నేను నా నటుడ్ని
నా పాత్రను ప్రస్తుతిస్తూ నన్ను నేను చూపిస్తాను
నేను నా నటుడ్ని నా పాత్రకు మొదటి ప్రేక్షకుడ్ని
నేను నా నటుడు ధరించే పాత్రను కాను
ఈ రసరసాయనంలో నాది ప్రేక్షక పాత్రకాదు
నేను నా ఆకలిని కాను
నా ఆకలి అస్తిత్వాన్ని
నేను నా ఆహారాన్నీ కాను
నా ఆహారపు అస్థిత్వాన్ని
నేను ఈ పదాల్ని నా కవితలో
ఉపయోగిస్తున్నట్లు తెలియకుండానే ఉపయోగించలేను
నేను ఈ ప్రశ్నల్ని సంధిస్తున్నట్లు
తెలియకుండానే జవాబులకోసం ఎదురు చూడలేను
నేను ఈ ఊరేగింపులో నా జాడల్ని వదులుతున్నట్టు
తెలియకుండా నడవలేను
నేను ఈ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నట్టు
తెలియకుండా అరవలేను
అయితే :
నేను ఈ పదాలు నా కవితలో పడకమునుపే
నేను నా ప్రశ్నల్ని సంధించక మునుపే
నేను ఈ ఊరేగింపులో నా అడుగుల్ని నడవక మునుపే
నేను నా నినాదాల్ని గొంతెత్తి అరవక మునుపే
నేను నా ఉనికిని
నా ఉనికి వేరు, నా అస్తిత్వం వేరు
నేను వేరు, నేను – నన్ను వేరు
నన్ను – నేనుకు నువ్వే
నేను నా అజ్ఞానాన్ని
నేను నా అభినివేశాన్ని, నా వైఫల్యాన్ని
నేను నా ద్వేషాన్ని, నా రాగాన్ని
నా ఒకే ఒక్క ఉనికికి అనేక అస్తిత్వాలు
నేను నా పౌరసత్వాన్ని
నా పౌరసత్వం నా దేశానిది
నా దేశం నాది
నేను నా ప్రభుత్వాన్ని కాను
నేను నా ప్రజాస్వామ్యాన్ని
ప్రభుత్వం నాపై ఉపయోగించే చట్టాలూ -చట్రాలు
నా ఆమోదంతోనే చెయ్యాలి
నేను ఈ దేశ పౌరుణ్ణి
నా పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
ప్రజల పౌరసత్వాన్ని ప్రశ్నించే ప్రభుత్వాలకి చట్టబద్ధత లేదు
ఈ ప్రభుత్వం నాది కాదని
తెలియకుండా నేను పౌరుడిగా మనలేను
నా పౌరసత్వం నా ఆయుధం
నేను నా ఆయుధం
నా పౌరసత్వం నా ఉనికి నా అనేక అస్తిత్వాల్లో ఒకటి కాదు
నేను నా పౌరసత్వం, నేను నా ప్రజాస్వామ్యం
నా ప్రజాస్వామ్యమే నా పౌరసత్వం
రాజ్యాంగం నా ఉనికి నా అస్తిత్వం కాదు
ఈ ప్రభుత్వానికి నా వ్యతిరేకత రహస్యంకాదు
విప్లవం ఒక ఎత్తుగడ, విప్లవం నా ఉనికి కాదు
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల్ని వ్యతిరేకించటం నా అనేక అస్థిత్వాల్లో ఒకటి
నా ఉనికి వేరు నా అస్తిత్వం వేరు
ప్రభుత్వం నాకు నువ్వు
నేను వేరు నన్ను వేరు నువ్వు వేరు
*
చిత్రం: తిలక్
నా ఒకే ఒక్క ఉనికికి అనేక అస్థిత్వాలు
Nice