“నువ్వు ఇట్లాంటోడివా?”

తురుకోళ్లగా పుట్టడం పాపమా?

“ముస్లింల తప్పులేదు. ఢిల్లీకెళ్లిన వారి కంటే తిరుపతికి వెళ్లిన వాళ్లు, ఇషాకు వెళ్లిన వాళ్లు ఎక్కువున్నారు”అనే భార్గవ్ సర్ పోస్ట్ ను షేర్ చేసి పడుకున్యా పైటాల. నిద్రలేచేసరికి “నువ్వు ఇట్లాంటోడివా?”, “ నీ గురించి ఏమో అనుకున్యాం” అంటూ తెలిసిన వాళ్లు నాకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. లెక్కబలం లేకపోవడం, ఉద్యోగం, అంగబలం తక్కువ ఉండటం వల్ల వెనక్కి తగ్గినా. నిజం చెబితే నా సమాజం ఇట్లా అంటుందేంటి అనుకున్యా. బాధపడ్డా. పెద్దచేపల్లో చిన్నచేపలం కదా ఇట్లనే ఉంటాదనుకున్యా. ఇది రాజ్యం చేసిన బెస్ట్ పీఆర్ పనే కదా?
దాదాపు ఇరవైరోజుల తర్వాత..
మైటాల నాలుగప్పుడు మర్రిమాను కింద పొద్దుపోక కూర్చున్యా! నా వేదనలు, బాధలు పంచుకునే మర్రి ఊడలకాడకి నా మాదిరే చానామంది వచ్చి కూకుంటాంటారు. అక్కడికి ఒక చదువుకోని అరటితోట రైతు రెడ్డప్ప వచ్చినాడు. మాటల్లో.. “యముడికి చానా రెస్టులే. ఆయప్పకు సెలవులు’ అన్యాడు. నా సెలవులూ, ఆయన జీవితం మాట్లాడుకుంటానాం!
మాటల మధ్యలో ఒక టీవేసు వచ్చి ఆగినాది. ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసుకోని పులిందలకు పోతా ఆ చెట్టుకింద ఆగినాడు. కరోనా వల్ల తెలీని వాళ్లు స్నేహితులవుతున్న కాలమిది.. కేవలం కరోనా మింద మాట్లాడితే చాలు! కలిసిపోతారు. అట్ల రెడ్డప్ప, నేను, చాకలాయిప్ప మాట్లాడతానాం!
“రేయ్ … తురుకోళ్ల ఇంటికాడికి పోవాకు. వాళ్ల బట్టలు ఉతకాకు” అన్యాడు రెడ్డప్ప!
“అట్లనేయ్య! నాకుతెల్చు. ఈ తురుకోళ్లు మసీదలకు పోతారు. కర్సుకుంటారు. నేను వాళ్లతో  లెక్కకూడ తీసుకోనుయ్యా”అంటా అడ్డపంచె సర్దుకుంటాండాడు! “య్యోవ్.. మీకు తెల్దో లేదో .. వాళ్ల చేత్తో లెక్క కూడ తీసుకోడంలా”అంటా గర్వంగా కాలరు ఎగిరేసినాడు.
మధ్యలో నేను అందుకున్యా!
“ఓ పని చేయి.. నోట్లను డెటాలుతో కడిగి బీరువాలో ఎత్తిపెట్టుకో.  తురుకోళ్లందరితో రాలేదు. మోడీ సారు విదేశాలనుంచి ఎవ్వరినీ రానియ్యకుంటే .. ఇది లేదన్నా. 30 శాతం మాత్రమే వీళ్ల వల్ల వచ్చినాది. మిగతా70 శాతం ఎవరు అంటించారు’ అన్నానంతే నవ్వుతా!
“సార్ .. అదికాదు! కరోనాకి మందు కనిపెడతారా?” అని టాపిక్ మార్చారు ఇద్దరు. నిజం వాళ్లను గమ్మగ చేసినాది.
ఆ రోజు ఇంటిచ్చాక బంధులొకాయన్ని కలిశా. “కరోనా మన పులిందల్లో జెండా మాను వీధుల్లో ఉండాయంట. అక్కడికి పోయినోడికి క్వారెంటైన్ లో పెట్నాక నెగటివ్ వచ్చిందంట. టప్పెట్లతో పిల్చకచ్చినారు మొగోణ్ని’’ అని ఆ మామ అన్యాడు.
‘పాపం.. వాళ్లకేం తెలుసు”?!
“నీకు తెలీదు వాయ్ .. అల్లుడూ! మనం వాళ్లమాదిరి పనులు ఇడిచిపెట్టి యాటికంటే ఆటికి గుంపులుగ పోతారు. రోతనాకొడుకులు”అన్నాడు.
“అన్ని మతాల వాళ్లు పోతారు. మామూలే “
“చూడు అల్లుడు.. వాళ్లు నీటు ఉండరు. రోతనాయళ్లు. కొట్లాటలకు గుంపుగా వచ్చారు”
“భయం మామ! భయ్యం. తక్కువమంది గుంపుగా కలుచ్చారేమో”
“ఇలేకరితో మాట్లాడలేను. నువ్వేమన్నా వాళ్లల్లోకి దిగినావా? ఏంలా మన దూదేకలోళ్లు గడ్డాలు,టోపీలు పెట్టి గెటప్పు మారుచ్చాండారులే వాయ్ “అన్యాడు.
“మన కులం పోగొట్టను. నిజాలు చెప్పినా అంతే” అన్యా. ఇంతలో ఫోనొచ్చి ఆ మాటలు ఆగిపోయినాయి.
రెండుమూడురోజులాగినాక..
ఒక కరీంనగరు మిత్రుడు హఫీజు కాల్ కొట్నాడు. యోగక్షేమాలు తెల్సుకున్యాం. మాటల్లో ఢిల్లీపోయిన వాళ్ల గురించి బాధపడినాం!
“పాపకు జ్వరం. వాంతికి. పాలుతాగల. ఆసుపత్రికి పోయినం. మా ఆవిడ బురఖా చూసిన్రు. ఖతం. మీరు డిల్లీకి పోయిన్ర’ అని అడిగితే పోలేదు అన్నాక.. రిక్వెస్ట్ చేశాక . వైద్యం చేశాడు’అన్నారు. వామ్మో అన్యా.
“మా పెదనాన్న గడ్డం పెంచుతాడు. మసీదులో ఎక్కువుంటాడు అని ఎవరో చెబితే మా పాపను చూడటానికి ఆసుపత్రిలోకి రానియ్యల’అన్యాడు హఫీజ్ !
ఫోన్ పెట్టేస్తూ NRC, CAB ఓకే చేయించుకుంటారు. మనం ఫర్లేదు. పేదవాళ్లు ఏమవుతారోనని బాధపడ్డాడు!
“పెద్దసారు.. పార్టీకోసం ఏ ముద్ర అయిన వేస్తాడు. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం కూడా ఇవ్వనందుకి ఓటరుగా మనకిమనం మన మెట్లతో కొట్టుకోవాల’
“నిజమే.. కాంగ్రెస్ ఇలా ఉండకపోవు. నేను ఫేస్ బుక్ లో నిజం రాస్తే .. నన్ను తిడుతున్నారు”అంటూ ఫీలయ్యాడు.
“మన దగ్గర డబ్బుల్లేవు. ఇంటిని కాపాడుకోవాల. ఎమోషన్ మరీ ఎక్కువ అయితే ఇంట్లో పెండ్లాం, పిల్లలకు తిండిపెట్టలేం. కొట్లాటలు తగవు’ అన్యా. మా కూతురు ఫోన్ లాగుతోంది.. తర్వాత మాట్లాడత అన్యాడు!
సరిగ్గా  హఫీజుతో మాట్లాడాక మా పెద్దమామకు షుగరొచ్చి కిందపడిపోయింటే.. పులిందల్లో  సీఎం జగన్మోహన్ రెడ్డిగారి మామ వాళ్ల ఆసుపత్రికి తీసకపోయినాం. అడ్వాన్సు పదివేలక కట్నాక.. నర్సు ‘మా కేమీ సంబంధం లేదని, ఏమయినా అయితే’ అని ఉత్తరం రాయమంది. సంతకం కూడ పెట్టినా.
కెసీట్లో “నూర్ బాష” చూసిన డాక్టరు మెల్లగా “ఢిల్లీ పోయినాడా” అనడిగాడు. “అడగటం మీధర్మం. మా పెద్దమామకు పక్షపాతం వచ్చి”అన్యా!
“అది కాదు. బంధువులేమైనా? “ అంటే “వెళ్లలేదు సర్ ‘’ అన్యా! ఐదు రోజులు ఐసీయులో ఉన్నాక.. మామ ఆరోగ్యం కుదుటపడినాది.
ఒకరోజు బండిమీద కూరగాయలమ్మే ఓ వ్యక్తిని పలకరించా. యాపారం అడిగాను. “రెడ్ జోన్ ఉందిప్పా! తురకోళ్ల  దగ్గర కొనల. భయపడుతున్నారు’అన్యాడు. పేద వాళ్లు ఎలా బతుకుతారోనని బాధపడతా ఇంటికొచ్చా!
ఓ రోజు ధనికుల బజారుకు పద్దన్నే పోయా. ఓ తెల్సిన సారు దగ్గరికి పోయినా. మాటల్లో “మా ఏరియాలోని వాకర్లు అంతా సాయంత్రం కలుస్తారు. తురుకోళ్ల దగ్గర చికెను, మటను కొనద్దు. హలాలు లేకుండా బతకలేమా? కోళ్లను పట్టకచ్చుకోని ముర్దారు కోసుకోలేమా?” అంటున్నారు.
“దారుణం సర్ “
“అంతా చదువుకున్న అనుభవమున్న ఆఫీసరులే”
“ఏంటో..”
“అరాచకమే అయ్యా. మళ్లా బిజేపీ వస్తే. చానా కులాలు పోతాయి” అన్యాడాయన.
బాధపడ్డాం ఇద్దరం.
మాటల్లో “మొన్న ఓ ముస్లిం అమ్మాయి కొందరి ప్రశ్నలు తట్టుకోలేక బయటికొచ్చేపుడు బొట్టు పెట్టుకుందంట” అన్యాడు సారు.
“భయం. అభద్రత” అన్యా!
నా కళ్లారా చూసినాక, నిజాయితీగా మిత్రులు చెప్పిన మాట ఇన్యాక .. ఈ కరోనా టైములో ఈ విషప్రచారమేంటీ? అని ఆలోచిస్తే ఒళ్లు దడదడలాడింది. దడుచుకున్యా.
చుట్టూ మంచి వాళ్లున్నారు. ఆ కొంత మంది మనుషుల ఆలోచనలు మార్చారు రాజకీయాలకోసం. అధికారదాహం కోసం చిన్నమైనారిటీ చేపలను ఏంచికోని తినడం భావ్యమా?
తురుకోళ్లగా పుట్టడం పాపమా?
చిన్నచేపలను తిమింగలాలు మింగేయటం ఎంత సేపు?
కూరగాయలు, పండ్లు, చెప్పులు, జ్యూసు అమ్మేవాళ్ల దుస్థితి ఏంటీ?
ఎల్డింగు పనిచేసేవాళ్లు, మెకానిక్కులు.. ఇలా చిన్నాచితక పనులు, వ్యాపారాలు చేసే వాళ్ల కష్టాలు ఆ దేవునికి(ఉంటే) ఎరక. ధనికులకేం కాదు. ఎటొచ్చీ పేదముస్లింలపైనే వేటు!
*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

3 comments

Leave a Reply to Rajavali Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు