పాఁవు

పొద్దు రాతిరి మా యింట్లో సంగటీ, సేపలకూర రడీ అయ్యేకాడికి టైం పదవతా ఉండాది. నేనూ, మా నాయన ఆ యేళ దాకా ఎపుడెపుడు అవతాదా, ఎపుడెపుడు తిందావా అని కాసి పెట్టుకోని ఉన్నోళ్లం, మాయమ్మ పొయ్యి మింద నించి కూర దించీ దించంగానే ఆత్తరమాత్తరంగా తినేదానికి కుచ్చునేసినాం. ఆలిసెం చెయ్యకుండా మాయమ్మ గూడా యిద్దరికీ చెరొక ముద్ద సంగటి పెట్టేసి, ఇంక యేడి యేడి సేపల పులుసు గిన్నెల్లో యేస్తాదనంగా, అపుడు పరిగెత్తుకుంటా వొచ్చినేడు రాఘవులు మావ “కనకబావా.. కనకబావా.. యో కనకబావా?” అని మా నాయిన్ని అరస్తా.

మా గుడిసి ముందేసిన పందిట్లో నిలబడుకోని అట్టా జెవుడు కాకి మాదిరిగా అరిసే ఆ మనిషిని జూసి, మేం ముగ్గురం ఏవైందన్నట్టు మొకాలు పెట్టినాం.

“ఏందిరా అట్ట చూస్తన్నావా? లేసిరాయా మల్ల తిందువుగానీ” అంటా తొందర పెడుతుండే మావతో, “యాందిరా? యావైందిరా?” అన్నేడు మా నాయన కుచ్చోనే‌.

“యో పాఁవుయా సోవే! పాఁవుయా!” అని రాఘవులు మావ అన్నేడో లేదో, మా నాయన సిరతపులి లేసినట్టు ఒక్క దెబ్బన పైకి లేసి, తలుపు మూలనుండే ఎదురుకర్రా, మూడు సెల్సుల బ్యాట్రీ అందుకోని “యాడ్రా? యాడ్రా?” అంటా బయటికి దూకినేడు. ఎనకాల్నే నేనూ, గిన్నెలు సర్దేసి మాయమ్మ కూడా లగెత్తినాం.

రాఘవులు మావ మా నాయన్ని నేరుగా యీధిలోకి తీస్కోనిబోయి మా గుడిసికీ, యీధికీ మద్దిలో అడ్డంగా నాటిన కంప సాయి చూపిచ్చి,

“ఇద్దోయా! ఇట్నే, ఈ సందులోనే దూరిందయా. సరైన పాఁవుయా. బాగా ముదురు పాఁవు అయ్యుండాల. కచ్చితంగా బారెడు పొడుగుంటాది. నేను నడుసుకుంటూ యింటికి పోతుంటే సల్లంగ దూరతుండాది మీ కంపలోకి. యీధి లైటు యెలుతుర్లో మిన మినా మెరస్తా ఉనాదియా దాని ఒళ్లా! నేను చూసేటప్పిటికే పాఁవు మొత్తం కంపలోకి దూరేసి, తోకని లోపలకి లాక్కుంటా ఉనాది. దాని తోకే మూరడుండాదియా సోఁవే!” అన్నేడు కన్నుగుడ్లు ఇంతింత పెద్దవి చేసి.

“ఈ మద్దెన ఈ పాఁవుల బాధ యెక్కువైపోయిందిరా రాఘవులా. ఈటెమ్మల్ని చెయ్యా. రాతిరయితే కోడి పెంట వాసనకి పరిగిస్తా ఉండాయి యిళ్లలోకి” అంటా బ్యాట్రీ యేసి, కంపంతా చెకింగు చెయ్యడం మొదలుపెట్నేడు మా నాయన.

“ఊరు గెవిట్లో యిల్లు కట్టుకుంటిరే. ఇంక పురుగూబుట్రా రాకనే ఉంటాయా?” మాయమ్మని, నన్నూ మార్చి మార్చి చూస్తా అన్నేడు రాఘవులు మావ.

మాయమ్మా, నేను ఒకరి మొకం ఒకరు చూసుకున్నాం ఏం చెప్పాలో తెలవక.

“వొరే మచ్చా. ఎట్టా పాఁవుని చూసినావు గదా. అట్ట కొట్టేసి పోయేవిరా నీకు పున్నెఁవుంటాది‌. నాకు అలివి గాని పనిరా అదా. ఏవనుకోబాకురా మచ్చా. ఈ సకాయం చేసిపెట్టరా. మొదులే పిల్లాజెల్లా, గొడ్డుగోదా తిరిగే సోటిది” అని మా నాయన అడగంగానే, రాఘవులు మావ ఎక్కడలేని ఈరత్వాన్ని తెచ్చుకోని,

“నేనే కొట్టేద్దును బావా! కానీ ఈ పొద్దు శుక్కురారం. ఎట్ట కొట్టమంటావు చెప్పా? అదే ఇంకో రోజైతేనా, ఈ పాటికి దాని తలకాయ పిచ్చల పిచ్చలగా పగులుంటాది” అన్నేడు.

దానికి మా నాయన నవ్వతా “ఒరే పనికిమాలిన నా కొడకో, ఎవురు చెప్పినేర్రా ఈ పొద్దు శుక్కురారవని? బుధారం రా ఈ పొద్దు పిచ్చోడా” అనేకాడికి మావ ఉక్కిరిబిక్కిరైపోయి, యాడ కొట్టాల్సొస్తుందోనని తడబడిపోతా,

“ఆఁ.. అయినా గూడా నేను కొట్టగూడదు లేయా. యింట్లో టయాలు బాగా లేవు మాకు” అని ఇంకొక సాకు చెప్పినేడు. ఇంక మా నాయనకి ఒళ్లు మండిపోయి,

“యెనకటికి పంగరాని మంగళోడు మంగళారం అన్నేడంట. అట్టున్నాది నువ్ చెప్పేది. నువ్వు బోరా పిరికి నా కొడకా. అయినా పొయ్ పొయ్ నిన్నడిగినాను చూడు. నాది బుద్ది తక్కవ” అనేసి చిరాకు పడినాడు. ఆ మాటంటానే మావకి ఇంతెమ్మన పొడుసుకొచ్చేసింది రోసం.

“యో నువ్ మాట్లాడేది బలే బాగుండాదే. నేనేదో పోనీలే పాపం పాఁవుయా అని చెప్తే నన్ను కొట్టమంటుండావే. అదసలే కాకలు తిరిగిన నాగుపాఁవుగా ఉండాది. అంత ధైర్నస్తుడివైతే నువ్వు కొట్టుయా సూద్దావా” అంటా ఎగిరినాడు.

“నువ్వు గమ్మునుండరే. అసలే పాఁవు కనపడక నేనేడస్తా వుంటే.. నువ్వు కొట్టబల్లేదులే పో” అన్నేడు మాయబ్బ వొంగి వొంగి కంప మొదుట్లోకి చూస్తా.

మా నాయనట్టా యాష్ట పోవడం చూసి రాఘవులు మావ కొంచుం మెత్తబడిపోతా,

“యో కనకబావా. అది ఏ బొక్కలోకో దూరేసుంటాదియా. ఈడ యెతికితే యాడ అగుపిస్తాది నీకో. పొయ్ లోగా చూడుబోయా” అన్నేడు.

మా నాయన బ్యాట్రీ యేసుకొని పోయి మా యింటికి, కంపకీ మద్దెలో వుండే సందులో చూసినేడు. నిజింగానే రొండు మూడు బొక్కలున్నేయ్ ఆ సందులో. అదే మాట రాఘవులు మావతో చెప్పినేడు. ఇంక మావ ఆయిన తెలివికి ఆయినే మురిసిపోతా “నేను చెప్పుండ్లా వోటిల్లోకే దూరుంటాదది. ఇంక నీ వల్లా, నా వల్లా కాదుయో. పొయ్యి యానాదోళ్ల చెంచడ్ని పిల్చుకోని రాబో. వోడైతే ఊదరబెట్టి పాఁవుని బయటికి రంపిచ్చి కొట్టిస్తాడు. పో పో” అన్నేడు.

మా నాయనకి అది దప్ప ఇంకొక దారి కనబళ్లేదేవో. ల్యాకుంటే అదే మంచిదనుకున్నేడో ఏవో మరి,

“సరే అట్నే పొయ్ పిల్చుకోనొస్తా గానీ, నువ్వు కొంచెం ఈళ్లిద్దరినీ చూసుకుంటా వుండురా” అని మమ్మల్ని రాఘవులు మావకి వొప్పజెప్పి, మళ్ళీ మాయమ్మకేసి చూసి, “మేయ్ ఈడ్నే ఉండండి. యింట్లోకి గింట్లోకి పోబాకండి” అంటా తలాకిటి మొత్తకి తడికి అడ్డం పెట్టి, యానాదోళ్ళ చెంచయ్య ఇంటికి పరిగెత్తినేడు.

నేనూ, మాయమ్మా, రాఘవులు మావ మా యీధికి ఆ పక్కనుండే సింతమాను కింద కుచ్చున్నేం. ఎన్నెల ఇరగ కాస్తుండాది. కరెంటు పోలుకి యేసుండే లైటు దగ్ దగ్‌మని మండతుండాది. దాని చుట్టూ ఈసుళ్ళు ఎగరతా వుండాయ్. గాలి సల్లంగ తోలతుండాది. ముగ్గరం ఏవీ మాట్లాడుకోకుండా గమ్మున కుచ్చోనుండాం. నాకు మాత్రం ఆలోశినంతా సేపల కూర మిందనే ఉండాది.

“మో.. యమా.. తిందాం పదమా” అన్నా మాయమ్మతో.

“ఒరే.. ఒక్క రుంచేపుంటే మీ నాయన చెంచయ్యని పిల్చుకోనొచ్చి పాముని కొట్టేస్తాడ్రా. మళ్ళి బొయ్ అందరం తిందాలే ఉండు నాయినా” అనింది మాయమ్మ నా తలకాయ మింద చెయ్యి పెట్టి నిమరతా. నేను ఇంకేం మాట్లాకుండా మొకం నల్లంగా బెట్టుకున్యా. మా ఇద్దరి మాటలిన్న రాఘవులు మావ “యేం కూర చిన్యా?” అనడిగినాడు మాయమ్మని.

“పచ్చాపల(పచ్చి చేపల) కూరనా. ఇంతకుముందే పొయ్యి మింద నించి దించతా ఉండా. నువ్వొచ్చినావు” చెప్పింది మాయమ్మ.

“అదీ కత. అందుగ్గదా మాయల్లుడు నిలవలేకపోతుండేదా!” అని ఆగి బీడీ యెలిగిచ్చుకోని, మళ్ళా నాతో “ఓరల్లుడో పచ్చాపల కూర పాసిపోదులే గానీ, ముందా పాఁవుని కొట్టనీరా. చూడబోతే అదసలే రాసనాగు మాదిరుండాది” అన్నేడు మావ.

నేను “రాసనాగు అంటే ఏంది మావా?” అన్నా టక్కమని. దానికి మావ బీడీని ఒక దమ్ములాగి వొదిలి,

“రాసనాగంటే ఏవనుకుంటన్నావ్? నాగుపాఁవు జాతిలోకే మకారాజు. అన్ని పాఁవులూ గుడ్లు బెట్టి పిల్లల్ని పొదిగితే, అది మటుకు గూడు కట్టి పిల్లల్ని కంటాది. అది పగబట్టి వొదిలినోడుల్యా. కరిస్తే బతికినోడుల్యా. అట్టుంటాది దాని యవ్వారం” అని ఒకసారి నాకల్లా తిరిగి, నేను భయం భయంగా ఇంటుండేది చూసి “ఒకసారి నా సిన్నప్పుడు యావైందంటే, అప్పుడు నేను నీయంత పిల్లోడ్ని. మా నాయనకి సద్దికూడు ఎత్తుకోని, గెనాల మింద నడుసుకుంటా చేలల్లోకి పోతుండా. ఉన్నెంట్టుండి కాలికి ఏందో తగిలింది. యాందబ్బా అని సూద్దునా. రాసనాగు! రాసనాగంటే మామూలు రాసనాగా? ఒక మనిషి పొడుగుండాది. బుస్సుమని బుసగొడుతుండాది. నేను భయపడ్లా. భయపడితే నేను మల్లిగోని బిడ్డని ఎట్టవతానా? గబక్కమని వొంగి దాని తోక పట్టుకోని గిర గిరా తిప్పి ఇసిరి కాలవలో పారేసినా. అంతే దెబ్బకి దడుసుకోని తిరిగి సూడకుండా పరిగెత్తిందది” అంటా ఇంకా యాందో చెప్తా వుంటే, సింతమానుకి గట్టేసిన మా బక్కెద్దు రాఘవులు మావ ఎనక్కొచ్చి బుస్సుమని బుసకొట్టింది. పాఁవు గావాల అనుకోని బిత్తరకపోయి బీడి వొదిలేసి, ఎగిరట్ట దూకినేడు ఆ మనిసి భయానికి. ఆయిన్ని చూసి మాయమ్మా, నేనూ పకపకపకా నవ్వతా ఉంటే, ఈలోగా మా నాయన చెంచయ్యని, వాళ్ళ కొడుకు మునిగోడ్ని యెంటేసుకోని వచ్చేసినాడు.

అప్పిటికే నడిరాతిరి దాటిపొయ్యుండాది. చెంచయ్య వొచ్చి రాంగానే చేతిలో పట్టుకోనుండే చిల్లు దుత్త కింద పెట్టి, కొడుకుతో “పొయ్ ఆడ రుంత కసువు జవురుకోని రాబోరా” అని సింతసెట్టు కింద మా బక్కెద్దు కోసం ఏసిన ఎండుగెడ్డిని చూపిచ్చినేడు. మునిగోడు గబగబా జవురుకోనొచ్చి వాళ్ళబ్బ ముందేసినాడు. ఆ గెడ్డినంతా ఆయిన ఆ దుత్తలోకి కుక్కినేడు. మొత్తం నిండినాక మళ్ళా దుత్తని ఎనక్కి తిప్పిచ్చి, దానికి యెనకాల పెట్టుండే బొక్కలోకి ఇంక రుంత కసువు కూరినేడు. ఆనేక మునిగోడ్ని పిల్చుకోని పొయ్యి, మా నాయన చూపిచ్చిన కలుగుల్లో ఒక కలుగు మింద దుత్త బోర్లిచ్చినేడు. నేనూ, మాయమ్మ కంపకాడ నిలబడుకోని ఏం జరగతుండాదో గెవనిస్తా వుండాం.

చెంచయ్య అగ్గిపుల్ల గీసి దుత్త ఎనక వుండే బొక్కలో పెట్టినాడు. గెడ్డి రగులుకునింది. ఆ రగులుకున్న గెడ్డిని ఒకమాపన ఊదన మళ్ళినేడు. అట్టా ఊదతా వుంటే కలుగులోకి పొగంతా పొయ్యి, పాఁవుకి వూపిరాడక బయటికి వచ్చేస్తాది. మునిగోడూ, మా నాయన గుడిసి సుట్టూ తిరగతా పొగ యాడ్నించి బయటికొస్తాదో సూస్తా ఉండారు. రాఘవులు మావ వాళ్ళ యెనకే నడస్తా వుండాడు.

చెంచయ్య నాలుగు సార్లు గెట్టిగా గాలి ఊదేకాడికి గెడ్డి మండుకోని దుత్త బొక్కలో నించి మంట బయటికొచ్చేసింది. చెంచయ్యకి మూతి కాలిపోయి “అబ్బా… అబ్బా…” అని మూలిగినేడు. మూతే గాదు మీసం గూడా మద్దిలో కాలిపోయి, పాతాల భైరవి సిన్మాలో మాయల పకీరు మీసం మాదిరిగా అయిపోయింది. అయినా గూడా మంటని చేత్తో తట్టి తట్టి ఆర్పేసి, వొదలకుండా ఊదతానే వున్నేడు. అమ్మా, నేను ఆయిన బాధ చూసి, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోని నవ్వుకుంటన్నేం.

కాసేపు అయినాక మునిగోడు మా యింటికి ఆ పక్కనించి “నాయినా! ఈడ్నించి పొగ బయటికొస్తన్నాదిరో” అన్నేడు. చెంచయ్య ఊదడం ఆపేసి “తొవ్వురా తొవ్వు.” అనరిసినాడు. మునిగోడు తొవ్వీ, తొవ్వీ కొంచేపటికి ఒక ఎలికిని తెచ్చి చెంచయ్య ముందరేసి “ఇదే ఉనింది కలుగులో” అని చెప్పినేడు. చెంచయ్య రాఘవులు మావ సాయ చూసి “ఏవిరా? నువ్వు చూసింది పాఁవునా? ఎలికినా?” అన్నేడు. ఆ మాటతో కూడా రాఘవులు మావకి ఉగ్రం వొచ్చేసింది. “యో ఎట్ట కనిపిస్తుండానుయా నీకా? పాఁవుకి, ఎలిక్కి తేడా తెల్దా మాకా?” అంటా కసిరినేడు. ఇంక చేసేదేఁవీ లేక ఇంకొక కలుగు మింద దుత్త బోర్లిచ్చి మళ్ళీ ఊదడం మొదులు పెట్టినాడు చెంచయ్య. మా నాయినా, మునిగోడూ, మావ మళ్ళీ తిరగడం మొదులు పెట్నేరు.

మావకి ఒక పక్క భయం భయంగానే వుండాది. ఆయన వాటం జూసి మునిగోడు కావాలనే “పాఁవు పాఁవు” అని ఇంకా భయపెడతుండాడు. మావ ఒక అడుగు ముందుకేసి, మునిగోడు “అదిగో పాఁవు.” అనంగానే నాలుగు అడుగులు యెనక్కి దూకతా వుండాడు. మాకు నవ్వాగడం లేదు. అట్ట గంటా, రొండు గంటలు చెంచయ్య ఊదర బెడతానే వుండాడు. మునిగోడు యింటి సుట్టూ తొవ్వతానే వుండాడు. మాయమ్మా, నేను నిదర తట్టుకోలేక బయట కుచ్చోని తూగను మళ్ళినాం. కాసేపిటికి మా నాయినా, మావ కూడా వచ్చి మా పక్కన కుచ్చోని తూగడం మొదులేట్టేసినారు. అట్ట తూగీ, ఇట్ట తూగీ సింతమాను కింద యేసుండే బండని ఆనుకోని మాయమ్మా, మాయమ్మ ఒళ్ళో తలకాయ బెట్టుకోని నేను యిద్దరం నిదరబోయినాం.

ఎప్పుడో కోడి కూసే యేళకి మునిగోడు “పాఁవు నాయినా… పాఁవు నాయినా…” అని చెంచయ్యని అరస్తా, దేన్నో దబా దబామని కొడతా వుండే సప్పుడు ఇనిపిచ్చింది. ఆ అలికిడికి మేం ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసినాం. చూస్తా వుండంగానే అబ్బా, కొడుకులిద్దురూ పాఁవుని కొట్టి, ఈధిలోకి యెత్తుకోనొచ్చి, రోడ్డుమింద యెలుతుర్లో యేసినారు. మేవంతా పైకిలేచి దగ్గిరికి పోయి, వోళ్ళు కొట్టిన పాఁవుని జూసి ఇచ్చిత్తరపడి నోళ్ళు తెరిచేసినాం. ఎందుకంటే రాఘవులు మావ చెప్పినట్టు అది నాగుపాఁవో, రాసనాగో గాదు. అదొక నీళ్ళపాఁవు పిల్ల. కరెస్టుగా రొండే రొండు జానల పొడుగుండాది. దానికి ఇసం గూడా ఉండదు. కరిసినా పెద్ద పెమోదం ఏవీ లేదు. మా నాయనకి దాన్ని చూసినాక ఎక్కడలేని సురుకు వొచ్చేసింది.

“యాడ్రా ఆ నా కొడుకా? వానెమ్మా. పరుంబోకు నా కొడుకు. ‘సరైన పాఁవుయా! బారెడు పొడుగుండాదియా! దాని తోకే మూరడుండాదియా’ అంటా చెప్పినేడు. ఈడ జూస్తే పాఁవే మూరడుండాది. లకాడి నా కొడుకు. యాడ్రా వోడా?” అంటా చుట్టూ చూసినేడు. రాఘవులు మావ యాడా కనబడ్లేదు.

“ఇంకేడ రాఘవులుగోడురా? వోడు ఎప్పుడో ఇంటికి పొయ్యి పొనుకునేసుండ్లా.” అన్నేడు చెంచయ్య నవ్వతా.

అందరం అట్ట మాట్లాడుకుంటా, అరుసుకుంటా ఉంటే, ఈలోగా నర్సితాత సొంబు పట్టుకోని కయ్యల్లోకి పోతా పోతా ఆ నీళ్ళపాఁవుని జూసి, “ఒరే బలే పాముని కొట్టినేరురా! మీయంటి మొగోళ్ళు ఈ దేశింలోనే లేర్రా!” అని ఎగతాళి చేసినేడు.

“ఎవురు మాత్తరం ఏవీ జేస్తారు పెదనాయన! ఇదంతా ఆ లమిడీ కొడుకు రాఘవులుగోడు చేసిన పని గదా. పాఁవు పాఁవు అని రాతిరంతా తిండీ, నిదర లేకండా చేసినాడు. దొరకాల నా కొడుకు…” అని మా నాయన తిడతా వుంటే, నర్సితాత మద్దిలో కలగజేసుకోని, “వోడి మాటలు ఎట్ట నమ్మినేవురా కనకా. పూసిందంటే కాసిందనేటోడు వోడు. వోడ్ని నమ్మి బాగుపడినోడు ఎవుడన్నా వుండాడా మనూళ్ళో? సరే సరే! ఇంకా ఎందుక్కానీ భగిసేట్లు, పొయ్యి పనికొచ్చే పనులు ఏవన్నా వుంటే చేసుకోబోండి.” అనేసెళ్ళిపోయినేడు.

మా నాయన “ఇట్టాటి ఏడుపు పెట్టి, యేడుక జూసే నా కొడుకులు ఉండబట్టే గదా ఊళ్ళూ, సంసారాలు నాశనమైపోతుండేది” అని రాఘవులు మావ గురించి గొణుక్కుంటా, పాఁవుని కర్రతో ఎత్తి దిబ్బలో పారేసి, చెంచయ్యకి డబ్బులిచ్చి పంపించేసినాడు.

సరే అయిందేదో ఐపోయిందని మేం తడికి తీసుకోని, యింట్లోకి పొయ్యి సూద్దుఁవా! వొడెమ్మా బడవా! యిళ్ళంతా మునిగోడు తొవ్విన బొక్కలే! వోటినంతా పూడ్చేకాడికి బారెడు పొద్దెక్కింది మాకు. ఇంకప్పుడు మొకాలు కడుక్కోని, రాతిరి చేసిన సంగటి నీరెక్కిపొయ్యుంటే దాన్ని అంబలి చేసుకోని, సేపలకూర నంజుకోని తినేసి, సింతమాను కింద మంచం యేసుకోని పొనుకున్నాం నేనూ, మా నాయన. పొనుకున్నోడ్ని గమ్మనుండకుండా “నాయినో! పాఁవుల్ని సంపితే పరియావరణం దెబ్బతింటాదంట. మా సారు చెప్తున్నేడు” అన్నేను నేను. అది ఇని మా నాయన మూసిన కన్ను తెరవకుండానే “యెవుడ్రా ఆ సారా? ముందు వోడ్ని పట్టి పెరకాల పాఁవు, అప్పుడు తెలస్తాది అబ్బయ్యకి దాన్ని కొట్టాల్నో, వొద్దో” అని నా తల కింద చెయ్యి పెట్టినాడు దుండు మాదిరిగా. నేను నన్నెప్పుడూ కొట్టే మా సారుని తిట్టినందుకు నవ్వుకుంటా కండ్లు మూసుకున్యా. రాతిరంతా నిదర ల్యాకండా వుండటం వల్లేవో నాకు యెంటనే నిదర పట్టేసింది.

*

రచయితలకు  ఏకాగ్రత అవసరం

* హాయ్ వెంకట్! మీ గురించి చెప్పండి.

మాది చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలోని కాళంగి. మా ఊరు శ్రీకాళహస్తి దగ్గర్లో ఉంటుంది. నేను పుట్టింది, పెరిగింది అక్కడే! పదో తరగతి దాకా అక్కడ చదివి ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చేశాను. కొన్నాళ్లు బెంగళూరులో ఉద్యోగం చేసి ప్రస్తుతం ఒక సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాను.

* పుస్తకాలు చదవడం ఎప్పుడు మొదలుపెట్టారు?

మా మావయ్య వెంకటయ్య పుస్తకాలు బాగా చదివేవారు. ఆయన ద్వారానే చిన్నప్పుడు నాకు పుస్తకాలు, దినపత్రికలు చదవడం అలవాటైంది. నేను మొదట చదివిన కథ బాలగంగాధర తిలక్ గారి ‘ఊరి చివర ఇల్లు’. అప్పటికి నాకు 12 ఏళ్లు. మొదట చదివిన నవల మైనంపాటి భాస్కర్ గారి ‘ఆఖరి మలుపు’. అవి చదువుతూ ఉంటే ఆసక్తిగా అనిపించేది. ఇడుపులపాయలో ఉన్నప్పుడు ఎక్కువగా యండమూరి, మధుబాబు నవలలు చదివేవాణ్ని. అప్పుడప్పుడూ పత్రికల్లో వచ్చిన కథలు చదువుతుండేవాణ్ని.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

బెంగుళూరులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఖాళీ సమయం ఎక్కువుండేది. అప్పుడే కథ రాయాలని అనిపించింది. అలా మొదటి కథ ‘అబద్ధపు బాణం’ రాశాను. 2018 ఏప్రిల్‌లో సాక్షి దినపత్రిక ఫన్‌డే‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత రాసిన ‘గోరువెచ్చని కన్నీరు’ కథ అదే ఏడాది సెప్టెంబర్‌లో సాక్షిలోనే అచ్చయింది. ఇప్పటికి 12 కథలు రాశాను.

* మీకు ప్రశంసలు తెచ్చిన కథలు?

‘ఆకలి యుగంలో ఒక రోజు’ అనే కథ చదివి రచయిత, జర్నలిస్టు డ్యానీ గారు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ‘మరో లోకం’ కథ చదివి కొందరు ఫోన్లు చేశారు. సాక్షిలో వచ్చిన ‘డోలు బాబా’ కథ చాలా మందికి నచ్చింది. కాళహస్తి బస్టాండ్‌లో నేను చూసిన ఓ వ్యక్తి గురించి కొంత ఫిక్షన్ కలిపి రాసిన కథ అది.

* మీకు నచ్చిన రచయితలు? కథలు?

దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథలంటే చాలా ఇష్టం. కొత్త రచయితలు ఆయన కథలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అనిల్.ఎస్.రాయల్ గారి కథలన్నా నాకు చాలా ఇష్టం. ఆయన కథలు చదివి నేను కథారచనలో మెలకువలు నేర్చుకున్నాను. వీరితో పాటు కేశవరెడ్డి గారి నవలలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. చాసో ‘బొండు మల్లెలు’, అనిల్.ఎస్.రాయల్ ‘నాగరికథ’, వెంకట్ శిద్దారెడ్డి ‘కస్తూరి నీడలు’, సీఎన్ చంద్రశేఖర్ ‘బాలు’.. ఇలా చాలా కథలు నాకు ఇష్టమైనవి ఉన్నాయి.

* కథలు ఎక్కువగా చదువుతుంటారు కదా! గతంలో వచ్చిన కథలకు, ఇప్పుడు వస్తున్న కథలకూ ఏం తేడా గమనిస్తున్నారు?

ఇప్పుడూ చాలా మంచి కథలు వస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పటి కథల్లో వస్తువు కొంత పేలవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తిలక్, నామిని లాంటి వారి కథలు గమనిస్తే, ప్రతి కథా పాఠకుణ్ణి ఒక స్థాయిలో ఆకట్టుకుంటుంది. గతంలో రచయితలు ప్రజల్ని ఎక్కువగా గమనించి, వారి జీవితాలను పరిశీలించి కథలు రాసేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఆ అవకాశం తగ్గిందనిపిస్తుంది.

కేశవరెడ్డి గారు రాస్తూ రచనలో లీనమైపోయేవారు. ఒకసారి అలా రాసి బయటకు వచ్చి చూస్తే పెద్ద వర్షం పడి ఇంటి ముందు కాల్వలు నీటితో నిండిపోయాయట. కానీ అదేమీ ఆయనకు తెలియదు. ఇదంతా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్తే తెలుసుకున్నాను. రచయితలకు అలాంటి ఏకాగ్రత అవసరం.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

మా ఊరి గురించి‌, అక్కడి మనుషుల గురించి కథలు రాయాలని ఉంది.

*

వెంకట్ ఈశ్వర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సూపర్ వెంకట్ గారు 👌👌👌 excellent story .. “ఇట్టాటి ఏడుపు పెట్టి, యేడుక జూసే నా కొడుకులు ఉండబట్టే గదా ఊళ్ళూ, సంసారాలు నాశనమైపోతుండేది” ఎంత బాగా రాసారండి.

  • చాలా బావుంది…యాసని బాగా పట్టుకున్నారు👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు