“గీతాంజలి నాకో కొత్త దృక్పథాన్ని, జీవితపు తాత్వికతను,నేను అనుభవించే అందాల వెలుగును,నా ఆశలకో అర్థాన్నీ ఇచ్చింది.ఎక్కడో అందరాని ఈశ్వరుడిని నా సుఖ,దుఃఖ నిత్యసహచారి, నా అనంత జీవిత పథచారినిగా చేసి నా పక్కన నిలబెట్టింది”..అన్నాడు చలం..”గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వ రసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం ఉండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి.”అన్న చలం గీతాంజలిని యోగి సాధనా మార్గ మాధుర్యంగా భావించారు.
టాగోర్ గీతాంజలిని ఎందరో ఎన్ని విధాలుగానో అనువదించారు. ఒక్కొక్కరి అనుభూతి వేరు. కొద్ది రోజుల క్రితం దేశ రాజధానిలో నివసిస్తున్న పప్పు శాంతాదేవి గీతాంజలి లోని ఒక్కో కవితకు తన వ్యాఖ్యానాన్ని అందించారు. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయినా, శాంతాదేవి సాహితీ ప్రియురాలు. కథలు,అనువాదాలు కూడా చేస్తుంటారు. రవీంద్రుడి గీతాలు కొందరి ప్రణయగీతాలుగా,మరికొందరికి ప్రకృతీ పురుషుల ప్రేమగీతాలుగా, కొందరికి కేవలం ప్రకృతి వర్ణనగా కనిపిస్తాయని,తనకు మాత్రం అవి భక్తి గీతాలుగానే కనిపించాయని పప్పు శాంతాదేవి చెప్పుకున్నారు. భగవంతుడిని చేరుకోవడానికి సాధకుడి అన్వేషణలో భాగంగా ఆమె గీతాంజలిని అర్థం చేసుకున్నారు.
ఒక ఆధ్యాత్మిక చింతనలో పడ్డ తర్వాత చలానికైనా, పప్పు శాంతాదేవికైనా ఆకాశంలో,మేఘాల్లో, సముద్రంలో,నేలలో, ప్రకృతిలో మాత్రమేకాదు, చివరకు అక్షరంలో కూడా అనంతమైన ఈశ్వరత్వం కనిపిస్తుంది. ఆమె ఒక్కొక్కవ్యాఖ్యానం చదువుతుంటే మనను ఒక అతీతమైన,ఆధ్యాత్మిక లోకాల్లోకి తీసుకువెళుతున్నట్లనిపిస్తుంది. ఆమె ఒక్కో వ్యాఖ్యానం ఒక్కో కవితలా కనిపిస్తుంది. గీతాంజలిని ఆమె అనువదించలేదని,వ్యాఖ్యానించానని మాత్రమే చెప్పారు కాని నిజానికి ఆమె వ్యాఖ్యానం గీతాంజలి కి ఒక ప్రగాఢమైన అనువాద వ్యాఖ్యానంగా అభివర్ణించచ్చు. వ్యాఖ్యానించే క్రమంలో ఆమె ఒకో పద్యానికి అంతరార్థాన్ని వివరించారు. ఈ అంతరార్థం టాగోర్ కవితల్లోని నిగూడార్థాన్ని ఆమె తనదైన శైలిలోతెలిపారు. టాగోర్ కవి హృదయాన్ని ఆమె మనకు తెలిపారని,టాగోర్ లోని ఆధ్యాత్మికత, అద్వైతం, స్వేచ్చ విముక్తి గురించి తెలుసుకోవాలంటే శాంతా దేవిరచనను చదవాల్సిందేనని ఈ పుస్తకానికి ముందు మాట రాసిన మాడభూషి శ్రీధర్ వివరించారు.
రవీంద్రుడి గీతాంజలి గురించి వంద సంవత్సరాల క్రితమే ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక వ్యాసం రాస్తూ టాగోర్ ను ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అని అన్నారు. భగవద్గీతపై ఎన్ని విశ్లేషణలున్నాయో, గీతాంజలిపై అన్ని వ్యాఖ్యానాలున్నాయి.
కాని స్థూలంగా టాగోర్ ఎవరు? నావరకైతే 1861లో జన్మించి, 1941లో మరణించిన రవీంద్ర నాథ్ టాగోర్ గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితాన్ని, ఆయన జీవితకాలంలో జరిగిన సామాజిక,సంస్కరణోద్యమాల్నీ అర్థం చేసుకోవాలని, ఆయన రచనలను కూడా ఇదే నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అనిపిస్తుంది.
తన బాల్యంలో మూడు ఉద్యమాల ప్రభావం తనపై పడిందని రవీంద్రనాథ్ టాగోర్ అనేక రచనల్లో చెప్పుకున్నారు. అందులో మొదటిది. రాజారామ్మోహన రాయ్ సంస్కరణోద్యమం. రవీంద్రుడి తండ్రి మహర్షి దేవేంద్ర నాథ్ టాగోర్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం విగ్రరాధన, పునర్జన్మ, అవతారాలు, హిందూ కర్మకాండ ను నిరసించింది. దేవేంద్ర నాథ్ టాగోర్ బ్రహ్మ సమాజంలో పాల్గొన్నప్పటికీ మధ్యే మార్గాన్ని అవలంబించేందుకు ప్రయత్నించారు. సతీసహగమాన్ని నిరసించారు. కులతత్వాన్ని వ్యతిరేకించాడు. సమాజం ఆయనను వెలివేసినాపట్టించుకోలేదు. రవీంద్రుడిపై బెంగాల్ సాహిత్యాన్ని మలుపుతిప్పిన, తన వందేమాతర గీతంలో స్వాతంత్ర్య సమరాన్ని పురికొల్పిన బంకించంద్ర ఛటర్జీ ప్రభావం ఉన్నది. మూడవది. జాతీయోద్యమం. తాను ఈ మూడు ఉద్యమాల సమ్మేళనం అని రవీంద్రుడే చెప్పుకున్నారు .
అదేసమయంలోఆయనపై యూరోపియన్ సాహిత్యం ప్రభావం ఉన్నది. జర్మనీ భాషను నేర్చుకున్నారు. గోతే, హెన్రిచ్ హీనే, ఫాస్ట్ సాహిత్యాన్నిచదివారు. యూరోపియన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాడు. భారతీయ సంస్కృతిలోని నైతికతను ఆయన ప్రేమించాడు. యూరప్ లోని సాహితీ విలువలకు ఆయన ఆకర్షితుడయ్యాడు. యూరప్ లోని నాగరికత, శాస్త్రీయ అభివృద్దిని అభిమానించానని చెప్పుకున్నారు.మహోన్నతమైన ఇంగ్లీషుసాహిత్యం తనపై ప్రభావం చూపిందన్నారు. ఇంగ్లండ్ విజ్ఞానాన్ని మన తలుపుల వద్దకు తెచ్చిందన్నారు. అదే సమయంలో స్వేచ్చ, మానవత్వం, న్యాయం వంటి విలువల్ని కూడా ఇంగ్లీషు సాహిత్యం నుంచి నేర్చుకున్నానన్నారు.విదేశీ పాలన పై తిరుగుబాటు చేసినా పశ్చిమ దేశాల్ని తిరస్కరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
టాగోర్ పై చైతన్య భక్తి ప్రభావం కూడా ఉన్నది. చైతన్యప్రభు దక్షిణాది భక్తినీ, బెంగాలీ భక్తిని సమ్మిళితంచేశారు. కులతత్వాన్ని వ్యతిరేకించారు యూరోపియన్ ఉదారవాద,స్వేచ్ఛా వాద సంస్కృతి మాత్రమే కాకుండా ఉపనిషత్తులు, బుద్దుడు, బెంగాల్ వైష్ణవిజం, బాల్ కల్ట్ (వైష్ణవ హిందూ,సూఫీ ముస్లింల తాత్వికతతో కూడిన జానపద సంగీతం) టాగోర్ పై ప్రభావం చూపింది.జయదేవ్, విద్యాపతి,చండీదాస్ వంటి కవుల ప్రభావం కూడా ఆయనపై ఉన్నది. రాధా కృష్ణుల ప్రేమతత్వాన్ని వివరిస్తూ టాగోర్ బనుసిన్హ పేరుతో వైష్ణవ గీతాలు కూడా అల్లారు. వైష్ణవ సాహిత్యంలోని సంగీతం,కవిత్వం ఆయనను ముగ్ధుల్ని చేసింది. అదేసమయంలో మతాలకు అతీతంగా రచనలు చేసిన కబీర్ ప్రభావం కూడా ఆయనలోఉన్నది.
టాగోర్ అనేక సామాజికశాస్త్రాల్నిఅధ్యయనం చేశారు. సంపదను సమానంగా పంచాలనే సోషలిస్టు ఆదర్శం సాధ్యమా అని ఆలోచించారు.
22వ ఏట ఆయన రాసిన ‘ప్రభాత్ సంగీత్’ ఆయనలో చైతన్యం పురివిప్పిన రీతిని మనకు తెలియజేస్తుంది. ప్రకృతిలోని స్వేచ్చ, సంగీతపు లయ, మార్మిక నృత్యపు కదం ఈ కవితల్లో మనకు కనపడతాయి. జమీందారీ ఎస్టేట్ లో ఆయన కార్మికులు,ముఖ్యంగాస్త్రీ కార్మికుల కష్టాల్ని గమనించారు.
దేశ రాజకీయాలపై కూడా ఆయన కవిత్వ పరంగా స్పందించారు.
1894లో ‘ఏబార్ ఫిరావో మొరే’ (టర్న్ మీ అవే నౌ) అనే కవితలో ఆయన ప్రజలను సుఖాలను వదులుకుని పోరాటాల జీవితాల్లోకి వాస్తవాల్లోకి ప్రవేశించమని పిలుపునిచ్చాడు.
అణగారినవారు బలంగా మారాలని, తమను తాము కావాడుకోవాలని, వారిని సంఘటితం చేయాలని ఆయన 1905లో కలకత్తాలోని క్లాసిక్ థియేటర్ లో విద్యార్థులకు పిలుపునిచ్చారు. మీ జీవితాన్ని దాసోహం చేసుకున్నవారి నుంచి కృతజ్ఞతను ఆశించకూడదన్నారు.
దేశాన్ని ప్రజలు తమ బలంతో నిర్మించాలని,మన ఆలోచనలు,మనకార్యాచరణ, మన సేవల ద్వారానే మన దేశాన్ని కాపాడుకోవాలని రవీంద్రుడు సాధన పత్రిక సంపాదకీయంలో తెలిపారు.దేశాన్ని మనం గెలుచుకోవాలని,క్రియాశూన్యతనుంచి బయటపడాలని,దరఖాస్తుల ద్వారా స్వాతంత్ర్యం రాదని, స్వాతంత్ర్యంసంపాదించుకోవాలని స్వదేశీసమాజ్ పత్రికలో రాసిన వ్యాసంలో పిలుపునిచ్చారు.
వ్యక్తులు స్వేచ్చగా తమ జీవితాన్ని నిర్ణయించుకోవాలని టాగోర్ భావించారు.వ్యక్తి చైతన్యం సమాజం ద్వారా ప్రభావితం అవుతుంది కాని మొత్తం సమాజమే ప్రభావితం చేయదన్నారు.మనిషి బుద్దిలోని భావోద్వేగం నిజమైన వాస్తవికత అన్నారు.మెజారిటీ ఎప్పుడూ కరెక్ట్ కాదని,ప్రజలు భౌతిక పరిస్థితులకు కేవలం బానిసలు కాదని అన్నారు.
కవి, చిత్రకారుడు, భావుకుడు కనుక ఆయన ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొనకపోవచ్చు కాని రవీంద్రుడు తన రాజకీయ ఆలోచనల్ని ఎప్పుడూ దాచుకోలేదు. బెంగాల్ విభజన, జలియన్ వాలా బాగ్ ఊచకోతలపై స్పష్టంగా తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. జలియన్ వాలా బాగ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘సర్’ బిరుదును ఆయన తిరిగి ఇచ్చేశారు. పంజాబ్ లో తన సోదరులు పడ్డ అవమానాలు, బాధలు సర్వత్రా ప్రజల హృదయాల్లో క్రోధాగ్నిని రగిల్చినప్పటికీ పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోనందుకు తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవ చిహ్నాలన్నిటినీ త్యజించాలని నిర్ణయించానని ఆయన స్పష్టం చేశారు. గౌరవహీనులుగా పరిగణన చెందుతున్న తన దేశీయుల సరసన సామాన్యుడిగా నిలబడడమే తనకు నిజమైన గౌరవమని తెలిపారు.
గాంధీ, నెహ్రూ భావజాలంతో ఆయనకు సామీప్యత ఉండేది. బెంగాల్ ను విభజించాలనే కర్జన్ నిర్మయానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. నిర్మాణాత్మక సహకార నిరాకరణను ఆయన అవలంబించారు. దేశ భక్తి గీతాలు అల్లారు. ఎన్నో సభల్లో పాల్గొన్నారు. విప్లవకారుడైన అరబిందో ఘోష్ ను ఆయన అభిమానించారు.
టాగోర్ యాత్రకు అధికప్రాధాన్యత ఇచ్చారు. నిరంతరం నడిచేవాడికి దేవుడే కామ్రేడ్ గా, సహచరుడుగా ఉంటాడని ఆయన ‘ఆన్ వార్డ్ మార్చ్’ లో రాశారు. “ఖాళీగా కూర్చుంటే ప్రపంచంలో గుర్తింపు లభించదు” అన్నారు. మనిషి నిటారుగా నిలుచుకున్నప్పుడే అతడి అదృష్టంకూడా నిలిచి ఉంటుందని చెప్పారు.అతడితో పాటు అదృష్టం కూడా ప్రయాణిస్తుందని చెప్పారు. ముందుకుసాగడమే అమరత్వాన్నిసాధించడమని చెప్పారు. టాగోర్ మనిషిని ప్రేమించాడు. మానవత్వానికి విలువఇచ్చారు. “మనిషి యాత్ర చేయకపోతే మందిరం ఎలా చేరుతాడు” అన్నారు. జీవితమంతా ఆయన యాత్ర చేస్తూనేఉన్నారు. సూర్యుడిని నిరంతర యాత్రికుడుగా అభివర్ణించారు .సూర్యుడు ఎన్నడూ నిద్రమత్తులో జోగలేదని గుర్తు చేశాడు.
ఏమైనా “మనిషి అనే వాస్తవమే అన్ని వాస్తవాలకంటే సత్యం. దానికి మించిన సత్యంలేదు” అని ఆయననమ్మారు.
భారత దేశం సారాంశం అనేక అంశాల సమ్మేళనంగా ఆయన భావించారు. “భారత దేశం అంటే ఆర్యుల చరిత్ర కాదు, హిందువుల చరిత్ర కాదు,ముస్లింల చరిత్ర కాదు, పశ్చిమ దేశాల స్పర్శ లేకుంటే మనం ఒక పరిపక్వతను కోల్పోయేవారం. హిందువులు,ముస్లింలు,క్రైస్తవులు, నలుపు,శ్వేత వర్ణాలతో కూడిన మహోన్నత భారతాన్ని మనం నిర్మించాల”ని ఆయన చెప్పారు. “బంకించంద్రఛటర్జీ తన మంత్రదండంతో మన భాషపై చచ్చిన కళేబరాల భారాన్ని తొలగించి,మనసాహిత్యాన్ని సుదీర్ఘ కాల నిద్ర నుంచి మేల్కొల్పారు” అని రవీంద్ర నాథ్ టాగోర్ అన్నారు. సిపాయీల తిరుగుబాటు,బెంగాల్ లోని మత,సాహిత్య రాజకీయ ఉద్యమాలు, ఆయనను మేల్కొలిపాయి. ఈ ఉద్యమాల్లో ఆయన కుటుంబాలు కూడా పాల్గొన్నాయి.రామమోహన్ రాయ్ ను ఆధునిక భారత ఆవిష్కర్తగా ఆయన అభివర్ణించారు.
తన భార్య,కూతురు, తండ్రి,కుమారుడు ఆరేళ్ల వ్యవధిలోనే మరణించడం టాగోర్ లో ఆధ్యాత్మికతకు దారి తీయవచ్చు. ఒక ప్రేమికుడుగా, ఒక గాయకుడుగా, ఒక వేణు వాద్యకారుడుగా, చివరకు మృత్యువుగా కూడా దేవుడు అతడిని అలరించి ఉండవచ్చు. కాని టాగోర్ లో మనిషి పట్ల, శ్రమజీవి పట్ల, స్వేచ్చా స్వాతంత్ర్యాల పట్ల, హేతు వాదం పట్ల, సైన్స్ పట్లా, అన్నిటికిన్నా మించి ప్రశ్నించే దృక్పథం పట్ల ప్రేమ ఆయన కవితల్లో అంతటా తచ్చాడింది. టాగోర్ లోని తిరుగుబాటు దారు కూడా ఏనాడూ మరణించలేదు. ‘జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్న గురజాడ మాదిరే ఆయన శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించారు.
మానవుడు సగర్వంగా తలఎత్తుకునే, విజ్ఞానం స్వేచ్ఛగా మనగలిగే, మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లే ప్రపంచం కోసం ఆయన తపించాడు. కులం, మతం,జాతి,వర్ణం వంటి ముక్కలు ముక్కలైన ఇరుకైన గోడల మధ్య ప్రపంచం మగ్గిపోకూడదని, పరిశుద్ద జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపు టెడారిటో ఇంకి పోకూడదని ఆశించాడు.
తలుపులన్నీ మూసుకుపోయిన చీకటి గదిలో దేవుడు లేడని,ఎక్కడ రైతు నేలను దున్నుతున్నాడో,ఎక్కడ శ్రామికుడు రాళ్లు పగుల గొడుతున్నాడోఅక్కడ దేవుడున్నాడని, ఎండలో,వానలో ధూళి దూసరితములైన వస్త్రాల్లో ఉన్న శ్రమ జీవుల్లో ఉన్నాడని ఆయన చెప్పారు. పట్టు పీతాంబరాలను ఆవల పెట్టి మనుషులున్న నేలమీద నడవమని భక్తులకు రవీంద్రుడు చెప్పినంత ప్రతిభావంతంగా ఆ రోజుల్లో చెప్పిన వారు లేరు.
“కీలు గుర్రము మీద బాలీసునానుకొని ప్రాణాలు లేనట్టి బగమంతుడొచ్చాడు ఊరంత ఊరేగుతూ, ఉత్సవము సారించుతూ” అని ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు తెన్నేటి సూరి రాశారు.
స్పష్టంగా చెప్పాలంటే టాగోర్ నిర్దిష్టంగా ఏ మతాన్నీ వ్యక్తంచేయలేదు. గీతాంజలిలో ఆయన పేర్కొన్న మహాశక్తి ఏ మతానికీ చెందింది కాదు. “నా మతం ప్రధానంగా ఒక కవి మతం” అని ఏనాడో చెప్పిన కవి టాగోర్. కవితా,ఓ కవితాలో శ్రీశ్రీ తన కవితాత్మను ఏ విధంగా అభివర్ణించారో గీతాంజలిలో టాగోర్ తనకవితాత్మతో ఒక అతీతమైన శక్తిని ఆవాహన చేసుకున్నారు. దివ్యానుభవాన్ని, బ్రహ్మానుభవాన్నీ అనుభవించారు.
‘ద రిలీజియన్ ఆఫ్ ఆన్ ఆర్టిస్ట్’ (ఒక కళాకారుడి మతం) అని టాగోర్ ఒక వ్యాసం రాశారు. చదివారు. అది చదివితే టాగోర్ ఏమిటో మనకు అర్థం అవుతుంది.”నా చుట్టూ ఉన్న ప్రజలు వాస్తవమని నమ్మినంత మాత్రాన ఏ మత బోధనూ ఆమోదించడం నాకుసాధ్యం కాదు.నా మతం ప్రధానంగా ఒక కవి మతం. ప్రతి కవీ తన స్వంత విత్తనాలను,తన స్వంత నేలను తయారు చేసుకోవాలి. తనదైన విశిష్టమైన భాషా మాధ్యమాన్ని ఏర్పర్చుకోవాలి.తన జీవితపు మార్మిక స్పర్శతో, తన స్వంత సృజనకు ప్రత్యేకమైన వాహికగా మార్చుకోవాలి.. సైన్స్ లోను,అధిభౌతిక శాస్త్రంలోనూ నిర్దిష్ట వాస్తవం ఉండవచ్చు కాని వాస్తవిక ప్రపంచం కళకు చెందుతుంది. దాన్ని మీరు మాయ అనండి, లయ అనండి..”అని టాగోర్ ఏనాడో చెప్పారు.
రవీంద్రుడి దృష్టిలో స్వర్గం అంటే ఏమిటి?.. సూర్యుడిలో, భూమి ఆకుపచ్చదనంలో మనిషి ముఖంలోని అందంలో, మనిషి జీవితంలోనిసంపదలో, మనకు అప్రధానమైనవనుకున్న వస్తువుల్లో స్వర్గం ఉంటుంది. భూమిపై ప్రతి చోటా స్వర్గపు ఆత్మ సంచరిస్తూ, ధ్వనిస్తూ ఉంటుంది అన్నారు.
“కవిత్వానికి ఒక వ్యాకరణం ఉంటుంది.ఒక పదజాలం ఉంటుంది. కవిత్వాన్ని వాక్యం వాక్యం విడదీసి హింసించే ప్రయత్నం చేసి నీ కావల్సింది చెప్పించుకునే ప్రయత్నం చేస్తే కవిత మెత్తటి గాలిలా,నిశ్శబ్దంగా ఎవరికీ కనపడకుండా నిష్క్రమిస్తుంది..” అని టాగోర్ అన్నారు.
రవీంద్రుడిని అర్థం చేసుకోవాలంటే ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాచీన కాలం నాటి తాత్వికతను,ఆధునిక కాలం నాటి ఆవశ్యకతను, మనిషి వేదనను,జీవన సంఘర్షణను అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ఒక కవిని అర్థంచేసుకోవాలి. చలం నుంచి పప్పు శాంతాదేవి వరకూ ఆ మార్గంలో తమదైన రీతిలో కృతకృత్యులయ్యారనుకుంటున్నా..
*
అభినందనలు సార్. చక్కని వ్యాసం. ధన్యవాదాలు సర్.
thank you friend
Excellent analysis of Pappu Shantadevi telugu vyakhya of Raveendrananadh Tagore’s Gitanjali.
thank you subbu garu
అద్భుతమైన రీతిలో రవీంద్ర కవీంద్రుని దర్శనం చేయించారు. అభినందనలు. ధన్యవాదాలు
Thank you sir
శాంతాదేవిగారి పుస్తకాన్ని సమీక్షిస్తూ, ముందుగా
రవీంద్రుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ, టాగోర్ ఆలోచనల్ని, ఆదర్శాలను, భావజాలాన్ని, కవితా సారాన్ని, ఆయన్ని ప్రభావితం చేసిన సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, సంస్కరణ ఉద్యమాలను మనకు వివరించారు. ఇది శాంతాదేవిగారి పుస్తకం మీద అర్థవంతమైన సమీక్షే కాకుండా, టాగోర్ని అర్థంచేసుకోవడానికి దోహదం చేసే అధ్బుత సాహిత్య రచన.
ధన్యవాదాలు శాంతిశ్రీ బెనర్జీ గారు…
టాగోర్ గీతాంజలి గురించి రాస్తుంటే గీతాంజలి తర్వాత దాదాపు పాతికేళ్ళ తర్వాత కవిగా ప్రసిద్ధుడైన శ్రీ శ్రీ ప్రస్తావన తేవడం అనవసరమేమో అనిపించింది కృష్ణారావు గారూ.ఆయన కవిత్వం మీద టాగోర్ ప్రభావం వుందని అనలేం.
అనలేదు కదా
“కవితా,ఓ కవితాలో శ్రీశ్రీ తన కవితాత్మను ఏ విధంగా అభివర్ణించారో గీతాంజలిలో టాగోర్ తనకవితాత్మతో ఒక అతీతమైన శక్తిని ఆవాహన చేసుకున్నారు. దివ్యానుభవాన్ని, బ్రహ్మానుభవాన్నీ అనుభవించారు.”
ఇది చదివితే కవితా…… లోని కవితాత్మను ఎలా అభివర్ణించారో ఠాగోర్ కూడా గీతాంజలి లో తన కవితాత్మాతో ఒక శక్తిని ఆవాహన చేసుకున్నారు. ముందు శ్రీశ్రీ ప్రస్తావనుంది కనక ఈ అంతకన్నా చాలా ఠాగోర్ చాలా ముందు రాశాడు కాబట్టి శ్రీశ్రీ ఒక్క కవిత మొత్తం గీతాంజలి ని ప్రభావం చేశాడని చెప్పడం సరికాదని నాకనిపిస్తోంది .
గొప్ప కవులంతా కాలంతో సంబంధం లేకుండా తమ కవితాత్మను ఆవిష్కరించుకోవడంలోని ఒక పోలికను చెప్పడమే నా ఉద్దేశం. అలా చెప్పడంలో నేను విఫలమైఉంటే క్షమించాలి.