పదిపైసలు-పాట

రుచటిరోజు మళ్లీ అదే సమయానికి జముకు మోగింది.

“అమ్మా! పాటకెల్దామా!?” అన్నాను.

“నా వల్లకాదు నాయనా! నిద్దర చాలదు” అనేసింది అమ్మ.

“నే నెలతాను” అన్నాను

“నీ ఇష్టం.. ఎలితే ఎల్లు” అంది.

“మరి డబ్బులివ్వాలి కదా!” అన్నాను. డబ్బులిమ్మని చెయిచాపేను

“డబ్బులు లేవురా!” అని నసుగుతూ సునబగాయితీసి, మళ్ళీ పావలాకాసు చేతిలో పెట్టింది. నేను వెంటనే పరుగెత్తాను.

రెండో రోజు కథ మొదలుబెట్టాడు పాఠుకుడు. వాల్మీకి ఆశ్రమములో నున్న సీతాదేవి ప్రసవవేదనతో కథ మొదలయింది

సీతాదేవి రోజూ సాయంత్రంపూట విహారానికి దగ్గరిలో ఉన్నపూలతోటలోనికి వెళుతుం టుంది. ఆమెకు అప్పటికి నవమాసాలు నిండి వుండడముతో ఇద్దరు మునికన్యలు ఎప్పుడూ ఆమెవెంటే వుంటూనే వుంటారు

ఆరోజు కూడా అలా సాయంత్రము పూలతోటలో వుండగా ఆమెకు నొప్పులు వస్తాయి.

గాయకుడు ఆ సందర్భాన్ని లేదా ఆ సన్నివేశాన్ని  చాలా గొప్పగా పాడేడు. అందరికీ ఏడుపు తెప్పించేశాడు.

“ అమ్మా!.. ఓ చెలీ..ఓ సఖీ!.. ఓ మునికన్యలారా! నా ఉదరభాగమునందు  నొప్పి వచ్చు చున్నదమ్మా! .. అమ్మా!” అనగానే  మునికన్యలు వెంటనే జల్దుకొని

“అమ్మా! మెల్లగా ఆశ్రమానికి వెళిపోదాం పదండి . నెమ్మదిగా నడవండి” అని ఆమెను పట్టుకుని నడిపిస్తారు.

సీతమ్మ మాత్రం

అమ్మా!.. నేను నడువలేకున్నాను సుమా!.. అమ్మా!.. అంటూ బాధపడుతూ ఉంటుంది.

ఆ గాయకుడు మధ్య మధ్య ఒకటి రెండు మాటలు చెపుతూ, భావానికి అనుగుణంగా నొప్పిని నటిస్తూ పాటలోనే కథంత చెప్పాడు

ప్రసమ సమయమమ్మా

నేనెటుల నడువనమ్మా

ఇది ప్రసమ సమయమమ్మా..

అమ్మా!.. అబ్బా!..నొప్పి తీవ్రముగానున్నది, అయ్యో!

నడువ జాలానే.. ఓయమ్మా

నడువ లేనొక ఘడియయైనా

నడువ జాలానే.. ఓయమ్మా

నాతొడలు భారాములాయే

నా నడుము నిలువాక పోయే..  “నడువా”

నాతొడలు భారమాయే

నా నడుము నిలువదాయే

నా శ్వాస ఆడదాయే

నా ఊపిరాగిపోయే.. ఓయమ్మా..

నడువ జాలానే.. ఓయమ్మా

నడువలేనొక ఘడియయైనా

నడువ జాలానే.. ఓయమ్మా!  అని పాడేడు.

(పాట పూర్తిగా గుర్తులేదు. సుమారు యాభై యేళ్ల తరువాత పాట కొంతైనా గుర్తుందంటే ఆవాళ అతడు పాడిన విధానమే కారణము.)

కొల్లి ముసలమ్మ సంగతి చెప్పనక్కరలేదు. పయ్యాడకొంగుతో కళ్లు తుడుచుకుంది. బొంగురుపోయిన గొంతుతో బాధగా అంది.

“తల్లి మాలచ్మి పుట్టికాన్నుంచి అన్నీ కష్టాలే, కష్టాలు అనుభగించడానికే మానవ జలమ్మెత్తింది ఆడ జల్మమంత అద్దోనమైన జల్మ మరోటి లేదు..” అని వ్యాఖ్యానించింది .

పాటకులు ఆరోజు కుశలవుల జననమూ-వాల్మీకి మహర్షి వద్ద వారి విద్యాభ్యాసమూ-శ్రీరాముని  యాగాశ్వమును అడ్డుకోడమూ- తండ్రీ కొడుకుల యుద్దము-సీతమ్మ తల్లిభూదేవిలో కలిసి పోవడము-కుశలవుల పట్టాభిషేకము-రాములవారు అవతారాన్ని చాలించడము అంతా పాడేరు.

అలా మొత్తానికి ఆరోజు పాట పూర్తి అయింది.

పాట పూర్తయి హారతి పళ్లెము ఒకరు తిప్పుతుండగా మిగతా యిద్దరూ ఇలా చెప్పారు.

“అయ్యా! గతములో ఈ గ్రామానికి వచ్చిన ఏ కళా బృందము వారైనా, తమ ఈ గ్రామాన్ని గురించి గొప్పగానే చెప్పారు. ఆ మాటలు విని మేము ఈ గ్రామానికి వచ్చాము. మాది ‘నివగాం’ గ్రామము. మేము ఈ గ్రామానికి,ఇదే మొదటిసారి రావడము.అయితేనేమి మేము వచ్చినందుకూ ఈ రెండు రోజులు  ఇక్కడ మీ ఆదరాభిమానాలు చూస్తున్నాము..

వెనక పాటగాడు కల్పించుకోని

“ఈవిగల చెయ్యి వాసనగల పువ్వు ఎక్కడున్నా దాగవుగదా!” అన్నాడు.

దానికి ప్రధానపాఠుకుడు

“అవునురా నాయనా! అంతేకాదు… కవులేమన్నారో తెలుసా

ఇయ్య ఇప్పింపంగల

అయ్యలకే గానీ మీసమన్యుల కేలా!

రొయ్యకు లేదా బారెడు

కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా! అన్నారు.

అట్టి దాతలు దానకర్ణులు ఉన్న ఈ సభ గొప్పది. వీరి కీర్తి ఆచంద్ర తారార్కము వర్ధిల్లాలి.” అని చెప్పి సభలోని పెద్దలనుద్దేశించి .

“అయ్యా! మీ దాతృత్వముతో మమ్మల్ని సంతోష పెట్టారు. అందుకు మీకందరికీ పేరు పేరునా వందనాలు తెలుపుకుంటున్నాము. మీ గ్రామము ఇలాగే దినదినాభివృద్ధిచెంది మాబోటి కళాకారులను ఆదరించాలని కోరుకుంటున్నాము.” అని కాసేపు పొగిడారు.

రెండోరోజు పాట పూర్తయిన సమయానికి పక్కనే ఉన్న శృంగారపు వాళ్ల ఇంటి దగ్గర నుండి ఒక మానితో బియ్యము, ఒక గోనెతో చోళ్లు తెచ్చి మధ్యలో పెట్టారు ఇద్దరు.

కొల్లోలి ముసలమ్మ అప్పుడు చెప్పింది.

“అవిగో.. ఈ రోజు పాటకు మీకు రావలసిన గింజలు. ముత్తుము బియ్యము, నల్తుము సోలు. మొత్తము ఏడుకుంచాలు.ఇంటికి సోలడు తవ్విడు దండి తెచ్చాము.” అని చెప్పింది.

“దండింది నేను కాదునే, నాకు కాలూ సేతుల్లేవు, నానేటి తిరగ్గలను! అదిగో సింగారపు నచ్చుమమ్మ, కొత్తమ్మ ఆ ఇద్దరే బాజ్జితపడ్డారు.”  అని కూడా  చెప్పింది.

పాటుకులు చాలా సంతోషపడ్డారు.

“అమ్మా! రేపు అన్నమ్మగారి దొడ్డిలో పాడమంటున్నారు, కొసవీధి వారు.

కళాభిమానులు, కళాపోషకులు అయిన మీరు, మా మీద దయచూపి అక్కడకు కూడా వచ్చి మాపాట విని, మీరు ఆనందించి.. మమ్మల్ని ఆనంద పరచమని వేడుకుంటు న్నాము తల్లుల్లారా!” అంటూ రెండు చేతులతో దండం పెడుతూ చెప్పి ముగించారు.

కథ పూర్తైనా నేను వెళిపోలేదు,చివరవరకూ ఉన్నాను. ఆ పాఠుకులంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది నాలో. వాళ్లప్రతిమాట ప్రతి కదలిక ఆసక్తిగా చూసేను.

***

నాకు రెండురోజుల జముకుల పాట బాగా నచ్చింది. మూడోరోజు, రోజంతా రెండు రోజుల్లో విన్న పాటలో గుర్తున్నవి చిన్న చిన్న చరణాలు పాడుకొన్నాను.

ఎప్పుడు రాత్రవుతుందా! మళ్లీ ఎప్పుడు పాట వింటానా! అని ఎదురు చూశాను.

రాత్రి అయింది. నా భోజనమూ అయింది.

“అమ్మా! ఈ రోజు పాటెక్కడో తెలుసా!” అన్నాను,మా అమ్మతో,

మా యింట్లో పాటలన్నా పూజలన్నా మా ఇద్దరికే ఆసక్తి. మిగతావారు ఇవేమి పెద్దగా పట్టించుకోరు.

“ఎక్కడైతే మనకేల.. నేను రాలేను, నువ్వు రెండురోజులు ఇన్నావు చాల్లు. పల్లక పడుకో.. రోజూ నిద్దరలేక పోతే మళ్లీ ఏదో ఒకటొస్తాది రోగం..” అంది.

నాకు వెళ్లాలని ఉంది. మనసు అటే లాగుతోంది.

“అమ్మా!ఈరోజు ఎక్కడో కాదు అన్నమ్మగారి దొడ్డిలోనే….!”  అన్నాను.

అన్నమ్మగారి దొడ్డి మాఇంటికి తూర్పుదిక్కున ఓ రెండువందల గజాల దూరములో వుంటుంది. నిజానికి అది దొడ్డికాదు. అదికూడా మూడువీధులు కలిసే చోటే. కాకపోతే వాళ్ళ ఇల్లు,మిగతా ఇళ్ళవాసకంటే మరికాస్తా ముందుకొచ్చి వీధిలోకి వుంటుంది. అక్కడ, అలా మూడు వీధులు కలిసే చోటునే అన్నమ్మగారి దొడ్డి అని అందరూ అంటారు. ఆ పక్కనే మా పెద్దమ్మ గారి ఇల్లు కూడావుంది.

“ఎల్లనూరికి దారెందుకూ పల్లక పడుకో….”   గట్టిగా గసిరింది.

“ఈ ఒక్కసారికే ఎల్తానమ్మా!”..అని మా అమ్మ వెనకనే తిరగసాగేను.చివరికి విసిగి

“ఎల్తే ఎల్లు నన్ను విసిగించక.” అని చిరాకు పడింది.

ఎలాగోలాగ ఒప్పుకుందిలే అని సరదాపడ్డాను.

“మరి డబ్బులో” అడిగాను

“దులుపుతాను.. ఎందుకంటే డబ్బులు చెట్టుకి కాస్తన్నాయి కదా!” అంది. వెటకారంగా

“ డబ్బులు లేకుండా ఎలాగైతే” అన్నాను.

“నాదగ్గర కాణీ లేదు, లేనిది నేనేటిచ్చీది” అంది చిరాగ్గా.

“ఈ ఒక్కరోజుకే అన్నాను కదా!”

“ఒక్కరోజే ఎల్తావో, రోజూ ఎల్తావో..నీ యిష్టం. నాదగ్గరైతే కాణీ లేదు. నువ్వు నమ్మప్పొతే ఇంద చూడు” అని తన నడుముదగ్గర చీరకొంగుకున్న సునబగాయి తీసి రెండు కప్పులూ చూపించింది.

నాకు ఏమి చెయ్యాలో తోచలేదు.

ఎలాగ!? ఎలాగైనా వెళ్లాల.. మనసు ఒకటే పీకుతోంది.

హఠాత్తుగా ఒక విషయము గుర్తుకొచ్చింది.

సాయంత్రం  కోమటి సత్యారావు కొట్టులో, బుడ్డీ కిరసనాయిలు పోయించి,నప్పుడు పావలా యిస్తే పదిహేను పైసలు తీసుకొని పదిపైసలిచ్చాడు. ఆ పదిపైసలు ఉండాలి గదా!

ఆ విషయమే అమ్మతో అన్నాను.

“ఆ .. ఉండాలి. ఉంటే ఎంది? ఇపుడిచ్చియ్యాలా!?”  అంది కోపంగా.

“అమ్మా..!అమ్మా..!”  అని మళ్లీ పాటపాడేను.

చివరికి విసిగిపోయి అంది

“ఆ దేవుడి బల్లమీద ఉంటాది  ” అంది చిరాగ్గా!

“ చేతిన పదిపైసలైనా లేకుండా అయిపోయాము. డబ్బుల్లేవంటే వినవు” బాధపడుతూ అంది.

ఆమాట నాకు బాధగానే అనిపించింది. కానీ ఆగలేకపోయాను.

రేపట్నుంచి మరి వెళ్లకూడదు. అని గట్టిగా తీర్మానించుకున్నాను.

ఆరోజు పాటకు ఆలస్యంగా వెళ్లాను. అప్పటికి పాట మొదలుపెట్టి కొద్ది సేపయిపోయింది. వింటున్నానే గానీ పాట నాకేమి బోధపడడం లేదు.

అత్త కోడలిని చాలాబాధలు పెడుతుంది. ఏటికి వెళ్లి జల్లెడతో నీళ్లు తెమ్మంటుంది. కోడలు తేలేకపోతుంది. అత్త రెండువైపులా గది తలుపులు మూసేసి రోటిలో పందుము మిరపకాయలు దంచమంటుంది కోడలిని. పాపము ఆ కోడలు చాలా బాధలు పడుతుం ది. ఆమె పార్వతీదేవి భక్తురాలు. తనపేరు కూడా పార్వతే. కొన్నాళ్ల తరువాత పార్వతీదేవి తన చెల్లెలయిన గంగాదేవిని ప్రార్ధించగా చివరికి ఆమె జల్లెడలో నీళ్లు నిలబడేటట్టు చేస్తుంది. మిరపకాయలు కారము దంచేస్తుంది. ఇలా సాగుతోంది కథ.

అది భారతమా!.. కాదు, రామాయణమా!.. కాదు. మొదలు తెలియదు. దాంతో యిబ్బం దిగా అనిపించింది. దానికి తోడు నిద్రొకటి వచ్చేస్తోంది. కాసేపు బలవంతంగా విన్నాను.

కానీ వుండలేకపోయాను.

వెళిపోదామని లేచాను. మరి వాళ్లకి డబ్బులివ్వాలి కదా! యిప్పుడు డబ్బులిస్తే  నేను వెళిపోతున్నట్టు తెలిసిపోతుందని సిగ్గుపడి డబ్బులివ్వకుండానే వచ్చేసాను.

అప్పటికి మా అమ్మ ఇంకా పడుకోలేదు.

“ఏమి తొందరగా వచ్చేశావు” అడిగింది.

నిద్దరొస్తోందని చెప్పకుండా

“నువ్వు పదిపైసలన్నా లేదు అన్నావు కదా! అందుకే వచ్చేశాను” అన్నాను.

“సర్లే పల్లక పడుకో”  అంది.

నా సంగతి అమ్మ కనిపెట్టేసి నట్టుంది. చీకట్లో కనపడ్లేదు కానీ, అమ్మ నవ్వుతున్నట్టు నా కనిపించింది. ఎందుకంటే

మా అమ్మ సంగతి నాకు తెలీదా! నాసంగతి అమ్మకు తెలీదా!

***

రెడ్డి రామకృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు