నీ ముఖమే గుండెలో తగులుతుంది

ప్రవీణ్ దృశ్యంలోంచి పెద్దన్న భాష్యం!

రుణమ్మ , ఈపేరు కొండకంటే బరువు. మనస్సు లోయకంటే లోతు. పట్టుదల ఆకాశం కంటే అనంతం.

ఓపిక గాలి కంటే విసురు.దుఃఖం భూమి కన్నా బరువు.ఎవరికైనా కష్టాలొస్తే కన్నీళ్లు వొస్తాయి.మరి కన్నీళ్లకే కష్టాలొస్తే అది కరుణమ్మోమో.కరుణమ్మ నాకు నాయనమ్మ వరస. మాఊరే. నాచిన్నతనం నుండి నాయనమ్మని చూస్తూనే ఉన్నాను.ఎడతెగని పోరాటానికి చిహ్నం ఆమె.నిరంతరంగా పాట్లుపడుతూ ,ఆటుపోట్లను ఎదుర్కొంటూ , పడిలేస్తూ, ఇంతదూరం నడిచివొచ్చిన వీరవనిత.కత్తులు కటార్లు పట్టిన వీరనారికాదు.భర్త చేతుల కత్తులలో గాయపడుతూ రక్తం జలజల రాలుతున్నా,గాయాలకు  స్వేదంతో మందురాసుకొని, కన్నీళ్లతో కట్లుకట్టుకొని ,ముగ్గురు ఆడపిల్లల్ని పెంచిపెద్ద చేసిన ఒకానొక తల్లి వృక్షం. దారిద్రాన్ని అడ్డంగా నిలువుగా కోసి తన సత్తువ చూపిన కన్నిటికడవ. బతుకునదిలో దారితప్పిన ఒంటరి పడవ. పాతిక రూపాయల కూలితో పిల్లల ఆకలి తీర్చటం, మొగుడి సారాయి దాహాన్ని ఆపటం సాధ్యమేనా?చదువుకని పోయిన ఒక్కగానొక్క కొడుకు తండ్రిబాటలోనే నడుస్తూ ఎత్తిన సారాసీసా లా ఇంటికొస్తే తట్టుకొని నిలబడటం కుదిరేపనేనా?ముగ్గురి కూతుళ్ళని ఏ మచ్ఛాలేకుండా దారిమలపటం సులువుగా సాధ్యపడే విషయమేనా?తాగుడుకోసం పిల్లల బతుకుల్ని తాకట్టుపెట్టి తినడానికని తెచ్చిన రేషన్ బియ్యాన్ని సైతం తాగుడుకు అమ్మేసిన భర్త అరాచకత్వం చూసి కన్నీళ్ళుపెట్టుకొని సముదాయపడటం తెలికేనా?దారిద్య్రం పేదరికం ఐదువేళ్ళునోట్లోకి పోనితనం, ఏ పిడుగు ఏ క్షణంలోంచి రాలిపడి బతుకుని ఛిద్రం చేస్తుందో ఏమో తెలీని పీకులాటలో, ఏ సుడిగుండం ఏ ఆర్థికసంక్షోభం తనకుంటుంభాన్ని పెళ్ళగిస్తుందో అనే దినదిన నరకంలో జీవించటం అందరికి కుదిరేపనేనా?

పిల్లల్ని సంకనేసుకొని ఎన్నిసార్లు బావుల్లోకి తొంగిచూసి తిరిగొచ్చి మొదటినుండి జీవించటం కుదిరేపనేనా? అడుగుతీసి అడుగు వేసే క్రమంలో కాళ్ళకింద నుండి కోసుకుపోయే ఇసుక రేణువుల్లాంటి బాధ క్షణాల్లోనించి ,ఒకానొక వెనిక్కి నెట్టేయబడుతున్న తనంలోంచి ,ముందుకు పోవటం, చీల్చుకుని విస్తరించడం, కరుణమ్మకి కొత్త ఏమి కాదు .తనకిదంతా అలవాటే.పాలు తాగిన నాటినుండి  వయా పసుపుతాడుని కలుపుకుని పిల్లల్ని కని పెళ్లిళ్లు చేసేదాక ఎడతెగకుండా చేసిన పని ఇదే.

నాట్లు వేయటం,కుప్పలు నూర్చటం,దుగాలుచెక్కటం,గింజల్ని తూర్పారబట్టడం కంది నరకడం,నాగలి దున్నటం,బస్తాలు మోయటం,ఒకటేమిటి  మగాడు చేసే ప్రతిపని కరుణమ్మ చేస్తూనే ఉంది.మూడుముళ్లు వేసి బతుకంతా బానిసని చేసినా ,తన శ్రమని, పనిని, కష్టాన్ని లాక్కుంటూ, ఒళ్ళంతా గాయాలు చేసినా,తుమ్మ పేడుతో దేహమంతా రక్తంతో అలికినా ,పిల్లలు నిద్రించాకా మత్తులో ,మగజగత్తు ఇచ్చిన అహంకారంతో తనని అత్యాచారం చేస్తున్నా,జెర్రిపోతు కాట్లును చూసి పిల్లలముందు ఏమీ చెప్పలేక దుఃఖపడినా, ఏంచేయగలదు పిచ్చితల్లి కరుణమ్మ.ఎలా భరించిందో? ఆ బీడీ మచ్చల్ని?ఎలా ఓర్చుకుందో గోర్లుపీకిన గడియల్ని?ఎలా తట్టుకుందో నోటిలో బట్టపెట్టి హింసించిన క్షణాల్ని?ఎలా నిలబడ్డదో
ముళ్లుగర్ర విరిగేదాకా కొట్టినా?,విరిగిపోయిన ముళ్ళు కాలికి పెట్టే సలపరం లాంటిది.తేలుకుట్టి నొప్పి పుట్టే పాదం తీపిలాంటిది.ఎన్ని భరించిందని?ఎంత నరకానికి సాక్షి అయిందని?

ఫెమినిస్ట్ భాషలో కరుణమ్మ ఒక అణచివేత. మొగుడి దృష్టిలో కరుణమ్మ ఒక బానిస.ఊరి కళ్ళకి తను ఒక దురదృష్టవంతురాలు.మట్టిని చీల్చి గింజల్ని జల్లెడపట్టే పరుసువేది కరుణమ్మ.చెమటకాయాల్లోంచి పిల్లల్ని పొదిగిన పోలంగంప కరుణమ్మ.చీకట్లను చీల్చి వెలుగు రాజేసిన పొయ్యి కరుణమ్మ.ఎండకు ఎండి వానకు వంగి మళ్ళీ లేచి నిలబడ్డ గరికమొక్క కరుణమ్మ.బురధలోంచి బయటపడ్డ ఎడ్లబండి చక్రాల ఇరుసు కరుణమ్మ.చేతికి గాజులన్నా కొనుక్కోలేని దనికురాలు కరుణమ్మ.అమ్మా..! కరుణమ్మ ఎక్కడ నేర్చావు ఇంతటి ఓపికని.ఎవరు దిద్ధిపెట్టారు ఈ నడతని.?ఏ దయామయుడు అద్దాడు నీ కళ్ళకింత కరుణనని.?ఏ కరుణామయుడు పూసాడు నీ కాళ్ళకింత సహనాన్ని?

ఒకమనిషిని నమ్మి తనతోనే తన జీవితం అంతా అని నమ్మటం,పురుషు అహంకారంతో భర్త ఏమి చేసినా నోరు మెదపకుండా ఉండటం,భర్త ఎదిచేసినా ఎంత హింసించినా అదంతా కర్మనో జాతకమనో అనుకోవటం,ఎదురించే గుణాన్ని పోరాడి తెచ్చుకునే సంవేదల్ని కలిగించలేని అమ్మానాన్నల వైఫల్యం అనుకోవడం,కరుణమ్మ చేసిన తప్పేమో?కరుణమ్మ నీది తల్లీ..!, నిజమైన ప్రేమ.గాయం చేసిన మనిషిని సైతం ప్రేమిస్తావు.,తాగి ఎక్కడో రోడ్లపైనే పడిన నీ పెనిమిటిని ఇల్లుచేర్చి ఒల్లుకడిగి బువ్వపెట్టి మూతి తూడుస్తావు.పక్కలో పాసుపోస్తే చీదరించుకోకుండా శుభ్రం చేస్తావు.వాంతులు చేసుకున్నా,ఒంటిమీద గుడ్డ జారిపోయినా నీగుండేదో జారినట్టు ప్రవర్తిస్తావు.

లంజముండ,ఎవడిదగ్గర పడుకున్నావే ఇంతసేపు భోగంధానా? అని అవమానించినా రోతగా నిన్ను సంభోదించినా సంభోగించినా నిన్నునువ్వు కప్పేట్టుకొని అనుచుకొని సముదాయించుకొని కుమిలి కుమిలి దుఃఖించావేగానీ,ఒక్కమాట తిరిగి అన్నదానివికాదు.ఎదురుతిరిగి నీకేంకావాలో పోరాడినదానివి కాదు.  నువ్వో ఓపిక చెట్టువు.సహన సముద్రానివి.చెక్కుచెదరని సరస్సు గుణానివి.ఎంత తోడితే అంత స్వచ్ఛత వొచ్చే ఏటి చలమవి.పగిలిన నీ పాదంలో ఒక ప్రపంచముంది.ముడతలు పడ్డ నీముఖంలోబతుకు నక్షత్రాలున్నాయి.గాజులన్నా లేని నీ చేతుల్లో చలువ చేతలు మిలమిల మెరుస్తాయి.ఏటిని కాళ్లతో తన్నే గారడివాడికంటే,కొoడల నడుముల్ని కొలిచే మాయగాడికంటే,సముద్రాల అరికాళ్ళలో  ముళ్ళు తీసే మహర్షులకంటే,జీవితాన్ని ఉన్నదున్నట్టు వదిలేసి అరణ్యాల్లోకొ అడవ్వుల్లోకొ సాగిపోయే సన్యాసులకంటే,జ్ఞానులు మహామహా తాత్వికుల బోధనలు చెప్పే జీవితసారం కంటే ,తల్లీ నువ్వు జీవించిన జీవితమే గొప్పది.నువ్వు చూపిన మార్గమే గొప్పది.

రాలిన పూలు రాలుతూనే ఉంటాయి. రావాల్చిన చిగుర్లు వస్తూనే ఉంటాయి.ఏరు ఎండుతుంది.ఏరు మళ్ళీ నిండుతుంది.లేచిన మంటలు లేస్తూనే ఉంటాయి.ఆరిన జ్వాల రాజుకుంటూనే ఉంటుంది.ఇంకెప్పుడు తల్లి నీ దుఃఖం కొండెక్కేది?నీ కన్నీళ్లు ఆనందాన్ని వర్షించేది?మొగుడి అహంకారానికి ముడుచుకున్న నీ శరీరం ఎప్పుడు తల్లి విచ్చుకొని ఎగిరేది?ఎప్పుడు కాస్త కాలందొరికినా నువ్వే గుర్తొస్తావు.జాలిగా పేదగా ఎవరు కనిపించినా నువ్వే కళ్ళలో మెదులుతావు. నీ ముఖమే గుండెలో తగులుతుంది.స్వప్నాలు కలుక్కుమని కళ్లు చిట్లిపోతాయి.  ఇంకా ఎన్నాళ్ళు ఇలానే ఉంటావు అని ఒకటే దిగులు.తడిఆరని కన్నీటి ఆశ.

కరుణమ్మ…ఇన్నేళ్లలో ఎప్పుడూ నువ్వునవ్వడాన్ని చూడలేదు. సంతోషంగా ఉండటాన్ని వినలేదు. నీముఖం మీద ఆనందపక్షి వాలటo నేను ఊహించలేదు.

ఎందుకో ….మరి ఎందుకో..
దేవుడా ..ప్రభువా ..తండ్రి..నాయనా…ఎందుకో..ఈ కన్నీళ్ల గుగ్గీలు ఇంకెంత కాలం కరుణమ్మకి తినబెడతావు?ఇన్ని చీకటి జ్యోతుల్ని కరుణమ్మ కళ్ళలో ఎన్నేళ్ళు వెలిగిస్తావు?

Oh..!God, how long you would wound the womb of her?

*

పెద్దన్న

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nice sir…గుండెను తాకింది మీరు రాసిన ఈ స్టోరీ….మా అమ్మ పడిన కష్టలను మల్లి నా కళ్లలొ కదిలేలా చేసింది….చాలా బాగా రాశారు….ఫొటొ కుడా బావుంది పెద్దన్న @ప్రవీణ్ గారు

  • చదువుతుంటే….. కష్టాల కొలిమి….. వేడి….. నాకు తగిలినట్టుంది………

  • Sir Nenu me poetry chadavaka mudu peedanna sir anthey pillala ki patalu chepey oka manchi sir ,machi vekthi ani anukunanu sir me poetry chadivaka peddanna sir antey pillalaku matramey kadu ma lanti Andavalaku kuda oka message chaparu atta gari intiki veltey ela undali ani maku oka manchi message chaparu sir .karunamma lanti kastam mudu ma kastam anta ani pistudi e lanti poetry Rasinaduku thanku sir.tapulu untey shamichandi Sir

  • Avadhulu leni ame hrudayagaadhanu adhbhuthamyna mee rachanatho andaru aavedana chendela vivarinchaaru .excellent sir

  • Avadhulu leni ame hrudayagaadhanu adhbhuthamyna mee rachanatho andaru aavedana chendela vivarinchaaru excellent sir

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు