నేను 1984 నుండి పర్యావరణం, అడవుల సంరక్షణ ,గిరిజన హక్కుల పైన పనిచేస్తున్నాను. నేటికి ఈ పయనం మూడు దశాబ్దాలు దాటింది. ఈ పయనం లో భాగంగా ప్రాజెక్ట్ ప్లానింగ్, అప్రైజల్, మానిటరింగ్, ఇవ్యాలుయేషన్, ,అడ్వకసి, లాబీయింగ్, తదితర కార్యక్రమాలు చేశాను. అడవులు, గిరిజనులు,గ్రామీణులు, పర్యావరణ అభివృద్ధి కోసం స్దానికులతో, వివిధ దేశ ,అంతర్జాతీయ సంస్ధలు ,ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాను. పరిశోధన, దేశ ,విదేశీ విద్యార్ధులకు పరిశోధనలు చేయడంలోమార్గదర్శకత్వం, స్ధానిక ప్రజలు,సంస్ధలకు శిక్షణ ఇవ్వడం. పర్యావరణ భారతి, ధింస పత్రికలకు అసోసియేట్ ఎడిటర్గా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిస్తితి నివేదిక(1990) పుస్తకానికి రిసర్చర్ గా పనిచేశాను. స్వతహాగా కవిత్వం ,చిత్రలేఖనం , ఫోటోగ్రఫి,రచయితను, ఇంకా సగం,నేలకన్ను,ఫ్లోటింగ్ ట్రీ(ఆంగ్ల కవిత్వం),మట్టిగూడు పుస్తకాలను అచ్చువేశాను గ్రీన్ షాడోస్ ,#20 మెమోయిర్స్ పేరున ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ప్రదర్శనలు చేశాను. ఈ పయనం లో పలు మారు మూల ప్రాంతాలకు వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని అన్ని జిల్లాలతో బాటు, దేశం లోని ఇతర ప్రాంతాల్ని సందర్శించాను.
వృత్తి రీత్యా, ఇతరత్రా కారణాలవల్ల నాకు కొన్ని ప్రదేశాల్ని మళ్ళీ తిరిగి చూసే అవకాశం లబిస్తుంది, నాకు, కవిత్వానికి వున్న వారధి సంచార జీవనం. ఈ జీవనంలో భాగమే ఆయా ప్రదేశాలు , అక్కడికి వెళ్ళినప్పుడు, వాట్ని వీడి వచ్చినప్పడు వాటి జ్ఞాపకాల బీజాలు నాలో కవిత్వ రూపంలో మొలకెత్తుతాయి.అందుకే నా ప్రతి కవితకీ ఆ వూరు పేరు, తేది, జోడించి వుంటాయి. కారణం నాకు అవి ఇచ్చిన ప్రేరణకు కృతజ్ఞత. మొదటిసారి చూసిన ప్రదేశం మళ్ళీ ఇంకోసారి వెళ్లి చూసినప్పుడు మారి పోయి వుంటుంది,మార్పు అనివార్యం ,కాని మార్పు అసహజంగా వున్నపుడు మనస్తాపం చెందుతాను, బహుశా ఆ ఉద్వేగం నుండి వచ్చిందే ఈ ఇంకా సగం సీక్వెల్. మెకెంజీ గ్రామ చరిత్రలను కైఫియత్ అన్న పేరుతొ మనకందించాడు , కైఫియత్ అంటే ‘మనసులోని మాట’ . బహుశా ఆ గ్రామాలు, అక్కడి ప్రకృతిలో జరిగిన, జరుగుతున్న మార్పులు వాటి మనసులోని మాట కాదేమో!. కాని, కనీసం కొన్ని ప్రాంతాలు, ప్రకృతి, నేటి వాటి కైఫియత్ లని ఇంకా సగం సీక్వెల్ రూపంలో…
ఇంకా సగం-సీక్వెల్ (రివిజిటింగ్ ఏ పోయెమ్). ఇది రాయడానికి కారణం రెండు,మొదటిది నేను మళ్ళీ వెళ్ళిన ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ ప్రకృతి లో పెను మార్పులు జరిగివుంటాయి, పచ్చటడవి , నది, వాగు, వంక, కొండ, కోన కనిపించకుండా పోతాయి.ప్రజల బతుకులు మారిపోతాయి. అది నన్ను కలిచివేస్తుంది. రెండవది పదేళ్ళ క్రితం అ ప్ర్రాంతంలో రాసుకున్న కవితను మళ్ళీ ఇంకో రూపం లో చూస్తాను. ఇదే రివిజిటింగ్ ఏ పోయెమ్. నా మొదటి పుస్తకం ఇంకా సగం 2000 లో అచ్చువేశాను, అందులోని కొన్ని కవితలకి సీక్వెల్ రాశాను, అలానే అదే పేరుతొ లేకపోయినా ఇందులోని చాలా కవితలు సీక్వెల్స్. ఈ పుస్తకం లో అయిడు భాగాలు. సెందురూడా, సెందురూడా, ఇది మొత్తం నగర జీవితాన్ని ప్రతిబింబిస్తుంది,నదింతే, ఇది నది, నీళ్ళు దానితో అల్లుకున్న జీవితాలు,జీనుభాయి గువ్వ గూడు ఇది అడవి గురించి, ఇంకా సగం ఇది మా ఇంటి చుట్టూ అల్లుకున్నది.
నా ఈ ప్రయత్నంలో సహకరించిన, మాధవీలత, శిశిర్,అచ్చువేసిన గాలి ఉదయ్(వికాస ధాత్రి),అరుణా, కవి యాకూబ్, శివాజి,ఛాయా కృష్ణ మోహన్,కవి శివారెడ్డి, అఫ్సర్ అలానే ఇంకా సగం పరిచయ సభకు వక్తలు గా వస్తున్నడా. సురేందర రాజు, అరుణ భిక్షు లకు ప్రత్యేక కృతఙ్ఞతలు.
మీరు ఇంకా సగం-సీక్వెల్(రివిజిటింగ్ ఏ పోయెమ్) ఆస్వాదిస్తారని ఆశిస్తూ.
జి.సత్యశ్రీనివాస్
Add comment