న్యూ లెన్స్ లోంచి .. అడవి

డుస్తున్న వాడల్లా ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తూ అలా  కొద్దీ క్షణాలు నిలబడిపోయాడు సామ్రాట్.

ఆశ్చర్యంలోంచి తేరుకునే సరికి అతని మనసులోని కోరిక ఉవ్వెత్తున ఎగిసి వచ్చి ముందు నిల్చుంది.

ఇది కలా నిజమా అర్ధం కాక తనను తాను గిల్లుకున్నాడు. కల కానిది అంటే నిజమే..

చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో జ్ఞాపకాలు కదలాడాయి.

ఎంత ఆనందమయిన క్షణాలవి.. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కళ్ళ ముందుకు అలాంటి  ఉయ్యాల.

మారిపోయిన సంస్కృతీ, అలవాట్లు, వస్తువుల మధ్యలో ఇప్పుడు ఇవి ఇక్కడ ? ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో తేరిపార చూస్తున్నాడు. కొండపై వైపు ఆకాశాన్ని తాకుదామని ఎగబాకినట్లుగా ఉంటే ఆ కొండ అంచున నిలువెత్తు పెరిగి విస్తరించిన  చెట్టుకొమ్మలనించీ వేలాడుతున్న తాడు . అది U ఆకారంలో కట్టి ఉంది. భూమికి మూడున్నర అడుగుల ఎత్తున చివరికొన.  ఆ తాడు రెండుకొనల మధ్య వారధిలా అరచెయ్యి వెడల్పుతో రెండడుగుల కర్ర కట్టి ఉంది.

అతనికి దాన్ని పట్టుకుని ఉయ్యాలలా ఊగాలని కోరిక ఎగిసిపడింది.  అంతలోనే ఈ చెట్టు ఏమి చెట్టో.. గట్టిదేనో కాదో కొమ్మవిరిగి పడితేనో సందేహం వచ్చి కిందకు చూశాడు.

కొద్దిగా జారితే లోయలోకి వెళ్ళిపోతాడు. నిలువాటి చెట్ల తలలు లోపలెక్కడో పాతాళంలో ఉన్నట్లుగా ఉన్నాయి.

చెట్టు కొమ్మల మధ్యనుండి ఉయ్యాల రా రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆగలేకపోయాడు. ఏదైతే అయిందని రెండు భుజాల మధ్యన వేలాడుతున్న బ్యాక్ ప్యాక్ తీసి ఓ చెట్టు మొదట్లో ఆనించాడు. జాగ్రత్తగా వెళ్లి ఆ కర్రల్ని పట్టుకున్నాడు. చేతులకు చల్లగా తగిలాయి. ఉలిక్కిపడ్డాడు.  ఏమిటని జాగ్రత్తగా చూశాడు.

నిజానికవి కర్రలు కాదు. ఇత్తడి కడ్డీలు. పాలిష్ లేనివి. ఆ తాళ్లు కూడా మామూలు తాళ్లు కాదు.

అయినా ఊగాడు. స్వేచ్ఛగా ఊగాడు.  ఆనందంతో ఊగాడు. పెద్దగా అరిచాడు. గట్టిగా నవ్వుకున్నాడు.

అతనితో పాటు చెట్టూ చేమా, కొమ్మా రెమ్మా, పిట్టా పుట్టా అన్ని గొంతు కలిపి నవ్వుతున్నట్టుగా ఉందతనికి. ఆ అరుపులూ నవ్వులూ ఆ కొండా కోనల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.  కొత్తశక్తి శరీరంలోకి ఇంజెక్ట్ అయి ఒళ్ళంతా పాకుతున్నట్టుగా అనిపించింది.

బయట రోజువారీగా తానుండే సమాజంలో ఇట్లా ఉండగలనా.. ఇలా చేయగలనా.. నన్నిలా ఎవరైనా ఊహించగలరా ..

చిన్న ఊపు ..

అవడానికి అది చిన్న ఊపే.. కొద్ది నిముషాలే ఊగింది.  కానీ, ఎంత ఆనందాన్ని నింపింది అనుకున్నాడు.  అప్రయత్నంగా ఈల పాట అతని గొంతులోంచి వచ్చింది. ఆకాశాన ఎగురుతున్న పక్షులు అతన్ని చూసి నవ్వుకున్నాయి.

బారులు తీరి చెట్టుపైకి కొన్ని పోతుంటే కొన్ని అదే దారిలో  వెనక్కి వస్తూ శిక్షణ పొందిన సైనికుల్లా కదులుతున్న పెద్ద ఎర్ర చీమలు బాగ్ తీసుకోబోతుండగా కనిపించాయతనికి.  బాగ్ మీదకు ఏమైనా పాకేయేమోనని కళ్ళు పరీక్షించాయి. ఏమీ కన్పించలేదు. అయినా బాగ్ దులిపి భుజానికి తగిలించుకున్నాడు.  ఇంత చిన్న చీమల నుండి అంత పెద్ద జంతువుల వరకు, చిన్న గడ్డిపరక నుండి మహావృక్షాల వరకు ఎన్నింటికి ఆవాసమో ఈ అడవి  అనుకున్నాడు.

ప్రకృతిలో ఉన్న గొప్పదనాన్ని తలుచుకుంటూ అడుగులేస్తున్నవాడల్లా ఏదో గుర్తొచ్చినట్టు ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు.

ఈ అరణ్యంలో ఆ ఇత్తడికడ్డీల ఉయ్యాలను తాళ్లతో ఎవరు కట్టి ఉంటారు. ఎక్కడినుంచి వచ్చి ఉంటుంది.. ప్రశ్నలు తలెత్తాయి.

చిన్నప్పుడు ఏదో పండక్కి ఉయ్యాలలు ఊగేవాళ్లమని అమ్మ చెప్పేది.

బహుశా ఈ ప్రాంతపు ఆదివాసీలు ఏదైనా పండుగ కోసం ఇలా కట్టారేమో..

వారి పండుగలు ఆచారవ్యవహారాలు ఏమిటో..  ఈ చుట్టూ పక్కల ఆదివాసీ గ్రామం ఉందేమో.. ఆలోచిస్తూ సాగుతున్నాడు సామ్రాట్.

 ****                                         ****

అదంతా కీకారణ్యం ..  జనసంచారం కన్పించని దట్టమైన అరణ్యం.

ఆకుపచ్చ చీర సింగారించుకుని కళకళలాడుతున్న చెట్లు.

ఆ చెట్లకొమ్మల నిండైన దుస్తుల్లోనుంచి సందు చేసుకుంటూ చీకటి రంగుని తరిమేస్తూ దూసుకొస్తున్న సూర్యకిరణాలు వెచ్చ వెచ్చగా తాకుతున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్తగా సింగారించుకునే  ప్రకృతిని చూసి మైమరచిపోతూ.. మధ్య మధ్యలో  ఆ సోయగాల్ని కెమెరాలో బంధిస్తూ..

చల్లటి గాలి మెత్తమెత్తగా ఆత్మీయంగా స్పర్శిస్తుంటే ఆస్వాదిస్తూ..  సహజ సుందర దృశ్యాల్ని  అనుభూతి చెందుతూ  ఈస్టర్న్ ఘాట్స్ లో సోలో ట్రెక్ చేస్తున్నాడు  సామ్రాట్

రాత్రి వెళ్తూ వెళ్తూ చిలకరించిన మంచుకు మెత్తబడిన ఎండుటాకులపై నడుస్తుంటే వాటి కింద దాగిన పండి ఎండిన ఆకులు మేమున్నాం అంటూ చేస్తున్న సవ్వడికి  కుందేళ్లు  కన్ను మూసి తెరిచేంతలో కనిపించి మాయమై పోతూన్నాయి.  ఎటునుండి ఎటు పోతున్నాయో..

తనను చూసి వేటగాడు అనుకుని భయపడి పారిపోతున్నాయేమో.. చిన్న సందేహం మొలిచింది. అటు ఇటు పరుగు పెట్టే వాటిని చూస్తూ  సన్నగా నవ్వుకున్నాడతను.

ఈ మొక్కల్లో, చెట్లలో ఎన్ని అరుదైన జాతులున్నాయో , ఔషధ మొక్కలున్నాయో..ఆలోచిస్తూ కమ్మని వాసనల స్వచ్ఛమైన గాలి గుండె నిండా నింపుకుంటున్నాడు.

అడుగడుగునా వినిపించే పక్షుల కిలకిలారావాలు తప్ప ఏదీ.. ఎక్కడా నర సంచారపు జాడలే కనిపించలేదు.

ఆదివాసీలు ఈ అడవుల్లోనే కదా ఉండేది . గూడేలు ఏమీ తగలడం లేదే ..

కనుచూపు మేర పరుచుకున్న పచ్చని ప్రకృతి ఒడిలో గంభీరంగా నిలిచిన  కొండల నడుమ అలా కనిపించి ఇలా మాయమయే వన్యప్రాణులతో ఊసులాడుతూ .. దూరం నుంచి వేగంగా వీచేగాలుల్నీ , సన్నని పిల్లగాలుల్నీ  స్పర్శిస్తూ ఉత్తేజం పొందుతూ గమ్యం కేసి పోతున్న అతను ఆగాడు.

గంభీరమైన తూర్పుకనుమల శ్రేణుల్లో తాను సరైన దిశలోనే వెళుతున్నాడా సందేహం వచ్చి జేబులోంచి మొబైల్ తీసాడు. సిగ్నల్స్ లేవు. బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే సిగ్నల్స్ అందుతాయని అదే తెచ్చుకున్నాడు. అయినా లాభం లేదు.

****                                           ****

సామ్రాట్ వెళ్లాలనుకునే పర్వత శిఖరం చేరాలంటే బొర్రా కేప్స్ స్టేషన్ లో దిగాక  ఐదు కిలోమీటర్ల దూరంలోని కటికి జలపాతం వరకు కొంత గతుకుల మట్టి రోడ్డు సౌకర్యం ఉంది. కానీ ఆ రోడ్డులో వాహనంలో  వెళ్లడం అతనికిష్టం లేదు .

వాహనం ఎప్పటిదో బిసి కాలం నాటిదని కాదు. అందులో జనాన్ని కుక్కి ఎప్పటికోగాని కదలరని కాదు. కాలినడకనే ఆ అడవిని దాటుకుని ఎదురొచ్చే చిన్న చిన్న కొండల్ని, లోయల్ని దాటుకుంటూ ఆ మధ్యలో వచ్చే మనుషుల్నీ, పశు పక్ష్యాదులనీ, వృక్షాల్ని పలకరిస్తూ అవి చెప్పే కబుర్లువింటూ  వాటితో కబుర్లాడతూ వెళ్లడం సామ్రాట్ కి ఇష్టం.

ప్రకృతి చేసే కొంగొత్త రాగాల్ని వింటూ అప్పుడప్పుడూ శృతి  కలుపుతూ..  వాటితో మనసులో చెలరేగే  ఎన్నెన్నో  ఊసుల్ని మౌనంగా పంచుకుంటూ సాగిపోతుంటాడు . రాత్రయితే మార్గ మధ్యలో కన్పించిన ఏ గూడెంలోనో ఆశ్రయం పొందడం, లేదంటే కాస్త అనువుగా ఉన్నచోట టెంట్ వేసుకుని విశ్రమించడం అతనికి అలవాటు .

గతంలో ఇలాంటి సోలో ట్రెక్ లు ఎన్నో చేసిన అనుభవం ఉంది. హిమపర్వత పాదాల చెంత తిరుగాడి ఎవరెస్టు బేస్ క్యాంపుని పలకరించి ముద్దాడిన కాళ్ళవి.

వేల అడుగుల ఎత్తుకుపోయిన సామ్రాట్ కి ఇది చాలా చిన్న కొండే. కాకపొతే అరకు ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ట్రెక్ చేయలేదు. అనుకోకుండా రెండు రోజుల ఖాళీ దొరికిందని అప్పటికప్పుడు ఈ ట్రెక్ కి బయలుదేరాడు బ్యాక్ ప్యాక్ తో.

బొర్రా కేవ్స్ లో రైలు దిగి కటికి వాటర్ ఫాల్స్ దాటి చాలా ముందుకు  పోతున్నాడు.

నిలువెత్తుగా ఎదిగి నింగిని  తాకుతూ ఆనందంతో పరవశించిపోతూ తలలూపే చెట్లు, కొన్ని చిగురుటాకులతో కొన్ని రంగురంగుల్లోకి మారిపోతున్న ఆకులతో.. రాలే ఆకులతో ఎన్నిరంగుల మిశ్రమం.. అద్భుతంగా ఉంది వాటి కలయిక. ఎప్పటికప్పుడు కొత్త అందాలతో సమ్మోహన పరిచే అడవులు, వాటి వెనక గుంభనంగా ఉండే పర్వతాల మోహంలో ఉన్నాడతను.

పండుటాకు రాలి సామ్రాట్ తలమీద పడింది.   ‘ఆ ఎంత సహజంగా రాలిపోతున్నాయివి.. అంతే సహజంగా చివుళ్లు తొడిగి పచ్చదనం నిండా ఒంపుకుంటున్నకొమ్మలు రెమ్మలు .. చివుళ్ళతో పాటే తొడిగే మొగ్గలూ .. విచ్చుకున్న పూలూ .. అవి వెదజల్లే పరిమళాలు .. ఎవరికోసం ఇవన్నీ..’

ఛ ..ఛా .. ఏంటి లా ఆలోచిస్తున్నాడు. ఎవరికోసం ఏంటి వాటి కోసమే.. నేనెందుకు  ట్రెక్ చేస్తున్నా.. నా కోసమే కదా .. అవీ అంతే తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు.

నేలకొరిగిన మహావృక్షాల శకలాలు ఎదురయ్యాయి.. కూకటివేళ్లతో సహా ఒరిగిపోయిన వృక్షాలు అక్కడక్కడా..

బహుశా హుదూద్ తుఫాను సమయంలో జరిగిన విధ్వంసమేమో..

అకస్మాత్తుగా చిన్ననాటి మిత్రుడు అడవి మదిలో మెదిలి అతని కాళ్లకు ఏదో అడ్డం పడ్డట్లు అనిపించింది.

చిన్నప్పుడు అందరూ అతన్ని ఎగతాళి చేసేవారు అడవి ఏంటి అడవి.. ఇదేం పేరని.. మా అమ్మా నాన్న ఇట్లాటి పిచ్చి పేరెందుకు పెట్టరోనని తిట్టుకునే అడవి ఇప్పుడు లేడు.

కిలిమంజారో వెళ్లి వచ్చేసరికి అడవి మరణవార్త తెలిసింది. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసాడు.

బహుశా ఈ అడవిలో ప్రకృతి సృష్టించిన విలయం తాలూకు విధ్వంసపు ఆనవాళ్లు ఇన్నేళ్లయినా ఇంకా అగుపిస్తూనే ఉన్నాయి . కాల్ మనీ ఉచ్చులో చిక్కుకున్న  మిత్రుడు అడవి జీవితంలోకి చొచ్చుకొచ్చిన పెనుతుఫాను చేసిన భీభత్సం. ఇంతకంటే తక్కువేం కాదుగా. సామ్రాట్  గుండె బరువైంది.

ఎదురుగా ఉన్న పెద్ద బండకు ఓ క్షణం ఆనుకుని నుల్చుంటూ  కాళ్లకింద మట్టిని చూశాడు.

ఈ నేల ఎంత సారవంతంగా ఉంది.  నేల సారాన్ని ఎంత సహజంగా కాపాడుకునే అడవి ఎన్ని రకాల జీవులకు నిలయమో.. జీవధారల్ని కురిపించే ఈ అడవి ఎన్ని ప్రాణులకు ఆధారమో..

బాక్సయిట్, ఇనుప ఖనిజం పుష్కలంగా ఉన్న కొండలివి.  కోడి పిల్లల్ని తన రెక్కల కింద దాచుకుంటూ గద్దలనుండి కాపాడుకుంటూ ఉంటుంది. ఎంతో విలువైన ఖనిజ సంపదను పచ్చదనపు దుప్పటి కప్పి అడవి ఇలాగే భద్రపరుస్తోంది. ఈ అడవుల్లో ఉన్న కొండ జాతి వాళ్ళకే కాదు జీవజాలానికి ఆవాసమై. గద్ద తన్నుకుపోతే వీళ్లంతా ఏమైపోతారో.. ఎడతెగని ఆలోచనలు ముంచెత్తాయి.

మనసు బాధగా మూలుగుతుంటే ఒకవైపు కొండ దిగి మరోవైపు ఉన్న ఏటవాలు కొండ ఎక్కి దిగుతున్నాడు.

ఎత్తైన ప్రదేశం నుండి వీక్షించడం గొప్ప అనుభూతి. సూర్యుడూ అతనితో పాటే దిగుతూ..

కొండకొమ్ము నుండి  లోతైన లోయలోకి వేగంగా దూకే నీటి సవ్వడి దూరంగా వినిపిస్తూ అతని గుండె వేగాన్ని పెంచింది.

అతనికెప్పుడూ ఇంతే .  ఆ సవ్వడితో తన శ్వాస జత కలపాలనిపిస్తుంది.   మైమరచి నాట్యం చేస్తుంది.

జలపాతపు  సవ్వడి .. మైమరపించే గాలులు..  ఎటువైపునుండో ఆలకిస్తుండగా ..  అంతరాయం కలిగిస్తూ తలపైన హెలికాఫ్టర్ ఏదో తిరుగుతున్న శబ్దం .

మావోయిస్టుల కోసం వెతుకులాట కాదు కదా.. కొంపదీసి నన్ను వాళ్లలో వాడిగా జమ కట్టరుగా.. ఏమో.. అలా జరిగినా ఆశ్చర్యం లేదు .

రాజీవ్, వెంకటరత్నం, ఉత్తేజ్ లు మేమూ నీతో వస్తాం అని వెంటబడి చివరికి వాళ్ళ ప్రయాణం ఆపుకోవడానికి కారణం మావోయిస్టు ముద్ర వేస్తారనే భయంతోనే.

ఎటువంటి పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాడు. ఇక ఆ విషయం ఆలోచించడం అనవసరం అనుకుంటూ ముందుకు కదిలాడు.

అప్పుడు కనిపించిందతనికి ఉయ్యాల .

****                                 *****                         *******

ఇంకొంత ముందుకు నడిచాడు ఆ ఎగుడు దిగుడు నేలలో.  పాము మెలికలు తిరిగినట్లుగా ఉండే సన్నని బాటలో.. అద్భుతమైన లయతో వినవస్తున్న సంగీతంతో తాను జత కలిపాడు.  ఎటు ఏ విష పురుగులుంటాయో , క్రూర మృగాలుంటాయో పరిస్థితుల్ని గమనించుకుంటూ పరిశీలనగా చూస్తున్నాడు.

గుబురుగా ఉన్న చెట్టుకొమ్మల మధ్య ఆకుల్లో ఆకుల కలిసిపోయిన బుల్లిపిట్ట నుంచి ఆ వింపైన సంగీతమని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.   తనకానందాన్ని పంచుతున్నది ఈ బుల్లిపిట్టా.. పిట్టా కొంచెం కూత ఘనం అంటారు ఇందుకేనేమో..దాన్ని అబ్బురంగా చూస్తూ కొన్ని క్షణాలు నిల్చున్న అతన్ని ఆ వెంటనే కనిపించిన దృశ్యం మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది .

కొద్ది దూరంలో పెద్ద వృక్షపు చిటారుకొమ్మన వేలాడుతున్న పడవ.. గబగబా ఆ చెట్టు దగ్గరలోకి చేరాడు.

అక్కడిదృశ్యం చూస్తుంటే అకస్మాత్తుగా J G Ballards నవల గుర్తొచ్చింది.  ఈ పడవ అట్లాగే వచ్చిందా .. మళ్ళీ తలెత్తి పైకి చూశాడు .  చుట్టూ చూశాడు .

ఆకాశం కేసి చూస్తూన్న మహా వృక్షంపై చిక్కుకున్న పడవ తలకిందులై  వేలాడుతూ..  విస్తరించిన ఆ చెట్టు కొమ్మలకు వేలాడే తాళ్లు అడ్డదిడ్డంగా.. రెండు మూడు చెట్లకింద చెల్లా చెదురుగా పడివున్న లైవ్ జాకెట్స్.. ఇంకా ఏవో చిన్నా చితక సామాన్లు అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్లుగా..

J G Ballards నవలలో గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలకలు కరిగి అడవులు అన్ని నీటిలో మునకవేయక తప్పదని చెప్పింది ఇప్పుడు నిజమైందా..

ఇంతటి ఉపద్రవం ఎప్పుడొచ్చిందిక్కడ?  వినలేదే?

సునామీలాంటి ఘటనలెప్పుడు వినలేదే.. వుద్ వుద్ తుఫాను ప్రభావమా.. నిన్న మొన్నటి తితిలి.. అదిక్కడ దాకా వచ్చిందా…అతని మనసు విలవిల లాడింది.

భవిష్యత్ తరాలు కాదు ఇప్పుడే ఇంతటి ఘోర విపత్తా.. నమ్మలేకపోతున్నాడు.

సముద్రమట్టానికి  దాదాపు తొమ్మిదొందల మీటర్ల  పైనే ఉన్న ఎత్తులోకి  ఇవి ఎప్పుడు వచ్చి ఉంటాయి.. ఎంత ఆలోచించినా చిక్కుముడి వీడడంలేదు.

మళ్ళీ మళ్ళీ తలెత్తుతున్న ప్రశ్నని అలా అదిమి వాటిని ఫోటోలు తీసాడు.

నాలుగడుగులు వేశాడో లేదో గుర్రం అస్థిపంజరం ఎదురుగా.

ఏమిటీ వింతలు అనుకుంటూ  దగ్గరకెళ్లాడు.  ఏనాటిదో ఇది అనుకుంటూ పట్టుకున్నాడు. అచ్చు నిజమైన అస్థిపంజరంలాగే ఉన్నా నిజమైంది కాదని పట్టుకోగానే అర్ధమైంది.

దేనికి  సంకేతం ఈ ఇనుపతీగల అస్థిపంజరం..?

కొండ అంచున నడుస్తున్నవాడల్లా విషాద సంగీతంలా వినిపిస్తున్న వైపు అసంకల్పితంగా అడుగులేశాడు .

మంద్రంగా వినిపిస్తున్న రాయి చప్పుళ్ళు. పచ్చని చెట్ల మధ్యలో  నేలకొరిగిన మహా వృక్షం. ఆ వృక్షంపైన  డ్రాయింగ్ షీట్ లాంటివి అడ్డదిడ్డంగా పడినట్లుగా..

పర్యావరణంలో ఏవో వైబ్రేషన్స్ ..

ప్రతి కొండ, అడవి  జీవావరణ వ్యవస్థకు కొండంత అండ. మనిషి కొండల్ని నిలువెల్లా చీల్చేస్తున్నాడు. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని, ప్రకృతి ఏర్పరచుకున్న వ్యవస్థని ధ్వంసం చేస్తున్నాడు.. అరుదైన వృక్ష, పక్షి, జంతు జాతుల ఎదుగుదలకు అడ్డుతగులుతూన్నాడు. అందుకే ఆ వినాశనం చూడలేని ప్రకృతి ఆలపిస్తున్న విషాద గీతంలా  ఉంది ఈ సంగీతం అనుకున్నాడు.

అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ రంగు రంగుల బెలూన్లు గాలిలో ఎదురొచ్చి ఆకర్షించాయి.

రంగురంగుల బెలూన్లకి కింద దారం వేలాడుతూ.. అవి ఒక గుత్తిగా చెట్టుపైకి వెళ్తున్నట్టు.

“ఓహ్ బెలూన్లు ” ఆనందంతో అరిచాడు.

చిన్నప్పటినుండి  బెలూన్లంటే ఇష్టం.  అవి గాల్లో ఎగురుతూ ఉంటె చూడడం ఎంతో ఆనందం.  కానీ ఎన్నిసార్లు ఊదినా కొద్దిసేపటికే  పగిలిపోయేవి. కానీ,ఇక్కడ ఈ గాలిలో ఎండ పొడలో  చక్కగా ఎగురుతూనే ఉన్నాయే.. ఇవి హీలియం బెలూన్లలా  ఎగురుతూనే ఉన్నాయనుకుంటూ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అందలేదు.

నీలపు నింగిలో  ఆకుపచ్చని వనంలో ప్రకృతి చేసే మంద్రమైన సన్నని శబ్దాల మధ్య రంగు రంగుల బెలూన్లు.   అద్భుతంగా ఉందా దృశ్యం.  అతనిలో ఏవో ప్రకంపనలు.

మనుషులు వేరైనా, భాషలు ఏవైనా, ప్రాంతాలు ఏవైనా  జ్ఞాపకాలు, ఎమోషన్స్, భావాలు  అందరికీ ఉంటాయిగా.. వాటిని తెలుపుతున్నట్లుగా అనిపించింది.

బెలూన్స్  దాటుకుని కొద్దిగా ముందుకుపోయాడు.

పచ్చని చెట్లకొమ్మలు నాచుపట్టిన కొండరాళ్ళ మధ్యలోంచి సడిలేకుండా పాలనురగలా కిందకు జాలువారుతున్న నీటి పాయలు .

వావ్.. ఇక్కడ కాసేపు సేదతీరొచ్చు అనుకుంటూ దగ్గరకు వెళ్లాడు. అతన్ని నిరాశ పరుస్తూ పలచని పాలిథిన్ కవర్లు . పలచని ఎండకు సన్నని మెరుపుతో  అచ్చం నీళ్లు ఎత్తుపల్లాల రాళ్ళపై నుండి కిందకు పారుతున్నట్లుగానే అగుపిస్తూ.. నిజమైన జలపాతం అని భ్రమింప చేసింది.  చూడ్డానికి సరదాగానే ఉంది. అందంగానే ఉంది.

మీ నీటి దారుల్ని, సముద్రాల్ని, మీ పర్యావరణాన్ని నాశనం చేసి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే నేను అందంగా కనిపిస్తున్నానా ఓసి వెర్రిబాగుల్లారా.. ప్లాస్టిక్ ఫక్కున నవ్వుతున్నట్లనిపించింది

మనుషుల  నడకతో చితికిపోయిన గడ్డి  ఎండుటాకులు పక్కకు దొర్లిన గులకరాళ్ళతో  ఏర్పడ్డ సన్నని బాటలు అగుపిస్తున్నాయి. వీటివెనక ఏదో మర్మం ఉందనిపిస్తోంది. ఇంకా ఎన్ని వింతల్ని తన రెక్కల కింద దాచుకుందో ఈ అరణ్యం అనుకుంటూ సాగుతున్న సామ్రాట్ కి కాస్త దూరంగా పెద్ద గుడ్లగూబ కనిపించింది .

ఉత్సుకతతో  దగ్గరకు వెళ్ళాడు. కారు బంపర్ బార్లు, కారు పార్ట్శ్ విరిగినవి చితికినవి వాడి చేసిన గుడ్లగూబ అది.

నేనిక్కడే ఉన్నా.. నిన్ను గమనిస్తూనే ఉన్నా అన్నట్లుగా ఉంది దాని చూపు.  దాన్నట్లా చూస్తుంటే ఈ అడవిలో నా జాగా ఏది? అని ప్రశ్నిస్తున్నట్లుగా తోచి ఉలిక్కిపడ్డాడు సామ్రాట్.

దాన్ని చేయడానికి వాడిన ఆ పార్ట్స్  ఆధునిక జీవన వేగాన్ని గుర్తుచేస్తున్నాయి.  ఆ వేగమే వాటిని  లేకుండా చేసిందా.. ఆ వేగమే మనిషిని కూడా చిదిమేస్తుందా.. ఏవేవో ప్రశ్నలు అతని మదిలో చెలరేగుతున్నాయి.

ప్రకృతికి మనిషి దూరం అవడం వల్ల, ప్రకృతితో అనుబంధాన్ని కొనసాగించక పోవడం వల్ల, అడవితో సమన్వయం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుందా.. ఇంత వరకూ ఎప్పుడూ ఏ ట్రెక్ లోనూ కలగని వింతలు, ఎదురవుతున్న దృశ్యాలు అతన్ని ఆలోచింప చేస్తున్నాయి ..

ఒక పెద్ద బండరాయి  తర్వాత వచ్చిన చిన్న మలుపులో కొద్దిగా వాలుగా ఉన్న చోట రంగుల చెట్టు. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, పసుపు, నీలం, లేతాకుపచ్చ, ఆకాశం రంగుల్లో..  చెట్టు వేర్లు కాండం  కొమ్మలు ఆకులు  అంతా రంగురంగుల్లో.. ఆకర్షణీయంగా.

సహజత్వం కోల్పోయి కృత్రిమ అలంకారాలలోకి, ఆకర్షణల్లోకి వెళ్లిపోయామని చెప్తోందా.. మనిషికూడా అట్లా అసహజంగా తయారయ్యాడని హెచ్చరిస్తోందా.. దేనికి చిహ్నం ఈ ప్లాస్టిక్ క్యూబ్స్ తో చేసిన చెట్టు ఆలోచిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరిగాడు.

ఆ తర్వాత అలా ఆ చెట్టునే తదేకంగా చూస్తూ నుంచున్నాడు.

ప్రపంచమంతా టన్నులకొద్దీ వాడే ప్లాస్టిక్, ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసే ప్లాస్టిక్.. ప్రకృతికి మనిషి తయారుచేసి వాడి పడేస్తున్న ప్లాస్టిక్ కి మధ్య జరిగే ఘర్షణను తెలుపుతున్నట్లుగా తోచింది ఆ చెట్టు చూస్తుంటే ..భవిష్యత్ చిత్రం చూపుతున్నట్లుగా ఉంది. ఇది చాలా సీరియ్సగా ఆలోచించవలసిన సమస్య ..

మానవ మనుగడకు అన్నింటికంటే ముందు కావాల్సింది ఆక్సిజన్.  మొక్కలూ  చెట్లూ లేకపోతే..

జనావాసాలు, నాగరికత చిహ్నాల్లేని సహజ సిద్ధంగా జంతు వృక్ష వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతాలే లేకపోతే  ప్రపంచానికి ఆక్సిజన్  కరువై పోదూ.. ఆక్సిజన్ ప్రధాన వనరు అడవే కదా…

అడవికీ మానవుడికీ విడదీయరాని బంధం.  ఆదిమ నాగరికతలు, సామాజిక విస్తరణ ఈ అడవుల్లోనే కదా ఆరంభమైంది. అటవీ ఉత్పత్తులు మానవ జీవితంలో అంతర్భాగమయ్యాయి.  సామ్రాట్ మదిలోకి ఎడతెగని ఆలోచనలు వేగంగా దూసుకొస్తుస్తుండగా కాళ్ళు తన పని చేసుకుపోతున్నాయ్.  నాలుగడుగులేశాడో లేదో  వెండి ముద్దలు, రాగి ముద్దలు, బంగారపు ముద్దలు, వజ్రాలు పడి మెరుస్తున్నట్టుగా .. చిన్న పెద్ద సైజుల్లో..రకరకాల రంగుల్లో షేపుల్లో రాళ్లలాంటివి. అడ్డదిడ్డంగా పడిపోయి ..

ఖనిజ సంపదకు మూలం ఈ కొండలు  గుట్టలు అడవులు. గనుల తవ్వకాలతో చిక్కిపోతున్న కనుమలు .. ఖనిజాల తవ్వకం పేరుతో గుండెల్లో గునపాలు అంటూ విన్నవో చదివినవో గుర్తొచ్చాయి.   ప్రకృతి వనరుల్ని  సహజ సంపదని కొల్లగొట్టి  తనవి చేస్కోవడం కోసం ఆధునిక మనిషి మనిషితనాన్ని కోల్పోతున్నాడేమో..

ఈ మధ్య చూసిన నాసా వాళ్ళ షార్ట్ ఫిలిం గుర్తొచ్చింది సామ్రాట్ కి. భూమికి 640 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ లోంచి చూస్తే లెక్కలేనన్ని నక్షత్రాల మధ్య భూమి వెలిసిపోయిన బ్లూ డాట్ గా కనిపిస్తుంది. అక్కడి నుండి భూమిని చూస్తే అద్భుతంగా మిరకిల్గా అగుపిస్తూ..  అలాంటి భూమి మీద అటూ ఇటూ తిరుగుతుంటాం. నాదీ నీదంటూ కొట్లాడుకుంటాం. అన్నింటినీ సొంతం చేసేసుకుందామని ఆరాటపడుతుంటాం.  తనకే కాకుండా తరతరాలకు కరిగిపోని సంపద కొండల్ని ఇవ్వాలనుకునే స్వార్ధ జీవి మనిషొక్కడేనేమో ఈ సృష్టిలో.

మానవజాతి అభివృద్ధిలో ఇవన్నీ సహజమేనా.. అభివృద్ధికి కొలమానం ఏమిటి? డబ్బు, ఆర్ధిక వనరులేనా?

ప్రకృతి మనకున్న ఆస్తి. అది ఒక వ్యక్తి సొంతమా.. కాదు. ఉమ్మడి ఆస్తి కదా.. ఆలోచనలు తల చుట్టూ మూగిన దోమల్లాగా చెలరేగుతుంటే ఆ ఆలోచనల్లోంచి వస్తున్న చైతన్యంతో వడివడిగా అడుగులు పడుతున్నాయి.

అడుగడుగునా వింతలతో ఉద్వేగ భరితంగా సాగుతున్న అతనికి  మంట వెలుగు  అగుపించి అడవి అంటుకుందా.. అటుకేసి అడుగులేసాడు.

సింగరేణి బొగ్గు మండుతున్నట్టుగా.. భూమిలోంచి వచ్చిన బొగ్గు.. సూర్యుడు స్టోర్ చేసిన కోల్ ఎనర్జీ.. అది తయారవడానికి మిలియన్ల కొద్దీ సంవత్సరాలు పడుతుంది.  ఎన్ని చెట్లు అందులో కలిశాయో.. వనరుల కోసం ఆకలిగొన్న మనం తవ్వేస్తున్నాం.. నియంత్రణ లేకుండా తవ్వేసుకుంటున్నాం అనుకుంటూ దగ్గరగా వెళ్లి చూశాడు.  బొగ్గు కాదు  అవి చిమ్నిలు.

పారిశ్రామిక అవసరాలకోసం బొగ్గు తవ్వుతున్నాం. రకరకాల ఖనిజాలు తవ్వుతున్నాం.  అడవుల నరికివేత పారిశ్రామికీకరణ..అడవులు ఏది ఎక్కువ  అవసరం ప్రశ్న తలెత్తింది. రెండూ అవసరమే అనిపిస్తున్నదతనికి

తను వెళ్లాలనుకున్న చోటుకు వెళ్తున్నాడా దోవ తప్పాడా ఒక్క క్షణం మెదిలిన సందేహాన్ని నొక్కేశాయి ఈ వింతలూ విడ్డురాలు.  ఆవి ఏమిటో తెల్సుకోవాలనుకుంటూ నాలుగడుగులేశాడో లేదో .. మిలమిలా మెరుస్తూ మెలికలు తిరిగి లోయలోంచి పైకి వస్తన్న తెల్లత్రాచుపాములాగా.. ఒక్క క్షణం తాను చూస్టున్నదేమిటో అర్ధంకాక అట్లా చూస్తుండిపోయాడు . ఇంతటి ఉద్వేగం ఏ ట్రిప్ లోను కలుగలేదు . దగ్గరకెళ్ళి చూశాడు . అవన్నీ ప్లోరోసెంట్ బల్బులతో అట్లా పేర్చారు ..  ఆదివాసీల సంస్కృతి ఆహార విహారాల్లోకి , ఆచార వ్యవహారాల్లోకే కాకుండా వాళ్ళ కాళ్ల కిందకి కూడా అందంగా ముస్తాబై వస్తున్న కార్పొరేట్ సర్పంలా అగుపించింది సామ్రాట్ కి.  తన ఆలోచనలకు తానే చిన్నగా నవ్వుకున్నాడు.  మెడలో వేలాడుతున్న కెమెరాలో బంధించాడు.  కుడివైపు ఎవరో ఉన్నట్లనిపించి చూశాడు. నల్లటి ఆకారం వెనుకనుండి  కనిపించింది.

పలకరింపుగా నవ్వుతూ దగ్గరకు వెళ్లిన వాడల్లా రెండడుగులు వెనక్కి వేశాడు.  కొన్ని క్షణాలు అలా చూసి నెమ్మదిగా ముందు వైపుకు తిరిగాడు.

అవును మనిషి రూపమే .. చిల్లులు పడ్డ  ఎదలోంచి, కళ్ళలోంచి కారుతున్న రక్త కన్నీరు,  ఒళ్లంతా గాయాలతో ఛిద్రమైన  శిలాజంలా..

ముట్టుకు చూశాడు చల్లగా తగిలింది. ఇనుము బొగ్గుతో చేసిన ట్లున్నారు..

ఎంతో మేధావిననుకునే మనిషి తన చర్యలతో తన కంటిని తానే పొడుచు కుంటున్నాడని. ఎన్నో పక్షి జాతులు, జంతు జాతులు, చేపలు, సరీసృపాలు అంతరించిపోయినట్లే మనిషికూడా..  అని హెచ్చరిస్తున్నట్లుగా తోచిందతనికి.

అభివృద్ధి కావాలి కానీ సహజ ప్రకృతిని ఫణంగా పెట్టి కాదు.  ఆశతో పేరాశతో నాశనం చేసే హక్కు నీకెక్కడిది?

ఈ రోజు నీ ముందున్న ప్రకృతి సంపద అలాగే భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత నీది.  నీవు సాధించిన అభివృద్ధి భవిష్యత్ తరాలకు సోపానాలు వేయాలి కానీ వినాశనమ్ కాదు కదా.. మానవ ఆరోగ్యానికి, ప్రకృతికి సమతుల్యతల మధ్య అగాధం సృష్టించడం కాదు కదా.. అని బోధిస్తున్నట్టుగా ఫీలవుతూ ముందుకు కదిలాడు సామ్రాట్ .

కొద్ది క్షణాల్లోనే కొందరు యువకులు ఎదురు వస్తూ కనిపించారు.  వాళ్ళని చూడగానే ఈ దట్టమైన అడవిలో కనిపిస్తున్న వింత అనుభవాలకు దృశ్యాలకు వీరికి ఏదో సంబంధం ఉందనిపించింది. ఆ విషయమే వారినడిగాడు.

మీరు వాటిని చూసాక మీ ఫీలింగ్ ఏమిటి ఎదురు ప్రశ్న వేశాడు బక్కపలచని యువకుడు. క్లుప్తంగా చెప్పాడు సామ్రాట్.

ఫైన్ ఆర్ట్స్ & స్కల్ప్చర్ విద్యార్థులమని కష్టమైనా విన్నూత్నమైన ప్రయోగం తలపెట్టామని సామ్రాట్ మోహంలో కన్పిస్తున్న ఉత్సుకత , విషయం తెలుసుకోవాలన్న ఆతురత గమనించిన మరో యువకుడు చెప్పాడు.

“ఈ అడవుల్లో ఎవరు తిరుగుతారు. ఎవరో నాలాంటి వాళ్ళు తప్ప. మీరిచ్చే మెస్సేజ్ చేరాల్సిన వాళ్లకు చేరదుగా..  “నవ్వుతూ సామ్రాట్ ..

“మీరన్నది నిజమే కానీ త్వరలో అరకులో నాలుగు రోజుల గిరిజన సదస్సు జరగబోతున్నది. దేశ విదేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మేము ఈ ప్రయోగం తలపెట్టాం.  మొత్తం 30 ఆర్ట్ వర్క్ ని పెడుతున్నాం.  ఇండిపెండెంట్ పానెల్ వీటిని ఫైనల్ చేస్తుంది. దేశ విదేశాల ఆర్టిస్టులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. వాళ్ళే న్యాయ నిర్ణేతలు” చెప్పాడు మరో యువకుడు.

వాళ్లనే ఆసక్తిగా గమనిస్తూ  మాటల్ని శ్రద్దగా వింటున్న సామ్రాట్ కేసి తిరిగి పలకరింపుగా చూస్తూ “వి ఇన్వైటింగ్ వ్యూయర్స్ టు ఎక్స్పీరియన్స్ నేచర్ త్రు ఏ డిఫరెంట్ లెన్స్”  అన్నాడో విదేశీ.

పర్యావరణ ప్రేమికులైన  స్పాన్సర్స్ తోడ్పాటుతో జరిగే పక్షం రోజుల అవుట్ డోర్ ఎక్సిబిషన్ గురించి  వివిధ ప్రాంతాల్లో పోస్టర్స్, వివిధ మాధ్యమాల్లో ప్రచారం ద్వారా విషయం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, ఒకటి రెండు రోజులకోసం అరకు వచ్చే యాత్రికులు ఈ సీజన్లో ఎక్కువనీ, వారిని ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారని,  ఈ ప్రయత్నంలో వచ్చిన స్పందనని బట్టి భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు .

గుక్కపట్టి ఏడుస్తున్న ప్రకృతిని ఓదారుస్తూ, బోర్లాపడి మట్టికొట్టుకుపోతున్న మనిషిని లేపి నిలబెట్టే ప్రయత్నం చేసే వీరి కృషిలో తెలుగువారే కాకుండా దేశ విదేశీ స్కల్ప్చర్ & ఆర్ట్ విద్యార్థులు తోడవడం విశేషంగా తోచింది సామ్రాట్ కి.

అడవి ఆకులురాల్చినంత సహజంగా ఒకరు విధ్వంస రచన చేస్తుంటే మరొకరు మోడువారే చెట్లకు చిగురులు అద్ది కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనిషి వింత ప్రకృతికి లోలోన నవ్వుకున్నాడు.  అడవి చల్లగ పదికాలాల పాటుండాలి. తనలాంటి ప్రకృతి ప్రేమికుల్ని అలరించాలి…

అది సరే… కానీ అందుకోసం నువ్వేం చేస్తున్నావ్? లోపలినుండి తోసుకొచ్చిన  ప్రశ్నతో ఉలిక్కి పడ్డాడు సామ్రాట్

నిజమే .. కూర్చున్న చెట్టుని నరుక్కుంటున్న మనిషి కళ్లుతెరవడం కోసం, జీవవైవిధ్యాన్ని కాపాడ్డం కోసం తనేం చేస్తున్నాడు.

“మా ఆర్ట్ వర్క్ చూసిన వ్యక్తి మీరే.. మీ ఫీడ్ బాక్ ప్లీజ్.. ” సూదంటు చూపులతో అడిగాడు ఓ యువకుడు.

ఒక్క క్షణం అందరికేసి కలియచూశాడు సామ్రాట్. ఏమి చెబుతాడా అని అందరి కళ్ళు అతని వైపే చూస్తూ చెవులొగ్గి ఆత్రంగా..

“నేను చూసిన ప్రతిదీ అద్భుత్జమైనదే.. నాతో ఏదో చెప్తున్నట్లుగానే తోచింది. పొరలు పొరలుగా ఎన్నో అర్ధాలు..  ప్రకృతి అందాలను ఆస్వాదించే నాలో కొత్త ఆలోచనల ద్వారాలు తెరుచుకున్నాయి.  కళ్ళు కొత్త లెన్స్ అమర్చుకున్నాయి. జరగబోయే వినాశనం ఆపాలంటే మానవుడు- ప్రకృతి మధ్య అనుబంధాన్ని చిక్కబరుచుకుంటూ  అడవి- మనిషి సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరాన్ని చెప్తున్నాయి మీ అద్భుత కళా ఖండాలు.  మీ కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ఆల్ ది బెస్ట్” కరచాలనం చేసి ముందుకు కదిలాడు సామ్రాట్

*

శాంతిప్రబోధ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది. విషయం పాతదే. అందరం అనుకుంటున్నదే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న
    ప్రకృతి విధ్వంసం ఎక్కడికి దారితీస్తుందోనని భయపడుతూనే ఉన్నాము. న్యూలెన్స్ పేరుతో
    మీ లెన్స్ తో కథను చక్కగా నడిపించారు. అభినందనలు.

    • అవును సర్ విషయం పాతదే. నిత్యకుంపటిలా మండుతున్నదే.
      కథ చదివి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు