ఏ పండగొచ్చినా.. ఇప్పుడంతా సెల్లుఫోన్లు పట్టుకోని ఎవరూ మాటాడుకోరు. ఒకరికొకరు కల్చరు. కల్చినా మాట్లాడుకోరు. మాట్లాడినా సెల్‌ఫోన్లతో మాట్లాడతారు. పేరుకు పండగే కానీ.. అంత చప్పగనే ఉంటాది. ఎవురింట్లో వాళ్లు కొత్త సిన్మాలు సూచ్చా.. ఫేసుబుక్ సూచ్చా ఉంటారు. అయితే ఒకప్పుడు సంకురాత్తిరి పండగ ఇట్లుండేది కాదు. మంచులందరూ కల్చిపోయి.. పండగలు చేసుకునేవాళ్లు. మాట్లాడుకునేవాళ్లు. నగుకునేవాళ్లు. పండగను పండగలా జరిపేవాళ్లు.
సంకురాత్రి అంటానే ఓ మాట గుర్తొచ్చాది.
సంకురాత్తిరి పండక్కు *చలి సంకలెత్తకోకుండా* పెడ్తాది అంటాండ్రి పెద్దోళ్లు.
మేం పిల్లప్పుడు సంకురాత్రి పండగ మా ఊర్లో బాగానే జరుపుతాండ్రి. కాపోళ్లు(రాయలసీమలో రెడ్లను ఇలా పిలుస్తారు) మా ఊర్లో ఎక్కువ. బాగనే పండగైతాండ. భోగి పండగప్పుడు పద్దన్నే పిల్లోళ్లను కడిప్మాను మింద కుచ్చబెట్టి టోపీగిన్నెలోని రేనగాయల్ని పిల్లోల్లమింద మెల్లగా ఇడుచ్చాండ్రి. ఆ రేనగాయల్లోనే లెక్కుండేవాళ్లు నిమోప్పులు, ఆశ చాక్లెట్లు వేసేవాళ్లు. అయ్యి దొరుకుతాయా.. అని ఆశగా చూపెట్టుకోని ఉండేవాళ్లు. ఒకరోజు అట్ల మా ఇంటివెనకల ఉండే విజయక్క ఇంటికాడికి పోయి.. వాళ్ల పిల్లోడిమింద రేనగాయలు ఇడిచ్చే… రేనగాయలు ఏరుకోకుండా ఆశా చాక్లెట్లు ఇంటికి తీసకచ్చుకున్యా. అట్ల ఎవురన్నా భోగిపళ్లు వేచ్చారని బజార్లంబడీ తిరుగుతాంటిమి.
పండగ ముందురోజు మాయమ్మ కూలిపనికి పొయ్యేది కాదు. పద్దన్నేపేడకాళ్లు దిబ్బలో బెయ్యకుండా గాటిపాటనే కువ్వ ఏచ్చాండ. మా ఇంటికాడికి చుట్టుపక్కలోళ్లు వచ్చి *ఒబ్బా.. పేడకాడి ఏసకపోతాం* అంటాండిరి. నాకేమో కోపం వచ్చేది. అసూయతో రగిలిపోతాంటి. *మా పేడకాడ అంత దెంకపోవాకల్లి* అంటాంటి. *పేడకాడి ఏసకపోతే ఏమైతాది* అని మా పేడ గంపలోనో, డబ్బారేకు చాటలోనో పేడ ఏసి ఇచ్చేది. *మల్లా గంప, చాట ఈక్కా* అని అంటాండ మాయమ్మ. *మన పేడ అయిపోతాదిమా* అంటూ మాయమ్మ ఎనకాల తిరుగుతాంటి. *వాళ్లకు ల్యాక మనింటికాడికి వచ్చినారు* అనుకుంటా.. మాయమ్మ బండలు కడగటానికి నీళ్లు ఎత్తకచ్చాండ. పంతలు, కాగులు, కుండలు, ఇనపబక్కెట్లు, బిందెలు… నీళ్లతో నింపేది. ఇండ్లు కడిగేది పద్దన్నే. ఎనిమిదికల్లా.. గుంతలోని సున్నంరాళ్లమింద నీళ్లు పోసి ఉడకబెట్టేది. బువ్వ తిన్యాక ఇంటిముందు పేడతో అలికేది. మాయమ్మ ముందు అలుకుతాందని.. పక్కింటి గొల్లోళ్లు, ఎదురింటోళ్లు… పోటీకి అలుకుతాన్యారు. బయట అరుగులకు, గోడలకు, ఇంట్లో.. అంతా సున్నం తీసేది. దేవునిపటాలు తుడిచేది. కొట్రీ ఇంట్లో ఎర్రమట్టి తీసేది. ఆ రోజు మా ఇండ్లు కళకళలాడేది.
పండగ పద్దననంగా నిద్దరొచ్చేదికాదు. మా ఇంటికాడ ఉండే ఆడోళ్లందరూ తెల్లార్జామునే లెయ్యాల.. ముగ్గులేసుకోవాల అని మాటాడుకుంటాండిరి. ఆ మాటలు ఇన్యాక.. ఎప్పుడెప్పుడు పద్దనైతాదిబ్బా.. అని నిద్రలో లేచి సూచ్చాంటి. పద్దనే నాలుగప్పుడు లేచి పిల్లగాళ్లమంతా బొచ్చుటవాల్లో, లుంగీగుడ్డలో, సన్నరగ్గులో కప్పుకోని సలికి వణుక్కుంటా… అమ్మగార్ల దగ్గర ముడుక్కుంటాంటిమి. మేము ముగ్గులు వేసుకోం. మాయమ్మ కాదనలేక మా పక్కింటోళ్ల గొల్లోల్ల ఇంటికాడ, ఎదురింటోళ్లయిన మంగలోల్ల ఇంటికాడ, రోంత దూరముండే కాపోళ్ల ఇంటికాడ.. ముగ్గలకు రంగులేచ్చాండ. మాయమ్మ కాడ కూచ్చోని నేను, మా చెల్లెలు రంగులు ముగ్గులకు వేచ్చాంటిమి. మా మాద్దిరే అందరు పిల్లోల్లు ముగ్గుల కాడ కుచ్చుంటాండిరి. నాకెందుకే సరస్వతి కలరు, బులుగు కలరు ఇష్టముంటాండ. అదే రుద్దుకుంటా అంటాంటి. ఎవరు ఇంటికాడ ముగ్గులేచ్చామో వాళ్లు… *పిల్లల్లారా జాగ్రత్త. రంగుపొడి అయిపగొట్టాకండి. పెట్టెల బయట రంగెయ్యాకండి* అంటాండ్రి. *సరేలేక్కా* అంటాండిరి. ఆడిపిల్లోల్లు ముగ్గులు బెరీన వేసి *సంక్రాంతి శుభాకాంక్షలు* అని రాచ్చాండ్రి. నేను కూడా రాచ్చా.. అని ఎవరోకరి ఇంటికాడ ఒప్పుకుంటాంటి.. రాచ్చానని. రోంత ప్యాషను మంచులయితే.. *హ్యాపీ సంక్రాంతి* అని ఇంటిముందు రాసుకుంటాండిరి. పాచిమగాననే.. మా గరుగుమింద అంతా పిల్లోళ్లం తిరుగుతాంటిమి. లెక్కుండేవాళ్లు పెద్ద ముగ్గు వేచ్చాండ్రి. ముగ్గుల్లో గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల్లో చెండుమల్లెపూలు పెడతాండ్రి. ఏముగ్గు పెద్దదో… అనుకుంటా తిరుగుతాంటిమి. ఎప్పుడు చూసినా… మా ఇంటి ఎనకాల ఉండే ప్రియాంకవాళ్ల ఇంటికాడ పెద్ద ముగ్గు ఉంటాండ. వాళ్లక్క వాళ్లు చదువుకున్యారు. మంచి ముగ్గులు వేచ్చాండ్రి. రోంత లెక్కున్యోళ్లు కాబట్టి.. రంగులూ ముగ్గలకు బాగా ఏచ్చాండ్రి. ఎందుకో.. ఇండ్లన్నీ తలకాయల్లో ముగ్గుపూలు పెట్టుకున్యట్లు.. కనపడతాండ! ఊరంతా.. ముగ్గులతో మెరిసిపోతాండ.
పద్దన్నే ఏడుకల్లా.. గంగిరెద్దోళ్లు వచ్చాండ్రి.. పీపీపీ అంటా పీక ఊంపుకుంటా. గంగిరెద్దలమీద బంతలు, రగ్గులు, మెరిసే బట్టలు ఉంటాండ. మెడకి గంట… కొమ్మలకు కుంకుమపసుపు ఉంటాండ. మెడని సోకు సేచ్చాండ్రి. కాళ్లకు గజ్జెలుంటాండ. చెంగుచెంగుమని ఎగిరినట్లు.. గంగిరెద్దులు డ్యాన్సు వేచ్చాంటే… అట్లనే సూచ్చాంటిమి. గంగిరెద్దు ఎనకంబడీత పోతాంటిమి. ఎవరింటికాడికి పోయినా.. చాటల్లో బియ్యం వేసుకుని గంగిరెద్దును ఆడించే ఆయప్ప.. గుడ్డల బ్యాగులో బియ్యం వేచ్చాండ్రి. ఆయప్ప.. దండాలు తల్లీ అంటా ఇంకో ఇంటికాడికి పోతాండ. బయట ఉండానని.. మా చెల్లెలు అమ్మ పిలుచ్చాంది అని ఇంటికి పిల్చకపోతాండ. ఇంటికి పోతానే.. *బెరీన నీళ్లు పోసుకో* అంటాండ. మాయమ్మ అప్పుటికే ఉడకబెట్టిన శెనగవాళ్లు, బెల్లం రోట్లో వేసి రుబ్బురు గుండుతో రుబ్బి పెట్టేది. ఆ పూర్ణం రోంత నోట్లో ఏసుకుంటాంటి. గాటిపాట నీటుగా ఉంటాండ.. పండగపూట. *బెరీన నీళ్లు పోసుకోని.. రోశప్ప దగ్గరికి పోయి గుడ్డలు తెచ్చుకో* అంటాండె. *ఒమా.. పూర్ణకజ్జికాయలు బెరీన చెయ్యి* అంటాంటి. *మాయమ్మ పూర్ణ కజ్జికాయలు కాలుచ్చాంటే.. గబగబా నీళ్లు పోసుకోడానికి పోతాంటి. మాయమ్మ ఇచ్చిన చక్కా, నిక్కర ఏసుకోని మాదిగోళ్ల రోశప్ప ఇంటికాడికి పోతాంటి.
అప్పుటికే టయము పదిన్నర అయితాండ. *సగం పండగ అయిపోయింది. వేసుకోని ఏం లాభం బట్టలు* అని ఎవురన్నా.. ఆయప్పతో కొట్టాట పెట్టుకుంటాండ్రి. అట్లనే సూపెట్టుకోని.. ఆయప్ప చక్కా,నిక్కర ఇచ్చిరీ చేసి.. పేపర్లో పెట్టి ఇచ్చాండె. ఇంటికి పరిగిత్తుకుంటా వచ్చి.. ఆ చొక్కా, నిక్కర ఏసుకోని.. ఒకటికి రెండుమాట్లు అద్దంలో సూసుకుంటాంటి. మాయమ్మ వచ్చి.. టవాల్లో పోడరు వేసి మగానికి కొడ్తాండ. అగ్గిపుల్లతో కుడిచేయి మీద, కుడి దమ్మ మీద కాటిక చుక్క పెడ్తాండ. *వద్దుమా.. * అంటాంటి. మాయమ్మ ఇనకపొయ్యేది కాదు. అరిగిపోయినేటియి కాకుండా.. రోంత బాగుండే అవాయ చెప్పులు ఏసుకోని.. బయటికి వచ్చాంటి. *వామికాడికి పోయి చెనక్కాయకట్టె తాపో* అని మానాయినకు చెప్పేది మాయమ్మ. మా చెల్లెలు మాయమ్మ కాడనే ఉండేది. నేను బయటికొచ్చి.. మా బజార్లో పిల్లల్లతో కలిసి బడితిక్కో, దేలం తిక్కో పోతాంటి. నాకంటే మంచి చొక్కా, నిక్కర ఎవరిదన్నా కనపచ్చే.. కుళ్లుకుంటాంటి. లెక్కుండేవాళ్లు ప్యాంట్లు ఏసుకుంటాండిరి. మళ్లా దర్జాగా గరుగుమింద తిరుగుతాంటి. ఎవరన్నా.. టీవీ పెట్నారేమోనని తిరుగుతాంటిమి. పక్కిడ్డి ఇంటికాడో, గింగిరెడ్డి ఇంటికాడో.. టీవీ పెట్నారో లేదో అని ఒకసారి అట్టపొయ్యి వచ్చాంటిమి. యాడన్న టీవీ ఆడతాంటే… *ఏం సిన్మా ఏచ్చారుక్కా.. ఈ పొద్దు *అని అడుగుతాంటి. పన్నెండు కల్లా బయట తిరుక్కోని ఇంటికి వచ్చి మళ్లా *ఒమా.. బువ్వ* అంటాంటి. పప్పు, ఉల్లగడ్డతో రోంత తిని. మాయమ్మ చేసిన వొడిగాయిలు ప్లేట్లో పక్కనబెట్టుకోని పాంకుంటాంటి. శెనగకట్టుతో శారు చేసేది మాయమ్మ. ఎంత రుచిగా ఉండేదో. తిన్యాక.. ఒమా ఎవురికీ ఏపియ్యాకు..రాత్తిరి, రేప్పద్దనకూ కావాల్ల అంటాంటి. పండగప్పుడు మజ్జిగ చిలికేది కాదు మాయమ్మ. అందుకే గట్టిపెరుగు వేచ్చాండ నాకు. కమ్మగా తింటాంటి.
ఇంట్లో అందురూ తిన్యాక.. నేను,మాయమ్మ, మా చెల్లెలు.. మా వీధోళ్లమంతా మధ్యానం బారాకట్ట ఆడేవాళ్లం. మా కుడిపక్కన ఉండే మంగలోళ్లు వాళ్ల యాపమానుకు ఉయ్యాల ఏసుకుంటాండిరి. *ఒక్కా రోంచేపు ఊగుతా* అని అడుగుతాంటి. సూచ్చాండంగానే.. మధ్యానం అయిపోయేది. అట్ల ఇట్ల తిరుగుతానే.. పైటాల అయిపోయేది. మైటాలపూట… టెంకాయ పందాలు ఆడేవాళ్లు పెద్దోళ్లు. కుంటకాడనుంచి ఫలానోళ్ల చేనుకాడికి ఇన్ని ఏట్లకు టెంకాయ ఏచ్చా అని బొచ్చుటెంకాయతో పందేలు కాచ్చాండ్రి. చెలాటకంగా ఆడేవాళ్లు. వాళ్ల ఎంబడీత పొయ్యేవాణ్ణి. సూచ్చాండంగానే మబ్బయ్యేది. రాత్రి ఆరుగంటలకు ఇంట్లో వాళ్లందరం.. కాపోళ్ల ఇండ్లకాడ ఉండే.. బ్లాక్ అండ్ వైట్ బీపీఎల్ టీవీలకాడ వాలిపోయేవాళ్లం. దేవతల సినిమాలో.. ఫైట్లసినిమాలో ఏందోకటి వచ్చాండ. సూచ్చాంటిమి. మేం చదువుకుంటాండప్పుడే డిష్షు అప్పుడప్పుడే వచ్చినాది కాబట్టి రోంత మంచి సినిమాలు ఏచ్చాండ్రి. ఎనిమిదికళ్లా సినిమా అయిపోయాక.. ఇంటికి వచ్చి బువ్వ తింటాంటిమి. తిన్యాక.. బజార్లో అంతా బయటికొచ్చేవాళ్లు. ఎవురంతకు వాళ్లు మాట్లాడుకుండేవాళ్లు. మా ఇంటికాడ ఉండే అనంతమ్మవ్వ రేడియోలో పాటలు వినేది. పిల్లగాళ్ల మంతా ఆడుకునేవాళ్లం. బాగా అలసిపోయేవాళ్లం. నేనయితే.. మళ్లా పండగ ఎప్పుడొచ్చాదో. శివరాత్రి, ఉగాది ఎప్పుడొచ్చాదో అనుకుంటాంటి. మాయమ్మ కథలు చెబుతాంటే.. నేను, మా చెల్లెలు నిద్దరలోకి జారుకుంటాంటిమి.
…………………………
Good narration. Yaasa lo vraasina theeru baavundi
thankive so much sir
thankive so much