నీలంరంగు

రచయిత      : నరన్

మూలకథ     : ‘నీలనిరం’

‘నరన్’ అనే కలం పేరుతో రచనలు చేస్తున్న ‘ఆరోగ్య సెల్వరాజ్’ హాట్‍స్టార్ ఓటీటీలో పని చేస్తున్నారు. నరన్ నూతన తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి. తమిళ సాహిత్యంలో కథలు, కవిత్వం, నవలలు విరివిగా రాస్తున్న వర్ధమాన తమిళ రచయిత. అతని కవిత్వం,కథలలో సర్రియలిజం, మాజికల్ రియలిజం, ఫాంటసీ, జెన్‍తత్వం వంటి అంశాలు చోటుచేసుకుంటాయి. ‘కేశం’, ‘వారణాసి’, ‘మానేంది’ అతడికి గుర్తింపు తెచ్చిన కథలు. సాల్ట్ అనే పబ్లికేషన్ సంస్థను స్థాపించి ఆ ప్రచురణా సంస్థ ద్వారా దాదాపు 60 కి పైగా పుస్తకాలను, పేరెన్నికగన్న సమకాలీన తమిళ యువ రచయితలను తమిళ సాహిత్యానికి పరిచయం చేశారు. ఇంతవరకు సాహిత్యరంగంలో తన రచనలకై 11 అవార్డులు అందుకున్నారు. ‘కేశం’ అనే తమిళ కథా సంకలనానికి 4 అవార్డులు వరించాయి.

****

సిస్టిన్ చాపెల్ గుమ్మటం కిందనున్న  సారువాపైనున్న కొవొత్తుల మైనం బొట్లు బొట్లుగా చూరు నుండి కారుతున్న నీటి బిందువుల్లా సారువా బడితెలపైన, నేలపైన కారుతోంది.

చర్చి నేలంతా శుభ్రం చేయకపోవడం వలన గడ్డకట్టుకుపోయిన మంచుగడ్డల్లా కరిగిన మైనపు మరకలతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

ముప్పై మూడేళ్ళ మైకెలేంజిలో చర్చి గుమ్మటంలో మోచేతి పరిమాణము, బరువైన తెల్లని కొవ్వొత్తి అంచును సారువా బడితెపై పెట్టి, లేత పసుపు రంగులోని కన్య మరియ రూపాన్ని గీస్తున్నాడు. గోడపై కొవ్వొత్తి వెలుతురు పడి, ప్రతిబింబంలా పక్కన అంతకు క్రితమే గీసిన కొన్ని వర్ణచిత్రాలు, విశాలమైన వృత్తంలా నిర్దిష్ట విస్తీర్ణంలో కాంతివంతంగా దర్శనమిస్తున్నాయి.

వెలుగుతో గది కాంతివంతంగా వుంది. పోను పోనూ వెలుతురు సన్నగిల్లి నల్లరంగు పులుముకుంది. ఎపుడైనా ఏంజిలో చేతిలో కొవ్వొత్తితో మరేదైనా దిక్కుగా లేదా సారువా బడితెల దిశగా నడుస్తున్నప్పుడు చాపెల్ గుమ్మటమంతా గీయబడిన వందలాది మానవరూపాలు దర్శనమిస్తాయి.

ఏంజిలో తన శరీరం మీద ఎన్నో రోజులుగా విప్పకుండా తొడుక్కున్న  గోధుమరంగు పైవస్త్రంపై, అసంఖ్యాకమైన రంగులు చెదిరిపడున్నాయి. శరీరంపై, తలవెంట్రుకలపై, గడ్డం వెంట్రుకలపై రంగులు చెదిరిపడున్నాయి. జులపాల వెంట్రుకలపైనున్న రంగులు ఎండిపోయి, అవి వెంట్రుకలతో పాటు అంటుకుపోయి చిక్కులు పడిపోయాయి. తను ఎన్నో రోజులుగా వాలుగా జారబడే గీస్తున్నాడు. కేవలం భోజనానికి, కాలకృత్యాలకు తప్ప సారువాపై నుండి ఏ మాత్రం కిందకు దిగేవాడు కాదు.

గ్రహాల కక్ష్యల్లా మూడు, నాలుగు  వరుసలలో పేర్చిన సారువా బడితెలపైనే పడుకునేవాడు. అది కూడా ఏదో కాసేపలా బూటకపు నిద్ర మాత్రమే.

చర్చిలో వర్ణచిత్రాలు గీయడం మొదలెట్టిన ప్రారంభ రోజుల్లో కౌమారంలోని నలుగురైదుగురు సహాయకులు వెంట ఉండేవారు. వాళ్ళు ఏంజిలో ఆగ్రహాన్ని తట్టుకోలేక పని నుంచి తప్పుకున్నారు.

ఏంజిలో తేలికగా ప్రేమకు వశమయ్యే వ్యక్తి. అందులోనూ యువకులంటే అతడికి మహాఇష్టం. అతనికి అమ్మాయిలు ఎపుడో అరుదుగా మాత్రమే నచ్చేవారు. జీవితమంతా ఎన్నో ప్రేమ వైఫల్యాలను గుప్పెట్లో నింపుకున్నవాడు. అందులోను, అందరూ ఇంచుమించుగా ఇరవై ఏళ్ళలోపు యువకులే.

అందులో అమ్మాయిలు ఒకరిద్దరు మాత్రమే. తన సహాయకుడిగా ఉన్నపందొమ్మిదేళ్ళ మాథ్యూ తనతో మాత్రమే కాకుండా, తన ఈడు గల ఇంకో మిత్రుడితో  ప్రేమతో పాటు, శారీరక సంబంధం వుందని  తెలిసిన రోజు నుండి అతడు దాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

పదే పదే మోసపోతున్నామని తెలిశాక కూడా, ఏ మగవాడితోనైనా వెనువెంటనే తేలికగా ప్రేమలో పడుతున్నామని తనని తాను నిందించుకునేవాడు. ఇక తను ఎటువంటి సహాయకుడిని నియమించుకోకూడదని నిర్ణయించుకుని, గత మూడేళ్ళుగా చర్చిలో దేనిని లెక్కచేయకుండా రేయింబవళ్ళు ఒంటరిగా కూర్చుని ఆ వర్ణచిత్రాలను దిద్దేవాడు.

ఎన్నో రోజులుగా శరీరానికి స్నానం లేకపోవడం వలన వంటిపై మాసిన బట్టలపై, మూడేళ్ళుగా కాళ్ళకు ధరించిన బూట్లపై, శరీరంపై భయంకరమైన దుర్గంధం వెలువడేది. అన్నిటి మీద అనాసక్తితో తన మానాన తను గీసుకుంటూ పోయేవాడు.

యవ్వనంలోని కన్య మరియ బట్టలపై నీలంరంగు పూతను పూస్తున్నాడు. చనిపోయిన ముప్పై మూడేళ్ళ ఏసు, మేరీ మాత ఒడిలో ఒదిగిపోయాడు. ఒంటి చేతితో ఏసును మోస్తున్న పియట విగ్రహంలో కంటే, అక్కడ కొలువు దీరిన కన్య మరియను అతడు ఎంతో యవ్వనంగా గీశాడు.

గతంలోనూ ఆ విగ్రహాంలోని మేరీ మాత యవ్వనం క్రైస్తవమత పవిత్రతకు భంగం కలిగించేదిగా ఉందని కాథలిక్ సభ్యులంతా పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు గుప్పించారు.

రెండు రోజుల క్రితం చర్చిలో ఆ పనులను మరింత వేగవంతం చేసేందుకు వచ్చిన ఫాదర్, దిసమొలగా గీసిన ఆదాము ముఖాన్ని ఎక్కడో చూసినట్లు నిశితంగా గమనించాడు. అది దాదాపుగా ఏంజిలో సహాయకుడైనటువంటి మాథ్యూ ముఖంతో సరితూగింది.

స్వలింగ సంపర్కుడైన ఏంజిలో, తను ప్రేమించిన మగ ప్రేమికుల ముఖాలనే దాదాపు బైబిల్లోని పాత్రలన్నిటికి ఆపాదించి గీస్తున్నట్లు ఎన్నో రోజులుగా అతడి మీద నిందారోపణవుంది. అందులో యవ్వనంలోని యువకుల ముఖాలన్ని, ఇంచుమించుగా అతనితో పాటు స్వలింగ సంపర్కంలో పాలుపంచుకున్న యువకుల ముఖాలే.

ఛాతీ భాగాన రాళ్ళను తొలిచి యదార్ధవంతంగా కండరాలను వెలికి తీసిన అతడి అత్యంత ప్రతిష్టాత్మకమైన డేవిడ్ శిల్పం నిస్సందేహంగా కౌమార ప్రాయంలో అతడు ప్రాణపదంగా ప్రేమించిన అతని ప్రేమికుని ముఖపోలికలతో  ఉందనేది కొంతమంది వ్యక్తిగత అభిప్రాయం.

గతంలో, కౌమార ప్రాయంలోని ఆ ఇద్దరిని చెరువు దగ్గర చెక్క వంతెనపై, ఊరినానుకున్న పొలంగట్ల దగ్గర తరుచూ కలిపి చూశామని ఏంజిలోతో పరిచయమున్న వ్యక్తులు మధుశాల, విడిది గృహాలు, పేకాట క్లబ్బుల్లో అనేక చెవులకు ఈ విషయాన్ని రహస్యంగా చేరవేశారు.

ఏంజిలో తను గీసిన కన్య మరియ ముఖానికి కొవ్వొత్తిని మరింత దగ్గరకు తీసుకువచ్చి పరీక్షగా చూశాడు. ముఖాన మాతృత్వం , కారుణ్యం కంటే యవ్వనం, కోరిక ఎక్కువగా కొట్టొచ్చినట్లు కనిపించింది.

వర్ణచిత్రం మెడ నుండి కిందవరకు చూస్తుంటే, మెడ కింద చిన్న బుడిపిలా కనిపించి తటాలున ఒక క్షణం నీటి బుడగలా కనబడి వెంటనే అది సద్దుమణిగింది. వర్ణచిత్రాన్ని చూస్తున్న వాళ్ళకు కూడా అది అలాగే అనిపించే అవకాశం ఉందని నీలంరంగును ఆ బుడిపి పైన పూశాడు. అది పుయ్యగానే అది సద్దుమణిగినట్టు కనిపించింది.

రెండు కళ్ళతో, రెండు వైపులా బుడిపి పరిమాణాన్ని లెక్కించి చూశాడు. కుడివైపు ఇంకాస్త ఉబ్బెత్తుగా ఉండటం గమనించి, నీలంరంగులో తూలికను ముంచి, బుడిపి మీద పూశాడు. తూలిక నుండి నీలంరంగు కారింది. కారుతూ నేలవైపుకు వెళ్ళింది. ఏంజిలో నేలవైపుగా వెళుతున్న నీలంరంగు బొట్టువైపు దృష్టి సారించాడు.

నెలకోసారి చర్చిలో నేలపై కారిన మైనపు మరకలను శుభ్రం చేసేందుకు ముప్పై ఏళ్ళ వితంతువైన లూసీ అక్కడకు వస్తుంటుంది. ఆమె చేత్తో చిన్న కత్తి, తగరపు ముక్కలతో నేలమీద గోకుతుంది. నీలంరంగు బొట్టు ఒకటి లూసీ మెడ కింద రెండు ఉబ్బెత్తు వక్షోజాల మధ్యన జారింది.

నీలంరంగు ఆమె శరీరంపై పడి పులకరింతలో ఉన్న లూసీ తలపైకెత్తి చూసింది. ఏంజిలోనా కళ్ళు నీలంరంగు బొట్టును అనుసరించి, చూపు ఆమె తెల్లని వక్షంపై నిలిచింది. బహుశా, అది నీలంరంగు బట్టల్లోకి జారి కనుమరుగైంది కాబోలు. సారువ పైనుండి సర్రున ఏంజిలో కిందకు దిగాడు. అంత వేగంగా దిగివచ్చిన అతడిని చూసి లూసీకి విస్మయం కలిగింది.

లూసీకి ఇరు వైపులా ఏంజిలో చేతులు ఆనించి, ఆమె బట్టలను పటపటమని ఊడపీకాడు. వస్త్రపు కుడిఎడమలను ఏకం చేసే చెక్క బొత్తాలు ఊడి ఎగిరిపడ్డాయి.

ఆ నీలంరంగు వక్షోజాల మధ్య నుండి నాభిలోకి జారీ, పొత్తికడుపు కింద సరళరేఖలా ప్రయాణించి కనుమరుగయ్యింది. ఎడారి ఇసుక రంగులోని లూసీ శరీరం మీద జారిన నీలంరంగు  ఏంజిలో ఆలోచనలను ఎక్కడో తట్టి లేపింది. ఏంజిలో బొత్తాలు లేని అంగీ లాంటి ఆమె బట్టల్ని తీవ్ర ఉద్రేకంతో, విప్పేందుకు ఏ మాత్రం తీరికలేక పీకి పక్కకు విసిరేశాడు. విపత్తులా అతి తక్కువ సమయంలో ఎదురైన హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోలేక, విస్మయంతో నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది.

ఏంజిలో లూసీ శరీరాన్ని తన శరీరంతో పెనవేసుకున్నాడు. గాఢంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న ఫళంగానే ఆమెను పాప క్షమాపణ బోను వెనుకకు తీసుకెళ్ళి సంభోగించాడు. లూసీ అందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. సంభోగం పూర్తవ్వగానే దిసమొలతోనున్న ఆమె కళ్ళు ఒక్కసారిగా  బైర్లు కమ్మాయి.

నగ్నంగా గుమ్మటాన్ని చూస్తూ పైకి లేచిచూసేసరికి గుమ్మటమంతా బైబిల్ పాత్రలు, శిలువలో వేలాడుతున్న ఏసు, మేరీమాత రూపం వివిధ దశలలో, వేర్వేరు వయసుల్లో గీయబడియున్నాయి. దానితో ఆమె విస్మయానికి లోనయియింది. హవ్వా రూపం అచ్చం తనలా ఉండేసరికి, చటుక్కున హవ్వా నగ్నత్వం తన నగ్నత్వంలా అనిపించి, వెంటనే తను వేసుకునేందుకు బట్టల కోసం వెదికింది.

తన శరీరంపై మురికి పేరుకుపోయిన మగవాడి వంటి దుర్గంధం మెల్లమెల్లగా వ్యాపించడం  తెలుసుకోగలిగింది. తన నోటి నిండా దుర్వాసన నిండిన ఎంగిలి కంపు. అంచెలంచెలుగా ఎత్తుకు ఎదిగున్న సారువా బడితెల మీద ఏంజిలో రూపాన్ని వెదికింది.

అతడు నగ్నంగా కదలకుండా కూర్చుని, కన్య మరియాకు దేవదూతలు ప్రత్యక్షమయ్యి  ‘నువ్వు దేవకుమారుడిని ప్రసవిస్తావు’ అన్న బైబిల్ వచనాన్ని ప్రస్తావించే చిత్రాన్ని గీస్తున్నాడు.

అప్పుడు కూడా అతడి కాళ్ళకు లేడి రంగు బూట్లు విప్పకుండా అలాగే ఉన్నాయి. అతడి ముఖం మీద, శరీరం మీద అనేక చోట్ల నీలంరంగు అంటుకొనుంది. ఎంతోసేపట్నుండి ఆమె అతడి కింద తలకిందులుగా నిలబడుంది. దేవదూతలు తెల్లని రంగులు గీస్తున్నపుడు అది వీర్యపు రంగులో కిందకు జారడాన్ని తరచిచూస్తే, ఆ బొట్టు కూడా ఆమెపై నుండి కిందకు జారింది.

ఏంజిలో, లూసీ ముఖాన్ని ఎదురుగా చూసి తట్టుకొనే ధైర్యం చాలక, తన కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. మూసిన కళ్ళ నుండి కన్నీరు పొంగి పొర్లి లూసీ మీద పడింది. లూసీ ఆమె బట్టలను శరీరంపై చుట్టుకుని చాపెల్ నుండి వెనుతిరిగింది. చటుక్కున తన దిసమొలపై స్పృహ కలిగినవాడిలా తన అంగం మీద రంగు ఫలకతో మూసుకున్నాడు. ఆపై ఎటువంటి ఆచ్చాదన లేని తన శరీరంపై ఒక్కో రంగును ముంచి పూసుకున్నాడు.

జీవితకాలంలో ఇంకెప్పుడు కిందకు జారే బొట్లను అనుసరించకూడదని నిర్ణయించుకుని, మళ్ళీ గీయడం మొదలుపెట్టాడు. ఎన్నో రోజులుగా లూసీ అటువైపు వస్తూపోతూ, మైనపు మరకలను గోకుతుండేది. ప్రతిసారి ఏంజిలోను తలపైకెత్తి చూసేటప్పుడు ఏంజిలో చాపెల్ గుమ్మటాన్ని పైకి చూసేవాడు.

సారువాకి జారబడే ఏంజిలో బూట్లకు తలక్రిందులుగా ఆమె వెళ్ళి నిలబడేది. అరుదుగా రంగుల తుంపరలు, బొట్లు ఆమెపై, ఆమె బట్టలపై పడేవి. ఏంజిలో ఒక్కసారి కూడా కిందకి తలవంచి చూసెరుగడు. ఏడు నెలల తరువాత, ముప్పావు వంతు గర్భంతో లూసీ కిందకు వంగి, మైనపు మరకలను గోకేందుకు ఎంతగానో శ్రమించేది. బయట వర్షం కురిసి, చీకటి కమ్ముకున్న రాత్రివేళల్లో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సారువా నుండి కిందకు దిగిన ఏంజిలో చేతిలోని కొవొత్తి వెలుతురులో లూసీ ముఖాన్ని చూశాడు.

ఆమె ముఖాన్ని చూసే ధైర్యం చాలక తలను, కొవ్వొత్తిని రెండింటిని నేలవైపుకు కిందకు వాల్చినపుడు కడుపు ఉబ్బి గుండ్రంగా కనబడటం చూసి పాపభీతితో కేకలు వేసుకుంటూ బయట వర్షంలోకి పిచ్చిగా పరుగులు తీశాడు. ఈ సంఘటన తరువాత లూసీ ఎన్నో రోజులూ చర్చికు రాలేదు. మైనపు మరకలు చిన్నచిన్న గుట్టల్లా పేరుకుపోయాయి.

ఒకరోజు సూర్యోదయం బూడిద రంగులోనున్న సమయంలో, ఏంజిలో సారువాలో కూర్చున్న చోట్లోనే కూలబడినప్పుడు పసిబిడ్డలా ఏడుస్తున్న శబ్దం, ఆకలితో అరిచే పిల్లి శబ్దంలా చెవినపడి నిద్ర నుండి లేచాడు. ఏడుపు శబ్దం  చాపెల్ గోడలనిండా వ్యాపించి ప్రతిధ్వనించింది.

ఏంజిలో చేతిలో కొవ్వొత్తితో సారువా నుండి కిందకు దిగాడు. గొంతు వినబడిన దిశగా కొవ్వొత్తి వెలుగును ముందుకు తీసుకు వెళ్ళగా, కొవ్వొత్తి మైనపు మరకల మధ్య ఒక పెద్ద దీపశిఖలా పసిబిడ్డ ఒకటి తెల్లని గుడ్డలో మూటచుట్టి పడుకోబెట్టుంది. పసిబిడ్డ శరీరంపై, మూట చుట్టిన గుడ్డపై అక్కడక్కడ రంగులు చెదరిపడున్నాయి.

పసిబిడ్డ శరీరంపై, ఎత్తులోని సారువాపై నుండి మైనపు మరకలు పడి అంటుకుపోయాయి. మరింత దగ్గరకు వెళ్ళి పసిబిడ్డను తీక్షణంగా చూశాడు. లూసీని కనుచూపు మేర దూరంలోనే చూశాడు. ఆమె పాప క్షమాపణ బోను వెనక దాగొనుంది. మర్యాదగా అక్కడి నుండి బిడ్డను ఎత్తుకుని తీసుకెళ్ళిపొమ్మని బిగ్గరగా అరిచాడు. “ఈ చర్చి తిరిగి పూర్తిగా మైనపు మరకలు పేరుకుపోయెంత వరకు ఇటువైపు మళ్ళీ రావొద్దు.. రావొద్దు..రావొద్దు…” అని బిగ్గరగా అరిచాడు.

సారువాపైకి గబగబా ఎక్కి ఏసు జనన చిత్రాన్ని గీయసాగాడు. గీయడం పూర్తవ్వగానే దాన్ని నిశితంగా చూశాడు. బాలయేసు ముఖంలో ఆ పసివాడి ముఖఛాయలు విచ్చుకున్నాయి. జోసఫ్ ముఖం ఇంచుమించుగా ఏంజిలోతోను, మేరీ ముఖం లూసీతోను సరితూగింది.

***

శ్రీనివాస్ తెప్పల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథలోని నీలంరంగు చదువరికి కూడా అంటుకొన్న అనుభూతి కలిగిస్తుంది ఈ కథ. నరన్ కి అనువదించిన శ్రీనివాస్ తెప్పలకి ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు