నీకు ఏమి కావాలి ?
అని ఎవరన్నా అడిగినప్పుడు
ఆ సంగతే ఎరుగక
జీవితపు చివరి కొసకు చేరుకున్న విషయం
ఒక్కసారి నన్ను భయకంపితురాలిని చేస్తుంది.
ఏమి కావాలని నీకు అని
ఎప్పుడూ నాతో నేను అడగలేదు
మన వాంఛితాలు, అవాంఛితాలు
ఏవో అన్నీ కలగలిసి పోయి
అవి గుట్టలుగా పోగుపడి
వాటి మధ్య దారి తెలియక
తిరుగుతున్నప్పుడు
నాకు ఏమి కావాలో సరిగ్గా తెలియక
వాటి నుండి నిజంగా ఏమి కావాలో ఎంచుకోలేక అలసిపోయాను.
లేదూ మనపైకి ఎవరెవరో, వారి,వారి
వాంఛితాలను విసిరివేసి నవ్వితే భ్రమసి
తెలియకనే కౌగిలించుకొని
అడుగు ముందుకు పడనీయని
సర్ప పాశాలై అవి మనల్ని చుట్టేసుకున్నాక
భయంతో సర్పాలను ప్రేమించడం నేర్చుకుంటాం
అట్లా జీవితం అంతా గడిచాక
ఒక ఎంతో చిన్న వాక్యం మనిషిని
అతలాకుతలం చేసే వాక్యం
నన్ను నిలదీసింది?
ఏమి కావాలి ?
ఏమి కావాలి నీకు?
చెప్పగలమా?
ఏమి కావాలో నీకు?
ఏమి కావాలో నాకు?
ఎక్కడ ఎక్కడో వెతుక్కుంటాం
మన కేమి కావాలో తెలిసీ, తెలియని
తపనల, నిద్ర పట్టని అశాంతి రాత్రుల
ఇంతటి వెతుకులాటల, వేదనల తరువాత
నిజంగా ఏమి కావాలో తెలియకనే
ఇంకా, ఇంకా వెతుకులాడుతుండగానే
జీవితపు పెనుగులాట ఆఖరి అంకం ముగియనున్న వేళలో
మన మన జీవితాలు
నన్ను, నిన్నూ ఎక్కడికో
నీకూ, నాకూ తెలియని తీరాలకు
నెట్టేసిన అనంతరం ఇంతకీ
ఏమి పొందావ్ అని అవి కోపంగా
భయం, భయంగా మనల్ని నిలదీస్తాయి
అవును జీవితం మునుపు మనకి చెప్పలేదని కాదు
పలు మార్లు పరి పరి విధాలుగా
అది మెల్లిగానో, గట్టిగానో వాపోయింది
మన పరుగు ప్రయాణాలలో
ఏమి కావాలి నీకు? అన్న ప్రశ్న ను
నిజానికి మనం ఎన్నడూ వినదలుచుకోలేదు
చివరికి జీవితం
మరణ సదృశ్య నిశ్శబ్దమై
కదలని మురుగు నీటి మడుగై
మన కలలన్నీ మరణించాక
కొత్తగా ఒక ఒక కలను సృష్టించ లేని
ఎక్కడ వున్నామో అక్కడే ఒక్క కదలికన్నా లేక స్థిరంగా పాతుకుపోయి
మనం శిధిలం అవుతున్నప్పుడు
మనం చెదలు పట్టి లోలోన డొల్లలా అవుతున్నప్పుడు
అప్పుడు మన మన హృదయపు
లోతులలో నుండి,
మన అంతరాంతరాళలలో నుండి
సరిగ్గా, సరిగ్గా, అదే ప్రశ్న
మరి ఇక మనం తప్పించుకోలేని
పారిపోయి వేటి, వేటిలోనూ
గతంలో వలే ఆశ్రయం పొందలేని
సరిగ్గా అదే ప్రశ్న
” నీకు ఏమి కావాలి?” అన్న ప్రశ్న
ఇహ మనల్ని
కదలనియదు, ఊపిరాడనీయదు
ఇప్పుడు
అది ఏదో మన ఎరుకలోకి వస్తుండగా
ఎంతో అలసిపోయిన మనసుకి దేహానికి కావలిసినవి ఏవో కొద్ది కొద్దిగా కనుగొంటుండగా
అవాంఛిత సంకెళ్లను తొలగించుకొని
ఒక్క అడుగన్నావేయలేని నిస్సత్తువ ఆవరించి
లోన ఇదీ అని చెప్పలేని నొప్పి సలుపుతుంది
ఇప్పుడు మనం మనకు కావలసినవి
ఏదో కొంచం కనుగొన్నామన్న తృప్తితో
కనీసం మన, మన అంతరంగాల్లో
సమస్త సంకెళ్లను చేధించమన్న స్వేచ్ఛతో
జీవితానందపు దారిని కనుగొన్నామన్న
గర్వంతో జీవిద్దాం చివరాఖరికి.
*
Add comment