పల్లెవాసనల పిల్లవాడు…..

ఎక్కడా  భాషకి నకిలీ నగిషీలు పెట్టలేదు. ఏం చెప్పాలి అనుకున్నాడో అదే చెప్పాడు. విడమరిచి చెప్పాడు నారాయణ.

నం మన మూలాలని మరిచిపోయి ఎన్నాళ్ళయింది మనకి గుర్తుందా..? మన ఊరి వాసన , అందులో మనుషుల వేదన జ్ఞప్తికి వస్తాయా..? మనది మనమే భరింపలేని జీవితం అయిపోయాక పాత విషయాల జోలికి ఎందుకు వెళతాము. అసలు మనకోసం ఒక ఊరు ఉందని.అది మన కోసం ఎదురు చూస్తూఉంది అని గమనింపే ఉండదు. మనం అంతలా మారిపోయాం. మన మార్పు మనకే తెలియదు.మనం అదృష్టవంతులమా లేక మనల్ని మనం కోల్పోతున్న వలస పక్షులమా అనే ఫీల్ మాత్రం అప్పుడప్పుడు గుండె గూటిలోకి వచ్చి కూర్చుంటుంది.
అలాంటి సమయం లో ఒక వాక్యం రాయాలనే భావన మదిలో కదులుతుంది. దానికి కావాల్సిన సంరంజామా ఎలాగూ మెదడు పొరల్లో నిక్షిప్తం కాబడి ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం లేకుండానే రాసేస్తాము. ఇలా చాలా మంది కవులు తమ సొంత నేలను ఒళ్ళో పెట్టుకుని లాలించారు. నారాయణ స్వామి వెంకట యోగి, సిద్దార్ధ కవి వాగ్గేయ, ఖాజా, అఫ్సర్ , శివారెడ్డి, ప్రసాద మూర్తి, బండ్ల మాధవరావు, తగుళ్ల గోపాల్ వంటి కవులు తమ తమ సొంత నేలపట్ల చూపించిన ఆపేక్ష  ఎన్నదగింది. కష్టమో నష్టమో ఊరు ఊరే, ఆకలి కోసం వదిలి వచ్చిన ఊరు మనసు దాహం తీరుస్తుంది. అప్పుడు అది కావ్యమై కాగితం మీద కుదురుకుంటుంది.
ఒక పాతికేళ్ల లోపు ఉన్న కుర్రవాడు రాస్తే ప్రేమ కవిత్వం రాయాలి లేదా ప్రేమలేఖ  రాయాలి కానీ. వెంకట నారాయణ అనే ఈ కుర్రవాడు మాత్రం ఊరిని రాశాడు. ఊళ్ళో పడుతున్న వానని రాశాడు. వాన వాసన పట్టుకున్నాడు. కవిత్వంలో ఈ మధ్య రాస్తున్న కుర్రవాళ్ళా సరసన నిలబడడానికి తహతహ లాడుతున్న నారాయణ ” పల్లె వాన”చదవండి.

 పల్లె వాన 

వాన కురవగానే
మా ఊరంతా ముత్యం పువ్వులా విచ్చుకుంటుంది
ఇళ్ళ ముందు పరుగు పెట్టే మురికి జాలాట్లన్నీ
పిల్ల కాలువలై చెంగనాలు పెడతాయి
పిల్లలు నీటి బొట్లయ్యి
బుడుక్కు బుడుక్కున
మడుగుల్లో మునకలేస్తారు
ఎర్రల్ని పట్టి అరి చేతుల్లో పెట్టుకొని
గోరింటాకులు దిద్దుకుంటారు
చెట్లు వాన చుక్కల్ని విరిసి
దారుల్లో వెదజల్లుతాయి
కాకులు రెక్కల ముసుగుతన్ని
ముడుక్కోని కూర్చుంటాయి
రయితులు పట్టల్ని గొడుగులు చేసి
పంట మీద కప్పటానికి
పచ్చుల్లా చేలకి ఎగిరిపోతారు
అత్తరు పూసుకొని మట్టి
పడుచు పిల్ల హొయలు పోతుంది
పాములు దారి మరిచి
ఏ మదుగులమ్మటో
ఒళ్ళు చుట్టేసుకొని బుట్టలయి పోతాయి
గొడ్లు కొట్టాల్లో చలికి తలలు కడుపులో
పెట్టుకొని పడుకుంటాయి
ఊరు చుట్టూ ఉన్న వాగువంకల్లో
నీళ్ళు కుందేళ్ళ గుంపయి పరుగులు పెడతాయి
బాటలన్నీ పారేనీళ్ళ పాదాల్ని నాటిన పాదులవుతాయి
ఊరి ముంగలి చెంచుగుట్ట
దంపుడయ్యాక కడిగిన పెద్ద రోలులా ఉంటుంది
గాజు పురుగులు నల్లగా మెరిసిపోతూ
మెల్లగా జారిపోతుంటాయి
పిట్టలు కరెంటు తీగల మీద బారుగా వాలి
నిక్కి నిక్కి చూస్తుంటాయి
ఉసులు కరెంటుదీపాల చుట్టూ
చక్కర్లు కొడుతుంటాయి
ఊరి చెరువు నోటి నిండా
నీళ్ళు పోసుకొని నవ్వుతుంది
వాన వెలవగానే
మా ఊరి తూరుపు కొండల మీద
వానవిల్లు పురి విప్పి చిందులాడుతుంది
వాన కురిసినాక
మా ఊరు వానకి పూసిన
అచ్చమైన జనపదంలా ఉంటుంది.
ఎన్ని వాన కవితలు చదివి ఉంటాము?! కుందుర్తి దగ్గర మొదలు పెట్టిన వాన, ఈనాటికి ఎవరో ఒక కవి ఏదో ఒక చోట వాన మాట లేకుండా తన కవితా సంపుటిని తీసుకురాడు అంటే అదేం ఖండించదగిన విషయమేమీ కాదు. హెచ్చార్కె ” వానా వానా ఆకాశపు గానా భజానా” అంటాడు. పెద్దగా ఎలాంటి హంగుల్లేని వాక్యం అయినప్పటికీ వాన పడే ముందు ఆ హడావుడి చూస్తే, అనుభవిస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంది. ఇక్కడ ఈ కవితలో నారాయణ మాత్రం పల్లెని కడిగిన వాన గురించి మాట్లాడాడు. చాలా సాదాసీదా కవిత.కానీ ఈ కవితలో అతని ఊహా శక్తి నన్ను పట్టుకుంది. అతను బురద నేల గురించి రాయలేదు.జారిపడి పోయే రోడ్ల రొద రాయలేదు కానీ తన చుట్టూ ఉండే హడావుడిని పట్టుకున్నాడు. మబ్బు పట్టగానే గుండెల్లో మొదలయ్యే గుబులు చెప్పుకున్నాడు. ముఖ్యంగా అతను జీవ భాష వాడుకున్నాడు. కవిత్వాన్ని అది ఆసాంతం మోసింది. కాబట్టి మీముందుకు చేరింది.
మీరు ముత్యం పువ్వుని ఎప్పుడైన చూశారా…? అసలు ఉంటాయా..? అదో కొత్త భావన. ముత్యాన్ని పోలిక పెట్టడం మామూలు విషయమే కానీ దాన్ని పువ్వుతో మళ్ళీ పొలికపెట్టి చెప్పడం వల్ల తనకి తెలియకుండానే  ఆ సన్నివేశాన్ని కవిత్వం మూడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. జాలాట్లో అనే పదం వాడాడు. చాలా మంచి తెలుగు పదం. జాలాట్లో అంటే కాలువలో అని అర్ధం ఇంకా చెప్పాలి అంటే ఇళ్ల మధ్యలో పారే మురికి కాలువ.
“రయితులు పట్టల్ని గొడుగులు చేసి
పంట మీద కప్పటానికి
పచ్చుల్లా చేలకి ఎగిరిపోతారు”. ఈ పదాల్లో అతను పడ్డ  కుశాలు అంతా ఇంతా కాదు. ఎక్కడా  భాషకి నకిలీ నగిషీలు పెట్టలేదు.ఏం చెప్పాలి అనుకున్నాడో అదే చెప్పాడు. విడమరిచి చెప్పాడు. సులువుగా మెదడు లోకి పంపగలిగే సూత్రమేదో పట్టుకుని కవిత మొత్తం రాశాడా అనిపిస్తుంది. పాదులు చూపిస్తాడు, గాజు పురుగుల నెమ్మదయిన నడక చూపిస్తాడు. ఉసూళ్ల ఉనికి చెప్పుకు వస్తాడు. “ఊరి చెరువు నోటి నిండా
నీళ్ళు పోసుకొని నవ్వుతుంది ” చూడండి ఎంత గొప్ప మాట రాసాడో అసలు ఈ కవితలో ఉండే సిమిలీలు అన్ని దాదాపుగా మనం నిత్యం చూసేవే అయినా వాటిని నారాయణ వాడుకున్న పద్దతి మాత్రం అబ్బురంగా అనిపిస్తుంది. సందేహం లేనేలేదు. ఇతను కొంత కాలానికైనా కవిత్వం లోకి వస్తాడు. ఏదో అడపా దడపా రాస్తున్నా ఇకపై పూర్తి సామర్ధ్యాన్ని కవిత్వంలో పెడతాడు అనుకుందాం.
గుంటూరు జిల్లా, వినుకొండ ప్రాంతం దగ్గర ఉన్న గరికపాడు  నారాయణ స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం. సాహిత్యము తెలుసు, ఇతని కి సేద్యమూ తెల్సు. నారాయణకి సాహిత్యం మీద ఆసక్తి మెండు.  ఇరవై ఏళ్లకే  “భూమిపతనం” అనే నవల రాశాడు. చాలా మంచి నవల. ఒక ఊరిలో ఉండే సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మతం  చేసే విధ్వంసం వంటి అంశాల్ని చాలా నేర్పుగా చర్చకు పెడతాడు. శిల్ప నైపుణ్యాలు సంగతి పక్కన పెడితే అది సామాన్య పాఠకులకు చాలా త్వరగా చేరుతుంది. నవలా పరంగా అతను విజయం సాధించేశాడు. ఆలోచనపరుడు. గొప్ప రచయిత కాదగిన లక్షణాలున్నాయి. ఎన్నుకున్న వస్తువును ఒక భిన్నమైన రచనా శైలిలోకి ఒంప గలిగిన నైపుణ్యం కలవాడు. కొత్తగా కవిత్వం రాస్తున్నాడు. ఇంకా వాక్యం కాస్త మెరుగు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది.
కానీ వయసుతో పాటు ఉన్న అమాయకత్వం  త్వరగా  వదిలించుకుంటే మంచిది. వయసు మీరుతున్న కొద్దీ వాక్యం లో వేగం తగ్గితే కాలం ముందుకు తీసుకు వెళ్ళదు అనే విషయం గ్రహిస్తే మంచిది. మంచి చదువరి కాబట్టి విషయాన్ని అర్థం చేసుకునే వివేచన ఉంది. సరైన రీతిలో సాధన, అధ్యయనం చేయగలిగితే మనం ఒక మంచి సమగ్ర రచయితను చూడవచ్చు.
*

అనిల్ డ్యాని

4 comments

Leave a Reply to పల్లిపట్టు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుంది అన్న..మంచి కవిని తాజా వాక్యాన్ని పరిచయం చేసారు….మిత్రుడు నారాయణ భూమి పతనం నవల పంపినాడు… చదువుతున్న..
    బావుంది.
    వాన కవిత ,పరిచయం చేసిన విధం చక్కగా ఉన్నాయి అన్న…మీకూ తమ్ముడు నారాయణ కు శుభాకాంక్షలు

  • పువ్వు పుట్టగానే పరిమళించిన ట్లు. అద్భుతంగా రాసాడు..అంతకంటే అద్భుతంగా మీ విశ్లేషణ సాగించి..ఇద్దరికీ అభినందనలు..

  • మంచి కవితని పరిచయం చేసారు. నారాయణ వాడిని పదాలు చాలా సున్నితమైనవి. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు