పతంజలి శాస్త్రి కథకు వైవిధ్యమే వెన్నెముక

పతంజలి శాస్త్రి కథలన్నీ విచిత్రమైన ఉపమానాలు, కొత్తరకం వర్ణనలతో,కవితా శైలిలో పాఠకులను ఆలోచింపజేస్తాయి.

ర్తమాన తెలుగు సాహిత్యంలో విలక్షణ కథారచయితగా పేరుపొందిన తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1945 మే 14న జన్మించారు.ఒంగోలు,తిరుపతి,పుణేలలో విద్య నభ్యసించారు.దక్కన్ కళాశాలలో పురావస్తుశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నారు. బహుకాలం అధ్యాపక వృత్తిలో వున్నారు.గత రెండు దశాబ్దాలుగా పర్యావరణ రంగంలో కృషి చేస్తున్నారు.రాజమండ్రిలో ఎన్విరాన్మెంట్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.అర్థ శతాబ్దంగా అక్షరయాత్ర సాగిస్తున్న పతంజలి శాస్త్రి “వడ్ల చిలుకలు,పతంజలి శాస్త్రి కథలు” అనే కథా సంకలనాలు,”దేవర కోటేశు,హోరు”అనే నవలలు,ఒక కవితా సంపుటి,కొన్ని అనువాదాలను చేశారు.రచయితగా నవలలు,కథలతో పాటు సామాజిక శాస్త్రవేత్తగా పర్యావరణ సంబంధిత విషయాలు రాశారు.మెరుగైన సమాజం కోసం రచనల ద్వారానే కాకుండా,పర్యావరణ పరిరక్షణకై ఉద్యమకారుడిగా కృషి చేస్తున్నారు.పతంజలి శాస్త్రి అన్ని రచనలు ఒక ఎత్తు.కథకుడిగా ఆయన చూపిన ప్రతిభ మరో ఎత్తు.మొదట వెలువడిన “వడ్ల చిలుకలు” కథలకు,తర్వాత రాసిన మరిన్ని కథలను కలిపి “పతంజలి శాస్త్రి కథలు” పేరిట సమగ్ర సంకలనాన్ని తీసుకువచ్చారు.

మానవ జీవితానికి నీరే ఆధారం.నీటిచుట్టే నాగరికతలు వెల్లివిరిశాయి.నీటిచుట్టే సంపదలు అలుముకుని వున్నాయి.నీటిని వెతుక్కుంటూ జీవితాలు వలస పోతుంటాయి.నీరు లేకపోతే ఏమీ వుండదు.వర్షాభావం తో నీళ్ళు లేక ఎడారిలా మారుతున్న ఆనంతపురం.వారి బ్రతుకులు,వారి జీవితమంతా నీటికోసం ఎదురు చూస్తుండటంతోనే గడిచిపోతుంది.వారి కలలు,కన్నీళ్ళు,ఆశలు అన్నీ నీటి చుట్టే తిరుగుతుంటాయి.తాగడానికి కూడా నీళ్ళు లేక మరుభూమిలా మారిన ఊరు.నీళ్ళు కావాలి.నీళ్ళు…నీళ్ళ గురించే కథలు.వాటి చుట్టూ అల్లుకున్న కలలు.వాటిని కథలు కథలుగా వివరించే “కతలవ్వ” ఓదార్పు పిల్లలకు రంగుల స్వప్నం లా వుంటుంది.కాని నిజం అంతకంటే భయంకరంగా వుంటుంది.అనంతపురంలో వర్షాలు కురవాలి.అలాంటిలాంటి వర్షాలు కాదు.కుంభవృష్టి కురియాలి.ఆ వర్షాలకు ఏర్లు పొంగిపొరలాలి.వరదలు-ఊరు కొట్టుకుపోయేంత వరదలు రావాలి. అనంతపురంలో వరదలు అసంభవమైన,ఒక అందమైన ఊహ.ఆ ఊహలో “పిచ్చిదైపోయిన లచ్చమ్మ” అందర్ని వరదల గురించి హెచ్చరిస్తూ తిరుగుతుంటుంది.ఈ లచ్చమ్మను ఎవరూ మరిచిపోలేరు.వెంటాడుతున్న లచ్చమ్మ జ్ఞాపకాలు “ఆమె దనంతపురం” అని గుర్తు చేస్తూనేవుంటాయి.లచ్చవ్వ లాంటిదే కదిరమ్మ కూడా.కరువుతో అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు.అప్పు లేకుండా చేస్తామని నమ్మించి కొందరు కదిరమ్మ శీలంతో ఆడుకుని ఆమెను మోసం చేస్తారు.గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్న కదిరమ్మ చనిపోయి పేరంటాలు అవుతుంది.కదిరమ్మ బతికి వున్నప్పుడు అమ్మవారికి మొక్కుకుని వానలు కురిపించమనేది.ఇప్పుడు కదిరమ్మ పేరంటాలు అయింతర్వాత ప్రజలు వాన కురిపించమని ఆమెకు మొక్కుకుంటున్నారు.ఆమె శాంతిస్తేనే వానలు కురుస్తాయని వారి నమ్మకం.కరువును,వర్షాభావాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే,ప్రజలు ఇలాంటి నమ్మకాలలోనే మునిగి తేలుతుంటారు.

దారిద్రం ఎంతో భయంకరమైనది.అది మనిషిని జీవచ్చవంలా మారుస్తుంది.తిండి లేక చావడం వేరు.తిని చావడం వేరు.తింటే ఛస్తామని తెలిసినా తిండి కోసం వెంపర్లెత్తక తప్పదు.నిత్య దారిద్రంతో భాధపడే సోవయ్య శాస్త్రి ఒక “భోక్త”. అనారోగ్యంతో భాధపడే సోవయ్య,వైద్యానికి కూడా డబ్బుల్లేని సోవయ్య,భోజన ప్రియత్వంతో సాంవత్సరీకానికి వెళ్ళి,అది వికటించి కళ్ళు మూయడం మనల్ని కలచివేస్తుంది.దుర్భర దారిద్రంలో అమ్ముకోవడానికి ఏమిలేక చివరకు “రుబ్బురోలు” అమ్ముకోవడానికి ప్రయత్నించి నవ్వుల పాలవుతాడు విశ్వనాథం.దారిద్రం మనిషిని ఎంత పిరికిగా,ఎంత అశక్తుడిగా మారుస్తుందో విశ్వనాథాన్ని చూసి తెలుసుకోవచ్చు.అగ్రవర్ణాల వారి దారిద్రం భేషజాల మాటున మగ్గి,పరువు పేరుతో వారి జీవితాలు ఎలా అణగారి పోతున్నాయో ఈ కథలు తెలియజేస్తాయి.అయినా పరువు కంటే కుర్రాడి భవిష్యత్తే ముఖ్యమని తెలుసుకున్న ఒక బ్రాహ్మడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని “మూడో జన్మ” లో చూడవచ్చు.కరువు కాలంలో ఆకలికి తట్టుకోలేక విశ్వామిత్రుడు,చండాలుడు దాచుకున్న కుక్క మాంసాన్ని దొంగిలించి తిని కడుపు నింపుకోవడం పురాణాల్లో చదివాం.ఇప్పటి కాలంలో దారిద్రాన్ని భరించలేని బ్రాహ్మణుడు,దళితుడిగా మారడానికి కూడా వెనుదీయడం లేదని”మూడో జన్మ” తెలియజేస్తుంది.ఇందులో ఇంజనీరింగ్ చదవడమే కొడుకు ఆశయం.ర్యాంక్ రాలేదు.బీద బ్రాహ్మడైన ఆ పిల్లవాడి తండ్రి,కొడుకు బాధ చూడలేక అతడి మంచి భవిష్యత్తు కోసం ఒక దళితుడికి అతడ్ని దత్తత ఇచ్చేస్తాడు.అలా ఆ ద్విజుడికి అది మూడో జన్మే.ఇంతకంటే మంచి పరిష్కారాన్ని వాళ్ళు ఊహించలేకపోతారు.బడుగు జీవుల దారిద్రం అందరికి తెలిసిందే.ఎలాంటి దాపరికాలు వుండవు.ఇంట్లో వాళ్ళంతా ఏదో ఒక పని చేస్తేనే కాని కడుపు నిండని పరిస్థితి.పెద్దపెద్ద హోర్డింగులు,వాల్ పోస్టర్లు వారికి కాలక్షేపం.అలాంటి ఒక వాల్ పోస్తర్ ను చూసి వలీ అనే ఒక బాలుడు అందమైన జీవితాన్ని కలలు గంటాడు.కాని వాస్తవం అతని కలలన్నింటిని ద్వంసం చేసి పారేస్తుంది.పదకొండేళ్ళ వలీకి అక్క బీ దేవతలా కనిపించేది.తానసహ్యించుకునే కరీం ను,ఆమె పక్కలో చూసి ఆ షాక్ కు తట్టుకోలేకపోతాడు.ఇల్లు నడపడానికి అక్క ఏం చేస్తుందో,ఎలా చేస్తుందో తెలియదు.తన అక్కను తన నుండి దూరం చేస్తున్నదేదో గుర్తించలేక వలీ “వాల్ పోస్టర్” మీద పేడముద్ద వేసి తన కసి తీర్చుకుంటాడు.ఇక గిరిజన ప్రాంతంలో దారిద్రం లో బతకడం కోసం రహస్యం గా “రంగురాళ్ళ” తవ్వకానికి వెళ్ళగా,మట్టి పెళ్ళలు విరిగి సజీవ సమాధి కావడం ఇంకో కథ.

జీవితమంతా పోటీమయమైపోయింది.చదువుకోవాలంటే పోటీ.ఉద్యోగం కోసం పోటీ.బ్రతకాలంటేనే పోటీ.యాచకో యాచక శత్రు.కుండీలో చెత్త ఎత్తుకుపోవడానికి కూడా పోటీయే.తన కుండీలోని చెత్తను సత్తిగాడు ఎత్తుకుపోయాడని మస్తాన్ పోట్లాట.పోట్లాడుకునే వాళ్ళిద్దర్ని తన్ని ఆ చెత్తనంతా లాక్కుని బూడిద చేస్తాదు రోడ్లు ఊడిచే ఈరబాబు.మస్తాన్ కు ఉన్నది పోయింది.రావల్సింది రాకుండా పోయింది.ఇక్కడ బలం వున్నవాడే పోటీలో గెలిచాడు.ఇంకోవైపు పొట్టగడవక రెడ్డి హోటల్ వ్యాపారం పెట్టుకుంటే,లింగప్ప పోటీగా తాను హోటల్ పెట్టేసరికి,పోటీ తట్టుకోలేక రెడ్డి దివాళా తీస్తాడు. ఇద్దరు కలిసి బ్రతికే ఛాన్స్ లేనప్పుడు పోటీ తప్పదు.పోటీలో గెలిచినవాడిదే రాజ్యం.ఇక్కడ కాస్త బుర్ర వున్న వాడే గెలుస్తాడు.ఓడిపోయినవాడు తనకు”ప్రాప్తం” లేదని తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోకతప్పదు.కరువు మూలం గా అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.మూడేళ్ళనుంచి అప్పు తీర్చని అంజిరెడ్డిని పట్టుకుని వడ్డీవ్యాపారి దగ్గరుండి కిడ్నీలు అమ్మింపింజేసి తన డబ్బు వసూలుచేసుకుంటాడు.అప్పిచ్చువాడు,వైద్యుడు లేని ఊర్లో ఉండొద్దన్నాడు సుమతి శతకకారుడు.కాని వీళ్ళిద్దరు చేతులు కలిపి మనల్నే లేకుండా చేస్తున్నారు.శరీరభాగాలతోనే కాదు.శరీరాలతో వ్యాపారాలు చేసే వారున్నారు.పని ఇప్పిస్తానని అబద్దం చెప్పి సరమ్మను బొంబాయి తీసుకెళ్ళి అమ్మేస్తాడు భాషా.నారీ నికేతన్ వాళ్ళ సహాయం తో పారిపోయి ఇంటికొచ్చిన “సరమ్మ” గురించి ఊరు వాడా అంతా తెలిసిపోతుంది.ఇంట్లో తల్లి నిరాదరణ,ఊళ్ళో లైంగిక వేధింపులు సరమ్మను మళ్ళీ బొంబాయికే తరిమేయడం నమ్మలేని నిజం.ఆడవాళ్ళను ట్రాప్ చేయడం లో ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్దతి.కొంతమందికి జంతువులనైనా,మనుషులనైనా మచ్చిక చేసుకుని ఆటాడించడం లో వారికి వున్న నైపుణ్యం వేరు. ఒంటరిగా బంగళాలో వున్న ఆఫీసర్ దారితప్పి వచ్చిన కోతిపిల్లను చేరదీసి మచ్చిక చేసుకుంటాడు.

“అలవాటైన కోతి” వెతుక్కుంటూ రావడం ఎంత సహజమో,మెడికల్ సెలవు కోసం ఆఫీసర్ ను సంతృప్తిపరచే రత్నం లాంటి వాళ్ళను ఆలవాటైన కోతిలా పోల్చడం కూడా అంతే సహజం గా చిత్రీకరించారు.లేదా గడ్డు పరిస్థితి సృష్టించి వాళ్ళను లొంగదీసుకునే ఆఫీసర్ కూడా అలవాటైన కోతి కావచ్చు.వ్యభిచారం మహాపాపం.పరస్త్రీల మీద బుద్ది మళ్ళించకు అని హితబోధ చేసిన పాస్టర్ వరం కు రైల్లో ప్రయాణించే ఒక స్త్రీ పట్ల ఆసక్తి,ఆకర్షణ ఏర్పడుతుంది.ఆయన గతం లో పొందిన ఉద్విగ్న క్షణాల తాలూకూ జ్ణాపకాలు మనసును కల్లోలపరచగా,ఆమె పట్ల ఆకర్షణతో తప్పు చేయడానికి సిద్దపడతాడు.దైవభక్తి,పాపభీతి అని ఎన్ని కబుర్లు చెప్పినా సహజ వాంఛలను అణచుకోవడం ఎంత అసాధ్యమో,ఒక పాస్టర్ ను కేంద్రం గా చేసుకుని,చేసిన మనస్తత్వ విశ్లేషణ “ఎందాకా” అని ప్రశ్నిస్తుంది.ఏ బాదరబందీ లేక సింగిల్ వుమెన్ గా బ్రతికేవారు,సెల్ఫ్ ఎంజాయ్ కోసం విశృంఖలం గా గడిపేతీరును “దుర్గ” ఎంతకాలం వ్యతిరేకిస్తుంది?ఆ ఆకర్షణను ఆమె జయిస్తుందా అనేది అనుమానమే.మనిషి ప్రవర్తనను అంతర్లీనం గా శాసించేది పాపభీతియే.దుర్గ తన కన్యత్వాన్ని కాపాడుకుంటుందా?లేక అయ్యర్ తో గడుపుతుందా?ఎటూ తేల్చి చెప్పక రచయిత ముగింపును మనకే వదిలి మనల్ని అలజడికి గురిచేస్తాడు.ఈ కథలో ఆమె పేరుకు,కథ చివర్లో ఆమె కాలి కింద పగిలిన అమ్మవారి పటాన్ని మొక్కి పక్కన పెట్టేయడం తో మనం ముగింపును ఊహించుకోవచ్చు.

మనుషులను బట్టి,వారి ప్రేమ-ఆప్యాయతలను బట్టి బంధాలు-అనుబంధాలు ఏర్పడతాయి.జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని,జీవితాంతం అసంతృప్తితో వేగిపోయేవాళ్ళు ఎందరో కనిపిస్తారు.మరికొంతమంది తాము చేస్తున్న పని పట్ల భక్తిశ్రద్దలతో,అంకితభావంతో తమ జీవితాన్ని తృణప్రాయంగా భావిస్తారు.ధనుర్మాసంలో ఉదయాన్నే నెత్తి మీద అక్షయ పాత్రతో చేతిలో తంబుర,చిడతలు వాయించుకుంటూ,హరినామాలు పాడుకుంటూ ఊళ్ళో వాళ్ళు వేసిన బియ్యంతో వండుకుని ప్రసాదంలా పూజించడం నారాయణకు అలవాటు.దాన్ని దైవ కార్యంగా భావిస్తాడు.కాని ఫిట్టర్ చదివిన అతడి కొడుకు కోటీశ్వరరావు,దాన్ని అడుక్కుతినడంగా భావించి సహించలేకపోతాడు.కొడుకుతో హైదరాబాదు వచ్చినా అతని మనసంతా ఊరి మీదనే.మనోవ్యాధితో మంచం పట్టిన నారాయణ ధనుర్మాసం రాగానే ఓపిక తెచ్చుకుని మళ్ళీ ఊరికి వెళతాడు.అలాగే ప్రాణాలు విడవాలని అతని కోరిక.వృత్తి గాయకులు,ఆశ్రిత గాయకులు క్రమంగా అంతరించిపోవడం వెనుక వారి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును “ముక్తి కోసం” కథ ప్రతిభావంతంగా చిత్రీకరించింది.సినిమాల దెబ్బతో జానపద కళారూపాలు,నాటకాలు ప్రజాదరణను కోల్పోయాయి.పట్టణాలు,తాలుకా కేంద్రాలలోనే కాకుండా థియేటర్లు మారుమూల గ్రామాల్లో కూడా టూరింగ్ టాకీసులుగా వెలసి ప్రజలకు బోలెడు కాలక్షేపాన్ని అందజేస్తున్నాయి.థియేటర్ల మీద ఆధారపడి కూడా కొంతమంది బతికేస్తున్నారు.

అలాంటిది హఠాత్తుగా ఆ థియేటర్ మూతబడితే దాన్ని నమ్ముకున్నవాళ్ళు ఏమైపోవాలి? ఆ ఊరికి ప్రాణం పోసిన సినిమా హాలు మూతపడటంతో అందరికి గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది.అందరి జీవితాలతో మమేకమై,వారికి మిగిలిన ఏకైక కాలక్షేపం కూడా కరువై పోవడంతో,ఎవరో ఆత్మీయులను పోగొట్టుకున్నట్లుగా ఫీలయి పోవడాన్ని “బొమ్మ నేదు” లో చక్కగా చూపించారు.యంత్రాలు మానవుడి సౌలభ్యం కోసమే అయినా,వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే అవి నాలుగుకాలాలపాటు మన్నుతాయి. మనిషయినా,యంత్రమైనా సరియైన నిర్వహణ లేకపోతే మూలనపడక తప్పదు.నిజమైన మెకానిక్ యంత్ర మర్మాన్ని తెలుసుకుని,దాన్ని బాగు చేసెంతవరకు నిద్రించడు. పాడయినదాన్ని బాగుచేయడం ఒక సవాల్ గా స్వీకరించి,యంత్రం లో యంత్రమై పనిచేసె నాయుడి గారి కార్యదీక్షకు “జెన్” అద్దం పడుతుంది. జీవితమంతా శుచి శుబ్రతలతో గడిపిన తల్లిని,చనిపోయింతర్వాత నానాకల్మషం తో దుర్గంధ పూరితంగా వున్న శ్మశానంలోకి తీసుకురావడం,ఆ అపరిశుబ్ర వాతావరణంలో అంత్యక్రియలు చేయాల్సిరావడం కొడుకు భరించలేకపోతాడు. చచ్చిన వాళ్ళ సంగతేమో కానీ,బ్రతికి వున్నవాళ్ళకే అక్కడ “వైతరిణి” కనబడుతుంది.”టై”లో ఎవరికష్టాలు వారివి.రైలు ప్రయాణీకులు ఆ కాస్త సమయం లో వాళ్ళ కష్టాలు చెప్పుకుని తమ బరువు దించుకుంటారు.నాగరికుడైన కృష్ణమూర్తి తన బాధను వాళ్ళతో పంచుకోలేక,తనలో దిగమింగుకోలేక కన్నీళ్ళ పర్యంతమవుతాడు.కుటుంబ సంబంధాలన్నీ డబ్బు సంబంధాలుగా మారుతున్న వైనాన్ని ఈ కథలో చక్కగా చిత్రీకరించారు.

గిరిజన ప్రాంతాల్లో వ్యాపిస్తున్న వస్తు వ్యామోహం వారి జీవన విధానంలో ఊహించని మార్పులను తీసుకువచ్చింది.మైదానాల్లోంచి వచ్చినవాళ్ళు సౌందర్య సాధనాలను వినిమయ పద్ధతిలో ఇచ్చి వాళ్ళను దోచుకోవడమే కాకుండా చివరకు డబ్బులకు కూడా అంటగడుతుంటారు.ఆ ఆకర్షణ నుండి తప్పించుకోలేని బలహీనతతో,డబ్బులు లేని నిస్సహాయత వల్ల గిరిజన మహిళలు సతమతమవుతుంటారు.పనులు లేక కొంత,డబ్బులు లేక కొంత- వచ్చిందేదో మొగుళ్ళంతా తాగుడుకు ఖర్చు పెట్టేయడంతో ఎప్పటికప్పుడు వెతుకులాటే.ఒకవైపు మామ లింగారెడ్డికి తాగడానికి డబ్బు లేదు.ఇంకోవైపు కోడలు బాపనమ్మకు సెంటు కొనడానికి అర్జంటుగా డబ్బు కావాలి.”పుట్టింటోరి నెమలి”గా వర్ణించుకునే వాళ్ళ పెంపుడు కోడి జీపుకింద పడి చచ్చిపోవడంతో ద్రైవర్ ను బెదిరించి డబ్బు లాగడానికి మామా కోడళ్ళు విడివిడిగా వాదిస్తూ,వాడిపై విరుచుకుపడతారు.తీరా ఆ డబ్బులు చేతికందే సమయానికి అప్పులోడు ఊడిపడి ఆ డబ్బును ఎగరేసుకుపోతే మామా కోడళ్ళు బిక్కమొగమేసుకుని చూస్తూ వుండిపోవాల్సివస్తుంది.రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శివలింగంతో- దాని అర్చకత్వం,ఆలయ భూములకోసం ఊళ్ళోని రెండు వర్గాలు రంగంలోకి దిగుతాయి.చివరకు ఆర్కియాలజీ వారు వచ్చి పరీక్షించి,ఆది శివలింగం కాదు మైలురాయని నిర్ధారించడంతో అంతా అవాక్కైపోవడాన్ని “ఒకటీ బై నాలుగు”లో చూడవచ్చు.ఎక్కడినుండో వచ్చిన వాళ్ళు చౌకగా పొలాలు కొని,ఆ వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు.ఇదంతా బాగానే వుంది.

కాని ఎప్పటి నుండో వ్యవసాయ పనులపై ఆధారపడి పొట్టపోసుకునే వాళ్ళ గతి ఏం కాను? “చేనులను-చేపల” చెరువులుగా మార్చి భూములను నాశనం చేస్తున్నారు.పనులు లేకుండా చేసి బీదాబిక్కిని చంపుతున్నారు.డబ్బు దృష్టితో చూసేవాడికి వ్యవసాయం అయినా ఒకటే.చేపల చెరువులైనా ఒకటే.డబ్బు కంటే ఊరు- ఊరి ప్రజల బాగుకోసం ఆలోచించేవారుంటే తప్ప,ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోవడం సాధ్యం కాదు.విలాస పురుషులకు అందమైన అమ్మాయిలైనా,చీమలైనా ఒకటే.నలిపి పారేయడం ఒకటే వారికి తెలుసని”మనో చీమ” నిరూపిస్తుంది. ప్రభుత్వం వారు తలపెట్టే సంక్షేమ పథకాలు- నిధులు ప్రజలకు చేరే క్రమంలో అవి అన్ని చేతులు మారగా ,రూపాయికి మూడు పైసలు మాత్రమే వారికి అందుతున్నాయని తేలింది.ప్రజాసేవకై ఏర్పాటు చేసిన ప్రతి వ్యవహారము అవినీతిమయమై పోయిందన్న విషయాన్ని వ్యంగంగా విమర్శిస్తూ బ్యూరోక్రసీ- రెడ్ టేపిజం లపై రాసిన ఒక అద్భత కథనం “గ్రాసం” కథలో కనిపిస్తుంది. ఈ వ్యవస్థలో అందరికంటే బలవంతుడు పోలీసు. కరడు గట్టిన అధికారం,నియంతృత్వం గా పరిణమించినప్పుడు వాళ్ళకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.బాసిజానికి అలవాటు పడ్డ పోలీసులకు గానీ,వాళ్ళ దౌర్జన్యాలకు అలవాటుపడ్డ ప్రజలకు గానీ- ఆదర్శప్రాయమైన పోలీసు ఆఫీసర్ అసమర్థుడిగానే కనిపిస్తాడు. మంచితనంతో ఎ.ఎస్.పి.సాధించలేని పనిని,పోలీసు రీతిలో ఒక ఎస్.ఐ.సాధించిన విజయం ఎంత కుటిలంగా,ఎంత దుర్మార్గంగా వుంటుందో “ఎస్.ఐ.నవ్వేడు” కథలో తెలియజేసిన విధానం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కానిస్టేబుల్ కనకం అల్లుడు చీటికి మాటికి డబ్బు తెమ్మని వేధిస్తూ,అమ్మాయిని హింసిస్తూ, పుట్టింటికి తరిమేస్తుంటాడు. ఈసారి అల్లుడికి పదిహేను వందలు ఎలా సర్దాలో తెలియని కనకానికి,మిత్రులైన తోటి పోలీసులు సహాయం చేస్తారు.లాకప్ లో వున్న జేబుదొంగ రాజును ఒక పూట వదిలేస్తే ఆ డబ్బులు సమకూరుతాయి.అదీ “కనకం గట్టెక్కిన వైనం” . మంచికైనా,చెడ్డకైనా పోలీసు నీతి,పోలీసు నీతియే అని ఈ కథ నిరూపిస్తుంది.మనుషులలో పెరుగుతున్న వ్యాపారధోరణిని,వస్తు వినిమయ సంస్కృతిని ఈ కథలు తెలియజేస్తాయి. శ్రమ దోపిడి,లైంగిక దోపిడి,ఆర్థిక దోపిడి,రాజ్యం చేసే దోపిడి- ఇలా రకరకాల రూపాల్లో కొనసాగుతున్న దోపిడిని,దోపిడికి గురవుతున్న వ్యక్తుల జీవితాన్ని ఈ కథలు ఆసక్తికరం గా చిత్రించాయి.

మనుషుల రకరకాల మనస్తత్వాలను,వాళ్ళలో చోటు చేసుకున్న రకరకాల భయాలు-ఆందోళనలను,విపరీత ధోరణులను చిత్రీకరించడంలో రచయిత ఒక మనస్తత్వ శాస్త్రజ్ణుడి పాత్రను పోషించారనే చెప్పాలి.తెలిసో,తెలియకో మనుషుల్లో రకరకాల ఫోబియాలు వుంటాయి.అలా శ్రీనివాసరావుకు పాము ఫోబియా.అతడు ఏమి చేస్తున్నా పాము గురించిన ఆలోచనలే అతడ్ని వెంటాడుతుంటాయి. సత్యం గారింట్లో పాము దూరినప్పటినుంచి శ్రీనివాసరావుకు నిద్రపట్టదు.క్రమంగా మానసిక సంతులితను కోల్పోతాడు.ప్రతిదీ పాములానే కనిపిస్తుంటుంది.చివరకు అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. లేని పాము కోసం చేసిన అన్వేషణ “దూరెన్ పాము”లో కనిపిస్తే,నిజంగానే ఇంట్లో దూరిన పాము “శత్రు సర్పం”గా తయారై,అందర్ని హడావుడి పెట్టించి అలజడికి గురిచేస్తుంది.ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు.పాము ఇంట్లోకి దూరిందని పిల్లాడు చెబితే,అది ఎక్కడ వుందో తెలుసుకోలేక దాన్ని పట్టుకోవడానికి,చంపడానికి చేసిన అనవసర ఆర్భాటం ఈ కథలో కనిపిస్తుంది.దూరం నుండి చూసేవారికి ఏది నిజమో,ఏది భ్రమనో తెలియనంత ఉత్సుకత.కనిపించే వాస్తవాలు వాళ్ళ ఆలోచనావిధానాన్ని బట్టి మారుతుంటాయి.

అందుకే ఊహలు వేరు.”వాస్తవం” వేరు.సమస్యలు లేని జీవితం వుండదు.వీటిని అధిగమించి ప్రశాంతంగా ఎలా వుండటం?శాంతి ఎక్కడి నుండి వస్తుంది.యాక్సిడెంట్లో భర్త దుర్మరణం,అమెరికాలో వున్న కొడుకు- ఆమెలో ఎదో అశాంతి,ఒంటరితనం.చివరకు ఒక బాబా ఆశ్రమంలో సేదదీరడాన్ని “శైత్యాంతం” లో చూడవచ్చు.కావాల్సిన ఆప్తుడు చనిపోవడం విచారకరమే అయినప్పటికీ నలుగురు కలిస్తే ఆ విచారం పోయి వేరే విషయాల్లోకి చేరుకుని సందడిగా మారి- చివరకు తమతమ బ్రతుకుల్లోకి,తమ జీవితాల్లోకి చేరుకుంటారు.ఈ తాత్కాలిక వైరాగ్య ధోరణికి “ప్చ్ ..హూ..”” కథ అద్దం పడుతుంది.

గిరిగీసుకుని బతికే మద్యతరగతి కుటుంబీకులకు రిస్క్ తీసుకోవడం గానీ,ఉన్నత స్థాయికి ఎదిగే ఆలోచన కాని వుండదు.బియ్యంలో పుట్టి,బియ్యం నే తింటూ,బియ్యంలోనే నశించి పోయే” వడ్ల చిలుకలు” బాపతువారని,మధ్య తరగతి వాళ్ళ గురించి తేల్చేస్తారు. ఎంత పాతదైనా,విరిగిపోయినా,పనికిరాకుండా పోయినా ప్రతిదాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని సామాన్లతో ఇంటిని నింపేయడం కొంతమందికి అలవాటు.అనవసరమైన “బరువు సామాను” వదిలించుకోవాలనే భర్త,ప్రతిదీ అవసరమని వాదించే భార్య- ప్రతిసారి ఇల్లు మారినప్పుడు పెద్ద గందరగోళం తప్పదు.

పతంజలి కథల్లో విస్తృతమైన వస్తు వైవిధ్యముంది.వస్తువుకు తగ్గట్టుగా ఈ కథలు వినూత్న శైలీశిల్పాలను సంతరించుకున్నాయి.ఇందులో”కతలవ్వ” జానపద కథాకథనరీతిని తలపిస్తుంది.”మనోచీమ” మాజిక్ రియలిజం కాగా,”అలవాటైన కోతి” ప్రతీకాత్మకము.”ఆమె దనంతపురం”,”పిచ్చి లచ్చమ్మ” కథలు సీక్వెల్ గా అనిపించినా,”ఆమె దనంతపురం”లో మార్మికత చోటుచేసుకుంది.”భగవంతం కోసం”,”దూరెన్ పాము” కథల్లో అధివాస్తవికత ధోరణి కనిపిస్తుంది.ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే సత్యాల వెనుక కనిపించని వాస్తవాన్ని పట్టుకోవాలి.రాని”భగవంతం కోసం” లేని వెతుకులాట. త్రిపుర ప్రారంభించారు.పతంజలి శాస్త్రి కొనసాగించారు. ఇలా ఎవరైనా,ఎప్పుడైనా,ఎంతకాలమైనా ఇలాగే కొనసాగించే సౌలభ్యం ఈ కథకు వుండటం విశేషం. పతంజలి శాస్త్రి కథలన్నీ విచిత్రమైన ఉపమానాలు, కొత్తరకం వర్ణనలతో,కవితా శైలిలో వుండి పాఠకులను ఆకట్టుకుంటాయి.ఆలోచింపజేస్తాయి.మొత్తానికి పతంజలి శాస్త్రి కథలు పాఠకుల స్థాయిని,చైతాన్యాన్ని,ఆలోచించే శక్తిని పెంచడమే కాకుండా- కథను గురించి,జీవిత చలన సూత్రాలు-సత్యాల గురించి విపులంగా చర్చించేలా,ప్రశ్నించేలా చేస్తాయి.

*

కె.పి.అశోక్ కుమార్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా సమగ్రంగా ,ప్రతి కథను చక్కటి విశ్లేషణ చేస్తూ వ్రాసారు. “ప్చ్.హు.” కథను నాన్నగారు పోయినప్పుడు వ్రాసారు. కథ వాస్తవికత కు అద్డం పడుతుంది. అదే వ్రాసారు అశోక్ కుమారు గారు.

  • చాలా సమగ్రంగా ,ప్రతి కథను చక్కటి విశ్లేషణ చేస్తూ వ్రాసారు. “ప్చ్.హు.” కథను నాన్నగారు పోయినప్పుడు వ్రాసారు. కథ వాస్తవికత కు అద్డం పడుతుంది. అదే వ్రాసారు అశోక్ కుమారు గారు. పతంజలి శాస్ట్రీ కథలు ఒక విలక్షణమైన శైలితో ఆలోచింప చేసేవి గా ఉంటాయి. నా దృష్టిలో వారు వ్రాసిన ప్రతి కథ చదువరుల లో ఆలోచనలు రేకెత్తిస్తు ఉంటాయి.

    • నేను పతంజలి గారి కథలు చదవలేదు.లిస్టులో పెట్టుకున్నాను.మీ సమీక్ష చదివాక వెంటనే చధవాలని పిస్తున్నది .ప్రతీ కథను మీరు విశ్లేషించిన తీరు ….శైలి తో సహా ..ఎంత బాధ్యతతో సమీక్షించారు కదా అనిపించింది. అభినందనలు అశోక్ గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు