“నీ తలమీద కూర్చున్న ఆ ధన్య ఎవరు?”

కవులు చమత్కారాల కోసం ఏవేవో రాస్తారు. కానీ అసలు సంగతులు కూడా దాచి చెప్తారు. వెతుక్కోవడమే మనపని మరి!!!

ఒక పెద్ద పనికోసమని విశాఖదత్తుడి ముద్రారాక్షసం సంపాదించాను. చదువుదామని భయం గానే ఇలా పేజీలు తిప్పేను. మొదటగా నాందీశ్లోకం.
 విచిత్రం అది నాకు తెలిసినదే. సంతోషం కూడా కలిగింది. ఎందుకంటే అది ఎప్పుడో ఎలాగో నాకు నోటికి వచ్చేసిన శ్లోకం అంటే కంఠస్థం అనమాట. పైగా సంగీతరాగయుక్తంగా.
ఇది బహుశా ఓరియంటల్ కళాశాలలో చదువుకునేటప్పుడు ఏ సంగీతం టీచరో, తెలుగు టీచరో నేర్పి ఉంటారు సభారంభాలలో ప్రార్ధన కోసం.ఎన్నో ఏళ్లయినా ఇంకా గుర్తుంది
సరే బావుందని వ్యాఖ్యానం చూశాను. భలే నవ్వొచ్చింది పరిపరి విషయాలు మనసులో మెదిలి.
అవన్నీ ముచ్చటించుకుందాం
శ్లోకం ఇది
ధన్యాకేయం స్థితా తేశిరసి శశికళా కింను నామై తదస్యాః
నామైవాస్యాత్తదేతత్ పరిచితమపి తే విస్మృతం కస్య హేతోః
నారీం పృచ్ఛామి నేందుం కథయతు విజయా న ప్రమాణం యదీందుః
దేవ్యానిహ్నాతుమిచ్చోరితి సురసరితం ప్రాప్తమర్యాద్విభోర్యః
సంస్కృతనాటక సంప్రదాయం ప్రకారం నాందీ శ్లోకం లో శివస్తుతి ఉండాలి.
ఇందులో కవి కొంటె శివుడిని రక్షించమని అడుగుతున్నాడు.
పార్వతి అమాయకంగానో లేదా గడుసుగానో “నీ తలమీద కూర్చున్న ఆ ధన్య ఎవరు” అని అడిగింది.
 ఆయన” శశికళ” అన్నాడు.
“అది ఆమె పేరా” అంది.
” అవును అదే పేరు. నీకు బాగా పరిచయమైనదే ఎందుకనో మర్చిపోయాను” అన్నాడు.
“నేను అడుగుతున్నది అమ్మాయి గురించి చంద్రుడి గురించి కాదు” అని రెట్టించింది పార్వతి.
 దానికి శివుడు నిర్విచారంగా, నిర్భీతి గా “నీ చెలికత్తె విజయను అడుగు కావాలంటే చంద్రుడో కాదో చెప్తుంది.” అంటున్నాడు
ఇలా పార్వతీదేవి నుంచి గంగను దాచడానికి మాయమాటలాడే శివుడు మిమ్ములను కాపాడుగాక అని ప్రార్ధన
ఇదేం ప్రార్ధనండీ!!?
రామరాజు భూషణుడు వసుచరిత్రం అవతారిక లో ఇంతకన్న తెలివైన పద్యం శివస్తుతి గా రాస్తాడు
అదీ విందాం
ఆ మందాకిని మౌళిబూని నను అర్ధాంగీకృతం చేసితి ఔనౌ మేల్మేలని ఆర్యయల్గ
ప్రణంతుండై తత్పదాంభోజ యోగామర్షంబున గంగయున్మొరయ చూడాభోగ సామర్ధ్యంబున వేడు శుంభుడు కృతిస్వామిన్ కృపన్ ప్రోవుతన్
ఇక్కడ “ఆ మందాకినిని నెత్తిన పెట్టుకుని నన్ను అర్ధాంగీకారంతో సరిపెట్టేవని” ఆర్య అంటే పార్వతి అలిగింది.
అపుడు ఆమె అలక తీర్చడానికి శివుడు ఆమె కాళ్లమీద పడ్డాడు. అతని తోపాటు తలమీద ఉన్న గంగ కూడా పార్వతి కాళ్లమీద పడవలసి వచ్చి అరిచిందిట. మొరయ అంటాడు మొరిగిందనమాట. అంటే నది కదా కింద పడేటప్పుడు చప్పుడు. మరి ఆమెను ఊరుకోబెట్టాలి పార్వతికి తెలియకుండా.
అందుకని తలమీది జుట్టు లేదా జడలు సరిచేసుకునే వంకతో గంగను వేడుకుంటున్నాడట. అలాంటి శంభుడు కృతిస్వామిని అంటే వసుచరిత్ర కావ్యాన్ని అంకితం తీసుకున్న అళియ రామరాజును రక్షించాలని స్తుతి.
ఈ ప్రార్ధన లో భట్టుమూర్తి ప్రతిపదంలోనూ చమత్కారం నింపుతాడు. మందాకిని అంటే అరవై ఏళ్ల స్త్రీ. ఆర్య అంటే పదహారేళ్ళ అమ్మాయి. అర్ధాంగీకృత అంటే శివుడి సగ భాగం లో ఉన్నది అనీ అర్ధ్ంగీకారం అనీ ఇవన్నీ శ్లేషలే.
ఆ అందాలలా ఉంచుదాం.
అసలు ఈ ఇద్దరు భార్యల గొడవేమిటి
“అనేకాసు నాయికాసు అవైషమ్యేన స్నేహానువర్తీ దక్షిణో నాయకః ” అంది కావ్యాలంకారశాస్త్రం
ఎంతో అందంగా.
అనేకమంది నాయికల మీద వైషమ్యం లేకుండా స్నేహం తో ఉండేవాడు దక్షిణ నాయకుడట. వైషమ్యం అంటే ఏమిటి,స్నేహమంటే ఏమిటి
దానికి తెలుగులో నరసభూపాలీయం పేరుతో వచ్చిన అనువాదం లో
“చెలగు బహుప్రియా సదృశ శీలుడు దక్షిణుడు “అని ఉంటుంది.
ఎక్కువమంది భార్యలు ఉండి వారి పట్ల సమానమైన నడవడిక కలవాడు అని అర్ధం. నలుగురు శృంగార నాయకుల్లో ఈయన ఒకడు.
ఇక అర్ధమయ్యేఉంటుంది మీకు నా ప్రశ్న.
దక్షిణ అనే నాయిక లేదా అని.
ఈ ప్రశ్నవేస్తామని తెలిసి ఆయన దక్షిణ నాయకుడికి లక్షణం చెప్పేక ఉదాహరణ గా మంచి పద్యమే రాశాడు. ఇదికూడా రామరాజు భూషణుడే రాశాడు.
సాగర మేఖలా సతికి చారు భుజా పరిరంభమిచ్చె
వాణీ గగనావలగ్నకును నేర్పు మెయిన్ మొగమిచ్చె వీరలక్ష్మీ గజరాజగామినికి అమేయభుజాంతరమిచ్చె సంతత త్యాగి నృసింహభూవరుడె దక్షిణ నాయకుడెన్ని భంగులన్
ఆ మహారాజు సముద్రమే మేఖలగా గల ఒక భార్యకు భుజాపరీరంభం ఇచ్చాడట. సరస్వతిఅనే మరో కాంతకు ముఖాన్ని శౌర్యలక్ష్మి అనే మరో అతివ కు బాహువులను ఇచ్చాడని చమత్కరిస్తూ ఆయన ఏకపత్నీత్వాన్ని కాపాడేడు. అంటే ఇక్కడ భార్యలు గా భామిని చదువున పరాక్రమాన్ని చెప్పేడు
ఇక లీలాశుకుడి కృష్ణ కర్ణామృతంలో పద్యం కూడా గుర్తురాక మానదు.
అంగుళ్యామ్ కః కవాటం ప్రహరతి
కుటిలే మాధవః కిం వసంతః
నో చక్రి కిం కులాలః
అంటూ ఓ గోపిక కృష్ణుడిని నిలదీసే శ్లోకం
రాత్రంతా ఎక్కడో గడిపి తెల్లవారు జామున ఇంటికి వచ్చి తలుపు తట్టేడు కృష్ణుడు. గోపిక కోపంతో నిద్ర పట్టలేదు. పోలేదు. తలుపు తియ్యలేదు. ఆమెకు వచ్చిన వారి జాడ తెలుసు.
అయినా సరే కోపం మీద ఉండి “వేళ్లతో ఎవరు తలుపు తడుతున్నారు” అని అడిగింది
నేనూ మాధవుడిని అన్నాడు
ఏమీ వసంతుడివా అడిగింది
మాధవుడంటే వసంతుడని కూడా అర్ధం ఉంది కదా
కాదు కాదు చక్రి ని అన్నాడు.
అహా కుమ్మరివాడివా అంది
ఇలా ఆమె ఆ దక్షిణ నాయకుడైన కృష్ణుడి మీద కోపం వెళ్లగక్కడాన్ని కవి చమత్కారం గా చెప్తాడు.
ఐతే విశాఖదత్తుడు కూడా శివుణ్ణి మోసగాడిగా చమత్కరించి ఊరుకోలేదు.
తర్వాత చెప్పిన మరో నాందీ పద్యంలో శివదర్శనం చేయిస్తాడు.
ఇది దేవుళ్ళ విషయం కాబట్టి చమత్కారాలన్నీ సరదాగా తీసుకోవచ్చు
కానీ చరిత్ర గానీ సాహిత్యం గానీ బహుభార్యాత్వానికి కిరీటం పెట్టి దక్షిణనాయకుల కథలే చెప్పుకుంటూ వచ్చింది.
అలంకారశాస్త్రం శృంగార నాయికలను కూడా చెప్పింది కానీ ఆ ఎనిమిదీ వివిధ అవస్థలే తప్ప అవి వారి స్వభావాలు కావు
చరిత్రలో దక్షిణ నాయికలు లేరు. సాహిత్యంలో కూడా. బహుశా స్త్రీల కోమల హృదయాలు అలాంటి సంక్లిష్టమైన మైన సంబంధాలకు తట్టుకోలేవనేమో
చలం గారు జానకి అనే కథ లో ఆ ప్రయోగం చేశారు. జానకి కి పెళ్లయింది. పిల్లవాడు. అన్యోన్య ప్రేమానురాగాల దాంపత్యం జీవనం లో ఉంటుంది.
ఒకనాడు భర్త తన ఆప్తమిత్రుడు సూర్యనారాయణ చిరకాలానికి కలిసాడని ఇంటికి తీసుకొచ్చాడు. అతనూ జానకీ చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా మెలిగారు. తర్వాత దూరమైపోయారు
రామారావూ సూర్యనారాయణా తర్వాత ఒకే గదిలో ఉండి నాలుగేళ్లపాటు కలిసి చదువుతున్నారు. ఆ రెండు జంటలకూ రామారావూ సూర్యం, జానకీ రామారావూ లకు ఒకరి గురించి ఒకరికి తెలియదు.
ఇప్పుడు జానకీ సూర్యం మళ్లీ పరస్పరం చూసుకున్నారు. పాత ప్రేమలు కదిలాయి. జానకి కి భర్తమీద అమితమైన ప్రేమ. అంతకన్నా ఎక్కువ సూర్యం మీద ప్రేమ. ఒకేసారి. తట్టికోలేదు. తేల్చుకోలేదు. భర్తకి చెప్పాలని ఉన్నా చెప్పి బాధపెట్టలేదు. నలిగి నలిగి కుమిలి కునారిల్లిపోతుంది. సూర్యం ఆమె అవస్థ చూడలేక దూరంగా వెళ్లిపోతాడు. ఆమె అనారోగ్యం పాలవుతుంది.
నాలుగు మాటల్లో చెప్పేనే కానీ గుండె కరిగి కన్నీరయ్యే కథ. స్త్రీలు దక్షిణ నాయికలు కాలేరని ఒకవేళ అయినా పురుషులలాగ దులుపుకు పోలేరని చెప్పినట్టు అనిపిస్తుంది ఆ కథ చదివితే.
నిన్న గాక మొన్న నాకు జాను సినిమా చూస్తే కూడా అదే అనిపించింది. జాను తిరిగి సింగపూర్ వెళ్లేక ఆమె మనస్థితి తాలూకు పరిస్థితి ఏమిటి. కాలం అనే మందుబిళ్ల ఓదార్పుగా ఉందనుకోవాలి తప్ప.
ఇలాంటి  సున్నితమైన పురుషులు కూడా ఉంటారు. వారినే అనుకూలనాయకుడు అని మళ్ళీ అలంకారశాస్త్రం అంది. “ఒక్కకాంతకే వలచి గుణాభిరాముడగువాడనుకూలుడు” అంటూ.
అటువంటి నాయకుడిని గుణాభిరాముడు అని పేర్కొనింది.
ఐతే విశాఖదత్తుడి దగ్గరకే మళ్లీ వద్దాం
రెండవ నాందీ పద్యంలో అసలు శివుడంటే ఏమిటో శివ తత్వమంటే ఏమిటో రాస్తాడు.
 శివ నర్తనాన్ని దుఃఖ నృత్తమ్ అంటాడు. చాలా కష్టతరమైనది అని. ఎందుకంటే మహోత్సాహంతో పడే అడుగుల స్వైరపాతానికి భూమి కుంగిపోతుంది. బాహువుల చలనానికి లోకాలు కదిలిపోతాయి. కంటి వెలుగుల వలన ఎదురుగా ఉన్న లక్ష్యాలు కాలిపోతాయి. అలా అని నృత్యం ఆపడానికి వీలులేదు. ఆ ఉపద్రవాలు కలగకుండా నృత్యం చేసితీరాలి. ఇది కష్టం తో కూడిన ఆట
ఒక్కమాటలో చెప్పాలంటే ‘సంయమనం’ అంటే ఇదే
ముందు పార్వతీదేవితో వేళాకోళం మాటలాడిన శివుడే ఈయన. కానీ లోకాలకు ఏ హానీ కలగకుండా తన తాండవ కేళి నిర్వహిస్తాడు. అలాంటి శివుడు మిమ్మల్ని రక్షించాలని మళ్లీ అన్నాడు కవి.
అందువల్ల దేవతల బహుభార్యత్వాలు సరదా కథలే తప్ప నిజాలుకాదు సుమా అన్నట్టుగా అర్ధమైంది నాకు.
కవులు చమత్కారాల కోసం ఏవేవో రాస్తారు
కానీ అసలు సంగతులు కూడా దాచి చెప్తారు
వెతుక్కోవడమే మనపని మరి!!!
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొరయ అంటాడు మొరిగిందనమాట.—–
    వీరలక్ష్మి గారూ
    పై అర్థం ఏ తెలుగు నిఘంటువు లోనూ లేదు. ఎవరూ కూడా ఈ అర్థం లో వాడటం ఎన్నడూ వినలేదు. మీ ద్వారా తెలుసుకున్నాం. ధన్యులం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు