నౌకారంగ ప్రవేశం

ఉప్పుగాలి కబుర్లు-2

ప్రధాని ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ విధించిన చీకటి రోజులు (1975-1976). అప్పటికే  రాష్ట్రమంతటా విరసం ప్రభావం ఉధృతంగా ఉంది. నా వయసు 21. అంచేత సహజంగానే కొన్ని సాహసాలు చేశాను; ఉదాహరణకి – ప్రేమలో పడడం. కొన్ని దుస్సాహసాలు కూడా చేబట్టాను. ఆర్.ఎస్.యూ. తొలి ఉపాధ్యక్షుడూ, అలనాటి ఆప్తమిత్రుడూ అయిన సి.వి. సుబ్బారావు (సురా)ని తప్పించి అఙ్ఞాతంలోకి పంపించడం, ఏవో కారణాలచేత అతడు తిరిగి బయటకి రావాలని కోరుకున్నప్పుడు ఎన్‌కౌంటర్ కాకుండా బాహాటంగా పోలీసులకు చిక్కే ఏర్పాట్లు చెయ్యడం – వీటిల్లో నా పాత్రను పోషించాను.  సురా అరెస్టయి, రావిశాస్త్రి, భూషణం, తుమ్మల వేణుగోపాలరావు, చలసాని ప్రసాద్,  అత్తలూరి నరసింహారావు,  తదితరుల సావాసంలో విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

1975 చలికాలపు ఉదయాన వాల్టేరు స్టేషన్‌లో రైలెక్కి బొంబాయి ప్రయాణం కట్టాను. ఉద్యోగంకోసం వెతుకుతూ, షిప్పింగ్ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, బొంబాయి బాలార్డ్ ఎస్టేటులోని మెరైన్ క్లబ్బులో, అతి తక్కువ అద్దెకు డార్మిటరీ లాంటి రూంలో నెల్లాళ్లు ఉన్నాను. రోజూ సాయంత్రం పూట చర్చిగేట్ వరకూ నడుచుకుంటూ వెళ్లి, ఫ్లోరా ఫౌంటెన్‌ని ఆనుకొని ఉండే దారుల్లో సెకండ్-హేండ్ పుస్తకాల దుకాణాల్లో గడపడం ఆనవాయితీగా మారింది. ఏ బాదరబందీ లేకుండా గడిచిపోయిన ఆ బొంబాయి చిరు చలికాలంలో నేను చేజిక్కుంచుకున్న పుస్తకాలలో – వాల్ట్ విట్‌మన్ కవితల సంపుటి ‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’, చాలా కాలం నా వెంట ఉంది.

రెండవ వారంలోనే ఉద్యోగం ఖాయమైందిగానీ షిప్పు ఇరాన్ రాబోతున్నదనీ, జాయిన్ కావడానికి సమయం పడుతుందని కంపెనీవాళ్లు తెలియజేశారు.  ఉద్యోగం చేతిలో ఉంది కాబట్టీ కంపెనీ వారిచ్చిన అడ్వాన్సు, భత్యాలు పుస్తకాలు కొనుక్కోవడానికి ఉపయోగపడ్డాయి. చీకూ చింతా లేకుండా పుస్తకాలు చదువుకుంటూ గడపడం మహదానందాన్ని కలిగించింది.

ఆనాటితో మొదలుపెట్టి, ఎన్నో అవకాశాలను కల్పించిన బొంబాయి మహానగరం పట్ల ఏర్పడ్డ ప్రేమ నేటికీ తరగలేదు.

అయితే మెరైన్ క్లబ్బులో ఒకనాటి రాత్రి జరిగిన సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆనాటి రాత్రి నా ప్రక్క రూములో ఏదో గలాభా మొదలై నాకు తెలివొచ్చింది. నేనున్నది అత్యంత చౌక గది గనుక పక్క గదుల్లో జరిగేవన్నీ వినబడుతూనే ఉంటాయి. ఆ గదిలో ఉన్న జూనియర్ డెక్ ఆఫీసరు ఎవర్నో గద్దిస్తున్నాడు.

“అప్పుడు నువ్వేం అన్నావు?”

జవాబు స్పష్టంగా వినబడలేదు.

“చెప్పరా, గట్టిగా చెప్పు!”

“నువ్వు ఎక్కడుంటున్నావు, అన్నాను”

“నేనేం అన్నాను?”

“మెరైన్ క్లబ్బులో అన్నావు”

“మరప్పుడు నువ్వేం అన్నావు?”

జవాబులేదు.

బలంగా కొట్టిన శబ్దం.

“కొట్టొద్దు, కొట్టొద్దు! నన్ను వదిలేయ్! ఇంటికి వెళ్లిపోతాను”

“అప్పుడు నువ్వేమన్నావురా, చెప్పు, వీళ్లు వింటారు”

రూములో మరికొంతమంది ఉన్నారని అర్థం అయింది.

“నీ రూముకి వెళ్దాం, పద అన్నాను”

“ఇంకా ఏమన్నావు?”

“….”

మరో పిడిగుద్దు. చిన్నగా ఏడుపు.

“మనకివాళ రాత్రంతా మజాయే అన్నావా, లేదా?”

“అన్నాను, తప్పయిపోయింది. వదిలేయ్, ప్లీజ్”

“నీకు రాత్రంతా మజా చేసి అప్పుడు పంపిస్తాను, కొజ్జా నా కొడకా! చూస్తరేంట్రా, తగల్నీయండి!”

దభీ దభీమంటూ ముగ్గురు నలుగురు కొడుతూన్న శబ్దాలు.

“మీ కాళ్లు పట్టుకుంటాను, నన్ను వదిలేయ్యండి, ప్లీజ్!”

అలా చాలా సేపు కొట్టారు.

అర్థరాత్రి దాటాక వాళ్ల గది తలుపు తీసిన చప్పుడైంది. నేను నా రూములోంచి తొంగి చూశాను. ఒక నడి వయస్కుడిని లాక్కుంటూ వెళ్లి, బయట రోడ్డుమీద పడేసి వచ్చారు. అతడి మొహం రక్తమోడుతున్నది. ఏదో ఘనకార్యం చేసినట్టు నవ్వులు. అది వాళ్ల మగతనాన్ని నిరూపించుకున్న సందర్భంగా కలిగిన సమిష్టి ఆనందం అని తరువాతెప్పుడో అర్థమయింది.

రాత్రి సరిగ్గా నిద్ర పోలేదు. మర్నాడు తెల్లవారుతూనే టీ తాగేందుకు బయటకు వెళ్తూంటే అతడు అక్కడే, పేవ్‌మెంటు మీద కనిపించాడు. చలికి ముడుచుకుపోయి ఒక వారగా కూర్చొని ఉన్నాడు. బాగా నలిగిపోయాయిగానీ, మంచి బట్టలే వేసుకున్నాడు.

“టీ తాగుతావా?” అని అడిగేను. కావాలన్నట్టు తల ఊపాడు. రోడ్డు ప్రక్కన ఉన్న కొట్లో టీ తాగుతూ,

“నా పర్సు ఎక్కడో పడిపోయింది,” అన్నాడు.

టీ తాగాక, “సిగరెట్టుందా?” అని అడిగాడు.

అప్పటికింకా అలవాటు కాలేదు గనక లేదన్నాను.

“రెండు రూపాయిలుంటే ఇవ్వు, బస్సుకి,” ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నాడు.

ఐదు రూపాయిలు ఇవ్వబోతే తీసుకోలేదు. రెండు రూపాయి బిళ్లలు మాతం తీసుకొని,

“థాంక్స్,” అని, కొంచెం కుంటుతూ వెళ్లిపోయాడు.

అతడిని అంతసేపు, అలా కొడుతూ ఉంటే నేనెందుకు అడ్డుకోలేదు? పోనీ ఇంకెవరినయినా ఎందుకు పిల్చుకురాలేదు? సెక్యూరిటీ గార్డుకైనా ఎందుకు చెప్పలేదు? ఏదో ఒకటి చెయ్యాలని ఎందుకు తట్టలేదు? ధైర్యం చాలలేదా? ప్రక్కన సురా లాంటివాడు ఉండి ఉంటే ఏదోలా అడ్డుకొనే వాళ్లమా? ఈ ప్రశ్నలు నన్ను చాలాకాలం వెంటాడాయి. టెక్కలిలో ఉండగా – ముఖ్యంగా నాన్నగారి నోట వెంట విన్న – శ్రీకాకుళ ఉద్యమకాలంనాటి చిత్రహింసలూ, ఎన్‌కౌంటర్ హత్యల వివరాలూ గుర్తుకొచ్చాయి. ఇది వాటికి సంబంధంలేని సంఘటన అయినప్పటికీ, అసహాయులను బందీచేసి, తీవ్రంగా కొట్టడం వరకూ సారూప్యం ఉందనిపించింది. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా, ‘నేను ఎన్నటికీ విప్లవకారుడిని కాలేను’ అనే అశక్తత ఆవహించేది.

***

మరి కొద్ది రోజుల్లోనే కంపెనీ నన్ను బాలార్డ్ ఎస్టేటులోనే ఉన్న మూడు చుక్కల గ్రాండ్ హొటేల్‌కి మార్చింది. మొత్తం సిబ్బందిని ఒకేసారి మారుస్తున్నారనీ, అంతా కలసికట్టుగా ఇరాన్ రేవు పట్టణమైన అబాదాన్ వెళ్తామనీ తెలిసింది. మిగతా ఆఫీసర్లు ఒక్కరొక్కరే ఆ హొటేల్‌కి రావడం మొదలైంది. బెంగాలీలు, పంజాబీలు, మరాఠీలు, మళయాళీలు, తమిళులు. క్రూ గుజరాతీలు. వంటవాళ్లు, స్టూవర్డ్‌లు గోవన్‌లు. యావత్ భారతదేశం అక్కడే ఉందనిపించింది. తెలుగువాడిని నేనొక్కడినే కావడం కొంచెం నిరాశ కలిగించింది.  నా ఇంగ్లీషు ఫరవాలేదుగానీ, హిందీ అప్పటికి అంతంత మాత్రమే. రేడియోలో వింటూ వచ్చిన పాటలూ, మనోరమ థియేటర్లో చూసిన సినీమాలూ – వీటి ద్వారా పట్టుబడ్డ హిందీ అన్నమాట. మేమంతా బాగా ఇష్టపడ్డ 1950-60ల నాటి పాటల్లో హిందీ కన్నా ఉర్దూ పాలు ఎక్కువ అని మాకప్పుడు తెలియదు.

కొత్త పరిచయాలు. సందడి, ఉత్సాహం, ప్రయాణ సన్నాహాలు. సీనియర్ల సహకారంతో చలికోట్లూ, ఉన్ని దుస్తులూ, బాయిలర్ సూట్లూ, యూనిఫాంలూ కొనుక్కున్నాను. పేద్ద సూట్‌కేసులో కొన్నవన్నీ కుక్కుతున్నప్పుడు ఫోర్త్ ఇంజినీరు చూశాడు. నేను ప్లాస్టిక్ మగ్గు సూట్‌కేసులో పెట్టడం గమనించి, దాన్ని ఎడమ చేత్తో తీసి అవతల పారేశాడు. “ఛీ!ఛీ!” అంటూ. ముందురోజే కొన్న కొత్త మగ్గు చెత్తబుట్టలో పడింది.

“బకెట్‌గానీ తెస్తున్నావా, కొంపదీసి?” అని అడిగాడు. లేదన్నాక శాంతించి, “మనం వెళ్తున్నది షిప్‌లోకి, హాస్టల్‌కి కాదు! అర్థం అయిందా?” అని గర్జించాడు.

“యెస్, సర్!” అన్నాను.

నేను జూనియర్ ఇంజినీర్‌ని గనక, మిగతా వాళ్లంతా నా పై ఆఫీసర్లే గనక, ప్రతి ఒక్కర్నీ ‘సర్’ అని తీరాలి. వాళ్ల ముందు నిలబడాలి. కూర్చోమంటేనే కూర్చోవాలి. జేబుల్లో చేతులు పెట్టుకోకూడదు. చెప్పింది ముందు చేసి, ఆ తరవాతే సందేహ నివృత్తి చేసుకోవాలి, పెద్దల సంభాషణల్లో కల్పించుకొని మాట్లాడరాదు. అభిప్రాయం చెప్పాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలి, ఆఫీసర్ల భార్యలు, నిజానికి స్త్రీలు ఎవరైనా కేబిన్‌లోకి వస్తే లేచి నిలబడాలి; వాళ్లు సుఖాసీనులైన తరవాతే కూర్చోవాలి. వాళ్లు వెళ్లిపోయేటప్పుడు గది తలుపు తీసి పట్టుకోవాలి, ఫోర్కు, చాకు, స్పూను ఉపయోగించే విధి విధానాలు తెలిసి ఉండాలి ఇవన్నీకాక, టేబిల్ మేనర్స్ సరేసరి. ఇంకా చాలా నియమాలున్నాయి. ఫోర్త్ ఇంజినీరు నాకు ఒకటీ, ఒకటీ నేర్పించాడు – మధ్యమధ్యలో తలవాచేలా చీవాట్లు పెడుతూ.  పర్యవేక్షకుడి ప్రవర్తన నాకు అప్పుడు చిరాకనిపించినా అతనిలోని మంచితనం షిప్పులోకి వెళ్లాకే తెలిసింది.

ఫోర్త్ ఇంజినీరు టిప్‌టాప్‌గా ఉంటాడు; బ్రిటిష్ ఏక్సెంట్. ‘స్టైలిష్ లెఫ్ట్ హేండర్’ అంటారే, ఆ టైపు. కాకపోతే కాఠిన్యం ఒక పాలు ఎక్కువ. నన్ను పర్యవేక్షించేందుకు ఇంజినీర్లకు బిగ్ బాస్ అయిన సెకండ్ ఇంజినీర్, అతగాడిని నియమించాడని తరువాత తెలిసింది. ఇక ఛీఫ్ ఇంజినీర్ అంటే – ఆయన దర్శన భాగ్యమే అపురూపం.

ఎక్కడో టెక్కలి స్కూల్లో మొదలు పెట్టి, విశాఖపట్నం పోర్టులో అప్రెంటిస్‌షిప్, ఇప్పుడు బోంబే, మొదటిసారి విమానం ఎక్కి అబాదాన్! ఆ తరువాత?!… ఈ నౌకా జగత్తు, ఈ సముద్రయానం నాకే వింతలూ, విశేషాలూ చూపిస్తుందో? అప్రెంటిస్‌గా ఉన్న ఐదేళ్లూ ఎప్పుడు షిప్ ఎక్కి సముద్రం మీదకి వెళ్లిపోతామా అని ఉగ్గబట్టుకొని ఎదురు చూసిన రోజు రానే వచ్చిందనే ఉత్సాహం ఒకవైపు; మరోవైపున స్వస్థలానికి, స్వదేశానికి, స్వంత మనుషులకూ అకస్మాత్తుగా దూరం కావడం కలిగించిన క్షోభ. చెరువు చేపపిల్ల ఒక్కసారిగా నడి సముద్రంలో దుమికినట్టుగా అయింది నా పని. కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాననే ఉత్సాహం, అన్నింటినీ అధిగమించింది. సన్నాహాలు, చిన్నాచితకా పనులు మీద పడి, మనసుని మళ్లించాయి.

కాస్త తీరుబడి దొరికగానే కుటుంబీకులకూ, ఆత్మీయులకూ, సన్నిహితులకూ ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. ఏకైక బ్లాక్-అండ్-వైట్ టీవీ ఛానెల్ అయిన బొంబాయి దూర్‌దర్శన్‌లో వచ్చిన పాట నన్ను తాకి, లోలోపల సుడులు తిరిగింది. అది ఉమాదేవి సుప్రసిద్ధ గానం,

‘అఫ్సానా లిఖ్ రహీ హూ, దిల్-ఎ-బేకరార్ కా,

ఆంఖోన్ మే రంగ్ భర్‌కే, తెరా ఇంతజార్‌కా….

ఆత్మీయుల సమాచారానికి ఆనాటి నావికులకు ఉత్తరాలే శరణ్యం. పోర్టుకి వచ్చినప్పుడల్లా, ఒకటి రెండు నెలలు ఆలస్యంగా చేరే ఉత్తరాల కట్టలను అందుకోవడం, వారి జీవనంలో ఆనందాన్ని కలిగిస్తుంది. తరువాతి పోర్టు వచ్చేవరకూ  చదువుకోవడం, ఒక్కోసారి ఎంతగానో ఎదురుచూసిన ఉత్తరాలు రాకపోవడం, ఇక అన్నిటికన్నా ఘోరం – ఏజెంటు తెచ్చిన కట్టల్లో మనకి ఒక్క ఉత్తరం కూడా లేకపోవడం – ఇవన్నీ నావికుల జీవితాల్లో సర్వసాధారణాలని అప్పటికి నాకింకా తెలియదు. షిప్పులలో నేడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌కీ, వాట్సప్ కాల్స్‌కీ అలవాటుపడ్డ ఆధునిక నావికులకు, ఆనాటి సాధకబాధకాలు, భావోద్వేగాలు తెలిసే అవకాశమే లేదు.

1975 డిసెంబరులో నా మొదటి ఓడలో, జూనియర్ ఇంజినీరుగా, అనగా ఫిఫ్త్ ఇంజినీరుగా, ఉద్యోగ బాధ్యతలు చేబట్టాను. అప్పటికింకా దేశంలో ఎమర్జెన్సీ అమలులోనే ఉంది; ఇందిరా గాంధీ ఉన్నంతకాలం కొనసాగుతుందనే అంతా అనుకున్నారు. జైలునుంచి సురా రాసిన ఉత్తరం, అంచెలంచెలుగా నన్ను చేరుకుంది.

అందులోని ఒక వాక్యం, నేటికీ వెంటాడుతుంది: ‘స్నేహితులు మన హృదయాల లోతుల్లో మిగిలిపోయే తీరని కోరికల ప్రతిరూపాలు.’

*

ఉణుదుర్తి సుధాకర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతం. నాలాంటి వాళ్లకి విందు భోజనం

  • గత జ్ఞాపకాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

  • మన నిజ జీవితంలో జరిగే అనేక అనుభవాలు, అంశాలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక రకమైన ఆనందం, అనుభూతి పొందుతాం. నీ ఈ కథలో అది స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చాలా బాగుంది. నాకు

  • … అది కాదు కాని ఆ వయసులో కొత్త ప్రదేశాలలో, కొత్త వాళ్ళతో అదీ ఉద్యోగార్ధం వెళ్లినప్పుడు గొడవల్లో తల దూర్చడం బహుశ మధ్య తరగతి కుటుంబాలలోనుంవి వచ్చిన వారికి కుదరదు! కానీ ఆ ఉదయం అతనికి టీ ఇప్పించాలి అన్న తెలివిడి కూడా ఆ మధ్యతరగతి మనస్తతత్వం అనుకుంటా! అలాగే అవసరం రెండు రూపాయలే …ఐదు కాడు…రెండు చాలు అనే మనస్తత్వం కూడా!

    నేనప్పుడు ఎక్కడున్నాను అని జ్ఝాపకం చేసుకున్నా! మద్రాసులో మెరినాలో వున్నా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు