నీళ్ళు దట్టంగా పెరిగిన
చెరువు అడివిలో కొంగల
రెక్కల గానం చెవులకి ఎంత ఇంపో
పగటి పడవ పై
ఎండ తెరలెత్తి
మిన్ను కడలిలో తిరుగాడే
సూర్యుడెంత చక్కనోడో
ఊరిలోంచి గుప్పున లేచే
బువ్వ పరిమళం
ఎంత ఆకలి తీపో
ఎల్లిపాయకారం నూరిన
రోట్లో ఏలుపెట్టి తుడిచి
నాలిక మీద అద్దిన కారం
కొసమంట ఎంత కమ్మనో
బురద గుంటలో కొట్టకొచ్చి
దడి కట్టిన లబ్బరు కర్రల మీన
జాలాడి నీళ్ళు తాగి పూసిన
లబ్బరు పూలు ఎంత తెల్లనో
మీసాలు నెరిసిన తాత చెప్పే
ముతక శాత్రాలలో దాగిన
శృంగార మిణుగురులవి ఎంత వెలుగో
మా కాటయ్య మావ
డప్పు మోతకి
కాటిలో చిందాడుతున్న
పాడే మీద పీనుక్కి ఎంత కుశాలో
ఊరి ముడ్డమ్మటి
కోంటోల్ల బొందల మీద
పిడక ముద్దలా
రాతికొమ్ముపై కొలువైన
నందీసుడికి ఎంత దిగులో
పాతబడిన బియ్యం మిల్లు
గూళ్ళలో ముడుక్కునే
పావురాల్లని పట్టాలనే
కోరిక ఎంత సరదానో
ఇళ్ల ముంగిళ్ళలో
కళ్ళాపి కొమ్మలపై
ముగ్గు పిట్టలకి ఎంత సోకో
కడవ అంచుల మీద
నీళ్ళ మోతలాగా
కుర్రదాని ముడ్డి పై
జడ కొసల నాదం
ఎంత సందడో
అవ్వ చెప్పే దెయ్యాల కతల్లో
దాగిన భయం ఎంత వణుకో
రోజూ వేళకి మోగే
బడి గంట దొంగ తనంలో
ఎంత గర్వమో
తొలిసారి ప్రేమలేఖలో
విరిసిన ప్రియురాలు
ఎంతెంత అందమో
పాతబడని పసి గెవుతులలో
దాగబడిన మట్టి బతుకు
ఎంత ముచ్చటో!
*
కళ్ళాపి కొమ్మలపై ముగ్గు పిట్టల సోకు
ఒక పల్లెటూరి పిల్లగాడి ఊసులు ఎంత బాగుంటాయో నీదైన శైలిలో చెప్పిన కవిత అన్నయ్య.. పల్లెటూరిలోని పదాలని, దృశ్యాలని వాడడం వల్ల ఇది అచ్చమైన పల్లె కవితైపోయింది… ఈ కవితకి ఈ కవిత లాగానే అభినందనలు చెప్పాలి…