నెల పొడుపు

నా ప్రతీ కథలోనూ మనిషికీ, మనసుకీ, ప్రాణానికీ విలువ ఉంటుంది.

‘‘ఇదిగో…! తడక మీద బట్టలు వేస్తున్నా. తల స్నానం కాగానే వేటికీ తగలకుండా రా! మరిచిపోయి ఆ దేవుడి గదిలోకి కానీ వెళ్లకు’’… అంది శారద తలస్నానం చేస్తున్న కూతురు శిఖర తో…
ఆ పల్లె మొత్తం వెచ్చటి దుప్పటి కప్పుకుని మరీ వణుకుతుంటే.. ఆ తల్లీకూతుళ్లు మాత్రమే తప్పనిసరి స్థితిలో మేలుకున్నారు.

…‘‘శిఖా వినిపించిందా?’’ శిఖర నుంచి సమాధానం రాకపోయేసరికి స్వరం పెంచింది శారద.

మంచూ, చలి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. టైమ్‌ తెల్లవారు జామున మూడు కావస్తోంది. నెత్తినపడ్డ వేడినీళ్లు్ల నేలకు చేరే లోపే చల్లగా అయిపోతున్నాయి.

అరికాళ్లనుంచి పైకి పాకుతున్న చలి అప్పటికే తడిసిన తన తనువుని వణికిస్తుంటే… చిన్న స్వరంతో

‘‘హా.. సరే అమ్మా!’’ వినిపించిన మాటకు బదులిచ్చి మళ్లీ ఆలోచనల్లో పడిపోతూ…

‘‘ఈ రోజు ఆఫీస్‌కి ఎలా సెలవు పెట్టాలి..? ఏం రీజన్‌ చెప్పాలి..? దయాకర్‌ సార్‌ ఒప్పుకుంటాడో లేదో..? జ్వరమని చెప్పనా..? లాస్ట్‌ మంత్‌ అదే చెప్పాను..!?  పోనీ పర్సనల్‌ ప్రాబ్లమ్‌ అని చెబితే..?!

అమ్మో… అర్థమైనా అర్థం కానట్లు రీజన్‌ అడుగుతాడు. ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి?… ప్రతి నెలా ఇదో సమస్యైపోయింది…’’

అప్పటికే ఖాళీ అయిన బకెట్‌లో మగ్గుతో నీళ్లని తోడే ప్రయత్నాన్ని యాంత్రికంగానే చేస్తూ ప్రస్తుతానికి అనివార్యంగా తిరిగొచ్చింది శిఖర.

బారెడు పొడవున్న తల వెంట్రుకల కొసల నుంచి జారిపడుతున్న నీటి చుక్కలు స్నానం పూర్తై చాలా సేపయ్యిందంటున్నాయి.  అప్పటికే సగమారిన వొంటిని తుడుచుకోవడానికి వేగంగా టవల్‌ అందుకుంది శిఖర.

అదో చిన్న కుగ్రామం. పదేళ్లు దాటిన ఆడపిల్లలు మిడ్డీలు వేసుకుని బయట తిరక్కూడదనేది ఆ ఊరి శాసనం. దాని బట్టి అర్థం చేసుకోవచ్చు నియమాలనేవి ఏ స్థాయిలో ఉంటాయో…!!

ఉదయం ఎనిమిదిన్నర కావస్తోంది. టెన్షన్‌ పెరిగిపోతోంది.

‘‘సెలవు కోసం ఏం రీజన్‌ చెప్పాలి..!?’’ స్నానం చేస్తున్నప్పటి నుంచీ అదే ఆలోచన, అదే ప్రశ్న.

నేల మీద కూర్చున్న శిఖర… మోకాళ్లపైన తల పెట్టుకుని.. కాళ్ల చుట్టూ చేతులు కట్టుకుని కూర్చుంది. నొప్పి తగ్గించుకోవడానికి అదో ప్రయత్నం.
‘‘ఇదిగో..! కొద్దిగా అన్నం తిను శిఖా!’’ చేతిలోని ప్లేట్‌ శిఖర ముందు పెట్టింది శారద.
‘‘ఇప్పుడేం వద్దులేమ్మా.. తినాలని లేదు!’’ అంది శిఖర కాళ్లను చుట్టిన చేతులను మరింత బిగుస్తూ…
‘‘యే పిల్లా! పొద్దున్నే జుట్టు విరబోసుకుని వీధిలో అలా కుచ్చున్నావ్‌?’’ శిఖరను ఉద్దేశించి అడిగింది పక్కింటి రాధమ్మ.
‘‘రా అక్కా! కూర్చో..! ఏముందీ.. నెల నెల వచ్చే సంబడమే!’’ కూతురినడిగిన ప్రశ్నకి తనే బదులిస్తూ నవ్వింది శారద. శిఖర కూడా రాధమ్మని చూసి పలకరింపుగా నవ్వుతూ దూరంగా జరిగి.. ‘‘కుర్చో పెద్దమ్మా!’’ అంది.
‘‘హూ.. మాయిదారి సంబడంలే తల్లీ! ఇదిగో రేపు పన్నెండుకి ఇంట్లో పూజెట్టుకుందామంటే మా పిల్లకి వేళ! ఏమవుతుందో ఏమో!?’’ అంది రాధమ్మ మెట్లపైన కూర్చుంటూ..
‘‘అయ్యో అవునా! ఎప్పుడూ అంతే.. వేళ చూసుకుని వస్తుందక్కా!’’…అంటూ రాధమ్మ పక్కకి వచ్చి కూర్చున్న శారద… ‘‘తినెయ్‌ తల్లీ! ఈ సమయంలో ఏదోటి కడుపులో వేసుకోవాలి. పైగా ఇది రాత్రన్నం. కూర వేసేశాను కదమ్మా.. మధ్యాహ్నానికి పాడైపోతుంది. రెండు ముద్దలు నోట్లో వేసుకోరా’’ అంటూ కూతుర్ని బ్రతిమాలింది ప్రేమగా…
‘‘తిను పిల్లా! ఇలాంటప్పుడే బాగా.. తినాలి!’’ అంటూ రాధమ్మ కూడా మాట కలపడంతో ముందు పెట్టిన కంచాన్ని అయిష్టంగానే అందుకుంది శిఖర.
తన కొత్త కోడలు గురించి, ముసలి అత్తగారి గురించి, పక్క ఫోర్షన్‌లో ఉండే తోటికోడలు గురించి, ఊరిలో మగవాళ్లు తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ గురించీ చాడీలు చెప్పుకుని… చివరికి నాలుగు చెంచాల టీ–పొడి అప్పుగా తీసుకుని కదిలింది రాధమ్మ.
అయిష్టంగానే మెతుకు మెతుకు తింటున్న శిఖరని చూస్తూ… ‘‘ఆ తిన్న కంచం అక్కడా ఇక్కడా వదిలెయ్యకమ్మా. నువ్వే కడగాలి తెలుసుగా?!’’ అంది శారద లోనికి వెళ్తూ.
‘‘హా.. అలాగేమ్మా! కడిగి బండ మీద దబ్బిలిస్తాలే!’’
***

‘‘హలో.. సార్‌…! నేను ‘శిఖర’ని…’’ మెల్లగా అంది.
‘‘హా.. చెప్పు శిఖరా..!?’’ అన్నాడు దయాకర్‌ సార్‌.
‘‘ఈ రోజు… నాకు కొంచెం హెల్త్‌ బాగుండలేదు… లీవ్‌….తీసు..కుం..టాను సార్‌!’’ నసిగింది.
‘‘అనుకున్నాను! నువ్వు కాల్‌ చేశావంటేనే నాకు డౌట్‌ వచ్చింది. మరి ఈ రోజు నీ వర్క్‌ ఎవడు చేస్తాడు??!’’
‘‘సార్‌ అది కాదు. ఏమాత్రం ఓపికున్నా వచ్చేదాన్ని సార్‌… కానీ…!’’
‘‘అయితే రా.. ఓపిక చేసుకుని రా!’’ ఫోన్‌ కట్‌ చేసెయ్యడానికి సిద్ధమయ్యాడు దయాకర్‌.
‘‘సార్‌… సార్‌.. ప్లీజ్‌ సార్‌!’’
‘‘శిఖరా..! నో ఆర్గ్యుమెంట్స్‌..! వస్తేరా. లేదంటే రేపటి నుంచి రావక్కర్లేదు!’’

ఫోన్‌ కట్‌ అయ్యింది.
‘అమ్మో..! రెండు నెలల జీతం రావాలి. మానెయ్యి అనగానే పౌరుషంగా మానెయ్యలేను. ఇప్పటికే నా జీతం డబ్బుల కోసం అమ్మ చాలా ఎదురు చూస్తోంది. ఇప్పుడు నేను ఆఫీస్‌ మానేస్తే… చాలా కష్టమైపోతుంది’…‘‘అమ్మా..! ఆఫీస్‌కి వెళ్లాలి. ఆ దేవుడి గదిలో ఉన్న కబోర్డ్ లోంచి ఏదొక డ్రెస్‌ తెచ్చి దండెంపైన వెయ్యమ్మా! మార్చుకుంటాను’’ అరిచింది శిఖర.

తనది బతికి చెడ్డ కుటుంబం. శిఖరకి పదేళ్లు వచ్చేనాటికే భోగభాగ్యాలన్నీ పోయాయి. కుటుంబ భారం పెరిగిపోవడంతో ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పని చేయడం మొదలుపెట్టిన తండ్రి వెంకట్రావ్‌… ఎంతోమంది ఆడపిల్లకి చదువెందుకని వారించినా… శిఖరని బాగా చదివించాలని ఆశపడ్డాడు. కానీ శిఖర డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగానే యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ రోజు నుంచి చదువు ఆపేసి కుటుంబ భారాన్ని అందిపుచ్చుకుంది శిఖర. నాలుగేళ్లుగా వచ్చిన జీతంతోనే ఇద్దరి తమ్ముళ్ల చదువులు, వాళ్ల హాస్టల్‌ ఫీజులు, అప్పులకు వడ్డీలు పోగా నెలలోని చివరి రోజులు కష్టంగానే సాగుతుంటాయి.

స్కూటీ స్టార్ట్‌ అయ్యింది. కడుపులో పేగులు, కాళ్ల నరాలు నిలువెల్లా కుంగదీస్తూన్నా స్కూటీ మీద ఠీవిగా కూర్చుంది శిఖర.
‘‘శిఖా…! ఆగాగు!’’లోపలి నుంచి పరుగున వచ్చింది శారద.
‘‘ఏంటమ్మా?’
‘‘చెప్పడం మరిచిపోయాను. నిన్న డోక్రా మీటింగ్‌కి వెళ్తుంటే సీతాదేవిగారు నన్ను ఆపి అరిసెలు చెయ్యడం వచ్చా అని అడిగారు. నాకు రాదుగానీ మా తోటికోడలు రమకి వచ్చ‌ని చెప్పాను. అయితే ఈ రోజు పదకొండయ్యేసరికి రమని తీసుకుని ఇంటికిరా అన్నారు. అదే విషయం మీ పిన్నికి చెబితే… ‘అమ్మో… మీ మరిదికి తెలిస్తే ఊరుకుంటాడా? కొంపలంపడ పెత్తనాలేంటే అని దుడ్డుకర్రతో ఆ కొంపల చుట్టే పరుగులు పెట్టించడూ?!’ అంటూ భయపడింది. నాకూ నిజమే అనిపించింది. సీతాదేవిగారికి మొహమాటం లేకుండా రామనిచెబితే బాగుండదు కానీ… ‘అరిసెలు చెయ్యడానికి మా పిన్నిని రమ్మన్నారట కదండీ..! కానీ మా పిన్ని ఈ మూడు రోజులు ఇంట్లోకి రాకూడదంటండి’ అని అబద్ధం చెప్పెయ్య్‌. అర్థం చేసుకుంటారు’’ అంది శారద.

‘‘ముందు చెప్పొచ్చుగామ్మా!? కాస్త త్వరగా బయలుదేరేదాన్ని. లేట్‌ అవుతోంది నాకు. సరేలే చెబుతాను’’ స్కూటీ స్లోగా ముందుకు కదిలింది.
‘‘దారిలోనేగా తల్లి! నా బంగారం కదూ! మరిచిపోకు!’’ మాటలతోనే కాస్త బుజ్జగించింది శారద.
‘‘హూ… సరే చెప్పే వెళ్తాను. నువ్వు ఆలోచించకులే! లోపలికి వెళ్లుమ్మా! బాయ్‌!!’’ బుంగమూతితో స్కూటీ వేగాన్ని పెంచింది శిఖర.

***
స్కూటీ పక్కకు పెట్టుకుని సీతాదేవి(మిస్సెస్‌ సూర్రావులు)గారి ఇంటి గేట్‌ తీసిన శిఖర… ‘నాన్నమ్మగారూ.. నాన్నమ్మగారూ..’ అని పిలిస్తూ నూతి పళ్లెం దగ్గర వేప పుల్లతో పళ్లు తోముకుంటున్న సూర్రావులు తాతయ్యను చూసి ఆగింది.

సూర్రావులు ఆ ఊరి మాజీ ప్రెసిడెంట్‌. అతడికి తతంగం అని మరో పేరుంది. మనిషి కనిపిస్తే చాలు.. ఆ మనిషి మూడ్‌తో, మాటతో సంబంధంలేదు. ఏదోటి మాట్లాడుతూనే ఉంటాడు సూర్రావులు. అందుకే అతడికి తతంగం అని పేరు పెట్టారంతా.
ఈలోపే సీతాదేవి బయటికి వచ్చి ‘‘ఏం పిల్లా?’’ అనడంతో… శారద చెప్పమన్నట్లే చెప్పి వెనుతిరిగింది.

ఇంతలో.. ‘‘ఇదిగో పిల్లా! ఆగు ఇప్పుడే వస్తాను’’లోనికి వెళ్లింది సీతాదేవి.

‘అబ్బా! లేట్‌ అయిపోతుందే..’ అనుకుంటూనే వెళ్లిపోతే బాగుండదని అక్కడే ఆగింది శిఖర.
‘‘ఏమ్మా! స్కూల్‌ టీచర్‌ వెంకట్రావ్‌ కూతురువేగా నువ్వూ?!’’ కాస్త పరకాయింపుగా అడిగాడు తతంగం వేపపుల్ల నములుతూ!..
‘‘హా.. అవునండి!’’
‘‘ఏం చదవుతున్నావేంటీ….?’’ మళ్లీ ప్రశ్న.
‘‘చదువు కాదండి. జాబ్‌ చేస్తున్నాను’’
‘‘ఓహో.. ఎక్కడా..?’’
‘‘కడలితూరులోని దయా ఐస్‌ ఫ్యాక్టరీ ఉంది కదండి. అందులో చేస్తున్నాను.’’
‘‘అబ్బా.. బాగా దూరం. ప్రయాణం గంటపైనే పట్టేస్తుందేమో..?’’
కాగితానికి చుట్టిన రవ్వలడ్డూను కవర్‌లో వేసి… బయటికి తెచ్చిన సీతాదేవి…

‘‘ఇదిగో పిల్లా.. నోట్లో వేసుకో.’’ అంటూ శిఖర చేతికి అందించింది. కవర్‌ అందుకున్న శిఖర కాస్త మొహమాటంగా నవ్వింది.
‘‘మీ ఫ్యాక్టరీ ఓనర్‌ పేరు దయాకరే కదా..?’’
‘‘అవునండీ’’
‘‘వాడు ఇప్పటికే మూడో.. నాలుగో.. పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెద్ద పెళ్లానిది మన  ఊరు పక్కనే గడపలంక. మన ఊరు హైస్కూల్‌లోనే చదువుకుందా పిల్ల. పాపం వదిలేశాడంట. అప్పుడే వదిలేసి నాలుగేళ్లు కావస్తుంది. అయినా ఆడదన్నాక అణిగీమనిగీ ఉండాలి. లేదంటే అంతేమరీ…’’…
శిఖర వాచ్‌లో టైమ్‌ చూసుకుంటూ  ఇబ్బందిగా నవ్వింది.

…‘‘హా… అవును… ఇంతకీ నీ జీతమెంతేంటీ..?’’ నోట్లో వేపపుల్ల తీసి పక్కకి ఉమ్మూతూ అడిగాడు సావదానంగా తతంగం..
‘‘మీరు టిఫిన్‌ చేద్దురుగానీ త్వరగా రండీ!’’ అని భర్తని పిలిచిన సీతాదేవి… ‘నువ్వు వెళ్లమ్మా! ఆ మనిషి అలానే మాట్లాడుతుంటారు’ అంటూ సైగ చేసి చెప్పింది చిన్న స్వరంతో.

దాంతో స్కూటీ వైపు నడుస్తూనే ‘‘ఏడువేలండి!’’ అని బదులిచ్చింది శిఖర.

దారిలో కొన్ని చూపులు అసౌకర్యంగా ఆడతనాన్ని వెతుకుతుంటే… మరికొన్ని వెకిలి చేష్టలు వీలలేస్తూ ఆమెను ఉద్దేశించాయి. అయినా తనలో పెద్దగా మార్పేం లేదు. నెలనెలా నొప్పిలానే రోజూ ఈ రొప్పి తప్పదనే ఓ వెర్రి నవ్వు తనని గట్టిగానే సముదాయించింది కాబోలు స్కూటీ వేగం పెరిగింది.

‘‘ఏమే శిఖా ? లేట్‌ అయ్యింది..??  వెళ్లు.. వెళ్లు.. ఆ దయాకర్‌గాడికి కనిపించు. ఇందాకట్నుంచి చిందులేస్తున్నాడు!’’ చాలా నెమ్మదిగా చెప్పింది స్నేహితురాలు రజిత.

వెంటనే బ్యాగ్‌ పక్కన పడేసి బాస్‌ రూమ్‌లోకి పరుగుతీసింది శిఖర.

‘‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌!’’ వణుకుతున్న స్వరంతో

‘‘ఆ… నిన్న ఎన్ని లోడ్స్‌ పోయాయో నోట్‌ చెయ్యలేదు. ఈ రోజు సెలవు కావాలని పొద్దు పొద్దున్నే ఫోన్‌ చేసేశావ్‌. అయినా మీకెందుకమ్మా ఉద్యోగాలు? ఎందుకూ ఉపయోగపడరూ! పైగా మీకు రికమెండేషన్‌లు..’’ గిర్రున తిరిగే కుర్చీలో వెనక్కంటూ జారబడి నల్లటి గుడ్లను పైకి లేపి గుర్రున చూస్తూ అన్నాడు దయాకర్‌.
‘‘సార్‌… నిన్నటి లెక్కలన్నీ రాజవర్మ సార్‌కి అప్పగించే వెళ్లాను సార్‌. ఆయన ఇంకా ఆఫీస్‌కి రాలేదనుకుంటాను’’
‘‘ఆ.. మీకు పనేముంది? ఎవడు ఆఫీస్‌కి వచ్చాడు? ఎవడు వెళ్లిపోయాడూ? ఇవేగా.. మీ ఆడవాళ్లకి ఉండే ఆరాలు, చాడీలు?’’
‘‘అదికాదు సార్‌….!’’
‘‘అమ్మాతల్లీ.. వెళ్లు… ఇప్పటికే లేట్‌గా వచ్చావ్‌! వెళ్లి నిన్నటి లెక్కలు తీసుకునిరా!’’
***

‘‘ఏంటే ఈ దయాకర్‌ సార్‌? ఎప్పుడూ ఇంతేనా! ఆడవాళ్లని గౌరవంగానే చూడరు. పాపం వాళ్ల ఆవిడ ఎలా వేగుతుందో..!?’’ రజిత పక్కనే కుర్చుంటూ అంది శిఖర.
‘‘ఇంకెక్కడి వాళ్లావిడా..? వదిలేసి ఎప్పుడో పోయిందట. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమట మనోడు. మొన్న స్వరాజ్‌ సార్‌ చెప్పారు వాడి స్టోరీ మొత్తం’’ నవ్వింది రజిత.
‘‘అవునా..!? ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటే… ఎవరో ఒకరిది తప్పై ఉండొచ్చు. కానీ ఒక్కరితోనే అంతమందికీ విభేదాలొస్తున్నాయంటే… ఇప్పటికైనా అర్థం చేసుకోవాలిగా అతను…!? పెళ్లి వెనక పెళ్లి చేసుకుని తెలిసి తెలిసి ఇతరుల జీవితాలని నాశనం చెయ్యడం ఎందుకో..? ఇలాంటివాళ్లని డబ్బే చెల్లుబాటు చేస్తుందిలే…!’’
‘‘హూ… అదీ నిజమే… అదంతా సరేగానీ ఏంటి ముఖం డల్‌గా ఉంది?’’
‘‘అబ్బ.. అదేం అడుగుతావ్‌లే! తెల్లవారుజామునే నెల పండగొచ్చింది! సెలవడిగితే నో అన్నారు సార్‌. ముక్కుతూ మూలుగుతూ బయలుదేరి వచ్చాను’’
‘‘అయ్యో అవునా!’’
‘‘హూ… అవునే..! ఎప్పుడు ఆఫీస్‌ అవుతుందో.. ఎప్పుడు ఇంటికి వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలో!?’’
‘‘ఏముంది లెక్కపెట్టుకో.. మన దయాకర్‌ గాడి గాడిద కూతలు వెయ్యదాటాయంటే టైమ్‌ అయిపోయినట్లే!’’ అంది రజిత నవ్వుతూ…

రజిత చెప్పినట్లే దయాకర్‌ 1001 తిట్లు పూర్తి కాగానే ఆఫీస్‌ నుంచి బయటపడ్డారు ఇద్దరూ. (తను వెళ్లే రూట్‌ కాకపోయినా.. అప్పుడప్పుడూ రజితని బస్టాప్‌ దగ్గర దింపి యూ టర్న్‌ తీసుకుకోవడం శిఖరకు తప్పనిపని. ఆ అలవాటుతోనే రజిత కూడా స్కూటీ పార్కింగ్‌ దగ్గరకి వచ్చింది శిఖరతో పాటు)
‘‘అయ్యో దేవుడా! టైర్‌ పంచర్‌ అయిందే..! వెనక టైర్‌ మొత్తం గాలి పోయింది. నిన్నే కొట్టించాను..’’ నిర్థారణగా అంది శిఖర.
‘‘అయ్యో..! ఇప్పుడెలానే? అసలే టైమ్‌ ఎనిమిదిన్నరయ్యింది…’’ జాలిగా చూస్తూ అంది రజిత.

శిఖర ముఖం తెల్లబోయింది. ఏడుపొక్కటే తక్కువ. ఉదయం నుంచి విపరీతమైన కడుపు నొప్పి. బాడీలో ఏ పార్టూ బాగున్నట్లే అనిపించడంలేదు. నాలుగు దాటినప్పటినుంచి నీరసంతో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూనే ఉంది. తీరా ఇంటికి వెళ్దామంటే టైర్‌ పంచర్‌ కావడంతో ఉన్న ఓపిక కూడా పోయినట్లుగా ముఖం వేలాడేసింది.
…‘‘సరే నువ్వు ఆటోకి వెళ్లు… రేపొచ్చాక పంచర్‌ సంగతి చూద్దాం! నేను స్వరాజ్‌ సార్‌కి కాల్‌ చేస్తా. ఆయన ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నాడుగా. నన్ను బస్టాప్‌ దగ్గర డ్రాప్‌ చెయ్యమని అడుగుతాను.’’ అంది రజిత మళ్లీ తనే మాట్లాడుతూ.
‘‘అది కాదే. నాకు పీరియడ్స్‌ కదా… ఆటోలో అంటే… అంతమందికి తగులుతూ వెళ్లడమంటే….’’
‘‘ఆ… నువ్వూ నీ ఛాదస్తం. ఆపవే బాబు.. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకోలేదూ..!? ఇంటికి వెళ్లి.. ఆ చల్లని నీళ్లతో నేను స్నానం చేస్తాననుకుంటున్నావా..? అంతలేదు. పాపం మా పిచ్చి అమ్మ మాత్రం వెళ్లగానే రోజూ పసుపు నీళ్లు జల్లుతుంది. బయటి మైల లోనికి రావద్దని. అయినా ఏ కాలంలో ఉన్నావే నువ్వు..? పోనీ ఓ పని చేస్తావా?’’
‘‘ఏంటది?’’
‘‘ఈ నైట్‌కి మా ఇంటికి వచ్చెయ్యి. పీరియడ్స్‌ సంగతి మరిచిపో. నేను మా అమ్మకి చెప్పను. నువ్వూ చెప్పకు. ఇద్దరి మీద కాసిన్ని పసుపు నీళ్లు జల్లుతుంది. మంచిగా మంచం మీదే నాతో పాటు పడుకుందూగానీ… రేపు ఇద్దరం కలిసి ఆఫీస్‌కి వచ్చేద్దాం. ఆంటీతో నేను మాట్లాడతాను.’’

‘నైట్‌కి మా ఇంటికి వచ్చెయ్‌’ అని రజిత మొదలుపెట్టిన దగ్గర నుంచి తల అడ్డంగా ఊపుతున్న శిఖర… ‘‘ఆపవే! తెలిసి తెలిసి తప్పు చెయ్యమంటున్నావ్‌. నా గురించి తెలిసే… ఇదంతా చెబుతున్నావా?’’ విసుగ్గా అంది స్కూటీని ఆసరగా చేసుకుని జారబడుతూ.

‘‘అరే శిఖా..! ఒకప్పటి రోజులు వేరే. అప్పట్లో రక్తస్రావాన్ని ఆపేందుకు తగిన మార్గాలు ఉండేవి కావు. అందుకే ఇష్టమొచ్చినట్లు తిరగకుండా ఓ మూల కూర్చోమనేవారు. ఎవరినీ ముట్టుకోవద్దనేవారు. తిరిగిన ప్రదేశాన్ని శుభ్రం చెయ్యించేవారు. తిన్న పాత్రలను కడిగించేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలా శుభ్రతను పాటించాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తెలుస్తున్నాయి. చదువుకున్నావ్‌. అన్నీ తెలుసు! కానీ ఎందుకిలా..?’’

‘‘ఎందుకంటే… మారింది – మారడంలో తప్పులేదనే నీ నమ్మకం ఎంత గొప్పదో.. మారలేదు – మారితే అరిష్టం అనుకునే వాళ్ల నమ్మకం కూడా అంతే గొప్పది. వాళ్ల నమ్మకాన్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ… వాళ్లకి తెలియకుండా వాళ్ల నమ్మకాలకి కళంకాన్ని అంటగట్టకూడదనేది నా నియమం.’’

‘‘నువ్వూ నీ నియమాలూ… మారవా నువ్వూ? కాస్త చదువుకున్నదానిలా ఆలోచించు’’

‘ఏమో.. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. ఏ రోజులైనా… ప్రస్తుతానికి అనుగుణంగా నడవటమే నాకు తెలుసు. అయినా నలుగురూ వేలెత్తి చూపే పనిని చేసి ఏం సాధిస్తాం? నువ్వు చెప్పిన లాజిక్స్‌ అన్నీ నాకు న్యాయమనిపిస్తున్నాయంటే… ఆ దేవుడైనా క్షమిస్తాడు కానీ, పదిమంది కలిసి నమ్మే నమ్మకాన్ని కాదంటే ఈ సమాజం ఎప్పటికీ క్షమించదు’’

‘‘మొత్తానికి నువ్వు పట్టిన కుందేళుకి మూడే కాళ్లంటావ్‌?!’’

ఒక్క క్షణం మౌనంగా ఉన్న శిఖర మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది.

 

‘‘నువ్వే అంటున్నావుగా కాలం మారిందని. ఆనాటి పద్దతులు ఇన్నాళ్లకి చాలా మారాయి. మన తర్వాత తరానికి ఈ పద్దతులన్నీ మరింత మారొచ్చేమో. గడిచే కాలమే ఏ మార్పుకైనా సహజత్వాన్ని తెచ్చిపెడుతుంది. మంచైనా చెడైనా అసహజంగా మార్పులు తేవాలనుకున్నవాళ్లని ఈ సమాజం వెలివేస్తుందని నీకు తెలియదా..?’’

‘‘చాలా సిల్లీగా ఉంది. ఓ మారు మూల గ్రామంలో ఉండే నువ్వు బావిలో కప్పలాగే ఉంటానంటావ్‌. నీ ఊరుని దాటి.. నీ చుట్టూ ఉన్న మనుషులని దాటి చూడు. ప్రపంచం కనిపిస్తుంది. నీ పిచ్చి నియమాలు ఈ నాలుగు ఊర్లకే పరిమితం. అయినా ఇప్పుడు సమస్య మంచా చెడూ అని కాదు. మాటకు మాట సమాధానమూ కాదు. ఆడపిల్లలం క్షేమంగా ఇంటికి వెళ్లడం ముఖ్యం. నువ్వు చెప్పే మంచీ చేడూ తూచా తప్పకుండా పాటించే నీలాంటి వాళ్లతో పాటూ… అందుకు విరుద్దమైన సమాజం కూడా మన చుట్టు ఉందని గుర్తు పెట్టుకో. మొండిగా చెయ్యకు. నా మాట విని ఆటో స్టాండ్‌కి వెళ్లి ఆటో ఎక్కు. ఒక్కసారి మీ అమ్మకి కాల్‌ చేసి అడుగు. అన్ని నియమాలు పాటించే ఆవిడ కూడా ‘ఎలాగోలా ఇంటికి రా తల్లి’ అనే చెబుతుంది.’’

ఇంతలో శారద నుంచి ఫోన్‌ రానేవచ్చింది.

‘‘ఏ తల్లీ బయలుదేరావా? నొప్పి కొంచెమైనా తగ్గిందా?’’ అవతల శారద.
‘‘మ్మా… అది… స్కూటీ ట్రబులిచ్చింది…’’
‘‘అయ్యో అవునా? అయితే ఆటోకి వచ్చెయ్యి తల్లి! హా… జాగ్రత్త నలుగురున్న ఆటోనే ఎక్కు! తొమ్మిదైపోతుంది. ఖాళీ ఆటో గానీ ఎక్కకు మంచిది కాదు. ఊరు దగ్గరకు రాగానే ఫోన్‌ చెయ్యి. నువ్వు దిగే దగ్గరకు నేను వస్తాను. ఏంటో నాకు చాలా కంగారుగా, భయంగా ఉంది శిఖా!’’ ఆమె మాటల్లో నిస్సహాయత.
‘‘అయ్యో అమ్మా! కంగారు పడకు. నేను జాగ్రత్తగానే వచ్చేస్తానులే!’’ సముదాయింపుగా చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది శిఖర.
‘‘ఎలాగోలా రమ్మందా? లేక నియమ నిబంధలను దాటితే చంపేస్తానందా?’’ వెటకారం ధ్వనించింది రజిత ప్రశ్నలో. మౌనమే శిఖర సమాధానమైంది.
‘‘శిఖా..! మనిషి కోసం కట్టుబాట్లు పుట్టాయి కానీ కట్టుబాట్లకోసం మనిషి పుట్టలేదు. ఏం ఆలోచించకు. బయలుదేరు. నేను స్వరాజ్‌ సార్‌కి మెసేజ్‌ చేశాను. ఫైవ్‌ మినిట్స్‌లో వస్తా రిసెప్షన్‌లో ఉండమన్నాడు. నేను ఆయనతో వెళ్తాను. యు గో. బాయ్‌’’ శిఖర మరో మాట మాట్లాడే వీలు లేకుండా ముందుకు కదిలింది రజిత.

ఆఫీస్‌ నుంచి ఆటోస్టాండ్‌కి నడిచే సరికే శిఖరకు బాగా నీరసం వచ్చేసింది. మధ్యాహ్నం సరిగా తినకపోవడంతో తల తిరగడం మళ్లీ మొదలైంది. ఆటో స్టాండ్‌లో ఆటోలేం కనిపించడంలేదు. ఆటో కోసం ఎదురు చూసే  చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన జనాలు మాత్రం చాలామందే ఉన్నారు. టైమ్‌ చూసుకుందామంటే బ్యాటరీ డౌన్‌ అయిపోయి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది.

‘‘ పైడేరులంక…  పైడేరులంక…..’’ అరుపు వినిపించగానే వయా ప్రయాణికులంతా ఎగబడ్డారు. శిఖర కూడా కష్టపడి ఆ ఆటోలో కూర్చుంది.
‘‘ఏరా…! కర్ణా..!? నువ్వు రావట్లేదా మీటింగ్‌కీ..?’’ శిఖర ఎక్కిన ఆటో డ్రైవర్‌ని పక్కనే ఎదురుగా ఉన్న ఖాళీ ఆటో డ్రైవర్‌ అడిగాడు.
‘‘ఎక్కడికిరా?’’
‘‘అదే..రా…! మన కిరణ్‌గాడు లేడూ..!? వాడిని ఎండ్రాలకోట కానిస్టేబుల్‌ తల బద్దల కొట్టాడట. మన ఆటో డ్రైవర్లంతా రేపు బంద్‌ చేద్దామని.. ప్రసాద్‌ బాబాయ్‌ ఇంట్లో మీటింగ్‌ పెట్టారు. అక్కడికే..!? ఇంకో అరగంటలో మీటింగ్‌..!?’’ చెప్పుకొచ్చాడు ఆ ఆటో డ్రైవర్‌.
‘‘అవునా! నాదాకా రాలేదురా ఈ విషయం! సరేలే! నేనూ వస్తాను’’ అని వాడికి సమాధానమిచ్చి.. ఆటో ఎక్కిన వాళ్లందరినీ దిగిపోమనడంతో… విసుగ్గా దిగారంతా శిఖరతో సహా.
శిఖరకి క్షణమొక యుగంగా సాగుతోంది. ఎప్పుడు ఇంటికి వెళ్లి పడిపోతానా? అన్నట్లుగా ఉంది తన పరిస్థితి.
ఆ తర్వాత రెండు మూడు ఆటోలు వచ్చాయి. కానీ తోపులాటలో శిఖర వెనకబడిపోయింది.
కాసేపటికి ‘‘పైడేరులంక…  పైడేరులంక…..’’ నిండుగా ఉన్న ఓ ఆటో శిఖర ముందు ఆగింది. అప్పటికే ముగ్గురు ఆడవాళ్లు వెనుక సీట్లో కూర్చుని ఉన్నారు. డ్రైవర్‌ పక్కన అటు ఇద్దరూ.. ఇటు ఇద్దరూ.. మగవాళ్లు కూర్చోవడంతో డ్రైవర్‌ మాట తప్ప మనిషి కనిపించడంలేదు. ముందుకూ వెనక్కీ కూర్చుని ఆ మూగ్గురు ఆడవాళ్లు.. శిఖరకు కాస్త ప్లేస్‌ ఇచ్చారు. తల తిరగడంతో కాసేపటికే ఇనుప ఊసకు తల వాల్చేసింది శిఖర.
చీకటి దారుల్లో… చల్లటి గాలులను చీల్చుకుంటూ ఆటో వేగంగా కదులుతోంది. మధ్య మధ్యలో చాలామంది దిగుతున్నారు. ఎక్కుతున్నారు. శిఖరకు మాత్రం స్పహలో లేనంతగా కళ్లు తిరుగుతున్నాయి. కాసింత తేరుకున్నా… మళ్లీ కళ్లు మూతలు పడుతున్నాయి. ఎక్కేవారికి దిగేవారికి చోటి ఇస్తోంది కానీ.. చుట్టూ పరిస్థితులేంటో.. దిగేచోటు ఇంకెంత దూరం ఉందో తనకేం తెలియట్లేదు. ఎవరూ తన పరిస్థితిని గమనించట్లేదు. తను దిగాల్సింది పైడేరులంక(లాస్ట్‌స్టేజ్‌) కావడంతో కాస్త ధైర్యంగా కళ్లు మూసుకుంటోంది. మనుషులు దిగుతున్న ప్రతిసారీ లోనికి జరుగుతూ ఎక్కేవాళ్లకి చోటిస్తోంది. ఎంత తెరవాలని ప్రయత్నిస్తున్నా కళ్లు సహకరించట్లేదు. ఎప్పుడో కానీ తనకలా అయ్యిందే లేదు.

‘ఆటో దిగిన తర్వాత ఇంటికి ఎలా నడవగలను?? అయినా ఈ పాటికి అమ్మ నాకోసం ఆ రోడ్డు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందేమో!’ ఇలా.. ఆలోచనల వేగం మదిని కలవరపెడుతున్నా… కళ్లు మాత్రం తెరుచుకోవట్లేదు. కాసేపటికి ఆటో స్లో అవుతూ ఆగినట్లు అనిపించింది.
‘‘స్వామీ…! ఓ ఇరవై రూపాయల అరటిపండ్లు ఇవ్వండి స్వామీ?’’ అన్న స్వరం శిఖరకు స్పష్టంగా వినిపిస్తోంది.
‘‘డజను ముప్ఫై అయిదే స్వామీ. డజన్‌ ఇచ్చెయ్యమంటారా?’’ అన్నాడు పండ్లు అమ్ముకునే వ్యక్తి.

‘‘వద్దులే స్వామీ..! ఇరవైకి ఇవ్వండి చాలు’’ అంటూ జేబులోంచి డబ్బులు తీస్తున్న ఆటో డ్రైవర్‌ని స్పష్టంగా చూసే ప్రయత్నం చేసింది శిఖర. అప్పటికి ఆటోలో శిఖర ఒక్కర్తే ఉంది.

అరటిపండ్ల బండి మీద ఉన్న చిన్న లైట్‌ వెలుగులో ఆటో డ్రైవర్‌ని చూడగానే కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇనుప ఊసకు వాల్చిన తల నిటారుగా పెట్టి మరీ చూసింది.

‘అయ్యో! ఆటో డ్రైవర్‌ అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తా!?’ శిఖర షాక్‌ అయ్యింది. బ్యాగ్‌లోని వాటర్‌ బాటిల్‌ అందుకుని రెండు గుటకలు వేసింది.

శిఖర ఆ షాక్‌లోంచి బయటికొచ్చేలోపే అరటిపండ్లు అందుకుని ఆటో స్టార్ట్‌ చేశాడు స్వామి.
‘‘చిట్టి తల్లీ..! జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో.. తప్పులు రెండురకాలు. ఒకటి తెలిసి చేసేది. రెండు తెలియక చేసేది. తెలియక చేసేదానికి ప్రశ్చాత్తా్తపమనే అవకాశం ఉంటుంది. కానీ తెలిసి చేసే తప్పుకు ఎలాంటి క్షమాపణలు ఉండవు. ఎప్పుడూ… తెలిసి తెలిసి తప్పు చెయ్యకూడదు.’’ నాన్న పదేపదే చెప్పిన మాటలు మదిలో మెదిలాయి.

బ్రతికున్న మనిషి కంటే దూరమైన బంధం తాలూకు జ్ఞాపకాలకు విలువెక్కువ. అదే బలమైన కారణమైయుంటుంది. ‘‘ఆపండి’’ అని గట్టిగా అరిచింది.
‘‘ఏమైంది మాతా!’’(పలుప్రాంతాల్లో స్వామి మాల వేసుకున్నవాళ్లు ఆడవారిని మాత అని సంబోధిస్తారు). మినుకు మినుకు మని వెలుగుతున్న ఓ వీధి దీపాన్ని దాటి రెండు అడుగుల ముందు ఓ పక్కగా ఆటో ఆగింది.
‘‘దిగాలండి’’ బ్యాగ్‌లోంచి డబ్బులు తీస్తూ అంది శిఖర.
‘‘ఇక్కడా?’’ ఆశ్చర్యంగా అడిగాడు స్వామి. ఆ పరిసర ప్రాంతమంతా కటిక చీకటిని తలపిస్తోంది. ఏదైనా వాహనం వస్తేనే వెలుగొస్తుంది. చుట్టూ అరటి తోటలు.. కొబ్బరి చెట్లూ.. వరి చేలూ.. మధ్యలో రాళ్లు రప్పలతో అస్తవ్యస్థమైన రోడ్డు’ కనుచూపు మేరలో ఎక్కడో అక్కడక్కడ చిన్న వీధిదీపాలు…

‘‘అవునండి!’’ డబ్బులు ఆటో చెక్క మీద పెట్టి దిగింది.

‘‘మాతా…! ఇటు ఎక్కడికి? పైగా వీధి లైట్స్‌ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. ఎక్కడ దిగాలో చెప్పండి అక్కడ దింపేస్తాను. మరో ఇరవై రూపాయిలిస్తే చాలు!’’ బేరమాడాడు.

‘‘లేదండి. ఈ పక్కనే మా ఇల్లు. మీరు వెళ్లండి’’ తలపైకి ఎత్తకుండానే సమాధానమిచ్చింది శిఖర.
కానీ… అతడు వదిలేలా లేడు.

‘‘ఇక్కడెక్కడ ఇళ్లున్నాయి మాతా? ఈ ఎడమవైపంతా అరటి తోటలు… ఆ ముందుకు శ్మశానం.. ఇక ఈ కుడివైపంతా పిల్లకాలువ… ఈ దిక్కు నుంచి ముందుకెళ్లి పెద్ద మలుపు తిప్పుకుని మళ్లా ఈ పిల్లకాలవ అవతలివైపు రోడ్డుకే వెళ్లాలి మనం. ఇంకో కిలో మీటర్‌ వెళ్తేగానీ ఇళ్లే ఉండవు. మీరు పొరబడుతున్నట్లున్నారు మాతా. ఈ దారి మీకు కొత్తేమో!?’’ రోజూ అదే దారిలో తిరిగే అనుభవం మీద ఆరా తీసాడు స్వామి.

అతడి అనుమానాలకు బదులిచ్చే ఓపిక లేక అసలు సంగతి చెప్పెయ్యాలని నిర్ణయించుకున్న శిఖర… తల ఎత్తకుండానే ఇలా బదులిచ్చింది.

‘‘సిగ్గు విడిచి ఓ తండ్రిలా భావించి ఈ విషయం మీకు చెబుతున్నాను స్వామీ.. నేను ఈ మూడు రోజులు మీవంటి మాలలో ఉన్నవారికి ఎదురు పడకూడదు. కానీ మీలానే నేనూ బతుకుదెరువు కోసం బయటికి రావాల్సి వచ్చింది. పరిస్థితులే నన్నిలా నిలబెట్టాయి.  క్షమించండి’’ అని చెప్పి అక్కడ నుంచి ముందుకు నడిచింది.
ఆ సమాధానం విన్న స్వామి…. లెంపలు వేసుకునే లోపే ఆమె చీకటి మబ్బులో కలిసిపోయింది. ఆమె వెళ్లిన కాసేపటి దాకా అతడు అలానే ఆటోలో కూర్చుని ఉండిపోయాడు.

సీటు వెనుకాల ఉన్న ఖాళీ ఆయిల్‌ డబ్బా అందుకుని పిల్లకాలువలోని నీళ్లు నింపి తెచ్చి… ఆటో కడగడం మొదలుపెట్టాడు స్వామి. ఇంతలో సైలెన్సర్‌ పీకిన రెండు బైక్స్‌ వేగంగా ఆటోని దాటాయి. ఆ బైక్స్‌ మీద ఉన్న నలుగురు కుర్రవాళ్లు ఉత్సాహంగా కేకలేస్తూ శిఖర నడిచి వెళ్లిన దారిలోనే శ్మశానం దాటుతూ పెద్ద మలుపువైపు దూసుకెళ్లారు. ఆ స్వామికి కచ్చితంగా తెలుసు… ఇప్పుడో విపత్తు జరిగినా జరగొచ్చని.

నైతికత ఓ వైపు… నమ్మిన సిద్ధాంతాలోవైపు అతడిని నిలదీస్తుండగా.. అనుకున్నంతా జరుగుతోంది. పిల్లకాలవ అవతల రోడ్డులో అస్పష్టమైన అరుపులు వినిపిస్తున్నాయి.

ఆ స్వామి ఆటో స్టార్ట్‌ చేశాడు. ఉన్నచోటు నుంచే యూ టర్న్‌ తీసుకుంటే నమ్మిన సిద్ధాంతమే గెలుస్తుంది. శిఖర వెళ్లిన వైపు కదిలితే నైతికత నిలుస్తుంది.

మినుకు మినుకుమనే వీధి దీపం వెలుగులో… ఆ ఆటో వెనకాల ఓ కొటేషన్‌ కనిపిస్తుంది. అదేంటంటే… ‘‘నిస్సహాయతకు నియమాలకూ ముడిపెట్టకు.. నిశీధిలో నీడకు వెలుతురు మాత్రమే వెలితి!’’

***

మార్పు కోసం ప్రయత్నమే …

 తూర్పు గోదావరి జిల్లా చిన్నలంక గ్రామానికి చెందిన సంహిత నిమ్మన…. జర్నలిజంలో పీజీ చేశారు. వృత్తి రీత్యా జర్నలిస్టు.  సామాజిక అంశాల మీద స్పందిస్తూ కథలు రాస్తున్నారు. మొదటి కథ మనసు మాట సాక్షి ఆదివారం అనుబంధంలో వచ్చింది.  స్పందన, విచక్షణ, విశ్లేషణ నేపథ్యంగా కథలు రాస్తున్నాను అంటారు సంహిత. గత కొంత కాలంగా రాజకీయంగా, సామాజికంగా వివాదాస్పదమైన ఒక సున్నితమైన అంశం నేపథ్యంగా ఈ కథ రాశారు.

 1. సంహిత గారు నమస్కారం. మీ మొదటి కథ ఎప్పుడు రాశారు…?

గత సంవత్సరం ఫిబ్రవరిలో రాశాను. నిజానికి నేను నా స్కూల్‌ డేస్‌లోనే కథ రాయడానికి ప్రయత్నించాను. ‘రామయ్యా:–..బ్లాబ్లాబ్లా.. వీరయ్య:–..బ్లాబ్లాబ్లాబ్లా..’ అని ఏవేవో రాసేదాన్ని. ఒకసారి ఆ పిచ్చికథ మా టీచర్‌ కంటపడితే ‘మీ పాప చదవకుండా స్కూల్లో కథలు రాస్తోంది’ అని మా మమ్మీకి కంప్లయింట్‌ చేశారు. దాంతో ఇంట్లో నాకు చిన్న సైజ్‌ వాయింపు అయ్యింది. ఇంటర్‌ తర్వాత కవితలకే పరిమితమయ్యాను. ఎప్పటికప్పుడు కథ రాయాలని ఉన్నా… నేను ఎంచుకున్న కథానాయకుడు లేదా కథానాయిక మాటలను పాఠకుడికి అర్థమయ్యేలా ఎలా రాయాలో.. ఒక సిట్యుయేష‌న్‌లో కంటిన్యూ అవు తున్నప్పుడు దాన్ని ఎక్కడ ఆపాలో.. మరో సిట్యుయేషన్‌లోకి ఎలా వెళ్లాలో తెలిసేదే కాదు. అందుకే మొదటి సారి కథని ‘నేను’ అని మొదటి పెట్టాను. సాక్షీ ఫ్యామిలీ ‘సంసారం’ కాలమ్‌కి రెండు గుండెల చప్పుడు అని ఓ ఆర్టికల్‌ రాశాను. దానికి మంచి స్పందన రావడంతో ఒక పెద్దాయన మనోభావాల‌నే ఊహాత్మకంగా కథ అల్లాను. అదే నా మొదటి కథ(మనసు మాట).

  1. ఈ కథ నేపథ్యం ఏమిటి?
    విశ్లేషణ, విచక్షణ అనేవే ఈ కథకు అసలైన నేపథ్యాలు. నా చిన్ననాటి నుంచి ఈ ఆచారాన్ని గమనిస్తూనే ఉన్నాను. పాటిస్తూనే ఉన్నాను. కఠిన నియమాలు, నియమ నిష్టలు అన్నీ కూడా నెలసరి వచ్చిన స్త్రీ వట్టిగడ్డిపైన కూర్చుని మాత్రమే గడపాల్సిన రోజుల నాటివి. అసలు నెలసరి అంటే మాతృత్వానికీ, మన మనుగడకూ మూలం. అది సృష్టి. అంటే దేవుడి ప్రమేయంతోనే జరిగింది.
    పది గొంతుకలు కలిసి అరిచినా వినిపించనంత డప్పు మోతల మధ్య.. నిస్సహాయురాలైన ఆడదాన్ని కాళ్లు చేతులు కట్టేసి.. చచ్చిన భర్త శవంతో పాటూ చితిలో వేసే ఆచారం సతీసహగమనం. అది అమల్లో ఉన్నంతకాలం సంప్రదాయమే దాని పేరు. ప్రాణాలతో చెలగాటమేంటన్న వాధనే దాన్ని మూఢ‌నమ్మకమని నిరూపించింది. ఇప్పుడిప్పుడే నెలసరి మీద కూడా ఒక అవగాహన వస్తోంది. చాలా వరకూ మారుతున్నారు. చాలా చోట్ల మారారు. మరింత మారేందుకు నా ఈ ప్రయత్నం. నా దృష్టిలో… తక్కువ – ఎక్కువ, మంచి – చెడు, కులం – మతం, తప్పు – ఒప్పు వీటన్నింటిపైనా మనిషి ఎప్పుడు నిమాయాలను సృష్టించి, పాటిస్తాడంటే…. మూడు పూట్లా ఐదువేళ్లు నోట్లోకి వెళ్తూ… వేళకు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలిగినప్పుడు మాత్రమే.
  2. శబరిమల వివాదం గురించి అంతర్లీనంగా చర్చించారు కదా. కథల్లో రాజకీయ అంశాలు చర్చించడం వల్ల కథా ప్రక్రియకు నష్టమా? లాభమా? ఎలా??

నా ప్రతీ కథలోనూ మనిషికీ, మనసుకీ, ప్రాణానికీ విలువ ఉంటుంది. ఈ కథలో కూడా నైతికతే ప్రధానం. గొప్ప కొటేషన్స్‌ స్టేటస్‌గా పెట్టుకున్న ప్రతివాడూ దాన్ని పాటిస్తాడని నమ్మలేం. ఎందుకంటే మోసగాడికి తను మంచివాడ్ని అని నమ్మించే ఆయుధం కూడా ఆ కొటేషనే కదా! మరో విషయమేంటంటే… నా శ్రేయోభిలాషి ఒకరు ఈ కథని చదివినప్పుడు ఒక మాటన్నారు. ‘ఆ ఆటో డ్రైవర్‌ స్వామిమాల వేసుకోకుండా ఉండి ఉంటే… అతడే ఆ అమ్మాయిని ఏమైనా చేసి ఉండేవాడేమో?’ అని. ఏమో? చెప్పలేం. ఇవి ధైర్యం చేసి మనిషిని నమ్మలేని రోజులు కదా!?. ఇదిగో ఇలాంటి సూక్ష్మ పరిశీలన, హేతుబద్దమైన ప్రక్షాళనే ఈ కథలోని అసలైన అంతర్లీనాలు.

ఇక శబరిమల వివాదమంటారా? అది నిజంగానే రాజకీయం. అలాంటి రాజకీయాలు కథా ప్రక్రియకే కాదు మరి ఏ ప్రక్రియకూ లాభం కాదు. స్త్రీ అస్తిత్వానికి సంబంధించిన ఓ నైతిక పోరాటాన్ని కావాలనే వివాదంలోకి నెట్టి విడిచిపెట్టారు. ఈ లోకాన్ని మొత్తాన్ని ఓ శక్తి నడిపిస్తోందని నేను నమ్ముతాను. ఆ శక్తే హిందువుకి భగవంతుడు. ముస్లింకి అల్లా. క్రైస్తవుడికి జీసెస్‌. రూపాలు, నామాలు వేరైనా శక్తి మాత్రం ఒక్కటే. ఆ శక్తి దర్శనాన్ని ఆక్షేపించేందుకు నియమాలేంటి? పదేళ్ల ముందు వారికి, యాభై ఏళ్ల తర్వాత వారికి మాత్ర‌మే అనుమ‌తి అంటే… మాతృత్వానికి అర్హురాలైన స్త్రీలను అనర్హులంటున్నారు. దేవుడి అనుగ్రహాన్ని కోరుకుంటూ దర్శనానికి వెళ్లే ఏ స్త్రీ అశుద్ధాన్ని మోసుకుని (నెలసరి సమయంలో) గర్భగుడిలోకి వెళ్లదు. అయినా ఇది కర్రకు కత్తి దూసేంత సమస్యకాదు. విచక్షణతో ఆలోచించి సడలించుకోవల్సిన నియమమంతే.

  1. మీకు నచ్చిన కథలు, నవలలు, రచయితలు?

నాకు నచ్చిన కథలు చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన అల్లిబిల్లి కథలు. అంటే.. అదో పుస్తకం పేరు అనుకునేరు. అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి తెలివిగా ఊహించి కథలు చెప్పేది. అపరిచితుల దగ్గర చాక్లెట్స్‌ తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా… చాక్లెట్‌ తీసుకున్న రాము ఎలా మోసపోయాడో తెలుసా అంటూ ఓ కథ అల్లి చెప్పేది. చేతులు కడుక్కోకుండా తింటే… సోము ఎలా అనారోగ్యం పాలయ్యాడో చెప్పేది. రామూ, సోమూలు ఆమె ఊహలే కావచ్చు. కానీ, అప్పటికి నాకు అవే నిజాలు. నాకు అర్థం చేసుకునే వయసు వచ్చేనాటికి… తను చదివిన నవల్స్‌ కూడా సింపుల్‌గా ఒక సినిమాలా చెప్పేది. తను చదివిన పుస్తకాల్లోనిదే ఈ సంహిత పేరు కూడా. అలా అమ్మ చెప్పే స్టోరీస్‌ విని విని నాకు వినడమే అలవాటైంది. ఆ అలవాటు ఎంతగా మారిందంటే చదివి రాసిన ఎగ్జామ్స్‌ కంటే.. పాఠాలు విని రాసిన ఎగ్జామ్స్‌కే మార్కులు బాగా వచ్చేవి. ఇప్పటికీ చదవడమంటే చాలా కష్టమైన పనే నాకు. అందుకే నేను పెద్దగా పుస్తకాలు చదవలేదు. చదువుదామని తీసుకున్నా.. పూర్తిగా చదవకుండా మధ్య మధ్యలో తిరగేసి, క్లైమాక్స్‌ చదివి మమ అనేదాన్ని. కానీ నాకు నేనుగా చదివిన పుస్తకం ‘ఏడుతరాలు’. మనిషిని మనిషిగా చూడని కౄరత్వంపై ఒక రకమైన కోపం, బాధ, దుఃఖం అన్నీ కలిసి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివించాయి.

  1. మీ నేపథ్యం…?

మాది తూర్పుగోదావరి జిల్లాలోని చిన్న లంక గ్రామం. నిమ్మన సోమేశ్వరరావు, వెంకటేశ్వరీబాయ్‌లకు ఒక్కగానొక్క కూతుర్ని. డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్నాను. డిగ్రీలో నా కవితలు, పేరడీలు విన్న మా అధ్యాపకుల ప్రోత్సాహంతో ఎమ్‌.ఎ. జర్నలిజం పూర్తి చేసి.. మీడియా వైపు అడుగులు వేశాను.

  1. ఎలాంటి కథలు రాయాలని అనుకుంటారు?

ఇలానే రాయాలనే నియమం ఏదీ లేదు కానీ.. నలుగురిని ఆలోచింపజేసే కథాంశాలనే ఎంచుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్యూ.

*

సంహిత

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శబరిమల తీర్పుపై అత్యాచార, వ్యభిచార కూప పీడితులను కాపాడే ఉద్యమ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ స్పందన….

    WHY #SABARIMALA VERDICT MAKES ME FEEL INVADED?
    I know as I start typing these words on the keyboard a huge world of people are going to be very disappointed in me…but I am what I am…and feel compelled to write what I feel very strongly from my innermost being.

    From an early age, I was very spiritual. My parents are god-fearing and instilled in me the presence of a higher power. I am fairly ritualistic…but do not know any hindu chants/sholkas etc. My commune with God was and is a deep communication which I have nurtured through a pattern of daily prayers. I think from an early age I came to believe that not all is humanly possible…there are situations/ events that can drain you….there are human beings who will hurt you…and in all these happenings if you surrender to a higher power…you are able to draw the strength to keep moving inspite of all obstacles.

    I guess everybody in this world finds ways and means to cope and move ahead…for me it was largely through the spiritual strength churned out of daily meditation and prayers. Over the years, I started developing my personal symbols of hope & strength. The female deities who were embodiment of power/shakti/para-shakti became my personal favorites. Maybe all this is also connected to my evolution as a person.
    But one male deity who caught my attention was ‘Lord Ayyappa’. I still remember as a child when my father went to Sabarimala after observing 41days of austerity…I spent days listening to the stories of Lord Ayyapa after he came back…and one thing that stuck me was that this is a secular temple…Vavar a muslim warrior was Lord Ayyapa’s best friend…infact I understand there is a dargah for Vavar Swami enroute to Sabarimala… Believers from all faith can go here which is not a usual practice in many temples in Kerala where it is explicitly written outside that ‘only Hindus can enter’. K.J Yesuday a legendary singer who is a Christian has visited the temple and a song sung by him composed by Sri Kambangudi Kulathur Srinivasa Iyer in Sanskrit is the lullaby that is played every night in this temple. Once I understood the set of rituals that was followed for the 41days austerity, I could clearly understand why only girl children before they attain menarche and women after they attain menopause were allowed to climb the ’18 steps’ to have a darshan/sight of Lord Ayyapa.

    Over the years, I saw each temple across the country have their own unique rituals. There are temples which chant ‘profanity’ (Kodungallur Amma) and there are temples which celebrity feminine power (Kamakhya Temple)…maybe there are rituals that are regressive too. But over a period of time…as a organic evolution…and maybe also because of the of the efforts of reformist regressive harmful rituals have ended. But the faith and belief of the believers continues to grow. Is there a logic to it? I don’t know….not everything can be explained by logic. For example I cannot logically explain the sense of God experience I feel when I am able to restore the smile on the face of a child or adult that I have rescued… It is a deeply personal moment.

    Believers of any faith, evolve a set of practices that gives them comfort. Most of these practices…are oral traditions passed on from generation to generation. One important practice that most believers undertake is to visit their place of worship. For Hindus it could be Tirupati or Vaishno Devi or Sabarimala, for Christians it could be the Holy City of Jerusalem or the Vatican and for the Muslims the Mecca. Each place of worship requires a different set of rituals unique to that place of worship. One goes to these places of worship not because you cannot sit and pray in your own house or office or wherever that suits you…but there is a innate faith in all believers that collective spaces of worship gives us another level of strength which is rejuvenating. Maybe also because of the ‘oneness’ in worship a positive energy radiates in these places of worship. I cannot explain logically the overwhelming sense of feeling that flows as tears from my eyes…when I see Lord Balaji in Tirupati or Mookambika Devi in Kollur. I am sure that must be the same feelings for Christians when they visit Church of Holy Sepulchre,Jeruselam or for muslims when they visit Kabba in Mecca.

    Why did I feel invaded when the #Sabarimala verdict came?
    While verdict in the name of gender equality gives rights to all women to enter Sabarimala no matter what age they belong…and rightly said it was now for the women to choose whether they want to go or not, my contention is that these temples of deep faith & belief become what they become because of the specific rituals practiced by that temple. If those practices are radically changed the space loses its sanctity. Sabarimala is one of the largest annual pilgrimages in the world with over 40-50 million devotees visiting every year in short span of 103 days in a year (temple is open only from 15th Nov-26th Dec, 14th Jan, 14th April and 5 days in the beginning of every month).
    Whether that gives an idea of deep faith in these practices to anybody I don’t know? But I definitely know when a deep faith that stirs my soul is negated I feel disrespected and devalued. I also know that you are trying to invade and take away small spaces I have created in my life that gives me a sense of oneness with a higher being…

    I will continue to strive hard to practice ‘Tattavamasi’ i.e.. to see the divinity in you…but do not please take away the space that I nurture which makes alive the divinity in me.

    ఇదే సారంగలో, ఇదే విషయంపై వచ్చిన *మనుష్యులం కాదు, భక్తులం* అనే వ్యంగ గల్పికపై రెండు మూడు వ్యాఖ్యలు చేసాను. ఒకటి, ‘స్త్రీ ఋతుక్రమ విషయంలో సనాతన ధర్మ దృక్పథం ఏమిటి?’ అనే విషయంలో ‘ఇండియా ఫ్యాక్ట్స్’ అంతర్జాల పత్రిక నితిన్ శ్రీధర్ వ్రాసిన ఆరు వ్యాసాల వివరాలు, రెండవది, జస్టిస్ హిందూ మల్హోత్రా నలుగురు న్యాయమూర్తుల తీర్పులతో విభేదిస్తూ, ప్రతి నిషేధమూ వివక్షగా భావించనక్కరలేదు, అని యిచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలని తెలుగులో యిచ్చాను. ఆసక్తివుంటే ఈ కథా రచయిత్రి చదువుకోవచ్చు.

    ఇంకా ఆసక్తి వుంటే జస్టిస్ ఇందూ మల్హోత్రా యిచ్చిన పూర్తి తీర్పు పాఠాన్ని యిక్కడ చదువుకోవచ్చు…

    https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=4&ved=2ahUKEwjD45bXkr7gAhUJbisKHdoOCowQFjADegQIBxAC&url=https%3A%2F%2Fbarandbench.com%2Fwp-content%2Fuploads%2F2018%2F09%2FSabarimala-Indu-Malhotra-J-judgment.pdf&usg=AOvVaw2Ka24YpuKboNH1ItuUups7

  • సతీ సహగమనం అనేది హిందూ సమాజమంతా అన్ని కులాల్లోనూ వున్నది, ప్రతి ఒక్క మహిళా సహగమనం చేసేది, లేదా బలవంతంగా కట్టి చేయించేవారు అన్న భావన వున్నట్లున్నది. సతి గురించి వివరంగా యిక్కడ తెలుసుకోవచ్చు.
    https://en.wikipedia.org/wiki/Sati_(practice)

    శబరిమల విషయంలో దేశవ్యాప్తంగా స్త్రీల ఆలయ ప్రవేశంకోసం పోరాడుతున్న ప్రగతిశీలవాదులందరి లక్షల గంటల శ్రమ, రచనలు, ప్రయత్నాలలో వెయ్యోవంతయినా సునీతా కృష్ణన్ చేస్తున్న పనులకు సహకరిస్తే ఎంతో ప్రయోజనం, ఏది ప్రధానమో దానికోసం మన ప్రయత్నాల సార్థకత సిద్ధించేదని నా అభిప్రాయం. చిత్రంగా తస్లీమా నస్రీన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ‘‘I do not understand why women activists are so eager to enter Sabarimala. Better they should enter the villages where women suffer from domestic violence, rape, sexual abuse, hate, where girls have no access to education, health care, and no freedom to take a job or get equal pay,” the writer tweeted.’’

  • చాలా అద్భుతంగా ఉంది…
    ఆలోచించే అవకాశాన్ని అందరికీ కల్పించారు…
    ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను…
    నేను అయ్యప్ప మాల వేసుకున్నా…
    అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న స్వాములు ముందుగా మానవత్వాన్ని చూపించాలి అని నా అనుభవ పూర్వకంగానే తెలుసుకున్న విషయం. వాస్తవిక దృష్టితో కథ చాలా అద్భుతంగా ఉంది. సశేషం గా ఇచ్చిన ముగింపు అద్భుతంగా ఉంది. ఇది ఎవరి విచక్షణతో వారు ముగింపును కొనసాగించే అవకాశం ఉంది. నా కొనసాగింపు గా శిఖ ఇచ్చిన తండ్రి స్థానాన్ని స్వామి నిలబెట్టుకోవడమే…..

  • సామాజిక రుగ్మతను వేలెత్తి చూపడం అందరూ చేసే పనే.. కాని కవయిత్రి భిన్న ఆలోచనా శైలి.. అద్భుతం. ప్రశ్నాల్లోనే సామాధానం చూపించారు.. వాస్తవిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందిని కథాంశం ఎంచుకుని కళ్లకు కట్టి చూిపించారు. మీ ‘నెలపొడుపు’ కొత్త మేలుకొలుపు.

  • చ‌క్క‌ని క‌థ రాసిన సంహిత‌కు అభినంద‌న‌లు. మ‌రిన్ని మంచి క‌థ‌లు రాయాల‌ని ఆశిస్తున్నాను.
    – యాకూబ్ పాషా

  • కథ చాలా బాగుంది..👌👌.. స్త్రీల జీవనశైలిలోని ఇబ్బందుల్ని కళ్లకు కట్టారు..

  • ఒక చిన్నపాటి నవలలో ఉండేంత విషయాన్ని ఓ కథలో చెప్పగలిగారు.
    అసందర్భమైన సన్నివేశాలను, అనవసరమైన పాత్రలను జొప్పించకుండా కథను మీరు నడిపి తీరు(స్క్రీన్‌ ప్లే) చక్కగా ఉంది.
    ముఖ్యంగా కథ ముగింపును ప్రేక్షకుడి ఊహాకే వదిలేయడం నిజంగా అనేది కత్తి మీద సాము లాంటిదే.
    ‘‘మనం చెప్పాల్సిన విషయం పాఠకుడి మనసు లోతుల్లోకి వెళ్లగలిగింది’’ అనే నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి సాహసం చేయలేరు.
    నెలసరి సమయాల్లో ఓ భారతీయ స్త్రీలో కలిగే అంతర్గత మధనం, ఆలోచన తీరును కళ్లకు కట్టారు.

  • Nice story…. writer permission iste chinna chinna marpulu chesi short film tistaanu
    8333912312 my contact number!

  • మీ రచన చాలా బాగుంది….. ఈ కథ ఎంతో మందిని ఆలోచింపచేసే లా ఉంది…..
    మీ కథానేపథ్యం గురించి కూడా బాగా చెప్పారు… నేను కూడా కథలు రాయాలని చాలా సార్లు ప్రయత్నించాను…. కాని మీరు మొదట్లో ఎలా ఇబ్బంది పడ్డారో (అంటే కథ ఎలా ప్రారంభించాలి, ఎక్కడ మలుపు తిప్పాలి, పాఠకుడికి అర్థమయ్యే లా ఎలా వ్రాయాలి) అలాగే నేను ఇబ్బంది పడుతున్నాను…. కాని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి , కచ్చితంగా నేర్చుకుంటాను వ్రాస్తాను…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు