నేను……….. నా రంగుల కల

నేను …

చిత్రదీపంలా వెలుగుతున్న

నా రంగుల కల

అక్షరాల నెమలి కన్నులు

దాచుకున్న జీవితం పుస్తకంలో

తిరగేసినపేజీలు

మళ్ళీ చూడాలనిపిస్తుంది

కొన్ని గతించి పోయిన

మహావాక్యాల నెనరు

పునర్లోకించే

ఎదో పురాఙ్ఞాపకం

అసలు నిలువ నివ్వదు

అంతా బాగానే ఉంటుంది

సజావుగానే సాగుతుంది

నేను …

చిత్రదీపంలా వెలుగుతున్న

నా రంగుల కల

ఎప్పుడో సుతి మెత్తని  తరంగమై

చెంపను మీటిన చిరుగాలి  ……..

ఎక్కడో    దగ్దమౌతున్న కారడవిలో

నిస్సహాయంగా కురిసిన వెన్నెల

కుటీరం వాకిటిలో కూచొని

రెక్కలు మొలిచిన పర్వతాలు

మేఘాలతో యుద్ధం ప్రకటించే

నిశిరాత్రిలో

మిథున యౌవ్వనాన్ని తలచుకొని

నేత్రించి- శ్రవణించి- హృదయించి

స్మృతుల పొట్లాలను

కలానికి బలి చేస్తున్న ఈక్షణాన…….

నేనుచిత్రదీపంలా వెలుగుతున్న నా రంగుల కల

ఒక నీరెండలో

మూసిన గుడిసె

తలుపుల సండులనుండి

దాడి చెస్తూ ప్రవేశిస్తున్న

బాల సూర్యుడి లేత చిలిపిదనంలో

ఒక తెగిపోయిన తల

అకస్మాత్తుగా తేలుతూ వచ్చి

ప్రభుత్వాల పతన దృశ్యాన్ని చెప్పిన

రక్త రహస్యం…

నేను……

చిత్ర దీపంలా వెలుగుతున్న నా రంగుల కల.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

కాంచనపల్లి గోవర్ధన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు