నేను పుస్తకాలు రెండు విధాలుగా చదువుతాను.
ఒక విధంగా, రచయిత మనో ప్రవేశం చేసి, పూర్తి సానుభూతితో చదువుతాను.
ఒక కథ కానీ, పుస్తకం కానీ చదివేటప్పుడు, రచయిత వైపు నుంచి చదవడం చిన్నప్పటి నుంచీ అలవాటు. నేను చిన్నతనం నుంచీ ఏ పుస్తకం చదివినా, ఆ పుస్తకం నా పరిసరాల్లో జరిగినట్లు నా మనోఫలకం మీద కనిపించేది. భీముడు, దుర్యోధనుడు ఎక్కడ గదాయుద్ధం చేశారో నాకు బాగా తెలుసు. కుంభకర్ణుడు మా లైబ్రరీలో నిద్ర పోవడం నేను చూశాను. డిటెక్టివ్ నర్సన్ మా ఇంటి వెనక దాక్కొని ఉండటం నేను గమనించాను. ఉదాహరణకి మనం ఒక ప్రేమ నవల చదువుతుంటే, చదివినంత సేపూ, ఆ వాతావరణంలో, ఆ మనుషులతో, ఆ ఆలోచనలతో చదవగలిగితేనే ఆ నవలతో తాదాత్మ్యం చెందగలం. ఒక కథానాయకుడితోనో, నాయకురాలితోనో ఆ దృక్పథంలో చూడగలిగితేనే, కథా గమనం బాగా తెలుస్తుంది.
ఈ తాదాత్మ్యమే చాలదు. ఆ రచయిత నమ్మకాల్ని, పూర్వ ప్రతిపాదనలనీ నమ్మాలి. నేను బైబులు చదువుతున్నపుడు, చదివినంత సేపూ నేను ఆ విశ్వాసపరంగానే చదువుతాను. మరియతనయుడి పరిశుద్ధ జననం నమ్ముతూ చదివితేనే ఆ పుస్తకం నమ్మకస్తులు ఎలా చదువుతారో తెలుస్తుంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ చదువుతున్నపుడు ఈ ‘నమ్మకం’ బాగా అవసరం అవుతుంది. అసిమోవ్ పుస్తకాలు చదువుతుంటే మనిషి కాంతివేగంతో ప్రయాణిస్తాడని తాత్కాలికంగా నమ్ముతూ చదువుతాను. ఆ ప్రతిపాదనను ప్రతిక్షణం ప్రశ్నిస్తుంటే, ఆ పుస్తకాల్లోని రుచి తెలియదు. ఆ కాంతివేగ ప్రయాణం ఆ కథ సాగటానికి ఒక పరికరం మాత్రమే.
ఈ నమ్మకమే చాలదు. రచయితతో సహానుభూతి కూడా పొందాలి. ముఖ్యంగా కవిత్వం చదివేటప్పుడు ఇది బాగా అవసరం అవుతుంది. నటనలాగానే, రచనకూ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఒక రిజిస్టర్, అంటే ఒక టోన్, ఒక స్థాయి, ఒక మూడ్ ఉంటుంది. ఈ రిజిస్టర్ కి వ్యతిరేకంగా పొతే అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు టీవీ లో సైన్‌ఫెల్డ్ లో ఆ రిజిస్టర్ మార్చడం ద్వారా హాస్యం కనబడుతుంది. బాగా హృదయవిదారకమైన విషయం చెబుతుంటే, దాన్ని వ్యంగ్య ప్రధాన దృష్టితో చదువుతుంటే, సంతాప సభలో వెనక కూర్చొని జోకులు వేసుకున్నట్లు ఉంటుంది. అలాగే, కామెడీ క్లబ్ లో సీరియస్ కవిత్వం కోసం చూస్తే కన్నీళ్లు వస్తాయి.
ఈ సహానుభూతి మాత్రమే చాలదు. మనల్ని మనం రచయితలాగా ఊహించుకోవాలి. మనమే రచయితలమైతే ఈ క్యారెక్టర్ తో ఏం మాట్లాడిస్తాం? ఈ కథ ఎలాగ జరిగితే బాగుంటుంది? ఇది ఫిక్షన్ మాత్రమే కాదు, ఏ విషయంలో అయినా అవగాహన బాగా కలుగుతుంది. కొన్ని సార్లు నాన్‌ఫిక్షన్ చదివేటప్పుడు అనేక సార్లు కేవలం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసి, ఆ పుస్తకం నేను ఎలా రాస్తానో అని ఆలోచించుకుంటాను. కొంత చదివిన తర్వాత, ఆ తర్వాత ఏమవుతుందో అని మనం అనేక సార్లు ఊహించుకుంటాను. ఇదే చదవడమంటే. నిజానికి మంచి రచయిత ప్రతి పాఠకుడినీ రచయిత చేసేస్తాడు!
నేను మరో విధంగా చదువుతాను,రచయిత ప్రత్యర్థి లాగ, నేతి వాదంలో (న ఇతి వాదం, సోక్రటిక్ మెథడ్ లాగా).
కొంచెం ఎదిగినప్పటి నుంచీ రచయితను ఒక సందేహ దృష్టితో చదవడం అలవాటయింది. చిన్నపుడయితే ప్రతి రచయితనూ ఆకాశం లోకి ఎత్తేసి చూసేవాడిని. రచన చేయగలిగిన మనుషులు తాము రాస్తున్న విషయం గురించి బాగా తెలుసుకున్న వారని అనుకునేవాడిని. అది మన సంప్రదాయంలోనే ఉన్నది. పెద్దల మాట గౌరవింపుము. గురువుల మాట వినుము. పుస్తకం మనకి ప్రత్యక్ష గురువు అయినపుడు, రచయిత పరోక్ష గురువు అవుతాడు కదా? కానీ పెద్దయేసరికి, రచన చేసిన మనిషికి అతని సృష్టి మీద అవగాహన ఉండక్కరలేదని తెలిసి వచ్చింది. ముఖ్యంగా బాహ్య ప్రపంచంతో చూస్తే రచయిత ప్రత్యామ్నాయ సృష్టి పేలవం గానూ, అసంబద్ధం గానూ ఉంటుందని తెలిసి వచ్చింది.
ఆ సందేహమే చాలదు. ప్రతి పుస్తకం వెనకా కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి. ఆ ప్రతిపాదనలు ప్రశ్నించడం మన అవగాహన పెంచుతుంది. ఉదాహరణకి, చాలా పుస్తకాల్లో ఒక విషయం అంతర్లీనంగా కనబడుతుంది: మనిషి ఆర్ధిక స్థితి అతని గుణగణాలని నిర్ణయిస్తుంది అని. పేదవాడు మంచి వాడయి తీరతాడు. ఆ ప్రతిపాదన అవసరమా? అది నిజమేనా? అది ఆలోచిస్తున్న కొద్దీ ఆ రచనా చట్రం, పరిమితులు, లోటుపాట్లు తెలుస్తాయి.
ఆ ప్రతిపాదనలు ప్రశ్నించడం చాలదు. ప్రత్యామ్నాయాలు చూడాలి. ఇంతకు ముందు చెప్పినట్లు రచయిత రాసిన పుస్తకం మనం తిరిగి రాసుకోవడమే చదవడం అంటే. ఈ ప్రతిపాదనలకు మరొక విధంగా ఉంటే ఎలాగ ఉంటుంది అని ప్రశ్నించడం సాధారణంగా ప్రతి పరిశోధనలోనూ ఒక భాగం. దీనికి ఇంగ్లీషులో కౌంటర్ ఫాక్ట్యువల్ అని ఒక పేరు కూడా ఉన్నది. తెలుగులో వచ్చే కథల్లో చాలా శాతం ఎకనామిక్స్, సోషియాలజీ మీద వచ్చే కథలే కాబట్టి, ఆ సబ్జెక్టులని వృత్తి రీత్యా పరిశోధించే వాళ్ళు వాడే పనిముట్లు మనం వాడాలి.
ప్రత్యామ్నాయాలు చూడటం చాలదు. మనకి తెలిసిన ప్రపంచంలో ఆ ప్రత్యామ్నాయాలని సమర్థించే నిజాలు చూడగలగాలి. ఆ ప్రత్యామ్నాయాల చారిత్రిక, సాంస్కృతిక పరిణామ గతిని చూడగలగాలి. అనేక సార్లు ఆ విషయాలు యథాతథంగా ఉండవు. అంటే, ఉదాహరణకి వివాహ వ్యవస్థ మీద కథ ఉన్నది అనుకోండి. రచయిత ఆ వ్యవస్థ సామాజిక సంబధాలకి అవసరం అని ఒక దత్తాంశం లాగ తీసుకున్నాడనుకోండి. మీరు అనవసరం అని ఊహించుకుని కథ మరో విధంగా రాస్తే చాలదు. వివాహ వ్యవస్థలేని సమాజాలు చరిత్రలో ఉన్నాయా? అది ఎందుకు వచ్చింది? దాని వలన కలిగిన లాభం ఏమిటి? ఇప్పుడు నార్వే లో వివాహాలు చేసుకొని సమాజం ఎలాగ నడుస్తుంది? వివాహం వల్లనే సామాజిక బంధాలు అనగలమా?
నిజానికి నేను చెబుతున్న విషయాలు పరిశోధనాత్మక శాస్త్రాలలో సర్వ సాధారణం. లెక్కల్లో కొన్ని శతాబ్దాల కిందటే, ఈ విధమైన సత్యాన్వేషణ సాధారణమైంది. ప్రూఫ్స్ అండ్ రెఫ్యూటేషన్స్ అన్న పుస్తకం మొత్తం, వాదం, ప్రతివాదం, పరిమితుల వంటి ఒక క్రమంలో సత్యాన్వేషణ ఉదాహరణ పూర్వకం గా చూపిస్తాడు ఇమ్రే లకటోస్. నిజ జీవితంలో ఉండే విషయాల కార్య కారక సంబధాలు ఎలాగ చూడాలి అన్న పరిశోధన చేసినందుకు మొన్న ఎకనామిక్స్ లో నోబెల్ మెమోరియల్ ప్రైజ్ వచ్చింది.
మరి ఇది కేవలం ఈ శాస్త్రాలకి మాత్రమే వర్తిస్తుందా? సాహిత్యం చదవడానికి కూడా ఉపయోగపడుతుందా? దీనికి రెండు విషయాలు చెబుతాను. ఒకటి — మన తెలుగు దేశాల్లో సాహిత్యం శాస్త్రవిజ్ఞానం లాగ చలామణి అవుతూ ఉంది. ఎకనామిక్స్, సోషియాలజీ, జెండర్ స్టడీస్, ఆరోగ్య, పర్యావరణ, వ్యాపార విషయాలు ప్రజలకి కథలద్వారా, పాత్రల నోటి నుండీ, రచయిత స్వగతం నుంచీ, వాడిన పదాల నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. అటువంటప్పుడు, మరి ఆ విషయాలు ఆ శాస్త్రోపకరణాలు వాడి విశ్లేషించడం సముచితం.
రెండవది — లిటరేచర్ లో డీకన్స్‌ట్రక్స్‌నిజం అనే ప్రక్రియ నేను చెప్పిన ఒక విషయం ఇంతకు ముందే చూపింది. అది, అంతర్లీనంగా ఉండే ప్రతిపాదనలు బయటకి తెచ్చి ప్రశ్నించడానికి సులభం చేసింది. అయితే, దాన్ని చాలా మంది పాఠకులు, విమర్శకులు ముందుకు తీసుకు వెళ్ళ లేక పోయారు. ఆ అమూర్త భావనలని నిజ ప్రపంచంలో లంగరు వేసి విశ్లేషించడంలో ఈ శాస్త్ర ప్రక్రియలు యథాతథంగా కాకపోయినా ఏదో విధంగా ఉపయోగ పడతాయి.
***
నేను పుస్తకాలు రెండు విధాలుగా చదువుతాను.
ఒక విధంగా రచయిత పేరు పట్టించుకోకుండా చదువుతాను.
నేను చిన్నపుడు రచయిత ఎవరో తెలుసుకోకుండా చదివే వాడిని. మన ప్రాచీన సాహిత్య చరిత్రలో లాగానే, నేను రచయితల పేర్లు పట్టించుకోలేదు. రామాయణం రాసింది ఎవరో వాల్మీకి అంటే, అతడెవరో అని కుతూహలం ఏదీ ఉండేది కాదు. వాల్మీకి బదులు సుబ్బారావు అంటే, అలాగే చదివే వాడిని. ఆ రోజుల్లో చదివిన రవీంద్ర సాహిత్యం, శరత్ సాహిత్యం, రంగ నాయకమ్మ సాహిత్యం, యద్దనపూడి నవలలు — ఇటువంటివన్నీ, ఒక అజ్ఞాత రచయిత రాసినట్లే చదివాను.
రచయిత పేరు పట్టించుకోకుండా చదవడం ఒక ఉపయోగం కలిగించింది. ఏ కథ అయినా ఆ కథాబలం మీదనే నిలిచి ఉంటుంది. ఒక కవిత శ్రీశ్రీ రాస్తేనేం, వెంకటరావు రాస్తేనేం? ఆ కవిత అర్థం మారిపోదు కదా? పెద్ద వాళ్ళు రాశారని అనవసరంగా పొగడటం, పేరులేని వారు రాశారని సరిగ్గా చదవక పోవడం ఉండవు. ముఖ్యంగా పెద్ద వాళ్ళు చెప్పిన విషయం యథాతథంగా తీసుకోవడం ఉండదు.
అయితే, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం కొంచెం కటువుగా కనబడుతుంది. పలానా పెద్ద రచయితను విమర్శించే అంతటి వాడివా? నువ్వు రాసి చూడు చూద్దాం! అనే వాళ్ళు ఎక్కువ అయ్యారు. హోటల్ కి వెళ్ళామనుకోండి. పచ్చడిలో ఉప్పు ఎక్కువయిందని కంప్లైంట్ చేశారనుకోండి. వంట వాడు వచ్చి మీకేం వంట వచ్చు? మీకు పచ్చడి అంటే ఏమిటి తెలుసునా అంటాడా? [ఇది కొంచెం క్లిష్టమైన విషయం — మరో సారి వివరంగా రాస్తాను. నిజానికి వంట వాడు తన వంటలు ఎవరికో చెప్పవచ్చు. వెజిటేరియన్ అయి ఉండి కబాబ్ ఫ్యాక్టరీ లో మాంసం మీద కంప్లైంట్ చేస్తే అర్థం లేదు.]
ఉదాహరణకి నేను కొడవటిగంటి బుద్ధికొలత వాదం పూర్తి అహేతుక వాదం అంటాను. అలాగే, శ్రీశ్రీ పద్యాల్లో నాకు లయవిరుద్ధంగా అనేకం కనబడతాయి. అనేక పద్యాల్లో కనబడే భావవైరుద్ధ్యం నాకు పంటికింద పుచ్చిన బఠాణీ లాగా తగులుతుంది. రాచకొండ రచనల్లో స్థూల భావాల్లో కొట్టుకుపోయే సూక్ష్మ బేధాలు నాకు కంటిలో కలక లా ఇబ్బంది పెడుతుంది. ఇవి చెప్పడానికి నాకుండే అర్హత ఒక్కటే: పాఠకుడిలా, అందునా శ్రమ తీసుకొని చదువుతున్న పాఠకుడిలా, అందునా, బహుకాల పాఠకుడిలా, అందునా, ఈ అంశాలని సాహిత్యేతర రంగాల్లో చదివిన పాఠకుడిలా ఉన్న ఒక్క అర్హత చాలు. ఈ విధంగా ఆలోచించడానికి రచయిత పేరు మర్చిపోతేనే సులభం.
మనం చాల కొటేషన్లు చూస్తాం: ఐన్‌స్టయిన్ దేవుడి గురించి ఇలాగ అన్నాడు. లేదా శ్రీశ్రీ పెట్టుబడి దారుల గురించి ఇలాగ అన్నాడు అని. ఇటువంటివి నమ్మడం ఒక లాజికల్ ఫాలసీ. అప్పీల్ టు ది అథారిటీ — అధికార ప్రమాణం — మనం ఈనాడు ఒప్పుకోము. ఐన్‌స్టయిన్ గారు ఫిజిక్స్ లో గొప్ప అంటే ఒప్పుకోవచ్చు. వారు దేవుడిగురించి ఏ విధమైన పరిశోధన చేశారు? శ్రీశ్రీ కవి అంటే ఒప్పుకోవచ్చు. ఆయన ఏ విధమైన ఎకనామిక్స్ చదివారు? ఆ కొటేషన్ చివర పేరు తీసివేసినా ఆ కొటేషన్ నిలవగలిగితేనే, అపుడు అది ఆలోచనార్హత పొందుతుంది.
నేను మరొకవిధంగా రచయిత పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా చూసి చదువుతాను.
మనం ఏ రచన అయినా దానంతట అది దాని కాళ్ళ మీద నిలబడుతుంది అనుకోవడం తప్పు. ప్రతి రచనా ఒక పరంపర, ఒక ఒరవడి, ఒక ఆలోచనా స్రవంతిలో భాగం. అది మనం పరిగణించక పోవడం వల్ల రచనను సరైన కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోలేము. ఆ కాంటెక్స్ట్ అనేది ఒక్కటే ఉండదు. రచయిత యొక్క అనేక అస్తిత్వాలు, భాష, చారిత్రిక నేపథ్యం, ఇలాగ అనేకం కలిసి కాంటెక్స్ట్ ను సృష్టిస్తాయి.
ఉదాహరణకి డైరీ అఫ్ ఆన్ ఫ్రాంక్ తీసుకోండి. అది రాసినది ఒక చిన్న పిల్ల అనీ, అది ఆ అమ్మాయి జీవిత చరిత్ర అనీ, ఆ అమ్మాయి నాజీల చేత హతమయిందనీ తెలియడం ద్వారా, ఆ కథకి ఒక ఆర్ద్రత, ఒక వాస్తవికత ఏర్పడతాయి. గుఱ్ఱం జాషువా రాసిన కవితలు ఆయన అస్తిత్వం ద్వారా మరికొంత బలం కూర్చుకొంటాయి. ఆయన అనుభవం ఆ కవితల్లో కనబడుతుంది. కనీసం పాఠకుడిగా ఆ కవితల వెనక ఆయన్ను చూడటం మనకి పఠనానుభవం పెంచుతుంది.
ఈ విధమైన నేపథ్యసహిత పఠనం ఈ రోజుల్లో ఎక్కువయింది. ఉదాహరణకి ఒక రచయిత తన ఆత్మకథ అని ఏ మిలియన్ లిటిల్ పీసెస్ అని ఒక పుస్తకం రాసాడు. తర్వాత అది ఫిక్షన్ అని తేలింది. ఆ నేపథ్యం మూలాన ఆ పుస్తకం అర్థమే మారింది. సైన్ ఫెల్డ్ టీవీ సిరీస్ లో ఒక పాత్ర పేరు చాంగ్ అని విని, ఆవిడ మాట ప్రాచ్య విజ్ఞుల మాట లాగ నమ్ముతుంది. ఆవిడ పేరు చాంగ్ స్టెయిన్ అని తెలియగానే, నమ్మడం మానేస్తుంది!
ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక కవి బ్లాక్ జీవితానుభవం గురించి ఒక కవిత రాసాడు. ఆ కవి తెల్ల వాడు అని తెలియగానే, అంతవరకూ మెచ్చుకున్న వారే, అతడిని ఆడిపోసుకున్నారు. ఇండియాలో కూడా, ఉదారవాది అయిన అరుంధతి రాయ్ అంబేద్కర్ పుస్తకానికి ముందు మాట రాయడాన్ని ఖండించిన వారున్నారు.
సాహిత్యం సర్వజనీనం అయినప్పుడు, ప్రతి ఒక్క రకపు అస్తిత్వానికి ఉనికి కల్పించడం మన విధి. అందుకే ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వవలసి ఉంటుంది. పాఠకుడిగా, మనం ఆ రచయిత అస్తిత్వం గణన లోకి తీసుకొని మరీ చదవ వలసి ఉంది. దీని మూలంగా సాహిత్య ప్రక్రియలు మారతాయి, కథలు మారతాయి, గొంతులు మారతాయి. సాహిత్యం జలనిధీ, జీవనదీనూ.
ఈ రెండు పరస్పర విరుద్ధ భావాలను ఎలా సమన్వయము చేయడం? ఇన్నేళ్ల తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, పిడుగుకీ, బియ్యానికి ఒకే మంత్రం వెయ్య కూడదు. ఎవరో ఫ్రెంచ్ రచయితా వేళాకోళంగా చెప్పినట్లు “రాజ్యం ధనికులనీ, పేదలనీ ఇద్దరినీ రోడ్లమీద పడుకోవడం నిషేధిస్తుంది” — సమానం గా చూడటం కాదు ముఖ్యం. ఫెయిర్‌నెస్ ముఖ్యం. (దీనికి సరైన తెలుగు పదం నాకు దొరకలేదు. నిఘంటు అర్థాలు సరిపోవు. ఎందుకంటే, ఇంగ్లీష్ లో జస్టిస్ యాజ్ ఫెయిర్‌నెస్ లాంటి పుస్తకాల మీద చర్చ జరగడం ద్వారా, ఈ పదానికి ఒక చరిత్ర ఏర్పడింది. తెలుగులో ఏ పర్యాయ పదానికీ ఆ చరిత్ర లేదు! మరొక సారి ఈ విషయం చర్చిస్తాను.) అధికార స్థానంలో ఉన్నవారినీ, అధీన స్థానంలో ఉన్నవారినీ ఒకే విధంగా చూడ కూడదు. కవిత బాగాలేదు అనుకున్న వారినే, అది పదేళ్ల పిల్లవాడు రచించాడంటే దానికి ఒక ప్రాముఖ్యం కలిగిస్తాం. తొమ్మిదేళ్ల పిల్ల 1919 లో రాసిన ఒక పుస్తకం మొదటి సంవత్సరమే 18 సార్లు పునర్ముద్రణ పొందింది!
పాఠకుడిగా చదువుతున్నపుడు, అనేక బాధ్యతలు ఉంటాయి. నాకు చదవడం వల్ల జ్ఞానం, రసానుభూతి లాంటివి కలిగించాల్సిన బాధ్యత నా స్వార్థమైన బాధ్యత ఒకటి. వీటికి అతీతమైన, మానవ స్వాభావితమైన సత్యాన్వేషణ బాధ్యత మరొకటి. రచనను పిండి పూర్తిగా దాని రసాన్ని, భావాన్ని, అర్థాన్ని గ్రహించాల్సినది రచయితకి బాకీ ఉన్న బాధ్యత. చివరిగా నాకు సాహిత్యం పట్ల, తద్వారా సమాజం పట్ల కూడా బాధ్యత ఉంది. నన్ను నేను పరిశీలించుకుంటే, మొదటి రెండు బాధ్యతలు బాగా నెరవేర్చినా, మిగిలినవి సంతృప్తికరంగా చెయ్యలేక పోతున్నాను. వినమ్రంగా, ఓపికతో, సహనంతో రచనలని, రచయితలనీ చదవాలని తెలిసినా, అది ఆచరణలో పెద్దటం కష్టంగా ఉంది. ఈ విషయం ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను.
చివరి మాట: ప్రతి నెలా రాస్తున్న ఈ శీర్షిక రెండు నెలలు రాయలేక పోయాను. అడవిలో చెట్టు పడితే శబ్దం చేస్తుందో లేదో తెలియనట్లు, నేను రాసింది ఎవరైనా చదువుతున్నారో లేదో తెలియకుండా ఉన్న మూలాన రాయాలన్న ఉత్సాహం కోల్పోయాను. మీకు ఈ విశ్లేషణ నచ్చితే, వచ్చే సారి నేను ఇంకా ఎలాగ చదువుతానో చెబుతాను. లోతుగా లేదా పైపైన ఎలాగ చదువుతానో, మొదటి నుంచీ లేదా వెనక నుంచీ ఎలాగ చదువుతానో — ఇలాగ అనేక విరుద్ధ ప్రక్రియలు కూడా నా జేబులో ఉన్నాయి, మీరు చదువుతామంటే. పాఠకులుగా మీ బాధ్యత మీరూ నెరవేర్చుకోండి మరి!
*
రాయండి సర్ ఆపకుండా!కొంతమందయినా ఉంటారు నాలాగ.ప్రస్తుతం నేను చేస్తున్నది అదే’నేర్చుకోవటం!
రచయిత ప్రత్యామ్నాయాలను చూడడం ఒక్కటే కాదు. మనకు తెలిసిన ప్రపంచంలో ఆ ప్రత్యామ్నాయాలను సమర్ధించే నిజాలను చూడగలగాలి అన్న పరిశీలన, రచయిత నేపథ్య సహిత పటనంతో చదువరికి ద్రుష్టి హ్రస్వం అయిపోతున్నదనే పరిశీలన బాగున్నాయి. చివరిమాటకు ముందున్న ఆఖరు పేరా సరిగ్గా అర్థం కాలేదు. సరైన విమర్శకులు కరవైన ఈ రోజుల్లో నిష్పాక్షికంగా రాయగలిగిన మీరు చదువరినే అన్న వినమ్రతతో అయినా సరే, రాయటాన్ని కొనసాగించటమే మంచిది. తెలుగులో రాయటం మీకు కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
My Regards to you sir .In a literary meeting I heard Madhurantakam Narendra garu say this…Tolstoy writings represent synthesis and Dostoyevsky writings show us Dissociation. Both are the two paths to know truth.
Till date I have not come across another such brilliant sentence
Now I read a whole essay. Wow.sir. every sentence has depth of comparative study.Quotations are real time wrappers. This has become the order of the day. Now I understand why an essay or a story gets thick and worth remembering. It’s originality of viewing life. Many many thanks. Yes. I have been waiting for your essays. But yes .I agree I did not raise the question why we are not getting your essays.
Please do write. It shall make the mirror more transparent and a glass more reflective. Thanku
My regards to you.
చాలా బాగుంది sir.
>> వంట వాడు వచ్చి మీకేం వంట వచ్చు? మీకు పచ్చడి అంటే ఏమిటి తెలుసునా అంటాడా?
హా హా మంచి జోకు. చదివేవాడికి రాసేవాడు లోకువ 🙂 ఈ నెల ఈమాట సంపాదకీయం కూడా ఓ సారి చదవండి.
>> నేను రాసింది ఎవరైనా చదువుతున్నారో లేదో తెలియకుండా ఉన్న మూలాన రాయాలన్న ఉత్సాహం కోల్పోయాను.
ఓ మాట చెప్పనీయండి. రాసేవాళ్ళు ఎవరికోసమో ఎప్పుడూ రాయరు అని నేను అనుకుంటున్నా. నాకు రాయాలని ఉంది అని రాయడమే. అది రాసి పంపిస్తాం. నచ్చితే సంపాదకులు వేసుకుంటారు. నచ్చకపోతే మరొకరికి పంపుతాం. ఈ సంపాదకులు మనలాంటి వాళ్ళే. మనకి రాయడంలో లెర్నింగ్ కర్వ్ ఉన్నట్టే వాళ్ళకీ ప్రచురించడంలో ఓ కర్వ్ ఉంది. పుట్టగానే ఒకరు రచయితా, మరొకరు సంపాదకులూ అయిపోలేరు కదా? పోతే ఎవరైనా చదివారా లేదా అన్నది మీరెన్నడూ నిర్ణయించలేరు. చదివినా కామెంట్ రాయడం ఇష్టం ఉండకపోవచ్చు (ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో). అందువల్ల మీ రాయకపోతే వచ్చే నష్టం మీకు డబ్భై అయిదు శాతం.
మరో విషయం మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా. మీరు రాయకపోతే కొన్నాళ్ళు పాఠకులు “అర్రే ఈయన మానేసారే రాయడం?” అనుకుంటారు కానీ కొన్నాళ్ళకి ఎవరికీ గుర్తుండదు. ఎవరి క్రాస్ లు వాళ్ళకున్నాయి కదా మోసుకోవడానికి?
ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. “If you have a brilliant idea and do not want to share with anyone about it, it will remain exactly where it is.” అర్ధమైందనుకుంటా. ఇలా అన్నందుకు మీరు తిట్టుకున్నా సరే.
ఈ వ్యాసం వల్ల నాకు చాలా కొత్త విషయాలు తెలిశాయి సర్. ఇవి పాఠకులకు మాత్రమే కాదు రచయితలకు కూడా చాలా ఉపయోగం. ఆ ఫ్రెంచ్ రచయిత ఎవరో గానీ వెటకారం ఎక్కువే!! ఇంకా రాస్తూ ఉండండి సర్.
whoah this blog is wonderful i really like reading your articles. Keep up the great paintings! You realize, a lot of people are hunting round for this info, you could help them greatly.