నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా …

సినిమా పాటల్లో సాహిత్యం ఎంత? ఈ ప్రశ్నని అన్వేషిస్తూ తండా హరీష్ కొత్త శీర్షిక

రచయిత ఎందుకో ఆకాశాన్ని తన పాటల్లో చూసుకొని మురిసిపోతుంటాడు. వాస్తవంగా ఆకాశాన్ని మెటాఫర్ గా ఊహించుకోని కవి ఎవరు ఉండరు. ఓ పాటలో ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే అంటాడు.ఇప్పుడు నేను పరిచయం చేయపోయే పాటలో నీలినీలి ఆకాశం అంటున్నాడు.ఇలా ఎన్నో అలంకారాలను తన పాటల్లో ప్రవేశపెట్టి,ఇంకా ప్రవేశ పెడుతూ అలుపులేకుండా ముందుకు సాగుతున్న పాటలపూదోట అతను.”నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది” అనే పాటకు నంది అవార్డు పొందిన రచయిత. ఎవరో కాదు మనందరికి సుపరిచితుడైన చంద్రబోస్.ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె వాస్తవ్యులు.తాజ్ మహల్ సినిమాలోని “మంచుకొండల్లోని చంద్రమా” అనే పాటతో సినీరంగప్రవేశం చేశారు.ఆయన రచించిన పాట నీలి నీలి ఆకాశాన్ని ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్నాను.

అసలు ఆకాశం నీలిరంగులో ఉంటుందా?ఉంటే ఎప్పుడు ఉంటుంది?ఎందుకు ప్రేయసికీ ఇద్దామనుకుంటాడు ?మళ్ళీ ఎందుకు వద్దనుకుంటాడు
అనే విషయాలను చూస్తే ఆకాశం నీలిరంగులోకి మారటానికి గల కారణం సూర్యకిరణాలు పరావర్తనం చెందటం.అదికూడా వాతావరణంలో కిరణాలు ప్రయాణం చేసే దాన్ని బట్టి ఆకాశం రకరకాల రంగుల్లోకి మారుతుంది.సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పుడు ఆకాశం నీలిరంగులోకి మారుతుంది.వాస్తవంగా ఏ ప్రేమికుడైనా మొదటగా ప్రకృతిని తన సొంతంగా భావిస్తాడు.అలానే ఈ ప్రేమికుడు నీలి ఆకాశాన్ని తనలోకి ఒంపుకున్నాడు.నింగిని,నీరును,నేలను,చెట్లను సమాదరిస్తాడు.ఆకాశంలో ఉన్న నిగూఢార్థం “విశాలత”.

అంతటి గొప్ప హృదయాన్ని ఆవిష్కరించేవైపుకు రచయిత ఆ వాక్యాలను పాటకు తొడగవచ్చు. ఆకాశానికి సూర్యకిరణాలకు మధ్య  మబ్బులు  అడ్డొచ్చినప్పుడే నీలిరంగులోకి మారుతుంది ఆకాశం. ఇంతలా నేను ఆకాశాన్ని తీసుకవచ్చి ప్రేయసికి ఇస్తే ఆమె కానరాకుండా ఉంటే ఇక ఏంలాభం అనుకొని మానేస్తాననే అభిప్రాయాన్ని ఆ ప్రేమికుడి కోణంలో రచయిత గొప్పగా జోడించారు.

ప్రేమికుడు తన ప్రేయసికీ ఏదో కానుక ఇవ్వాలి అని,సంభ్రమాశ్చార్యాలకు గురి చెయ్యాలని తహతహలాడుతుంటాడు.నిజమైన ప్రేమికుడు ఈ పాటలో లాగా తన నవ్వును చూసో ,ముఖాన్ని చూసో  గొప్ప కానుకగా అనుభూతి చెందుతాడు.అందుకే ఇక్కడ నెలవంక కూడా తన నవ్వుకు సరిపోదంటాడు.
ఇక్కడ నవ్వుల్లో కూడా చాలా భిన్నమైన భావప్రకటనలను మనం చూడొచ్చు.ఇక్కడ నవ్వు తనని తనుగా ఇష్టపడే వారికోసం గుండెలోతుల్లో నుంచి వచ్చే నవ్వు.అది వెలకట్టలేనిది.దాని ముందు ఏ బహుమతి నిలువదు.

ఏ ప్రేమికుడైనా తన ప్రేయసిని చూసినప్పుడు ఏదో కోణాన్ని తనలోకి ఆహ్వానిస్తాడు.నడకను హంస నడక అనో,కళ్ళను తామరలనో ఇంకా ఏదో విధంగా ఊహించుకుంటూ ఆ ఊసులలో బ్రతుకుతుంటాడు. ఇక్కడ రచయిత ప్రయోగం వినూత్నమైనది.కొంత అతిశయం,కొంత ప్రతీపాన్ని జోడించి ఆమె నడిస్తే నేలకు తారలు మొలుస్తాయని,ఆమె శ్వాసను వదిలితే గాలులు బ్రతుకుతాయని రచయిత కొత్తదనాన్ని ఆపాదించే ప్రయత్నం చేశాడు.అందులో సఫలమయ్యాడు.

మొదటి చరణాన్ని ఇంద్రధనుస్సును,నల్లమబ్బులను తీసుకొని చిక్కగా అల్లాడు.ఇంకా వీటికి గిరాకి తగ్గట్లే. దాదాపుగా మనకు అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి.అలాగని ఇబ్బంది ఏ మాత్రం పెట్టకుండా శ్రోతకు వదిలేసి రచయిత సులువుగా తప్పుకున్నాడు. ఇంద్రధనుస్సులో లేని రంగుగా ప్రేయసిని చెప్పుకొచ్చాడు.ప్రేమికుడికి ప్రేయసి ఎప్పుడు ప్రత్యేకమే. కాబట్టి అతను అలాగే అంటాడు,అనాలి.ఇంద్రధనుస్సును చూసి మనమంతా మురిసిపోతాం.అందులోలేని రంగును తన ప్రేయసికి రుద్ది ఇక్కడ ప్రేమికుడు సరికొత్తరంగుతో చీరను నేయటానికి సిద్ధమవుతాడు.సాధ్యపడుతుందా అనే ప్రశ్న వేసుకుంటే వారివురి మధ్యలో ఉండే పటిష్టతే సమాధానం చెబుతుంది.కళ్ళను నల్లమబ్బులతో పోల్చడం సహజమైన విషయమే కానీ కాటుక కూడా పెట్టనంత సహజమైన అందం నీది అని చెప్పడానికి రచయిత వాడిన పదాలు కొంత పదునుగా లోతుగా దిగుతాయి.అంతకు ముందు కాలంలో దిష్టితగలకుండా ఉండడం కోసం బుగ్గలకు చుక్క పెట్టేవారు.ఇప్పుడు కాళ్ళకు దారాలు కట్టుకుంటున్నారు.అంతమాత్రాన వారితో విభేదించేదేమి లేదు.”కాకి పిల్ల కాకికి ముద్దు” అనే సామెతను గుర్తుచేసుకొని నిశ్శబ్దంగా ఉంటే సరిపోతుంది.ఈ పాటలో ప్రియుడు పూర్తిగా తనలో లీనమయిపోయాడు.ఎంతలా అంటే తనకు దిష్టి తగలకుండా బుగ్గకే కాదు తనువంతా చుక్కను పెట్టాలనేంతలా.రచయిత ఈ పాదాలలో అభివ్యక్తిని తారాస్థాయికి తీసుకెళ్ళాడు.ఇదే చరణంలో ప్రేయసికి బహుమతి ఏదో ఒకటి ఇవ్వాలని ఆశపడి చివరకు తనను మించిన బహుమతిలేదని తెలుసుకొని తన ప్రాణాన్ని తాళిబొట్టుగా పేని కడతాను అని చెప్పటంలో గొప్ప సందేశాత్మకత దాగి ఉంది.ప్రేమ పేరుతో మోసంచేసేవాళ్ళకు ఈ పాదాలు చెంపపెట్టులాంటివి.ప్రేమంటేనే నిజం.నిజం లేని చోట, నిలకడ లేని చోట ప్రేమ ఆత్మహత్య చేసుకుంటుంది.

ఇప్పటిదాకా ప్రేమికుడికి ప్రేయసి పట్ల ఉండే భావనలను రచయిత చూపించారు.రెండవ చరణం ప్రేయసి ప్రేమికుడి నుండి ఏం ఆశిస్తుందో,తాను ఏం ఇవ్వాలనుకుంటుందో అనే అంశాల కలబోతగా ముందుకు సాగుతుంది.ప్రేయసి కూడా ఆకాశాన్నే ఇవ్వాలనుకుంటుంది.ఆమె కూడా “విశాలత” అనే అర్థంలోనే ఇద్దామనుకోవచ్చు కానీ అతని హృదయం ముందర చిన్నదని ఊరుకుంటున్నాను అంటుంది.రచయిత రెండు వేరు వేరు సందర్భాల్లో ఒకే అంశాన్ని తీసుకొని అక్కడ మబ్బులు కమ్మేస్తాయని,ఇక్కడ హృదయం ముందర చిన్నదవుతుందని ఎంతో సమర్థవంతంగా రాయటం గమనించవచ్చు.

ఏ స్త్రీ యైనా ఏమి కోరుకుంటారు పుట్టినింటినుంచి మెట్టినింటికి వెళ్ళినప్పుడు అమ్మలాంటి ప్రేమను,నాన్న లాంటి అనురాగాన్నే కోరుకుంటారు.ఇక్కడ రచయిత దృష్టికోణం మొదటి చరణంలోనుండి రెండోచరణంలోకి వచ్చే సరికి పూర్తి భిన్నంగా మారిపోయింది.అంతసేపు ప్రేమికుడికి,ప్రేయసి పట్ల ఉండే ప్రేమ భావనలను కుప్పపోశాడు.రెండవ చరణంలో మళ్ళీ  ప్రేయసి వైపుగానే నిలబడి ప్రేమికుడితో తన జీవితం ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పిస్తాడు.ఓ రోటీన్ లోకి తీసుకెళ్ళి నీ కోసం మళ్ళి మళ్ళి జన్మిస్తాను అని ప్రేయసితో పలికించి ముగిస్తాడు.వాస్తవానికి ఈ పాటను బ్రతికిస్తున్నదంత పల్లవి,మొదటి చరణమే.రెండవచరణం కూడా తన స్థాయిలో నిలబడింది.పాటలో పల్లవి కీలక భూమిక పోషిస్తుందన్న విషయం తెలియనిది కాదు.

ఓ సారి ఆ పాటను చూద్దాం..

పల్లవి :

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

నెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో
నీ నవ్వుకు సరిపోదంటున్నా…

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

చరణం – 1
ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

చరణం – 2
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

చిత్రం :30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
రచన:చంద్రబోస్
గానం:సిద్ శ్రీరామ్
సంగీతం:అనూప్ రూబెన్స్

తండ హరీష్ గౌడ్

72 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • బాగుంది…చక్కని పాటను చక్కగా వర్ణించారు.. చంద్రబోస్ గారి పాటలు ఎంతో ప్రత్యేకమైనవి.
      మంచుకొండల్లోని చంద్రమా’ నుండి ఆయన కలం ప్రారంభమై నేటికి దూసుకుపోతూనే ఉంది. యువ రచయిత లకు ఆయనొక ఇన్స్పి రేషన్. ఆయన పాటలు ఎన్నోసార్లు హమ్ చేసాను. ప్రేమ గురించి రాసినా, ప్రేయసి గురించి కవిత్వికరించినా ఆయనకు ఆయనే సాటి.
      స్ఫూర్తివంతమైన గీతాలు చంద్రబోస్ ప్రత్యేకత. ఆయన ఏ పక్క నున్నా…. ఐ మీన్ ఆయన ఏ పాట రాసినా అందులో ఉండే లక్షణాలు మనఅందరికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేవే.

      అలాంటి రచయిత పాటను విశ్లేషించాలంటే ఎంతో గట్స్ ఉన్న నీకే సాధ్యం. చక్కగా వర్ణించారు. మీలోని ప్రతిభను ఈ పాట విశ్లేషణ ద్వారా మరోసారి మాకందించారు. ఇటీవలనే మీరూ పాటలు రాయడం , విని, చూసి ఆనందించడం మావంతయ్యింది. భవిష్యత్తు లో చక్కటి పాటలు రాసి చంద్రబోస్ గారంత ఎత్తుకు మీరెదగాలని…
      చంద్రబోస్ గారి కలం మరెన్నో ప్రత్యేకమైన పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….
      చక్కని విశ్లేషణ అందించిన సారంగ వెబ్ మ్యాగజైన్ నిర్వాహకులకు….అభినందనలు…శుభాకాంక్షలు..

      మీ
      నామా పురుషోత్తం
      సీనియర్ జర్నలిస్ట్
      అక్షరాల తోవ నిర్వాహకులు
      ఖమ్మం
      98666 45218

      • అన్నా సుదీర్ఘమైన మీ కామెంట్ కు అనేక ధన్యవాదాలు..థాంక్యూ వెరీ మచ్ప పురుషోత్తం అన్న

  • బాగుంది తండా హరీష్ గారు. వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చారు. మంచి సమీక్ష వ్యాసం.

    ఇప్పుడు వస్తున్న సాహిత్యం లేని అర్థం లేని పాటలపై కూడా మీ దృష్టిలో ఉంచుకొని చీల్చి చెండాడండి.

    • థాంక్యూ రవిందర్ అన్న..మీ విలువైన కామెంట్ కు

  • ఆ ప్రేమికుడిలో ఒదిగిపోయి రాసావు తమ్ముడూ…చాలా బాగుంది…మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడల్లా…కళ్ళు మూసుకుని పాటలను ఆస్వాదించేదాన్ని..హహహ…ఇపుడు నీ వ్యాసం చదువుతూ ఆ హాయిని అనుభవించా…ఫేస్ బుక్ లో ఇక్భాల్ గారి హిందీ పాటల విశ్లేషణ చదివా..ఇపుడు నీవి…

  • నీలి నీలి ఆకాశం పాటపై …..మీ సమీక్ష లో రచయిత హృదయాన్ని చిత్రించారు.. సరళ శైలిలో సంపూర్ణ భావాన్ని వ్యక్తపరిచారు …హరీష్ అన్న

  • కరోనా కల్లోల.ములో మనసును హాయి గొలిపే విశ్లేషణ
    పాట అంతరంగాన్ని ఆకాశమంతా వైశాల్యంతో వివరింవావ్
    నీ విశ్లేషణ దృశ్యమానము అవుతూ మమ్మల్ని విహరింప చేస్తున్నది.

  • మంచి శీర్షిక ప్రారంభించిన ఎడిటర్ గారికి అభినందనలు.
    పాటలోని సన్నివేశాలను చక్కగా సమీక్ష చేసిన తం డా హరీష్ హరికి శుభాకాంక్షలు.
    అద్భుతమైన విశ్లేషణ….. చాలా బాగుంది…

    • అన్న థాంక్యూ..
      మీ విలువైన కామెంట్ కు..

  • తండ హరీష్ గారు మనసుకు హాయ్ కల్గించే పాటకు హృదయానికి హత్తుకునే విశ్లేషణ చాలా బాగుంది. మంచి శీర్షిక ప్రారంభించిన సంపాదకులకు ధన్యవాదాలు…

  • వెరిగుడ్ హరీష్ ..చాలా బాగా విశ్లేషించావు.వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగపరుచుకున్నావు.కంగ్రాట్స్ !!

  • సినిమా పాటలు ఇలా కూడా వర్ణిస్తూ విశ్లేషించవచ్చు అని తెలియజేశారు…
    అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో టీవీ చానల్లో ఇలాంటి విశ్లేషణ చూడడం జరిగింది అయితే అవి కవులు లేదా వాటిని తీసుకున్న దర్శక నిర్మాతలు లేదా సంగీతదర్శకులు మాత్రమే విశ్లేషించే వారు కానీ ప్రేక్షకుల్ని దృష్టికి రాని విషయాలను మరొక ప్రేక్షకుడిలా అనుభూతి చెంది విశ్లేషించారు చాలా బాగుంది..
    ధన్యవాదాలు….
    మీ నుండి ఇలాంటి విశ్లేషణలు మరిన్ని ఆశిస్తున్నాను

  • కొత్త చూపు. మరిన్ని పాటలకోసం ఎదురుచూస్తాను.

  • తండ హరీష్
    మంచి
    పాట ను ఎంచుకొని అద్బుత మైన విశ్లేషణ చేశారు
    పాట వింటునపుడు ఎంత ఆనందాన్ని పొందామో
    విశ్లేషణ చదువుతున్నపుడు అంతా ఆనందాన్ని అందించాడు హరీష్
    చంద్ర బోస్ పాటతో ప్రారంభించిన ఈ విశ్లేషణ
    విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
    ధన్యవాదాలు

  • గొప్ప ప్రారంభం తమ్ముడు. మంచి పాట , మన జిల్లా రచయిత ను ఎన్నుకోవడం బాగుంది. సమీక్ష చక్కగా ఉంది.

  • తంద్ హరీష్ గారు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.అర్థవంతంగా,సందర్భోచితంగా,సరళంగా ఉంది

  • ఆ పాటను రాసిన చంద్రబోస్ గారు అలా ఆలోచించరో లేదో మాకు తెలియదు గానీ మీరు వర్ణించిన తీరు మాత్రం మమ్మల్ని ఆ పాట గురించి ఆలోచింపజేసింది అని చెప్తుగలను…

  • పాట యొక్క అందాన్ని అనుభూతి ని ఏమాత్రమూ
    తగ్గకుండా విశ్లేషణ చేశారూ..మునుముందు సినిమా పాట ల్లో సాహిత్య దృష్టి ని మరింతగా బలోపేతం చేసేందుకు ఇలాంటి వ్యాసాలు ఉపయోగపడతాయి అని నమ్ముతున్నాను. మరెన్నో పాటలపై విమర్శకుడా చేయాల్సింది గా కోరుకుంటున్నాను. అభినందనలు .
    సారంగా మ్యాగజైన్ కి ప్రత్యేక ధన్యవాదాలు💐💐

  • చంద్రబోస్ గారి పాట ఎంత మధురమో మీ విశ్లేషణ కూడా అత్యంత మధురం హరీష్ గారు.

    • చంద్రబోస్ గారి పాట ఎంత మధురమో మీ విశ్లేషణ కూడా అత్యంత మధురం హరీష్ గారు.

  • ఎదో తెలియని మెత్తనితనం మీ వాక్యాలకు ఉంది అన్నా.అలాగే వాక్యంలోని లోతును పట్టుకునే చూపు మీకుంది.ఒక పాటలోని విశేషాలను అద్భుతంగ విశ్లేషించిన వ్యాసం.మరిన్ని మంచిపాటలను వెలికితీయాలని కోరుకుంటున్న అన్న ఈ కాలమ్ ద్వారా.

  • తమ్ముడు నువ్వు ఎంచుకున్న శీర్షిక …తీసుకున్న లిరిక్స్ చాలా బాగున్నాయి…. విశ్లేషణ చాలా బాగా చేసినవు.ఒక దగ్గర ఆకాశానికి సూర్యకిరణాలకు మధ్య మబ్బులొచ్చినప్పుడు ఆకాశం నీలి రంగులోకి మారుతుంది…..ఈ వాక్యం కొంచెం చూడు.ఈ లిరిక్స్ ని ఇంకా బాగా విశ్లేషించగలవు…..హృదయపూర్వక అభినందనలు తమ్ముడు 💐💐💐
    నీ నుండి ఇంకా చాలా పాటల సమీక్షలు రావాలని కోరుకుంటున్నాను…👍

  • తమ్ముడూ చాలా చక్కని వివరణలతో విశ్లేషించావు..
    ముఖ్యంగా వర్ణిస్తూ రాసిన చంద్రబోస్ గారి పాటను నీవు అద్భుతంగా కవితాత్మకంగా చెప్పడం చాలా బాగుంది
    హృదయపూర్వక అభినందనలు తమ్ముడు

  • ఈ మధ్య నోటిలో బాగా నానుతున్న పాట ఇది. సాహిత్యవిలువలతో రాసే సినిమా పాటలు ఎప్పటికీ నిలిచే వుంటాయి. మీ విశ్లేషణ ఆసాంతం చదివిస్తుంది. తొలి ప్రయత్నం సఫలమైంది. చంద్రబోస్ గారి పాటల్లో “మౌనంగానే ఎదగమనీ..” పాట చాలామందికి ఇప్పటికీ కాలర్ ట్యూన్ గా వుంటుంది. ఇప్పుడు “నీలీ నీలీ ఆకాశం..” .

    మంచి ప్రయత్నం. ఆల్ ది బెస్ట్ . కీప్ గోయింగ్ .

  • హరీష్ గారు పాటతో పాటు మీ విశ్లేషణ చాలా బాగుంది. విమర్శ లక్షణాలు మీలో బలంగా కన్పిస్తున్నాయి.శుభాకాంక్షలు. మంచి మంచి పాటలతో మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను.

  • చక్కని సమీక్షా నీలి నీలి ఆకాశం ని విప్పి పాఠకుల కుచేరువ చేశారు అందులోకి మమ్మల్ని ఇమడ్చి నారు సోదరా అద్భుతః

  • పాట వింటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో , మీ విశ్లెషణ చదువుతుంటె మరింత ఆహ్లాదంగా ఉంది .

  • చాలా బావుంది హరీష్ ..సరికొత్తగా

  • చాలా బాగుంది హరీష్ గారు

    అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు