పల్ప్ పుస్తకాలు తెరిచిన తలుపులు!

“దేశభక్తుడైతే మాతృభాష వదిలి పరాయి దేశ భాష వెంట పడడు”. ఈ మాట నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు అల్లూరి సీతారామ రాజు జీవిత చరిత్రలో చదివాను. బడిలో నేర్చుకునే వాటికంటే బయట ఎక్కువగా నేర్చుకునే నామీద ఆ మాటల ప్రభావం ఎక్కువగా పడింది. ఇంగ్లీషులో, చదువుకి అవసరమైనంత మాత్రమే నేర్చుకుని, కేవలం తెలుగు పుస్తకాలే చదువుతూ ఉండే వాడిని. అందుకని, నా ఇంగ్లీష్ పుస్తకాల చదువు ఆలస్యంగా, నెమ్మదిగా సాగింది. ఒక పాఠకుడిగా నా ఇంగ్లీష్ పుస్తక పఠనం ఎలా సాగిందో ఇప్పుడు వివరిస్తాను. 

చిన్నపుడు నేను చదువుకున్న  సౌపాడు ఎలిమెంటరీ స్కూల్ చిన్నది. మా పంతులు గారికి ఓపిక ఎక్కువ కానీ, ఇంగ్లీష్ బాగా రాదు. కాసిని అక్షరాలు నేర్పి పల్లపాటి స్కూల్ లో ఆరో తరగతికి పంపించాడు. తెలుగు పుస్తకాలు, వారపత్రికలు దొరికే పల్లెటూర్లో ఇంగ్లీష్ పుస్తకాలు ఒక్కటయినా కనపడేది కాదు. మా అన్నయ్యకి కాలేజీలో బహుమతిగా వచ్చిన న్యూ టెస్టమెంట్ మాత్రమే నాకు గుర్తున్నంతవరకు నేను చూసిన ఇంగ్లీష్ పుస్తకం. 

తాడికొండకి వెళ్లిన తర్వాత మా మాస్టారు ఇంగ్లీష్ పుస్తకాలు చదివిద్దామనే ఉద్దేశ్యంతో ఈనిడ్ బ్లైటాన్ (Enid Blyton) పుస్తకాలు మాకు పంచి పెట్టారు. అవి మరీ చిన్నపిల్లల పుస్తకాలు. మాట్లాడే పువ్వులు, జంతువులూ, వనదేవతలతో ఆ చిన్న కథలుండేవి.  పద్నాలుగేళ్ల వయసులో వున్న నేను,  చలం, విశ్వనాధ, శ్రీశ్రీ లాంటివారి సాహిత్యం చదివిన నేను, ఐదారు ఏళ్ల పిల్లలు చదివే ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. అది నాకు మరీ ఇబ్బంది అనిపించలేదు. ఇంగ్లీష్ సులభంగా ఉండటం, కథ ఆలోచించనవసరం లేకుండా ఉండటం వల్ల నేను ఆ పుస్తకాలు సునాయాసంగా చదివేసాను. కానీ, అవి తప్ప ఏమీ ఇంగ్లీష్ పుస్తకాలు చదవలేదు. తాడికొండలో ఉన్న తెలుగు వాతావరణంలో ఇంతకు ముందు చెప్పినట్లు అనేక గద్య, పద్య, కవితా పుస్తకాలు చదివాను కానీ, అవి కేవలం తెలుగు, లేదా సంస్కృతభూయిష్టమైన తెలుగులో మాత్రమే చదువుకున్నాను. 

కానీ నాకు ఇంగ్లీష్ చదవక పోవడంలోని లోటు ఏమీ తెలియలేదు. అన్ని భాషా పుస్తకాల అనువాదాలు తెలుగులో దొరుకుతుండేవి. నేను బెంగాలీ, హిందీ, మలయాళీ, కన్నడ, తమిళ, పారశీక భాషల్లో నుంచి తెలుగులోకి తర్జుమా అయిన నవలలు, నాటికలు చాలా చదివాను. అవి పరాయి భాష నుండి అని ఏమాత్రం అనిపించలేదు. కానీ, వేరే ప్రపంచమని మాత్రం బాగా తెలిసింది. ముఖ్యంగా రష్యన్ నవలలు చదివినపుడు ఆ సమాజం, ఆ మనుషులు, ఆ మాటతీరు, ఆ ఆలోచనలు విచిత్రంగా అనిపించేవి. అలాగే బెంగాలీ పుస్తకాలు కూడాను. అయితే, నేను పుట్టి పెరిగిన చోటనుంచి వేరే వేరే ప్రపంచాలు చూసిన నాకు వాటి మధ్య  మరీ మౌలికమైన వ్యత్యాసాలు కనిపించలేదు. అవి నాకు తెలియని ప్రపంచాలని సరిపెట్టుకున్నాను. 

మాలతీ చందూర్ ఆ రోజుల్లో ఇంగ్లీష్ నవలల్ని స్వాతి మాస పత్రికలో పరిచయం చేస్తూండేది. దాని ద్వారా అనేక నవలల కథలు తెలుసుకున్నాను. ఆవిడ ముందు ఆ నవల పుట్టుపూర్వోత్తరాలు చెప్పేది. ఆ తర్వాత ఆ కథ ఎందుకు నచ్చిందో కొంచెం సూచనప్రాయంగా చెప్పి, తర్వాత కథ అంతా చెప్పేది. ఆ పుస్తకాలు కొన్ని అద్భుతం! కొన్నేమో మరీ సాధారణమైనవి. ఆవిడ అభిరుచి నచ్చకపోయినా, కొన్నయినా మంచి పుస్తకాల గురించి తెలుసుకోగలిగాను. 

ఒక పిట్టకథ: నేను అమెరికాలో ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ, నేను రిల్కే, బౌదేలైర్ లాంటి వాళ్ళను తెలుగులో చదివాను అంటే ఆశ్చర్యపోయారు. రుస్తుమ్, షోరబ్ కథ, షేక్స్పియర్ నాటకాలు, గ్రీకు పురాణ గాథలు లాంటి పుస్తకాలు తెలుగులో చదివాను అంటే ఎవరూ నమ్మలేదు. అన్నిటికన్నా అందరూ పదే పదే నిర్ధారణ చేసుకున్నది, నేను తెలుగులోనే ఇలియట్ కూడా చదివాను అని చెప్పినప్పుడు! నిజానికి ఆ అజ్ఞాత అనువాదకులకి ఎంతగానో ఋణపడి ఉంటాను. 

నాగార్జున సాగర్ కి 17 ఏళ్ల వయసులో వెళ్ళినపుడు అది వేరే ప్రపంచం. అక్కడికి పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉండేవారు. అందుట్లో చిన్నప్పటి నుంచీ ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్న పిల్లలు ఉండేవారు. నేను ఇంగ్లీషులో నా అంతట నేను మొదటి వాక్య నిర్మాణం పదమూడో ఏట! (ది వాటర్ వస్ బాయిలింగ్ అనే వాక్యం రాసి అనేక సార్లు అది సరిపోతుందో లేదోనని  చూసుకోవడం గుర్తుంది). వాళ్ళు గడ గడ ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నారు! విచిత్రమేమిటంటే, నాకు పదవ తరగతిలో ఇంగ్లీష్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చింది. అయినా, వాళ్ళ లాగ కాస్త కూడా మాట్లాడటం తెలియదు. May be an image of 1 person

సాగర్ లో బుద్ధవరపు లక్ష్మీ నరసింహం గారు అని మా ఇంగ్లీష్ మాస్టారు నేర్చుకోవడమంటే మార్కులు అనే కాదు అని తెలిసిన వారు. ర్యాంకులు వచ్చినా, మేము ఇంగ్లీష్ పుస్తకాలు చదవని బాపతు అని తెలిసి మాకు ఇంగ్లీష్ పుస్తకాలు పంచి పెట్టారు. ఇవి నిజమైన పుస్తకాలు! పిల్లల కథలు కావు. నా అదృష్టం కొద్దీ నా వంతుకు వచ్చిన పుస్తకం Epitaph of a small winner. అప్పుడు నాకు తెలియదు కానీ, చాలా అద్భుతమైన పుస్తకం. నాకు చదవడం చాలా కష్టమైంది. ఏవో కొన్ని పేజీలు రాసి, ఆ కాన్సెప్ట్ మీద ఒక కవిత (తెలుగులోనే) రాసిన జ్ఞాపకం! అప్పుడు ఇంగ్లీష్ మీడియం మిత్రుడు జేమ్స్ హాడ్లీ చేజ్ నవల ఒకటి ఇచ్చి ఇది చదువు అన్నాడు. ఇంగ్లీషులో ఉన్నా ఆ చవకబారు నవల సులభంగా చదివేశాను. అంతే కాదు, బాగా నచ్చింది కూడాను. అటువంటివి మరో రెండు పుస్తకాలు చదివేశాను.

ఆ విషయం తలుచుకుంటే, ఇప్పుడు నాకు అనిపిస్తుంది — కొత్త భాషలో పుస్తకాలు ఇటువంటి పల్ప్ పుస్తకాలు చదవడంతో మొదలు పెట్టాలని! నిజానికి మాతృభాషలో కూడాను. అపరాధ పరిశోధనతో మొదలు పెడితే చదవడం అలవాటవుతుంది కానీ, ఆముక్త మాల్యదతో కాదు కదా! అందుకే తెలుగులో ఒక తరం వారికి సాహిత్యాభిలాష పెరగడానికి యద్ధనపూడి, యండమూరి లాంటి వాళ్ళు కారణం. ఇప్పుడు కూడా తెలుగు పాఠకులు పెరగలేదు అంటే మంచి పల్ప్ సాహిత్యం లేక పోవడం మూలానే అంటాను. ఆలోచింపచేసే రచనలు కాదు కావలసింది ముందు — చదివించే రచనలు కావాలి. 

అలాగే పదహారేళ్ళ వయసులో ఇంగ్లీష్ నవలలు మొదలు పెట్టిన నేను మరో రెండేళ్ళకి ఐఐటీ వెళ్లేవరకూ మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకాలు ముట్టుకోలేదు. అప్పటికి నేను తెలుగు పుస్తకాల మాయలో పడి ఉన్నాను. కళాపూర్ణోదయం, ముద్రా రాక్షసం, ఉత్తర రామచరితం లాంటి పుస్తకాలు, తెలుగు నవలలు, కవితలు ఆ రెండేళ్ళూ చదివినంత ఇప్పటి వరకు చదవలేదు. అప్పటికి నాకు ఇంగ్లీష్ అంటే గౌరవం పెరిగినా మక్కువ మాత్రం లేదు. 

ఐఐటీకి వెళ్ళేటప్పటికి, నాకు తెలుగులో పుస్తకాలు చదివే వాళ్ళు కొంతమందే తగిలారు. ముఖ్యంగా కొడవళ్ళ హనుమంత రావు, మా అన్నయ్య క్లాసుమేట్, అప్పటికే ఎం టెక్ చేస్తున్నాడు. తనకి వచ్చే స్కాలర్షిప్ డబ్బులతో తెలుగు పుస్తకాలు కొనేవాడు. తాను ఉన్న ఒక ఏడూ ప్రతివారం ఆ హాస్టలుకి వెళ్లి తెలుగు పుస్తకాలు చదివి, తర్వాత కామన్ రూమ్ లో వార పత్రికలు చదివి వచ్చేవాడిని. హనుమంతరావు ఉత్తమ సాహిత్యాభిలాష కలిగిన వ్యక్తి. ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదివే వాడు. అతని దగ్గర నుంచే నేను మార్టిన్ ఈడెన్ పుస్తకం తీసుకొని చదివాను. అందరూ ఏదో అంటున్నారని వుడ్ హౌస్ చదివాను కానీ, ఆ హాస్యం నాకు కొరుకుడు పడలేదు. 

ఆ తర్వాతి సంవత్సరం ఐఐటీ కి అలవాటు పడటం మొదలు పెట్టాను.  నా సాహిత్యాభిలాష ను ప్రభావితం చేసిన హనుమంతరావు లాంటి మనుషులు లేరు. నా మిత్రులంతా ఇంగ్లీష్ పుస్తకాలే చదివే వారు. వాటినే చర్చించుకొనే వారు. కాలక్రమేణా నాకు ఆ పుస్తకాలు అలవాటు అయ్యాయి. అందరూ చెప్పుకొనే పుస్తకాలు లిటిల్ ప్రిన్స్, జోనాథన్ లివింగ్ సీగల్ లాంటి పుస్తకాలూ,  నకిలీ సైన్స్ పుస్తకాలు (అంటే డాన్సింగ్ వూలీ మాస్టర్స్ లాంటివి), చివరికి అయాన్ రాండ్ పుస్తకాలు చదివాను. ప్రతి ఒక్కళ్ళూ చదువుతున్నారని చదివాను కానీ, ఈ పుస్తకాలు నన్ను ప్రభావితం చెయ్యలేదు. అయితే, నాకు వుడ్ హౌస్ హాస్యం, కామిక్ పుస్తకాల హాస్యం (టింటిన్, ఆస్టెరిక్స్) అర్థం అయ్యాయి. 

ఆ నాలుగేళ్లలో మూడు అనుభవాలు నా ఇంగ్లీషు పుస్తకాల చదువుకి మైలు రాళ్లు. ఒకటేమో, సైన్స్ ఫిక్షన్ చదవడం. ఒక మిత్రుడు ప్రతి వారం బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ కి వెళ్లి సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు పట్టుకొచ్చే వాడు. తాను కాలేజీ లో సైన్స్ ఫిక్షన్ మీద ఒక కోర్స్ కూడా చేశాడు. ఇద్దరం ఆ పుస్తకాలు చదివి చర్చించుకునే వాళ్ళం. ఆ రోజుల్లో చదివిన నవలల్ని, కథల్ని వర్గీకరించే వాళ్ళం. ఎక్కడో (అంటే, భూమ్మీద కాకుండా వేరే గ్రహం మీద), ఎప్పుడో (అంటే సాధారణంగా చాలా ముందటి భవిష్యత్తులో), ఎవరో (అంటే, మనుషులు కాకుండా వేరే జీవులు). వీటిని రకరకాలుగా కలపవచ్చు (అంటే, రెండు గ్రహాలు అయితే, వాటి మధ్య ప్రయాణం, సంఘర్షణ లాంటివి; రెండు కాలాలు అయితే కాల ప్రయాణం లాంటిది, ఇలాగన్న మాట. ఇలాగ రచనల్ని స్థూలంగా విభజించడం చాలా సౌకర్యం. పోల్చడానికి, అంచనాలు వెయ్యడానికి, కొత్తదనం ఎక్కడ ఉన్నదో చూడటానికి సదుపాయం. 

మరొక్కటి తెలుసుకున్నదేమిటంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, సైన్స్ ఫిక్షన్ లో సైన్స్ అంత ఉంది. ఈ రచనల్లో, సైన్స్ కేవలం ఒక ఊహా ప్రపంచం నిర్మించడానికి ఒక ఊతంమాత్రమే. అంటే ఏ సమస్య అయినా పరిశీలించడానికి ఒక లాబరేటరీ లాగ, ఒక కృత్రిమమైన ప్రపంచం సృష్టించి, కొత్త కోణాల ద్వారా ఆ సమస్యని చూడగలుగుతాం. ఆ లాబరేటరీ తెలుగు వారిది కాదు, అమెరికా వారిది కాదు, అది పూర్తిగా ఊహా ప్రపంచం. అందులో రచయిత సాంస్కృతిక చరిత్ర ఉన్నా, దాన్ని అధిగమించి ఆలోచనామృతంలాగ అర్థం చేసుకోగలిగితే అనేక మౌలికాంశాల చర్చ ఉంటుంది. మనిషి అంటే ఏమిటి? సమాజం అంటే ఏమిటి? ఇటువంటి ప్రశ్నలని మనం అనుకోని కోణాలనుంచి అర్థం చేసుకోవడానికి ఆ పుస్తకాలు నాకు సహాయ పడ్డాయి. అంతకన్నా మౌలికమైన ప్రశ్నలు వెయ్యటం నేర్పాయి. 

రెండో అనుభవం నేను డాస్ కాపిటల్ చదవడం. చిన్నప్పటి నుంచి వామ పక్ష భావాల నవలలు చదివాను. పేదల తరుపు అంటే కేవలం మార్క్సిజం మాత్రమే అన్న అభిప్రాయం అప్పుడు! కానీ, ఏనాడూ మార్క్సిజం చదవలేదు. నేను ఐఐటీ ఉన్నపుడు ఒక్క సారి హాస్పిటల్ లో మూడు రోజులు గడిపాను. అప్పుడు ఎందుకో ఈ పుస్తకం, రెండవ భాగం, నా దగ్గర ఉన్నది. దాన్ని మొదటి నుంచి చివరి వరకూ చదవడం మొదలు పెట్టాను. నేను బయటికి వచ్చాక మొదటి, మూడవ భాగాలు చదవలేదు కానీ, ఆ విషయాల మీద రాసిన కొన్ని కార్టూన్ పుస్తకాలు చదివాను. 

ఈ పుస్తకం చదవడం మూలాన నాకు ఒక గొప్ప జ్ఞానం కలిగింది. ఏమిటంటే, ఎవరన్నా ఏవిషయం గురించి అన్నా చెప్పిన దాన్ని మంత్రం లాగ భావించకుండా మనం మూలం దగ్గరికి వెళ్లి చదవగలం! ఆ ఉత్సాహంతో నేను వేదాలు, ఉపనిషత్తులు సంస్కృతం / ఇంగ్లీష్ లో చదివాను. ఇంకా మార్క్సిజం గురించి తెలుసుకోవడానికి, ఒక మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ లో చేరి కొన్ని ఫ్రెంచ్ తత్వ వేత్తలు రాసిన పుస్తకాలు చదివాను. మరొక్క విషయం తెలిసిందేమిటంటే ఈ రక రకాల పుస్తకాలు చదవడం వల్ల భాష మీద పట్టు పెరిగింది. నాకు తెలియకుండానే, భాష నాకు చదవడానికి ప్రతిబంధకంగా ఉండడం తగ్గిపోయింది. కేవలం భావ సంక్లిష్టత మాత్రమే వేగంగా చదవడానికి నాకు అడ్డం వచ్చింది. ఇంకా అప్పటికి తెలిసిందేమిటంటే ఇంగ్లీష్ లో నాకు కావలసిన పుస్తకాలు తెలుగులో కన్నా ఎక్కువ ఉన్నాయి అనేది. అనువాదాల మీద ఆధారపడే నాకు మొదటి సారి ఇంగ్లీష్ లో చదవడంలో ఉండే ఉపయోగాలు కనబడ్డాయి. 

మూడవ అనుభవం ఒక వ్యక్తిగతమైన దీక్ష లాంటిది. నేను బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్నపుడు, అమెరికాలో కాలేజీ లకి అప్లికేషన్లు పెట్టుకోవడం మొదలు పెట్టాను. దానికి దాదాపు రెండు వేల రూపాయల ఖర్చు. ఎన్ టీ ఎస్ ఈ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ నాకు తిండి, చదువు ఖర్చులకి సరిపోయేది. ఈ అప్లికేషన్ల కోసం ఒక నెలన్నర పాటు సెలవుల్లో అప్పుడే కొత్తగా పెట్టిన మద్రాస్ కంప్యూటర్ లాబొరేటరీస్ లో ఉద్యోగం చేసాను. ఆఫీస్ నాగేశ్వరరావు పంతులు పార్కు దగ్గర. అమృతాంజనం వాసన వచ్చేది. 

ప్రతిరోజూ నాకు దినచర్య ఇలాగ ఉండేది. ఉదయాన్నే లేచి ఆఫీస్ కి వెళ్ళి, అక్కడే ఏదో తినెయ్యడం. మధ్యాన్నం పక్కనే ఉన్న హోటల్లో గట్టిగా టిఫిన్ లంచ్ లాగా తినడం. సాయంత్రం వస్తూ వస్తూ, అక్కడ పాత పుస్తకాలు చూసి ఏదో ఒక పుస్తకం కొనడం. వచ్చి అర్థ రాత్రి వరకూ ఆ పుస్తకం చదవడం. దాదాపు రోజుకి ఐదు, ఆరు గంటలు చదివే వాడిని. (ఉద్యోగానికి న్యాయం చెయ్యలేదు అనుకొనేరు! నేను ఆప్టిమైజషన్, ప్లానింగ్ అప్పుడే వస్తున్న “పర్సనల్ కంప్యూటర్” మీద రాశాను. మాన్యువల్ చదివి ఆ కంపెనీకి కొన్ని స్టాండర్డ్ లైబ్రరీ సృష్టించాను. ఆ నెలన్నరకే నాకు కాస్త బోనస్ కూడా ఇచ్చారు!)  

సెలవులు కావడం మూలాన, నా స్నేహితులెవరూ హాస్టల్ లో లేరు. చివరి సంవత్సరం అవడం మూలాన, నాకు ఏ పరీక్షలూ లేవు. పుస్తకాలే మిత్రుల్లాగా, రోజు రోజూ ఇంగ్లీష్ నవలలు చదువుతూ వచ్చాను. డికెన్స్, ఆస్టిన్, బ్రోన్టే, వైల్డ్ ఇలాగ ఇంగ్లీష్ రచయితలూ, టాల్స్టాయ్, దోస్తోయ్వస్కీ, ఇలాగ రష్యన్ రచయితలూ, ఫిట్జ్ గెరాల్డ్ లాంటి అమెరికన్ రచయితలూ, ఇలాగ ఆంగ్ల సాహిత్యాన్ని చదవడం మొదలు పెట్టాను. చదువుతున్న కొద్దీ, ఆ ప్రపంచపు కొత్తదనం పోసాగింది. భాష అడ్డం రానట్లు, ఆ ప్రపంచంతో ఉన్న అపరిచితత్వం అడ్డం రాకుండా పోయింది. ఆ సంభాషణలూ, ఆ ఆలోచనలూ ఆకళింపు చేసుకోగలిగాను. 

అప్పటికి నాకు ఇంగ్లీష్ పరాయి భాష అవడం మానేసింది. ఆత్మీయులతో తెలుగులో మాట్లాడినా, కొన్ని కొన్ని సంభాషణలకు ఇంగ్లీషే తెలుగు కన్నా సహజంగా తోచసాగింది. అమెరికా వెళ్ళిన తర్వాత, భాష, శైలి, కథ, కథనం — వీటన్నిటి గురించి పూర్తిగా వేరే అవగాహన వస్తుందనీ, నా ఇంగ్లీష్ పూర్తిగా మారిపోతుందనీ, నాకప్పుడు తెలియదు. 

తరువాయి భాగంలో, ఆంగ్ల సాహిత్యంలో అమెరికాలో నా ప్రయాణం ఎలా సాగిందో చెబుతాను.

*

రామారావు కన్నెగంటి

6 comments

Leave a Reply to Vasu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు చెప్పింది నిజమే. పల్ప్ చదవడం అనే అలవాటు పెంచుతుంది. సాహిత్య పఠనానికి అది ప్రధమ సోపానం.

  • “ఔను నిజం ఔను నిజం
    ఔను నిజం మీరన్నది మీరన్నది
    మీరన్నది మీరన్నది నిజం నిజం.”
    మీ యీ విడత వ్యాసం చాలా చక్కగా ఉంది. నాకు నేనూ నా బాల్యమూ కనిపించే రచనలన్నీ మంచివే.
    -వాసు-

  • నేనూ చందమామ కథల తో మొదలెట్టి Komoori Sambasiva rao గారి ditective నవలల తో సాగి kodavatiganti చలం శ్రీశ్రీ రావిశాస్త్రి ఆ పైన లెనిన్ State and revolution దాకా సాగింది. కుటుంబ రావు గారు ఎక్కడో కొవ్వలి ,జంపన అనే వారి రచనల ను pulp రచనలు గా ప్రస్తావించారు అని గుర్తు.

  • I agree, that’s why Chetan Bhagat is so popular among lower / upper middle class students in India , though he is not extraordinary writter his English and subjects in his writings are so easy to read and understand for any one with different backgrounds

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు