ఊసుపోనప్పుడు ఊపిరి తీస్తునపుడూ
సమీప దూరాల వియోగ విరామాల నడిమి
దివారాత్రాలూ విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం
ఆగిపోయిన దారుల వెంట
గమ్యం తెలియని ఒంటరి నడక
వాలిపోయిన వాకిట రాలిపోయిన రంగులు
ఊహలతో కొంత కొలుస్తాను
మౌనంతో కొత్త ముడేస్తాను
పట్టు దొరకని చేరువలో
తీగ తెగిన రహస్తంత్రి విషాదాన్ని పాడుతూ..
అవునూ దుఃఖపు తడిలేని నిష్కమణను
అలాఎలా నిర్వచించగలిగావు?
మహా సూన్యంలాంటి ఏకాంతంలో
బిన్ ఆగ్ దిల్ క్యూ జలాయే?
చిటారు కొమ్మన ఊగే పూమొగ్గ
గలగలమనే ఆకుల ఊసుల మధ్య
ఎవరికీతెలియని చోట
ప్రాణం పోసుకొని పదాలలో
మొట్టమొదటి ఆ చివరి మాటకోసం
మౌనం నుంచి ధ్యాన శిఖరందాకా
తడవ తడవకూ తడిమే అదే కల
నదిని రేగిన నెగడును ఆర్పలేని నిస్సహాయత
పట్టు జారిన అయోమయన గల్లంతయిన గుండె
పూరెక్కలవంటి అయినవేళల కోసం
ప్రతి ఉదయంలో వెదుకుతాను
ఉండీ లేని సందేహం కదలనీదు
ఉన్నదేదో కాకపోయాక
కట్తీహై దుఃఖం మే ఏ దిన్!
అడిగదిగో.. అదియె మన యాత్రాస్థలం
కలిసి విడిన అడుగులవెంట
ఏక్ తారతో కలసి విరాగి తత్వం
ఎక్కవలసిన రైలు రాక మునుపే
గమ్యం గ్రహించిన పధికుడా!
మరలిపోయే ముందు ఒక్కసారి
వెనుదిరిగి చూడాల్సింది
దిగులు దీపం గుబులు నిన్ను కదిలించేది
కనీసం ఆకాశం నేలను చుంబించే చోట
రాయని నా ప్రేమలేఖ చదవాల్సింది
వెంట తరిమే ఎడారినీడను విడిచి
పగలు రాత్రివైపు నడిచినంత సహజంగా
ఏవీ పట్టని పురిటి క్షణాలకోసం
నాకోసమే నీవైన నిన్ను వెదుకుతూ
దిగంతాలకవతల నిన్ను పోల్చుకుంటాను
ప్రేమించడమే తెలిసిన పసిదనాన్ని
మరింత మక్కువగా హత్తుకుందాం
కొత్తగా చేరిన వెలుగు పూలతో
పాలపుంత పరిమళిస్తుంది
ఆకాశం అమేయమౌతుంది
నిజంగా…. నిశ్చయంగా…..
*
కనీసం ఆకాశం నేలను చుంబించే చోట
రాయని నా ప్రేమలేఖ చదవాల్సింది