నేను చేసే తప్పులు

Episode 9:

పక్షం మాట్లాడుకోడానికి ఆసరాగా ఈ కథ (లేదా కథాభాగం అనచ్చు) ఇస్తున్నాను. చదవండి.

నేను చేసే తప్పులు

నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు. సామాన్యంగా కోపం రాదు. కానీ వస్తే ఉగ్ర నరసింహావతారమే.

ఆ రోజు పేపర్ చదువుతున్నప్పుడు దేవి వచ్చి విషయం చెప్పింది. ఓనర్ ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడట. వెంటనే.

“ఇప్పటికిప్పుడు అంటే ఎలా?” అన్నాను నేను.

“ఏమో వాళ్ల కొడుకు పెళ్లి కుదిరిందట” సగం విషయం చెప్పి వెళ్లిపోయింది. అలా చేస్తే నాకు చిరాకు. “నేను డ్రస్ మార్చుకోని వస్తాను” అంటూ బెడ్ రూమ్‍‍ లోకి వెళ్లి తలుపేసుకుంది.

“ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. బయట కరోనా ఎలా వుందో తెలుసా?” అన్నాను.

నేను చెప్పేది అర్థం చేసుకోకుండా “ఇంట్లో సరుకులు అయిపోయాయి” తనకిష్టమైన రెడ్ కుర్తా వేసుకుంటూ గదిలో నుంచి అరిచింది దేవి.

అసలే డబ్బులు లేవు. నెల సగం కూడా అవకముందే సరుకులంటే! ఛ!

నేను ఓనర్‍ ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆయన తన కూతురింట్లో తీరిగ్గా టీవీలో భక్తి ఛానెల్ పెట్టుకోని చూస్తున్నాడాయన. ఆ ఇంట్లో ఛార్జర్ ఈయన ఫోన్‍కి సెట్ అవదట. దానివల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆయన తిరిగి తన ఇంటికి వెళ్లి మళ్లీ ఛార్జింగ్ పెట్టేదాకా మాట్లాడటం కుదరదు.

నాకు కోపం ఇంకా పెరిగిపోయింది.

సరిగ్గా అప్పుడే చిన్న కూతురు వచ్చి ప్రోగ్రస్ రిపోర్ట్ ఇచ్చింది. అన్నీ అత్తెసరు మార్కులే. నాకు కోపం వస్తుందని దానికి ముందే తెలుసు. అందుకే లోపల్లోపల నన్ను తిట్టుకుంటూ వుంది. “సంతకం పెడితే చాలురా భగవంతుడా” అని దేవుడికి దణ్ణం పెట్టుకుంటోంది.

అప్పుడే నేను ఉగ్ర నరసింహావతారం ఎత్తింది. అప్పుడు నేను అరిచిన అరుపుకి భూకంపం వచ్చిందేమోనంతగా భయపడిపోయారు పక్కింటివాళ్లు.

***

ఈ వ్యాసంలో ఏం మాట్లాడుకోబోతున్నామో కథ పేరులోనే చెప్పేశాను. ఇది “నేను” అంటూ కథ చెప్పేవాళ్లు చేసే తప్పుల గురించి. పైన ఇచ్చిన కథలో అలాంటి తప్పులు మీలో చాలామందికి దొరికిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. వాటి గురించి వివరంగా చెప్పుకుందాం. ముందు కాస్త వ్యాకరణం నేర్చుకుందాం. స్కూల్లో తెలుగుమాస్టరుగారు లేదా మేడమ్‌గారు చెప్పిన సంగతులు గుర్తున్నాయా?

పురుషములు మూడు విధాలు: అవి ఉత్తమ పురుష (First Person), మధ్యమ పురుష (Second Person), ప్రథమ పురుష (Third Person). ఆంగ్లమున Third Person అను దానిని తెలుగులో తృతీయ పురుష అని కాకుండా ప్రథమ పురుష అని వ్యవహరిస్తారని గుర్తించవలెను. ఉత్తమ పురుష అనగా వక్తను అనగా మాట్లాడే వ్యక్తిని సూచించే సర్వనామను – ఉదా: నేను, మేము. మధ్యమ పురుష అనగా శ్రోతను అనగా వినే వ్యక్తిని సూచించే సర్వనామము. ఉదా: నీవు, మీరు. ప్రథమ పురుష అంటే ఎవరిని లేదా వేటిని గురించి మాట్లాడుతున్నామో సూచించే సర్వనామాలు. ఇది వక్తకు, శ్రోతకు సంబంధం లేకుండా మూడో వ్యక్తిని లేదా అంశాన్ని సూచిస్తుంది. ఉదా: అతడు, ఆమె, అది, వారు, అవి మొదలైనవి. “అతడు ప్రధముడు, నీవు మధ్యముడవు నేను ఉత్తముడను” ఇదీ సూత్రం. ఏమర్రా అర్థమైందా?

ఈ వ్యాసం నుంచి కొంచెం పక్కకి తప్పుకోని, చిన్న డొంక దారి విషయం చెప్తాను. మీరు మంచి తెలుగు రచయిత కావాలని అనుకుంటుంటే మొట్టమొదట చదవాల్సిన పుస్తకం – తెలుగు వ్యాకరణం. చాలా రోజుల క్రితం నేను చచ్చు పుచ్చు కథల నుంచి కాస్త ఫర్వాలేదనిపించే కథలు రాస్తున్న కాలంలో ఒకానొక ఫేస్‌బుక్ చర్చలో ఇంగ్లీషు మీడియం జ్ఞానంతో First Person narrative ని ప్రథమ పురుషని వాడేశాను. పెద్దలు వేలెత్తి చూపించిన తరువాత నేను చేసిన మొదటిపని క్షమాపణ అడగటం, రెండో పని కోటీ వెళ్లి తెలుగు వ్యాకరణం అనే చిన్న పుస్తకం కొనుక్కోవటం. కథలు రాయటానికి పనికొచ్చే పుస్తకాల లిస్టు ఈ వ్యాసాల చివర్లో ఇస్తాను. అందులో మొదటి పుస్తకం పేరు – తెలుగు వ్యాకరణం. (అయినా తప్పులు చేస్తున్నానేమో అన్న భయం ఉంది. జాగ్రత్త ఉంది.)

డొంక దారి అయిపోయింది. మళ్లీ రహదారిలోకి రండి. సూత్రం గుర్తుందిగా? “అతడు ప్రధముడు, నీవు మధ్యముడవు నేను ఉత్తముడను.” దీన్ని రచనలో వాడి చూద్దాం. “అతడి కథ ప్రథమ పురుష, నీ కథ మధ్యమ పురుష, నా కథ ఉత్తమ పురుష.” కథలు ఈ మూడు రకాలుగా రాయచ్చు. ఈ మూడు రకాల కథనాలకి దేనికదే ప్రత్యేకమైన పద్ధతి, నియమాలు ఉంటాయి. వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం.

ఈ మూడింటిలో మధ్యమ పురుష (నీ కథ) చాలా అరుదుగా కనపడుతుంటాయి. వీటి గురించి చివర్లో చెప్తాను. ఇక మిగిలినవి రెండు – ఉత్తమ పురుష, ప్రధమ పురుష కథనాలు. కథలు ఇలా కూడా రాస్తారు అన్న పుస్తకంలో మొహమ్మద్ ఖదీర్‌బాబు వీటి గురించి చాలా సరళంగా – “నేను కథలు”, “అతని కథలు” అంటారు. మనం ఆయనకి కృతజ్ఞత చెప్తూ అవే పదాలు వాడుకుందాం.

నేను కథలు (ఉత్తమ పురుష కథనం – First-person narration): ఉత్తమ పురుష కథనం రచయిత తన కథ, లేదా తమ కథ చెప్తాడు/చెప్తుంది. “నేను”, “మేము” అనే సర్వనామాలను ఉంటాయి.

ఇది చాలా సులభమైనది అని చాలా మంది అంటారు. కొత్తగా రాస్తున్నవాళ్లు మొదటగా రాసిన కథలు ఎక్కువ శాతం నేను కథలే అయ్యుంటాయి. బహుశా ప్రత్యక్షంగా చూసిన సంఘటనో, లేక ఊహల్లో చూసిన సంఘటనో కథగా రాయటంలో, “నేను చూసింది మీకు చెప్తాను” అనుకోని చెప్పడంలో సౌలభ్యం వుండటం వల్ల కావచ్చు. కథ అంతా కథకుడి ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్పబడుతుంది. వ్యక్తిగతమైన కథలు చెప్పడనికి, రచయిత ఆలోచనలను, భావోద్వేగాలను పాఠకుడు దగ్గరగా అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు రచయిత ఈ శైలిని ఎంచుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి కానీ మనం రెందు మాత్రం పరిశీలిద్దాం.

ఏక ఉత్తమ పురుష కథనం (Single First-Person Narrative)

ఒకే ఒక్క ప్రధాన పాత్ర దృష్టికోణం నుంచి మొత్తం కథనం చెప్పబడుతుంది. ‘నేను’, ‘నాకు’, ‘నాది’ లాంటి సర్వనామాలను ఉపయోగిస్తారు. కథకుడు ప్రపంచాన్ని, ఆలోచనలను, సంఘటనలను ఎలా అనుభవిస్తాడో పాఠకుడు కూడా అదే విధంగా అనుభవిస్తాడు. భావోద్వేపు లోతులు చూపించడానికి, పాత్ర అంతర్గతమైన సంఘర్షణలు చెప్పడానికి ఈ శైలి అనువైనది. తెలుగులో రచయిత కోణం నుంచి బాల్యాన్ని, గతాన్ని చూపించే కథలు చాలా పాఠకాదరణ పొందాయి. పచ్చనాకు సాక్షిగా (నామిని), దర్గా మిట్ట కథలు (మొహమ్మద్ ఖదీర్‌బాబు) లాంటి చాలా కథలు ఈ ధోరణిలో కనిపిస్తాయి. ఈ శైలికి ఉండే బలం – పాత్ర మనతో మాట్లాడుతుండటం వల్ల కలిగే సన్నిహితత్వం. కాకపోతే ఈ కథనం కథకుడికి తెలిసిన, కనిపించిన లేదా అనుభవించిన విషయాలను మాత్రమే చెప్పనిస్తుంది. యంగ్ అడల్ట్ కథలకి, జ్ఞాపకాల కథలు (nostalgia, memoirs), సైకలాజికల్ థ్రిల్లర్స్, ఒక వైపు నించి చెప్పే ప్రేమకథలకు ఈ శైలి బాగా సరిపోతుంది. ఇలా కాకుండా రచయిత కేవలం ఒక సాక్షిలా నిలబడి చూసింది చెప్పడం ఇంకో పద్ధతి. “అత్తగారి కథలు – భానుమతి రామకృష్ణ” కథల్లో భానుమతిగారు వుంటారు. కానీ అవి ఆమె కథలు కావు. ఆమె అత్తగారి కథలు. జరుగుతున్నదాన్ని కేవలం ఒక రిపోర్టర్ లాగా నిలబడి చెప్తుందావిడ. ఇవి కాక ఒక వస్తువో, ఆత్మో, జంతువో, చెట్టో చెప్పుకునే కథలు కూడా వున్నాయి.

ఇంకో రకం ఉత్తమ పురుష కథనం ఒక సమూహం మొత్తం చెప్పినట్లు చెప్పడం. ఇది చాలా అరుదు. పిల్లలంతా కలిసి చెప్పిన ఒక కథ. ఒక గూడెంలో వున్న దళితులంతా కలిసి చెప్పిన కథ. సమాధిరాళ్లు చెప్పిన కథ. ఇలా రాయచ్చు.

బహుళ ఉత్తమ పురుష కథనం (Multiple First-Person Narrative)

ఈ పద్ధతిలో కొంచెం చెయ్యి తిరిగిన రచయితలు కథలో రెండు మూడు పాత్రలతో నేను కథలు చెప్పిస్తారు. ప్రతి పాత్రకీ ‘నేను’, ‘నాకు’, ‘నాది’ వంటి సర్వనామాలను ఉపయోగిస్తారు. సాధారణంగా నవలలో ఒక్కొక్క పాత్ర కథనం ఒక్కొక్క అధ్యాయంగా రాస్తారు. ఈ శైలిలో కథలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి. ఒక పాత్ర కథలో ఒక సెక్షన్‌కి హెడ్డింగ్‌లా పెట్టి ఆ పాత్ర కోణం నుంచి కథ చెప్పి, మరో పాత్ర హెడ్డింగ్‌తో మరో కోణంలో కథ చెప్పడం చాలామంది చేస్తుంటారు. ఈ శైలి ఒకే సంఘటనను విభిన్న కోణాలనుంచి పరిశీలించడానికి రచయితకు అవకాశం కల్పిస్తుంది. దాని వల్ల కథలోకి భావోద్వేగ వైరుధ్యాన్ని తీసుకురావచ్చు. కాకపోతే కథకుడు చాలా జాగ్రత్తగా ఒకటి కన్నా ఎక్కువ గొంతులను, ఒకదానికి మరొకదానికి వ్యత్యాసం తెలిసేలా వినిపించాలి. ఇది కొంచెం కష్టమైన పని. విభిన్నమైన స్వరాన్ని ఇవ్వలేకపోయినా, ఏది ఎక్కడ చెప్పాలో అలా చెప్పకపోయినా, అలా మాట్లాడే రెండు పాత్రలు కలిసిన సన్నివేశాలు – పాఠకులను గందరగోళానికి గురిచేస్తాయి. కథ నడిచే వేగానికి ఈ శైలి (సరిగ్గా రాయకపోతే) స్పీడ్ బ్రేకర్ అయ్యే ప్రమాదం ఉంది. డ్రామా కథలు, సంబంధాల మీద ఆధారపడిన నవలలు/కథలు, మల్టిపుల్ నరేటివ్ కథనం సరిపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ కథన శైలిని భలే వాడుకున్నారు అని అనిపించేలా చేసిన నవల – జుపీందర్‌జీత్ సింగ్ రాసిన నవల Butchered For Love (తెలుగు అనువాదం పరువు – ఝాన్సీ పాపుదేసి).

అయితే ఈ రకంగా కథ చెప్పేటప్పుడు కొన్ని పరిధులు వుంటాయి. వాటిని తెలుసుకుంటేనే “నేను కథలు” రాయటం సులువౌతుంది. అవి తెలుసుకోవడానికి ఈ వ్యాసం మొదట్లో ఉన్న కథ వైపు చూడండి. అందులో తప్పులు మీరు కనిపెట్టారు కదా అవే “నేను చేసే తప్పులు.” వాటి గురించి మాట్లాడదాం రండి.

ఈ కథ చెప్తున్నది ఎవరు? ఎవరో ఒక కుటుంబీకుడు. గోపాలం అనుకుందాం. ఈ గోపాలం పాఠకులకి కథ చెప్తున్నాడు. అలా కథ చెప్తున్న గోపాలం తనకి తలియని విషయాలను, తెలిసే అవకాశం లేని విషయాలను కూడా చెప్పేస్తున్నాడు. అవతలివాళ్ల మనసులో ఏముందో, తనకి కనపడని మనుషులు ఏం చేస్తున్నారో గోపాలం చెప్పేస్తున్నాడు. ఇదీ తప్పు.

ఒక రచయిత ఉత్తమ పురుష కథనాన్ని ఎంచుకున్నప్పుడు, ఆ కథను ఎంచుకున్న పాత్ర/పాత్రల కళ్ళు, చెవులు, మనస్సు ఆ మనసులో కలిగే భావోద్వేగాల ద్వారా మాత్రమే కథ చెప్పడానికి కట్టుబడి ఉండాలి. ఆ పరిధి దాటిన ప్రతిసారి ఆ కథకి సంబంధించిన మూలసూత్రాన్ని ధిక్కరించినట్లే.

ఉత్తమ పురుష కథనం అంటే పరిమిత జ్ఞానంతో రాయటం. ఈ విషయం రచయితలు తరచుగా మర్చిపోతుంటారు. అలా మర్చిపోయిన కథకులు ఎనిమిది తప్పులు చేస్తుంటారు. ఇదిగో ఇవీ ఆ ఎనిమిది తప్పులు –

  1. మరొకరు ఏమి ఆలోచిస్తున్నారో చెప్పడం: ఉత్తమ పురుష కథనంలో చాలామంది చేసే తప్పు ఇది. ఇలాంటి కథలు రాస్తున్నప్పుడు మనం ఏం జరుగుతుందో చూడగలం, వినగలం. కానీ అవతలి వ్యక్తి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోలేము. ఈ ఉదాహరణ చూడండి –

తప్పు: “రవికి చాలా కోపం వచ్చింది. మనసులోనే తిట్టుకున్నాదు. అతను ఏమీ మాట్లాడకపోయినా ఆ విషయం నాకు అర్థమైంది.”

ఎలా రాయచ్చు: “రవి దవడలు బిగించాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఆ గదిలో ఉద్రిక్తత నాకు స్పష్టంగా అర్థమైంది.”

  1. కథకుడు లేని సమయంలో జరిగిన సంఘటనలను వర్ణించడం: కథ చెప్తున్న వ్యక్తి అక్కడ లేకపోయినా అక్కడే ఉన్నట్లు జరిగిన సంఘటనలని వర్ణించడం, అక్కడ ఉన్న వేరే పాత్రలు ఏం మాట్లాడుకున్నాయో చెప్పడం.

తప్పు: “నేను నిద్రపోతున్నప్పుడు, నేహా టెర్రస్ మీద ఏడుస్తోంది. ఆమె తన తండ్రి గురించి ఆలోచిస్తోంది.”

ఎలా రాయచ్చు: “మరుసటి రోజు ఉదయం, ఆమె కళ్ళు ఉబ్బి ఉండటం చూశాను. బహుశా రాత్రంతా తన తండ్రిని తలుచుకోని ఏడ్చినట్లుంది.”

  1. భవిష్యత్ సంఘటనలు లేదా ఫలితాలు జరిగినట్లు రాయటం: కథ లీనియర్‌గా అంటే నిన్న, ఈ రోజు, రేపు అన్నట్లు నడుస్తుంటే ఈ రోజు కథలో రేపు జరగబోయేది చెప్పకూడదు. రేపు కూడా జరిగిపోయిన తరువాత ఈ మధ్య ఏం జరిగిందంటే అని మొదలుపెడితే ఈ తప్పు వర్తించదు.

తప్పు: ” ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం సంవత్సరం తరువాత ఫలితం ఇవ్వబోతోంది.”

ఎలా రాయచ్చు: “ఆ క్షణంలో, అంతా బాగానే ఉంటుందని నేను నమ్మాను. ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే, దాని పలితం నాకు త్వరలోనే తెలుస్తుంది అనుకున్నాను. అనుకున్నట్లే సంవత్సరం తరువాత ఆ ఫలితాన్ని అనుభవించాను.”

  1. శారీరక పరిమితులను మర్చిపోవడం: ఉత్తమ పురుష కథకుడు ఒక చోట నిలబడి కళ్ల ముందు కనపడుతున్నదే చెప్పాలి. చూడలేనివి, వినలేనివి రాయకూడదు.

తప్పు: “నాకు విపరీతమైన కోపం వచ్చింది, నా కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.”

అద్దంలో చూస్తుంటే తప్ప, రచయితకి తన కళ్లు ఎర్రబడ్డాయని ఎలా తెలుసు?

ఎలా రాయచ్చు: “నా పిడికిళ్లు నా ప్రమేయం లేకుండా బిగుసుకున్నాయి. పళ్ళు పటపటా కొరికాను”

  1. ప్రతి వాక్యంలో “నేను”ను అతిగా వాడటం: ఈ రకమైన కథనం personalised కథగా అనిపించడానికి వాడాలి కానీ సోత్కర్ష కోసం కాదు.

తప్పు: “నేను తలుపు దగ్గరకు నడిచాను. నెమ్మదిగా దాన్ని తెరిచాను. నేను అక్కడ ఒక మనిషిని చూశాను. నాకు చాలా భయం వేసింది.”

ఎలా రాయచ్చు: “తలుపును తాకగానే అది శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నా కడుపులో భయం చల్లగా ఆవరించింది.”

  1. అంతర్గత సంభాషణతో సమాచారాన్ని కథలోకి దొర్లించడం: నాకు తెలిసిన సమాచారం అంతే చెప్తాను వినండి అంటూ మొత్తన్ని కథలో ఒపేయడం సరికాదు. సాధారణంగా ఈ కథలు రచయిత సొంత కథలే కాబట్టి అతనికి/ ఆమెకి మొత్తం తెలిసి ఉండచ్చు. కానీ పాఠకుడికి ఆ సంగతులు రచయిత చెప్పడం వల్ల తెలియకూడదు. పాఠకుడు తనంతట తానే తెలుసుకునేలా కథ చెప్పాలి.

తప్పు: “నేను 1993లో పుట్టాను. మా నాన్న పోస్ట్ ఆఫీసులో పని చేసేవారు, మా అమ్మ గృహిణి. నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. తెలుగు ఇష్టం. లెక్కలంటే అంటే అసహ్యం.”

ఎలా రాయచ్చు: “వేసవి కాలం భలే ఉండేది. సాయంత్రం అమ్మ ఇంటి పని మొత్తం చేసి, పాతదైనా పొందికగా ఉండే చీర కట్టుకోని, మల్లెపూలు పెట్టుకోని నాన్న కోసం ఎదురు చూసేది. ఆయన పోస్టాఫీసులో చిన్న గుమాస్తా. ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ మామిడి పండ్లు తెచ్చేవారు. అవంటే నాకు భలే ఇష్టం. అన్నం కూడా మానేసి అవే తినేవాడిని. అలా తింటున్న ప్రతిసారి డజన్ కాయలు ఎంత పడిందో చెప్పి, “ఒక కాయ ఖరీదు ఎంతరా?” అని అడిగేవాడు. మామిడి పండు తీపి మొత్తం పులుపుగా మారేది. నాకు లెక్కలంటే భయం. అసహ్యం కూడా. ఒక్కసారైనా ఛందస్సు గురించో, పోతన పద్యం గురించో అడుగుతారేమో అనుకునేవాణ్ణి. కానీ ఒక్కసారి కూడా అడగలేదు.”

  1. అవాస్తవంగా కనిపించే ఆత్మజ్ఞానం: ఏ మనిషీ తన గురించిన పూర్తి ఆత్మజ్ఞానం కలిగి ఉండడు. అందువల్ల తన లోటుపాట్లను, ఆలోచనలో ఉండే తప్పులను పూర్తిగా తెలుసు అన్నట్లు చెప్పడం సరికాదు.

తప్పు: “నేను చాలా తెలివైనదాన్ని. కొంచెం నాటకీయంగా మాట్లాడతాను కానీ నిజానికి నేను చాలా ప్రాక్టికల్. అలా అని ఎమోషన్‌లేదని కాదు. నేను ఒక మనిషిని ప్రేమిస్తే, నేను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు.”

ఎలా రాయచ్చు:”నేను మళ్ళీ అతిగా స్పందిస్తున్నానని నాకు అనిపించింది. కానీ నేను ఆపుకోలేకపోయాను. అతను చెప్తున్న విషయం ప్రాక్టికల్‌గా అసాధ్యం అని అనిపించడం వల్లే నేను అలా రియాక్ట్ అయ్యానేమో. ఎండుకంటే నేను అతనిని ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నదాని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను”

  1. ప్రత్యేకమైన స్వరం లేకపోవడం

ఇది తప్పు కాదు కానీ, కథ నడకకి అడ్డంపడే లక్షణం. ప్రతి ఉత్తమ పురుష కథకుడికి ఒక ప్రత్యేకమైన స్వరం ఉండాలి. చరిత్ర రాసినట్లు వాక్యాలు (ఆరొవ ఉదాహరణ మళ్లీ చూడండి) రాయకూడదు.

“నేను రక్తాన్ని చూసి స్తంభించిపోయాను.”

ఇందులో రచయిత శైలి కనపడటం లేదు.

ఎలా రాయచ్చు:”రక్తం. అంతటా. నేను కదలలేకపోయాను. నా మనస్సు… శూన్యమైపోయింది.”

ఇక్కడ కొంచెం ఆగుదాం. మళ్లీ ఒకసారి ఈ వ్యాసం మొదట్లో ఉన్న కథ చదవండి. ఈ ఎనిమిది రకాలు తప్పులలో ఏవైనా తప్పులు అందులో కనిపిస్తాయేమో చూడండి. ఇంకేదైనా నేను కథని తీసుకోని ఇలాంటి తప్పులు ఏమైనా జరిగాయేమో పరిశీలించండి. మళ్ళీ కలిసినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం.

*

అరిపిరాల సత్యప్రసాద్

1 comment

Leave a Reply to Chandrasekhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కగా వివరిస్తున్నారు. తరువాతి భాగాలకోసం ఎదురు చూస్తున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు