పక్షుల పాటల వెనక యుద్ధాల హోరు!

గతవారం అట్లాంటాలో జరిగిన ఆటా మహాసభల సాహిత్య సదస్సులో ఈతరం తెలుగమెరికా రచయిత, అనువాదకురాలు, యాక్టివిస్ట్ మమతా కొడిదెల చేసిన ప్రసంగం ఇది.

రాజకీయం కాని కవిత ఒకటి రాయలంటే

పక్షులను నేను వినగలగాలి

పక్షులను వినాలంటే

యుద్ధ విమానాలు నిశ్శబ్దమవ్వాలి

మర్వాన్ మఖూల్ అనే పాలస్తీనా కవి రాసిన ఈ నాలుగు లైన్ల కవిత ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. Whoever comes across it, it touches them deep in the heart. మొదటిసారి రెండేళ్ల క్రితం ఇంగ్లిష్ అరబిక్ భాషల్లో ఉన్న కవితను ఫేస్ బుక్ లో నా వాల్ మీద షేర్ చేస్తే సురేష్ కొలిచాల గారు దాన్ని వెంటనే తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మధ్య ఒక సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో ఎవరో ఈ కవితను పోస్ట్ చేస్తే, అక్టోబర్ 7 న వినిపించలేదా ఈ యుద్ధ విమానలు అన్న హేళనగా అడిగారు ఒక ఇజ్రాయెల్ సానుభూతిపరుడు. ఈ కవితను మర్వాన్ అక్టోబర్ 7 కంటే చాలా ముందు, కొన్నేళ్ల  ముందు రాశారు. 

చరిత్రను వక్రీకరించడం అనేది ప్రజల అణిచివేతను కప్పిపెట్టే ఒక పన్నాగం. ఆ పన్నాగాన్ని బయటపెట్టి, అణిచివేతను ప్రతిఘటించడంలో ప్రజలను సంఘటిత పరిచే బలమైన సాధనాల్లో ఒకటి సాహిత్యం. అది కథ కావచ్చు, కవిత కావచ్చు, విశ్లేషణాత్మక వ్యాసం కావచ్చు. 

యుద్ధానికెప్పుడూ రెండు ముఖాలు ఉంటాయి. దురాక్రమణదారుడు లేదా దురాక్రమణదారులు ఒక ముఖం, అణిచివేయబడుతున్నవారు రెండో ముఖం. 

ఎక్కడెక్కడో జరుగుతున్న యుద్ధాలను మనం ఎందుకు పట్టించుకుంటాం? రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరగటం కావచ్చు, ఆ యుద్ధాలకు సరఫరా అయ్యే సామాగ్రి తయారీలో ఏదో రూపేన మనం పాల్గొంటున్నాం. ఉదాహరణకు మనం కడుతున్న ట్యాక్సులు ఎన్నో యుద్ధాలకు బడ్జెట్ సమకూర్చుతాయి. ఇవన్నీ కారణం కావచ్చు, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా, సామాన్య ప్రజల ఆక్రోశాన్ని వినగలిగే మానవత్వాన్ని మన గుండెల్లో కాసింతైనా ఇంకా మిగుల్చుకున్నందుకు అని అనుకుంటాను.

డెబ్బై ఆరేళ్ల క్రితం స్థాపించిన ఇజ్రాయిల్ కోసం తమ స్వంత భూములనుంచీ, ఇళ్లనుంచీ వెళ్లగొట్టబడ్డ పాలస్తీనీయుల దుఃఖ గాథ, స్వాతంత్రం కోసం వాళ్లు చేస్తున్న పోరాటం మనకు తెలిసింది వార్తల వల్లే అయినా, మన మనసుల్లోకి ఇంకింది మొహమూద్ దార్విష్, మొయిన్ బొస్సిసో, ఘసన్ కన్ ఫానీ వంటి కవులూ కథకులు రాసిన సాహిత్యం వల్లనే. యుద్ధం పేరిట పాలస్తీనియులను హననం చేస్తున్న ఇజ్రాయిల్ కు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తున్నా మెజారిటీ దేశ ప్రజలు పాలస్తీనియులకు సంఘీభావంగా పాలస్తీనా సాహిత్యాన్ని అనువాదం చేస్తున్నారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. 

తెలుగులో కూడా స్వంత కవితలతో ఇప్పటికే కొన్ని సంకలనాలు వెలువడ్డాయి. ఎందుకు ఈ సాహిత్యం అని వెక్కిరించినవాళ్లూ, పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. ఈ సాహిత్యం… అణిచివేతను చరిత్రలో రికార్డు చెయ్యడంతో పాటు, ఇంతమంది మనలానే ఆలోచిస్తున్నారన్న ధైర్యం సాహిత్యకారులకూ, పాఠకులకూ ఇస్తుంది. పాలకుల నిర్ణయాలను కూడా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. సాహిత్యానికి ఇంత శక్తి ఉంది గనకనే చిలీ అంతర్యుద్ధంలో ప్రపంచ ప్రజాకవి, గాయకుడు విక్టర్ హారాను పినోచెట్ సైన్యం హత్య చేసిoది. రెఫాత్ అలరీర్ అనే పాలస్తీనా కవిని టార్గెట్ చేసి హత్య చేసింది ఇజ్రాయెల్ సైన్యం. “If I Must Die”  అనే అలరీర్ రాసిన చివరి కవిత ప్రపంచాన్ని కుదిపేసింది.  గీతాంజలి గారు అనువాదం చేసిన ఈ కవితను ‘నేను గనక మరణించాల్సి వస్తే’ అనే శీర్షికతో  సంచిక పత్రికలో పబ్లిష్ చేశారు: 

అవును నేను గనుక మరణించాల్సి వస్తే..
నా కథ చెప్పటానికైనా నువ్వు బతికి ఉండాలి.

నా వస్తువులు అమ్మడానికైనా..
ఒక చిన్న గుడ్డముక్క కొనడానికైనా ..
పోనీ కొన్ని దారాలు..

(దాన్ని తెల్ల రంగులోకి మార్చి  పొడవైన తోక లాంటి దాన్ని చేయాలి)                  

గాజాలో ఎక్కడో స్వర్గాన్ని చూస్తున్న ఒక చిన్నపిల్లవాడు ..
ఎవరికీ.. కనీసం తన రక్త సంబంధీకుల కైనా..
పోనీ తనకు తానైనా సరే వీడ్కోలు చెప్పకుండా
చనిపోయిన తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న పిల్లవాడు..


ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న
నువ్వు తయారు చేసిన గాలి పటాన్ని..
నా గాలి పటాన్ని చూస్తాడు.
ఒక్క  క్షణం అక్కడో దేవదూత ఉందనుకుంటాడు.


కనీసం భ్రమ పడతాడు.
ఆమె బోలెడంత ప్రేమని
తనతో తెస్తుందని కూడా అనుకుంటాడు.. బహుశా!
పోనీలే.. నేను చనిపోవాల్సి వస్తే..
నా మృత్యువు ఆ గాలిపటం రూపంలో అయినా ఒక ఆశని తెస్తుందేమో..?


అందుకే.. నేను గనుక చనిపోవాల్సి వస్తే..
నువ్వు బతికి ఉండాలి!

యుద్ధ విరమణకోసం జరిగిన ఎన్నో నిరసన ప్రదర్శనల్లో కనిపించిన తెల్ల గాలిపటం ఏం తెలియజేస్తుందో ఆ కవిత వల్ల ఇప్పుడు అందరికీ తెలుసు. 

గాజామీద ఇజ్రాయెల్ దాడి మొదలైన కొద్దిరోజుల తరువాత మర్వాన్ మఖూల్ New Gaza అనే తన కవితను పంపించారు. ‘కొత్త గాజా’ అనే పేరుతో ఆ కవితను అనువాదం చేస్తాననీ, ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయిస్తాని అడిగితే వెంటనే ఒప్పుకుని, ‘తప్పకుండా చెయ్యండి. ఈ యుద్ధాన్ని తొందరగా ఆపాలి.’ అని అన్నారు. నమ్మశక్యంగాని క్రూరత్వంతో అక్కడ జరుగుతున్న హింసను చూస్తూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు, ఓ కవి తన కవిత ఈ  ప్రపంచాన్ని కదిలిస్తుందని నిస్సందేహంగా నమ్మడం అబ్బురం కాదూ?  

Who are we to think words do not have power?

పదాలకు శక్తి లేదని ఎలా చెప్పగలం. వాటికి శక్తి ఉంది.

సమ్మర్ అవాద్ అనే పాలస్తీనీయన్ అమెరికన్ కవయిత్రి రాసిన “Syllogism of Palestinian Grief’ అనే కవితను ‘పాలస్తీనా దుఃఖ తర్కం’ అనే శీర్షికతో కొలిమి మ్యాగజైన్ కోసం అనువాదం చేశాను.

 “జీసస్ పాలెస్తీనీయుడు.

జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టి

దేవుడు పాలెస్తీనీయుడు.

దేవుడు పాలెస్తీనీయుడు, అందువల్ల

దేవుడి తల్లి గాజాలో నివసిస్తోంది.

అక్కడ ఎందరో ఆమె లు ఉన్నారు,

ఎంత మందో ఆమె కొడుకులు ఉన్నారు, చెల్లాచెదురుగా

అల్-షిఫా ఆసుపత్రి నేల మీద శిలువ మాదిరి పడిపోయి.

 

ఆమె ఎత్తుకుంటుంది వేలాడుతున్న జీవంలేని అతని మాంస ఖండాల్ని” అంటూ అక్కడ జరుగుతున్న జాతిహననాన్ని మన ముందు గుండెలవిసేట్టు ఆవిష్కరిస్తూనే,  

“కాని, దేవుడి తల్లికి తెలుసు,

మాతృత్వపు పురా దృష్టి ఆమెది,

అతను తిరిగి లేచి వస్తాడని ముందే రాసిపెట్టి ఉందని

ఆమెకు తెలుసు.అనే గొప్ప ఆశను రగిలిస్తారామె.  Who are we to lose hope? ఆశను పోగొట్టుకోడానికి మనమెవరం. మనం ఆశను పోగొట్టుకోడానికి వీల్లేదు.  

సారంగ మ్యాగజైన్లో  కవి, సాహిత్య విమర్శకులూ అయిన కృష్ణారావుగారు పాలస్తీనా గురించి ఒక వ్యాసం రాశారు  “ఒక చేతిలో  శాంతికపోతం, మరో చేతిలో సమర  యోధుడి తుపాకితో ఉన్నాను. నా చేతిలో శాంతికపోతాన్ని ఎగిరిపోనివ్వకండి.” అని అరాఫత్ అన్న మాటను గుర్తు చేస్తూ పాలస్తీనా దుఃఖంలో ఎవరు టెర్రరిస్టో గ్నాపకం చేస్తారు. ఎన్. వేణుగోపాల్, నిర్మలానంద,నందిని సిద్ధా రెడ్డి, శివారెడ్డి ,  దివికుమార్, రవిబాబు తదితర రచయితలు 1970 ల నుంచి పాలస్తీనాకు మద్దతుగా కవితలూ వ్యాసాలు రాసారనీ , అనువాదాలు చేశారనీ  ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. By the way, ఈ వ్యాసం లో హెచ్చార్కే గురించి నాకు తెలియని ఒక హృద్యమైన సంఘటన షేర్ చేసుకున్నారు. Honestly, I felt quite proud to be his daughter. 

పాలస్తీనా అనేకాదు యుద్ధసమయాల్లో అణిచివేయబడుతున్న ప్రజలతో సంఘీభావంతో నిలబడ్డది మన తెలుగు సాహిత్యం అని రాస్తూ, ‘ఎక్కడ కన్నీళ్లు,నెత్తురూ,పోరాటం ఉండేవో ఆప్రాంతాన్నే తెలుగు సాహిత్యం ప్రేమించేది.’ అని అందరం గర్వపడేలా గుర్తు చేస్తారు కృష్ణారావు. 

చైతన్య చెక్కిళ్ల  కుర్దుల గురించి కొలిమి మ్యాగజైన్లో ఒక మంచి విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. స్వయం ప్రతిపత్తి కోసం, ఆత్మగౌరవంతో బతికే హక్కు కోసం, తమ భాష, సంస్కృతులను కాపాడుకోవడం కోసం వందల ఏండ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న కుర్దులకు సంఘీభావంగా నిలబడదామని రాస్తూ కొన్ని కవితలను కూడా అనువాదం చేశారు. అందులో ఒకటి, అబ్దుల్ పష్యూ రాసిన ‘విమర్శకుల కోసం’ అన్న కవిత:

నువ్వు నన్ను నిర్విరామంగా, నిర్దయగా అడుగుతావు
నాలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడిదని
ఆకు లాంటి నా నాలుక, నిస్సహాయమైన ఒక సన్నని మాంసపు ముక్క
ఫేరో రాజభవనంలోని పరదాలను
ఎట్లా చీల్చి చింపగలిగిందని
ముండ్ల భూమి మీద
ముండ్ల తీగల కంచె గుండా
నిర్భయంగా ఎట్లా దాటగలిగిందని అడుగుతావు.

ఏ సింహాసనం, ఏ మకుటం నాకు దన్నుగా ఉందని అడుగుతావు,
ఏ జేబు నుండి నేను కత్తిరించబడ్డానని అడుగుతావు.

నెమ్మదించు…
నీకు ఒక మాట చెప్తాను విను:
నా పేదరికం ఒక నిండు ఖజానా అయినప్పుడు,
నా నిరాశ్రయత ఆకాశ హర్మ్యం అయినప్పుడు,
నా నిద్రలేమి వెచ్చని పరుపు అయినప్పుడు,
నా దుఃఖాల ద్రాక్షతోటలు నాలుగు కాలాలూ
రసమయంగా, గాలి జొరబడలేనంత గుబురుగా పెరిగినప్పుడు,
స్వేచ్ఛ నన్ను వెతుక్కుంటూ రాదా?
మొక్కవోని ధైర్యమే నా ఆంతరంగికురాలు కాదా?” 

సమాజంలోని వక్రాన్ని బయటపెట్టి, తలకిందులుగా ఉన్న సమాజాన్ని సరిగ్గా నిలబెట్టేందుకు ఉపయోగపడే అందమైన, బలమైన సాధనం సాహిత్యం అని ఇదిగో ఇలాంటివి చదివినప్పుడే అనిపిస్తుంది.

సమాజాన్ని మార్చేందుకు మాత్రమే సాహిత్యం అన్న మంకుపట్టు నాకు లేదు. కానీ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరం శాంతిలో, ప్రేమలో బతకుతూ, పువ్వుల గురించీ, సీతాకోకచిలుకల గురించీ కవిత్వం చదువుకుంటూ, చందమామ కథలు వినుకుంటూ బతకడం ఎంత బాగుంటుందో  కదా? అలాంటి సమాజం వొచ్చే దాకా, పక్షులను కవి వినగలిగేదాకా యుద్ధాల గురించి తెలుసుకుందాం. రచయితలుగా కనీస బాధ్యతతో, అణిచివేయబడుతున్న ప్రజల పక్షాన నిలబడి రాద్దాం, చదువుదాం.

*

మమత, కె

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • chaalaa baagaa maataadaaru madam. paalasteena gurinchi vaari kavitvam gurinchi aa poraataaniki sangheebhaavangaa raasina kavitvam gurinchi israel ku maddhatu istunna amerika nelapai nilabadi maataadaadam nachindi. abhinandanalu.

  • మీ ప్రసంగం మిక్కిలి ఉత్తేజకరంగా ఉంది.మంచి కవితలను ఉటంకించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు