విషాదం, సాంత్వనాల మేలు కలయిక

ఇంతకు ముందు పరిచయం చేసిన బహుమతి పొందిన కథ నైట్ సర్ఫ్ మాజిక్ రియలిజంని ఆధారం చేసుకున్న ఒక అస్తిత్వ కథ. ఇంకా లోతుగా వెడితే అది ఒక మనిషి జీవితంలో ఒక సంఘటనతో ముడిపడిన అంశం గూర్చి మాత్రమే తప్ప సమాజం గూర్చి, సమాజంతో ముడిపడివున్న కొన్ని జీవితాలలో ఉన్న ఘర్షణ గూర్చి మాత్రం కాదు. ఈనెల పరిచయం చేస్తున్న డామికో అందుకు భిన్నంగా ఒక చిన్న సమాజంతో ముడిపడివున్న బహుమతి పొందిన కథ. దీనిలో పెద్ద సమాజానికి కూడా తావున్నది. పదహారేళ్ల కుర్రాడి పేరే కథదీని. అతను తనలాంటి పన్నెండుమంది బాలనేరస్థుల మధ్య పన్నెండు నెలలకి పైగా గడిపిన కాలంలోని కొన్ని సంఘటనలు, అతను అక్కడికి రావడానికి కారణమూ ఈ కథలో అంశాలు.

మామూలుగా నేరస్థు లనగానే ‘ఖూనీలు చేసినవాళ్లు, కరడుగట్టిన హృదయం ఉన్నవాళ్లు’ అన్న స్టీరియోటైపులు మెదడులో దర్శన మిస్తాయి. బాలనేరస్థులకి కూడా ఆ వర్ణన వర్తిస్తుం దనుకోవడం సాధారణమే అయినా, వాళ్లల్లో అక్కడక్కడా ఖూనీలు చేసినవాళ్లు కూడా ఉన్నా, అధికశాతం ఆ కోవకి చెందరు. ఇక్కడి “బాయ్స్ హోమ్” చిన్న సమాజం. దానికి బయటవుండే పెద్ద సమాజం వాళ్లని అక్కడికి పంపింది. ఈ “బాయ్స్ హోమ్”లో కొంతమంది పిన్నవయసులో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డవాళ్లు. చిన్నచిన్న కేండీలంటే పడిచచ్చే చిన్నతనం పోనివాళ్లు. వీళ్లు తప్పొప్పులు స్పష్టంగా తెలిసినవాళ్లు అని చెప్పగలగడానికి నిదర్శనం, ఫ్రెకిల్స్ అన్న కుర్రాడు చేసిన నేరం తనకన్నా చిన్నవయసున్న కుర్రాళ్లని కారు వెనకసీట్లోకి పట్టుకెళ్లి వాళ్లమీద అత్యాచారం చెయ్యడం అని తెలియగానే అతణ్ణి కిందపడేసి, కొట్టి దాదాపు చంపబోవడం.

ఈ బాలనేరస్థుల గృహంలో కొత్తగా అక్కడికి తీసుకురాబడ్డవాళ్లకి అక్కడ అప్పటికే వున్నవాళ్ల చేత రాగింగ్ తప్పనిసరి. ఇండియాలోని కొన్ని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో జరిగే తీవ్రతరమయిన రాగింగులలో కొత్త కుర్రాణ్ణి “బ్రేక్” చెయ్యడం అప్పటికే అక్కడ ఉన్నకొంతమందికి ఆశయం. ఈ గ్రూప్ హోమ్ లో కూడా అదే పరిస్థితి. అందరూ కలిసి ఒకేసారి ఆ పనికి పూనుకోకుండా ఒక వ్యక్తికి మాత్రం ఆ కొత్తవాణ్ణి అప్పజెబుతారు. వంతులవారీగా నిర్వహించే ఆ బాధ్యత ఫ్రెకిల్స్ విషయంలో డామికోకి వస్తుంది. అయితే, అప్పటికే సాత్త్వికుడని ముద్రపడిన డామికో ఆ మెత్తనిదనం వల్లనే ఫ్రెకిల్స్ ని మిగిలినవాళ్ళకి నచ్చేటంతగా బ్రేక్ చెయ్యలేకపోతాడు. పైగా ఈ పదహారేళ్ల కుర్రాడూ తన పిల్లాడంటూ ఒక ఫోటోని ఫ్రెకిల్స్ కి చూపిస్తాడు కూడా. డామికో ఆ కారాగారవాసానికి చేరడం ఒక విధంగా ఫోటోలో చూపిన ఆ పిల్లాడనే చెప్పవచ్చు – ఆ పిల్లాడి తల్లి బేబీ షవర్ కోసం గిఫ్ట్ నిద్దామని అతడు షాపింగ్ మాల్ లో బేబీ డ్రస్సులని జేబులో కుక్కుకుని పరిగెడుతూ పట్టుబడ్డాడు మరి! కథ చదువుతూ ఇది చెప్పే పేరా దాటగానే, ఫ్రాన్స్ దేశపు విక్టర్ హ్యూగో రాసిన Les Miserables నవలలో దాదాపు అదే వయసున్న కథానాయకుడు ఆకలితో మాడుతున్న చెల్లెళ్ల, తమ్ముళ్లకోసం బ్రెడ్డుని దొంగతనం చేస్తూ పట్టుబడి తరువాత జీవితాంతం దాని ఫలితాలని అనుభవించడం గుర్తుకు రాక మానదు. పుట్టబోయే బిడ్డనీ, ఆ బిడ్డ తల్లినీ పోషించాలని డామికో తపన. ఆ దొంగతనం చేసే ముందరే ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లి దాన్ని ఘనంగా చేశాననీ, ఆ ఉద్యోగం తనకి వస్తుందనీ విశ్వాసంతో ఉన్నాడు కూడా. ఇక్కడ విషాదకర మయిన అంశం ఏమిటంటే, ఆ సమయంలోనే అతడు పట్టుబడ్డది.

అతని కారాగారవాస సమయం అంతా ఆ పిల్లాడిని చూడాలన్న తపనతో గడుస్తూంటుంది. ఆ తపనని అతను తన సహవాసులతో పంచుకోక ఉండలేడు కూడా. అందరికీ సంయమనం పాటించే ఓపిక ఉండదు కదా! నిర్లక్ష్యంతోనో లేదా మరో కారణంతోనో ఒక కుర్రాడు ఏదో అనరాని మాట అన్నాడని అతని మీద చెలరేగినందుకు డామికో శిక్షాకాలాన్ని పొడిగిస్తారు. పుట్టిన బిడ్డని ఏడాది తరువాత అయినా గానీ చూస్తాడన్న ఆశతో బతుకుతున్న అతనికి ఇది నిరాశని మిగిలిస్తుంది, అతనిచేత పారిపోయే ప్రయత్నం చేయిస్తుంది. పట్టుబడతాడు. శిక్షాకాలం మళ్లీ పెరిగుతుంది. దానితోబాటే పిల్లాణ్ణి చూడడానికి వేచివుండవలసిన సమయం కూడా.

ఈ పరిస్థితిలో అంతకు ముందు పారిపోయిన పదమూడేళ్ల వయసున్న ఫ్రెకిల్స్ పట్టుబడి మళ్లీ వెనక్కొస్తాడు. వీళ్లచేత మొదటిసారి తిన్న దెబ్బలు గుర్తుండడం చేత భయంతో వణికిపోతున్నాడు. క్రిస్మస్ రోజు రాత్రి గడ్డకట్టించే చలిలో కాలికి ఉత్త సాక్సుతో పారిపోదా మనుకుని కప్పుమీదకి ఎక్కివుండవచ్చు గానీ అక్కడ చిక్కుపడిపోయి ఆ కారాగారవాసంకన్నా చావడమే మేలు అన్న నిర్ణయానికి వస్తాడు. ఇక్కడ డామికోకి ఒక పాత్ర ఉండాలి అని ఈపాటికి పాఠకులు ఊహించే వుండాలి. అది ఎలాంటిది అనేది చదివి తెలుసుకోవడమే బాగుంటుంది.

అమెరికాలో కథల పోటీలో బహుమతి పొందిన కథ అంటే ఎలాంటి అంశం గూర్చి, ఎలాంటి జీవితాల గూర్చి రాసిన కథ అయివుంటుంది అన్న ప్రశ్నలు కలగడం సహజమే. దానితోబాటే, గ్లోబలైజషన్ ప్రభంజనానికి మూలమనీ, శ్వేతజాత్యహంకారానికి అధికార ప్రతినిధి అనీ, డాలర్లని కళ్లముందు ఆడించి కొంతమందిని మంత్రించినట్లుగా తన వెంట తిప్పుకుంటూన్నదనీ అమెరికా గూర్చి కొంతమంది అనుకునే సమయంలో ఈ కథ ఆశ్చర్యం కలిగించక మానదు.

ఇది అస్తిత్వపు కథ. రచయిత జో బాండ్ తండ్రితో కలిసి గ్రూప్ హోమ్ నడిపేవాడు. అక్కడి అతని అనుభవాలు ఈ కథకి ఎలా తోడ్పడ్డాయో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

*

 

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు