పచ్చ కామెర్లు

నేను ఈ కథ చెప్పాల్నంటే.. మేం శకుంతలాంటి ఇల్లు ఖాళీ జేసి, ఇప్పుడుంటున్న అరవై నాలుగు గజాల మూడర్రల చిన్న ఇంటికి మారాలి.

ఈ ఇంటికోసమని తీసుకున్న అప్పు, ఆ మధ్య నా చదువైపోతున్న టైమ్‌లకూడ కడుతున్నట్టు గుర్తు.

ఇల్లు ఎట్లుంటదంటే.. మొత్తంగ రెండు మెట్లు దిగితే మెయిన్‌ రోడ్డే. ఆ పాతబస్తీ మెయిన్‌రోడ్డు మీద అర్ధరాత్రిదాంక ఆ బండ్లు, ఈ బండ్లు పోతనే ఉంటయి. సౌండ్ వస్తనే ఉంటది. నేనేందంటే, ఎంత సౌండ్ ఉన్నా, ఏం కథ నడుస్తున్నా నా పనేదో నాది అన్నట్టు ఉండేటోడిని. మా అమ్మతోనో, అన్నతోనో మాట్లాడుకుంట ఉంటే ఇట్లాంటి ఒక సౌండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ల నడుస్తున్నదని కూడా తెలిసేటిది కాదు. ఇల్లు చిన్నదైతే అయిందిగానీ, నాకు గుర్తున్న అసలు జీవితమంత ఈ ఇంటితోనే ఉన్నది.

మా అమ్మ అనేటట్టు, నాకు గాలి సోకి బాగైన కొన్నాండ్లకు బడి ఎగ్గొట్టిన పాపాన పోలేదుగదా! అప్పట్నుంచి ఎప్పుడు సదువుల ఫస్టే నేను. ఆ కథ మళ్లా ఒకటుంది తర్వాత చెప్తగానీ, నేను ఫస్టే వస్తున్న అని చెప్పి నాకు స్కూల్ల ఫీజు తీస్కోలేదు మా మేడమ్‌. మొత్తం ఫ్రీగనే సదువుకున్న. కానీ ఎట్లయినా సదువులకైతే పైసలయితయి. ఇంటికి చేసిన అప్పు అట్లనే ఉన్నది. మా నాన్న టాకీసుల పనిచేస్తే ఎంతొస్తదని?

ఒకరోజు ఎట్ల ఆలోచన చేసిందో మా అమ్మ.. నా పుట్టిన్రోజునాడే అది. నన్ను పట్టుకొని ప్రకాశం బజార్ తీస్కపోయింది. నల్లగొండల ప్రకాశంబజార్ అంటే అట్లాంటి ఇట్లాంటి బజార్ కాదు. అక్కడ దొరకనిది అంటూ ఉండదు. ఒక బట్టలషాపు కాడ నాకొక లాగు, అంగీ కొనిచ్చింది. అది ఎర్రదో, గోధుమ రంగుదో కానీ, కొత్త బట్టలేస్కున్న రోజు నా కండ్లల్ల కండ్లు పెట్టి చూస్తే తెలుస్తది నా సంబరం!

అట్నుంచి అటు ఒక బేకరీ షాప్ కాడికి తీసుకపోయింది. నేను అందరికీ పంచుతానికి చాక్లెట్లు కొన్నంక కూడా ఏదో చూస్తుంటే, “ఇంకేందే?” అనడిగిన.

“నువ్వాగురా!” అని నన్ను ఇడిపించి, రెండు బిస్కెట్ ప్యాకెట్లు, రెండు కార ప్యాకెట్లు, ఇంకేవో కూడా కొని సంచిల ఏస్కుంది.

నేను కొత్త బట్టలుకొన్న జోరు మీద నడుసుకుంట ఇంటికొచ్చిన. కొత్త బట్టలేస్కొని నా పుట్టిన్రోజని ఇంటిపక్కల అందరికీ చాక్లెట్లు పంచిన. మళ్లొచ్చి చూస్తే, మా అమ్మ ఇంట్లనే రెండు గాజు సీసాలల్ల కార ప్యాకెట్లు, బిస్కెట్లు నింపి గూట్ల పెట్టింది.

“మల్లికార్జున కిరాణం షాపు” అన్నది మా చిన్నక్క.

ఆ రెండు సీసాలల్ల నింపిన సామాన్లతోటి స్టార్టయిన ఆ షాపు.. ఇంట్లనే చిన్నగ చిన్నగ పెద్దదైంది. ఫ్రిడ్జ్ వచ్చినంక పాలు, పెరుగు కూడా అమ్ముడు మొదలుపెట్టినం. పిల్లలు తినే చారానా, ఆటానా స్వీట్లకానించి, అన్నీ దొరికేలెక్క తయారైంది.

అంతకుముందైతే సాయంత్రం నాన్ననో, అమ్మనో బజారుకి పోయి ఏమన్న తెస్తరని చూసేటోడ్ని. అది పోయి ఇంట్లనే అన్నీ ఉండె. “గాలొస్తే కొట్టుకపోతడు ఈడు మల్లిగాడు” అనేటిది నన్ను చిన్నప్పుడు. అట్లాంటిది షాపొచ్చినంక నేనే దుబ్బుకు దుబ్బయిన.

ఆ షాపు ఎట్లాంటిందంటే.. ‘అందరికీ అక్షయపాత్ర లెక్క’ అని అంటది మా అమ్మ. నా చిన్నప్పుడు గల్లపెట్టె కోసమని ఒక చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బా ఉండేటిది. అది రాత్రుళ్లు గాల్ల లేసేది. ఆ గాల్లనే దాంట్లనించి కొన్ని నోట్లు మాయమయ్యేటివి. ఎవరు దాన్ని గాల్ల లేపేది? మా నాన్న.

“నువ్వు అండ్లనించి పైసలు తీసినవా తీయలేదా?” అని మా అమ్మ గట్టిగా అరిస్తే, “నేనేడ తీసిననే, టిపినుకని ఏయో చిల్లర పైసలు తీసుకున్న” అనేటోడు తప్పించుకుంట. అది మా చిన్నక్క ఆటోకైనా, మా అన్న సినిమాకైనా, నేను ఏదన్నా కావాలని గొడవజేసినా.. అన్నిటికీ ఆ గల్లపెట్టెనించే పైసలు ఊడిపడుతయి. ఇప్పటికీగూడ.

మా నాన్న అందులనుంచి పైసలు తీస్తున్నడని చెప్పి రోజూ పండుకునే ముందల నేనే అందుల నోట్లన్నీ లెక్కబెట్టేది. కొత్త నోట్లంటే నాకెందుకనో పిచ్చిష్టం. ఇప్పటికీ కొత్త నోటు చేతికొస్తే ఖర్చు పెట్టకుండ దాస్తుంట. అట్ల కొత్త నోట్లు ఏమన్న వస్తే, “అమ్మా, ఇది దాచిపెడదమే!” అంటుండె.

నా కోసమని మా అమ్మ ఒక గల్లగురి కొనిపెట్టింది. కొత్త నోట్లు ఏమొచ్చినా అయన్నీ నేను ఆ గల్లగురిల పడేస్తుండె. నేను టౌన్ ఫస్టు వచ్చిన అని నాకు ఇంటర్ల ఫ్రీ సీటొచ్చింది. ఇంజినీరింగ్ కూడా ఫ్రీనే. కాలేజీల అసలు బ్యాక్‌లాగ్ అన్నది లేని రికార్డు నాది. కానీ మామూలుగనైనా ఎగ్జామ్ ఫీజు కడ్తానికి వెయ్యి రూపాయలదాంక అయితుండె. అప్పటికప్పుడు వెయ్యి రూపాయలంటే ఎక్కడ్నించి వస్తయి?

“ఎట్లనే?” అని నేనడిగితే, గల్లగురి దిక్కు చూసేది మా అమ్మ. దాన్ని ఎన్నడూ పగలగొట్టలేగానీ ఒక్కొక్క నోటు మెల్లగ బయటికి తీస్తుండె. నా ఎగ్జామ్ ఫీజుకి అయి సరిపోతుండె. నా నాలుగేళ్ల ఇంజినీరింగ్ సదువుల, ఎగ్జామ్ ఫీజు కట్టాల్సొచ్చినప్పుడల్లా గల్లగురి దిక్కే చూసేది. అట్లాంటి కనెక్షన్ ఆ షాపుతోని. ఇయన్నీ కాదు కానీ, మా షాపు అనంగనే నాకు గుర్తొచ్చే ఇంకో కథ చెప్పాలి.

ఒకరోజు ఇట్లనే.. వర్షాలు పడని ఏ వర్షాకాలమో జరమొచ్చి నేను ఇంట్ల కూసున్న. షాపుకి వచ్చి పోయెటోలల్ల.. “బడికి పోవైతివయ్యా!” అంటుంటే, “రెండు రోజుల్నుంచి సుస్తి చేసినట్టుందె” అని మా అమ్మ అనుడు.

ఒక ముసలామె ఎందుకో నా కండ్లల్లకి చూసి, “కామెర్లు గిట్ల వచ్చినట్టున్నయె ముత్యాలి” అన్నది అమ్మ దిక్కుజూసి.

“కామెర్లా?”

“అవునే! సూడు, పచ్చగ అయినయి కండ్లు”

ఆ మాటకి దబ్బున లేశింది మా అమ్మ. పూల్ గడ్డ మీద ఒక తుర్కామె కామెర్లకు పసరు మందు ఇస్తదంటే నన్ను ఎంటపెట్టుకొని తీస్కపొయ్యింది.

నేను పోంగనే నా కండ్లల్లకు చూసి, “ఉన్నయి” అని చెప్పింది ఆ తుర్కామె. తెల్లారె పచ్చి ఆవుపాలు తీసుకొని రమ్మన్నది.

గొల్లవాడకట్ట అంత మనదేనాయె! తెల్లారంగనే అప్పటికప్పుడు పిండిన ఆవుపాలు ఎమ్మటే తీస్కొచ్చింది అమ్మ. నేను, అమ్మ నడుసుకుంటనే తుర్కామె కాడికి పోయినం.

ఆ తుర్కామె పండు ముసల్ది. ‘‘ఈడ కూసో’’ అని నన్ను పక్కన కూసబెట్టుకొని, ఏం సదువుతున్నవు, ఎన్నేండ్లు నీకు? అనుకుంట, “చేదుగుంటది. గుటుక్కున తాగినవంటే అయిపోతది” అని పసరు మందు నూరి, పచ్చి పాలల్ల కలిపి ఆ గిలాస నా చేతుల పెట్టింది.

ఆమె అటు తిరిగి ఇంకెవల్తోటో మాట్లాడేసరికి నేను తాగేసిన.

“వార్ని, మొండి పిలగాడే ఈడు” అన్నది ఆమె. నేను అట్ల మొండిగనే ఉంటుంటిని. నాలుగు రోజులు పసరు మందంటే, నాలుగు రోజులు అట్లనే ఒక్క దెబ్బకి ఆ పసరు మందు తాగిన.

“నీ కొడుకు మంచోడే! తాకట్లమారోళ్లు ఒక్కొక్కళ్లు గింత తాగి కక్కుకుంటరు” అనేది ఆ ముసలామె.

ఈ పసరు మందు తాగుడు ఒక కథయితే, దానికి పత్యం ఉంటం కదా, అదీ అసలు కథ. పత్యమంటే ఎట్లాంటిందో తెల్సా? గింతగూడ కారం తగలొద్దు. నూనె సుక్క కలవొద్దు. పోపులేకుంట, చింతపండు పచ్చిపులుసుతోటి అన్నం తినాలి. పదిరోజులు ఇట్లనే.

సరిగ్గ అప్పుడే నా దోస్తు ఒకనికి కూడ కామెర్లయితే, వేరే ఊర్ల చూపిచ్చిన్రంట. అది కూడ పసరు మందేగానీ దాని పత్యం తీరు వేరే. ఆ పత్యంల రోజూ నీసు తినాలి. చికెనో, మటనో, చాపలో.. ఏదోకటి. నీసు తింటేనే పత్యమన్నట్టు.

నిజంగనే నన్ను కూడ అక్కడ చూపిచ్చి ఉంటే, రెండు మూడు నెలలకుగానీ ఒకసారి చికన్ ఒండని మా ఇంట్ల ఎట్ల తెచ్చిపెడుదురో ఆలోచించలేగానీ, “చీ, నన్ను కూడ అక్కడ చూయిస్తే అయిపోవుగా” అని మనసుల మాత్రం అనుకున్న.

దాని గురించే ఆలోచించుకుంట పత్యం రోజులల్లనే ఒకరోజు.. షాపులనే ఒక చాక్లెట్ బాక్సు నించి ఎక్లయిర్స్ అని ఒక చాక్లెట్ ఉండేటిది. అది తీసి నోట్ల ఏస్కొని నముల్తా కూసున్న. దాని ఫ్లేవర్‌ తెలుస్తుంటే మూతి ఎట్ల ఆడుతుంటది?

మా అమ్మ చూసింది. “నోరు తెర్వురా?” అన్నది గట్టిగ.

“ఏం తింటున్నవురా!” అని మళ్లా అరిస్తే, అది ఊసేదాంక ఉరుకుడు పట్టిన. ఆ రోజు తర్వాత మా షాపుల చాక్లెట్ తీస్కొని తినలే నేను.

తెల్లారి ఆ తుర్కామెకి ఇది చెప్తే, నవ్వి ఏమనలె. “ఏం కాదులె” అన్నదంతే. నాకు కామెర్లు అయితానికి ఒక్కరోజు ముందల్నో ఏమో, ఏదో పండగొచ్చిందని అప్పలు చేసిన్రు. మా అమ్మ పండగకి చేసే అప్పలు తినాలీ! నాకేమో పత్యం ఉండె.

నేను ఆ చివర్రోజు పసరు మందు తాగినంక, ముసలామె “ఇట్లరా” అని దగ్గరికి పిల్చింది.

“ఏమైంది?” అన్నది.

“ఏమైతది! చాక్లెట్ తినొద్దు. పండగకి అప్పలుగూడ తినొద్దంట. ఇంట్ల మొత్తం అయే ఉన్నయి” అని ఏడ్చుకుంట చెప్పిన.

ఆమె మా అమ్మని దగ్గరికి పిల్చి, “ఓ పదిరోజులనయింక పిలగానికి ఇన్ని అప్పలు చేసిపెట్టు, మర్చిపోకు” అన్నది నిమ్మలంగ.

ఆమె చెప్పినట్టే మా అమ్మ నాకు నయంకాంగనే అప్పలు చేసిపెట్టింది.

పసరు మందు అప్పటి పత్యం పదిరోజులకు అయిపోయిందేమోగానీ, నీసు మాత్రం ఏడాది ముట్టొద్దు. ఆ ఏడాదిల చానా పండుగలొచ్చినయి. చానాసార్లు మా నాన్న ఇంటికి చికన్‌ పట్టుకొచ్చిండు, మా అమ్మ మంచిగ వండిపెట్టింది. మా షాపులకి అప్పుడప్పుడే ఎక్కడెక్కడివో కొత్త కొత్త చాక్లెట్లు వస్తున్నయి.

ఆ ముసలామెని గట్టిగా తిట్టుకుందామనుకునేది నేను. అటెమ్మటే, “ఇట్లరా” అని ముఖంకూడ గుర్తులేని ఆమె మాటొక్కటి గుర్తుకొచ్చేది. అంతే, తిట్టుకోకపోయేటిది!

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

3 comments

Leave a Reply to Raj Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇట్లరా…
    అని పిలిచిన ఆ పిలుపు మర్వలేకపోవడమే ఈ కథకీ నీ జీవితానికి కూడా ప్రాణం మల్లీ..
    😍😍🤗🤗
    ప్రేమ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు