్ లో అతను కొట్టడం అతని నిద్రపట్టకపోవడానికి కారణం. ఆ కుర్రాడు కొంతమంది నల్లజాతివాళ్లకి నాయకుడు. వాళ్లందరూ శాంతియుతంగా దేవుడిమీద పాటలు పాడుతూ సత్యాగ్రహం చేస్తూ వుంటే, ఆ నాయకుణ్ణి బొక్కలోకి తోసి, దారుణంగా హింసించి, జనంచేత ఆ పాడడాన్ని ఆపమని అతనిచేత చెప్పించడానికి జెస్సీ ప్రయత్నించాడు. అయితే, మరునాడు మళ్లీ వాళ్లనీ, వాళ్ల పాటలనీ మళ్లీ ఎదుర్కొనవలసి వస్తుందని జెస్సీకి తెలుసు. దానితోబాటే ఉత్తర ప్రాతం నించీ వచ్చే ఆందోళనకారుల సహాయ సహకారాల గురించి కూడా. (బానిసత్వం అమెరికాలో దక్షిణప్రాంతానికి పరిమితం. ఉత్తరప్రాంతంలో రెండు జాతులవాళ్ళూ దాదాపు సమానంగా జీవించక పోయినా ఒకళ్లు ఇంకొకళ్లని బానిసలుగా చూడడం అంత సహజం కాదు. ఉత్తరప్రాంతంవాళ్లకి బానిసత్వం అంటే గిట్టకపోవడం దానికి కారణం. అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బానిసత్వాన్ని నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నం సివిల్ వార్ గా మారి ఈ రెండు పక్షాల మధ్యా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆరు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.)
ఆ సమయంలో తన ఇంటికి వినపడే దూరంలో ఉన్న నల్లవాళ్లు పాడుతున్న పాట అతనికి తన చిన్నతనాన్ని గుర్తుచేస్తుంది. అది ఎలాంటి చిన్నతనం? పదేళ్లు కూడా రాని అతణ్ణి అతని తల్లిదండ్రులు ఒక నల్లజాతివాణ్ణి క్రూరాతిక్రూరంగా చిత్రహింస పెట్టి అమలుపరుస్తున్న మరణదండనని చూడడానికి పిక్నిక్ పేరున తమతో పట్టుకెళ్లి, తండ్రి తన భుజాల మీద ఎక్కించుకునల్లా చూపించిన చిన్నతనం. ఆడవాళ్లు అక్కడికి చేరడానికి కూడా అందంగా అలంకరించుకు వెళ్లిన అతని చిన్నతనం. ఒక తెల్లవాడు చాకుని పట్టుకుని నగ్నంగా వేలాడదియ్యబడ్డ ఆ నల్లవాడి మర్మావయవాన్ని కత్తిరించడానికి వెడుతుంటే ‘ఆ చాకు తన చేతుల్లో వుంటే బావుండేదే!’ అని అతనికి అనిపించిన చిన్నతనం. ఆ నల్లతన్ని చైనుకు కట్టి చెట్టు పైనించీ వేలాడదీసి కాళ్లకింద పేర్చిన మంటలోకి దించుతూ, పైకి తీస్తూ హింసపెట్టడాన్ని కళ్లారా చూసిన చిన్నతనం. ఆ ఘోరం ముగిసిన తరువాత, దీపావళినాడు టపాకాయలు కాల్చిన తరువాత విందుభోజనాలు చేసినట్టుగా కుటుంబంతో అక్కడే తిండి కూడా తిని ఇంటికి చేరిన చిన్నతనం.
బాల్డ్విన్ ఈ కథలో చేసిన చిత్రణ మరువలేనిది. ఇదేమిటి, ఇంతకన్నా ఇంకెంత ఎక్కువ ఘోరాలు జరిగాయో చెప్పగలిగినవాళ్లు ఇంకొంతమంది ఉండవచ్చు, ఇంకొన్ని కథల్లో అది జరిగే ఉండవచ్చు. కానీ, “ఆర్ట్ ఆఫ్ ది టేల్” అన్న సంకలనంలో ఈ కథ చేర్చబడిన దంటే బాల్డ్విన్ చిత్రణ గొప్పదనం కారణమయ్యే వుంటుంది.
అమెరికాలో దక్షిణభాగంలో జాత్యహంకారత ఎంత విశృంఖలంగా ఉండేదో, ఎలాంటి క్రూరత్వాన్ని చూపడం సాధారణంగా భావించారో తెలుసుకోవడానికి ఈ కథ చదవాలి. వాషింగ్టన్, డి.,సి.కి యాత్రా విహారానికో లేదా పనిమీద మాత్రమేనో వచ్చేవాళ్లు తప్పనిసరిగా ఒక పూటయినా అక్కడి ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంలో గడపాలి. రాజ్యాంగంలో “అందరూ సమానమే”నని స్పష్టం చేసిన తరువాత కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని బానిసగా చూడడమే గాక, కొనడమే గాక, ఎలాంటి హింసలకు గురిచేశారో తెలుసుకున్న తరువాత ఒళ్లు గగుర్పాటు చెందక తప్పదు.
రచయిత గూర్చి:
https://www.biography.com/people/james-baldwin-9196635
జేమ్స్ బాల్డ్విన్ (1924-1987) కవి, రచయిత, నాటక కర్త, ఆందోళనకారుడు. తన రచనలలో జాత్యంతర, స్వలింగ సంబంధాలని దాదాపు యాభై ఏళ్లక్రితం తన రచనలలో ప్రవేశపెట్టిన వ్యక్తి.
చాలా బాగా వ్రాసారండి శర్మగారు.
బాధాకరమైన సంఘటనలు అనేకం జరిగాయి. నేను కోన్ని బుక్స్ చదివాను. అమెరికన్ మ్యూజియం కోంతవరకే చూడగలిగాను. తట్టుకోలేక పోయాను. వాళ్ళెలా భరించారో ఊహకందనిది.