పట్టు మీది పొదుగు!

  కరోనా కహానీలు

“మీరేం చేస్తున్నారో మీకేమన్నా బోధపడుతోందా?” అడిగింది భార్య.

“నేను ‘చైనా’నే” నీలుగ్గా అన్నాడు భర్త.

“అందుకే మీకు కరోనా పుట్టింది” రోగం పుట్టింది అన్నట్టుగానే వుంది భార్య మాటల్లో ధ్వని.

“నీకు అంటిస్తాను రా” కవ్వింపుగా అన్నాడు భర్త.

“మీరు కష్టపడక్కర్లేదు, మీకొస్తే నాకొస్తుంది” అంది భార్య. అని “చైనాకొస్తే ప్రపంచానికే వచ్చింది, నేనొక లెక్కా” అంది.

“యస్… ఐయామె చైనా” మళ్ళీ అన్నాడు భర్త. అని “నా పాలిట అమెరికాలా తయారయ్యావు” అన్నాడు.

ఆ తరువాత సెల్లందుకున్నాడు. కాల్ చేశాడు. డీమేట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంట్ రెండూ కావాలని చెప్పాడు.

“మన అకౌంట్లో వున్న డబ్బులు మనం తియ్యడానికి లేదు గానీ…” భర్త ఫోన్లో వున్నా గాని ఆగకుండా అంటూ వుంది భార్య.

సెల్లుని కాస్త దూరంగా పెట్టి “మన అకౌంట్లో డబ్బులు మనం తియ్యక్కర్లేదు, వెయ్యడమే” నవ్వుతూ అన్నాడు భర్త.

నెత్తి నేలకు గుద్దుకుందామా అన్నట్టు చూసింది భార్య.

ఏ బ్యాంకు ట్రేడింగ్ అకౌంట్ యిచ్చిందో అది థర్డ్ పార్టీ- అని అటు సెల్లో పాఠాలు చెప్పేస్తున్నాడు భర్త.

“ఏమీ తెలీకుండా యేట్లోకి దిగిపోండి” గింజుకుంటూ అంది భార్య.

“అదృష్టదేవత తలుపు కొడుతుంటే తియ్యనంటావేంటి?” భార్యమీద విసుక్కుంటూ “మీ చెల్లిని ఎడ్యుకేట్ చేస్తున్నాను” అవతల సెల్లో ఆన్సర్ యిచ్చాడు.

“మీరు చెడింది కాక అందర్నీ చెడగొట్టండి” గట్టిగానే అంది భార్య.

నిన్ను తరువాత చెడగొడతాను- అని కాల్ కట్ చేశాడు భర్త.

“ఖాళీగా వుండలేకపోతున్నారు” భార్య గొడవకు సిద్ధమైపోయింది.

“ఔను, నేను ఖాళీగా వుండను. ఉండలేను. డబ్బు సంపాదించకపోతే నాకు జబ్బు చేస్తుంది. ఏ మనిషికయినా చెయ్యాలి కూడా…” భర్త వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ “మిమ్మల్ని డబ్బెవరు సంపాదించొద్దన్నారు?” అంది భార్య.

“నేను ఆపనే… ఆ బిజినెస్సే చేస్తున్నాను” ఘంటాపథంగా చెప్పాడు భర్త.

“దానికీ వొక సమయమూ సందర్భమూ వుంటుంది కదా?” అంది భార్య.

“యస్… వుండాలి. ఉంది. ఇదే అదును. మనకి మంచి పదును. అందుకే రింగులోకి దూకా” భలే హుషారుగా అన్నాడు భర్త.

“అవి అప్ అండ్ డౌన్ అవుతాయి…” తనకి తెలిసిందేదో చెప్పబోయింది భార్య.

“జీవితంలో యిన్ని అప్ అండ్ డౌన్స్ చూసిన వాళ్ళం, అయినా యిక్కడ అంతా అప్పే గాని డౌన్ లేదు” భుజాలు యెగురేశాడు భర్త.

“అంత అప్ యెక్కలేక మన మోకాళ్ళు చెక్కెస్తాయేమోనండీ?” బెదురుగా నటిస్తూ అంది భార్య.

“అనుమానించకపోతే నువ్వు భార్యవెలా అవుతావు?” జోష్ తో మెచ్చుకోలుగా అన్నాడు భర్త.

ఇంక చెప్పడం తనవల్ల కాదన్నట్టు వుస్సురుమంటూ నెత్తిన చేతులు వేసుకుంటూ తనలో తను అనుకున్నట్టుగా “యీ షేర్స్ యేమిటో? గోలేమిటో” అంది భార్య.

“ఈ షేర్స్ కానిది… షేర్స్ లో లేనిది భూస్థలమంతా వెతికిన దొరకదు. నువ్వు తినే యే పదార్థమైనా తీసుకో… నువ్వు వాడే యే వస్తువైనా తీసుకో… మార్కెట్లోకి వచ్చేది యేదైనా తీసుకో- అది… ఆ ప్రోడక్ట్… మార్కెట్లోకి రాకముందు ఐపీవో- యినీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు వెళుతుంది. అంటే యెవడు వ్యాపారం చేసినా తను మొత్తం పెట్టుబడి పెట్టడు. తను కొంత పెట్టి మనతో కొంత పెట్టిస్తాడు. ఆ లాభం మన పెట్టుబడికి తగ్గట్టు లెక్కకట్టి యిస్తాడు…” కురుక్షేత్రంలోకి దిగిన కృష్ణుడు మల్లె బోధగా చెప్పాడు భర్త.

అర్జునుడికి మల్లె అమాయకంగా చూస్తూనే “ఆ… లాభం అయితే లాభం, నష్టమయితే నష్టం మన పెట్టుబడికి తగ్గట్టు లెక్కగట్టి యిస్తాడు…” సవరిస్తున్నట్టుగా అంది భార్య.

“గుడ్” అనబోయి అనకుండా వుండిపోయి తలూపిన భర్తను చూసి “లాభనష్టాలను సమంగా చూసే దృష్టి వుండాలి” అంది భార్య.

“వెరీగుడ్” మెచ్చుకోకుండా వుండలేదు భర్త.

“నువ్వు వినియోగాదారుడిగా వున్నావు, ఆ వినియోగానికి పెట్టుబడిదారుడిగా వుండడానికి భయపడుతున్నావు” తన యింటలెక్చువల్ థింకింగుకు తనే మురిసిపోయాడు భర్త.

“ఈ లాక్ డౌన్ యెన్నాళ్ళు వుంటుందో… కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి” సమాధానంగా కాదు, తను ఆలోచిస్తున్నదే అనేసింది భార్య.

“అందుకే మనం పర్వతాలు సొంతం చేసుకోవాలి” నవ్వుతూ చూశాడు భర్త.

“కరోనా కాలంలో పర్వతాలు వున్నా కరిగిపోతాయి” నవ్వకుండా అంది భార్య.

“అన్ని కంపెనీల షేర్లూ కుదేలయిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ లేస్తున్నాయి. ఆలస్యం చేస్తే మనకు అందవు. మనం కొనలేం…” యెలర్ట్ గా వుండి అన్నాడు భర్త.

మౌనంగా వుండిపోయింది భార్య.

“అదిగో ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పీయం యిరవై లక్షల కోట్ల ప్యాకేజీ నిన్నరాత్రి ప్రకటించగానే యివాళ తెల్లవారేసరికల్లా బిఎస్ఈ సెన్సెక్స్ ఆరువందల ముప్పైయ్యేడూ పాయింట్ నాలుగూ తొమ్మిది పాయింట్లు పెరిగింది. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు…” అన్నాడు భర్త.

“ముందు నిత్యావసరాల రేట్లు పెరిగిపోతున్న విషయం ఆలోచించండి. ఇంట్లో బియ్యం పప్పులూ వుప్పులూ నూనెలూ యేమీ నిలవా లేవు. తినడానికి వుంచుకుంటే ధైర్యంగా వుంటుంది. పిల్లలతో…” భార్య యింకా చెప్పకముందే “మిడిల్ క్లాస్ థింకింగ్” తనా క్లాసు కానట్టు తిట్టుకున్నాడు భర్త.

“హై క్లాస్ బాబుగారు యేమేమి హై క్లాస్ పనులు చేస్తారో చెయ్యండి” విసిగిపోయినట్టు చేతులెత్తి భర్తకు దండం పెట్టింది భార్య.

“థాంక్యూ. మనం దాచుకున్న డబ్బూ- నీ బంగారం పిల్లల బంగారం అమ్మి- యింకా యింటి మీద అప్పుతెచ్చి షేర్స్ కొంటాను… యెందుకంటే…” చెప్పబోయాడు భర్త.

“నేను చైనా’ని” అందించింది భార్య.

“యస్. హండ్రెడ్ పర్సెంట్. నేను చైనాని. చైనానే ఫాలో అవుతాను. కుదేలయిన అన్ని కంపెనీల షేర్లూ చైనా కొంటోంది. పిచ్చిదై కొంటోందా?” నిలదీసినట్టే అడిగాడు భర్త.

“లేదు, చైనాయే మిమ్మల్ని చూసి ఫాలో అవుతోంది” యెత్తిపొడుపుగా అంది భార్య.

“నువ్వు ఫాలో అవడం లేదుగా” అన్నాడు భర్త.

“రేపు చస్తామో బతుకుతామో తెలీక చస్తుంటే…” మరి మాటలు రాలేదు భార్యకి.

“మనుషులు చచ్చిపోవచ్చు. షేర్లు చచ్చిపోవు. రేపు అంటూ వుంటే మన చావు బతుకులతో సంబంధం లేకుండా షేర్లు నిలిచి వుంటాయి” అన్నాడు భర్త.

వాదించడం యిష్టం లేనట్టు వూరుకుంది భార్య.

“లాక్ డౌన్ తర్వాత లైఫ్ పట్టాలెక్కితే క్రూడ్ ఆయిల్స్… ఆటోమొబైల్స్… ఫార్మసీ… వీటన్నిటికీ గ్రోత్ వుంటుంది. అందుకే అందరూ అంతలా పడిపడి కొంటున్నారు. పతనమవుతున్న యీ టైంలో షేర్ల రేట్లు యెందుకు యింక్రీజ్ అవుతున్నాయో చెప్పు” అడిగాడు భర్త.

“మీలాంటి చైనావాళ్ళు వుండబట్టి” వుక్రోషంగా అంది భార్య.

“ఇంత కారు చవుకగా షేర్స్ దొరికే అవకాశమే మరి లేదు… రాదు” భార్యని బుదరిస్తున్నట్టు గెడ్డం పట్టుకున్నాడు భర్త.

“సరేలెండి… రేపు ఆ షేర్లే వండుకు తిందాము” అంది భార్య.

“వండుకు కాదు, అమ్ముకు తిందాము” సరిచేశాడు భర్త.

“మరి రేపటిదాకా యేమిటి తిందాము? అదే మీ షేర్లు పెరిగినదాక…” అడిగింది భార్య.

భర్త నుండి సమాధానం లేదు.

అప్పుడు భార్యే మళ్ళీ అంది. “వెనకటికి నీలాంటి వాడికే పదకుండు నెలల భత్యం వుంటే- అరే యింకొక్క నెల భత్యం వుంటే సంవత్సరం వచ్చును గదా- అని నెల రోజులు వుపవాసం వున్నాడట..”

“ఉంటే?” ఆత్రంగా అడిగాడు భర్త.

“కళ్ళు పేలి చచ్చిపోయినాడు. ఏడాది బత్తెం మిగిలిపోయింది” ముగించింది భార్య.

ఆ రాత్రి భార్యా భర్తలిద్దరికీ నిద్దర్లు లేవు.

సూర్యుడు మళ్ళీ వచ్చాడు.

మళ్ళీ పొద్దున్నే యెవరి ఆలోచనకు వాళ్ళు బందీలయారు.

కరోనా పోలేదు. కయ్యాలూ ఆగలేదు.

*

బమ్మిడి జగదీశ్వరరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంతటి సమస్యనైనా సున్నితంగా, హాస్యంగా రాయడంలో మీకు మీరే సాటి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు