1
పర్వతమంత నొప్పి ఉంది అది కరిగిపోవాలి
ఈ హిమాలయాల్లోంచి ఒక గంగ ప్రవహించాలి
ఈరోజు గోడలు పరదల్లా ఊగుతున్నాయి
కానీ పునాది ఇంకా పెకలాల్సి వుంది
ప్రతి వాడలో ప్రతి మూలలో
ప్రతి పల్లెలో ప్రతి నగరంలో
ప్రతి శవమూ చేతులు ఎగిరేస్తూ కదలాలి
హంగామా సృష్టించటం నా ఉద్దేశం కాదు
దేశ ముఖచిత్రo మారాలని నా సంకల్పం
నీ గుండెల్లో లేదంటే నా గుండెల్లో
ఎక్కడయినా సరే నిప్పులు రగలాలి
హిందీ మూలం: దుష్యంత్ కుమార్
2
ఇనుప గుణం
శబ్దం ఎలా
కవిత్వమవుతున్నదో
ఒకసారి చూడు
అక్షరాల మధ్యలో
జారిపోయిన మనిషిని
తప్పక చదువు
ఇది ఇనుప చువ్వల చప్పుడా..,
లేక
మట్టిలో రాలిన రక్తపు రంగా
అని ఎపుడన్నా తెలుసుకున్నావా
‘ఇనుము’ గురించి
కంసాలిని ఏం అడుగుతావు..!
ముక్కు మీద కళ్లెమున్న
అశ్వాన్ని అడిగి చూడు.
హిందీ మూలం: ధూమిల్
నవంబర్ 9, 1936 సంవత్సరం వారణాసిలో జన్మించారు. ‘ధూమిల్’ అనే పేరుతో చాలా కాలం కవిత్వాన్ని రచించారు. 10 ఫిబ్రవరి 1970 నాడు మరణించారు. కల్ సున్ న ముజే, సంసద్ సె సడక్ తక్, సుధామ పాండే కి ప్రజాతంత్ర అతని ప్రముఖమైన రచనలు. ‘కల్ సున్ న ముజే’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
Add comment