నేనూ హాస్టల్ కి వెళ్తా…

ఒకరోజు నందుని తరుముతూ ఒకామె క్లాసు వరకు వచ్చింది. అదే మొదటిసారి ఆమెను చూడ్డం.

“టీచరుగారూ, ఈడితో ఏగలేకపోతన్నాను. కాస్త బయం చెప్పండి” అంది ఆయాసం తీర్చుకుందుకన్నట్టు గుమ్మంలో నిలబడి. నందు నాకు పరిచయమే. ఈ సంవత్సరమే ఇక్కడ దగ్గర్లోకి ఇల్లు మారి వచ్చారని చెప్పాడు మొదటిరోజు క్లాసుకొచ్చి.

నందుకి పదేళ్లుంటాయేమో. రెండేళ్లు మధ్యలో బడికి పంపనేలేదని చెప్పిందామె. ఇంకా మూడులోనే ఉన్నాడు. వాడిచేతిలో సగంసగం తింటున్న జామకాయ ఉంది. వాడు తల్లికి దొరక్కుండా క్లాసులోకొచ్చి నా కుర్చీ వెనుక నిలబడ్డాడు.

“ఈరోజు క్లాసుకి రాలేదేం నువ్వూ, మీ అక్కా?” అన్నాను వాడివైపు తిరిగి.

“ఈరోజు రాంలే” అన్నాడు మళ్లీ జామకాయ తినటంలో పడి.

“అవును, చదూకుందుకు ఎందుకు ఒళ్లొంగుద్దీ. దొంగ తిండికైతే ఒంగుద్దికానీ. ఇంటికి రా, చెబ్తాను. ఈపూట నీకు అన్నం పెట్టేది లేదు”, అందామె కొడుకుని ఉద్దేశించి. ఆమె ముఖంలో అలసట, నీరసం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“నాకు ఆకలవుతే తినొద్దామరి” అన్నాడు వాడు తల్లిని నిర్లక్ష్యంగా చూస్తూ.

పిల్లలంతా పుస్తకాలు పక్కన పెట్టి, వాడివైపు చూస్తూండటం గమనించి వాడిని బయటకెళ్లి తినమని చెప్పాను. తల్లిని గుమ్మంలోంచి పంపితేనే కానీ వెళ్లనని వాడు మొండికేశాడు.

నేను నందు తల్లితో బయటకు నడిచాను.

“తండ్రి లేని పిల్లలని ఒదిలేస్తంటే ఈడిలాగ తయారౌతున్నడు. మా పావని తెల్సుగా టీచరుగారూ. దాని తిండి దాన్ని తిననివ్వడు. రాచ్చసుడల్లే తింటాడు. అదేం ఆకలో, ఎప్పుడు చూసినా ఆకలంటాడు. పిల్లకోసం పెట్టినదీ ఈడు తినేస్తంటే ఆ పిల్ల ఆకలితో నకనకలాడతంది. నేనెక్కణ్ణించి తేవాల? ఈడి బాబు తాగి తాగి పోయాడు. ఇంటికాడ ముసిలాళ్లున్నారు. ఈళ్లందరికీ ఒంటిచేత్తో తెచ్చిసాకాలంటే నా చేత కావట్లా. అసలు ఈడు పుట్టకపోయినా బావుణ్ణు.” నిస్సత్తువగా ఆమె ఇంటి దారి పట్టింది.

ఎదుగుతున్న పిల్లల ఆకలి తీర్చలేని ఆ తల్లి బాథ అర్థమైంది.

తల్లి వెళ్లాక నందు మెల్లిగా క్లాసు బయటకొచ్చాడు.

“రేపొస్తాలే టీచర్” అంటూ వెళ్లబోతుంటే అడిగాను,

“అక్క కోసం పెట్టిన జామకాయ నువ్వే తింటే ఎట్లా నందూ”

“మరి నాకు ఆకలవుతే ఏడుపొస్తది. స్కూల్లో అన్నం సయించలా మజ్జానం. ఇప్పుడు ఏదైనా పెట్టమంటే ఏం లేదంటది ఆమెగోరు” తల్లిని విసుక్కుంటూ వెళ్లిపోయాడు.

ఈ రాత్రి నిజంగానే ఆమె నందూకి అన్నం పెట్టదా?! అని ఆలోచించుకుంటే “ఎందుకు పెట్టదు, తల్లికదా” అని తోచింది మనసుకి.

పావని, నందు అక్కాతమ్ముళ్లు. ఇద్దరూ సాయంకాలం క్లాసులకి వస్తారు కానీ చదువు దగ్గర ఇద్దరితోనూ పేచీనే. ఎనిమిది చదువుతున్న పావనికి తెలుగు అక్షరాలు తెలిసినా కూడబలుక్కుని చదవటం రావట్లేదు. నందు ఒక్కోరోజు పుస్తకాలు తెచ్చుకుని కూర్చుని, “లెక్కలివ్వండి టీచర్” అని అడిగి చక్కగా చేసేవాడు. చదవటం, రాయటం రాకపోయినా లెక్కలు మాత్రం బాగా పట్టుబడ్డాయి వాడికి.

ఒక్కోరోజు క్లాసుకి రావటం మానేసి, ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో ఆటలాడుతూ కనిపిస్తాడు. ఒళ్లంతా మట్టి కొట్టుకుని, చెదిరిన జుట్టుతో గుమ్మంలోకొచ్చి క్లాసులో కూర్చుని రాసుకునే పిల్లల్ని కూడా విసిగిస్తాడు. పిల్లలంతా ఫిర్యాదు చేస్తుంటే నవ్వుతాడు.

రెండు చేతుల్లోకి మట్టి తీసుకుని క్లాసులోకి విసిరి వెళ్లిపోతుంటే పిల్లలంతా, “మమ్మల్ని చదువుకోనివ్వట్లేదు టీచర్, వాడిని కొట్టండి, తీసుకొస్తాం” అంటూ లేచి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుంటే వాళ్లని సమాధానపరిచి, గుమ్మంలోంచి వాడిని పిలిచే ప్రయత్నం చేసినా, వాడు ఆపాటికి ఎక్కడో దూరంగా పరుగెడుతూ ఉంటాడు. వాడు చేసే అల్లరి భరించశక్యంగా ఉండదు. వీడేనా బుద్ధిగా లెక్కలు చేసేవాడు అన్నంత అపనమ్మకం కలిగేది.

వాడి ప్రవర్తనలో అంతంత అరాచకం ఎందుకో?!

వచ్చిన కొత్తలో, “పావనీ, మీ అమ్మా, నాన్నలకి చెప్పు. వీడి అల్లరి మరీ ఎక్కువవుతోంది.”అంటే

“మానాన్న లేడు టీచర్, వాడికి ఆకలేస్తే అస్సలు మాట వినడు” అంది ఆ అమ్మాయి యథాలాపంగా.

“రేపు వచ్చేప్పుడు మీ అమ్మగార్ని తీసుకురా.”

“అమ్మ సాయంత్రం చీకటడ్డాక వస్తది టీచర్. మీరెళ్లిపోతారుగా.”

ఒకరోజు ఎర్రబడ్డ కళ్లతో వచ్చాడు నందు. ఏడ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పుస్తకాలు కూడా తెరవకుండా కూర్చున్నాడు.

“అక్కేది?” అంటే జవాబు లేదు. “ఏమైంది” అంటే జవాబు లేదు.

మిగిలిన పిల్లలు వాడిని పట్టించుకోకుండా తమ చదువులు చూసుకున్నారు. క్లాసు అయ్యాక నందుతో పాటు అడుగులు వేస్తూ, బుజ్జగింపుగా అడిగాను.

“నందూ, ఎందుకు ఏడ్చావు? అక్క క్లాసుకి రాలేదేం?”

వాడు నడక ఆపి, నాకేసి చూస్తూ చెప్పాలా వద్దా అన్నట్టు ఆగాడు. మళ్లీ అంతలోనే,

“బడి నుంచి వచ్చేక ఆకలవుతాందంటే ఏమీ పెట్టట్లేదు మాయమ్మ.” పదేళ్ల నందు ముఖంలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది.

“ఈరోజు అమ్మ పనిలోకి వెళ్లలేదా?”

“జొరంగా”

“జ్వరం కనుక అమ్మ వంట చెయ్యలేదేమో.”

“అక్కకి వంట చెయ్యటం వచ్చుగా. అయినా బియ్యం లేవంటది. ఆకలవుతాందని గొడవ చేసేనని అమ్మ కొట్టింది” వాడి కళ్లు మళ్లీ తడుస్తున్నాయి. వాడి భుజం మీద చెయ్యివేసి, “పద, నాతోపాటు సెంటర్ వరకూ రా” అంటూ తీసుకెళ్లి, వాడికి బియ్యంతోపాటు పప్పు, కూరలు, రెండు రకాల బిస్కెట్లు కొనిచ్చి, “అమ్మకి బ్రెడ్ ఇవ్వు” అంటూ అందించాను. వాడి కళ్లు సంతోషంతో మెరిసాయి.

***

సంక్రాంతి సెలవులై పిల్లలంతా వచ్చారు. నందూ ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు. కొంచెం పెద్దదిగా ఉన్న ప్యాంటు ఒకటి వేసుకున్నాడు. తను పెద్దవాడైపోయినట్టు కనిపించాడు.

“టీచర్, సెలవుల్లో మా పెదనాన్నోళ్లింటికి వెళ్లాను. మా అన్నయ్య రవిబాబు కూడా ఆస్టల్ నుంచి వచ్చాడు. వచ్చే ఏడు నేను కూడా ఆస్టల్ కి వెళ్తాను. అన్నయ్య చెప్పాడు అక్కడ బావుంటదంట.” ఉత్సాహంగా చెప్పాడు.

“అమ్మని, అక్కని వదిలి వెళ్లి హాస్టల్ లో ఉంటావా?”

“ఓ, నాకేం భయంలేదు.” వాడి హుషారు చూస్తుంటే ఇప్పుడే వెళ్లిపోయేలా ఉన్నాడు. వాడి అమాయకత్వం, ఉన్నట్టుండి పేచీలు పెట్టే వాడి ప్రవర్తన కళ్లముందుకొచ్చాయి. తండ్రి లేని పిల్లడని కూడా వాడిపట్ల మరింత అభిమానముంది నాకు. నందు క్రమంగా క్లాసుకి రావటం తగ్గించేసాడు. అక్కడే ఆడుతూ కనిపిస్తుంటాడు. క్లాసుకి రమ్మంటే హాస్టల్ కి వెళ్లిపోతాగా అంటాడు.

ఈ సంవత్సరం పరీక్షలయ్యాక కొత్తక్లాసులో జేరినప్పుడు కదా హాస్టల్ కి వెళ్లేది అంటే వినడు. చెప్పగాచెప్పగా మళ్లీ రావటం మొదలెట్టాడు. బాగా చదువుకుని మంచి మార్కులతో పాసవ్వాలని చెబుతుంటే అన్యమనస్కంగా తల ఊపుతాడు. పావని మాత్రం రోజూ వస్తోంది. ఒకరోజు తన మనసులోది చెప్పుకోవాలన్నట్టు క్లాసు అయ్యాక అందరూ వెళ్లేవరకూ ఆగి, నాదగ్గరకొచ్చింది.

“ఏం, పావనీ, ఏదైనా చెప్పాలా?”

ఒక్క నిముషం సందేహంగా నిలబడిపోయింది.

“టీచర్, హాస్టల్ లో నిజంగానే బావుంటుందా?”

“నందూ గురించా? నువ్వు కూడా హాస్టల్ కి వెళ్లిపోతావా?”

“టీచర్, నాకోసం పెట్టినది కూడా తమ్ముడు తినేస్తాడని అమ్మ వాణ్ణి తిడుతుంది. కానీ అమ్మకి వాడంటే చాలా ప్రేమ. అసలు వాడు రాత్రి పూట అమ్మ దగ్గరకానీ పడుకోడు. వాడూ, నేనూ సెలవుల్లో పెదనాన్నింటికెళ్లినప్పుడు కూడా అమ్మ లేదని రాత్రుళ్లు గొడవగొడవ చేసేవాడు పడుకుందుకు. హాస్టల్ కి వెళ్తే ఉండగలడో లేడో! కానీ…పెద్దయ్యాక వెళ్దువులే అని అమ్మ చెప్పినా వినట్లేదు.” ఏదో చెబుదామన్నట్టు నిలబడి, అంతలోనే నెమ్మదిగా కదిలి, దిగులుగా ఇంటి వైపు దారితీసింది.

అయితే నందు హాస్టల్ ప్రయాణం వెనుక ఏదో కథ ఉందన్నమాట. వాడినే అడగాలి రేపు అనుకున్నాను.

ఆరోజు బస్సు దిగి క్లాసుకి వస్తుంటే దార్లో సైకిలు తొక్కుతూ ఎదురయ్యాడు నందు.

“టీచర్, పెద్ద సైకిల్ వచ్చేసింది నాకు” అన్నాడు గర్వంగా.

సైకిల్ దిగి నాప్రక్కనే నడుస్తున్నాడు.

“నందూ, నువ్వు నిజంగా హాస్టల్ కి వెళ్లిపోతావా మమ్మల్నందర్నీ విడిచి?” అన్నాను.

“వెళ్లినా సెలవులకి వస్తాగా…” ఒక్కక్షణం ఆగి,

“టీచర్, హాస్టల్ లో ఎంత కావాలంటే అంత అన్నం పెడతారంట” అన్నాడు రహస్యంగా నావైపు ఒంగి.

***

 

అనురాధ నాదెళ్ళ

8 comments

Leave a Reply to Janardhan Reddy Gajjela Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు