నీరజ్ పదాల దుమారం మిగిలే వుంటుంది!

నీరజ్ ఇక లేడు. పూలతో మబ్బులతో పగటితో రాత్రితో కలిసిపోయి వందల పాటలు తను పాడీ మనతో పాడించిన నీరజ్ కన్ను మూశాడు. సినిమా పాటకి కవిత్వ అందాలన్నీ అద్ది వెళ్ళిపోయాడు.

గోపాల్ దాస్ నీరజ్ అంటే యెవరా అని ఆలోచిస్తారు. కేవలం నీరజ్ అని అంటే, హిందీ చిత్రాల కవి కదా అనేస్తారు. ఇంకొంతమంది “కారవాఁ గుజర్ గయా గుబార్ దేఖతే రహే” అని కూడా కూనిరాగం తీస్తారు. అవును నీరజ్ రాకతో హిందీ సినిమా పాటలు కళకళలాడి పోయాయి. పాటకూ ముక్త కవితకూ మధ్య సరిహద్దులు చెరిపేశాడు. అప్పట్లో మనకు ఘనాపాఠీలు సంగీత దర్శకులుగా వున్నారు, ఇతను యెలా వ్రాసిచ్చినా దానికి అందమైన బాణీ కట్టే వారు. గేంబ్లర్ చిత్రంలోని ఈ పాట : “దిల్ ఆజ్ షాయర్ హై” చూడండి. దీనికి మామూలుగా వుండే పల్లవి చరణాలు అన్న అల్లిక లేదు. ఇలాంటి యెన్నో అందమైన ప్రయోగాలు చేశాడు.

1925 లో ఉత్తర్ ప్రదేశ్ లో పుట్టిన నీరజ్ కు కవిత్వమంటే ప్రాణం. అలీగఢ్లో ధర్మ సమాజ్ లో హిందీ సాహిత్యాన్ని బోధిస్తూ హిందీ ఉర్దూలలో కవిత్వం కూడా వ్రాసేవాడు. ఇతని జీవితం కష్టాల మయం. ఆరేళ్ళకే తండ్రిని కోల్పోయాడు. ఇటావా హై స్కూల్ చదువు పూర్తి చేసుకుని, ఇటావాలోని వో కోర్టులో మొదట టైపిస్టుగా పని చేశాడు. ఆ తర్వాత వో సినెమా థియేటర్లో పని చేశాడు. కొన్నాళ్ళు కాన్‌పుర్ డి ఏ వి కాలేజిలో గుమాస్తాగా, తర్వాత ఇంకో చోట టైపిస్టుగా ఇలా ఉద్యోగాలు మారుతూ వుండాల్సి వచ్చింది. చదువు కొనసాగుతూనే వుంది. ఇంటర్మీడియేట్, బియ్యే లు అయ్యాక హిందీ సాహిత్యంలో ఎమ్మే కి కట్టి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. యెక్కువ కాలం పని చేసింది అలీగఢ్ ధర్మ సమాజ్ కాలేజిలో. ఇతని మొదటి కవితా సంగ్రహం 1944లో “సంఘర్ష్” పేరుతో వచ్చింది. ఆ తర్వాత అంతర్ధ్వని, విభావరి, ప్రాణ్గీత్, దర్ద్ దియా హై, బాదర్ బరస్ గయో, ముక్తగీత్, దో గీత్, నీరజ్ పాతి, గీత్ భీ అగీత్ భీ, ఆసావరి, నదీ కినారే, లహర్ ఫుహారేఁ, కారవాఁ గుజర్ గయా, ఫిర్ దీప్ జలేగా, తుమ్హారే లియే, నీరజ్ కీ గీతికాయేఁ లాంటి పుస్తకాలు ప్రకటించాడు. ప్రభుత్వం కూడా పద్మశ్రీ, పద్మవిభూషణ్ లతో సత్కరించింది.

సినిమాకు రావడానికి ముందే నీరజ్ కవిగా ప్రఖ్యాతుడు. కవి సమ్మేళనాల్లో అతన్ని ఆసక్తిగా వినేవారు. వొకసారి దేవానంద్ పిలుపుమీద వారం రోజులు శలవుపెట్టి బొంబాయికొచ్చాడు. దేవ్ అతన్ని ఎస్ డీ బర్మన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బర్మన్ కి అతని మీద నమ్మకం కుదరలేదు. అతనికి పెద్ద పరీక్షే పెట్టాడుట బర్మన్. వొక బాణీ ఇచ్చి, “రంగీలారె” తొ మొదలయ్యే పాట వ్రాయమన్నాడు. పార్టీలో తన ప్రియుడు వేరే అమ్మాయితో రావడం చూసి పాడే పాట. అందులో ప్రేమ, అసూయ, వ్యంగ్యం అన్నీ వుండాలన్నాడు. ఈ దెబ్బకు అలీగఢ్ వాపసు వెళ్ళిపోతాడు అని అతని అంచనా. కాని రాత్రికి రాత్రి ఆ పాట పూర్తి చేసి ఇచ్చేసరికి తెల్లబోవడం అతని వంతయ్యింది. ఆ తర్వాత బర్మన్-నీరజ్ ల కాంబినేషన్లో వొక దాని తర్వాత వొకటి అద్భుతమైన పాటలు వచ్చాయి. అయితే ఎస్ డి బర్మన్, శంకర్ జైకిషన్లలో జై కిషన్ చనిపోయాక నీరజ్ కి పాటల మీదనుంచే మనసు పోయింది. ఇక తన సాహిత్యాన్ని అర్థం చేసుకుని బాణీలు కట్టే వారు లేరని బహుశా అతని వేదన, లేదా ఆ సాంగత్యం ముగియడం వలన కలిగిన వైరాగ్యం అయినా కావచ్చు. అయితేనేం, రాసినవన్నీ ఆణి ముత్యాలే.

యీ కవి సినిమాకు, సందర్భానికి, బాణీ కి తగ్గట్టుగా పాట వ్రాయగలడా అని మొదట్లో సందేహించినవారే తర్వాతర్వాత నాలుక కరుచుకున్నారు. అతని ప్రతిభ యెలాంటిదంటే కొన్ని సార్లు అతని సాహిత్యానికే వారే న్యాయం చేయలేక పోయారు. “కారవాఁ గుజర్ గయా ఘుబార్ దేఖతే రహే” అన్నది అతని ప్రసిధ్ధమైన కవిత. దాన్ని సినిమాలోకి తీసుకున్నాడు ఆర్ చంద్ర (నయీ ఉమ్ర కి నయీ ఫసల్). కాని న్యాయం చేయలేక పోయాడు. సినిమా ఆడలేదు, కాని పాటలు నిలిచిపోయాయి. అలాగే వొకసారి అతని మూడు పేజీల కవిత చదివి శంకర్ (జైకిషన్) యేమి చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడట. ఆ పాట కన్యాదాన్ లోది “లిఖె జొ ఖత్ తుఝె”. అతని పాటలకు బాణీలు కట్టడం వాళ్ళకు సవాలే. మరో పాట మేరా నాం జోకర్ లో “ఎ భాయ్ జరా దెఖ్ కె చలో”. “శోఖియోఁ మేఁ ఘోలా జాయే” పాట అతను వ్రాసిన “చాందనీ మేఁ ఘోలా జాయే” కవిత నుంచి తీసుకున్నదే. నీరజ్ పాటలు ఆ సంగీతం వలనే కాదు అతని పదాలు చేసే మాయ కారణంగా కూడా ఈ నాటికీ నిలిచి వున్నాయి. కొన్ని పాటలైతే పాటలలా వుండవు, ముక్త కవితా ప్రవాహంలా వుంటాయి. కాని అందమైన పాటలుగా వొదిగిపోయాయి. “ఫూలొన్ కె రంగ్ సె”, “షొఖియొన్ మె ఘోలా జాయే” అలాంటివే.

వో నాలుగు పాటలను అతనికి శ్రద్ధాంజలిగా  తలచుకుందాం.

ఇది శర్మీలీ లోని పాట : ఖిల్తే హైఁ గుల్ యహాఁ

మామూలు హిందీ పదాలు, ఉర్దూ పదాలు కలిపి అందమైన కవితలుగా, పాటలుగా మలచడం లో చేయి తిరిగినవాడు. ఈ పాటే తీసుకోండి . ప్రేమ పాట. ప్రేమ ను వ్యక్త పరచడానికి తీసుకున్న చిత్రాలన్నీ ప్రకృతి చిత్రాలే. పూలు, సెలయేరు, మేఘం, ఱుతువు ఇలాంటివి. వీటి తో రెండు సాధించాడు. వొకటి మన కళ్ళముందు అద్భుతమైన ప్రకృతి చిత్రాన్ని నిలబెట్టడం (ఆ పాట కేవలం ఔదిఒ వినండి). నిజంగానే కవి చెబుతున్నట్టు ఆ అందాన్ని మనసు అద్దంలో (మనసుతో కదా చూడాలి) నిలుపుకోవాలనిపిస్తుంది, యెప్పటికీ చెరిగిపోకుండా. మళ్ళీ కవితా విన్యాసాలు. సరస్సు మీదకు వంగిన మేఘాలను చూస్తే అతనికి, ఆ దృశ్యం ఆ సరస్సు పెదాలపై ఆడుతున్న మేఘ రాగంలా అనిపిస్తుందట. ప్రత్యేక వ్యాఖ్యానం అవసరం లేదు, ఇది చదివితే యెవరికి వారు వాళ్ళ హృదయాలలో అపురూప చిత్రాలను దర్శిస్తారు. ఏంజొయ్.

“ఖిల్తే హై గుల్ యహాన్ ఖిల్ కె బిఖర్నెకో” (షర్మీలీ : 1971)

రాలిపోవడానికే యిక్కడ పూస్తాయి పూలు
విడిపోవడానికే యిక్కడ కలుస్తాయి మనసులు
ఈ అందమైన ఋతువు రేపటిదాకా వుంటుందో లేదో
ఈ పూలతేరు రేపటిదాకా నిలుస్తుందో లేదో
దొరికిన ఈ నాలుగ్గడియలూ ప్రేమలో గడిపేయి
సరోవరము పెదాలపైన మేఘ రాగాలాపన
పూల గుండెలలలో చల్లచల్లని జ్వాల
నీ హృదయపు అద్దంలో ఈ చిత్రాన్ని నింపుకో
దప్పిగొన్న హృదయమూ, పిపాసువు రాత్రీ
పెదాల వరకూ వచ్చి నిలిచిన తీయతీయని మాటలు యేవో
ఈ క్షణాలకే నీ సమస్త ఆనందాన్ని అర్పించేయి.

గేంబ్లర్ చిత్రంలో ఈ పాట చూడండి :

“దిల్ ఆజ్ షాయర్ హై”

ఈ రోజు ఈ హృదయం కవిగా, ఈ బాధ పాటగా, ఈ రాత్రి వో ఘజలుగా నీ ముందున్నాయి
ఇతరుల గజళ్ళు వినేవారు కాస్త ఇటు కూడా కృపావీక్షణాలు వేయండి

ఇటొచ్చి చూస్తే నీ కోసం యెలా జీవిస్తున్నానో తెలుస్తుంది
నువ్విచ్చిన గాయాలను కన్నీటి చుక్కలతో యెలా కుడుతున్నానో తెలుస్తుంది
నీ వ్యథనే తీసుకుని కోరికల సభలో విధివ్రాతతోనే జూదమాడాను
ప్రపంచాన్నే గెలిచినా, నీ చేత వోడటమే నా ఆట పరిణామమయ్యింది

ప్రేం పూజారి చిత్రం లో ఈ పాట: “ఫూలోఁ కె రంగ్ సే”

ఈ హృదయమనే కలాన్ని పూల రంగుల్లో ముంచి నీకు రోజూ జాబులు వ్రాసి
నువ్వు క్షణక్షణమూ నన్ను యెలా వేధిస్తున్నది యెలా చెప్పేది
నీ కలల్లోనే పరుండి, నీ గురించిన ఆలోచనలతోనే నిద్ర మేల్కొన్నా
నీ ఆలోచనల్లోనే చిక్కుకున్నాను, పూలమాలలో దారంలా

మేఘమూ-మెరుపూ, చందనమూ-నీరు లాంటిదే మన ప్రేమానూ
మనం మళ్ళీ మళ్ళీ కలిసి యెన్నో జన్మలెత్తాల్సే వుంది
అంత మధురంగా, అంత మత్తుగా వున్నది నీ ప్రేమ మరి!

నయీ ఉమ్ర కీ నయీ ఫసల్ లో ఈ పాట: “కారవాఁ గుజర్ గయా ఘుబార్ దేఖతే రహే”
పూలలా కురిసే స్వప్నాలు
శూలాల్లా గుచ్చే ప్రియతములు
ఆకులన్నీ రాల్చుకుని మోడుగా నిలిచిన చెట్టు
నేను మాత్రం నిలబడే వసంతాగమనం కోసం యెదురు చూస్తున్నాను
నా ముందునుంచే బిడారు సాగిపోయినా అది రేపిన దుమ్ము దుమారాన్ని చూస్తున్నాను

జీవితమింకా మొదలుకాకుండానే సంధ్య వాలిపోయింది
కాలు ఇంకా మోపనే లేదు జీవితమే కాలుకిందినుంచి జారిపోయింది
ప్రతి రెమ్మా, ప్రతి ఆకూ రాలిపోయి, ప్రతి కొమ్మా కాలిపోయి
మనసులో కోరిక వెల్లడి చేయకుండానే జీవితమే ముగిసిపోయి
కన్నీళ్ళు గీతాలుగా రూపాంతరం చెందాయి
కలలన్నీ భూస్థాపితమయ్యాయి
నా తో వెలుగుతున్న దీపాలన్నీ పొగలు కప్పుకుని లేచిపోయాయి
నతమస్తకమై, జీవితపు ఈ మలుపులో
అవనతమవుతున్న గమనాన్ని చూస్తూ నిలుచున్నాను.

చివరగా “చచచ” చిత్రంలో పాట : “సుబహ న ఆయి”
ఆనందాన్ని వెతుకుతూ వెళ్ళినవాడు ధనంతో తిరిగొచ్చాడు
చిరునవ్వు వెతుకుతూ వెళ్ళినవాడు పూలవనంతో తిరిగొచ్చాడు
ప్రేమను వెతుకుతూ వెళ్ళినవాడు తనువు మనసూ యేదీ లేకుండానే తిరిగొచ్చాడు

నీ జ్ఞాపకం తోడు లేకుండా
వొక్క పగలూ రాలేదు, వొక్క రాత్రీ రాలేదు

యెలాంటి బంధమిది నీతో,
చిరునవ్వు, ఆనందమూ యెటో పోయాయే!
కన్నీళ్ళు కూడా తాకట్టుకు పోయాయి
నా పాడెకూ  పాట పాడేశారు
ప్రపంచం కూడా శత్రువులా తయారయ్యింది

ఇలా వొకటా రెండా యెన్నెన్నో అందమైన పాటలతో ప్రేక్షకులను రంజింప చేసిన నీరజ్ ఈ రోజు లేరు. ఆయనకు ఆయన పాటలతోనే నివాళి. ఆయన మాటల్లోనే:

ఇచ్చోట పూలు పూసేది రాలిపోవడానికే
ఇచ్చోట మనసులు కలిసేది విడిపోవడానికే

కాని నీరజ్ నీ పేరు, నీ పాట సదా మా హృదయాల్లో మోగుతూనే వుంటాయి.

*

పరేశ్ దోశి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీరజ్ గారి గురించి పూర్తిగా చదవడం ఇదే మొదటిసారి. అద్భుతమైన పాటల రచయితగానే తెలుసు.
    వీలయితే రోషన్ గారి((Roshanlal Nagrath) గురించీ రాయగలరు ఇది ఆయన centenary year అని విన్నాను.

  • మళ్ళీ చాలా ఇష్టమైన పాట్టల్లోకి కాస్సేపు అలా వెళ్లిపోయేలా రాసారు పరేష్ దోషి గారు …..

  • గొప్పనివాళి. ఈ పాటలన్నీ విన్నవే. మరచిపోలేని జ్ఞాపకాలు. నీరజ్ అతని పాటలు ఎప్పటికీ బతికిఉంటాయి.

  • Thanks for such a beautiful tribute . He was 93 , but his memories are so young and remains so for every .

  • పరేష్ దోషిగారూ నీరజ్ వెండి రజనులాంటి పాటలు విశ్లేషించి మనసును పరేషాన్ చేసేశారు…
    ఈపాటలన్నీ నీరజ్ వని తెలీదు
    నెనరులు మీకు

  • Wonderful Paresh. Never knew all these songs were written by him. ప్రతి మనిషి మనసులో కలిగే ప్రతి అలజడికీ అక్షర రూపం ఇచ్చిన గొప్ప కవి. మీ నివాళి కూడా అంతే అద్భుతంగా ఉంది.

  • శంకర్ జైకిషన్ ద్వయానికి శైలేంద్ర హసరత్ జైపురి ద్వయం రచయితలు. పాట వినగానే అది ఎవరు రాసారనేది మా మిత్రులం చెప్పగలిగే వాళ్లం. నీరజ్ పాట “లిఖె జొ ఖత్ తుఝె” విని శైలేంద్ర పిచ్చిగాళ్లం ఆశ్చర్యపోయాం. అది ఆయన పోయాకనే వచ్చిందని గుర్తు. బాగులేదనలేం. శంకర్ జైకిషన్ దారి తప్పారని మాలో తీవ్రవాదులు కన్నీరు పెట్టుకున్న పాట. ౬౬లో శైలేంద్ర పోయాక నా ఆప్తమిత్రుడు ఇంక హిందీ పాట విననని కొన్ని నెలలు భీష్మించాడు. మేరానామ్ జోకర్ లో నీరజ్ పాటలతో అనుకుంటాను అతను నీరజ్ ఉన్మాది అయిపోయాడు. బర్మన్ దాదా పాటలే ఆయనకి చాలా పేరు తెచ్చాయి. నాకు భావం ప్రకారంగా చాలా నచ్చిన ఆద్మీ హు ఆద్మీసే ప్యార్ కరతా హు నీరజ్ పాట. ఆరోజులు ఆపాటలు గుర్తు చేస్తున్నారు దోషీ

  • పరేష్ దోషీజీ !
    మీకు మీరే సాటి! ఎంతగొప్పగా రాశారో నీరజ్ గురించి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు