పాటలోని బైరాగి తత్వమేదో….

తెరలు తెరలుగా కదిలే మబ్బులు

పర్వత సానువుల్ని మంద్రంగా తాకినట్టు-

నిన్న నిదురించిన రాత్రి

ఈ పొద్దుటి మెళకువయై వికసించేలోపే

మంచుతెమ్మెరలా  చుట్టేసింది నీ పాట.

 

నన్ను నిద్రబుచ్చడానికి

హిచ్చొ…. ళ ళ ళ…. హాయీ….. దీర్ఘ…. రాగంతో

అమ్మ పాడిన జోల పాటలాగా

బహుశా ఈ జన్మంతా

నన్నావరించి వుంటుందేమో!

*       *      *

ఈశాన్యం నుంచి వీచి దేశమంతా చుట్టుకున్న

సత్పుల్ పరిమళమా!

బ్రహ్మపుత్ర నది వెంటా ,బరాక్ లోయలో

యుగయుగాలు ఆలపిస్తున్న

పురాతన జానపద గీతమా!

బారెడు పొడవున్న వెదురు పిల్లంగోయిలోనుంచి

ప్రవహించిన అస్సామీ ఆత్మ నీ పాట.

 

“తేర చూహా లాగే….మేరిసూఖీ డార్…హరియాయే…. ”

భూపేన్ దా….! నిజంగానే నీ రాగస్పర్శ

ఎడారులవంటి మమ్ము హరితవనాలుగా మార్చింది.

*    *     *

మనిద్దరికి ఏం సంబంధం వుందనీ …

నువ్వెక్కడో… నేనెక్కడో…

కనీసం  సంగీతం ఎరిగిన వాణ్ణి కూడా కాదు.

ఎందుకో మరి …నీ పాట

కష్టాల ఒరిపిడికి జీరబోయిన మా రంగయ్యగొంతులోని

దాసరి పదమే ఆనిపిస్తుంది.

 

ఎండిన మా సీమ పొలాలనుంచి

అడవులూ, కొండలూ దాటి

నన్ను చేరే నా పల్లె శోకగీతమై వినిపిస్తుంది.

మన గురించీ,

మనుషుల గురించీ మాట్లాడుకోవలసిన సందర్భాన్ని మళ్లీ గుర్తుచేస్తుంది.

నీ నేస్తం

పాల్ రాబ్సన్ ను మరీ మరీ జ్ఞాపకం చేస్తుంది.

పాటలోని బైరాగి తత్వమేదో నిత్యం మోహింప జేస్తుంది.

 

(భూపెన్ హజారికా అస్సామీ జాతుల గొంతుక .ఏడు ఈశాన్య రాష్ట్రాలే కాదు …ఇటు బెంగాల్ …అటు బంగ్లా కూడా… అంతగా ప్రేమించాయ్. ఇండియన్ పీపుల్స్ థియేటర్ సభ్యుడు. కొలంబియా యూనివర్సిటీ లో పీహెచ్డీ చేస్తున్నపుడు హక్కుల కార్యకర్త , నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్ స్నేహితుడయ్యాడు. చివరి రోజుల్లో అంటే 2004 లో బీజేపీ టికెట్ పై పార్లమెంట్ ఎన్నికల్లో  ఓడినాడు. ఈ పతనానికి నాలాంటి కొందరు బాధతో,కోపంతో,చాలా ఎక్కువ మోహంతో… అలిగి వుంటారు కూడా…..)

సత్పుల్ : సన్నజాజుల వంటి అస్సాం పూలు..

*

 

 

శ్రీనివాస మూర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు