నూరేళ్ళ ముందు చూపు ‘స్త్రీవిద్య’

భండారు అచ్చమాంబ తన సమకాలీన సమాజ మార్పు కోసం, స్త్రీ జనోద్ధరణ కోసం కలం పట్టిన రచయిత్రి. అందుకే ఆమె కథలన్నీ ఆ కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. పురుషులకే సరైన విద్య అందని కాలంలో స్త్రీవిద్య కోసం అచ్చమాంబ పడిన తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుంది.

మనం నిర్మించుకున్న నిఘంటువుల్లాగే రాసుకున్న సాహిత్య చరిత్రలు కూడా అసమగ్రమని పదే పదే నిరూపిత మౌతూనే ఉంది. దీనికి ఇటీవలి నిదర్శనం భండారు అచ్చమాంబ కథలు. మొన్న మొన్నటి దాకా తెలుగులో మొదటి కథ ‘దిద్దుబాటు’ (1910) అని, మొదటి కథకుడు గురజాడ అప్పారావు అనే నమ్మాము. భ్రమలో ఉండిపోయాం. ఈ నమ్మకాన్ని తుత్తునియలు చేస్తూ 2010లో సంగిశెట్టి శ్రీనివాస్ తన సంపాదకత్వంలో ‘కవిలే తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరాల్ సెంటర్’ తరపున లభ్యమైన 10 కథలతో భండారు అచ్చమాంబ కథలు  ప్రచురించారు. ఆ తర్వాత 2013 ఆగష్టులో షేక్ మహబూబ్ బాషా అచ్చమాంబ రాసిన మరో రెండు కథలు దొరికాయని ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాస్తూ 1. ప్రేమా పరీక్షణము. (ఈ కథ రాయసం వెంకట శివుడు సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు జనానా’ పత్రికలో 1898 జూలై సంచికలో ప్రచురితం అయింది.) 2. ఎఱువుల సొమ్ము బఱువుల చేటు. (ఈ కథ కూడా అదే పత్రికలో 1898 సెప్టెంబర్ సంచికలో ప్రచురింపబడింది.) అనే రెండు కథలను పరిచయం చేశారు.

ఇప్పటికీ లభ్యమైన సమాచారం ప్రకారం తెలుగులో మొదటి కథ ‘ప్రేమా పరీక్షణము’. (1898) తొలి తెలుగు కథలు రాసింది ‘భండారు అచ్చమాంబ’. (ఈమె తెలంగాణ వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణ్ రావు గారి అక్కయ్య) ఈమె మొత్తం 12 కథలు రాసింది. ఈమె కథల వైశిష్ట్యాన్ని గురించి డా. కె. శ్రీనివాస్, డా. ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ విలువైన వ్యాసాలు రాశారు. కొండవీటి సత్యవతి భండారు అచ్చమాంబ జీవిత, సాహితీ వైభవాన్ని తెలిపే ‘భండారు అచ్చమాంబ సచ్చరిత్ర’ ను వెలువరించారు. సహజంగానే ఈ కథలన్నీ ఆనాటి సమాజాన్ని చిత్రించిన కథలు. ముఖ్యంగా స్త్రీ విద్య, సంఘసంస్కరణ, స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ ఆత్మ గౌరవం చుట్టూ తిరిగాయి. అచ్చమాంబ తాను రాసిన 12 కథల్లో రెండు కథలు స్త్రీవిద్యా  ఆవశ్యకత గురించే రాసినవే. అవి. 1. జానకమ్మ (తెలుగు జనానా- మే 1902) 2. స్త్రీవిద్య (హిందూ సుందరి- 1902)

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భావించిన ఒక భర్త తాను చెన్నపురికి (చెన్నై) పరీక్షలు రాయడానికి  పోతూ కుటుంబ యోగ క్షేమాలు ఉత్తరం ద్వారా తెలపడానికి వీలుగా తన భార్యను చదువు నేర్చుకొమ్మని ఒత్తిడి చేస్తాడు. “ఆడువారు చదువు నేర్చుకొనగూడదనియు జదివిన స్త్రీలు తమ భర్తల ఆయువును హరింతురణియు ఇది శాస్త్రములలో నున్నదనియు” తమ నాయనమ్మ చెప్పేదని చదువు నేర్చుకోవడానికి విముఖత చూపుతుంది. అంతే గాక “ఎందులకా చదువు? భర్తకు నుత్తరములు వ్రాయుటకేనా? మేము మీ వలె కచీర్లకు బోయి యుద్యోగములు చేతుమా? చదువు ముక్కలు నాలుగు నేర్చిన తోడనే ఇరుగు పొరుగు వారలు నవ్వుదురు. నిందింతురు. తిరస్కరించుటకైననూ వెనుదీయరు.” అని భర్తతో వాదనకు దిగుతుంది. ఇవన్నీ అభూత కల్పనలేనని స్త్రీలు ఆజ్ఞానాందకారంలో వున్నట్లైతే మూఢత్వంలో ఉండిపోతారని అంటాడు.

చదువు నేర్చుకోవడం వలన కలిగే లాభాలను వివరించి  “అక్షరములను వ్రాయను జదువను నేర్చునంత మాత్రమున నరులు విద్యావంతులు కాజాలరు. అనేకులు వ్రాసిన ఉద్గ్రంతములను జదివి వాని తాత్పర్యములను గ్రహింపగల వారలే విద్యావంతులనబడుదురు. ఇట్టి విద్య వలన బుద్ధి వికసించుట. అనేక సద్గ్రంథములలోని యమూల్యంబగు నుపదేశ వాక్యంబులు మనసున నాటి మనుజుల నుదాత్తవంతులను గాజేయును. వారి యందలి దుర్గుణ పుంజములు పోయి సద్గుణ పరంపర లాస్థానము లాక్రమించును. లోకానుభవమును గనుటకు వారలు విశేష యోగ్యులగుదురు. అనేక లోక వార్తలు నెఱుగ గలిగిన వారలగుదురు. కొన్ని పుస్తకముల పఠనము వలన మనమునకాహ్లాదము గలుగును. ఇందు వలన సంసారమునందలి యసంఖ్యాతములగు దుక్కముల నొక్కింత మఱచి జనులానందింపగలరు. విద్య వలన నిట్టి లాభములు పెక్కు కలవు.” అని చదువు ఆవశ్యకతను విడమర్చి చెప్తాడు ఆ భర్త. ఆడవాళ్ళు చదువుకోకూడని ఏ శాస్త్రంలో కూడా లేదని చెప్తాడు. స్త్రీలకే చదువు వస్తే నిజంగా ఆ శాస్త్రములలో ఏముందో వారే చదివి తెలుసుకోవచ్చుగదా అంటాడు. “ప్రస్తుతము పురుషులకంటెను స్త్రీలు విశేష జ్ఞానసంపన్నులగుట యధిక యావశ్యము. ఏలన నికముందు పుట్టబోవు వారి నున్నత పదవికి తెచ్చుట స్త్రీల యధీనములోనిదై యున్నది.” అని స్త్రీల చదువుకోవడం ఈ కాలానికి ఎంత అవసరమో వివరిస్తాడు. ఇదంతా చెప్పిన తరువాత మీ ఆశయానికి నేనెప్పుడైనా ఎదురు నడిచానా అని ఆ భార్య మొత్తానికి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక చన్నై పయనమౌతూ నీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం చదువుతూ నేను ఎంత తన్మయత్వానికి లోనౌతానో మాటల్లో చెప్పలేను అని భర్త అనగానే వ్రాస్తాను కానీ మీరు నవ్వకూడదు మరి అని బతిమాలుతుంది. అలాగే చెన్నై నుండి తనకు కొన్ని పుస్తకాలు పంపమని చెబుతుంది. పరీక్షలు కాబట్టి మధ్యలో రాకున్నా దీపావళి తప్పక రావాలని కోరుతుంది ఆ భార్య. భర్త సరేననడంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో పెద్ద శిల్పం ఏమీ లేదు కానీ భార్యా భర్తల సంవాద రూపంలో నడిచిన కథ. భండారు అచ్చమాంబ తన సమకాలీన సమాజ మార్పు కోసం, స్త్రీ జనోద్ధరణ కోసం కలం పట్టిన రచయిత్రి. అందుకే ఆమె కథలన్నీ ఆ కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. పురుషులకే సరైన విద్య అందని కాలంలో స్త్రీవిద్య కోసం అచ్చమాంబ పడిన తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుంది. ఈ కథలోనే కాదు మిగిలిన కథల్లో కూడా అక్కడక్కడ అచ్చమాంబ స్త్రీవిద్య గురించిన పలు అభిప్రాయాలను వ్యక్తీకరించింది. కేవలం కథలు రాయడానికే పరిమితం కాకుండా  తన భర్తతో పాటు తెలుగుదేశంలోని పలు ప్రాంతాలను పర్యటించి అనేక సభల్లో ఉపన్యసించి స్త్రీవిద్య ఆవశ్యకత గురించి ప్రచారం చేసేది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాస్యత 65.46 శాతమే ఉంది.  ఒకటవ తరగతిలో 100 మంది విద్యార్థులు చేరితే 10వ తరగతికి దాకా   ఎంత మంది కొనసాగుతున్నారు? వారిలో బాలికల సంఖ్య ఎంత? డ్రాపౌట్స్ విషయంలో ప్రభుత్వాల దగ్గర ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? అనేది ప్రశ్నార్థకం. ఇప్పటికీ అనేక కర్మాగారాల్లో, హోటళ్లలో, బార్లలో, బస్టాండ్లలో, సినిమా టాకీసుల్లో, దుకాణాల్లో, బీడీల పరిశ్రమలో, పనిమనుషులుగా ఎంతో మంది 14 సంవత్సరాలు దాటని బాల, బాలికలు మగ్గి పోతున్నారు. సంచార జాతుల్లో అయితే ఎన్నో తూనీగలు బడి ముఖం చూడకుండానే ఓట్లుగా మారిపోతున్నాయి.

భండారు అచ్చమాంబ కథలకు ఇప్పటికీ ప్రాసంగికత  ఉందనే చెప్పాలి. అమ్మాయి చదువు అవనికే వెలుగని నమ్మిన కథా రచయిత్రి ఆమె. స్త్రీవిద్య కథ ఎంతో సరసంగా సాగి చివరికి ఒక గుణాత్మకమైన మార్పుతో ముగుస్తుంది. స్త్రీ చదువుకుంటేనే ఎంతో తెలివిగా సంసారాన్ని నడిపిస్తుందని చెప్పడం ఆమె లక్ష్యం. మిగతా అన్నీ కథలతో పోలిస్తే ఈ కథ మేలిమిరత్నం. తెలుగులో తొలి కథలే ఇంత పరిపక్వతతో రావడం ఒక విధంగా గర్వకారణం. అచ్చమాంబ గొప్ప దార్శనికురాలు. మైదానంలో సాగే కథాలాగా సాదా సీదాగా సాగిన ఈ కథ స్త్రీలలో ఒక కదలిక తెస్తుంది. స్త్రీవిద్యా ప్రాధాన్యాన్ని చెప్పి ఒక ఆచరణకు అడుగు వేయిస్తుంది. ప్రతీ స్త్రీ చదవవలసిన కథ.

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీధర్ వెల్దండి సార్ మంచి వ్యాసం.

  • విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.

  • మంచి సమాచారం. బాగుంది. కొమర్రాజు లక్ష్మణరావుగారు తెలంగాణా వైతాళికుడు కారండి. ఆయన కృష్ణా జిల్లా పెనుకంజిప్రోలులో పుట్టేరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు