1
చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు “ఆగ్నేయ ఆసియా దేశాల్లో పర్యటించేటప్పుడు మీరు ఆహార సమస్యను ఎలా ఎదుర్కొంటారు?” అని, “ఆ భయంతోనే మేము ఆ దేశాల్లో పర్యటనకు జంకుతున్నాము” అని.
ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారతీయులు తినగలిగే ఆహారం దొరకడం చాలా కష్టం. మాంసాహారులకు సైతం ఈ దేశాల్లో తినగలిగే ఆహారం దొరకడం ఎంతో దుర్లభమైన విషయం. ఇక నాలాంటి శాఖాహారుల పరిస్థితిని మీరు ఊహించుకోవచ్చు. మొసళ్ళు, తేళ్లు, పురుగులతో చేసిన ఆహారాన్ని భారతీయ శాఖాహారులు, మాంసాహారులు ఒకే విధంగా ఏవగించుకుంటారు. నేను శాఖాహారిని కావడం వల్ల శాఖాహార భోజనం కోసం బ్యాంకాక్ నగరమంతా కలియదిరిగాను. థాయిలాండ్ కి చెందిన ప్రసిద్ధ వంటకం pad thai కి ప్రసిద్ధి చెందిన విశ్వవిఖ్యాత రెస్టారంట్ Thipsamai కి వెళ్ళి veg pad thai ఆర్డర్ ఇచ్చాను. మెనూలో ఉన్న ఒకే ఒక్క శాఖాహార వంటకం ఇది. Pad thai ని ఒక ప్లేటులోనూ, ఏటి ఒడ్డున ఎత్తుగా పెరిగే రెళ్ళ గడ్డి వంటి ఒక విధమైన గడ్డిని రెండవ ప్లేటులోనూ పెట్టి తెచ్చి ఇచ్చింది ఒక థాయ్ అమ్మాయి.
“ఈ గడ్డిని ఎలా తినాలి?” అని ఇంగ్లీషులో అడిగాను. ఆ అమ్మాయి భయంతో పారిపోయింది. సిగ్గుతో ముడుచుకుపోయింది. Poor English skills వల్ల థాయ్ ప్రజలు కుచించుకుపోతూ ఉంటారు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆ వంటకం గురించి వివరాలు తెలుసుకోవడాన్ని పొడిగించలేదు. ఆ గడ్డి నంజుకుని pad thai తింటూవుంటే రుచికి పారవశ్యంతో కళ్ళు మూతలు పడ్డాయి. తలలో dopamine వడి వడిగా న్యూరాన్లు మధ్యన ప్రవహించడం తెలిసింది. ఆ pad thai noodles పచ్చగడ్డితో కలసి గొప్ప రుచిని ఇచ్చాయి. నా జీవితంలోనే అంతటి రుచికరమైన నూడిల్స్ ని ఎప్పుడూ తినలేదు.
2
Thipsamai నేను ఉండే హోటల్ కి చాలా దూరం. రోజూ అక్కడికి వెళ్ళి pad thai తినడం సాధ్యంకాని పని. అందువల్ల బర్గర్ కింగ్ లో రోజూ ఒక వెజ్ బర్గర్ ను తింటూ బ్రతకాల్సి వచ్చింది. నేను రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను కాబట్టి యాత్రల్లో ఆహార సమస్య నాకు తక్కువ. ఏమీ దొరకకపోతే కొన్ని పళ్ళు, నట్స్ తిని గడిపేస్తాను.
బర్గర్ కింగ్ లో ఒక వెజ్ బర్గర్ ని ఆర్డర్ ఇచ్చాను. అది వచ్చేలోగా నాంగ్ నూచ్ గార్డెన్ కు క్యాబ్ బుక్ చేసుకున్నాను. బర్గర్ తినడం పూర్తయ్యే వేళకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఎడతెగకుండా థాయ్ భాషలో మాట్లాడుతోంది. నేను అర్థంకాక కంగారుగా నా Samsung S24 Ultra మొబైల్ లో live call AI translation feature ని on చేసాను. ఆమె మాటలు ఆంగ్లంలోకి అనువాదం అయి నాకు వినిపించాయి. అలాగే నా మాటలు ఆంగ్లం నుండి థాయ్ భాషకు అనువాదం అయి ఆమెకు చేరాయి. కేవలం Samsung S24 Ultra మొబైల్ లో మాత్రమే లభించే live call AI translation ని మొదటిసారి ఉపయోగించినప్పుడు ఆ సౌలభ్యానికి ఎంతో ఆనందం కలిగింది. AI ని ద్వేషించాల్సిన అవసరం లేదని అనిపించింది. విదేశీ పర్యటనలు చేసే ప్రయాణికులకు ఇది ఒక వరం. ఏ దేశంలో అయినా ఇంగ్లీషు వస్తే చాలు ఈ మొబైల్ సాయంతో చక్కగా ఇంగ్లీష్ రాని వారితో ఫోన్లో మాట్లాడవచ్చు. ఈ AI కోసమే నేను ఐఫోన్ ని వదులుకున్నాను. అయితే కొత్త అప్డేట్ తో ఐఫోన్ 16 సిరీస్ వాడే వారికి ఆపిల్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ విదేశీ పర్యాటకులకు Samsung S24 ultra ఇచ్చే సౌలభ్యాలను ఐఫోన్ ఇవ్వదు.
ఇంతకీ విషయం ఏమిటంటే బర్గర్ కింగ్ వాకిలి వద్దకు రమ్మని ఆ ఫోన్ చేసిన అమ్మాయి చెప్పింది. బయట ఒక క్యాబ్ ఆగివుంది. బ్యాంకాక్ వచ్చిన తరువాత అందమైన కార్లలో తిరిగిన నేను రంగు మాసిపోయిన, గీతలు పడిన ఒక పాత కారు నా ముందు ఆగి ఉండటం చూసి నిరాశ పడ్డాను.
ఎత్తు పల్లాలు లేని రహదారిలో ప్రయాణం ఎప్పుడూ విసుగు పుట్టిస్తుంది. కొండదారుల్లో ప్రయాణం కుతూహలంగా ఉంటుంది. ఈ వాక్యం ఎందుకు చెప్పానో ముందు ముందు మీకు అర్థం అవుతుంది.
నా ముఖ కవళికలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ లోపలి నుండి డ్రైవర్ పిల్ల స్వచ్ఛంగా నవ్వుతూ కారు ఎక్కమని ఆహ్వానించింది. నా ఇబ్బందికరమైన ముఖ కవళికలు ఆ అమ్మాయికి అర్థం కాకపోలేదు. అటువంటివి ఆ అమ్మాయికి కొత్త కాదు. పేదవారి జీవితం అంత సులభం కాదు. ఆమె బొద్దుగా, అధిక బరువుతో, ఛాయ తక్కువగా, అనాకర్షకంగా ఉంది. ఇలా నేను చెప్పడం ఆమె ఎలా ఉందో మీకు తెలియజేయడం కోసమే తప్ప ఆమెను అవమానించడం నా ఉద్దేశ్యం కాదు.
ఆమెకు 20 ఏళ్ళు ఉంటాయి. దురదృష్టవశాత్తు అబ్బాయిలు ఇష్టపడే రూపం కాదు. పెద్దగా చదువుకోకపోవడం వల్ల జీవన భారాన్ని మోయడానికి బాధ్యతల్ని భుజస్కంధాలపై వేసుకొని క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాల్సిన అవసరం ఆమెకు వచ్చింది. నిజానికి అది చాలా పెద్ద భారమైనప్పటికీ ఆమె ఆ భారాన్ని ఎంతో తేలిగ్గా మోయగలుగుతోంది. ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా నవ్వుతూ, ప్రేమగా, శ్రద్ధగా చేసే వ్యక్తులంటే నాకు గౌరవం.
ప్రయాణంమంతా ఆమె తన స్నేహితులతో ఉల్లాసంగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. నేను ఫోన్లో interpreter mode ని on చేసి ఆమె సంభాషణ ఒక దానిని అనువాదం చేసి చూశాను. “ఒక భారతీయుణ్ణి నాంగ్ నూచ్ కి తీసుకెళ్తున్నాను” అని ఎవరితోనో చెబుతోంది.
కారులో సీట్లు సౌకర్యంగా లేవు. ఒకటే ఉక్క పోస్తోంది. ఏసి పెంచమని అడిగాను. ఇబ్బందికరంగా నవ్వుతూ ఆమె ఏసీ ప్యానెల్ మీద చేత్తో కొట్టింది. దానివల్ల చల్లదనంలో ఏ మార్పు జరగలేదు. కొంతసేపటి తరువాత మళ్లీ ఒకసారి ఏసీ పెంచమని అడిగాను. ఇంకాస్త గట్టిగా ఏసీ ప్యానెల్ మీద కొట్టింది. ఆ దెబ్బకు లోపలి ఏసీ యూనిట్ కాస్త ఊడిపోయి వైర్లకి వేలాడింది. ఆ పిల్లకి అదంతా అవమానకరమైన పరిస్థితి. Embarrassing గా చూస్తూ నవ్వుతూ “kho thot” అంటూ క్షమాపణలు చెప్పింది.
మరొకసారి దోస్తోవిస్కీ నవల పేదజనంలోని కథానాయకుడు మకార్ దేవష్కిన్ గుర్తొచ్చాడు. పై అధికారితో మాట్లాడుతున్నప్పుడు, అప్పటికే దారానికి వ్రేలాడుతున్న చొక్కా గుండీ ఊడిపోయి కింద పడిపోయినప్పుడు మకార్ దేవష్కిన్ ఎటువంటి embarrassment కి గురయ్యాడో, కంగారుగా ఎలా ఆ పడిపోయిన గుండీ కోసం నేల పై ప్రాకుతూ వెతికాడో నాకు గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి మీద అంతులేని జాలి, వాత్సల్యం కలిగాయి. “Don’t worry. No problem” అని చెప్పాను. ఆమె కాస్త తేలికపడింది. పాపం! పెట్రోలు పొదుపు చేసుకోవడానికి ఇరుకు సందుల్లోంచి, గల్లీలలోంచి అడ్డదారుల్లో కారును తీసుకు వెలుతోంది.
థాయిలాండ్ లోని అమ్మాయిలు ఎవరిపైనా ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వయంగా ఒంటరిగా వ్యాపారాలు నిర్వహించుకోవడంతో పాటూ బస్ డ్రైవర్ వంటి ఎన్నో కష్టమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అక్కడి స్త్రీలకు స్వేచ్ఛ, గౌరవం దక్కడం గమనించాను. అక్కడి సమాజంలో స్త్రీ పురుషుల నడుమ ఎంతో సమానత్వం ఉంది. పరస్పర గౌరవం ఉంది.
3
ఆ అమ్మాయి చివరికి నన్ను నాంగ్ నూచ్ గార్డెన్ లోని ఒక పెద్ద బస్ స్టాండ్ లో దింపింది. ఆ అమ్మాయికి నేను డబ్బు ఇవ్వబోతుంటే తీసుకోలేదు.
“మీకు టిక్కెట్ తీసి ఇస్తాను. నాకయితే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు” అని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకొని దూరంగా ఉన్న టిక్కెట్ కౌంటర్ వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి టిక్కెట్ తీసుకొని వచ్చింది. టిక్కెట్లతో పాటూ 600 వెనక్కి తెచ్చి “డిస్కౌంట్” అని చెప్పి నా చేతిలో పెట్టింది. ఆ అమ్మాయికి పది పదిహేను ఇంగ్లిష్ పదాలు తెలుసు. వాటి సాయంతోనే ఏదోలా నెట్టుకొస్తోంది. 600 తగ్గినందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పాను. క్యాబ్ రుసుము మరొకసారి ఇవ్వబోతే నవ్వుతూ తిరస్కరించింది.
“కస్టమర్ ని తీసుకువచ్చినందుకు వాళ్ళు మాకు కమిషన్ ఇస్తారు. అందులో చూసుకుంటాను” అని చెప్పింది. ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు.
“సాధారణంగా అందరూ తోటను చూసి వెళ్ళిపోతారు. అయితే మీ కోసం ఒపేరా, ఎలిఫెంట్ షో తో సహా టికెట్ తీసుకున్నాను” అని చెప్పి చాలా దూరం నాకు తోడుగా వచ్చి, ఒపెరా థియేటర్ ని చూపించి “ఒపేరా ప్రారంభమయిపోతోంది. మేము ఇంతకు మించి లోపలికి రాకూడదు. త్వరగా వెళ్ళండి. ఎంజాయ్ ఒపేరా!” అని చెప్పి సెలవు తీసుకుంది. ఆ అమ్మాయి సంస్కారానికి కదిలిపోయాను.
థాయ్ ప్రజలు సహృదయులు, సాటి మనుషులతో ఎంతో ప్రేమగా ఉంటారు. భారతదేశంలా కటువుగా ప్రవర్తించే ప్రజలున్న దేశం నుండి వెళ్ళినవారికి థాయ్ వాసులు సత్యయుగానికి చెందిన వారిలా అగుపిస్తారు.
నూట పది సంవత్సరాల వయసున్న ఒక యూరోపియన్ బామ్మ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి “ప్రేమ లేకుండా నవ్వే నవ్వు మన హృదయాన్ని విషయమయం చేస్తుంది”.
“Respect was invented to cover the empty place where love should be” అని లియో టాల్ స్టాయ్ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి.
మనదేశంలో కృత్రిమ గౌరవం తప్ప ఎవరిలోనూ ప్రేమని చూడలేం. తోటి మనుషులు పట్ల ప్రేమ అనేది మన భారతీయులకు తెలియని విషయం. ఇలా ఆరోపిస్తున్నందుకు మీరు నన్ను మన్నించాలి.
థాయిలాండ్ పర్యాటకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి కారణం థాయ్ ప్రజల హృదయాల్లోని ప్రేమ. వారి ఆతిధ్యం. బుద్ధుని బోధనలను అనుసరించడం వల్లనో, శతాబ్దాల పాటు మంచి రాజుల పరిపాలన వల్లనో, గొప్ప సాంస్కృతిక విలువల్ని ఇప్పటికీ కాపాడుకుంటూ ఉండటం వల్లనో, ఎందువల్లనో నాకు కారణం తెలియదు, థాయ్ ప్రజల హృదయాలు స్వచ్ఛంగా ఉన్నాయి. వారి నమ్రతకు, ప్రేమకి నా హృదయం కరిగిపోయింది. వారు నాకు దివ్యాత్ములలా అనిపిస్తారు. ప్రేమకు, ఆదరణకు ముఖం వాచిపోయిన వారు ఆగ్నేయ ఆసియా దేశాలకు పర్యటన చెయ్యాలి. మానవీయ స్పందన అనుభవించాలి. అందరూ సాటివారితో దయగా ఉంటే మరణానంతర కాల్పనిక స్వర్గాల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ లోకమే స్వర్గంగా మారుతుంది.
ఆ డ్రైవర్ పిల్ల ఇప్పుడు నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది. అందం ముఖంలో ఉండదు. దేహాకృతిలో ఉండదు. ప్రేమాస్పదమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. ఆ ప్రేమ వ్యక్తం చేసే దేహ కదలికలలో ఉంటుంది. ముఖకవళికలలో ఉంటుంది. మాటలలో ఉంటుంది. మాటల్ని ఆత్మీయంగా పలికే తీరులో ఉంటుంది. మన చర్యలలో ఉంటుంది. మన దృక్కోణంలో ఉంటుంది. మన హృదయంలోని ప్రేమే సౌందర్యం.
4
థాయిలాండ్ లోని అత్యాధునిక Nong Nooch Theatre లో Opera ప్రారంభం అయిన క్షణమే నాకు ఒక విషయం అర్థం అయింది, నాటక రంగం ఎంత గొప్పదో!
ఆ అతిలోక దృశ్యమయ ప్రపంచంలోకి, ఆ వర్ణాలలోకి, దృశ్యాలలోకి నా ఆత్మ ఇంకిపోయింది.
ఒక నాటకంలో, ఒక live concerts లో కలిగే అనుభూతి సినిమాలో ఎందుకు కలుగదు అంటే ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవమే. కళాకారుల aura ని, energies ని మనం ప్రత్యక్షంగా అనుభవించినప్పుడే గొప్ప రసప్రాప్తి కలుగుతుంది.
భారతీయ ప్రజలు నాటకరంగం వైపుకి మళ్ళాల్సిన సమయం వచ్చింది. అలాగే నాటక రంగం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని దృశ్యానుభవాన్ని మెరుగు పరుచుకోవాలి.
Royal Theatre, Tiffany, Alcazar లాంటి ప్రదర్శనలు చూసినప్పటికీ నాంగ్ నూచ్ ఒపేరా ప్రత్యేకం. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది.
5
తాయిలాండ్ లో ఉన్న 600 ఎకరాల Nong Nooch Tropical Garden ప్రపంచంలోని 10 గొప్ప ఉద్యానవనాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది. నేనయితే 5 గొప్ప ఉద్యానవనాలలో ఒకటిగా గౌరవించాలి అంటాను. ఎందుకంటే ఈ తోట నిర్మితిలో గొప్ప, అరుదైన కళాత్మకత ఉంది.
ఇటువంటి గొప్ప తోటని మీరు ఎక్కడా చూడలేరు. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు ఇటువంటి గొప్ప తోటని ఎన్నో వేల కోట్లు వ్యయం చేసి కూడా నిర్మించలేవు. ఇటువంటి తోటని గొప్ప ప్రేమతో మాత్రమే నిర్మించడం సాధ్యమవుతుంది.
1954 లో ధనికురాలైన Nongnooch Tansacha 800 ఎకరాల భూమిని కొని ఈ తోటను నిర్మించడం ప్రారంభించారు. విదేశీ పర్యటనలల్లో దర్శించిన ప్రపంచ ప్రఖ్యాత ఉద్యానవనాల యొక్క సౌందర్యం నుండి ఆమె ప్రేరణ పొంది అరుదైన పుష్పాలు, మొక్కలతో నిండిన ఉష్ణమండల ఉద్యానవనంగా ఆ భూమిని మార్చాలని నిర్ణయించుకున్నారు.
గొప్ప ఉద్యానవనాన్ని నిర్మించాలనే Nongnooch Tansacha నిర్ణయం వెనుక ఉద్యానవనాలపై ఆమెకి ఉన్న అమితమైన ప్రేమతో పాటు థాయిలాండ్ వృక్షజాలం యొక్క సహజ సౌందర్యాన్ని సంరక్షించి, ప్రదర్శించాలనే ఆమె వ్యక్తిగత కోరిక కూడా ఉంది.
నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్‌లో అరుదైన దేశీయ మొక్కలతో పాటు- అన్యదేశాల మొక్కలను కూడా సేకరించడం, పెంపకం చేయడం, గొప్ప తోటలను సృష్టించడం, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను రూపొందించడం వంటి బాధ్యతల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు.
మొక్కల పట్ల ఆమెకున్న ప్రేమకు మించి, వాటి పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత యొక్క ప్రాముఖ్యత గురించి సందర్శకులకు స్ఫూర్తినిచ్చే, అవగాహన కల్పించే ఒక అరుదైన స్థలాన్ని సృష్టించడం అనే ఉన్నతమైన లక్ష్యాన్ని Nongnooch Tansacha జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ ఉద్యానవనం పరిశోధనకు, Plant propagation కి, అంతరించిపోతున్న వృక్షజాతుల సంరక్షణకు వేదికగా ఉండాలని ఆమె కోరుకున్నారు. ఇది వ్యక్తిగత ఉద్యానవనం అయినా దానిని ఆమె 1980 లో ఎంతో దయతో ప్రజల సందర్శనార్థం తెరిచారు.
ఇప్పుడీ ఉద్యానవనం ఆమె కుమారుడు Kampon Tansacha సంరక్షణలో ఉంది. ఆయన సందర్శకుల మూలంగా వచ్చే ఆదాయాన్ని వృక్ష జాతుల పరిరక్షణకి, దాతృత్వ కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు.
Kampon Tansacha అంటారు “వృక్షజాతుల్ని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలి. ప్రతి దేశం బాధ్యత తీసుకుని ఇటువంటి ఉద్యానవనాన్ని ఒక దానిని నిర్మించాలి. లేదంటే పిల్లలకి ఈ భూమికి సంబంధించి మనం ఏమి చూపిస్తాము? ప్రకృతితో వారికి స్పర్శ పూర్తిగా తెగిపోతుంది. అది ప్రపంచానికి మంచిది కాదు”.
*
ఆంధ్ర భారతి తెలుగు నిఘంటువు నుండి.
శాకాహారి – కూరగాయలు మాత్రమే తినువాఁడు, మాంసము తిననివాఁడు
శాఖము – మాంసము (పై జాతులవారు వాడు మాట). [వరంగల్లు]
శాఖ –
1. చెట్టుకొమ్మ;
2. వేదభాగము;
3. చేయి.