నేనే పుట్ల హేమలతను కావాలి

చెప్పాల్సినవి వినాల్సినవి ఎన్నో చేయాల్సినవి ఉండగా నా కోసం ఉండాల్సిన సమయంలో తను నన్ను వదిలిపెట్టేసింది.

మ్మతో అదే చివరి సభ అని, అదే చివరి ఫోటోలు తీసుకోవడం అని, అవే చివరి మాటలు అని, అవే చివరి నవ్వులని ఏ మాత్రం నేను ఊహించలేదు. అమ్మ ప్రరవే తో ముడి పడినప్పటినుంచి ఏ సభను మానలేదు. ప్రయాణాలు తన ఆరోగ్యాన్ని ఎంత క్షీణింప చేసినా ఆమెకు స్నేహితులను కలుసుకోవడం వారిని చూసిన వెంటనే హత్తుకోడం మాటలు కలబోసుకోడం పాత జ్ఞాపకాలు తలచుకొని పడి పడి నవ్వుకోడం ప్రరవే కోసం అమ్మ ప్రయాణాలను ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. అమ్మది అంతా మా తాతయ్య పోలిక. అదే తెగువ అదే తెలివి అదే పట్టుదల దీక్ష. కార్యసాధకురాలు. నేనే చాలా నెమ్మది.

అమ్మని ఆస్పత్రిలో చేర్పించే ముందు రోజు కూడా మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. తుంబాడ్ సినిమాలో కొన్ని సీన్లు చూపించాను. ఇలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని ఆ సినిమాను కొట్టిపడేసింది. ఆసుపత్రిలో కూడా ఎప్పటిలానే మేము ఏవేవో విషయాలు చెప్పుకుని నవ్వుకుంటూనే ఉన్నాము.

చెప్పాల్సినవి వినాల్సినవి ఎన్నో చేయాల్సినవి ఉండగా నా కోసం ఉండాల్సిన సమయంలో తను నన్ను వదిలిపెట్టేసింది. అమ్మ మీద చాలా కోపంగా ఉంది. తనకి తెలుసు నాకిప్పుడు తనెంత అవసరమో. చివరి దశలో అమ్మ ఇచ్చిన మనోధైర్యం జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకోవాలి ఎప్పుడు serious గా తీసుకోవాలి అని చెప్పినవి ఇప్పుడు నేను బలంగా ముందుకు అడుగులు వెయ్యడానికి అవసరం అవుతున్నాయి. బహుశా ఇందుకే చెప్పిందేమో.

అమ్మ హాస్పటిల్ లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నాకు ఒక ధైర్యం ఇచ్చిన మా మల్లీశ్వరి అక్కకి, చూడాలనిపిస్తుంది అనగానే నా కోసం పరుగెత్తుకు వచ్చిన నా స్నేహితులు మహి బెజవాడ, కాశీ నాగేంద్ర, అమ్మ కోసం మా కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ నేను మర్చిపోలేను. ఫేస్బుక్ వాట్సప్ లో స్వాంతన కలిగించే మిత్రుల కామెంట్స్  చదువుకుంటూ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఓదార్చడానికే అమ్మకి ఇంతమంది మిత్రులు ఉన్నారా అనిపిస్తుంది. అమ్మ చివరి యాత్ర లో ప్రరవే  సభ్యులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం మా అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది.

అమ్మలేని తనం ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నా అక్కడ కూడా అందంగా ముస్తాబై కూర్చుంది కులం. ఆరోగ్యం బాలేక జరిగిన అమ్మ చావు లో కూడా కులవివక్షను వెతికే కులగజ్జి దళితులకు ఎప్పుడు వదులుతుంది అని అనుకోవచ్చు. మేం వెతకం. కులమే మా వెంటపడుతుంది. మమ్మల్ని పుట్టుకలో నైనా చావులోనైనా  వేదనకు గురి చేస్తుంది. ఇంటి గుమ్మం తొక్కని ఇంటి వారిని చూసాను. తొక్కినా అన్నం ముట్టని బయట వారినీ చూసాను. రెండూ చేసిన పెద్ద కులాల పెద్ద మనసులని చూసాను. మాకంటే పెద్ద కులస్తులైన  మా అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య, అమ్మను సమాధుల తోటకు తీసుకుపోగానే అరిచిన నిష్టూరపు అరుపులకు సాక్ష్యాలుగా మిగిలిన మా బంధువులే మర్నాడు అమ్మ కొత్త చీరలు తీసుకున్నా మైల పడని అదే వాచ్మెన్ భార్య గొప్ప మనసుకి కూడా సాక్ష్యాలుగా మిగిలారు. భోజనాలు అయ్యాయని వాకబు చేసుకుని పరామర్శించడానికి  వచ్చేవాళ్ళు, అప్పటిదాకా ఉన్నవాళ్లు ఖాళీ కడుపుతో మాయమవ్వడాలు ఎంతో సన్నిహితులు అనుకుని దుఃఖం దిగమింగి గుర్తుపెట్టుకుని కబురు పెట్టినా రానివాళ్లు…అమ్మ ఇప్పుడు కూడా నాకు కుల పాఠాలు నేర్పిస్తున్నట్టే ఉంది. ఆఖరికి మా అమ్మకి సమాధులతోటలోనే సమానత్వం దొరికింది. అంతా మా వాళ్ళేగా. అక్కడ ఏ గొడవలు లేకుండా పూర్తి శాతం రిజర్వేషన్ మాకే.

అమ్మకు విద్యార్థులు కన్న పిల్లలే. పెద్ద కూతురు వినోదిని అక్క, పెద్ద కొడుకు ఇక్బాల్ చంద్ అన్నయ్య. డాడీ దగ్గర మొదటి PhD చేసినవారు. వీళ్ళిద్దరూ గొప్ప రచయితలని ఏవేవో పురస్కారాలు అందుకుంటారు అని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్న స్పృహ మాకు ఉండదు.

చివరిసారిగా పెట్టెలో ఉన్న అమ్మను చూసి పిడికిట్లో ఉన్న మట్టి వెయ్యమన్నారు. నేను, వినోదిని అక్క, చెల్లి ఒకేసారి వెయ్యడం అత్యంత బాధాకరం మరువలేనిది. పేర్లు రాయలేను కానీ ఎంతోమంది విద్యార్థులు స్నేహితులు అమ్మ ప్రేమను పొందారు. మా కంటే కూడా అమ్మ మనసులో పెద్ద స్థానం సంపాదించుకున్నారు.

మమ్మీ కి  ఎంత అనారోగ్యం ఉన్నా నాకు ఇంత దుఃఖం మిగిల్చి వెళ్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రయాణం చేసిన ప్రతిసారి తానొక యుద్ధమే చేసేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు.తన వైధవ్యం శేష జీవితాన్ని ఊహించాను కానీ ఇది తట్టుకోలేని కోలుకోలేని దెబ్బ.

తను స్థాపించిన విహంగ పత్రిక, మనోజ్ఞ సాహిత్య  సాంస్కృతిక అకాడెమీ, తన వెయ్యాలనుకున్న పుస్తకాలని తీసుకురావడంలో కాస్త మనశ్శాంతిని వెతుకుంటున్నాం. నా కథల పుస్తకం మిళింద కోసం డాడీ వ్యాసాల పుస్తకాల కోసం తన రచనలను వెనుక పడేసింది. మా కోసం తన కష్టమంతా వెచ్చించింది. మా కోసమే అంకితమైంది.

మమ్మీ లేకుండా కూడా నేను బతకాల్సి వస్తుందని నమ్మడం మొదలు పెట్టాలి. నేనే పుట్ల హేమలత ను కావాలి.-

*

 

మానస ఎండ్లూరి

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాటలు రావడం లేదు రా!
    ఇంతలోనే అమ్మను కోల్పోతామనుకోలేదు..
    సుధాకర్ సార్ ను ఎలా ఓదార్చుకోవాలో తెలీదు..
    నువ్వే ధైర్యం చేయాలి..
    అమ్మ రచనలన్నీ పుస్తకంగా తేవాలి!
    అమ్మకు సలామ్!

  • బాధ, బాధ నుంచి సాంత్వన… పొందడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో ఈ వ్యాసం కళ్ళకు కట్టింది. మనం ఎంత కాదనుకున్నా పెళ్లి, చావుల్లో కులం, మతం… పెద్ద పెద్ద పాత్రలే పోషిస్తాయి. వాచ్మెన్ భార్య ఈ సమాజపు ప్రతినిధి.

    ఏది ఏమైనా… మీరెంతో మనోధైర్యంతో ఈ కష్టాన్ని అధిగమించాలని ఆశిస్తున్నాను. కాలం గడిచే కొద్దీ మీరు అమ్మలా మారతారనే భరోసా ఉంది.

  • అమ్మ పుట్ల హేమలత గారి మరణం వ్యక్తిగతంగా మీకే కాదు, తెలుగు

    సమాజానికి తీరని లోటుగా మేము తీవ్ర ఆవేదనకు గురయ్యాము. కుల

    వివక్ష నిర్మూలన కోసం మనం అంబేడ్కర్,పూలే మార్గంలో మనువాద

    భావజాలాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అమ్మనుండి మీరు

    స్వీకరిస్తున్నందకు ప్రజా ఉద్యమాభినందనలు

    కోడం కుమారస్వామి, జనగామ రచయితల సంఘం.

  • మనమంతా మన తల్లితండ్రులకు కొనసాగింపులం.
    వాళ్ళ ఆశయాలు, కలలు నెరవేర్చాల్సిన బాధ్యత మనదే.
    అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది.
    మంచి పేరు తెచ్చుకోవడమే మీరు ఆమెకిచ్చే నిజమైన నివాళి. ధైర్యంగా ఉండు.

  • అమ్మలేని లోకం నిండా ఆవరించుకునే శూన్యం పెట్టే భయం, దిగులూ, బాధా మామాలువి కావు మానసమ్మా,
    డాక్టర్ పుట్ల హేమలత అంటే సాహిత్యం లో ఒక పేజీ అని మాత్రమే అనుకోవడం అసాధ్యం అని అనేక పనుల్ని సుసాధ్యం చేసి వెళ్ళారు.

  • అనుభవ, అనుబంధాన్ని అక్షరాలుగా మార్చడం కేవలం జ్ఞాపకాలకు మాత్రమే సాధ్యం. అలాంటి పుట్ల పుట్ల జ్ఞాపకాల్ని
    మీకు అందించిన అమ్మకు నా సాహిత్య, సామాజిక వందనాలు!

  • అమ్మ అడిగిన ఒక్కరోజునీ ఇవ్వలేకపోయినందుకు చాలా దుఃఖం గా వుందిరా మానసా. ఆ ఒక్కరోజూ తను మనందరికీ దూరమైన తర్వాత ఇవ్వటం మరింత బాధగా వుంది. అమ్మ కోసం నువ్వు చేసే పనిలో మా సహాయం ఎప్పుడూ ఉంటుంది-సజయ, ఒమ్మి రమేష్ బాబు

  • అవునమ్మా.. నువ్వే పుట్ల హేమలత కావాలి. అమ్మ బాధ్యతలను తలకెత్తుకుని అందులోనే ఓదార్పు పొందాలి. అమ్మ నీకు నేర్పిన ధైర్యమే నిన్ను నడిపిస్తుందని నాకిప్పుడు గొప్ప నమ్మకం కలిగింది. అమ్మ లోటు పూడ్చలేనిది.. నీవన్నది అక్షర సత్యం.. ఈ వ్యవస్థ మారనంత వరకూ ఈ కుల వివక్ష కొనసాగుతుంది. అది అంతమొందేవరకూ పోరాడాల్సిందే. నీ కలంలోంచి దాన్ని దునుమాడుతూ ఒలికిస్తూ పలికించాల్సిందే.. నాన్న, చెల్లి జాగ్రత్త… నీతో మేమూ ఉన్నాం.. మంచి మనసున్న అమ్మని మనమంతా కోల్పోయాం.. ఆమె ఆలోచనలు ముందుకు తీసికెళ్లడమే మనమిచ్చే నిజమైన నివాళి… అమ్మలా అందరినీ అల్లుకుపోవాలి నువ్వు.. స్నేహాల పూదోటలోనే నీవు సేద తీరగలవు.. లవ్ యూ బంగారం… నీతో నేరుగా మాట్లాడే ధైర్యం వచ్చాక కలుస్తాను…

  • నా కాలి fracture వల్ల నేను ప్రరవే కి గానీ,రాజమండ్రి కి గానీ రాలేకపోయాను మానసా. కానీ అమ్మతో నాసిక్ నుండి మాట్లాడుతూనే ఉన్నాను. ప్రరవే కి ముందురోజు కూడా మేము మాట్లాడుకున్నాం. “నాకసలు ఒంట్లో బాగుండలేదు. శరీరాన్ని బలవంతంగా తీసికెళ్ళి అక్కడ పడేయాల్సిందే” అని హేమ చెప్పింది. ఆమె స్నేహ సౌశీల్యాలు చాలా అద్భుతమైనవి. ఎవరితో ఎవరికైనా పొరపొచ్చాలు, అభిప్రాయ బేధాలుండొచ్చు గానీ హేమలతతో అందరికీ ఎల్లలులేని స్నేహభావమే! ఆమె ఎక్కడుంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి.
    తప్పదు మానసా! నువ్వు తేరుకోవాలి.మేమందరం అమ్మని నీలో, మనోజ్ఞలో చూసుకుంటాం. నిజానికి అమ్మ మీలో సజీవంగా ఉంది ! మరీ ముఖ్యంగా నువ్వే అన్నట్లు నువ్వే పుట్ల హేమలతవి కావాలి.

  • అమ్మా..మీ బాధను అర్ధం చేసుకోవడం కష్టమే! అమ్మ తలపెట్టిన కార్యక్రమాలు సఫలీకృతం చేయడం లో ద్యాస పెట్టండి.డాడీ కి అండగా నిలవండి.అలా త్రుప్తి పడాలిసిందే!
    __డా.ప్రసాద్ అంకుల్
    హనంకొండ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు