నీ ‘కాళ్ళ’ కి సాష్టాంగం!

రేపు… మాపు అని వాయిదా వెయ్యొద్దనుకున్నా ఈ రోజు ప్రయోజనం లేదు, కాళ్ళ నిన్నలలో నిలిచిపోయారు!

‘కాళ్ళ’ గారికి పాతికేళ్ళ క్రితమే నేనో క్షమార్పణ బాకీ పడ్డాను. ఆ బాకీ తీర్చడం ఈ 25 ఏళ్లుగా కుదరలేదు, ఇప్పుడు ఆయనకు కుదరదు. ‘కాళ్ళ’ని క్షమించమని అడగాల్సి వచ్చిన కారణాన్ని చెప్పే ముందు, ‘మో’ (వేగుంట మోహన ప్రసాద్) గారి ఈ కవిత చూద్దాం:

నెత్తుర్నమిలిన కారాఖిళ్ళీ ‘లావా’ లా

వొస్తాయి నీళ్ళు నువ్ దంతధావనం చేసేపుడు

ఆ చప్పుడికి నీ బైపాస్ కార్డియాక్ డిజార్డర్

మరొక్కసారి గోరింటాకు పెట్టుకున్నట్లు నెత్తుర్నములుతూ

రక్తస్పర్శకు నును సిగ్గుపడి అపుడెపుడో

నీ నును రజస్వలానంతర నూగారు మీ

దొలికిన ఆశ్చర్యానందంలోంచి

ఇదేమిటి

ఇలాగేమిటి

ఇట్లా అయితే ఇంకా ఎట్లా

ఏం చేసుకోను దీన్ని

ఎట్లా లిఖించను దీన్ని

ముక్తాక్షరాల్లో

కొండచిలువలా

తొండ పావులా

నిర్గోడ మీద అర్భక బల్లిలా

స్మాల్ స్కై మీది బుల్లి చందమామ కుందేలు పిల్లలా

ఆశ్చర్యానందంలోంచి

టెక్సస్ వస్తాదు రుస్తుమ్మమ్మాయిల

వక్షోజ వికటాట్పటాఫట్ రెజిలింగ్ గుద్దుల్లా

రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’

అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించిన

‘కాళ్ళ’ కేకల్లా ఏ దంతానికి

ఏ రోమం దొరికితే దాన్ని పళ్ళతో పీకి

రోమ్ నించి వొస్తూ వస్తూ

ఇరవయిన్నొక్క వేల లీరాలకి

తెల్లా తెల్లారు జామున

హాయిగా నిశ్వసించటానికని

పన్ను లేని సిగరెట్టు కొంటూ శ్వాస కోశాల్లో

ప్రతి భస్మ అణువులోని భ్రష్టయోగి నిశ్వాసంలో

వొల్చుకున్న ఆశ్వాసాంత పద్యంలా

స్కాచ్ సీసాంత మద్యంలా

ఎలా ఒల్చుకోను నన్ను నేను జాల్ విమానంలో మానంలా

ఎలా దంత ధావనం చేసుకోను ఈ కారాఖిళ్ళీ

ఈ రక్తాక్షరాల ఉమిసిన ప్రేయసి పెదవుల్నించి 

కొండనాలుకలోకి కొండచిలువలా

ఉమిసిన లావాలో

ఎలా తోముకోను ఈ మకిలపట్టిన

మాళీ గేదె దేహ సౌందర్య సూర్యదగ్ధ లావణ్యాన్ని

తొలి మబ్బు నును నురగ బుద్బుద సౌందర్యాన్ని?

 

1984లో ‘అరగుంగో’ శీర్షికన ‘మో’ రాసిన ఈ కవితలో ‘కాళ్ళ’ ప్రస్తావన ఉంది. “రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’/ అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించిన/ ‘కాళ్ళ’ కేకల్లా…” అన్న పాదం దగ్గర ఒక అధోజ్ఞాపిక (footnote ) ఇచ్చి, ‘ప్రముఖ తెలుగు చిత్రకారుడు ‘కాళ్ళ’ – అని పద్యాంతంలో వివరణ ఇచ్చారు ‘మో’.

Argungu Fishing Festival గురించి కూడా ఒక ఫుట్ నోట్ లో ఇలా చెప్తారు: ‘మార్చ్- ఏప్రిల్ మాసాలలో నైజీరియా దేశం మొత్తానికే ఒక పెద్ద పండుగ ప్రదేశం. పెద్ద పెద్ద చేపల్ని పడ్తారు ఆ సమయంలో. కానీ, నీళ్ళు మాత్రం ఎర్రమట్టితో కలిసి ఖారాకిళ్ళీ ఉమిసినట్లుంటాయి.’

ఇంగ్లీషు ప్రొఫెసర్ గా నైజీరియాలో పనిచేశారు ‘మో’. ఇదే కవితకు ఇచ్చిన మరో ఫుట్ నోట్ లో the haves and have-notsకీ మధ్య ఉన్న దూరాల్ని ప్రస్తావిస్తారిలా: “ఆ దేశంలో పేదరికంతో పాటు భయంకరమైన క్యాపిటలిజం సహవాసం చేస్తున్నది. పెట్టుబడిదారులు హాయిగా బాక్సింగ్ క్రీడల్ని చూస్తూ ఉంటారు.” ఆ సామాజిక అంతరాలు, తీవ్రమైన అసమానతలు కవిలో కలిగించిన వేదన, క్రోధం అంతరాంతరాల చేతన నుంచి ఒక ఆకస్మిక ఆత్మగత భాషణై పెల్లుబికింది ‘అరగుంగో’ అంటూ.

చిత్రలేఖనంతో ‘మో’ కవిత్వాక్షరాలకున్న బంధం అపారం. ఆయన తన కవితల్లో Ernst Ludwig Kirchner, Max Beckmann, André Derain, Hermann Max Pechstein, Pablo Picasso, Édouard Manet, Oskar Kokoschka, Otto Muller, Giacomo Balla, Paul Cézanne, Marc Chagall, Henri E B  Matisse, Guillaume Apollinaire, Salvador Dalí, Vincent  van Gogh, Paul Gauguin….. (ఈ జాబితా అనంతం) వంటి చిత్రకారుల, వారి చిత్రలేఖనాల… Impressionism… Neo-Impressionism… Post-Impressionism ల నుంచి, Symbolism, Expressionism, Cubism, Futurism, Cubist-Realism… ల మీదుగా Surrealism దాటి… అనేకానేక ఆర్ట్ ఉద్యమాల ప్రస్తావన విరివిగా ఉంటుంది.

‘అరగుంగో’  కవితలో ‘కాళ్ళ’ వేసిన ఏదో ఒక బొమ్మని కాదు ‘మో’ refer చేసింది. ‘కాళ్ళ’ కళా మూర్తిమత్వాన్ని మొత్తాన్నీ ఒక పదచిత్రంగా గీసి ప్రదర్శించారు. ‘కాళ్ళ’ (అప్పటికి) గీసిన చిత్రాల సారాంశాన్ని ఒక భావంలోకి తర్జుమా చేస్తే వచ్చిన పదచిత్రం! లమ్డీముండా దేవుడ్నాకొడకా- అది తిట్టు కాదు, నింద కాదు, ఆరోపణ కాదు. ‘దేవుడు చచ్చిపోయాడని, మనమే దేవుడ్ని చంపిన పరమ హంతకులమ’ని నేరాంగీకారానికి పాల్పడే స్థితికి ఒక దశ ముందటి, చావని విశ్వాసాల ఆర్ద్ర… ఆర్త… అసహాయపు పిలుపు- లమ్డీముండా దేవుడ్నాకొడకా! రక్షించమని వేసిన గావుకేకల్లో ఉన్నది- భయం కాదు, విహ్వలత కాదు; పాముని చూస్తే వచ్చే వెరపు, లోయని చూస్తే వచ్చే జడుపు వంటిది కాదు, అసంబద్ధతల్ని చూస్తే కలిగే భీతి, అస్తవ్యస్తాల పట్ల కలిగే విభీతి. ఆ కేకలు వేసిన ‘కాళ్ళ’ – ‘feared’  కాదు, ‘dreaded’!

‘మో’ ది ఒక విలక్షణమైన చూపు. మనుషులు ఆయన కళ్లకి రెండు చేతుల… రెండు కాళ్ల… దేహాలుగా కనిపించరు, సారం వంటి అంతర్లోకపు manifestations గా మాత్రమే కనిపిస్తారు. ఈ కవిత రాసే నాటికి ‘కాళ్ళ’ వయసు- 36 ఏళ్లు. బహుశ, అప్పటికింకా ఖమ్మం మారి ఉండకపోవచ్చు. పువ్వులు సిగ్గుల,  పాటలు పరువాల ‘కాళ్ళ’ యవ్వనం, చలం గారి ఛత్రఛాయలో అమీనా.. మైదానాల ఉన్మత్త ఉన్మీలనం, ఐంద్రిక ఐకాంతిక స్వేచ్ఛాప్రణయం,  ఐచ్ఛిక దారిద్ర్యం, అధోజగత్ జీవన సాంగత్యం – వీటన్నింటికీ సమాంతరంగా నిరంతరంగా రంగులై రగులుతున్న, కాన్వాసులై కాల్చేస్తున్న ఆర్తితో హృదయం పెడుతున్న ఆర్తనాదం- దాన్ని దర్శించారు… ప్రదర్శించారు ‘మో’!

**           **           **

నాకు ‘కాళ్ళ’ తెలిసింది ‘మో’ గారి ద్వారానే. ‘అరగుంగో’ కవిత ద్వారా మాత్రం కాదు, అంతకుముందు, ‘మో’- ఆత్మకథనాత్మక కవిత్వం- ‘బతికిన క్షణాలు’ ముఖచిత్రకారుడిగా! పుస్తకం చదవకముందే దాని మీద సమీక్ష చదవడం ఇష్టం లేదు నాకు. ‘బతికిన క్షణాలు’ ముఖచిత్రం చూసినప్పుడు అనిపించలేదు గానీ, దాన్ని చదివాక, ఆ ముఖచిత్రం కుంచెతో కాళ్ళ రాసిన సమీక్షే అనిపించింది. Temporal art form అయిన కవిత్వ చర్చలో spatial art form అయిన చిత్రకళకి సంబంధించిన రంగులు, ఆకారాలు, పరిమాణాలూ, సంకేతాల్ని Spatiotemporal planeలో అనుసంధానించేందుకు చూశారేమో ‘మో’, ఆ ప్రయత్నాన్నే తన ‘బతికిన క్షణాలు’లో ఇలా అంటారొకచోట:

“అక్షరంలోని ఎక్స్‌ టెండెడ్ రియాలిటీ (extended reality)ని చూపించాలంటే రంగుల్నీ షేప్స్(shapes)నీ సైజెస్(sizes)నీ, టిక్మర్ నీ స్పేసియో టెంపోరల్ యాక్సిస్ (spatiotemporal axis)లో పిన్నుల్ని గుచ్చుకుంటూపోవాలి.”

ఏ గుండుపిన్నుల్నైతే గుచ్చుకుంటూ పోవాలని ‘మో’ అన్నారో, అవి ‘బతికిన క్షణాలు’ ముఖపత్రంలో నెత్తురోడుతూ కనిపించినప్పుడు నాకు ‘కాళ్ళ’ తొలిసారిగా పరిచయమయ్యారు.  ఆ పరిచయం, ‘అరగుంగో’  కవితలో అధోజ్ఞాపికగా మరోసారి ఎదురయ్యి సంపూర్ణమయ్యింది (‘అరగుంగో’  కవిత ‘మో’ 1984 లో ప్రకటించినా, నేను చదివింది మాత్రం ‘రహస్తంత్రి..’ కవితాసంకలనంలో 1991లోనే).

అప్పుడే గట్టిగా అనుకున్నాను, నా కవితాసంకలనానికి ‘కాళ్ళ..’తోనే  బొమ్మ వేయించుకోవాలని. అనుకున్నట్టుగానే, మరుసటి ఏడాది 1992 చివర్లో నా ‘రెండ్నిమిషాలు మౌనంగా’ కవితల డ్రాఫ్ట్ పట్టుకొని ఖమ్మం వెళ్ళాను.

“నా మొదటి కవితాసంకలనం అట్ట మీద మీ బొమ్మ, మోహన్ గారి అక్షరాలు ఉండాలని గట్టిగా కోరుకున్నాను ‘కాళ్ళ’ గారూ.. ” అని చెప్పాను, కొంచెం ఆత్రంగా.

‘ఎందుకలా, నా అక్షరాలు బాగుండవా..’ అనే అర్థం వచ్చేలా ఆయన అడిగినదానికి బదులు చెప్పడానికి ఇబ్బందిపడి, ‘అలా ఏమీ కాదు’ అనే అర్థం వచ్చేలా నసిగాను.

“నాక్కూడా కొద్దో గొప్పో అభిమానులుంటారు కదా; ‘కాళ్ళ’కి అక్షరాలు రాయడం రాదనే ప్రచారం వాళ్లు చివుక్కుమనేలా చేస్తుంది కదా. నన్ను ఇష్టపడే వాళ్ల గురించి కూడా నేను పట్టించుకోవద్దా”- అచ్చంగా ఇవే మాటలు ‘కాళ్ళ’ గారు నాతో అన్నది. నాకప్పుడు పాతికేళ్లు, ‘కాళ్ళ’ ఒక ఏడాది అటూ ఇటూ ఇరవై ఏళ్లు పెద్ద నాకంటే.

“నా కవిత్వం చూడకుండానే కండీషన్లు చెప్తున్నారు. అసలు మీరు బొమ్మ వేసే స్థాయిలో నా కవిత్వం ఉందో… లేదో…” ఉక్రోషంగా అన్నాను (‘నా కవిత్వానికి బొమ్మ వేసే స్థాయి మీకు ఉందా’ అని నేను అడిగినట్టే వినబడి ఉంటుంది ‘కాళ్ళ’కి).

కవులకి బొమ్మలు వేయడం ఆంధ్రదేశంలో ఏ ఆర్టిస్టుకైనా కంచిగరుడ సేవే అయినప్పటికీ, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్..’ అన్న లెవల్లో నాకు బొమ్మ వేయడమే నీ జన్మకి సార్థకత అనుకునే కవులకి, ముఖ్యంగా (అప్పటి) యువకవులకి నేనేమీ మినహాయింపు కాదు. బహుశా, అందుకేనేమో తొణకని… బెణకని ఓ చిర్నవ్వు నవ్వారు ‘కాళ్ళ’ నా మాటలకి. గిర్రున వెనక్కి వచ్చేశాను, ఖమ్మం నుంచి హైదరాబాద్.

‘మో’ ని చూసి, ‘మో’ కళ్ళతో ‘కాళ్ళ’ని చూసి కూడా, ‘కాళ్ళ’ని రోమత్వఙ్మాంసాస్థిస్నాయుమజ్జాప్రాణాల సప్తధాతు సమ్మేళనంగానే కుదించుకొని, వెనక్కి వచ్చేశాను. ఎడతెగని ఎన్నెల సోనలకి పైకప్పుల అడ్డూఆపు లేని ఏలూరు శివారు మొండిగోడల ఇళ్లు- ‘కాళ్ళ’ ఎంకి పాటల మార్దవానికి జోగుతుండేవట, ఉరువు దరువుల ఆయన చిందుకి తూగుతుండేవట. మాసిన గడ్డంతో రికామీ విసురు గాలి వంటి కూరిమికాడు ‘కాళ్ళ’ అంటే ముదిగారంగా మూగే నేస్తురాళ్లకి భలే మోజట (ఏలూరు రమణ గారు (ఇప్పుడు లేడు), ప్రకాష్ గారు కథలుగా చెప్పేవారు). ‘అంతమంది అమ్మాయిల్ని ఆకర్షించిన ఏమంత రూపసి’ అన్న ఉక్రోషంతో చూశానేమో, ఆనాడు ఖమ్మంలో ‘కాళ్ళ’ని. ‘కళలలో రాచరికముంటుంది. ఒక సింహాసనం వుంటుంది. కిరీటాన్ని తన ఖడ్గంతో తీసుకుని శిరస్సుపై వుంచుకునే పొగరుమోత్తనం వుంటుంది,’ అంటారు కవి, కథకులు,  ఫణికుమార్ (ఐఏఎస్). దానితో ఎంతో అంగీకారం ఉండి కూడా, కాసేపు కావరంతో ఏమారి, ‘మనుషులంతా ఒక్కటే.. ‘ తరహా సమానత్వ భ్రమతో బహుశా ‘కాళ్ళ’తో మాట్లాడి (పోట్లాడి) ఉంటాను.

ఇప్పుడిలా introspection తో అంటున్నానేగానీ, అప్పుడైతే నా ఉక్రోషం తగ్గలేదు. ‘కాళ్ళ’ బొమ్మా వద్దూ, మోహన్ అక్షరాలూ వద్దు- అని కొమ్మల జుత్తు విరబోసుకున్నట్టున్న ఓ trick photo ని కవర్ పేజీగా ఎంచి, మా శ్రీధి (పసునూరు శ్రీధర్ బాబు) తో అక్షరాలు రాయించుకున్నాను. అయితే, ‘కాళ్ళ’తో అవమానకరంగా ప్రవర్తించాను అన్న బుద్ధి కలగడానికి నాకు మరో ఏడాది పట్టింది.

నా పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి ‘మో’ గారి ఇంటికెళ్ళాను (1993 డిసెంబర్). అప్పుడే sample గా వచ్చిన ‘పునరపి ‘  కాపీ మీద ‘ఉష- నరేష్ కి పెళ్లికానుకగా…’ అని రాసిచ్చారు ‘మో’. పునరపి ముఖచిత్రం- అర్ధనారీశ్వరం- ‘కాళ్ళ’ పెయింటింగ్; అక్షరాలు కూడా ‘కాళ్ళ’వే. ‘కాళ్ళ’లానే, ‘కాళ్ళ’బొమ్మల్లానే రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’ అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించినట్టే ఉన్నాయి, ‘పునరపి’కి ఎంతో నప్పుతూ. కానీ, మరో రెండు నెలలకి ఆవిష్కరింపబడిన ‘పునరపి’ కవర్ మీద ‘కాళ్ళ’ బొమ్మ; అక్షరాలు మాత్రం మోహన్ గారివి.

దాన్ని చూడ్డంతోటే ఆ రోజు ‘కాళ్ళ’ గారు నాతో అన్న మాటలు ఛళ్లున ముఖం మీద చరిచినట్టు గుర్తొచ్చాయి. అప్పుడు కలిగింది పరితాపం… పశ్చాత్తాపం. ఆ క్షణమే ‘కాళ్ళ’ని కలిసి క్షమించమని అడగాలనిపించింది. ‘కాళ్ళ’ని కలవాలి రేపు-  అనుకుంటూ ఈ పాతికేళ్లుగా దాన్ని వాయిదా వేస్తూనే ఉన్నాను. రేపు… మాపు అని వాయిదా వెయ్యొద్దనుకున్నా ఈ రోజు ప్రయోజనం లేదు, కాళ్ళ నిన్నలలో నిలిచిపోయారు!

*

 

కాళ్ళ ఫోటో: ఉషాజ్యోతి బంధం 

 

 

నరేష్ నున్నా

20 comments

Leave a Reply to Bhagavan Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ కాళ్ల సత్యనారాయణ గారు ఏలూరు నుండి ఖమ్మం రావడం వెనక – – – డా.హరీష్, మా గురువు గారు కౌముది (షంషుద్దీన్) ఆధ్వర్యంలో ‘సరిత’ అనే సాహిత్య పత్రిక కోసం ఆయనను ఖమ్మం రప్పించారు. ఆ పత్రిక మొదలు కాలేదు గానీ ఆయన ప్రస్తానం – అవతనం తెలంగాణ లో గడిచింది. కాళ్ళ సత్యనారాయణ నాకొక్కడికే మిత్రుడు కాదు. అఫ్సర్ బాల్యం కాళ్ల చిటికిన వేలు పట్టుకునే గడిచింది. సీతారాం, ప్రసేన్, మోహన్, చంద్ర, సురేంద్ర, ప్రకాష్, అన్వర్, అక్బర్, hbt గీత, ఇంతమంది ప్రేమనూ ఆప్యాయతనూ పొందాడు కాళ్ళ… ఆయన మాకు ఒక విన్సెంట్ వ్యాంగో, మాకొక సాల్విడార్ డాలీ, డెబ్బై ఏళ్ళ జీవితం తలవంచకుండా గడిపాడు. వందలాది పుస్తకాలకు కవర్ పేజీలు వేసాడు. వేగుంట మోహన ప్రసాద్ “బ్రతికిన క్షణాలు”పుస్తకానికి అందరూ కాళ్ళ బొమ్మ కోసమే కొన్నారు అంటే అతిశయోక్తి కాదు. శివసాగర్, భామ,కేశవ రెడ్డి, రక్త స్పర్శ కవులకూ, రాం పునియాని హిందుత్వ రాజకీయాలు దాకా ఆయన వేయని కవర్ ఉందా ? అరుదైన నిరాడంబర జీవితం ఆయనది. నాలుగు దశాబ్దాల ప్రజా ప్రత్యామ్నాయ ఉద్యామాలనాడి ఆయన బొమ్మల్లో ఉంది. ఆయన వేసిన వేలాది బొమ్మలు ఆయన బ్రతుకులాగానే ఎలుకలకూ, పంది కొక్కులకూ ఆహారం అయ్యాయి. ఖమ్మంలో నీరుకొండ, కాళ్ళ నిలువెత్తు ఆచరణ నిరాడంబర జీవితం. కాళ్ళ సత్యనారాయణ అలియాస్ బొమ్మల సార్ ఇకలేరు… “ ~ గుర్రం సీతారాములు

  • “ కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ని అలాగే పట్టించుకోలేదు. అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్‌పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్‌ ప్రింటర్, తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ల సత్యనారాయణ నవంబర్‌ 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు. “ ~ సాక్షి దినపత్రికలో వచ్చిన నివాళి నుండి.

    https://www.sakshi.com/news/family/unwritten-autobiography-tribute-kalla-satyanarayana-1138552

  • చాల్రోజులకు బలమైన భాష , పటిష్టవంతమైన వ్యక్తీకరణ చదవగలిగాము. ఇరవైయేళ్ళక్రితం ఇంత గొప్పగా వుండేది సాహిత్య విమర్శ .ఇప్పుడు మీలాంటి అరుదైన సాహితీకారులే చిక్కని శక్తివంతమయిన భాష అందిస్తున్నారు ధన్యవాదాలు.

  • ” చిత్రకళా రంగంలో తెలుగు రాష్ట్రాల్లోనే లబ్ధప్రతిష్ఠులుగా పేరొందిన కాళ్ల సత్యనారాయణ ( 71 ) ఖమ్మంలో 24-11-2018 శనివారం నాడు కన్నుమూశారు. ఆయన కుంచెకు ఎల్లలు లేవు. సామాన్యుడి బతుకు వెతలు.. ఆర్థిక, సామాజిక పరిస్థితులు.. దేశ, ప్రపంచ కాలమానాలను చిత్తరువుల రూపంలో ప్రస్పుటపరిచారు. ఒక్క బొమ్మలోనే కావ్యాన్ని తలపించేలా ఎన్నెన్నో భావనలు కూర్చేవారు. ఇప్పుడా కుంచె ఒరిగిపోయింది. ”
    ~ ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చిన నివాళి నుండి.

    http://lit.andhrajyothy.com/sahityanews/kalla-sathyanarayana-died-15242

  • కొన్ని అక్షరాలు చిత్రాలై వెంటాడుతాయి . కొన్ని చిత్రాలు అక్షరాలంత అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి . అలా “మో” గారు, “కాళ్ళ”గారు ఒక ప్రత్యేకమైన జంట.
    వారివురు కలిసి పనిచేయడం తెలుగు పుస్తకపు అత్యంత ప్రశస్తమైన సమయం. పాఠకుల గుండెల ప్రతి స్పందనలోను ఈ ద్వయం నిలిచిఉంటారు….

  • సీనియర్ కమ్యూనిస్టు సభ్యుడు, ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త కాళ్ల సత్యనారాయణ చిన్నతనం నుంచే సీపీఐ (ఎం) అనుబంధ కళాసంఘమైన ప్రజా నాట్యమండలిలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు.

    ప్రముఖ సాహితీవేత్త నర్రా వెంకటేశ్వరరావుకు, ప్రముఖ చిత్ర దర్శకుడు దవళ సత్యంకు కాళ్ల సత్యనారాయణ సమకాలీకుడు.

    చిత్రాలు గీయడంలో దిట్టగా, గొప్ప సాహితీవేత్తగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కొన్ని వందల నవలలకు పురుడు పోశారు. వేలాది సాహిత్యాలకు ముఖ చిత్రాలు గీశారు.

    మానవ సంబంధాలన్నీ మనీతో ముడిపడి ఉంటున్న ఈ రోజుల్లోనూ డబ్బుకి లొంగని మహా మనిషిగా ఆయన గుర్తింపు పొందారు. తుది కంటా కమ్యూనిస్టు భావజాలంతోనే జీవితాన్ని అత్యంత నిరాడంబరంగా గడిపారు.

    ~ నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన నివాళి నుండి.

    http://www.navatelangana.com/article/state/732044

  • ఐహిక లోకాన్ని వీడిన ఈ గొప్ప కళాకారులకి నివాళి. ఈయన గురించి నేనిదివరకు ఎప్పుడూ వినలేదు. ఇలాంటి గొప్ప వారితో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు వారు ఉండగానే వారి గురించి పత్రికల్లో, సోషియల్ మీడియాలో రాస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఎక్కడ చూసిన వీరి గురించి ఆర్టికల్సే కనిపిస్తున్నాయి. ఈ గౌరవాభిమానాలు వారు ఉన్నప్పుడే చూపితే మరింత బాగా ఉండేదేమో. 25 సంవత్సరాల నుండి కలవని మనిషి, ఆయన పోయాక ఇప్పుడు క్షమార్పణ అడగలేదని అంగలార్చటం చాల హిపోక్రసీ అనిపిస్తోంది.

    • రాగ గారు…

      మీ ఆవేదన, మీ ఆరోపణ చాలా సమంజసం. అయితే, క్షమార్పణ బాకీ పడ్డాను – అన్న వాక్యాన్ని on its face చూడకండి. నా ఈ చిన్న నివాళి రాయడానికి దాన్ని ఒక నెపంగా మాత్రమే అర్థం చేసుకోండి. హిపోక్రసీ ఏమీ లేదని మనవి..

  • కాళ్ళ గారు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కోలా ప్రవర్తించే మనిషి కాదు…. అందరి దగ్గర ఒకేలా మసిలే మనీషి. మీ పరిచయం చదువుతుంటే నా అనుభవాలు మెదిలాయి.

    • మీ ప్రపంచం,అనుభవాల నుంచి కాళ్ళ ని చూసి పరిచయం రాయడం హృదయంగమం.ఎవరిగురించి రాసినా మీ సబ్జక్టివిటీ బలంగా ప్రతిబింబిస్తుంది.[త్రిపుర గురించి మీరు రాసిన వ్యాసం కూడా యిలాగే తాకింది మరి]అక్షరాలని మినహాయించి ,గీతలని బొమ్మని మాత్రమే కోరుకోడం గురించి మీ పస్చాత్తాపంతో సహా బాగా రాసారు.

  • ” 25 సంవత్సరాల నుండి ( కాళ్ల గారితో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు వారు ) కలవని మనిషి, ఆయన పోయాక ఇప్పుడు క్షమార్పణ అడగలేదని అంగలార్చటం చాల హిపోక్రసీ అనిపిస్తోంది ”

    రాగ గారు! ఆవేశంతో మీరీ మాట అన్నట్లున్నారు. హిపోక్రసీకి మీరనుకుంటున్న వారు చాలా దూరం అని ప్రాజ్నులైన సాహితీవేత్తలు, వారి సాహిత్య విమర్శకులు భావిస్తారని వినికిడి. ఇలా అడ్డుతగిలి అంటున్నందుకు అన్యధా భావించరని ఆశిస్తూ .

    • నమస్తే రామయ్య గారు. ఆవేశంతో అనలేదండీ, ఆవేదనతో అన్నాను. నేను సాహితీవేత్తను, విమర్శకురాలినీ కాదు కాబట్టి రాసిన వారి గొప్పతనం గురించి నాకు తెలీదు. కాళ్ళ గారి స్థానంలో నాకు తెలిసిన వాళ్ళుంటే “నేను” ఎలా ఫీల్ అవుతానో అదే కామెంట్ గా పెట్టాను. 25 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసు, మనం తప్పు చేసామని తెలుసు. తెలిసీ అన్నేళ్ళు ఆయన్ని కలవకపోడం, క్షమాపణ అడక్కపోడం అంటే, అవతలి వ్యక్తి మీద మనకెలాంటి భావన ఉన్నట్లు? అన్నాళ్ళు కలవని వ్యక్తి గురించి ఆయన పోయాక ఇలాంటి ఒక పశ్చాత్తపు ఆర్టికల్ రాయడం ఏ విధంగా సమంజసం? ఏం సాధించాలని? నా మనసుకు తోచింది ఇది. తప్పే అయితే క్షమించండి. ఇకముందు ఈ ఆర్టికల్ పైన కామెంట్ పెట్టను. Thank you!!

  • “ ఈ కాలపు అసామాన్య మహా చిత్రకారుడు, కాళ్ల సత్యనారాయణ “ ~ డా. గుఱ్ఱం సీతారాములు

    మొదటి సారి చూసినప్పుడు కాళ్ళ ఒక పట్టాన అర్ధం కాడు. కాస్త దగ్గర అయితే ఆ ప్రేమ లోతు కొలవడానికి యంత్రాలు సరిపోవు. మనిషి నలుపు కానీ మనసు రంగుల సింగిడి. నిత్యం ఆయన రంగులతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.ఆయన బొమ్మలు నున్నగా, కళ్ళకు హృద్యంగా ఉండవు. పెచ్చులు ఊడిన గోడల మీద ఆదిమానవుడు చెక్కిన పురా జ్ఞాపకాలలా ఉంటాయి. నేను చూసిన చానా బొమ్మల్లో బ్రైట్ గా నైరూప్య చిత్రాలు. ఆయన మాటల్లో క్లుప్తత, సూటి తనం, తక్కువ మాట్లాడడం. విస్తారమైన అధ్యయనం. సాహిత్య, సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల మీద సునిశితమైన ద్రుష్టి.

    “కాళ్ళ ఒక గీత, శ్రుతి అపశ్రుతుల సంగీతం, మనిషి మాత్రం పిట్టంత, అతని నీడ చెట్టంత, అతను నల్లగా, మెత్తగా, నిజాయితీగా, పచ్చిగా, మనిషి వాసన కొట్టే నీడ” అన్నాడు డా.హరీష్ గారు.

    40 ఏండ్ల క్రితం రంగుల కుంచెను బుజాన వేసుకుని ఖమ్మం చేరుకున్న ఆయన బాల్య యవ్వనాలు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఆచరణలో సాగాయి. పార్టీ విడిపోయాక ఆయన ఏ నిర్మాణాలలోనూ ఇమడక పోయినా ఆయన గీసిన బొమ్మలు నిర్మాణాల కన్నా ఎక్కువనే పనిచేశాయి.

    ఆయన గీతల్లో వికారమైన తలలేని మొండాలు, సాగిన చేతి వెళ్ళు,మనల్ని వెంటాడే నీడలు, చుట్టూ ఆవరించి ఉన్న సమస్త వైకల్యాలు, స్త్రీల వేదనలు, డంకేల్ దుర్మార్గాలు, లాతూర్ విషాదాలు, కాస్ట్రో, అలెండీ వీరోచిత గాధలూ, చిద్రమైన అద్దాలు, గడ్డ కట్టిన కన్నీళ్లు, ఏకాంత మృత్యువు, తెగిన దారాలు, మాతృ బంగం, దూది పింజలు ఆయన కాన్వాస్ మీద యుద్ధం చేస్తాయి. కాళ్ళ బొమ్మలు ఏ ఒక్క అంశాన్నో తడమలేదు, గడిచిన ఐదు దశాబ్దాల సాహిత్యాన్ని పలవరించి కలవరించిన అలసట లేని ప్రయాణం ఆయనది. ఆయన కుంచెకు శాశ్వత విరామం దొరికినా మనల్ని వెంటాడే వెన్నాడె బొమ్మలు ఎన్నో ఈ వ్యవస్థ మీద సందించి వెళ్ళాడు. అవి కేవలం బొమ్మలు మాత్రమె కాదు. నాగరిక జీవనం మీద మొలిచిన గాయపు మరకలు.

    అర్ధం చేసుకుంటే శక్తి ఉంటె ఆయన బొమ్మల్లో ఆదిమ కాలాన గుహలలో బ్రతికిన యాది గుర్తులు చూడొచ్చు. క్రూరజంతువులు దాడి చేసినప్పుడు గోడలమీద చిందిన రక్తపు చారికలూ చూడొచ్చు. మధ్య యుగాల నుండి ఆధునిక యాంత్రిక లోకం దాకా మనిషి నడిచొచ్చిన సమస్త నాగరిక గుర్తులూ ఆయన గీతల్లో చూడొచ్చు. అబాగ్యుని ఆకలి కేకలు, ఆకలి గొన్న పశువులా అబలమీద దాడి చేస్తే ఆ కళ్ళల్లో ఒలికే భయాన్నీ చూడొచ్చు. ఎగిరే ఎర్రజెండాలో అమరుని విస్వాశాన్ని చూడొచ్చు. ఒక దారం సుడి తిరిగి తనను తాను ఉరేసుకునే కార్మికుని సంక్షుభిత ముగింపు చూడొచ్చు. పెత్తందారీ పెద్దన్న ఒంటి కన్ను రాక్షసుడిగా ఈ సమాజాన్ని కబళించే డాలర్ విక్రుతాన్ని చూడొచ్చు. శిలువ మోస్తున్న రైతన్న వ్యధను, గ్రహం స్టెయిన్ చెదిరిన చెదిరిన కలనూ, పిండాలకు గుచ్చిన త్రిశూలాలు, తెగిన తలలూ, విరిగిన విగ్రహాలూ, తొంబయ్యో దశకం లో ఆధునిక కవితా చోదక శక్తులు అయిన రక్తస్పర్శ కవుల ద్వేషం లో, బ్రతికిన క్షణాల వలపోతల్లో, పునరపి లో, నరుడో భాస్కరుడు విసిరిన గండ్రగొడ్డలి ఒడుపులో, గులాంగిరి అట్టమీద దైన్యంగా కూర్చున్న శ్రామికుడి నుదిటి స్వేదంలో, కాల కూట విషంలా మానవత్వం మీద దాడిచేసిన గోద్రా గుజరాత్ గాయపు కన్నీటి చారికల్లో,దళిత రాజకీయాల్లో,భామ కరుకు,సంగతి లో, కేశవరెడ్డి నవలల అట్ట మీద బొమ్మల్లో, ఒకటా రెండా వేలాది బొమ్మల్లో ఆయన మార్క్ గీత అర్ధం కావాలి అంటే ముందు కాస్త రంగు అర్ధం కావాల.

    తెలుగు సమాజాన ఆకలితో, అవమానాలతో బ్రతికే బడుగు జీవుల ఆర్తనాదాలు, పికాసో గుయర్నికా విద్వంసాన్ని నేను మొదటి సారి కాళ్ళ బొమ్మల్లోనే దర్శించాను. గోయా, పికాసో బొమ్మల్లో బీభత్సాన్ని తెలుగునాట వర్తమాన కన్నీళ్లు ఆయన కాన్వాసును తడిపాయి.

    ఆయన ఎప్పుడూ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథల గురించి ఎక్కువగా చెప్పేవాడు.పతంజలి,చలం, ప్రేమ్ చంద్, కో.కు అన్నా ప్రేమ. బొమ్మలూ, సినిమాలూ,సాహిత్యం ఆయనకు ఇష్టమైన వ్యాపకం.

    తాను బ్రతికి నంతకాలం కీర్తికీ, ప్రచారానికీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకం లోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించాడు.

    ఆయన బొమ్మలకి విలువ కట్టే సాహసం మనం చేయలేము.మన మధ్యే బ్రతికిన ఒక మహా చిత్రారుడి అమూల్యమైన సంపద ఎలుకలకూ పందికోక్కులకూ బలికావడమే ఈ కాలపు విషాదం. ఇది ఒక కాళ్ళకు జరిగిన నష్టం కాదు. ఒక మహా చిత్రకారుడు నిష్క్రమణ ఈ లోకానికి తెలియకుండా పోవడం వెనక మనందరి సామూహిక వైఫల్యం ఉంది. ఆయన బొమ్మలు ముందు తరాలకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అదే కాళ్ళకు మనం ఇచ్చే నివాళి.

    జోహార్ కాళ్ళ! జోహార్ !! జోహార్.!!!

    డా.గుఱ్ఱం సీతారాములు
    9951661001

    https://epaper.andhrajyothy.com/c/34371261
    ఈ కాలపు అసామాన్య మహా చిత్రకారుడు.
    https://epaper.andhrajyothy.com/c/34371452

  • రాగ గారూ!

    మీరు ఆవేశంతో అలా అన్నారు అని రాయటం తొందరపాటులో జరిగిన పొరపాటు. చిన్న పొరబాటు వ్యాఖ్యకు నొచ్చుకోవద్దు.

    మీరు వెలిబుచ్చిన అవేదనకు తోడు అలా తమ సంవేదనను తెలియజేస్తున్న వారు ఎందరెందరో ఉన్నారు. యీ ఆర్టికిల్ పైనా, సారంగలో మీరు చూసి మీకు నచ్చిన ప్రతి విషయంపైనా, దయచేసి మీ అభిప్రాయాలను నిశ్సంకోచంగా తెలియచెయ్యండి.

    సారంగ లాంటి అంతర్జాల సాహితీ వేదికల మీద జరుగుతున్న ప్రజాస్వామిక ప్రగతిశీల స్వేచ్చా చర్చలు, వాగ్వివాదాలు నాలాంటివాడికి ( నేనో నేలక్లాసు పాఠకుడిని అని విన్నవించుకుంటున్నా ), మరెందరికో మేధోమధనానికి, భిన్న ద్రుక్ పధాలను చూస్తూ మన ఆలోచనా పరిధిని విసృతపరుచుకోవడానికి ఉపయోగపడతాయని నా నమ్మకం.

    మీకు, మీ స్వేచ్చా గళానికి నెనర్లు తెలియజేసుకుంటున్నా.

  • శీర్షికలోనే ఏదో తేడా కనిపిస్తోంది..
    ధ్వన్యాత్మక నిగూఢార్థ ‘నీ “కాళ్ళ” కి మొక్కుతా ! లేక నీ కాళ్ళకి దండం పెడతా అని అనాలె గానీ ‘సాస్టాంగం’ అని కాదు .. లేదా ‘ నీ పాదాలకు సాస్టాంగ ప్రణామం’ అనవలెను.
    స్మృతి నివాళి మరీ అంత సర్రియలిస్టిక్ గా ఉండాల్సిన అవసరమేమిటో ..

    • కార్తీక రామేశ్వరా చార్య గారూ!

      సాష్టాంగము- అన్న పదానికి బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు ఇచ్చిన అర్థం:
      Prostrate adoration. Literally, touching the ground with (స) the eight (అష్ట) limbs (అంగ), i.e. , the hands, knees, shoulders, breast and forehead. సాగిలబడి దండము పెట్టడము.
      సాష్టాంగదండ ప్రణామముచేయు to do homage.
      సాష్టాంగదండము or సాష్టాంగ నమస్కారము prostrate homage.
      “కరయుగములు చరణంబులు, నురములలాటస్థంబు నున్నతభుజముల్. సరిధరణిమోపిమ్రొక్కిన, బరువడిసాష్టాంగమండ్రు పరమమునీంద్రుల్.”

      • साष्टङ्ग adj. sASTaGga performed with eight limbs or members

        साष्टङ्गम् ind. sASTaGgam with the above prostration

        साष्टङ्गपातम् ind. sASTaGgapAtam making the above prostration

  • భాషకు తాను భాషననే స్పృహను కల్పించే మర్మం ఎరిగిన అరుదైన ప్రతిభకు ప్రతిరూపం నరేష్… రాగ ప్రతిస్పందన చూస్తే ఎందుకో నాకు టి ఎల్ కాంతారావు గుర్తుకు వచ్చారు. యెన్నెలంతా మేసి యేరు నెమరేయట మేమిటి? ఎన్నెల ఏమైనా గడ్డా యేరు యేమైనా పశువా అని ప్రశ్నించారాయన.

  • ఒక సారి కాళ్ళ గురించి తెలిసిన నాటి ఖమ్మం కలెక్టర్ అరవింద కుమార్ ఆఫీసు ల్లో బొమ్మలు వేయండి కాసిన్ని డబ్బులు ఇస్తాం అంటే “ఆ పనికి చానా మంది ఉన్నారు నేను చేయను అని సున్నితం గా తిరస్కరించాడు.ఈ బొమ్మలు బువ్వ పెట్టకుంటే నా రిక్షా నాకు ఉంది అనే తెగింపు. ఆయన ఆకలిని ఎక్కువగా ప్రేమించి ఉంటాడు.ఆయన కన్నీళ్ళు,పేగులు ఎప్పుడో ఎండిపోయి ఉండొచ్చు. ఆయన సహచరి కోటమ్మ గారు, ఇష్ట సఖి డా. హరీష్ గారు పోయాక మరీ ఒంటరివాడు అయ్యాడు. ఒక రకంగా ఆయనకు ఆ రెండు మరణాలు కోలుకోలేని దెబ్బ తీసాయి.అందుకే చావుకూడా నిర్దయగా ఆయనను దొంగ దెబ్బ తీసింది.

    కాళ్ళ ఆయన పూర్వీకుల నుండి పొందిన ఆస్తులూ అంతస్తులూ జ్ఞానమూ ఏమీ లేదు.తండ్రి ఒక సాధారణ రిక్షా కార్మికుడు. కాళ్ళ కూడా బ్రతుకు దెరువు కోసం రిక్షా తొక్కాడు. ఖమ్మం లో రెండు గదుల ఇల్లు తప్ప ఆయనకు మిగిలింది ఏమీ లేదు.ఇప్పుడు ఇవ్వడానికి ఆయన వారసులకూ ఏమీ మిగల్చలేదు.తన తండ్రి మిగిల్చు కున్న నిజాయితీ మినహా అది కాళ్ళ కడుపు నింపలేదు ఆయన వారసుల కడుపూ నింపదు. తాను బ్రతికి నంతకాలం కీర్తికీ, ప్రచారానికీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకం లోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించాడు.

    ఆ నిష్క్రమణ ఎవరికి కష్టం కలిగించిందో ఎవరికీ నష్టం కలిగించిందో చెప్పడం కష్టం. కానీ కాళ్ళ ఈ లోకం లో ఇమడలేక పోయాడు.లోకం పోకడ తెలియని వాడు అనే మాట అనను కానీ ఆయన బొమ్మల లోతు అంచనా వేయలేక పోయాము. నాకున్న పరిమిత అవగాహన ప్రకారం చిత్త ప్రసాద్ లాగా ప్రయోజనం లేని ఒక్క గీతను ఆయన గీయలేదు.బాబ్రి విషాదం తర్వాత వరసగా జరిగిన గుజరాత్ తరహా నరమేదాల మీద కాళ్ళ వేసినన్ని బొమ్మలు ఈ సమకాలీన ఆర్ట్ ప్రపంచం లో ఎవరూ వేయలేదు. ఏసియన్ సోషల్ ఫోరం సందర్భంగా కాళ్ళ మిత్రులు హైదరాబాదు లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసారు అనీ ఆయన బొమ్మలు మొత్తం ఎవరో కొన్నారు అని HBT గీత గారు చెప్పారు.ఆ నాడు అవి ఎంతకు కొన్నారో తెలియదు. ఇప్పుడు వాటి విలువ లక్షల్లో ఉండే అవకాశం ఉంది. మహా అంటే కాళ్ళ నాకు పది, పదిహేను ఏళ్ళు గా మాత్రమె తెలుసు ఆ కొద్ది పరిచయాన్ని అఫ్సర్ ప్రోద్బలం తోనే ధైర్యం చేసి రాసాను. ఎందుకంటె ఈ రంగుల ప్రపంచం నాకు తెలియదు.
    కాళ్ళ బొమ్మల మీద సాధికారంగా రాయగలిగిన వాళ్ళు అమరుడు మోహన్, డా.హరీష్ . మో. ప్రకాష్,హిందూ సురేంద్ర,శ్రీనివాస ప్రసాద్,అఫ్సర్,ప్రసేన్,సీతారాం.అంబటి సురేంద్ర రాజు, వీళ్ళు రాయగలరు. వాళ్ళు నిజంగా రాయగలిగితే కాళ్ళ సమగ్ర విరాట్ రూపం చూడగలం. వర్తమాన క్విడ్ ప్రో కో సాహిత్య వాతావరణంలో ఆ పని నా లాంటి అమాయకులు తప్ప ఎవరూ రాయరు అని పిస్తోంది. హైదరాబాదు లో కాళ్ళ సంస్మరణ సభకు వచ్చిన మనుషులను చూసాక ఈ నాలుగు ముక్కలు రాయాలి అనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు