అమ్మమ్మ నిండు నూరేళ్ళు బ్రతికింది
ఒక మహాస్వప్నాన్ని కంటూ బ్రతికింది
లేచిపడ్డ కెరటమై ప్రవహించింది
గాయాలను తడుముకుంటూ ఎగసిపడింది.
అమ్మలా, అమ్మమ్మలా జ్ఞాపకాలనూ, ఉప్పని కన్నీళ్లనూ సమంగా కలిపి మాకు ముద్దలు తినిపించింది. ఎన్నో కధలు చెప్పేది. కమ్యూనిస్ట్ పార్టీ గురించి గొప్పలు చెప్పేది. ఎప్పుడూ పాటలు పాడేది. ఆకస్మికంగా అదృశ్యమైన మావయ్య గురించి చెప్పేది. పెంకుటిల్లు బాగు చెయ్యడానికి తన వద్ద డబ్బులు లేవనీ, అద్దె డబ్బులతో, పూలు పళ్ళు అమ్మిన డబ్బులతో అంజమ్మమ్మ ఇల్లు గడుపుతోందని తను చెప్పకపోయినా మాకు చిన్నప్పుడే అర్ధమయింది.
వేసవి సెలవలకు బెజవాడ వెళ్తే అమ్మమ్మ రుచిగా చేసి పెట్టే వంటలతో పాటు తను చెప్పే కధలే మాకు ప్రత్యేక ఆకర్షణ. తన కాకినాడ హాస్టల్ జీవితం గురించి కధలు కధలుగా చెప్పేది. తర్వాత నేను ఉద్యోగ రీత్యా కాకినాడ వెళ్ళినప్పుడు అమ్మమ్మతో కలిసి ఆ కధల్లోని పాత్రధారులను కలవడం గొప్ప అనుభవం. ఆమె కధలోని అక్షరాలన్నింటినీ పోగేసుకుని సీతాకోక చిలుకల్లా వారంతా నా ముందు వాలారు. అలా అమ్మమ్మ కధల్లోని పాత్రలన్నీ మా మనసులో ముద్రపడిపోయాయి. రహస్య జీవితం గురించి అమ్మమ్మ చెప్పిన కధలు సస్పెన్స్ థ్రిల్లర్కి ఏమీ తీసిపోయేవి కావు. ఆ సాహస గాధల్లోని హీరోలు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మద్దుకూరి చంద్రం లాంటి వారు. అలాగే తన స్నేహితురాళ్ళు సూర్యం మామ్మ (మానికొండ సూర్యవతి), తాపీ రాజమ్మ, సరోజనక్క మాకూ ఆత్మీయులే.
అలా తను చెప్పే సాహస గాధలలో అంతర్లీనంగా తన జీవిత కధ ఉందని మెల్లిగా అర్ధం అయ్యింది. తన కధలో చరిత్ర ఇమిడి ఉందనీ, బలమైన రాజకీయ ఉద్యమం కలిసిపోయి ఉందనీ తెలిసాక ఆ కధ అందరితో పంచుకోవాలని అనిపించింది. అమ్మమ్మ కధ మాతోపాటు ఇంకా ఎందరికో స్పుర్తినిచ్చింది. తను అనుకున్న ప్రకారం, తన షరతుల మీద జీవితమంతా గడపడం ఏమంత తేలికైన పని కాదు. అయినా ఆ విధంగానే నూరేళ్ళు నిండుగా బ్రతికింది.
ఈ నూరేళ్ళ జీవితంలో అలజడి ఎంత, అత్మస్థైర్యం ఎంత, సంతోషమెంత, దుఖమెంత, పొందిందెంత, పోగొట్టుకున్నదెంత ఎవరు మాత్రం లెక్కించగలరు? అడుగు తీసి అడుగు వేసే లోపే కాళ్ళకింద నుండి జారిపోతున్న జీవితాన్ని, ఆశలను, ఆశయాలను గుండె నిబ్బరంతో ఒడిసి పట్టుకుని నిర్జన వారధిపై ఒంటరిగా వెలుగుతూ నిలబడింది. అది మాత్రం సత్యo. అందుకే ఈ పండుగ.
(కె అనురాధ, పెద్ద మనవరాలు)
మునిమనవరాళ్ళతో కోటేశ్వరమ్మ గారు
Add comment